
నడక దారిలో-51
-శీలా సుభద్రా దేవి
జరిగిన కథ:-
(తండ్రి మరణానంతరం ఆర్థిక సంక్షోభంలోనే డిగ్రీ చదువుతో బాటు సాహిత్యం , సంగీతం బాపూ బొమ్మలు చూసి వేయటం. శీలా వీర్రాజుతో కలంస్నేహం ,రోణంకి అప్పలస్వామి గారి అధ్వర్యంలో సభావివాహం. మా జీవితంలో పల్లవి చేరింది. తర్వాత రెండో పాప, బాబు అనారోగ్యంతో చనిపోయారు. వీర్రాజు గారు స్నేహితునితో కలిసి అడ్వర్టైజ్ ఏజెన్సీ పెట్టటం, నేను ఆర్టీసి హైస్కూల్ లో చేరాను. వీర్రాజుగారు స్వచ్ఛంద విరమణ చేసారు. కొంత అనారోగ్యం .విజయవంతంగా ఎమ్మెస్సీ పూర్తిచేసాను. అమ్మ చనిపోవటం,పల్లవి వివాహం,నాకు హిస్టెరెక్టమీ ఆపరేషన్ జరగటం, పల్లవికి పాప జన్మించటం, మా అమెరికా ప్రయాణం, నా ప్రమోషన్ ప్రహసనం. పాప రెండవ పుట్టిన రోజు వేడుక , కొత్త ఇంటి గృహప్రవేశం వరుసగా జరిగాయి. తిరిగివెళ్ళిన రెండు నెలలకే అజయ్ చనిపోవడంతో ఆషీని తీసుకుని పల్లవి వచ్చేసింది. అజయ్ కి ఇంతకుముందు ఆపరేషన్ జరిగిందనీ పదేళ్ళే బతుకుతాడని చెప్పకుండా మోసం చేసారని తెలిసింది. పల్లవి ఉద్యోగంలో చేరింది. నేను హెచ్చెమ్ కావటంతో కలిగిన ఒత్తిడి. తర్వాత—)
***
సంక్రాంతి వెళ్ళాక మూడు వారాల సెలవు పూర్తిచేసి స్కూల్ లో జాయిన్ అయి పోయాను. కేటరాక్ట్ అయినా కంటికి స్కూల్ లోనే డ్రాప్స్ వేసుకుంటూ కోర్సు పూర్తిచేసి కొత్త కళ్ళద్దాలు మార్చుకున్నాను.
కానీ అప్పటికే ఎండలు తీవ్రం కావటం , స్కూల్ లో పరీక్షల సమయం దగ్గర కావటం కొంత వత్తిడికి గురౌతూనే వున్నాను. నేను చేర్చిన కల్పన నా క్లాసుల్ని కొన్ని చూసుకోవటం కొంత నయంగానే వుంది.
ఒకరోజు డా.భార్గవీరావు, ఇంద్రగంటి జానకీ బాల, అత్తలూరి విజయలక్ష్మి అప్పుడప్పుడు డి.సుజాతాదేవి ఇంటిదగ్గరగానీ, మా యింట్లో గానీ, ఇలా ఎవరో ఒకరి ఇంట్లో కలుస్తూ వుండేవాళ్ళం. సుజాత అప్పట్లో ఆంధ్ర మహిళా సభ సాక్షరతాభవన్ లో పనిచేస్తూ వుండేది.. సాహిత్యం గురించి మాట్లాడుకోవటమో ,పాటలు పాడుకోవడమో చేస్తుండే వాళ్ళం.
ఒకసారి అందరం కలిసి పాపికొండలకు వెళ్దామా అని అనుకున్నాం. అయితే నాకు కేటరాక్ట్ జరిగి రెండు నెలలే అయ్యింది. ఎండల్లో తిరిగితే కష్టమేమో అని భయపడినా వెళ్ళటానికే నిశ్చయించుకున్నాను.
గౌతమీ ఎక్స్ ప్రెస్ లో రిజర్వేషన్ చేయించుకుని బయలుదేరాము. మేము అయిదుగురమే కాకుండా మాతో నాటకనటుడే కాక లలితకళాతోరణంలో రేడియో, సినీ, నాటక నటనలో శిక్షణతరగతులు నిర్వహించే దీక్షితులుగారి భార్య చిత్రలేఖ కూడా మాతో బయలు దేరారు. చిత్రలేఖ భార్గవీరావుకీ, విజయలక్ష్మికీ మంచి మిత్రులు. అయినా మా అందరితో కలివిడిగా కలిసిపోయారు. మర్నాడు ఉదయమే రాజమండ్రిలో దిగాము. సుజాతాదేవి కూతురు కమల, అల్లుడు డా.మధు రాజమండ్రిలోనే వుంటారు. స్టేషన్ కు వచ్చి మమ్మల్ని పికప్ చేసుకుని వాళ్ళింటికి తీసుకు వెళ్ళారు.
కమల తయారు చేసిన పలహారాలు తిని పాపికొండలుకు బయలుదేరాము. లాంచ్ ఎక్కిన తర్వాత కొంతసేపు గోదావరీ తరంగాలలో మైమరచిపోయాము. నేను తెచ్చిన కెమేరాలో గోదావరి అందాలనే కాక మిత్రులం కూడా చాలా ఫొటోలు తీసుకున్నాం. తర్వాత లాంచ్ లో వున్న వారందరినీ పాటలు పాడమని అడుగుతే చాలామంది పాడారు. నేను కూడా ఒకటి రెండు ఎంకి పాటలు పాడాను.
పేరంటాలు పల్లెలో లాంచ్ దిగాము కానీ కచ్చా దారిలో ఇసుక వలన నడవలేక విజయలక్ష్మి తప్ప మేము పైవరకూ వెళ్ళలేదు.
మధ్యలో మరో చోట ఎందువల్లో లాంచ్ ఆగింది. అక్కడేదో గుడి వుందని చెప్పి అందరూ వెళ్తుంటే మేమూ వెళ్ళాము. గుడిచూసి వస్తోంటే ఇసుకలో పాదాలు దిగబడి మెల్లగా నడుస్తున్నాము. అంతలో లాంచ్ బయలు దేరుతోందని కేకలు వినబడి పరుగు నడకతో అడుగులు వేయలేక పోతుంటే ఒక ఎడ్లబండి అబ్బాయి మా ఆరుగురినీ బండెక్కమని లాంచ్ వరకూ తీసుకు వెళ్ళాడు. ఎడ్లబండి ఎక్కే సరికి కాళ్ళు నొప్పులు మర్చిపోయి మాకందరికీ హుషారు వచ్చి అంతా కలిసి ” పరుగులు తీయాలి. గిత్తలు ఉరకలు వేయాలీ”అంటూ మల్లీశ్వరిలోని పాట అందుకున్నాము.
లాంఛ్ దిగి వస్తున్నప్పుడు ఒక కుటుంబంలో అమ్మాయి నన్ను ఆపి నేను పాడిన ఎంకి పాటల గురించి ప్రస్తావిస్తూ ఆమె నాయని సుబ్బారావుగారి దగ్గర బంధువని చెప్పింది. సుబ్బారావుగారి కుటుంబసభ్యులు ఎంకి పాటల కాపీరైట్ గురించిన తగవులు వలన ఆకాశవాణిలో ఆ పాటలు ప్రసారం కాకుండా ఆపివేయడం జరిగింది. దాంతో ఎంకి పాటలు మరుగున పడిపోయాయి. నాయని సుబ్బారావుగారు విస్మృతులు అయిపోయా రనే విషయం మా మాటల్లో మరోసారి ప్రస్తావనకి వచ్చింది.
ఆ రాత్రి కమలా వాళ్ళింట్లో భోజనం చేసాక అక్కడికి నడక దూరంలోనే వున్న గోదావరి ఒడ్డున నిలిచివున్న ఒక పడవలో కూర్చుని ఆ వెన్నెల రాత్రి అందరం చాలా సేపు పాటలు పాడుకున్నాము.
కమలవాళ్ళు హాస్పిటల్ కోసం కొత్తగా తీసుకున్న ఇంటిలో వసతి ఏర్పాటు చేసారు.
మా వసతికి వెళ్ళిన తర్వాత కూడా ఆ పాటల మైకం తీరక పోవటంతో ఒక్కొక్కటే గుర్తుచేసుకుంటూ ఏ రెండుగంటలవరకో పాటలు మా ఆవరణ నిండా ఎగరేస్తూ చివరకు నిద్రలోకి జారుకున్నాం.
అలవాటు ప్రకారం ఉదయమే నాకు మెలకువ రావటంతో నా ఆనందాన్ని కవితగా మార్చాను.
మర్నాడు కారు రెంట్ కి తీసుకుని అందరం రాజమండ్రి, కడియం, బిక్కవోలు మొదలైన చుట్టుపట్ల ప్రదేశాలన్నీ చూసాం. ఆ రాత్రి తిరుగు ముఖం పట్టాం.
రెండురోజులూ ఇంటినీ, బాధ్యతల్నీ ఆలోచనల్లోకి రానీయకుండా ఆనందంగా గడిపేసాము. ఈ ప్రయాణంతో మా అయిదుగురు మధ్య స్నేహబంధం మరింత గట్టిపడింది.
ఈ ఏడాది ఏడవ తరగతి, పదోతరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణ బాధ్యత దగ్గర పడింది. రెగ్యులర్ గా సలీమ్ ఆటోని పెట్టుకోవటం వలన నాకు కొంత సమయం కలిసి వస్తోంది. ఎంత ఆలస్యం అయినా స్కూల్ పనులు అయ్యేవరకూ సలీం కనిపెట్టుకొనే వుంటున్నాడు.
పరీక్ష ప్రశ్నపత్రాలను పోలీస్ స్టేషన్ లో భద్రపరిచే రోజు చాలా ఆలస్యం అయ్యింది. అలాగే ప్రతీరోజూ స్టేషన్ నుండి పేపర్లు తీసుకుని రావటం ,తిరిగి పరీక్ష పూర్తి అయ్యాక జవాబు పత్రాలు సీల్ చేసి పోస్టాఫీసుకి పంపించటం ఇవన్నింటికీ సలీం ఆటోనే వాడుకున్నాను. లేకపోతే ట్రాన్స్ పోర్ట్ ఖర్చు అని క్లర్కులూ, అటెండరూ ఇచ్చే బిల్లులు తప్పించుకున్నాను.
ఇంకా మేనేజ్మెంట్ గ్రాంట్లను మింగేయటానికి చూసిన రాబందుల ఆట కట్టించి హైస్కూల్ వాటా వసూలు చేసి ఫీజులు కట్టలేని పిల్లల ఫీజులకూ, స్కూల్ కి అవసరమైన వాటిని కొనటానికి వుపయోగించాను. ముఖ్యంగా ప్రాధమిక పాఠశాలని ఎప్పుడైతే హైస్కూల్ నుండి విడదీసి దానికో హెచ్చెమ్ నీ, వాళ్ళ బిల్లులు వేరని విడదీసి పెట్టారో అప్పుడే దానికి వేరు పురుగు సోకి క్రమంగా చీడ పట్టింది. ఇప్పుడు బాగుచేసే పరిస్థితి కనుచూపు మేరలో పరిష్కారం లేకపోయింది. ముఖ్యంగా గత అయిదారు ఏళ్ళలో స్కూల్ ఆర్థికంగా, విద్యావిషయకంగా మొత్తం నాశనమై పోయింది.
నేను హెచ్చెమ్ గా పనిచేసినది పదిహేను నెలలే అయినా ఇంచుమించు రెండు విద్యాసంవత్సరాలు చూసినట్లు అయింది. అకడమిక్ లోనూ, పాఠశాల నిర్వహణలోనూ గమనించినవి చూస్తుంటే ఈ విధంగా ఎన్ని పాఠశాలలు వున్నాయో
అనిపించింది. రిటైర్ అయిన తర్వాత తప్పకుండా ఇస్కూలు కతలు రాయాలి అని అప్పుడే నిర్ణయించుకున్నాను.
అనిపించింది. రిటైర్ అయిన తర్వాత తప్పకుండా ఇస్కూలు కతలు రాయాలి అని అప్పుడే నిర్ణయించుకున్నాను.
మొత్తం మీద నా సర్వీస్ పూర్తి చేసుకున్నాను. నా రిటైర్మెంట్ సందర్భంగా స్కూల్లో అయిదో తరగతి నుండి పదోతరగతి వరకూ విద్యార్థులు అందరికీ కంపాస్ బాక్సులూ, ఒకటి నుంచి నాలుగో తరగతి వరకూ పెన్సిల్ బాక్స్ లో పెన్సిల్, రబ్బర్, షార్పనర్ పెట్టి ఇచ్చాను. మొత్తం స్టూడెంట్సుకి బిస్కెట్ పేకెట్లు పంచాను.
పిల్లలంతా ముఖ్యంగా హైస్కూల్ పిల్లలు పెళ్లి వేదికలా స్టేజి డెకరేషన్ చేసారు. మా కుటుంబమే కాకుండా మా మరుదులూ, ఆడపడుచు కుటుంబాలు కూడా పదవీవిరమణ సమావేశానికి వచ్చారు. నా చిన్నప్పటి స్నేహితురాళ్ళు కృష్ఢకుమారీ, ఉషా కుమారీ కూడా వచ్చారు. పిల్లలు నృత్యాలు చేసారు. తర్వాత నేను ఏర్పాటు చేసిన విందు భోంచేసాము. చాలా గ్రాండుగా అంతా జరిగింది. మా సహాధ్యాయులందరికీ బహుమతు లు ఇచ్చాను.
నా తర్వాత ఇన్చార్జి హెచ్చెమ్ అయిన ఉమారాణీకి అన్ని ఫైల్స్ అప్పగించి ఇన్నేళ్ళుగా నాకు ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్నీ ఏర్పడేలా ఆర్థిక స్వావలంబన కలిగించిన పాఠశాలను కళ్ళారా చూసుకొని భారమైన హృదయంతో ఇంటికి వెళ్ళాను.
ఇంకా ఆ తర్వాత పెన్షన్ పేపర్లు సబ్మిట్ చేయటం పనులు మొదలయ్యాయి. అయితే పెన్షన్ సాంక్షన్ అయ్యేటప్పటికి ఎన్నినెలలు పడుతుందో తెలియదు.
నేను ఇంట్లోనే వుంటున్నాను కనుక ఆషీని చూసుకోవటం బాధ్యత నేను తీసుకు న్నాను. దాంతో వీర్రాజుగారికి కొంత వెసులుబాటు దొరికింది. అప్పటికే వచనకవిత్వంలో నవల రాయటం మొదలుపెట్టారు. 1956 లో ప్రచురితమైన వెలుగుబాటలు అనే నవల వచ్చి అరవై ఏళ్ళు అయిన సందర్భంలో ఆ నవలనే బతుకు బాట పేరుతో వచన కవిత్వంలోనికి రాయటం పూర్తి చేసి ప్రచురించారు. నెలనెలా వెన్నెల పేరిట ప్రతీనెలా సాహిత్యకార్యక్రమాన్ని సి.వీ కృష్ణారావు గారి ఇంట్లో జరుగుతాయి. వారి ఇల్లు మా ఇంటికి దగ్గరే అందుకని వాళ్ళింట్లోనే పుస్తక పరిచయం ఏర్పాటు చేసారు. బతుకుబాట పుస్తకం గురించి వీర్రాజు గారు ప్రస్తావించారు. తర్వాత శంకరంగారితో సహా ఓముగ్గురు పుస్తకం గురించి మాట్లాడారు.
చాలా రోజులుగా పెద్దక్కయ్యకు ఒంట్లో బాగుండటం లేదని తెలిసినా స్కూల్ పని ఒత్తిడి వలన వెళ్ళలేక పోయాను. పదిహేనేళ్ళ క్రితం మొదలైన కేన్సర్ క్రమంగా కీమోథెరపీవలన పూర్తిగా తగ్గిపోయింది. కానీ ఇటీవల మళ్ళా తలెత్తినట్లుంది. అది తెలిసి ఓసారి విజయనగరం వెళ్ళాలనిపించింది.
ఆమెకు ఈ ఏడాది డెభ్భై ఏళ్ళు నిండుతాయి. అమ్మ తర్వాత ఆమె నాకు పెద్ద దిక్కుగా భావించాను. అంతేకాక నేను సాహిత్యరంగంలోకి రావటానికి తొలి అడుగు వేయించింది అక్కయ్యే.
అందుకే అక్కయ్యకి కట్టుకోవటానికి తేలికగా వుంటుంది అని లేత గులాబీ రంగులో లక్నో చీర కొని తీసుకు వెళ్ళి ఇచ్చాను. అక్కయ్య ఎంతో సంబరపడి ఆ రోజు వాళ్ళింటికి వచ్చిన బంధువుకి ” మా చెల్లెలు నా పుట్టినరోజుకు కొని తెచ్చింది” అని చూపించింది. అది నాకెంతో సంతోషం కలిగించింది.
తిరిగి హైదరాబాద్ వచ్చేసరికి నా పెన్షన్ సేంక్షన్ అయినట్లు వుత్తరం వచ్చింది.పే & అక్కౌంట్స్ ఆఫీసుకు ఉదయం ఎనిమిది గంటలకు వెళ్ళి ఆర్డర్ తీసుకోవాలని ఉత్తరంలో వుంది. ఆ మర్నాడు వీర్రాజుగారిని సాయం తీసుకుని వెళ్ళాను. ప్రభుత్వ ఆఫీసులో సంగతి తెలిసిందే కదా. పదిగంటలకు ఆఫీస్ అయితే ఎనిమిదికే ఎందుకు వెళ్ళాలన్నారో అర్థం కాలేదు. మెల్లిగా పదిన్నర దాటాక ఒక్కొక్కరే రావటం మొదలైంది. నాకు వచ్చిన ఉత్తరం చూపించి అడుగుతే సంబంధిత ఉద్యోగి సెలవు పెట్టారన్నారు.
మర్నాడు మళ్ళా వెళితే అతను సెలవులో వున్నాడు. ఇన్చార్జిని వేసారు. అతను రావాలన్నారు. వీర్రాజుగారిని రావద్దని చెప్పి తర్వాత రోజు నేనే వెళ్ళాను.
మర్నాడు మళ్ళా వెళితే అతను సెలవులో వున్నాడు. ఇన్చార్జిని వేసారు. అతను రావాలన్నారు. వీర్రాజుగారిని రావద్దని చెప్పి తర్వాత రోజు నేనే వెళ్ళాను.
ఎనిమిదింటికి టేబుళ్ళు తుడుస్తున్న అటెండర్ తో ” ఎన్ని రోజులు ఇట్లా తిప్పుతారు. స్పష్టంగా చెప్పొచ్చు కదా ” అన్నాను. నిజానికి అప్పటికి నాకు కూడా అర్థం అయ్యింది. ఆ రోజు సంబంధిత ఉద్యోగి వచ్చాడు. కానీ ” మీరు ఈ ఏడాదికి ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్ సబ్మిట్ చేస్తేనే అప్రూవల్ వస్తుంది.” అని ఒక క్వెరీ వెయ్యబోయాడు.
” నాకు జీతం వచ్చినప్పుడే ఇన్కమ్ టాక్స్ పరిథిలో లేను. పదినెలలై పెన్షన్ లేదు. ఎంత వస్తుందో తెలియదు. ఎలా సబ్మిట్ చేస్తానండీ” అని ప్రశ్నించాను. ఎవరి ద్వారానో డబ్బులు ఇవ్వమని నిస్సిగ్గుగా అడిగించాడు. తప్పదుకదా ఓ వెయ్యి చేతిలో పెడితే కవర్ నా చేతిలోకి వచ్చింది. ఇదీ మన వ్యవస్థ. అది పట్టుకుని బయటకు వచ్చి ఆటో కోసం చూస్తూ ఎదురుగా చూస్తే అవినీతి నిరోధక శాఖ ఆఫీసు బోర్డు కనిపించింది. కానీ నేను అందులోనికి వెళ్ళలేదు. నా పెదాలమీద విషాదపునవ్వు తొంగిచూసింది.
ఆషీ ప్రీస్కూల్ చదువు అయిపోయింది. ఒకటోక్లాస్ లో ఎక్కడా చేర్చటమా అని ఆలోచించి రోజరీ కాన్వెంట్ యాజమాన్యంలో మూడు స్కూల్స్ ఉన్నాయి. అన్నీ మంచివే అని అక్కడ చేర్చాలనుకుంటే సీటు దొరికింది కానీ ట్రాన్స్పోర్ట్ సౌకర్యం లేదన్నారు. అలాగే అరవింద్ స్కూల్ లోనూ అదే సమస్య. ఆషీకి బ్రాంకైటిస్ వుంది. అంతదూరం ఒక్కదాన్ని ఆటోల్లో పంపటం సమస్య. లేదా నేనో వీర్రాజు గారో రోజూ వెళ్ళాలి. అదీ కష్టమే. ఆలోచనలో పడ్డాను.
అంతలో వికాస్ భారతి అనే స్కూల్ గురించి తెలిసింది. అందులో ఒత్తిడి లేకుండా. ప్రత్యేకపద్ధతిలో విద్యావిధానం వుంటుందని తెలిసింది. అది ఇంటికి దగ్గరలో వుంది. పొనుగోటి కృష్ణారెడ్డిగారు కూడా వాళ్ళ పిల్లల్ని అక్కడే చేర్చాలనుకున్నారు. సరే అని ఆషీని కూడా చేర్చాము. మొదట్లో వాళ్ళ వేనులోనే పంపాము. కానీ ఆషీకి అలా నచ్చక పేచీ పెట్టింది. అప్పటి నుండి సలీమ్ ఆటోనే మాట్లాడాము. ముందు ఆషీని స్కూల్లో దింపి తర్వాత పల్లవి అదే ఆటోలో ఆఫీస్ కి వెళ్ళిపోయేది. సాయంత్రం నేను ఆటోలో వెళ్ళి ఆషీని తీసుకు వచ్చేదాన్ని.
కానీ తర్వాతి ఏడాది ఆ స్కూల్ ఇక్కడ నుండి తీసేసి హయత్ నగర్ అవతల ఎక్కడికో మార్చారు. దాంతో మళ్ళా ముందు కేంద్రీయ విద్యాలయలో అనుకొనికూడా వెతికి దగ్గరలోని కేంబ్రిడ్జ్ స్కూల్ లో చేర్చాము. కృష్ణారెడ్డిగారు కూడా అదే స్కూల్లో తన పిల్లల్ని చేర్చారు.
ఓ రోజు అక్కయ్య అకస్మాత్తుగా కింద పడిందని వెంటనే ప్రాణం పోయిందనీ వార్త వచ్చింది. వెంటనే టికెట్ల కోసం ప్రయత్నించినా వెంటనే దొరకలేదు. ఆఖరుకు నేను ఒక్క దాన్నే వెళ్ళాను. దినాలరోజుకు పల్లవీ, వీర్రాజుగారూ వచ్చారు. అన్నయ్యలిద్దరూ అక్కయ్య కర్మకాండలకు పుట్టింటి తరపున చేయాలట. వాళ్ళేమీ పట్టించుకోలేదనేది అక్కయ్య కూతుళ్ళిద్దరినీ వాళ్ళ బంధువర్గం ఎత్తిపొడుపులు చేసేసరికి అందరూ ముఖాలు మార్చుకున్నారు. దానికి తోడూ పుణ్యస్త్రీగా పోయినందుకు ఏవేవో తంతులు మొదలెట్టారు. అవ్వన్నీ నాకు కొంచెం చికాకు కలిగించాయి. నిజానికి అక్కయ్యకి అవన్నీ నచ్చేవి కాదు. అంతకుముందెప్పుడు అక్కయ్య ఇంట్లో పూజలవీ చేసేవారు కాదు. చిన్నకూతురు తిరుపతిలో పిహెచ్డీ చదివి వచ్చాక ఒక గూట్లో వెంకటేశ్వరుడి విగ్రహం పెట్టి దీపం వెలిగించడం మొదలుపెట్టిందని అక్కయ్య ఒకసారి వెళ్ళినప్పుడు చూపించి నాతో చెప్పింది.
ఎలా అయితేనేం కర్మకాండలన్నీ బతికున్న వారి ఇష్టప్రకారం సంప్రదాయ సిద్ధంగా జరిగాయి.
నాకు ఇష్టం వున్నా లేకున్నా చేయి కలపక తప్పలేదు. పుట్టిన దగ్గర్నుంచి ఆడవాళ్ళకి జరిపే తంతులన్నీ ఇబ్బంది పెట్టేవే.భర్త పోయినా ఆమెకే ఆమె పోయినా ఆమె దేహానికే. అవి నా మనసులో పెట్టిన కలత తర్వాత నేను రాసిన నీడల చెట్టు నవలలో కూడా అక్షరబద్ధం చేసాను.
*****

జన్మస్థలం విజయనగరం.రచయిత,కవి, చిత్ర కారుడు ఐనా శీలా వీర్రాజు గారి తో వివాహానంతరం హైదరాబాద్ లో నివాసం.1970 లో కథారచన తో సాహిత్య రంగంలో అడుగు పెట్టి తొమ్మిది కవితా సంపుటాలు, మూడు కథా సంపుటాలు,ఒక నవలిక వెలువరించారు. వంద మంది కవయిత్రుల కవితల సంకలనం ” ముద్ర” కు డా.పి.భార్గవీరావు తో కలిసి సహసంపాదకత్వం వహించారు.ప్రధానోపాధ్యాయినిగా పదవీవిరమణ చేసారు.