నా అంతరంగ తరంగాలు-24

-మన్నెం శారద

నేను చూసిన మొదటి సినీ నటి

అప్పుడు మా నాన్న గారు గురజాలలో పోస్టుమాస్టర్ గా చేస్తున్నారు. మాచర్ల నుండి ట్రాన్ఫర్ అయి గురజాల వచ్చాం. గవర్నమెంట్ ఆఫీసర్స్ క్వార్టర్స్ అన్నీ అక్కడ సౌరయ్య కాంపౌండ్ లోనే ఉండేవి. ఆయనకు బస్ సర్వీస్ కూడా ఉండేది.

          మా ఇల్లు సరేసరి.. ముందు పోస్ట్ ఆఫీస్… వెనుక రెండు గదులు, వంటగది, బ్యాక్ యార్డ్, పైన బెడ్ రూమ్స్, పెద్ద ఓపెన్ టెర్రస్ ముందు వైపు పెద్ద బాల్కనీ ఉండేవి.

          మా ముందు కాంపౌండ్ లోనే రోడ్డు, అటూ ఇటూ చాలా క్వార్టర్స్ ఉండేవి. మున్సిఫ్, సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు,… అలా….

          నాకప్పుడు ఎనిమిదేళ్లు ఉంటాయి.

          మా క్వార్టర్ లో నుండి వెనుక వైపు మేజిస్ట్రేట్ గారి ఇంట్లోకి ఒక గుమ్మం ఉండేది.

          అటుగుండా వెళ్తే బయట రోడ్డు మీదకు వెళ్ళచ్చు. ఆఁ రోడ్ కాస్త నడిస్తే మెయిన్ రోడ్డుకి కనెక్ట్ అవుతుంది.

          మేజిస్ట్రేట్ గారమ్మాయి నా క్లాస్ మేట్. ఇద్దరం కలిసి అటుగుండానే స్కూల్ కి వెళ్ళేవాళ్ళం.

          మేజిస్ట్రేట్ గారయితే దేవుడే. ఆయన గురించి మరో పోస్ట్ లో చెబుతాను.

          పైన వున్న బెడ్ రూమ్ లోకి పగలు అమ్మ వచ్చేది కాదు. ఇక అది మా సిస్టర్స్ ఇష్టా రాజ్యం!

          అయితే మా అక్క ఎక్కువగా క్రింద అమ్మతో ఉండి, అదీ ఇదీ సహాయ పడుతుం డేది.

          నేను పైన స్కూల్ నాటకాలకు కిరీటాలూ, కత్తులూ కటార్లు, బొమ్మలు… ఏవేవో తయారు చేస్తూ అమ్మ వచ్చే టైంకి మంచం క్రింద దాచేస్తూ ఉండేదాన్ని.

          నా తర్వాత చెల్లెలు ఇందిర కాస్త అమాయకురాలు.

          దానికి ఏవేవో కట్టుకథలు చెప్పి దాన్ని ఆశ్చర్యపరుస్తుండే దాన్ని. అది తిరిగి పోయి మా అమ్మకు చెప్పేది. ఇక మా అమ్మగారు”ఎందుకలా దొంగ మాటలు చెబుతావ్ దానికి? అని నాకు నాలుగు తగిలించేవారు.

          అది అమాయికంగా నమ్మినందుకు, మా అమ్మగారు రెండు తగిలించినందుకు కూడా నేను పకపకా నవ్వేదాన్ని.

          ఇదో దైనందిక కార్యక్రమంలా సాగుతుండేది. నబి అని ఒక మెయిల్ ప్యూన్ పోస్ట్ ఆఫీస్ లో పనిచేసేవాడు. బహుశా నబి ఖాన్ ఏమో పేరు! చాలా మంచివాడు. అటు వంటివారిని చాలా అరుదుగా చూస్తాము.

          మా చెల్లెలు లలిత బడిలో వేస్తే వెళ్లనని రాగాలు తీసి గోల చేస్తే బలవంతంగా భుజాల మీద ఎక్కించుకుని తీసికెళ్ళేవాడు.

          సరే… ఇప్పుడు అసలు విషయానికి వస్తాను.

          ఒకరోజు నేనేదో బొమ్మలు బిజీగా తయారు చేసుకుంటుంటే నబి హడావుడిగా వచ్చి “పాపా, విజయవాడ వెళ్లే బస్సులో సినిమా యాక్టర్ కనకం వున్నదమ్మా “అని చెప్పాడు.

          నా డ్రామాల పిచ్చి బాగా తెలుసు అతనికి.

          అంతే!

          ఒక సెకండ్ కూడా ఆలస్యం చెయ్యకుండా ఎక్కడివక్కడ పడేసి చేతులు గౌనుకి తుడుచుకుని నేను రివ్వున తూనీగలా మేజిస్ట్రేట్ గారింట్లోంచి ఒక్కపరుగున వెళ్లి కనకం గారున్న బస్ కి ఎదురుగా నిలబడి ఆమె వంకే చూస్తూ నిలబడ్డా.

          నా మనసు పులకించి పోతున్నది పరవశంతో.

          ఈ ఉదయాన్నే ఏమి నా అదృష్టం..! ఈ మారుమూల పల్నాటి సీమలో ఒక సినిమా నటి నాకు ప్రత్యక్షం కావడమా…

          వళ్లంతా గిచ్చుకున్నా నమ్మలేని నిజం!

          ఆమె సోడా బండబ్బాయిని పిలిచి ఒక గోళీ సోడా కొట్టించుకుని తాగింది.

          ఈమెకు కూడా దాహం వేస్తుందా… వేసిందే పో.. ఒక తుచ్చమైన గోళీ సోడా తాగుతుందా…!

          వీళ్లు దేవతలు కదా… అమృతం తాగాలి కదా… కనీసం అలాంటి మరేదయినా ద్రవాన్ని గ్రోలాలి కదా!

          ఆమె సోడాని గుటకలు వేస్తూ నా వైపు చూసింది.

          నా జన్మ తరించి పోయింది. ఏమి నా భాగ్యం!

          వెంటనే మొహం చేటంత చేసుకుని నవ్వాను.

          నేను నీకు తెలుసా? ” అడిగింది నవ్వుతూ.

          ఏం ప్రశ్న ఇది…!!!

          ” తెలుసు “అన్నా ఎంతో సంబరంగా.

          “నా పేరు?”

          “కనకం గారు” అని చెప్పాను ఎంతో మర్యాదాగా మురిసి ముక్కలయిపోతూ.

          “ఓ, బాగానే తెలుసు… నా సినిమాలు చూసావా?”

          తల గుండ్రంగా తిప్పాను రుబ్బు రోలు పోత్రం లా…

          “ఏ ఏ సినిమాలు చూసావ్? “

          వెంటనే గుర్తొచ్చింది కీలు గుర్రం సినిమా.

          నా అదృష్టం కాకపోతే మాచర్లలో మా ఇల్లు టూరింగ్ టాకీస్ పక్కన ఉండడమేంటి.. ఏనాటి డొక్కు సినిమాలో అక్కడ ముక్కలు ముక్కలుగా ఆడడమేంటీ… వాటిని నేను పలుమార్లు తిలకించి పరవ శించడమేంటి….!’

          (అదే కీలుగుర్రం సినిమా శివరాత్రికి జాగారం చేస్తూ మీరా టాకీస్ లో చూసినప్పుడు వళ్ళు జలదరించింది. ఒక అద్భుతమైన ప్రేమికురాలిలా, సాత్వికమైన పాత్రలలో చూడడానికి అలవాటు పడి అంజలీ దేవిని అలా రాక్షసిలా దారుణమైన పాత్రలో చూడలేకపోయాను.)

          లేకపోతే ఈ విడ పెట్టిన పరీక్షలో నేను నెగ్గేదాన్నా?

          ఆ సంగతి చెప్పగానే ఆమె తెగ సరదా పడిపోయింది.

          “ఏంటీ, నీకు కీలుగుర్రం సినిమా తెలుసా, అప్పటికి నువ్వు పుట్టేవుండవు!” అన్నారావిడ అపనమ్మకంగా. నాకు గర్వంతో కూడిన సంతోషం వేసింది.

          బస్సు డ్రైవర్ ఎటో పోయాడట… కండక్టర్ ఒకటే విజిల్స్! బాగయింది… ఇంకాసేపు ఆ మహా నటిని చూడొచ్చు… అని నేను ఆమెకి ఇంకేం చేయాలో తోచలేదు. నేనేమో అక్కడ నుండి కదలడం లేదు. అటూ ఇటూ చూసి మళ్ళీ నా వైపు చూసి చిరునవ్వు నవ్వుతోంది…కొంత ఇబ్బందిగా.

          బహుశా నా లాంటి పిల్ల అభిమానిని ఆమె ఆదివరలో చూసివుండక పోవచ్చు.

          ఎట్టకేలకు డ్రైవర్ విలన్ లా ఎంట్రీ ఇచ్చాడు.

          కండక్టర్ కేకలు విజిల్స్ తో బస్సు కదిలింది. అయ్యో అనిపించింది.

          కనకం గారు చెయ్యి ఊపుతూ వెళ్ళిపోయారు.

          నేను నిట్టూర్చి ఈలోకంలో కొచ్చి మళ్ళీ రివ్వున ఇంటికి పరిగెత్తుకొచ్చాను.

          గబ గబా సంతోషం ఆపుకోలేక “అమ్మా అమ్మా నేను సినిమా ఏక్టర్ కనకాన్ని చూసా!” అన్నా గర్వం గా.

          అమ్మ నా వంక ఎగాదిగా చూసి”ఎక్కడా? “అనడిగింది.

          ” బస్సులో వుంది, నబీ చెప్పాడు “అన్నా గర్వంగా.

          నీకంతకన్నా యాక్టర్ దొరకలేదా చూడ్డానికి, పో ఇంక స్నానం చెయ్యి అని కసిరింది “చిరాగ్గా. ( అయితే అమ్మ అంతలా తీసి పారేయాల్సిన నటి మాత్రం కాదు కనకం గారు.

          ఆమె చిన్నతనంలోనే రేడియోలొ బాలానందం కార్యక్రమాల్లో పాల్గొనేవారట.
పీసపాటి గారితోనూ, బళ్లారి రాఘవగారితోనూ నాటకాలు వేసి ధీటుగా పద్యాలు పాడేవారట. నాయకురాలు పేరుతో వచ్చిన నాటకంలొ పల్నాటి నాగమ్మగా నటించి అనేక ప్రదర్శనలిచ్చి బహుముఖ ప్రశంసలు అందుకున్నారట. ఆర్ధికంగా కూడా బాగా సంపాదించి ఇల్లు, కార్లు కూడా సంపాదించారట. చాలా మంది నటీనటుల్లానే సినిమా తీసి అది మధ్యలో ఆగిపోయి సర్వం పోగొట్టుకుని తిరిగి నాటకాలు వేస్తూ చివరి దశ దైన్యంగా గడిపారని విన్నాను.

          చివరగా లేతమనసులు, భక్త ప్రహ్లాద ఆమె నటించారు.

          ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా వున్నప్పుడు వారి చేతుల మీదుగా అవార్డు అందు కున్నారు.)

          ఏ అవకాశం దొరికినా హేళన చెయ్యాలని చూసే మా సోదరీమణులు కిసుక్కున నవ్వారమ్మ మాటకి. తర్వాత ఎప్పుడో అప్పుచేసి పప్పుకూడు సినిమా హైదరాబాద్ లో మార్నింగ్ షో చూసాను. అందులో జగ్గయ్య ఇంగ్లాండ్ నుండి శివరావుని దొరసానిలా తయారు చేసి పెళ్లి చేసుకున్నానని తీసుకొని వస్తే CSR మొహం వెగటుగా పెట్టి ” ఇంగ్లాండ్ లో ఇంతకన్నా అందమైన దొరసాని దొరకలేదంట్రా? “అని అంటాడు.
అప్పుడు మా అమ్మ అన్న మాట గుర్తొచ్చి తెగ నవ్వొచ్చింది నాకు.

          తర్వాత ఎంతోమంది నటుల్ని, నటి మణుల్ని చూడటం, కలిసి మాట్లాడటం, ఇంటర్వ్యూ లు చేయడం జరిగినా ఆ చిన్ననాటి సంఘటనే నాకు గుర్తొచ్చినప్పుడల్లా ఎంతో థ్రిల్ కలిగిస్తుంది.

*****

(సశేషం) 

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.