నా జీవన యానంలో- రెండవభాగం- 51

-కె.వరలక్ష్మి

          అకిరా కురసోవా గొప్పగా పిక్చరైజ్ చేసిన ‘తెర్సు ఉజాలా’ మూవీ చూస్తే ఏ సినిమా కైనా కథే ప్రాణం, ఏ కథకైనా నిజాయితీయే ప్రాణం అన్పించింది నాకు.

          ఒక రోజు సి.బి. రావుగారు ఫోన్ చేసి ‘‘మీ అతడు – నేను కథలు చదివేను. నాకు చాలా నచ్చాయి. ‘ఈ మాట’ కోసం రివ్యూరాసాను’’ అని చెప్పారు.

          జూలై 4 U.S.A. ఇండిపెండెన్స్ డే. రాత్రి 8.30 కి మౌంటెన్ వ్యూలోనే మరోవైపు జరిగే ఫైర్ వర్క్ చూడడానికి వెళ్లేం, చాలా బాగా జరిగింది. ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుని 11.30 కి ఇంటికి చేరుకున్నాం. ఒక రోజు అనిత ఎనిగళ్ల ఒహాయో నుంచి ఫోన్ చేసి చాలాసేపు ఆప్యాయంగా మాట్లాడింది. నార్త్ ఈస్ట్ లో తనున్న ప్లేస్ చాలా బావుంటుందని, నయాగరాకు 5 గంటల జర్నీ అని, తప్పక తన దగ్గరకి రమ్మని పిలిచింది, మరో రోజు సి.బి. రావుగారు, ఆయన భార్య రమణగారు గీత ఇంటికి వచ్చారు, సాయంకాలం నన్ను వాళ్ల కారులో షోర్ లైన్ లోని బేక్ వాటర్ లేన్, బర్డ్స్ ని చూడ్డానికి, ఓ గంట వాకింగ్ కి తీసుకెళ్లేరు, నేను నేలమీద పడుకొని ఉండగా మా కోమల్ ఓ స్కెచ్ గీసాడు, దానితోబాటు కోమల్ గీసిన బొమ్మలన్నిట్నీ చూసి చాలా ఎంకరేజ్ చేసారు వాళ్లిద్దరూ.

          జూలై 9 ఇంట్లో బొద్దింకల మందు కొట్టేవాళ్లొచ్చారు. అది రెంటెడ్ హౌస్ కావడం వలన ‘వద్దు’ అని పంపించెయ్యడానికి వీల్లేదు, ఆస్మెల్ నెలలు నిండి ఉన్న గీత పీలిస్తే ప్రమాదమని చెప్పేరు. అందుకని వెంటనే ఎలా ఉన్నవాళ్లం అలా బైటికొచ్చేసి రోజంతా లైబ్రరీ, షాపింగ్ మాల్స్, హోటల్స్, పార్కులు తిరిగి తిరిగి రాత్రి బాగా పొద్దుపోయి తిరిగొచ్చాం. ఆ మర్నాడు ఉదయాన్నే గీతకు పెయిన్స్ ప్రారంభమయ్యాయి. వెంటనే గీత, సత్య సన్నీవేల్ శాంటాక్లారాలోని కైజర్ పెర్మనెంట్ హాస్పిటల్ కి వెళ్లేరు, మధ్యాహ్నం సత్య వచ్చి నన్ను, వరూపాపాయిని తీసుకెళ్లేడు, అమెరికా కాలమానం ప్రకారం జూలై 10 రాత్రి 10.37 కి సిరివెన్నెల పుట్టింది. సిజేరియన్ జరిగింది. పాపాయి గుండ్రటి మొహంతో చందమామలా ఉంది, అక్కడి నర్సుల, డాక్టర్ల హాస్పిటాలీటీ తో బావుంది. మన భయం కొద్దీ మనం ఉండడమే కాని, అక్కడ ఎవరూ ఉండాల్సిన అవసరం ఉండదు. అన్నీ వాళ్లే చూసుకుంటారు. గీతకి మాత్రమే బెడ్, ఖోజన సదుపాయాలు ఉన్నాయి. మనం బాలింతకి రెండో రోజు వరకూ ఏమీ పెట్టం, రెండో రోజైనా రొట్టె, పాలు ఇస్తాం కదా, వాళ్లు సర్జరీ అయిన రోజే టర్కీకోడి మాంసంతో భోజనం పెట్టేసారు, సాయంకాలం స్నానం చేయించేసారు. పాపాయికి మాత్రం బొడ్డు ఊడేవరకూ స్నానం చేయించకూడదట. సత్య ఆ రోజే నన్నూ పిల్లల్నీ ఇంటి దగ్గర దిగబెట్టేసాడు. గీతనీ, పాపాయినీ మూడవరోజు ఇంటికి పంపేసారు. 5 వ రోజు వరకూ పాపాయి అదేపనిగా నిద్రపోతూనే ఉంది. 6వ రోజు కళ్లు తెరిచి పగలు కాస్త మేల్కోవడం చేసింది.

          నేను రోజూ ఏదో ఒక టైంలో వాకింగ్ కి వెళ్లేదాన్ని. అంత పరిశుభ్రమైన రోడ్లమీద, ఇళ్లముందున్న ఫ్లవర్ గార్డెన్స్ ని చూసుకుంటూ నడవడం ఎంతో బావుండేది. ఎప్పుడూ ఒకవైపే నడుస్తున్నాను అన్పించి ఒకరోజు ఇంటిపక్కనున్న రోడ్డు క్రాస్ చెయ్యబోయాను. నడిచే వాళ్లొస్తే కార్లు వాటంతటికి అవే ఆగుతాయని గీత చెప్పింది. రోడ్డు సగంలో కెళ్లే సరికి అతి స్పీడుగా వస్తున్న కార్లను చూసి కళ్లుమూసుకుని నిలబడిపోయాను. కార్లన్నీ సడెన్ బ్రేక్స్ తో ఆగిపోయాయి. కళ్లు తెరిచి గబగబా రోడ్డుదాటి అవతలిపక్క ఫుట్ పాత్ మీద రెండడుగులు వెయ్యగానే పోలీస్ కారొచ్చి నాపక్కనే ఆగింది. కారులోంచి బబుల్ గమ్ నములుతూ అందంగా, ఆరోగ్యంగా ఉన్న పోలీస్ యువకుడు దిగేడు. అలా ఎప్పుడు పడితే అప్పుడు రోడ్ క్రాస్ చెయ్యకూడదని చెప్తూ నన్ను వెనక్కి తీసుకెళ్లి రోడ్డు పక్కనున్న స్తంభం మీది వాకింగ్ ఎంటర్ బటన్ నొక్కి ఆరెంజ్ కలర్ లో ఆగమని వచ్చే చెయ్యి గుర్తు వచ్చినప్పుడు కాదని, బ్లూ కలర్ లో నడుస్తున్న మనిషి గుర్తు వచ్చినప్పుడే రోడ్డు క్రాస్ చెయ్యాలని ఓపికగా వివరించాడు. నేను థేంక్స్ చెప్పగానే ‘‘బైబై. గుడ్ డే’’ అని కారెక్కేడు.

          నేను స్థిమితంగా వాకింగ్ చేసుకుని ఇంటికొచ్చి చెప్తే గీత కంగారు పడినప్పుడు అర్థమైంది అదెంత సీరియస్ విషయమో! ‘‘అయ్యో! నీకు ముందే చెప్పడం మరచి పోయాను, ఎంత ప్రమాదం తప్పిందో’’ అంటూ గాభరాపడింది. మాకోమల్ ‘‘నీ డ్రెస్ (చీర) చూసి నువ్విక్కడి దానివికాదని అంత స్మూత్ గా చెప్పేడు. ఇక్కడ వాళ్లకైతే ఫైన్ వేసేస్తాడు’’ అన్నాడు.

          ఆగష్టు నెలలో ఒకరోజు గాంధీ మై ఫాదర్’ మూవీ చూసేను. రోజూ సెలెక్టెడ్ మూవీస్ చాలానే చూస్తూ ఉన్నా గుర్తు పెట్టుకోదగినవి కొన్నే ఉంటాయి. ఆ మూవీ చివర్లో గాంధీజీ ‘‘నా జీవితంలో నన్ను అమితంగా రెండు ఓటములు బాధిస్తున్నాయి. ఒకటి నా మిత్రుడు మహమ్మదాలీ జిన్నా. రెండు నా పెద్ద కొడుకు హరిలాల్’’ అనడం మన మనసుల్ని కలచివేస్తుంది. ఎవరికైనా ఇలాంటి ఓటములు కొన్ని తప్పవేమో!

          ఆగష్టు 22న సిరివెన్నెల పాపాయికి క్రెడిల్ ఫంక్షన్ అతిథి రెస్టారెంట్లో చేసారు. గీత ఫ్రెండ్స్, రచయితలు చాలా మంది వచ్చారు. ఫంక్షన్ చాలా బాగా జరిగింది. అదే రోజు ఉదయం 9కి అక్కడి తెలుగు రేడియో ‘సుజనరంజని’ లో ప్రఖ్యమధుబాబు చేసిన నా ఇంటర్వ్యూ వచ్చింది. దాని సి.డి. ఇచ్చాడు మధుబాబు.

          నేను అక్కడికి వెళ్లినప్పటి నుంచీ చల్లగానే ఉండడం వల్ల రోజూ స్వెట్టర్ వేసుకుని వాకింగ్ కి వెళ్తున్నాను. ఆగష్టు 24 న సాయంకాలం 6.30 కి ముందు రోజులాగే ఉంటుంద నుకుని వెళ్తే చెమటతో తడిసి ముద్దయ్యాను. అప్పటి నుంచీ వేసవి వచ్చినట్టేనట. పగలు ఎండలోకి వెళ్లలేనంత వేడిగా ఉంది. శివలక్ష్మిపట్టెం ఫోను చేసినప్పుడల్లా అడుగుతోంది ‘‘మీకక్కడ బోరెత్తడం లేదా?’’ అని, తనైతే అమెరికా వెళ్లినప్పుడల్లా చాలా బోర్ పీలవుతుందట. అందరూ అదే అంటున్నారు. కాని బహుశా గీత చూపించే ప్రేమ వలన నేనక్కడ అంత కంఫర్టబుల్ గా ఉండగలిగేను. ఆ నెలలోనే ‘ప్రహేళిక’ ‘ఊరు’ ‘నాన్న’ కథలు రాసేను. మా అబ్బాయికి పంపించి ఏఏ పత్రికలకు పంపాలో చెప్పేను. ఈ కథలు రాయడాలు, ముందు జెరాక్స్లు, అప్పుడు ప్రింట్లు తియ్యడాలు – అవన్నీ గీతకీ నాకూ అలవాటు వల్ల సహజంగా అన్పిస్తాయి. మా రవి కొంత ఇబ్బంది పడుతున్నట్టు అన్పించింది. ఒక కథ ప్రింటు ఒక రోజంతా కాలేదట. ఇరవై వైట్ పేపర్స్  ప్రింటర్ లో +ఇంకు మొత్తం ఖర్చైపోయిందట. అప్పటికింకా పత్రికలకు ఆన్ లైన్ లో కథలు పంపే పద్ధతి రాలేదు. నవ్య వీక్లీకి ఒక కథ రాయాలని అనుకున్నాను, కాని విరమించుకున్నాను. సెప్టెంబర్ నెలలో ఒక రోజు శాంటాక్రజ్ బీచ్ కి వెళ్లేం. మౌంటెన్ వ్యూ నుంచి 35 మైళ్లు. అక్కడి అమ్యూజ్ మెంట్ రైడ్స్ పిల్లలు బాగా ఎంజాయ్ చేసారు. నేనూ, గీతా బీచ్ లో కాస్సేపు నడిచి రోప్ వే ఎక్కేం. కింద ఏ ఆధారం లేని సోఫాలో కూర్చుని గాలిలో ప్రయాణించడం. అక్కడి నుంచి 4 1/2 మైళ్ల దూరంలో ఉన్న మిస్టరీస్పాట్ కి వెళ్లేం. అక్కడ గ్రేవిటీ నిజంగానే అలా ఉందా? ఆ రూంని అలా క్రాస్ గా కట్టడం నుంచి ఫీల్ వస్తోందా? అన్పించింది. అక్కడ మనుషులు క్రాస్గా నిల్చున్నట్లు పీలవుతారు. ఒక కొండపైన అంత క్రాస్ గా కట్టిన చెక్క ఇంట్లో నిలువుగా ఎలా నిల్చోగలుగుతాం. ఒకే ప్లేస్ లో పొట్టి గానూ, పొడవుగానూ ఉన్నట్లు ఫీలవుతారు. అక్కడికి జర్నీ మాత్రం మంచి అడవిదారి, పొడవుగా పెరిగిన రెడ్ ఉడ్ చెట్లు, ఉదయాన్నే మంచుతోనూ, మధ్యాహ్నం ఎండతోనూ అందాలొలికించే దూరపు కొండలు. మొత్తం మీద ఆహ్లాదకరమైన ప్రయాణం. సిరి పాపాయిని మాత్రం రెండో నెలలోనే ఎండలోను, చలిలోను తిప్పేసాం.

          ఆ మరుసటి వీకెండ్ కి పక్కనే ఉన్న విష్మెన్ పార్క్ కి వెళ్లేం. బార్బెక్యూ లంచ్, పెద్ద పెద్ద కోడిముక్కలు, చేపలు నిప్పుల మీద కాల్చుకుని తినడం, టెంట్ వేసుకుని సాయం కాలం వరకూ అక్కడే గడిపేం, అక్కడి వాళ్లందరికీ సమ్మర్ లో అలా వీకెండ్స్ బైట గడపడం ఇష్టమైన పని, ఆటలు – పాటల్తో గడిపి పొద్దుపోయేవేళ ఇంటికొచ్చాం, ఎనిమిది పేజీల కథని ఏకబిగిన రాసి, దిద్దుళ్లు పూర్తి చేసి ‘కుట్ర’ అని పేరు పెట్టేను.

          దిన్ కర్ జోషి గుజరాతీలో రాసిన ‘ప్రకాశవో పరభావో’ నవలను కూచి వెంకట నరసింహారావుగారు తన భార్య కామేశ్వరి పేరుతో తెలుగులోకి చాలా చక్కగా అనువదించేరు, గాంధీజీ పెద్దకొడుకు హరిలాల్ గాంధీ జీవితం మీద రాసిన కథ అది. పుస్తకం చదవడం పూర్తిచేసేసరికి మనసంతా చాలా భారంగా అయిపోయింది. నేనక్కడికి వెళ్లేక చదివిన నాలుగో తెలుగు పుస్తకం అది. సాహితీ సమితి సమావేశంలో గీతకి గిఫ్ట్ గా వచ్చిన కాలిఫోర్నియా ఆంధ్రుల కథలు ‘వెన్నెల్లో హరివిల్లు’ మొదటిది. వివినమూర్తి గారి మొదటి కథల పుస్తకం రెండవది, కాశీభట్ల వేణుగోపాల్ కథలు మూడవది. ఒక రోజు లివర్ మూర్ లోని గుడికి వెళ్లేం. ఆలయాన్ని అద్బుతంగా కట్టేరు. చాలా బావుంది. ప్రధానాలయాలైన ఈశ్వరాలయం నార్తిండియన్ టైప్ గోపురాన్ని, వెంకటేశ్వరాలయం సౌతిండియన్ టైప్ గోపురాన్ని కలిగి ఉన్నాయి. తూర్పున రాజగోపురం, పశ్చిమాన చిన్నగోపురం, వెనక పెద్ద ప్రసాద ప్రదేశం, ఆ వెనక పెద్ద కాన్ఫరెన్స్ హాలు ఉన్నాయి. వినాయకుడు, కుమారస్వామి, దుర్గ, పార్వతీదేవి, శ్రీదేవి, భూదేవి, సీతారాములు, రాధాకృష్ణులు, నవగ్రహాల విగ్రహాలు ప్రతిష్ఠించబడి ఉన్నాయి. బోలెడన్ని వెండి బిందెలు, కలశాలు, విగ్రహాలకు అలంకరించబడిన బంగారు నగలు – చాలా రిచ్ గా ఉంది ఆలయం. వెళ్లినవాళ్లకి ఉచితంగా లంచ్, డిన్నర్ అక్కడే పెడతారట. మేం వెళ్లిన ఆ రోజు బిసిబేళిబాత్, దద్దోజనం పెట్టారు. సి.బి. రావు గారు వాళ్లూ ఇంకోవారంలో ఇండియాకు వెళ్లిపోతారని తెలిసి ఆ సాయంకాలం వాళ్లబ్బాయి ఇంటికి వెళ్లేం. ఓ రెండు గంటలు అక్కడ గడిపి, చదివేక వాళ్లకోడలుకి ఇచ్చేసే వొప్పందం మీద ఓ ఎనిమిది పుస్తకాలు తెచ్చుకున్నాను. రెండు రోజుల తర్వాత ఎన్. ఇన్నయ్యగారు వచ్చేరని, ఆయన్తో గెట్ టుగెదర్ ఏర్పాటు చేసానని, సి.బి. రావు గారు పిలిస్తే గీత, నేనూ వెళ్లేం. అక్కడి రచయితలు ఒక్కరు కూడా రాలేదు. ఇన్నయ్యగారు మంచి నాలెడ్జిబుల్ పెర్సన్. మంచి విషయాల మీద చర్చ జరిగింది. బోలెడన్ని కబుర్లు చెప్పుకొని రాత్రి 10 కి తిరిగివచ్చాం. అంతవరకూ సిరివెన్నెల పాపాయి బుద్ధిగా తన బుట్టలో నిద్రపోయింది.

          ఉన్నట్టుండి సెప్టెంబర్ లో ఒకరోజు సిరిపాపాయి నవ్వులు, ఇంకో రెండు రోజుల తర్వాత గట్టిగా ఏడవడం నేర్చుకుంది. కైజర్ హాస్పిటల్ వాళ్లు ముందే చెప్పినట్టు సెప్టెంబర్ 24న గీతా నేనూ పాపాయిని తీసుకెళ్లి 3 వేక్సినేషన్స్, 2 kind of drops వేయించాం, అంతే కొన్ని గంటల్లో పాపాయికి జ్వరం వచ్చేసింది. తను అలా కన్ను తెరవకుండా పడుకుని ఉండిపోతే ఇల్లంతా చిన్నబోయింది, నాకు మాటిమాటికీ కళ్లు చెమ్మగిల్ల సాగాయి. ఆ చిన్ని పాపాయితో పైకి చెప్పలేని అనుబంధమేదో ఏర్పడింది. బంధాలు కూడా బాధకు కారణాలేకదా! అదే హాస్పిటల్లో ఒకరోజు గీతకి, కోమల్ కి, వరూకి యాంటీఫ్లూ షాట్స్ (ఇంజక్షన్స్) ఇచ్చారు. అక్కడికి దగ్గర్లో ఉన్న చర్చి, పలు అంతస్తుల భవనం బేంకాఫ్ అమెరికా, సివిక్ సెంటర్ వగైరాలు చూసి ఫోటోస్ తీసుకున్నాం.

          1960 కి ముందూ వెనకా ఆంధ్రజ్యోతి కోసం సంజీవదేవ్ రాసిన వ్యాసాలు మూడు సంపుటాలు చదవడం పూర్తి చేసాను. ముఖ్యంగా వ్యాసాలు చిత్రకళ – కళాకారులు, ఆయన పరిచయస్తుల గురించే అయినా చిన్నదానికీ పెద్దదానికీ మనసును కలత చెందనీయకూడదంటాడు, లోకేశ్వర్ రాసిన తెలంగాణా చూపుతో చత్తీస్ ఘడ్ స్కూటర్ యాత్ర చదివేను. ‘చరైవేతి చరైవేతి2 అంటుంది ఐతరేయ బ్రాహ్మణం. ‘తిరుగుతూనే మనిషి జీవన మధువును పొందగలడు!.

          ఒక రోజు పాలో ఆల్టోలోని అపర్ణ గునుపూడి గారింటికి ‘నా కథల వెనుక కథలు’ అనే విషయం మీద నాతో ఏర్పాటు చేసిన గెట్ టుగెదర్ కి వెళ్లేం. దసరా సందర్భంగా వారింట్లో చక్కని బొమ్మలకొలువు కూడా పెట్టేరు. అపర్ణ సుబ్బారావు దంపతులు రకరకాల తెలుగువారి పిండివంటలు, చిత్రాన్నాలుతో అందరికీ ఆతిథ్యమిచ్చారు. గొర్తి బ్రహ్మానందం,  తాటిపాముల మృత్యంజయుడు, వేమూరి వెంకటేశ్వర్రావుగారు లాంటి సాహిత్యాభిమానులంతా కుటుంబాలతో వచ్చారు. అపర్ణగారు నన్ను ఆప్యాయంగా హత్తుకుని మెరూన్ బోర్డురున్న పర్పుల్ కలర్ గద్వాల్ చీర ఇచ్చారు. చాలా బాగా గడిచింది ఆ రోజంతా.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.