పౌరాణిక గాథలు -27
-భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి
వినయస్వభావము – ప్రహ్లాదుడు కథ
ప్రహ్లాదుడు ఒక చక్రవర్తి కొడుకు. అతడు ప్రేమ, అంకితభావం కలిగినవాడు. కాని అతడి తండ్రి హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడికి పూర్తి వ్యతిరేక భావాలు కలవాడు.
ప్రహ్లాదుడి తండ్రి హిరణ్యకశిపుడికి తన కొడుకు భగవంతుణ్ని స్మరించుకోడం అంటే ఇష్టముండేది కాదు.
ఎందుకంటే, అతడు భగవంతుడి కంటే తనే గొప్పవాడినని అనుకుంటూ ఉండేవాడు.
తన కొడుకు కూడా తనలాగే ఉండాలని కోరుకునేవాడు. ప్రహ్లాదుణ్ని తన మార్గంలోనే నడవమని చెప్పేవాడు. తన చుట్టూ ఉన్న సేవకుల దగ్గర్నుంచి క్రూరమైన పద్ధతుల్ని నేర్చుకోమని ప్రోత్సహించేవాడు.
హిరణ్యకశిపుడు ప్రహ్లాదుణ్ని తను చెప్పినట్టు వినకపోతే భయపెట్టేవాడు. తను చెప్పిన మార్గంలో నడుచుకోకపోతే అతణ్ని బాధలు పెట్టడానికి కూడ వెనకాడేవాడు కాదు.
పుట్టుకతోనే జ్ఞాని అయిన ప్రహ్లాదుడు చిన్నవాడైనా కూడా తన తండ్రి ఆదేశాలు మంచివి కావు కనుక అతడికి వ్యతిరేకంగానే నడుచుకునేవాడు.
హిరణ్యకశిపుడు గొప్ప బలపరాక్రమాలు కలిగిన చక్రవర్తి. భూమిమీద ఉన్నవాళ్లనీ, స్వర్గంలో ఉన్న వాళ్లనీ కూడా తన అధీనంలో పెట్టుకోగల సమర్ధుడు. అతడికి అసామాన్యమైన శక్తులు ఉన్నాయి.
అతడు తనకు మనుషులచేతగాని, జంతువులచేతగాని, రాత్రిగాని- పగలుగాని, ఇంటి లోపలగాని- ఇంటి బయటగాని చావు లేకుండా ఉండేలా వరం పొందాడు.
కనుక అతడు ఎవరికీ, ఎప్పుడూ భయపడక్కర్లేదు అనుకునేవాడు. కాబట్టి తనే అందరికీ దేవుడని, దేవుడికి కూడా తనే దేవుణ్ని అని చెప్పుకునేవాడు.
హిరణ్యకశిపుడికి ప్రపంచంలో ఉన్న ఏ వస్తువయినా తనకే చెందాలన్న కోరికతో ఉండేవాడు. ఎవరైనా ఎక్కడైనా సంపదగాని, భూమిగాని, రాజ్యంగాని గలిగి ఉన్నాడంటే అది కూడా తనకే చెందాలని అనుకునేవాడు.
ప్రహ్లాదుడు తనకు కొడుకుగా పుట్టడం దురదృష్టంగా భావించేవాడు. ప్రహ్లాదుడు కష్టాల్లో ఉన్న ప్రజల బాధల్ని అడిగి తెలుసుకునేవాడు.
నిస్సహాయులకి సహాయపడేవాడు. భయం అనేది ప్రహ్లాదుడికి చిన్నతనం నుంచీ తెలియదు.
తనకు తానుగా భగవంతుణ్ని పూర్తి అంకితభావంతో సేవించేవాడు. ఎప్పుడూ భగవన్నామం చేసుకుంటూ ఉండేవాడు. అతడికి కొన్ని నిర్దుష్టమైన భావాలు ఉండేవి. వాటినే ఎప్పుడూ అనుసరించేవాడు.
అతడి తండ్రి దుర్మార్గంగా ప్రవర్తిస్తూ…తనని కూడా అలాగే ఉండమని ప్రోత్సహిస్తూ…తననే అనుసరించమని చెప్పినా , చిన్నవాడైన ప్రహ్లాదుడు మాత్రం వాటిని పట్టించుకోకుండా అంకిత భావంతోను, అణకువతోను, దైవభక్తితోను మెలిగేవాడు.
హిరణ్యకశిపుడు కొంతమంది గురువులకి ప్రహ్లాదుణ్ని అప్పగించి భగవంతుణ్ని కాదు తండ్రినే పూజించాలి, భగవంతుడి కంటే అతడి తండ్రే గొప్పవాడు అని నరనరా ల్లోను జీర్ణించుకునేట్టు నేర్పించమని చెప్పాడు.
కాని గురువులు ఎంత చెప్పినా ప్రహ్లాదుడు మాత్రం మారలేదు. హిరణ్యకశిపుడికి కోపం వచ్చింది.
అటువంటి కొడుకు తనకు అవసరం లేదని, అతణ్ని ఎలాగయినా చంపించాలని నిర్ణయించుకున్నాడు. అతడికి విషం ఇప్పించాడు. అది అతణ్ని ఏమీ చెయ్యలేక పోయింది.
ఎత్తైన కొండల మీద నుంచి కిందకి తోయించాడు. అయినా అద్భుతంగా అతడు రక్షించబడ్డాడు.
ప్రహ్లదుణ్ని ఏనుగుల కాళ్లకింద పడేసి తొక్కించాడు. అది కూడా ఫలించలేదు.
హిరణ్యకశిపుడు ప్రహ్లాదుణ్ని ఎలాగయినా భూమి మీద లేకుండా చెయ్యాలని అనుకున్నాడు కాని అది అతడి వల్ల కాలేదు. ప్రపంచంలో ఉన్న అన్నింటినీ పొందగలిగిన హిరణ్యకశిపుడికి ప్రహ్లాదుడు ఒక సవాలుగా మారాడు.
సత్యాన్నే పలుకుతూ, పవిత్రంగా జీవిస్తూ, ప్రతిఫలాన్ని ఆశించని సేవతో జీవించే వాణ్ని భూమి మీద ఉన్నవాళ్లు, సూర్యుడికి పైన ఉన్నవాళ్లు కూడా ఏమీ చెయ్యలేరు.
అటువంటి వాడు ప్రపంచం మొత్తాన్ని ఒక్కడే ఎదిరించ గలడు. ఇందుకు కళ్లకి ఎదురుగా కనిపించే నిదర్శనంగా నిలబడ్డాడు ప్రహ్లాదుడు.
భగవంతుణ్ని మనస్ఫూర్తిగా నమ్మితే ఆయనే తన భక్తుణ్ని రక్షించుకుంటాడు అని ప్రహ్లాదుడు నిరూపించాడు.
అతడికి సొంత తండ్రి, శక్తివంతుడైన రాక్షసుడు, పెద్ద సైన్యం, పదునైన ఆయుధాలు, రాక్షస మాయలు, గొప్ప బలం ఇవన్నీ కలిగిన రాక్షసులకి చక్రవర్తి హిరణ్య కశిపుడు…చిన్న బాలుడైన ప్రహ్లాదుణ్ని చంపించడానికి అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నాడు.
కాని, ఏ ప్రయత్నమూ ఫలించలేదు. అతడికి ఏ ఒక్క అంశమూ హాని కలిగించ లేదు.
రాక్షసరాజుకి తన కొడుకు మీద కలిగిన కోపం తారస్థాయికి చేరుకుంది. తను అనుకున్న విధంగా కాకుండా తనకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న కొడుకు ప్రహ్లాదుణ్ని చూసి హిరణ్యకశిపుడికి ప్రశాంతత లేకుండ పోయింది.
తన కొడుకు తనపై చూపిస్తున్న తిరుగుబాటు ధోరణిని భరించలేక పోయాడు. విపరీతమయిన కోపంతో “”నేను నీకు నన్ను తప్ప వేరే ఏ దేవుణ్ని సేవించ వద్దని చాలాసార్లు చెప్పాను.
కాని, నువ్వు నీ మార్గంలోనే ఉన్నావు. నేను చెప్పినదాన్ని వినట్లేదు”” అన్నాడు.
అప్పటికీ ప్రహ్లాదుడు తండ్రి మాటలకి బదులుగా భగవంతుడి నామమే పలుకు తున్నాడు.
హిరణ్యకశిపుడు అడిగాడు “ ““నీ దేవుడు నిజంగా అన్ని చోట్లా ఉన్నాడా?””” అని.
ప్రహ్లాదుడు “ “ “అవును! అన్ని చోట్లా ఉన్నాడు!””” అని చెప్పాడు.
ఒక స్తంభాన్ని చూపిస్తూ ప్రహ్లాదుడి భావన తప్పు అని నిరూపించాలన్న ధోరణితో హిరణ్యకశిపుడు” “ “ఈ స్తంభంలో కూడా ఉన్నాడా?””” అంటూ ఆ స్తంభాన్ని గట్టిగా కొట్టాడు.
ఆ స్తంభం రెండుగా చీలింది. అందులోంచి ఎవరూ ఊహించని విధంగా హిరణ్య కశిపుణ్ని శిక్షించడానికి భగవంతుడు నరసింహావతారంలో వచ్చాడు.
సగం మనిషి,-సగం జంతువు ఆకారంలోను, రాత్రి- పగలు కాని సంధ్యా సమయం లోను , ఇంటి లోపల- బయట కాకుండా గడప మీద కూర్చుని హిరణ్యకశిపుణ్ని చంపేశాడు.
ఎవరయితే తనని చంపడం ఎవరికీ సాధ్యం కాదని అనుకున్నాడో అతడు భగవంతుడితోనే చంపబడ్డాడు.
ప్రహ్లాదుడు తండ్రి మాటలకి, చేతలకి తిరిగి సమాధానం చెప్పకుండా వినయంగా ప్రవర్తించి తండ్రికి మోక్షం, రాక్షసులకి భగవంతుడి దర్శనం కలగడానికి కారకుడ య్యాడు.
వినయస్వభావం కలిగిన వాళ్లకి భగవంతుడి ఆశీస్సులు ఉంటాయి!
*****