యాత్రాగీతం

హవాయి దీవులు – ఒవాహూ ద్వీపం – హనోలూలూ (చివరి భాగం)

-డా||కె.గీత

          మర్నాడు మా హవాయి యాత్రలో చివరి రోజు. ఆ ఉదయం సత్య, వరు మార్నింగ్ కామ్ అడ్వెంచర్ టూరు (Morning Calm Cruise adventure tour) కి వెళ్లారు. ఉదయం 7.30 నించి 11.30 వరకు సాగే ఈ టూర్ లో పడవ మీద సముద్రంలో కొంత దూరం వెళ్లి అక్కడ స్నోర్కిలింగ్ చెయ్యడం ప్రధానం. ఒక్కొక్కళ్ళకి దాదాపు $200 టిక్కెట్టు. ఇక సముద్రం మీద సాహసాలు ఇష్టం లేని మిగతా మేం అందరం ఆ ఉదయం పెరల్ హార్బర్ టూర్ కి వెళ్లాం. ఇంత క్రితం పెరల్ హార్బర్ టూర్ లో చూసినవే అయినా పిల్లలతో సరదాగా గడిచింది. 

          పెరల్ హార్బర్ లో ప్రధానంగా చూడవల్సిన టూరైన “యూఎస్ ఎస్ ఆరిజోనా నౌకా స్మృతి (USS Arizona)”,  మ్యూజియం, ఆరిజోనా నించి బయటకు తీసిన పెద్ద చుక్కాని, యుద్ధ నౌకల్లో ప్రధాన విశేషాలు, రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో బాంబింగుకి వాడిన కాప్సూల్స్, జపాను మీద అణుబాంబు జరిపిన కాప్సూల్ మొదలైన ఆరుబయటే ఉన్నవన్నీ సందర్శించాం. ఆ రోజు బాగా ఎండగా ఉండడంతో చివర్లో సిరి ఐస్ క్రీము కోసం పేచీ పెట్టి, ఇక నడవనని మారాం చేసింది. ఇక కాస్సేపు అంతా ఐస్ క్రీములు కొనుక్కుని కబుర్లు చెప్పుకుంటూ గడిపాము.  

          మధ్యాహ్న భోజనానికి దగ్గర్లో ఉన్న బర్గర్ ప్లేస్ కి వెళ్లి తిని, తిరిగి హోటల్ కు చేరాం. సత్య, వరు వాళ్ళ టూరులో మధ్యాహ్న భోజనం భాగం కావడంతో వాళ్లు భోజనానికి  మాతో కలవలేదు. 

          ఇక వాళ్లు తిరిగొచ్చాక, అందరం కలిసి మధ్యాహ్నమంతా హనుమా బే కి వెళ్లి సరదాగా సముద్ర స్నానాలు చేద్దామని రెండు గంటలకల్లా స్విమ్మింగ్ బట్టలు వేసుకుని బయలుదేరాం. అయితే తీరాచూస్తే హనుమా బే ఏదో కన్స్ట్రక్షన్ వల్ల మొత్తం మూసివేసి ఉంది. సత్య “కోకో హెడ్ పార్కు” అనే చోట ఉన్న కొండ మీదికి హైకింగ్ కి వెళ్ళొస్తానని బయలుదేరాడు. 

          తనని అక్కడ దిగబెట్టి, మేమంతా  మరో మంచి సముద్ర తీరం వెతుక్కుంటూ ముందుకు ప్రయాణం కొనసాగించాం. మొత్తానికి మరో గంట తరువాత వైమానాలో (Waimanalo Beach Park) తీరానికి చేరాం. వెచ్చని నీటిలో పిల్లలు తెగ ఆట మొదలెట్టే రు. సిరికి నీళ్ళంటే మహా సరదా కాబట్టి తాను కూడా పరుగెత్తింది. 

          నేను స్థిమితంగా చెట్టు కింద విశ్రమించాను. పిల్లలు హాయిగా నవ్వుకుంటూ, ఆడు కుంటూ ఉంటే నేను వాళ్లతో కలిసి సముద్రంలోకి దిగలేని బాధంతా మరిచిపోయాను. 

          మరో రెండు గంటల్లో సత్య హైకింగ్ అయిపోయిందని ఫోను చేసాడు. పిల్లల్ని అక్కడే వదిలి నేను వెనక్కి అరగంట డ్రైవ్ చేసుకుంటూ వెళ్లి సత్యని పికప్ చేసు కున్నాను. నడుము నొప్పికి స్ట్రాంగ్ మెడిసిన్ వేసుకున్నందువల్ల ఏం ఫర్వాలేదని నాకు నేను సర్ది చెప్పుకుని ధైర్యం చేశాను.  

          మార్గమధ్యంలో పిల్లల కోసం ఏదైనా కొనుక్కొద్దామని కోకో మెరీనా సెంటర్ కు వెళ్లాం. అయితే అక్కడ పార్కింగ్ లాటులో ట్రక్కులో అమ్ముతూ, తిని తీరవలసినవని పేరుగాంచిన హాట్ మలాసడాస్ (Hot Malasadas) అనే పోర్చుగీసు డోనట్స్ కనిపిం చాయి. పెద్ద లైనులో సత్య అరగంట నిలబడవలసి వచ్చినా మొత్తానికి డజను బాక్సు కొనుక్కుని పిల్లల దగ్గరకి వచ్చాము. 

          పిల్లలు ఆకలితో ఉన్నట్టు ఆవురావురుమని డోనట్లల్నీ చకచకా తినేశారు. అక్కడే సరదాగా సాయంత్రం ఆరు వరకూ గడిపాము. తిరిగొస్తూ హవాయి ఆకాశంలోని మేఘాల వెలుగుల మధ్య మెరుస్తున్న సాయం సంధ్య కాంతిని హృదయాన నింపుకున్నాం. 

          హోటలుకొచ్చి, స్నానాలు కానిచ్చి రాత్రి భోజనానికి దగ్గర్లో ఉన్న డ్యూక్స్ వైకికి రెస్టారెంటుకి వెళ్లాం. పిల్లలు బాగా అలిసిపోయినా భోజనం తరువాత షాపింగ్ అంటూ ప్రతి బ్లాకు చివరా ఉన్న ఏబీసీ స్టోర్లు తిరిగి ఒకళ్ళకొకళ్లు గిఫ్ట్ లు కొని ఇచ్చి పుచ్చుకున్నారు. నా కోసం ఆకుల్లేని చిన్న దేవగన్నేరు మొక్క కాండాన్ని కొన్నారు. Hawaii అమెరికాలో భాగమైనా, ఇక్కడినించి మరొక ప్రదేశానికి మొక్కలు, పళ్ళు, పూలు వంటివి పట్టుకెళ్ళడానికి అనుమతి ఉండదు. కానీ ఈ మొక్కని ఆ స్టోరులో లీగల్ పర్మిషన్ తో అమ్ముతున్నారు. నాకు దేవగన్నేరు పూలంటే చాలా ఇష్టం. దాన్ని ఇంటికి తెచ్చి అపురూపంగా కుండీలో పెంచుతున్నాం.కాలిఫోర్నియాలో మేం ఉండే ప్రాంతంలో చలికాలంలో ఉష్ణప్రాంతపు మొక్కలు చనిపోతాయి. వాటిని చలికాలంలో బతికించేం దుకు గ్రీన్ హౌస్లో, హీటర్లు పెట్టి ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. ఇప్పటికి ఇంకా పువ్వులు రాకపోయినా ఆ దేవగన్నెరు మొక్క మొత్తానికి బతికి బట్టకట్టి మెల్లగా ఎదుగుతూ ఉంది. 

          ఆ రాత్రి హవాయికి వీడ్కోలు తీసుకునేందుకు దార్లోనే సముద్ర తీరంలో ఉన్న 1890 లో జన్మించి సర్ఫింగులో హవాయికి ఒలింపిక్ మెడల్స్ సాధించి పెట్టిన “దుకే కహానమొకు” తొమ్మిదడుగుల కాంస్య విగ్రహం దగ్గరికి వెళ్ళాం. అక్కడే కాస్సేపు సముద్ర తీరంలో విశ్రమించాం. లేత ఆకుపచ్చని నీలి రంగులో సముద్రం తళతళా మెరుస్తూ తెల్లని నురుగుని చిలుకుతూ ఉంది. ఆహ్లాదంగా ఉన్న వాతావరణంలో ఎవరికీ నిద్ర రావటం లేదో, వచ్చినా వదిలెళ్ళడం ఇష్టపడ్డం లేదో కానీ పిల్లలు నాకూ, సత్యకీ చెరో వైపూ జేరబడ్డారు. మర్నాడు ఉదయమే మా తిరుగు ప్రయాణం. ఆయినా రాత్రి చాలా సేపటి వరకు ఆలా ఎంతో సేపు కబుర్లు చెప్పుకుంటూ సముద్ర తీరపు అందాల్ని ఆస్వాదిస్తూ కూర్చున్నాం. హవయి ఎన్ని సర్లు చూసినా మళ్లీ మళ్లీ చూడలనిపిస్తుంది. 

          మర్నాడు ఉదయం పదకొండుకే మా తిరుగు ప్రయాణం. అయితే పొద్దున్నే దెబ్బతిన్న కారు రిటన్ ఇవ్వడానికి ముందుగా సత్య, కోమల్ ఎయిర్ పోర్టుకి వెళ్లారు. కానీ రెండో కారు నా పేరుతో  తీసుకోవడం వల్ల కారు రెంటల్ వాళ్ళు నన్ను తీసుకు రావాల్సిం దేనని కాస్సేపు పేచీ పెట్టారు. ఒక పక్క సమయం అయిపోతుండడంతో మొత్తానికి వీడియో కాల్ లో నాతో మాట్లాడించడానికి ఒప్పుకుని కారు తిరిగిచ్చే కార్యక్రమాన్ని ఏదోలా పూర్తి చేసారు. వాళ్లు తిరిగొచ్చి రెండో కారులో అందరం ఎయిర్ పోర్టుకి చేరి, ఆ కారు కూడా రిటన్ ఇచ్చే సరికి సమయం సరిపోక మాకు ఆదరాబాదరా అయ్యింది. అయినా నేను వీల్ ఛైర్ లో ఉండడం వల్ల చెకిన్ లైనులో త్వరగా వెళ్లగలిగి, సమయానికి ఫ్లైట్ అందుకున్నాము.   

          ఇంటికి సజావుగా తిరిగొచ్చిన తరువాత ఆసుపత్రి చుట్టూ టెస్టులు, మందులు, ఇంజక్షన్లు  అంటూ తిరిగాక మరో మూడు నెలలు పట్టింది నేను పూర్తిగా కోలుకోవడానికి. నా నడుము నొప్పి ఒక్కటే నన్ను ఎంతో బాధించినా ఆ ప్రయాణం మొత్తానికి అందరం కలిసి వెళ్లిన మధురానుభూతిగా మనస్సులో మిగిలిపోయింది.

*****

(సశేషం)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.