
యే బారిష్ !! (కథ)
-ఇందు చంద్రన్
“పైనున్న వాళ్ళకి కిందుండే వాళ్ళ కష్టాలు ఎలా తెలుస్తాయండీ ? అంటూ ఏదో చెప్తూ ఉన్నాడు కిరణ్.
“అర్రే అలా అంటావేంటి ?….మేం కూడా కింద నుండే పైకొచ్చాంలేవోయ్….మాకేం డైరెక్ట్ గా సీనియర్ ఫోస్టింగ్ లు ఇవ్వలేదు అన్నాను అతని వైపు చూస్తూ
“ఎంతైనా గానీ…వద్దులేండి…..ఈ మాట ఇక్కడితో వదిలేద్దాం అన్నాడు కిరణ్ ఎటో చూస్తూ
“పర్లేదు…చెప్పు…అన్నాను మళ్ళీ
“కొన్ని సార్లు మన కష్టానికి తగ్గ ఫలితాన్ని వేరొకరు డబ్బులిచ్చి కొనేస్తూ ఉంటారు అన్నాడు సూటిగా
అతను దేని గురించి మాట్లాడుతున్నాడో అర్థమయ్యింది. వారం క్రితం జరిగిన ప్రమోషన్ మీటింగ్ లో అతని స్థానంలో మరొకరిని ప్రమోట్ చేయడానికి సిద్దమయ్యారు. చెప్పాలంటే నిజానికి కిరణ్ కి రావల్సిన ప్రమోషన్. కాని దాన్ని సమర్థిస్తూ ” ఏమో నీకింకా మంచి పొజిషన్ వచ్చే సంవత్సరం రావొచ్చే కదా? అన్నాను నేను కూడా.
“మీకు అర్థం కాదు మధు గారు….మీరుండేది ఎనిమిదో అంతస్తులో కదా? కిందకి చూడటం మర్చిపోయారేమో….ఓ సారి చూడండి అన్నాడు వెళ్ళిపోతూ
***
బాల్కనీ డోర్ మీద వర్షపు నీరు ధారలుగా కారుతూ ఉంది. ఎందుకో వర్షాన్ని చూస్తే నాకు అంత గొప్ప అనుభూతి కలగదు. ఏదో తప్పని పరిస్థితుల్లో తడవడం తప్ప ప్రత్యేకించి తడిచిన సందర్బాలు లేవు. నా చిన్ననాటి రోజుల్లో వర్షమే నాకు పెద్ద శత్రువు !! పొద్దున్న ఎండలో పెట్టిన ఇండోర్ ప్లాంట్స్ గుర్తొచ్చి బాల్కనీ లోకి వెళ్లాను. మొక్కలన్ని టిని లోపల పెట్టి బాల్కనీలో నిలబడి చుట్టూ చూస్తూ ఉన్నాను. వర్షం తనతో పాటు చల్లగాలిని , మట్టి వాసనని కూడా మోసుకొచ్చింది. ఆ మట్టి వాసన ఎక్కడ నుండి వచ్చిందో మరి ! వర్షంలో ఓ మధ్య వయస్కురాలు డాబా మీద గబగబా బట్టలు తీస్తూ ఉంది. ఎదురు బాల్కనీలో టీనేజీ కుర్రాడు ఫోన్లో వర్షాన్ని ఫోటోలు వీడియోలు తీస్తున్నట్టు ఉన్నాడు. చుట్టు పక్క ఫ్లాట్ లో ఎవరో మిర్చీ బజ్జీలు చేస్తున్నట్టున్నారు. చుట్టూ పక్కల చూడ్డం అయిపోయి కిందకి చూసాను. రోడ్ల మీద బండ్లన్నీ ఆగిపోయి పెద్ద క్యూ కట్టేసాయి. చిన్న చిన్న పండ్ల దుకాణాలు బండ్లన్నీ ఏదో మూల దాక్కోడానికి చోటు వెతుక్కుంటున్నారు. నిజం చెప్పాలంటే ఈ వర్షానికి అందరూ సమానమే కావొచ్చు…కాని అందరికీ ఈ వర్షం సమానం కాదు అనిపించింది. కొందరికి ఈ వర్షపు చినుకులు ముద్దాడి నట్టు అనిపిస్తే ఇంకొందరికి తడిపేసింది అన్నట్టు అనిపించొచ్చు. మరికొందరికి ముంచేసినట్టు కూడా అనిపించొచ్చు.
చివరగా నా చూపు ఓ గుడిసె దగ్గర ఆగింది.ఇల్లు వర్షానికి ఉరుస్తుందేమో దాని మీద పసుపురంగులో రూఫ్ కవర్ ని కప్పుతూ ఉన్నారు. ఓ వైపు ఆవిడ అందిస్తూ ఉంటే చూరు పైకి ఎక్కిన అతను దాన్ని లాగి కడుతూ ఉన్నాడు.ఇంతటి వర్షాన్ని ఆ రూఫ్ కవర్ ఆపేయగలదా? ఏమో వాళ్ళ నమ్మకాన్ని చూసి వర్షం కూడా ఆగిపోవచ్చు అనిపించింది. పైన కప్పేసి బయట ఉన్న సామాన్లన్నిటిని సర్దుకుంటు ఉన్నారు.
ఈ వర్షం చల్లని గాలి మట్టివాసనతో పాటు కొన్ని జ్ఞాపకాలని కూడా మోసుకొచ్చింది.
ఊరి చివరన శిధిలావస్తకి సిద్దంగా ఉన్న ఓ పెంకుటిల్లు, వర్షం పడితే ఇంటికి బయట పారే కాలువకి ఇంటి లోపల నిలిచే నీటి మడుగుకి పెద్ద తేడా తెలీదు. ఇంట్లో తేలిక సామాన్లు కొన్ని నీళ్లలో పడవల్లా తేలేవి.
ఆ వర్షంలోను స్కూలు బ్యాగులు పుస్తకాలు మాత్రం భద్రంగా కవర్లలో చుట్టేసి అలమారలెక్కేసేవి. ఒక్కోసారి వండుకోడానికి తినడానికి కూడా కుదరదు. వర్షం ఎప్పుడు తగ్గుతుందా? అని చూరు కేసి చూస్తూ ఉంటే కొన్ని సార్లు తెల్లారిపోతూ ఉండేది. చెప్పాలంటే వర్షంతో పెద్దగా చెప్పుకోడానికి తీపి జ్ఞాపకాలేవి లేవు. వర్షం వస్తుందంటే ఒక రకమైన భయం…..పస్తులున్న రోజులు, పై కప్పు కూలిపోతుందని నిద్ర మేల్కున్న రోజులే గుర్తొస్తాయి. ఇప్పుడైతే చూరు పై నుండి నీరు కారదు, ఇంటి లోపలకి నీళ్లు కూడా రావు అని అదొక గర్వం.
అమ్మ కవర్లతో చుట్టి అలమారలో దాచిన పుస్తకాలు మా జీవితాల్ని మార్చేసాయి. చెప్పాలంటే అమ్మ నమ్మకమే మమ్మల్ని ముందుకు నడిపించింది. మనం సాధించాలి అనుకున్న వాటికంటే కూడా మన మీద నమ్మకంతో మనకి ఒక అవకాశాన్ని ఇచ్చిన ప్పుడు దాన్ని నిలబెట్టుకోడానికి ఎంత దూరం అయినా వెళ్లిపోతూ ఉంటాం.అదేంటో మనకి మన మీద ఉన్న నమ్మకం కంటే కూడా వేరొకరు మన మీద పెట్టుకునే నమ్మకం కాస్త బలంగా అనిపిస్తూ ఉంటుంది.
చీకటైపోయింది…వర్షం కూడా తగ్గిపోయింది. రోడ్లు ఖాళీ అయిపోయాయి. ఆ పూరి గుడిసె వైపు చూసాను.
ఓ చిన్న బల్బు వెలుగుతుంది. లోపల నుండి తొమ్మిదేళ్ల కుర్రాడు గిన్నెలో ఏదో జాగ్రత్త గా పట్టుకుని గుట్టలుగా పోసి ఉన్న మట్టి దిబ్బల వైపు వెళ్తున్నాడు. నా చూపులు కూడా వాడి వెనకనే పరిగెడుతున్నాయి. చీకటిలో సరిగ్గా కనిపించలేదు కాని మట్టి దిబ్బల వెనక ఉన్న కుక్క పిల్లలకి గిన్నెలో ఉన్న ఆహారాన్ని పెడుతున్నట్టున్నాడు. దగ్గరగా చూడాలనిపించింది….హ్యాంగర్ కి ఉన్న స్కార్ఫ్ తీసి మెడకి చుట్టుకుని కిందకి వెళ్లాను. దారి మొత్తం నీటి గుంటలు, బురద….ఒకప్పుడు నేను నడిచిన దారిని గుర్తుచేస్తున్నాయి. ఆ పిల్లాడి వైపు నడిచాను. కుక్కపిల్లతో ఆడుకుంటున్నాడు.
“నిన్నిక్కడ ఎప్పుడూ చూడలేదే ? అన్నాను పిల్లాడి వైపు చూసి నవ్వుతూ
“మేం…ఈడికొచ్చి నాలుగురోజులైంది అన్నాడు కుక్క పిల్లని ఒళ్లో కూర్చో బెట్టుకుంటూ
“మరి…నీకెలా తెలుసు…ఇక్కడ కుక్కపిల్లలున్నాయని ? అన్నాను వాడి పక్కన కూర్చుంటూ
“వాన పడింది కదా….ఇవి అరుస్తాంటే ఇనిపించింది అన్నాడు.
“మరి బువ్వ పెట్టేసావా? అన్నాను.
“తినేసినాయి…అన్నాడు ఖాళీ గిన్నెను చూపిస్తూ
“మరి నీకు….అన్నాను పిల్లాడి కళ్లలోకి చూస్తూ
“నా దగ్గిర పది రూపాయుండాయి…అంగిట్లో ఏదైనా కొనుక్కుంటా…ఇవి చిన్ని పిల్లలు కదా ఆకిలికి అరుస్తాండాయి అన్నాడు అమాయకపు కళ్ళతో నవ్వుతూ కాసేపు మాట్లాడితే తెలిసింది, అక్కడ జరిగే కంస్ట్రక్షన్ పనికి రోజు కూలి పని చేయాడానికి వాళ్ళ అమ్మనాన్నలు వచ్చారని. స్కూల్ మధ్యలో ఆపేసి వచ్చేసాడని కూడా ఏదో మాటల్లో చెప్పేసాడు. పిల్లాడితో మాట్లాడే వరకు కూడా నాకు వీధి కుక్కలు వర్షాకాలంలో ఉండటానికి చోటు లేక అలమటిస్తాయన్న విషయం బుర్రకి తట్టనే లేదు. వాటి గురించి ఆలోచించలేదు కూడా. మా అమ్మ ఎప్పుడూ అంటూ ఉండేది మన ఎదుగుదల చుట్టూ ఉన్న వాళ్ళ కళ్లలో చూసినప్పుడు ఎక్కువ సంతోషాన్నిస్తుందని. కాని నాలో ఏదో మూలన నాకెందుకులే అన్నట్టు దాగి ఉన్న స్వార్థం స్పష్టంగా కనిపించింది ఆలోచిస్తూ వచ్చేసాను. వాడు కుక్క పిల్లల్ని తీసుకుని వాళ్ళ ఇంటి వైపు వెళ్ళాడు.
***
మధు గారు…..ఎందుకని కిరణ్ ని ఆ పొజిషన్ కి ప్రమోట్ చేద్దామంటున్నారు. మనకి తెలుసు కదా తన కెపాసిటీ ? అన్నాడు సీనియర్ ఆఫీసర్.
“ఒక అవకాశం ఇస్తే కదా తన కెపాసిటీ తెలుస్తుంది. మనం కూడా ఒక్క అవకాశం ఇస్తేనే కదా సర్ ఇన్ని మెట్లు ఎక్కగలిగాం అంది నవ్వుతూ.
“ఒకే…విల్ థింక్ అబౌట్ ఇట్ అని ఆయన వెళ్లిపోయారు.
మబ్బులు కమ్ముకుంటున్నాయి. చల్లటి గాలి వీస్తూ ఉంది. ఒక్కో చినుకు నేలని తాకుతూ ఉంది.
“అక్కా….మాములు నాలుగు పడవలు , నాలుగు కత్తి పడవలు చేసా…వాన పడతా ఉంది రా అక్కా అన్నాడు , పారుతున్న నీళ్లలో పడవల్ని వదిలేసి కేకలు వేస్తూ.
వర్షంతో తడుస్తూ “నీ పుస్తకాలు ఇక్కడ తడిచిపోయేలా ఉన్నాయి రా అంది తన చీర కొంగున పుస్తకాల్ని దాచేస్తూ…….
*****

ఇందు చంద్రన్ స్వస్థలం చిత్తూరు జిల్లా. బి టెక్ పూర్తి చేసుకుని ఐటీ లో ఉద్యోగం చేస్తున్నాను. కథలు , కవితలు చదవడం అంటే ఇష్టం. ఆ ఇష్టంతో సరదాగా రాయటానికి ప్రయత్నిస్తున్నాను.