రాగసౌరభాలు-13

(చక్రవాకం)

-వాణి నల్లాన్ చక్రవర్తి

          ప్రియ నేస్తాలందరికి శుభాకాంక్షలు. ఈ నెల మనసును కదిలించే చక్రవాకం రాగాన్ని గురించిన విశేషాలు తెలుసుకుందాము.

          చక్రవాకం 72  మేళకర్తల పథకానికన్నా మునుపే ఉన్న పురాతన రాగం. పూర్వ నామం వేగవాహిని. 16వ మేళకర్తగా ఇమడ్చటానికి వెంకటమఖీ రాగ నామానికి ముందు తోయ అనే అక్షరాలను చేర్చి తోయవేగ వాహినిగా నామకరణం చేశారు. దీక్షితులుగారు కూడా ఈ నామాన్నే గుర్తించారు. గోవిందాచార్యులు 72 మేళకర్తల నామాలను సరిచేసి మార్చినపుడు ఈ రాగ నామం చక్రవాకంగా స్థిరపరచారు. తరువాత చక్రవాకము అనే పేరు వ్యావాహారికంగా స్థిర పడింది.

          చక్రవాకం 16 వ మేళకర్త అవటం వలన సప్త స్వరాలు కలిగిన సంపూర్ణ రాగం. ఇందులోని స్వరాలు షడ్జమ్, చతుశృతి రిషభం, అంతర గాంధారం, శుధ్ధ మధ్యమం, పంచమం, చతుశృతి దైవతం, కైశికి నిషాదములు. ఇది సర్వస్వర గమకవరీక రాగము. రక్తి రాగము. రిషభ, నిషాదములు జీవ స్వరములు. మూర్చనాకారక మేళము. విస్తారము కలిగిన రాగము.

          ఈ రాగము అన్ని వేళలా పాడదగినది. భక్తి కరుణ రసాలను ప్రేమ సానుభూతి వంటి అనుభూతులను పంచగలిగినది. ఈ రాగములో అనేక అద్భుతమైన సంగీత రచనలే కాక, లలిత, సినీ సంగీతంలోనూ విస్తృతంగా వాడబడింది. హిందూస్తాని సంగీతంలో ఆహిర్ భైరవ్ గా పిలువబడే ఈ రాగంలో ఎన్నో మనసుని కదిపి కుదిపేసే హిందీ పాటలు కూర్చబడ్డాయి.

          ఈ రాగం యొక్క కరుణ రసం గురించి ప్రస్థావిస్తే చక్రవాక పక్షుల గురించిన కథ చెప్పుకోవాలి. ఈ చక్రవాకపక్షులు బాతు జాతి ఎర్రని పక్షులు. ఒక ముని తపసుని భంగం  చేసిన పక్షి జంటగా శాపగ్రస్తలు అయ్యాయని కథనం. పగలంతా కలిసి ఉండే ఈ జంట పక్షులు రాత్రి వేళ విడిపోతాయట. అందువలన రోజు రాత్రి సమయాన జంట పక్షి కోసం శోకిస్తూ అరుస్తూ ఉంటాయట.

          త్యాగరాజ స్వామి ఈ రాగంలో చక్కని కృతులను పాడి ప్రచారంలోనికి తెచ్చారు. శ్రీ మహావైద్యనాథ అయ్యరు ఒక సంగీత సభలో అత్యద్భుతంగా, అత్యంత విస్తారంగా, చాకచక్యంగా  గానం చేసి ్రోతలను ఆనంద పరవశులను చేశారట.

          ఈ రాగం రక్తపోటును నియంత్రించ గలదని అభిప్రాయము. అలానే చర్మ సంబంధిత, కండరాల బాధలను కూడా నివారిస్తుందట.  ఏకాగ్రతను పెంచగలదట.

ఇపుడు కొన్ని చక్రవాక రచనలు చూద్దామా?

శాస్త్రీయ సంగీతము

  1. వర్ణము            వలచి                                అట                                పొన్నయ్య పిళ్లయ్
  2. కృతి                సుగుణములే                    రూపక                             త్యాగరాజు
  3. కృతి                 ఎటుల బ్రోతువో              త్రిపుట                           -do-
  4. కృతి                 గజాననయుతం              ఆది                                దీక్షితులు
  5. కృతి                 సరోజనాభా                       ఆది                                స్వాతి తిరునాల్
  6. కీర్తన                 పిబరే రామరసం             ఆది                                సదాశివ  బ్రహ్మేంద్ర

సుగుణములే: https://youtu.be/nOAs7qi0sww?si=ycK9lg8tVtT_SQw-

అన్నమాచార్య కీర్తనలు

  1. చందమామ రావో                                ఆది                 బాలకృష్ణ ప్రసాద్
  2. త్రికరణ శుద్దిగా                                     ఆది                బాలకృష్ణ ప్రసాద్

చందమామ రావో: https://youtu.be/XvsmbHdRSDQ?si=ca4UK371p7S69cRt

లలిత సంగీతం

  1. చక్రవాకమిది                              బాలకృష్ణ ప్రసాద్                    సాయిబాబా p v
  2. తెలవారక మున్నే                      దేవులపల్లి                                పాలగుమ్మి విశ్వనాధం
  3. కొత్త కోవెల                                   దేవులపల్లి                                పాలగుమ్మి విశ్వనాధం
  4. మరపురాని కలలు                     మల్లవరపు విశ్వేశ్వరరావు      చిత్తరంజన్

సినిమా సంగీతం

  1. రాధకు నీవేరా ప్రాణం                           తులాభారం                  సుశీల
  2. ఏడుకొండల వాడ                                   పెళ్లిచేసి చూడు          లీల
  3. వీణలోన తీగలోన                                     చక్రవాకం                    సుశీల
  4. జగమే రామమయం                                కథానాయక మొల్ల      సుశీల

జగమే రామమయం: https://youtu.be/u4DIlhf05QQ?si=_ehdlgtjs5KnRNS1

          చూసారుగా? ఇవండి చక్రవాక రాగ విశేషాలు. వచ్చే నెల మరొక మంచి రాగ విశేషాలతో మీ ముందుంటాను. అంతవరకు సెలవా మరి?

 
*****
Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.