
వెనుతిరగని వెన్నెల(భాగం-68)
–డా||కె.గీత
(*“కౌముది” లో ధారావాహిక నవలగా 2015 నుంచి 2020 వరకు ప్రచురించబడిన “వెనుతిరగని వెన్నెల” ఇప్పటివరకు చదవని వారి కోసం కౌముది సౌజన్యంతో నెల నెలా ఆడియోతో బాటూ ఇక్కడ ఇస్తున్నాం.)
***
జరిగిన కథ: అమెరికాలో తన తల్లికి స్నేహితురాలు, స్త్రీలకు సహాయం చేసే సంస్థ “సహాయ”ను నడిపే ఉదయినిని కలవడానికి వస్తుంది సమీర. నాలుగు నెలల గర్భవతైన సమీర, తనకు విడాకులు తీసుకోవాలని ఉందని, అందుకు దోహదమైన పరిస్థితుల్ని చెపుతుంది. ఉదయిని “తన్మయి”కథ చెపుతాను, విన్నాక ఆలోచించుకోమని చెప్తుంది సమీరతో. చుట్టాల పెళ్లిలో కలుసుకున్న తన్మయి, శేఖర్ లకు పెద్దవాళ్ల అనుమతితో పెళ్లిజరుగుతుంది. పెళ్లయిన మరుక్షణం నించే శేఖర్ అసలు స్వరూపం బయట పడుతుంది. మొదటి సంవత్సరంలోనే అబ్బాయి పుడతాడు. శేఖర్ తో ఒక పక్క కష్టాలు పడుతూనే తన్మయి యూనివర్శిటీలో ఎమ్మే పాసయ్యి, పీ.హెచ్.డీలో జాయినవుతుంది. శేఖర్ తో ఎన్నో రోజులు పోరాడి, చివరికి తన్మయి విడిపోతుంది. హైదరాబాదుకు దగ్గర్లో తన్మయికి లెక్చరర్ గా ఉద్యోగం వస్తుంది. చిన్ననాటి స్నేహితుడు ప్రభుతో మళ్లీ పెళ్లి జరుగుతుంది. ప్రభుతో బాటూ అతని కుటుంబం కూడా వచ్చి చేరి, హింస మొదలవు తుంది.
***
కేంటీన్ లో టిఫిన్, కాఫీ అయ్యేక అమెరికా నుంచి తెచ్చిన కొత్త కేమేరాతో ఫోటో తీస్తూ “కాబోయే డాక్టరు తన్మయి గారి “చరిత్రాత్మకమైన కేంటీన్” అంటూ కాప్షను వెయ్యాలి ఈ ఫోటో కింద” అని,
“అయినా ఏ మాట కామాటే చెప్పుకోవాలి నువ్వు చెప్పినంత గొప్పగా అయితే ఏవీ లేదిక్కడ ఇడ్లీ” అన్నాడు నవ్వుతూ ప్రభు.
మరలాంటప్పుడు “ఏ మాట కామాటే చెప్పుకోవాలి” అని పాజిటివ్ గా వాక్యాన్ని ప్రారంభించడం ఎందుకో” అంది ఉడుకుమోత్తనంగా.
“మీ అంత తెలుగు మాకు రాదు లెండి తన్మయి గారూ” అంటూ “నేను పాపని, మృదుల్ ని తీసుకుని రూంకి వెళ్లిపోతాను. నువ్వు మాస్టారు రాగానే అన్నీ చక్కబెట్టుకుని నేరుగా వచ్చేసెయ్యి. అక్కణ్ణించే అందరం కలిసి బయటికి వెళ్దాం. ఏమంటావ్” అన్నాడు.
అప్పటికే అలసటగా భుజమ్మీద నిద్రపోసాగింది పాప.
“సరే కానీ, అదుగో మాస్టారు వస్తున్నట్టున్నారు. ఒక్కసారి పలకరించిన తర్వాత వెళ్లండి”. అంది దూరంగా డిపార్టుమెంటు మలుపు తిరుగుతున్న మాస్టారి మారుతీ కారుని చూస్తూ.
***
మాస్టారు వస్తూనే “ఏమ్మా ఎలా ఉన్నావురా” అని పలకరించేరు.
తన్మయి ఎదురెళ్లి కాళ్లకి నమస్కరించింది.
“పిల్లాపాపలతో కలకాలం చల్లగా ఉండు” అంటూ “కూర్చోండి ప్రభూ! మీ లాంటి గొప్ప యువకులే దేశానికి గర్వకారణం. తన్మయి మా అమ్మాయిలాంటిదే. తనకి మంచి జీవితాన్నిచ్చిన మీరంటే గొప్ప గౌరవం నాకు. తనెన్ని ఇబ్బందులు పడిందో నాకు తెలుసు. ఇప్పుడు మా అమ్మాయిని ఇలా సంతోషంగా చూడడం ఎంతో ఆనందంగా ఉంది” అంటూ తన్మయి పక్కనే నిల్చున్న బాబుని దగ్గరకు పిలిచి ఒళ్లో కూర్చోబెట్టుకుని “ఎంత పొడుగయ్యేడో!” అన్నారు.
“ఏమోయ్, మా పెరట్లో జామకాయలు జ్ఞాపకం ఉన్నాయా? ఇదో ఇలా మీ చెల్లిలాగే నిన్ను కూడా ఒళ్లో కూచోబెట్టుకుని అమ్మ ఆ చెట్టు కింద కూచుని చదువుకునేది. మా ఇంటికి ఎప్పుడొచ్చినా మనిద్దరం పెరట్లో ఆడుకునే వాళ్లం గుర్తుందా” అన్నారు బాబునుద్దేశించి.
బాబు నవ్వుతూ తలూపేడు.
ఆయన ఆప్యాయతకి కళ్లల్లో నీళ్లు వచ్చేయి తన్మయికి. ఒక గొప్ప ఉపాధ్యాయుడి లక్షణాలేవిటో ఆయనని చూసినప్పుడల్లా అర్థం అవుతూ ఉంటాయి తన్మయికి. అయిదు నిమిషాల తర్వాత ప్రభు లేవబోతూంటే “కూర్చోండి, టీ చెపుతాను. మధ్యాహ్నం భోజనా నికి మా ఇంటికే వెళ్దాం” అన్నారు.
“అయ్యో వద్దండి. నా మిత్రుడొకాయనకి వస్తామని చెప్పేను. టీ కూడా వద్దండి. ఇప్పుడే కాఫీలు తాగేం. నేను పిల్లల్ని తీసుకుని వెళ్తాను. తన్మయి మీతో మాట్లాడేక తరువాత వస్తుంది” అంటూ లేచేడు ప్రభు.
బాబు తన్మయి దగ్గిరికొచ్చి “బై” అని చెప్పి, బుద్ధిగా పాపాయి చిన్న బ్యాగు పట్టుకుని ప్రభుని అనుసరించేడు.
“తన్మయీ! ఎంత అదృష్టవంతురాలివమ్మా! నీ కష్టం చూసి ఆ భగవంతుడే నీ కోసం ఇంత మంచి వ్యక్తిని పంపించేడు. అన్నట్టు ఏదీ రీసెర్చి నోట్సు తెచ్చేవా” అన్నారు.
ముఖ్యమైన విషయాలు చర్చించి మరో అరగంటలో “ఒక గంట క్లాసు ఉంది ఇప్పుడు. కాగానే వచ్చి వివరంగా చూస్తాను. నువ్వు కావాలంటే అలా వెళ్లిరా” అన్నారు లేస్తూ.
తన్మయి డిపార్టుమెంటులోంచి బయటికొచ్చి మేరీ డిపార్ట్ మెంటు వైపు అడుగులేసింది. త్రోవ పొడవునా ఎప్పటిలాగే నిల్చున్న ఎత్తైన చెట్ల మధ్య ఎండా నీడలు దోబూచులాడే సన్నని బాటకిరుప్రక్కలా కొత్తగా మొలిచిన పచ్చిక అక్కడక్కడా తడి మెరుస్తూన్న గడ్డిపూలతో ఆహ్వానించింది. చిరు చల్లని గాలి వీస్తూ ఆహ్లాదంగా ఉన్నా విశాఖపట్నపు జిడ్డు వాతావరణం అలవాటు పోవడం వల్ల చెమటలు ధారాపాతంగా కారసాగేయి తన్మయికి. కర్చీఫుతో తుడుచుకుంటూ పక్కనే ఉన్న లైబ్రరీ వైపు చూసింది. జే ఆర్ ఎఫ్ కి దీక్షగా చదువుతూ ఉన్నప్పటి సంఘటనలన్నీ కళ్ల ముందు కదలాడ సాగేయి.
కరుణ, అనంత, రాజు, దివాకర్ జ్ఞాపకం వచ్చేరు.
“కరుణ ఎక్కడ ఉన్నాడో తనెప్పుడూ ఇక కనుక్కునే ప్రయత్నం చెయ్యలేదు. ఒకసారి మనుషులు జీవితంలోంచి తుడిచి పెట్టుకుపోయేక మళ్లీ గుర్తుకు తెచ్చుకోవడం అన్నది అర్థం లేనిది.
అనంత, రాజు ప్రభుత్వ స్కూళ్లల్లో టీచర్లుగా ఉద్యోగాలొచ్చి వాళ్ల జిల్లాలోనే స్థిరపడ్డారని ఆ మధ్య ఉత్తరం రాసింది అనంత. తను రిప్లై రాసినా ఇక ఎందుకో జవాబు రాలేదు అట్నుంచి.
ఇక దివాకర్ ఎక్కడ ఉన్నాడో. వాళ్లు మాస్టారింటికి దగ్గర్లోనే ఉంటారు కాబట్టి మాస్టారిని అడిగి తెలుసుకోవాలి.”
సాలోచనగా భుజం చుట్టూ కొంగు కప్పుకుని నడుస్తున్న తన్మయిని డిపార్టుమెంటు బయటే వేచి చూస్తున్న మేరీ గబగబా ఎదురొచ్చి సంతోషంగా కౌగిలించుకుంది.
“ఎంత బాగున్నావో తనూ నువ్వు. భలే అందం వచ్చింది నీకు” అంది నవ్వుతూ.
సంతోషంగా డిపార్టుమెంటులో ప్రత్యేకంగా ఉన్న తన రూముకి తీసుకెళ్లింది. గుమ్మం బయట “డా|| మేరీ, అసిస్టెంట్ ప్రొఫెసర్” అన్న బోర్డు చూసి సంతోషంగా మేరీ చేతులు పట్టుకు ఊపింది తన్మయి.
“అబ్బ, నీ కష్టాలన్నీ తీరి నిన్ను ఇలా ఉన్నత స్థితిలో చూస్తుంటే ఎంత సంతోషం గా ఉందో తెలుసా మేరీ” అంది ఆనందంగా నవ్వుతూ.
“అందుకే ఏది జరిగినా మన మంచికే అంటారు పెద్దలు. నీకు అతిచిన్న ఎలిమెంటరీ టీచరు ఉద్యోగం రాలేదని నువొకప్పుడు ఎంతో బాధపడ్డావు. అది రాక ఎంత మేలు జరిగిందో చూసావా?” అంది.
“అవును. నువ్వప్పుడు ధైర్యం చెప్పబట్టి సరిపోయింది. అదిసరే గానీ ప్రభు, పిల్లలు ఏరీ” అంది మేరీ.
“పాప అలిసిపోయి నిద్రపోయింది. లేస్తే పేచీ పెడుతుందని రూముకి తీసుకుని వెళ్లిపోయేడు. బాబుని కూడా తీసుకెళ్లేడు” అంది తన్మయి.
“నయమే బాబుని కూడా బాగా చూసుకుంటున్నాడు ప్రభు” అంది మేరీ.
తన్మయి చిన్న నవ్వు నవ్వింది. అందులో ఉన్న విషాదాన్ని వెంటనే పసిగట్టినట్టు
“అంతా ఓకేనా?” అంది మేరీ.
“ఫర్వాలేదు” అంది మళ్లీ నవ్వబోతూ.
“దా.. అలా కేంటీన్ వరకూ వెళ్లి కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం. ఇప్పుడు నాకు క్లాసులేవీ లేవులే” అంది మేరీ.
మేరీ ఎప్పుడూ తన మనసెరిగి నడుచుకోవడం తన్మయిని ఆశ్చర్యచకితురాల్ని చేస్తుంది. తనకున్న సమస్యల్ని తల్చుకోగానే ఊపిరి సలపనట్టయ్యి తనకీ అలా బయటికి నడిస్తే బావుణ్ణనే అనిపించింది తన్మయికి.
“ఊ చెప్పు తనూ! నీ కష్టాల్ని నేనెప్పుడూ ఆర్చలేను, తీర్చలేను గానీ కనీసం పంచుకోగలను” అంది మేరీ తన్మయి చేతిని తన చేతిలోకి తీసుకుని నడుస్తూ. తన్మయి చెప్పింది విని కాఫీ కప్పు పక్కకి పెడుతూ “ఊ.. మగవాళ్లు అందరూ ఒక్కటే తనూ! ఏదో ఒక లోపంతోనే ఉంటారు. అవి స్త్రీలు భరించగలిగిన శాతంలో ఉన్నప్పుడే సంసారాలు నిలబడతాయానుకుంటా. కొన్ని సార్లు అసలు భరించగలిగే అవకాశమే ఉండనంత వంద శాతం లోపాలున్నవాళ్లూ ఉంటారనుకో నా భర్తలాగా.” అని నిట్టూర్చింది.
అంతలోనే “చిన్న వయసులో పెద్ద జీవితాన్ని చవి చూసిన నీకు చెప్పనే అవసరం లేదనుకో. కానీ ఎంతో అర్థం చేసుకుని పెళ్లి చేసుకున్న ప్రభు అతని తల్లిదండ్రులు నిన్ను, బాబుని ఏడిపిస్తుంటే ఎందుకు ఉపేక్షిస్తున్నాడో నాకు అర్థం కావడం లేదు. కలకాలం నిన్ను భద్రతగా చూసుకోవలసిన బాధ్యత అతనిదే కదా! వేధింపు మానసిక మైనా క్షమార్హం మాత్రం కాదు. అతనికి అతని తల్లిదండ్రుల మీద ఎంత ప్రేమ ఉన్నా వాళ్లు నీ పట్ల సవ్యంగా నడచుకోనప్పుడు వాళ్ల ప్రవర్తన మార్చుకోమని చెప్పాల్సిన బాధ్యత కూడా అతనిదే. అలా కానప్పుడు నిన్ను పరిపూర్ణంగా ప్రేమిస్తున్నాడని అతను అనుకుంటున్నాడంటే అది సత్యం కాదు.” అంది.
కాస్సేపు నిశ్శబ్దంగా ఉండి “ఎప్పుడూ నాకు మాత్రమే సమస్యలు ఎందుకు ఎదురవుతాయో అర్థం కావడం లేదు మేరీ. ప్రభుని పెళ్లి చేసుకోవడానికి సంవత్సరం పాటు ఆలోచించినది ఇందుకే. అయినా తప్పు ఎక్కడ జరిగిందో అర్థం కావడం లేదు. తల్లిదండ్రులు ఎదురుగా లేకపోతే అత్యంత ప్రేమ మూర్తిగా ఉండే ఇతను వాళ్ల ఎదురుగా ఒక విభిన్నమైన మనిషిగా ప్రవర్తిస్తాడు. అంతెందుకు ఇప్పుడు బాబుని చక్కగా కూడా తీసుకెళ్లేడా? వాళ్ల ఎదురుగా అసలు వీడి వైపు చూడడానిక్కూడా ఇష్టం లేనట్లు ప్రవర్తిస్తాడు.
వాళ్ల మీద తనకున్న ప్రేమని చాటుకోవడానికో, వాళ్లతో చెప్పాపట్టకుండా పెళ్లి చేసుకున్నాడన్న గిల్టీ ఫీలింగుని తప్పించుకోవడానికో మరి. ఏదేమైనా వాళ్లు బాబుని, నన్ను నానా మాటలంటుంటే అతను ఉపేక్షీంచడమే కాకుండా, నన్ను కూడా భరించాల్సిందే అని చెప్పడం పరమ అన్యాయంగాను, చికాగ్గాను ఉంది నాకు. అసలు ఆ పసివాడి మనస్సు ఎంత గాయపడుతూందోనన్న ఇంగిత జ్ఞానం లేదు. ఆలోచిస్తూంటే మా జీవితాలు ఇలా గందరగోళంగా తయారు కావడానికి కారణం నేనే అన్న గిల్టీ ఫీలింగు నన్ను దహించేస్తూంది. ఒక పక్క ఒకరికి ఇద్దరైన పసిపిల్లలు. ఎటువంటి అడుగు వెయ్యాలన్నా ఎంతో ఆలోచించాల్సి వస్తూంది.” అంది తన్మయి ఉద్విగ్నంగా.
“బాధ పడకు తనూ! ప్రభుతో నువ్వు మనసు విప్పి గట్టిగా మాట్లాడడమొక్కటే పరిష్కారంగా తోస్తూంది నాకు. అయినా వినలేదనుకో పిల్లలిద్దరినీ తీసుకుని ఇక్కడికి ట్రాన్స్ఫర్ పెట్టుకుని వచ్చెయ్యి. ఎలాగూ ఇప్పుడు 610 జీవో అమలుకాబోతూంది కదా! కష్టమో, నష్టమో మనమే పెంచుకోవచ్చు. పిల్లల్ని ఆరోగ్యకరమైన వాతావరణంలో పెంచడం అవసరం. నీకు ఇటువంటి మానసిక ఆందోళనలు అవసరం లేదు. అవునూ పిల్లల్ని చూసుకోవడానికి మీ ఊరి అమ్మాయిని తోడు తీసుకెళ్లావుగా. ఏమయ్యింది?” అంది.
“అమ్మాయి ఉంది మేరీ. తనుండబట్టే నేను ధైర్యంగా పాపని, బాబుని పెంచుకొస్తూ , ఉద్యోగం చెయ్యగలుగుతున్నాను. మేమిలా ఊరొస్తున్నామని ఇంటికి వెళ్లొస్తానంటే పంపించేం.” అని గట్టిగా ఊపిరి తీసుకుని
“నువ్వు చెప్పినట్టు మాట్లాడడమూ అయ్యింది మేరీ. ‘నాకు సంతోషాన్నివ్వడానికే పెళ్లి చేసుకున్నానని, ఎప్పుడైనా సరే అతనితో నేను సంతోషంగా లేకపోతే నేను వెళ్లి పోవచ్చనీ’ అన్నాడు. ఆ క్షణంలో విడిపోయి వెళ్లిపోవాలనిపించినా కానీ కోపంలో అన్నాడని అనిపించి ఆగిపోయేను. అతని పట్ల పెంచుకున్న అవ్యాజమైన ప్రేమ కాళ్లకు సంకెళ్లలా అడ్డుతగులుతూంది. నిజానికి అతని మీద నేను ఆధారపడవల్సిన పని లేదు. ఇక అతని నుంచి విడిపోవడం అన్నది నాకు పెద్ద సమస్య కాదు. కలిసుండడమే సమస్య.” అంది.
నిశ్శబ్దంగా తలూపింది మేరీ.
“అయినా ఒక్కసారి ఆలోచిస్తే అతన్నించి విడిపోవడం వల్ల నేను ఎన్నో కలలతో పునర్నిర్మించుకున్న కుటుంబ జీవితానికి, వైవాహిక జీవితానికి దూరం అవుతాను. నా కూతురు తండ్రిని కోల్పోతుంది. మా ఇద్దరికీ తీరని నష్టం కలుగుతుంది. మరోపక్క ప్రభుకీ మానసిక క్షోభ తప్పదు. పైగా ఇందువల్ల లాభపడేది మొత్తం అతని తరఫు వాళ్లే. వాళ్లు ఆశిస్తున్నదీ అదే. నేను అతనిని వదిలెళ్లిపోతే అతనికి వాళ్లకి నచ్చిన అమ్మాయినిచ్చి పెళ్లి చెయ్యాలన్నదే వాళ్ల అభిమతం. వాళ్లు ఏం ఆశించి ఇదంతా చేస్తున్నారో అది నేనెందుకు నిజం చెయ్యాలి?” అంది సాలోచనగా తన్మయి.
“మరి బాబు సంగతి ఏవిటి? వాణ్ణి బాగా చూసుకోకపోతే అన్యాయం కదూ” అంది మేరీ.
“అదే నా బాధ కూడా మేరీ. మొదట్నుంచి అన్ని వైపుల నించి పసివాడు మధ్యలో నలిగిపోతున్నాడు. నా కడుపున పుట్టిన పాపానికి వాడు ఇంత దుఃఖాన్ని అనుభవించాల్సి వస్తోంది.”
తన్మయి కళ్లు నిండుకున్నాయి
.”పద, అలా బెంచీ మీద కూచుందాం” అంది నడక ఆపి మేరీ.
కళ్లు తుడుచుకుంటూ “నిజానికి ప్రభు తనంతట తనుగా చెడ్డవాడు కాదు. కానీ అతనిలో ఉన్న లోపమల్లా అతని వాళ్ల పట్ల అమితమైన ప్రేమ, బాబు పట్ల విముఖత. మొదటిది తప్పుకాదు నా ఉద్దేశ్యంలో. “A good son makes a good husband”. రెండోదే అతనితో నాకున్న పెద్ద సమస్య . నేను మళ్లీ పెళ్లి చేసుకోవడానికి ఎందుకైతే భయపడ్డానో అదే జరుగుతూంది. మరోలా ఆలోచిస్తే బాబు విషయంలో అతనికి ప్రేమ ఉండాలన్నది, ఉంటుందన్నదీ అర్థం లేని ఆలోచనేమో అనిపిస్తుంది. కన్న తండ్రికే లేదు, ఇతనికి ఎలా ఉంటుంది? కానీ పిల్లాడి మనసు గాయపరిచే పనులు చెయ్యడం క్షమించరాని నేరాలు. వాటిని నేను ఎప్పుడూ సహీంచబోనని గట్టిగా చెప్తూనే ఉన్నాను.” అంది తన్మయి.
“ప్రేమించక్కరలేదు. కనీసం మనిషిలా చూస్తే చాలు కదా! అయినా లోకమెరుగని పసివాడి పట్ల విముఖత ఏవిటి? పెళ్ళికి ముందు “వాడు నీలో భాగం” అన్నాడు. ఇప్పుడేమయ్యింది?” అంది మేరీ.
“ఆ సంభాషణా అయ్యింది. ‘వాడు నీలో భాగం, అన్నది వాడిని నీ నుంచి దూరం చెయ్యనని చెప్పడానికి. అంత మాత్రాన నేను నిన్ను ప్రేమించినట్టే వాణ్ణి ప్రేమించలేను. ప్రేమ లేకుండా ఉన్నట్టు నటించలేను’ అన్నాడు.
“ఊ. అయితే మొదటినుంచి అతను స్థిరమైన అభిప్రాయాలతోనే ఉన్నాడన్న మాట. నువ్వు అర్థం చేసుకోవడంలోనే లోపం ఉంది. మరి అతను పెళ్లికి ముందు వాళ్ల “తల్లిదండ్రుల్ని చూడడం” అన్న చిన్న మాటలో “తెచ్చి ఇంట్లో పెట్టుకుని వాళ్లేమన్నా భరిస్తూ నోరు మూసుకుని పడుండడం” అన్నంత పెద్ద అర్థం ఉందా? అతను నిశ్చయంగా పరిస్థితుల్ని ‘తనకి’ అనుగుణంగా మార్చుకుంటున్న స్వార్థపరుడు. అంది మేరీ ‘తనకి’ అన్నమాటని ఒత్తిపలుకుతూ.
“బహుశా: ఒక్కొక్కరి జీవితమే ఇంత అనుకుంటా మేరీ. ప్రవేశించడమే కానీ వెనక్కి రాలేని అభిమన్యుడి పద్మవ్యూహంలాంటి బతుకు నాది. చివరికంటా పోరాడాల్సిందే తప్పదు” అంటూ లేచింది తన్మయి.
***
మధ్యాహ్నం భోజనానికి “దసపల్లా” కి వెళ్లేరు. చేతులు కడుక్కుంటూ బాబుని అడిగింది.
“ఏం నాన్నా, ఏం చేసేవు పొద్దుట్నించి?” అంది తన్మయి.
“చెల్లితో ఆడుకున్నాను. తను మాకు దార్లో ఐస్ క్రీములు కొనిబెట్టేరు. రూమ్ లో కొంచెం సేపు టీవీ చూసేం” బాబు ఉత్సాహంగా మాట్లాడుకెళ్లిపోతున్నాడు. తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది.
ప్రభు ఒళ్లో నుంచి పాపని తీసుకుని “నువ్వూ వెళ్లిరా చేతులు కడుక్కుందుకు” అంది.
భోజనాలయ్యేక అట్నుంచి అటే రామకృష్ణా బీచ్ కి వెళ్లి సాయంత్రం వరకూ గడిపేరు. ఉవ్వెత్తున ఎగిసి పడ్తున్న కెరటాల్లో ఆనందంగా ఆడసాగేరు ముగ్గురూ. ఒడ్డున కూచుంది తన్మయి. ఆ క్షణం తన్మయికి జీవితమ్మీద గొప్ప ఆశాభావం కలిగింది. ప్రభు ఈ మాత్రం చేరదీస్తే చాలు బాబుని. వాడిపట్ల ఉన్న విముఖత ఉన్నా అది వాడి మొహమ్మీద చూపించకుండా ఉంటే చాలు. దూరాన సముద్రం చివర వేళ్ళాడుతున్న దిగంతాన్ని చూస్తూ “మిత్రమా! నన్ను, నా పిల్లల్ని రక్షించు” అని వేడుకుంది. రోడ్డుకవతల ఉన్న ఆలయంలో సాయంత్రపు ఆరాధన గంట మోగింది.
“సత్యం” అనుకుంటూ పక్కకి చూసింది.
అక్కడే ఇసుకలో పిల్లల్తో ఆడుతూన్న దివాకర్ ఆశ్చర్యంతో నోరు పెద్దది చేస్తూ “త్త…తన్మయీ …” అన్నాడు.
తన్మయి సంతోషంగా లేచి దగ్గిరికెళ్లింది.
అక్కడే దివాకర్ తో బాటూ ఉన్న దివాకర్ అక్క గబుక్కున తన్మయి చెయ్యి పట్టు కుని ఆనందంగా “అమ్మో మీరే! ఎన్ని సంవత్సరాలయిపోయింది!” అంది. పిల్లల్ని ఆడుకోమని దివాకర్ వచ్చి “బ్బ బలే కనబడ్డారు. చాచాన్నాళ్ళకి ” అన్నాడు. పిల్లల్ని, ప్రభుని చూపించి తన్మయి చెప్పింది విని “చాచాలా సంతోషం. అమ్మ మి…మిమ్మల్ని చూస్తే ఎ…ఎంతో సంతోషపడుతుంది” అన్నాడు. మొదటిసారి తనని చూసినప్పుడు తన గాథ విని కళ్లనీళ్లు పెట్టుకున్న దివాకర్ అక్కంటే తన్మయికి ఎంతో ఇష్టం. ఆ విషయాన్నే చెప్పింది. “భలేవారు. మీరు మమ్మల్ని జ్ఞాపకం పెట్టుకున్నారు అంతే చాలు. మా తమ్ముడికి కూడా ఒక దారి చూపించారు. వాడిప్పుడు వివేకానందా పాఠశాలలో హాస్టలు సూపరింటెండెంటుగా చేస్తున్నాడు.” అంది.
తన్మయి సంతోషంగా “అనంత, రాజు గవర్నమెంటు ఉద్యోగాలొచ్చి అక్కణ్ణించి వెళ్లేక మీరు కూడా మానేసేరనుకున్నాను. అయితే కంటిన్యూ చేస్తున్నారన్నమాట. వెరీగుడ్.” అంది.
“మి…మ్మీరే అడ్రసు లేకుండా వె…వెళ్ళిపోయేరు. మి…మీ అమ్మగారి అడ్రసుకి ఒ..కట్రెండు ఉ..ఉత్తరాలు రాసేను. మీ నించి ఎ…ఎప్పుడూ జవాబు లేదు” అన్నాడు నిష్టూరంగా దివాకర్
“అయ్యో అవేవీ అందలేదు. అందితే అమ్మ తప్పకుండా చెప్పివుండేది. వెంకట్, మురళి ఎలా ఉన్నారు?” తన్మయి.
“వె …వెంకట్, మురళి ఇ…ఇద్దరూ ఈ మధ్యే హ…హైదరాబాదు బ్రాంచికి వెళ్లి పోయేరు. వెంకట్ గారి స….స్థానంలోనే నన్ను ప్ర…ప్రమోట్ చేసేరు. దే…దేవుడి దయ వల్ల జీతం కూడా బా.. బాగా పెంచేరు. ప్ర..ప్రయివేటు ఉద్యోగం, ప…పనెక్కువైనా ప్రశాంతంగా ఉంది.” అన్నాడు.
కబుర్లలోనే ప్రభు పిల్లల్ని తీసుకుని రాగానే అందర్నీ పరిచయం చేసింది తన్మయి. దివాకర్ అక్క సంతోషంగా చూస్తూ “వెళ్ళేలోగా మా ఇంటికి తప్పకుండా రండి. నాన్నగారు రిటైరయ్యేక జగదాంబా సెంటరుకి దగ్గర్లోని మా తాత గారింట్లోకి మారిపోయేం. పైగా మా తమ్ముడికి పెళ్లయినా ఇబ్బంది లేకుండా ఉంటుందని” అంది సిగ్గు పడుతూ ఎటో చూస్తూన్న దివాకర్ వైపు చూస్తూ .
వాళ్ల దగ్గిర సెలవు తీసుకుంటూ “రేపు కైలాసగిరి, ఋషికొండ బీచ్ లకు ప్లాన్ పెట్టుకున్నాం. అయినా తప్పకుండా రావడానికి ప్రయత్నం చేస్తాను. మీ అమ్మగారిని అడిగేనని చెప్పండి” అంది తన్మయి.
దారి పొడవునా ప్రభుకి వాళ్ల గురించి చెబుతూనే ఉంది. “వాళ్ళమ్మ గారికి, అక్కకి చీరలు కొని పట్టుకెళదాం” అంది.
“తప్పకుండా. నిన్ను కష్టాలలో ఆదుకున్న వాళ్లంటే నాకెంతో గౌరవం” అన్నాడు ప్రభు. తన్మయికి ప్రభు ఇలాంటి విషయాలలో ఎంతో నచ్చుతాడు. అసలెటువంటి అభ్యంతరమూ లేకుండా ఏదడిగినా వెంటనే “సరే” అంటాడు. చదువు, ఉద్యోగ విషయా లకు ఎంతో ఎంకరేజ్ చేస్తాడు. ఎటువంటి విషయంలోనూ తనని వెనక్కి లాగే కుటిలత్వం, ఆధిక్యత చూపించడం వంటివి అస్సలు లేవు. ఏది చేసినా ఇద్దరం కలిసే చెయ్యాలని తననీ తనతో బాటుగా స్విమ్మింగు క్లబ్బులోను, డ్రైవింగ్ క్లాసులలోను జాయిన్ చేసేడు. ఇంత చేసేవాడు బాబు విషయంలో తనని ఎందుకు అర్థం చేసుకోలేక పోతున్నాడో తెలియడం లేదు!
ఆటో చీకట్లోకి దూసుకు పోతూంది. తన మనస్సులో జవాబులేని ప్రశ్నలా.
*****
(ఇంకా ఉంది)

డా|| కె.గీత పూర్తిపేరు గీతామాధవి. వీరు “నెచ్చెలి” వ్యవస్థాపకులు, సంపాదకులు. తూ.గో.జిల్లా జగ్గంపేటలో జన్మించారు. ప్రముఖ కథా రచయిత్రి శ్రీమతి కె. వరలక్ష్మి వీరి మాతృమూర్తి. భర్త, ముగ్గురు పిల్లలతో కాలిఫోర్నియాలో నివాసముంటున్నారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయంలోఇంగ్లీషు, తెలుగు భాషల్లో ఎం.ఏ లు, తెలుగు భాషా శాస్త్రం లో పిహెచ్.డి చేసి, 10 సం. రాల పాటు మెదక్ జిల్లాలో ప్రభుత్వ కళాశాల అధ్యాపకురాలిగా పనిచేసారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నించి 2006 లో “ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ” పొందారు.అమెరికాలో ఇంజనీరింగ్ మేనేజ్ మెంట్ లో ఎం.ఎస్ చేసి, ప్రస్తుతం సాఫ్ట్ వేర్ రంగంలో భాషా నిపుణురాలిగా పనిచేస్తున్నారు.
ద్రవభాష, శీతసుమాలు,శతాబ్దివెన్నెల, సెలయేటి దివిటీ, అసింట కవితాసంపుటులు, సిలికాన్ లోయ సాక్షిగా కథాసంపుటి, వెనుతిరగనివెన్నెల నవల, At The Heart of Silicon Valley -Short stories (2023),Centenary Moonlight and Other Poems(2023) ప్రచురితాలు. నెచ్చెలి ప్రచురణ “అపరాజిత” – గత ముప్పయ్యేళ్ల స్త్రీవాద కవిత్వం (1993-2022) పుస్తకానికి సంపాదకులు & ప్రచురణకర్త. ‘యాత్రాగీతం’ ట్రావెలాగ్స్, ‘కంప్యూటర్ భాషగా తెలుగు’ పరిశోధనా వ్యాసాలు కొనసాగుతున్న ధారావాహికలు. అజంతా, దేవులపల్లి, రంజనీ కుందుర్తి, సమతా రచయితల సంఘం అవార్డు, తెన్నేటి హేమలత-వంశీ జాతీయ పురస్కారం, అంపశయ్య నవీన్ పురస్కారం మొ.న పురస్కారాలు పొందారు.
టోరీ రేడియోలో “గీతామాధవీయం” టాక్ షోని నిర్వహిస్తున్నారు. తానా తెలుగుబడి ‘పాఠశాల’కు కరికులం డైరెక్టర్ గా సేవలందజేస్తున్నారు. కాలిఫోర్నియా సాహితీ వేదిక “వీక్షణం”, తెలుగు రచయిత(త్రు)లందరి వివరాలు భద్రపరిచే “తెలుగురచయిత” వెబ్సై ట్ వ్యవస్థాపకులు, నిర్వాహకులు.