
వ్యాధితో పోరాటం-30
–కనకదుర్గ
పాపం శ్రీని ఏం సుఖపడ్డాడు నన్ను చేసుకుని. పెళ్ళయిన 4 ఏళ్ళకే ఈ రోగం తగులుకుంది. ఇక్కడికొచ్చాక కొంచెం బాగున్నాం అనుకుంటే ఇప్పుడు ఇలా బాధపడ్తు న్నాం. ఒక్కడే ఇద్దరు పిల్లల్ని అందులో ఒక పసికందుని చూసుకుంటూ, ఆఫీసుకి వెళ్తూ నన్ను చూడడానికి వస్తూ కష్టపడ్తున్నాడు. ఆర్ధిక విషయాలు నాతో అసలు మాట్లాడడు. నేను ఎన్నిసార్లు అడిగినా దానికి బదులేం చెప్పడు. “నేను చూసుకుంటాను కదా! నీకెందుకు మరొక ఆలోచన? ఇప్పటికే నొప్పితో, ఒంటరిగా హాస్పిటల్లో వుండి అవస్థ పడుతున్నావు. ఇండియాలో అయితే మన ఫ్యామిలీ వారు వచ్చి ఎవరో ఒకరు ఉండేవారు. నువ్వు డాక్టర్లు చెప్పినట్టు చెయ్యి. వేరే ఆలోచనలు పెట్టుకోకు. మిగతా విషయాలన్నీ నేను చూసుకుంటా కదా!” అనేవాడు.
నా తాపత్రయం నాది. “హెల్త్ ఇన్స్యూరెన్స్ పే చేస్తుందా?” ఆశతో అడిగాను.
“ఆ కడ్తారు! అయినా ఇపుడా విషయాలెందుకు?” అని కట్ చేసేవాడు.
నేను బేరియమ్ త్రాగి సి.టి.స్కాన్ కి వెళ్ళి వచ్చి పడుకున్నాను.
ఇంకా ఎన్ని టెస్ట్స్ చేస్తారు, ఎన్ని చేసినా ఏమీ తెలియడం లేదంటారు. నాకు ఓపిక పోతుంది.
నొప్పి బాగా ఎక్కువయ్యింది, నర్స్ ని పిలిస్తే నొప్పి ఇంజెక్షన్ తీసుకొచ్చింది.
“ఆన్ ద స్కేల్ ఆఫ్ టెన్, జీరో ఈజ్ నో పేయిన్ అండ్ టెన్ ఈజ్ సివియర్ పేయిన్. వాట్ నెంబర్ ఈజ్ యువర్ పేయిన్?” అని అడిగింది.
అపుడు నాకొచ్చిన నొప్పి టెన్ కంటే ఎక్కువ ఏదైనా నెంబర్ ఉంటే అది అని చెప్పాలనిపించింది, కానీ నేను కళ్ళల్లో నీళ్ళు తిరుగుతుండగా, “టెన్,” అని అరిచాను.
“ఓకే డియర్ ఐయామ్ గివింగ్, ఐ నో బేరియం మస్ట్ హావ్ మేడ్ యువర్ పేయిన్ వర్స్.” అని మెల్లిగా ఇంజెక్షన్ ఇచ్చింది. ఆ ఇంజెక్షన్ ఇవ్వగానే మెదడ్లోకి డైరెక్ట్ గా వెళ్ళి మొద్దుబారినట్టనిపిస్తుంది. ఆ తర్వాత మెల్లిగా మత్తు కమ్ముకొస్తుంది, ఒక పది నిమిషాల్లో నిద్ర పడ్తుంది.
నా బెడ్ పక్కన వాళ్ళ దగ్గరికి డాక్టర్స్ వచ్చి వెళ్ళినట్టున్నారు. ఆయన కుర్ఛీలో కూర్చొని టీ.వి చూస్తున్నాడు.
నేను మెల్లిగా లేచి ఆయన కూర్చున్న వైపుకి వెళ్ళి, చాలా మెల్లిగా అడిగా,” వాట్ డిడ్ ద డాక్టర్స్ సే?” అని. ఆవిడ పడుకుంటే లేవకూడదని మెల్లిగా అడిగాను.
“తను పడుకోలేదు, ఏదో పాత సినిమా వస్తుంటే చూస్తున్నాం. డాక్టర్స్ మైనర్ సర్జరీ చేయాలన్నారు, ఆ తర్వాత రీహాబిలిటేషన్ సెంటర్ కి పంపించి ఫిజికల్ థెరపీ ఇస్తారట, దాని వల్ల ఎంత లాభముంటుందో చూసి నిర్ణయిస్తామన్నారు. సర్జరీ రేపు చేస్తారట. తను చాలా నెర్వస్ గా వుంది. ఎపుడూ హాస్పిటల్ ఎరగని వాళ్ళం, ఈ టెస్ట్స్, సర్జరీలు ఇవన్నీ ఇప్పటివరకు మాకు తెలియదు. చూద్దాం, వాళ్ళు కూడా మన లైఫ్ బెటర్ చేయాలనే ప్రయత్నిస్తారు కదా! ముందు ఇవన్నీ అయిపోయాక ఆ తర్వాత సంగతి గురించి ఆలోచించాలి అని నిర్ణయించుకున్నాం ఇద్దరం. లేకపోతే పిచ్చివాళ్ళమైపోతాం అనవసరంగా ఎక్కువగా ఆలోచించి.” అని సన్నగా నవ్వుతూ అన్నాడాయన.
“దట్స్ గుడ్ న్యూస్. గ్రేట్, హోప్ ఎవ్విరిథింగ్ గోస్ వెల్! మీ పిల్లలెవరైనా వస్తున్నారా?”
” అందరిని వద్దన్నాం. ప్రస్తుతానికి ఒకబ్బాయి వస్తే చాలని చెప్పాము. మాకు కొంచెం సపోర్ట్ గా వుంటాడు కదా!”
” యస్. తప్పకుండా చాలా సాయంగా వుంటాడు. ఆల్ ది బెస్ట్. వెల్ ఐయామ్ ఫీలింగ్ వెరీ టైర్డ్. సో ఐయామ్ గోయింగ్ టు స్లీప్ సమ్ టైం.”
“యూ లుక్ టైర్డ్. ప్లీజ్ గో అహెడ్ అండ్ స్లీప్.” అన్నదావిడ.
మా ఇద్దరి బెడ్స్ కి అడ్డుగా వున్న కర్టెన్ని సరిగ్గా లాగి మంచమ్మీద వాలిపోయాను.
బాగా నిద్ర పట్టేసింది.
నిద్రలో ఒక పీడ కల.
హాస్పిటల్ మొత్తం ఒక పెద్ద జైల్ లాగ ఉంది, చీకటిగా వుంది, గుడ్డి దీపాలు వెలుగు తున్నాయి. అందులో పేషంట్స్ అందరికీ ఐ.వి.లు పెట్టి ఉన్నాయి, కొంతమందికి వేరే ట్యూబ్స్, వైర్స్ వేళాడ్తున్నాయి, మరికొంతమంది వీల్ చేయిర్స్ లో అటు, ఇటు తిరుగు తున్నారు. చాలా మంది నొప్పి తట్టుకోలేక ఏడుస్తున్నారు. ఐ.వి పోల్స్ లాక్కుంటూ వచ్చి , జైల్ ఊచలను పట్టుకుని తమని బయటికి వెళ్ళనీయమని అరుస్తున్నారు, ఏడుస్తున్నారు,మొత్తానికి అంతా గోల గోలగా వుంది. జైలు బయట పొడుగ్గా ఉన్న రోబాట్స్ నొప్పి మందుని పెద్ద పెద్ద సిరంజీలతో ఇస్తున్నారు, అంతలా అరుస్తూ గోల చేస్తున్న వారు మెల్లిగా మత్తులోకి జారుకుంటూ ఎక్కడి వాళ్ళు అక్కడే కుప్పకూలిపోతున్నారు. కొంతమంది ఇంజెక్షన్స్ తప్పించుకోవడానికి అటు, ఇటు పరిగెత్తుతున్నారు. నాకు ఇంజెక్షన్ గుచ్చారు, కళ్ళు మూతలు పడుతుండగా జైల్ బయట దూరంగా శ్రీని, పిల్లలను పట్టుకుని కనిపించాడు. చైతు భయంగా చూస్తున్నాడు, స్పూర్తి గుక్కపెట్టి ఏడుస్తుంది, శ్రీని నిస్సహయంగా చూస్తున్నాడు. నేను కళ్ళు బలవంతంగా తెరవడానికి ప్రయత్ని స్తున్నాను, చైతన్య, స్ఫూర్తి…..అరుస్తున్నాను…
“దుర్గా.. హే దుర్గా.. వాట్ హాపెన్డ్? ఆర్ యూ ఓకే డియర్?” అని నర్స్ మోరా నన్ను గట్టిగా వూపుతూ లేపింది.
కళ్ళు తెరిచాను. ఎక్కడ వున్నాన్నేను? ఓ ఇది హాస్పిటల్ అంటే నాకొచ్చింది పీడకలన్న మాట. అనుకున్నాను. కాళ్ళు, చేతులు ఇంకా వొణుకుతున్నాయి.
“నథింగ్, ఐ హాడ్ ఏ నైట్ మేర్, వెరీ బాడ్ నైట్ మేర్,” అన్నాను.
“వియ్ వర్ వర్రీడ్ అబౌట్ యు. ఆర్ యూ ఓకే నౌ, డూ యూ నీడ్ ఎనీథింగ్?”
” నో ఐ యామ్ ఫైన్, థ్యాంక్ యూ!”
నాకు తినడానికి రావట్లేదని శరీరానికి న్యూట్రిషన్ కావాలని ఒకవేళ సర్జరీలు చేయాల్సివస్తే అస్సలు వొంట్లో శక్తి వుండదని టి.పి.ఎన్ ( Total Parenteral Nutrition) టెంపరరీ ఐ.వి కాకుండా చెస్ట్ దగ్గర కానీ చెయ్యి పై భాగంలో ఎక్స్-రే తో వేయిన్స్ చూసి పెడ్తారు, దీన్ని పిక్ లైన్ అంటారు, చాలా రోజులుంటుంది, వారానికి ఒకసారి డ్రెస్సింగ్ మారుస్తారు. దీని ద్వారా టి.పి.ఎన్ ఇస్తారు. నా బరువు బాగా పడి పోయింది, అందుకని పెట్టారు. కానీ అందరికీ ఒకేలాగ పని చేయాలని లేదు కదా! నాకు అది పెట్టగానే వాంతులు, డయేరియా మొదలయ్యాయి. అది పెట్టిం తర్వాత ఇంటికి పంపించి చూసారు. వెళ్ళినప్పట్నుండి వాంతులు, విరేచనాలవ్వసాగాయి. నొప్పి కూడా ఎక్కువయ్యింది. మళ్ళీ వెళ్ళి హాస్పిటల్ లో వెళ్ళి పడ్డాను. డాక్టర్ రిచర్డ్ వచ్చి చూసి,” ఇది బాడీకి న్యూట్రిషన్ మాత్రమే ఇస్తుంది. నేనింతవరకు ఏ పేషంట్లను చూడలేదు ఇలా చెప్పిన వాళ్ళను.” అన్నారు.
“నేను ఊహించి చెప్పడం లేదు కదా! మీరు కూడా చూస్తూనే వున్నారు కదా!” అన్నాను.
“మేము చదువుకున్న పుస్తకాల్లో ఇలాంటి రియాక్షన్స్ వస్తాయని మేము అస్సలు చదువుకోలేదు, ఏ పేషంట్స్ ఇంతవరకు ఇలా చెప్పలేదు. అందుకే నాకు అర్ధం కావటం లేదు, నీకెందుకిట్లా అవుతుందో!”
“అందరికీ ఒకేలాగ పని చేయాలని లేదు కదా! లోపల ఏమవుతుందో ఇప్పటివరకు తెలియలేదు కదా, నా కండీషన్ వల్ల అలా అవుతుందేమో!” అన్నాను.
నాకు బరువు పెరగడం ఏమో కానీ నాకు మాత్రం నరకం చూపించింది. వాళ్ళు తీయమని చెప్పారు, ఎలాగైనా బరువు పెరగాలి. బరువు పూర్తిగా పడిపోతే పెద్ద సర్జరీలు శరీరం తట్టుకోగలగాలి కదా!
ఎలాంటి డయోగ్నోసిస్ లేకుండా రోజులు, వారాలు గడిచిపోతున్నాయి. హాస్పిటల్ నాకు రెండో ఇల్లులా అయ్యింది. ఇంటికి వెళ్ళినా మళ్ళీ రెండు వారాల్లో మళ్ళీ వెళ్ళాల్సి వచ్చేది. ఇంట్లో వున్నపుడు పిల్లలతో సంతోషంగా గడపడం, పాపకి స్నానం పోయడం, దానికి బాటిల్ పాలు త్రాగించడం, బోలెడన్నీ ఫోటోలు తీయడం, చైతన్యకి స్కూల్ ఎసైన్మెంట్స్ లో సాయం చేయడంతో కాలం తెలియకుండా చకచకా పరిగెట్టేది. మళ్ళీ హాస్పిటల్ కి రాగానే కాలం స్థంబించిపోయినట్టుగా అనిపించేది. ఫ్హిబ్రవరి, 2000 లో నన్ను ఫిలడెల్ఫియాలో వున్న యూనివర్సిటీ హాస్పిటల్ జెఫర్సన్స్ కి అక్కడ టెస్ట్స్, ప్రొసీజర్స్ చేయడానికి పంపించడానికి నేనున్న హాస్పిటల్ గాస్ట్రోఎంటరాలజిస్ట్స్ అందరూ ఒక మీటింగ్ లో నిర్ణయించారు. వాళ్ళకి ఫోన్ చేసి చెప్పడం, అన్నీ ఫైల్స్ రెడీ చేసి ఉంచారు. కానీ అక్కడ బెడ్స్ ఖాళీగా లేవని, కొన్నిరోజులు పడ్తుందని చెప్పారు. సరే వాళ్ళు ఎపుడు రమ్మంటే అపుడే వెళ్ళాలి కదా!
హాస్పిటల్ లో ఒకరోజు మామూలుగా పొద్దున్నే లేచాను. కానీ అస్సలు వొంట్లో బాగాలేదు. నొప్పి ఎక్కువగా వుంది, దాంతో పాటే కడుపులో బాగా తిప్పేస్తుంది. వాంతి వచ్చేలాగ వుంది. నర్స్ కానీ, టెక్ కానీ వస్తారేమోనని బటన్ నొక్కాను. పొద్దునపూట అందరూ బిజీగా వున్నారు. ఒక టెక్ వచ్చి చేతిలో ఒక ప్లాస్టిక్ బౌల్ పెట్టి, “నేనిప్పుడే వస్తాను,” అని పరిగెత్తింది. వాళ్ళనీ తప్పు పట్టలేము ఒకోసారి విపరీతమైన బిజీగా వుంటారు, స్టాఫ్ తక్కువగా వుంటారు.
నాకు వాంతవుతుంది, కడుపులో చచ్చే నొప్పిగా వుంది, లోపల ఏముందని రావడానికి, పైత్యమంటారు కదా అలా నురగ నురగలా వస్తుంది, ఇంతలో అట్నుంచి వెళ్తున్న డాక్టర్ వచ్చి నా చెవులు మూస్తూ తల పట్టుకున్నాడు. అది నేనూహించని సంఘటన. “ఇట్స్ బికాస్ ఆఫ్ ది మెడికేషన్స్… పేయిన్ మెడికేషన్స్ ఎక్కువయితే ఇలాగే అవుతుంది. సారీ డియర్,” ఇందాక బౌల్ ఇచ్చి వెళ్ళిన టెక్ వచ్చింది.
“ఎక్కడున్నారు మీరు? పేషంట్ సఫర్ అవుతుంటే హెల్ప్ చేయాలని తెలీదా? నౌ హెల్ప్ హర్!” అని కొంచెం కటువుగా అన్నారు డాక్టర్.
“సారీ డాక్టర్, వియ్ ఆర్ వెరీ బిజీ టుడే.”
“దుర్గా, ఐ విల్ టాక్ టు అదర్ డాక్టర్స్…జెఫర్సన్స్ హాస్పిటల్ కి వీలైనంత త్వరగా పంపించడానికి ప్రయత్నిస్తాము. సారీ దుర్గా.. యు ఆర్ గోయింగ్ త్రూ వెరీ టఫ్ టైం. బట్ యు విల్ గెట్ అవుట్ ఆఫ్ దిస్ టఫ్ టైం. ఆల్ ది బెస్ట్..టేక్ కేర్.” అని వెళ్ళిపోయాడు ఆ డాక్టర్.
చాలా మంచి డాక్టర్. పేషంట్ బాధని అర్ధం చేసుకుని తను పూర్తి అంకితభావంతో పని చేస్తాడు.
ఆ రోజు సాయంత్రం కల్లా ఒక వార్త వచ్చింది జెఫర్సన్స్ హాస్పిటల్ లో ఒక బెడ్ క్యాన్సర్ వార్డ్ లో ఖాళీగా వుంది. రాత్రికి ఆ హాస్పిటల్ అంబులెన్స్ వాళ్ళు వచ్చి తీసుకెళ్తారని చెప్పారు.
నేను శ్రీనికి ఫోన్ చేసి చెప్పాను. “నేను నీతో రావాల్సి వుంటుందా? అలా అయితే పిల్లల్ని చూసుకోవడానికి జోన్ ని రమ్మని చెబ్తాను.” అన్నాడు.
“లేదు నువ్వేం రావాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఈ టైం అని చెప్పలేదు, ఎపుడు వస్తే అపుడు వెళ్ళాల్సిందే. రాత్రవుతుందని చెప్పారు, కాబట్టి వీలైతే పిల్లల్ని తీసుకుని రా! మళ్ళీ సిటీకి రోజు రావడం కుదరదు. శని, ఆదివారాల్లోనే రావడానికి వుంటుంది పిల్లలకి.”
“సరే ఆఫీస్ నుండి కొంచెం తొందరగా వచ్చి తీసుకువస్తాను. నీకెట్లా వుంది?”
“పొద్దున్నే వాంతయ్యింది, నొప్పి కూడా ఎక్కువయ్యింది. అందుకే డాక్టర్ వేరే గాస్ట్రోఎంటరాలజిస్ట్స్ తో మాట్లాడి, జెఫర్సన్స్ వాళ్ళకి ఎమర్జన్సీ అని చెప్పారేమో అందుకే క్యాన్సర్ వార్డ్ లో ఒక బెడ్ ఉందని నన్ను వచ్చి అడిగారు, నేను ఓకే అన్నాను. ఆ తర్వాతే వచ్చి చెప్పారు ఈ రాత్రికి తీసుకెళ్తారని.”
” అక్కడికెళ్తే వాళ్ళు టెస్ట్స్, ప్రొసీజర్స్ చేస్తే త్వరగా సమస్య ఏమిటో తెలిస్తే ట్రీట్మెంట్ ఇవ్వడానికి వుంటుంది. సాయంత్రం పిల్లల్ని తీసుకు వస్తాను. నువ్వు జాగ్రత్త. వాంతులకు ఇంజెక్షన్ ఇస్తున్నారు కదా! అడిగి తీసుకుని కాసేపు పడుకో.”
“సరే. నువ్వు కూడా జాగ్రత్తగా వుండు. సరిగ్గా రెస్ట్ దొరకడం లేదేమో! పాప పడుకోగానే నువ్వు పడుకో! రాత్రిళ్ళు ఎక్కువ మేలుకొని వుండకు, టేక్ కేర్.” అని చెప్పాను.
ఆర్నెల్లు గర్భవతిగా ఉన్నప్పట్నుండి ఈ హాస్పిటల్ కి రావడం అలవాటయిది. చాలా మంది నర్సులు నన్ను ఎంతో ప్రేమగా చూసుకునేవారికి నేను జెఫర్సన్స్ కి వెళ్తున్నాననే వార్త అందగానే నర్సులు వచ్చి కలవడం, గుడ్ లక్ అని చెప్పడం చేయసాగారు. అప్పటికి ఏమన్నారంటే డాక్టర్లు, పాన్క్రియాస్ లో రాళ్ళేమన్నా ఉన్నాయేమో అక్కడయితే అలాంటి పరీక్షలు చేసే పరికరాలు వుంటాయి, ఒకవేళ రాళ్ళు కనక వుంటే అక్కడ స్పెషలిస్ట్స్ తీసేస్తారని పంపిస్తున్నామని చెప్పారు. సర్జరీ అవసరమైతే ఇక్కడకు వస్తే ఇక్కడ సర్జన్ చేయగలడు అని చెప్పారు. ఇక్కడ సర్జన్స్ కి కొంతమందికి నేను తెల్సు. నాకు రోజు ఐ.వి తప్పకుండా వుండాలి కానీ కొన్ని రోజులకే నా ఐ.వి వేయిన్స్ కనెక్షన్ పని చేసేవి కావు, నా వెయిన్స్ చాలా సన్నగా వుండి దొరకడం చాలా కష్టం అయ్యేది. ఒకోసారి ఐ.వి స్పెషలిస్ట్స్ వచ్చి పిక్ లైన్ పెట్టేవారు. టి.పి.ఎన్ పెట్టినపుడు సర్జన్స్ పెట్టేవారు. ముఖ్యంగా ఒక సర్జన్ డా. ఫాక్స్, రెగ్యులర్ గా వచ్చి చూసి నవ్వుతూ మాట్లాడి నన్ను నవ్వించి వెళ్ళేవాడు. ఆయన కూడా వచ్చి, “హాయ్ కిడ్డో! ఐ హర్డ్ దట్ యూ ఆర్ గోయింగ్ టు ది బిగ్ హాస్పిటల్.. గుడ్ లక్! వాళ్ళు టెస్ట్స్ చేసి, ప్రొసీజర్స్ ఏవైనా చేస్తే చేయించుకుని వచ్చేసేయ్. ఆ తర్వాత ఏమైనా ప్రాబ్లెమ్ వస్తే నేనున్నాను ఇక్కడ, నేను చూసుకుంటాను. యూ ఆర్ అవర్ ఫ్యామిలీ మెంబర్. గుర్తు పెట్టుకో. నిన్ను మామూలుగా చేసే బాధ్యత మాది. ఆల్ ది బెస్ట్ మై డియర్.” అని దగ్గరగా వచ్చి చిన్న హగ్ ఇచ్చారు.
శ్రీని, పిల్లలు వచ్చి వెళ్ళాక నర్సులు, టెక్స్ ఎక్కువ పని లేనివాళ్ళు వచ్చి నా దగ్గరే కూర్చున్నారు.
“వియ్ ఆర్ గోయింగ్ టు మిస్ యూ దుర్గా! కానీ నువ్వు బాగవ్వడం ముఖ్యం. అక్కడ టెస్ట్స్, ప్రొసీజర్స్ అయ్యింతర్వాత మళ్ళీ ఏమైనా ప్రాబ్లెమ్స్ వస్తే మా దగ్గరకే రావాలి. వియ్ విల్ టేక్ గుడ్ కేర్ ఆఫ్ యూ మై డియర్!”
“అది పెద్ద హాస్పిటల్. అక్కడ వేరేగా వుంటుంది. అక్కడ పేషంట్స్ ఎక్కువుంటారు, నర్సులు తక్కువుంటారు, అంటే ఒకో నర్స్ చాలా మంది పేషంట్స్ ని చూసుకోవాల్సి వస్తుంది. అక్కడ నర్సులు బిజీగా వుంటారు కాబట్టి మాలాగ నీతో మాట్లాడటానికి వాళ్ళకి టైం వుండకపోవచ్చు. ఒకోసారి ఇట్లాంటి చిన్న హాస్పిటల్ నుండి పెద్ద హాస్పిటల్ కి వెళ్ళిన వారికి చాలా షాకింగ్ గా వుంటుంది. అందుకే చెబ్తున్నాం దుర్గా! కానీ కంగారు పడకు. అక్కడికి కొన్ని రోజులకే వెళ్తున్నావు. మళ్ళీ ఇక్కడికే వచ్చేస్తావు.”
“నీకు బాగయిపోతుంది, నీ హజ్బెండ్, పిల్లలతో సంతోషంగా వుంటావు. మీ కుటుంబం చాలా చక్కగా వుంటుంది. నిన్ను ప్రేమిస్తున్న మంచి భర్త, పిల్లల్ని చూసుకుంటు నువ్వు బాగయి త్వరగా రావాలని కోరుకుంటున్నాడు. ఎవ్విరిథింగ్ విల్ బి ఆల్రైట్ డియర్.”
ఇలా మాట్లాడుతూ కూర్చున్నారు జెఫర్సన్స్ నుండి అంబులెన్స్ వాళ్ళు వచ్చేవరకు.
ఇద్దరు అంబులెన్స్ టెక్నిషియన్స్ డార్క్ బ్లూ కలర్ డ్రెస్స్ ల్లో వచ్చారు.
కొన్ని సంతకాలు చేయించుకుని నన్ను స్ట్రెచర్లో పడుకోబెట్టారు పడిపోకుండా బెల్ట్స్ పెట్టారు.
నాతో బాగా క్లోజ్ గా వుండే నర్సులు మోరా, మెరిడిత్, టెక్స్ యాంజెలా,”ఇదిగో మీరు మాకు చాలా ఇష్టమైన పేషంట్ని తీసుకెళ్తున్నారు. జాగ్రత్తగా తీసుకెళ్ళండి. మా కళ్ళు మీ పైనే…చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళాలి.. బికాస్ షీ ఈజ్ వెరీ ప్రెష్యస్ ఫర్ అజ్.” అని వార్నింగ్ ఇచ్చారు. లిఫ్ట్ లో వెళ్తుంటే క్రింది దాకా వచ్చారు. నాకు కళ్ళల్లో నీళ్ళొచ్చాయి, ఇంత ప్రేమగా చూసుకునే వాళ్ళని వదిలి పెట్టి వెళ్తున్నాను. పెద్ద హాస్పిటల్లో ఉన్న ఇక్విప్మెంట్ ఇక్కడ వుంటే అక్కడికి పంపించేవారే కాదు.
నన్ను అంబులెన్స్ లోకి ఎక్కించేముందు అందరూ ఒకొక్కరు దగ్గరకు వచ్చి వారి గుండెలకు హత్తుకుని, బుగ్గమీద ముద్దు పెట్టి, ఆల్ ది బెస్ట్ చెప్పారు. చివరగా వచ్చిన నర్స్ ని పట్టుకుని ఏడ్ఛేసాను.
“అయ్యో ఎందుకు ఏడవడం. మళ్ళీ కొన్ని రోజుల్లోనే ఇక్కడకు వస్తావు, అయినా నువ్వు బాగవ్వడానికి వెళ్తున్నావు. అక్కడ వాళ్ళ ట్రీట్మెంట్ తో తగ్గిపోతే నువ్వు వచ్చి మమ్మల్ని కలవొచ్చు. బీ బ్రేవ్. వియ్ లవ్ యూ డియర్.” అన్నది నర్స్.
*****
(సశేషం)

నేను హైద్రాబాద్ లో పుట్టి పెరిగాను. గత 26 ఏళ్ళుగా అమెరికా, పెన్సల్వేనియా లో నివసిస్తున్నాము. ’90 నుండి ఫ్రీలాన్సర్ గా డెక్కన్ క్రానికల్, ఉదయం, ఆంధ్రజ్యోతి, ఆంధ్రభూమి, సాక్షి, వార్తాపత్రికలకు, వెబ్ మ్యాగజైన్స్ కి ఆర్టికల్స్ రాస్తూనే వున్నాను. తెలుగువన్ అంతర్జాల రేడియోలో ఆర్.జే గా ’పాటలపల్లకీ,’ కార్యక్రమాన్ని 13 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నాను. ’మయూరి,’ ’రచన’ మాసపత్రికలో, వివిధ వెబ్ మ్యాగజైన్స్, ’విహంగ,’ ’శిరాకదంబం,’ ’తెలుగువన్.కామ్’ లో ’ కథలు ప్రచురింపబడ్డాయి. పుస్తకాలు చదవడం, జీవితంలో చిన్నప్పట్నుండి మధ్యతరగతి జీవితాల్లో సంబంధాల గురించి గమనించడం, వాటి గురించి కథలుగా రాస్తే ఎలా వుంటుంది అని దాదాపు 13, 14 ఏళ్ళ వయసప్పట్నుండే ఆలోచించడం అలవాటయింది. ఇంకా ఎంతో చదవాలి, పుస్తకాలు, జీవితాన్ని ఇంకా ఎంతో రాయాలి అనే తపన ఉంది. శ్రీనివాస్ తో, జీవిత సహచర్యం, చైతన్య, స్ఫూర్తి(పిల్లలు) మీనా(కోడలు) ముందుకు సాగమని స్ఫూర్తినిస్తుంటారు.