
చార్ సౌ సాల్ పురానా షహర్ హైద్రాబాద్ తో ఎంతో కొంత అనుబంధం ఉన్న వాళ్ళందరి నవల ‘సలాం హైద్రాబాద్’ !!!
రాధా కృష్ణల ప్రేమకు బృందావనం, షాజహాన్ ముంతాజ్ ల ప్రేమకు ఆగ్రా, కుతుబ్ షా బాగ్ మతీల ప్రేమకు భాగ్యనగరం (హైద్రాబాద్) – అంతే, అంటే పొరపాటే! ప్రేమకు చిహ్నంగానే గాక మతసామరస్యాలలో, స్నేహపూరిత సంబంధ బాంధవ్యాలలో కూడా హైద్రాబాద్ నగరం దక్కన్ ప్రాంతములలో ఒకే ఒక్కటిగా తలమానికంగా నిలుస్తున్నది.
“కాశీ విశ్వనాథునికి బిస్మిల్లా ఖాన్ షహనాయితో ప్రతిరోజూ పూజలు ప్రారంభ మవుతాయి, చార్మినార్ వరఖ్ కార్మికుల చేతుల మీదుగా దేవాలయాలలో బంగారు, వెండి పూతలు పూయబడి దేవుళ్ళ విగ్రహాలు మెరిసిపోతుoటాయి. మరి అట్లాంటప్పుడు ఈ దేశంలో మత కల్లోలాలు ఎందుకు జరుగుతున్నాయో !” అని రచయిత ఆవేదన. ఒక హైదరాబాదీగా తన ఆవేదన. పరిమితులలో ఉంటే, సామరస్యం విరాజిల్లుతుంది. ఇదే హైదరాబాదీల తత్వ రహస్యం, ప్రగాఢ నమ్మకం.
‘ ప్రాచీన లక్నో ‘, ‘ దిల్లీ ‘ లాంటి నవలల్లో ఇతర నగరాలకు సంబంధించి బోలెడు సాహిత్యం వచ్చింది గానీ ఆ నగరాలకు సమవుజ్జీ అయిన హైద్రాబాద్ నగరం గురించి అంతగా సాహిత్యం లేకపోవడంతో రచయిత తన నేల తల్లి రుణాన్ని అక్షరాభిషేకం ద్వారా తీర్చుకోవాలన్న తపనా ఫలితమే ‘ సలాం హైద్రాబాద్ ‘.
హైద్రాబాద్ చరిత్ర, సంస్కృతీ సాంప్రదాయాలు, నగర జనజీవన విధానం, సామాజిక అవగాహన, రజాకార్ల దౌర్జన్యాలు, నిజాం నవాబుల పాలన, బ్రిటిష్ రెసిడెంట్ల ఆక్రమణల నుంచి ప్రత్యేక తెలంగాణ ఉద్యమం (1578-1970) , దిగంబరోద్యమం, విరసం ఆవిర్భావం వరకు నగర కార్యదర్శం మొదలగు విషయాలను క్లుప్తంగా తెలుపుతుంది ఈ నవల.
కొత్త నగరంలో మనం తరచూ తిరిగే ఆబిడ్స్, రెసిడెన్సీ (కోఠీ), లష్కర్ (సికింద్రాబాద్), హబ్సీగూడ, అధికమెట్టు (అడిక్మెట్), హయత్ నగర్, మొదలగు స్థలాల పేర్లు ఎట్లా వచ్చినాయో కూడా ఈ నవల తెలుపుతుంది.
ఇక పాత నగరం (ఓల్డ్ సిటీ) లోని – చార్మినార్, మదీనా, లాడ్ బజార్, పత్తర్ ఘట్టీ, పుత్లీ బౌలి, ఇంజిన్ బౌలి, జహానుమ, మొఘల్ పుర, గౌలి పురా, కందికల్ గేట్, గుల్జార్ హౌజ్, శాలిబండ, అలియాబాధ్, శర్కర్ గంజ్, రాజా కిషన్ పర్ షాద్ దేవిడీ, పాంచ్ మహల్లా, చౌమహల్లా మొదలగు స్థలాల చారత్రిక కట్టడాలు గురించి కూడా అద్భుతంగా వర్ణించబడినది. చార్మినార్ పక్కన మక్కా మసీదు, ఎదురుగ యునాని దావాఖాన, అందులో దొరికే మురబ్బాలు , చార్మినార్ కి ఆనుకుని ఉన్న భాగ్యలక్ష్మి మందిర్, కొంచం దూరంలోని శివమందిర్, జూమేరాత్ బజార్, చార్ కమాన్ల గురించి వర్ణన, అక్కడి బట్టల, గాజుల, అత్తర్ల మొదలగు వస్తు సామగ్రీల షాపింగ్ ప్రత్యక్షంగా అనుభవించినట్లు అక్షరావిష్కరణ ఈ నవలలో చేయబడింది. ఇదే కదా మరి, అసలు సిసలైన హైద్రాబాద్ షాపింగ్!!
ఈ కట్టడాలన్నీ హైద్రాబాద్ కీ షాన్ అన్నట్టు ఉంటే, మరొక వైపు కట్టించిన వారి చరిత్రలూ , అబ్బురపరిచే రాజరికాలు కూడా మనని ఆశ్చర్యచకితులను చేస్తాయి. ముఖ్యంగా మహ్ లఖా బాయ్ చందా అనే కళాకారిణి విద్య – విజ్ఞానం, లలిత కళల కోసం చేసిన భూదానాలే నేటి సీఫిల్ (ప్రస్తుతం ఐఫ్లూ), ఆంధ్ర మహిళా సభ, బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంగా వెలిసినాయి. అంతేగాక ఈమె ప్రపంచంలోనే మొట్ట మొదటి ఉర్దూ కవియిత్రిగా పేర్కొనబడి, హైద్రాబాద్ ను చరిత్ర పుటలలో నిలబెట్టినది. ఇటువంటి వారి దర్గాలే ఇప్పుడు మౌలాలీ, చాదర్ఘాట్, తదితర ప్రాంతాలలోచూస్తున్నాం.
ఒకప్పుడు హైద్రాబాద్ చల్లగ వీచే గాలులతో, ఎటు చూసినా రంగురంగుల పువ్వుల బాగ్ బాగీచాలతో , వాటిలో వాలే వివిధ రకాల పక్షులతో అతి సుందరంగా, రమణీయంగా ఉండేది. మరి ఇప్పుడు? కాంక్రీట్ కట్టడాలతో సిమెంటు భవనాలు అరణ్యంలా తయార య్యింది అని రచయిత లాంటి అనుభవజ్ఞులు, ప్రాచీనులు వారి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డా. గోవర్ధన్ శాస్త్రి అప్పటి సియాసత్ ఉర్దూ పత్రికలో అన్నట్లు “హైద్రాబాద్ కా అంగన్ గాయాబ్ “!
ఇక ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు, ఉద్యోగులు, ప్రొఫెసర్లు, లాయర్లు, డాక్టర్లు, యావతప్రజానికం మొత్తం ఒక్కటై చేసిన నినాదాలు, జరిపిన సభలు సమావేశాలు, పోరాటాలు, పెన్ డౌన్లు, మలబార్ పోలీసుల లాఠీ ఛార్జ్లు, అమయకులపై కాల్పులు, జైల్లో బంధించడాలు, విద్యార్థుల ప్రాణ త్యాగాలు, ఎన్ని విధ్వంసాలు జరిగినా తట్టుకుని, ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకొని బ్రతుకుతూ కూడా సమైక్యంగా పోరాటం కొనసాగించి, అప్పటి ముఖ్యమంత్రిని గద్దె దించి, ఐకమత్యాన్ని చాటుకున్నారు హైద్రాబాదీలు.
“”జై”లు కొడితే జైలు
జైలు కెడితే”జై” లు
జైలులో మన “జైజై”లు
“జైజై”లతో ఖైదీ అయిన జైలు “…..
అంటూ ఆవేశంతో బయటకు వస్తున్న విద్యార్థుల కవితలు. మరోపక్క యువత పుస్తకాలు తిరగేస్తుంటే
” మనమంతా బానిసలం
గానుగలం పీనుగలం
వెనక దగా ముందు దగా
కుడి ఎడమల దగా దగా
మనదీ ఒక బ్రదుకేనా
కుక్కల వలే నక్కల వలె
మనదీ ఒక బ్రదుకెనా
సందులలో పందుల వలె…..” ( శ్రీ శ్రీ మహాప్రస్థానం)
అంటూ ఉద్వేగపరిచే కవిత్వాలు.
ఇరానీ హోటళ్లలో కూర్చుని ‘ దో బై చార్ ఛాయ్ ‘, ‘ తీన్ బై ఛే ఛాయ్ ‘ లు తాగుతూ, మస్కా బన్లు తింటూ సామాజిక పరిస్థితులకు అనుగుణంగా సాహిత్య రచనలు చేస్తూ ఉద్భవించిన యువ కవులు ఎంత మందో చెప్పనక్కర్లేదు. వీరిలో దిగంబర కవులు (దిగంబరోద్యమం), విరసం కవులు పర్కొనదగినవారు. వీరికి, వరంగల్లు నుంచి వరవర రావు వంటి విప్లవ రచయితలు కూడా తోడైనారు. తెలుగు నూతన విప్లవ సృజనాత్మక సాహిత్యంలో ఇదొక గొప్ప మలుపు.
ఒక సాధారణమైన సిటీ కాలేజ్ విద్యార్థి “స్వామి” అను పాత్రతో అప్పటి హైద్రాబాద్, అందులో ముఖ్యంగా పాతనగర జన జీవనం, తెలంగాణ సాయుధ పోరాటం, సాహిత్య సంచలనం, యువత ఐకమత్యం, కులమతాలకు అతీతంగా మనుషుల మధ్య వెల్లి విరిసే స్నేహాలు తెలంగాణా యాస భాషలతో ఈ నవలలో అపురూపంగా చిత్రీకరించ బడినది.
క్లుప్తంగా ఈ నవల మనకు ఇచ్చే నజ్రానా —-
అప్నే జిందగీ మే ఆప్ హీ హై ఏక్ ముసాఫిర్
లేకిన్ కిస్ కిస్ కో మాలూం హై అప్నీ మంజిల్?!
ఇస్లియే,
చల్తే చలో, చల్తే చలో
యే వక్త్ కీ అవాజ్ హై
చల్తే చలో చల్తే చలో
— పైదాయిషీ హైద్రాబాదీ