సస్య-7

– రావుల కిరణ్మయి

ఎవరు

          తను వెళ్ళేసరికి ఇళ్ళంతా శుభ్రంగా సర్ధబడి ఉంది. నమస్తే మేడమ్ ! అంది అక్కడ కూర్చుని శ్రావణ్ వాళ్ళ అమ్మకు పాదాలు మసాజ్ చేస్తున్న తనంత వయసున్న అమ్మాయి.

          నమస్తే ! మీరు…?

          నా పేరు … అని ఆమె చెప్తుండగానే…
మానసా…! ఒక్క నిమషం ఇలా వచ్చిపో. అని లోపల నుండి. శ్రావణ్ పిలవడంతో ఆమె వెళ్ళిపోయింది. అలా వెళ్ళిన ఆమె చాలా సేపటి వరకు రాలేదు. శ్రావణ్ వాళ్ళ అమ్మ T.V పెట్టింది చూడమన్నట్టుగా. తను “మొల్ల రామాయణం బుక్ తీసుకొని చదువుతూ కూర్చుంది.

          సమయం ఎనిమిది గంటలు కావస్తున్నది. ఎంత సేపని ఇలా ? అనుకొని
పోవడానికన్నట్టుగా లేచింది. శ్రావణ్ వాళ్ళ అమ్మ కూర్చోమన్నట్టుగాను, భోజనం చేసి వెళ్ళమన్నట్టుగానూ సైగ చేసింది. మంత్రించినట్టుగా ఇంక ఏమి అనలేక కూర్చుండి పోయింది.

          మరో గంట గడిచిన తరువాత మానస శ్రావణ్ గది నుండి బయటికి వచ్చింది.

          రండి మేడమ్ ! మీరు వచ్చారని వారికి చెప్తే భోజనం చేసి వెళ్ళమన్నారు. నేనేదో భోజనానికే వచ్చినట్టు మాట్లాడుతున్నారు. వీళ్ళు ? అనుకోకుండా ఉండలేకపోయింది.

          మానస గారూ! నేను వెళ్ళాలి… అంది.

          వారితో ఏమైనా మాట్లాడాలా? చెప్పండి విషయం ఏమిటో నేను వెళ్ళి చెప్తాను ,అని డైనింగ్ టేబుల్ పై అన్ని సర్ది ఒక ప్లేటులో అన్నీ వడ్డించుకొని వెళ్తూ..

          వారి ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోవాలనుకుంటున్నాను సరే ! అయితే ముందు భోజనం చేయండి. నేను ఈలోగా వారికి తినిపించి వస్తాను అని వెళ్ళిపోయింది.

          శ్రావణ్ వాళ్ళ అమ్మగారు ఆప్యాయంగా పట్టుకుని నడిపించి సస్యకు వడ్డించి తను కూడా వడ్డించుకోవడంతో తినడం పూర్తి చేశారు. ఈ లోగా మానస వచ్చింది.

          రండి మేడమ్ ! అని శ్రావణ్ గదిలోకి తాను కూడా నడిచింది.

          ఎలా ఉన్నారు? అడిగింది సస్య.

          పరవాలేదు. కాస్త నయంగానే ఉంది. మానస అన్ని పనులూ చేస్తూ నా అవసరాలు కూడా దగ్గరుండి చూసుకుంటున్నది కదా! అందువల్ల కోలుకోవడానికి పెద్ద సమయం పట్టదనిపిస్తున్నది.

          మీరెలా వున్నారు ? మీరు ఏదో స్కూలు మారారని విన్నాను. ఇక సంగీతం పాఠాలు సరిగమలు అవసరం లేదనుకుంటా. అలాగే నా అవసరం కూడా. ఇక వెళ్ళండి. ఇప్పటికే చాలా. పొద్దు పోయింది. ఒక్కరే వెళ్ళగలరా? మానసను తోడు పంపమంటారా?

          లేదు. వెళ్తాను.

          మంచిది. ఇంత దూరం రాకండి. మీకు నా ఆరోగ్యం గురించి తెలుసుకోవాలను కుంటే విదుషి గారిని అడిగి తెలుసుకోండి. మీకు ఆత్మాభిమానం ఎక్కువ అని విన్నాను.. డబ్బులు తిరిగి ఇచ్చివేయండి. అని చెప్పి, మానసా…! అని ఆమె వైపు చూడగానే, శ్రావణ్ దగ్గరగా వెళ్ళి అతడికి సాయపడుతుండగా అతను వాష్ రూమ్ వైపు కదిలాడు.

          అతని మాటల్లో ఇంతకు ముందు లాంటి ఆత్మీయత ఏదీ లేదు.

          మేడమ్ ! వెళ్తారా? నేను రానా? అన్నది శ్రావణ్ ను మళ్లీ పడుకోబెడుతూ. మీ పనులు పూర్తయితే ఇద్దరం కలిసి వెళ్దాం అన్నది.

          లేదండీ! తను మీలాగా కాదు. నాకు పూర్తిగా బాగయ్యేంత వరకు మాతో పాటే ఇక్కడే ఉంటుంది. అన్నాడు శ్రావణ్.

          ఎందుకో ఆ మాటలు సస్యను కొంచెం బాధించాయి. ఆ రాత్రి ఉండడానికైనా సిద్ధపడి వచ్చిన తనను, అతను నిర్లక్ష్యం చేస్తున్నట్టుగా స్పష్టమవుతున్నది. సస్య ఇంటికి చేరుకుంది.

***

          మరునాడు కానీ ఆ తరువాత వారం రోజుల వరకు సస్య కలవడం కానీ, ఫోన్ గానీ చేయలేదు.విదుషి కూడా ఫోన్ చేయకపోవడం ఆశ్చర్యంగా అనిపించింది. స్కూల్లో కూడా పరిస్థితి తను అనుకున్నంత సాఫీగా ఏమీ లేదు. కొత్త మురిపెం ఇత్తడి పోగులా ముందు తనను గౌరవించినట్టుగా ఉన్నా నెమ్మది నెమ్మదిగా మీరేమి అనుకోకపోతేనే అంటూ టీ పెట్టించడం, నాన్వెజ్లు చేయించడం వరకు వెళ్తున్నది. దీన్ని సున్నితంగా పరిష్కరించు కోవాలని ప్రధానో పాధ్యాయుడితో మాట్లాడింది. అతను సమావేశం ఏర్పాటు చేస్తాను. మాట్లాడండి అని (అందరినీ పిలిచి) పక్కకు తప్పుకున్నాడు. అయినా తన ఇబ్బందిని గురించి వారికి తెలియజేసింది.

          మేడమ్ ! మిమ్మల్ని మా ఇంటికి వచ్చి వండమనడం లేదు. • మిమ్మలి మనమందరం ఒక కుటుంబం అన్న భావనతో అడుగుతున్నాం.. మీరూ మాతో పాటు తాగడం, తినడం చేస్తున్నారు కదా ! ఇంక సమస్యేమిటి ? అని ఒకరు, మీకు ఇగో ఎక్కువ. రామచిలుకలా వచ్చి వెళ్తున్నారు. బడి గురించి ఆలోచించిందేమీ లేదు. ఈ చిన్న పనులు కూడా మీకు కష్టమంటే ఎలాగ ? అని మరొకరు, మాట్లాడుతూ ఎంత ఉద్యోగం చేసినా, ఇలాంటి బాధ్యతలు,కోరికలు కూడా తప్పదన్నట్టుగా అనడం చాలా క్షోభ పెట్టింది. ఇలాంటివి ఎదురయితే సమస్య ఇంతకు ముందు విదుషీతో చెప్పుకునేది. కానీ తాను ఇప్పుడు చెప్పుకునే వీలులేకుండా తానే చేసుకున్నకదా !అని మరింత కుమిలిపోసాగింది.

          మరో రెండు రోజుల తరువాత

          అమ్మ, సస్యా! ట్యూషన్ చెప్పడానికి వెళ్ళడం లేదా? అడిగింది.

          లేదమ్మా ! నాకు తీరడం లేదు అంది.

          అలా కాదమ్మా ! మనం పని చేస్తామని డబ్బు తీసుకున్నప్పుడు న్యాయం చెయ్యాలి కదా ! చెల్లెలును చూశావు కదా ! మెడలో గొలుసును చూసుకొని ఎలా మురిసిపోతుందీ ! అలాగే వారు తమకు తగిన ఫలం ఆశిస్తారు కదా! కొంచెం ఎక్కువ శ్రద్ధ చూపించైనా వాళ్ళ పిల్లలకూ న్యాయం చెయ్యమ్మా. అన్నది. అమ్మకు జరిగిన విషయం చెప్పడానికి, మనసు అంగీకరించడం లేదు. ఎలాగోలా పదివేలు శ్రావణ్ కు అప్పగిస్తే సమస్య తీరనట్టే. అనుకొని అప్పు కోసం ప్రయత్నించింది. ఇచ్చేవారు దొరకడంతో స్థిమితపడింది.
విదుషికి ఫోన్ చేసింది. ఎన్ని సార్లు చేసినా లిఫ్ట్ చేయలేదు. కావాలనే చేస్తుందా ? లేక ఏం జరిగి ఉంటుందని? అన్న సందేహం నిలువనీయడం లేదు. సరాసరి ఇంటికే వెళ్ళింది. ఇంటికి తాళం వేసి ఉండడం ఆందోళన కలిగించింది. కనీసం ఇంటి వాచ్మెన్ కూడా లేకపోవడం ఇదే మొదటిసారి తనకు తెలిసి. ఎవరున్నారు ? చెప్పడానికి? పరి పరి విధాలా ఆలోచించింది. శ్రావణ్ కు  ఏమైనా తెలిసే అవకాశం ఉంటుందా ? అని కనుక్కోవడానికి మళ్ళీ ఆ ఇంటికే వెళ్ళింది. ప్రమాదం జరిగి ఇరవై రోజులు పైగానే జరిగి ఉంటుందేమో! శ్రావణ్ పూర్తిగా కోలుకున్నట్టే కనిపించాడు.

          సస్యగారూ! రండి అన్నాడు వెళ్ళగానే పలకరిస్తూ.

          మీరెలా ఉన్నారు? అడిగింది.

          చూస్తున్నారుగా. అని, ఇంట్లోకి తదేకంగా చూస్తుండడంతో మానస వెళ్ళి పోయిందండీ. ఇప్పుడే వస్తాను అని, లోపల నుండి టీ, బిస్కట్స్ తో వచ్చాడు.
తీసుకోండి. టీ నేనే స్వయంగా పెట్టాను. ఎలా ఉందో అన్నాడు.

          అద్భుతంగా ఉంది. అన్నది. తడుముకోకుండా. తాగిన వెంటనే..

          థాంక్యూ, ఎంతైనా మీ అంత కాకపోయినా, మెచ్చుకున్నారు. అదే పదివేలు. ఏం పని మీద వచ్చారు ? అడిగాడు సూటిగా. మీ ఆరోగ్యం గురించి తెలుసుకోవడానికి విదుషికి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. అందుకనే నేనే స్వయంగా వచ్చాను..

          ఇంత శ్రమ తీసుకొని వచ్చినందుకు మీకు మరోమారు ధన్యవాదాలు అన్నాడు.

          అమ్మ ఎలా ఉంది ? అడిగింది. అదిగో ! తన లోకం తనదే, అన్నాడు ఆ పూల మొక్కల దగ్గర కూర్చొని ఏదో పుస్తకం చదువుకుంటున్న ఆమెను చూపిస్తూ.

          ఇంకా, ఏంటి సంగతులు? అడిగాడు.

          మీ డబ్బులు,..

          తీసుకొచ్చారా ? ఇవ్వండి.

          లేదండీ . కొంత టైం పడుతుంది..

          ఓహో ! అలాగా ! మరైతే చీకటి పడక ముందే బయలుదేరండి అన్నాడు .కప్పులు తీసేస్తూ లేచి నిలబడి.

          అది… విదుషి గురించి మీకేమైనా తెలుసా ?

          లేదండీ. నాకూ తెలియదు.. మీ విషయం గానే తను నాతో కలిసింది.

          అవునా?

          మీకు సంగీతం నేర్పించి కాస్త సాయం చేయమంటేను ఒప్పుకున్నాను. మీకు నేర్చుకోవాల్సిన బాధ నేర్పించాల్సిన బాధ నాకూ తప్పింది అన్నాడు ఈసారి నిండుగా నవ్వుతూ.

          కానీ, నాకు ఇప్పుడు నేర్చుకోవాలని ఉందండీ. అంది మెల్లగా,”

          పెద్ద పెద్ద కచేరీలు చేసి పేరు పొందాలనే ? అడిగాడు. అందుకు కాదు. నా మనో వేదనలన్నీ సంగీతం నేర్చుకుంటూ పోగొట్టుకోవాలనుకుంటున్నాను. తీరని సమస్యల నుండి కాస్త ఉపశమనం పొందాలని. 

          మరీ అంత కఠిన సమస్యలా ? మీవి ? ఏమో! నాకే తెలియడం లేదు.

          విదుషి నన్ను మీ దగ్గరకు పంపడం, నేను పొరపాటున మిమ్మల్ని గాయపర్చడం, నేను స్కూలు మారడం, అక్కడి వారి ప్రవర్తన, ఇంట్లో అమ్మ నేను తీసుకున్న డబ్బులకు న్యాయం చేయమనడం ఇదంతా గజిబిజిగా నన్ను చుట్టుకున్నాయి.

          సస్యగారూ! మీరు ఏమీ అనుకోనంటే ఒక చిన్న మనవి. మీరు. మీ వీలు చూసుకొని నాకు ఫోన్ చేయండి. ఇప్పుడు నేను వంట చేయాలి. అమ్మకు పూజకు సిద్ధం చేయాలి. ప్లీజ్ ! అన్నాడు. సస్య  సెలవు తీసుకొని ఇల్లు చేరుకుంది.

***

          ఒక ఆదివారం శ్రావణ్ ని కలవాలని వీలు చేసుకొని ఫోన్ చేసింది రమ్మని సస్య.
ఇద్దరూ సాయంత్రం చల్లగాలిని ఆస్వాధిస్తూ నడక ప్రారంభించారు.

          చెప్పండి ఎందుకు పిలిచారు ?

          నేను మీ పట్ల తప్పుగా ప్రవర్తించాను. దానికి నన్ను క్షమించాలి. నా ఆ ప్రవర్తనకు కారణమూ ఉంది. నా వయసులో ఉన్నప్పుడు అమ్మ కూడా ఇలాగే ఒక పెద్ద వారిట్లో పనికి కుదిరి మోసపోయింది. అర్ధం చేసుకొని పెళ్ళి చేసుకున్నట్టు నటించిన నాన్న తరువాత వెళ్ళిపోయాడు. ఆ భయమే నేనూ తప్పటడుగు వేయిస్తుందేమోనన్న అనుమానంతో అలాచేశాను. మాపై నమ్మకం కుదిరింది. మీ గురించి తెలిసింది. అని చందన చెప్పిన విషయాల్ని చెప్పింది.

          ఆ విషయం నా మనసు లో నుండి ఎప్పుడో తీసేశాను. నాకు గతం తలచుకోవడం ఇష్టముండదు. ఎంతైనా మనుషులం కదా ! ఆ మాత్రం కూడా లేకుంటే మానవత్వం విలువేముంది ?

          అవును. అందుకే అడుగుతున్నాను. ఒక నెల రోజుల పాటు మీ ఇంట్లోపని చేయనివ్వండి మా అమ్మ కోసం అన్నది.

          సరే ! మీ ఇష్టం. నాకు మా అమ్మ తప్ప ఎవరూ లేరు. నాన్న అంధుడు. అమ్మను చూశారు. వీరిద్దరూ వేరు వేరు చోట్ల పెరిగిన అనాథలు అనడం కంటే కావాలనే భయపడి వీరి కుటుంబాలు వదిలించుకున్నాయి. అంటే బాగుంటుంది. వారిద్దరి మధ్య అపారమైన ప్రేమ, ఒకరి పట్ల ఒకరికి ఇద్దరు వ్యక్తుల మధ్య సన్నిహిత బంధానికి కావలసిన అన్ని లక్షణాల పునాదులు ఉన్నాయి. వాటిపైనే ఒక సంస్కారవంతమైన మరో కుటుంబం నిర్మించాలన్నది. వారి ఆశ అందుకు నాకు ఒక మంచి జంటను జత చేయాలనేది వారి కోరిక.

          మానస, తనేనా ? అడిగింది చటుక్కున.

          కాదు. బాగా కావలసిన మనిషి. ఆ బంధంనకు మించి.

          మరి…విదుషి..?

          నవ్వాడు.జవాబు చెప్పలేదు.పదండి ,వెళ్దాం అమ్మ చూస్తూ ఉంటుంది, అన్నాడు
చీకటి పడడంతో. ఇంటిదారి పట్టారు. ఇద్దరినీ కలిపి ఏడడుగులు పూర్తి చేయించిన ఆ నడకను కాలం ఇద్దరినీ కలిపి ముడివేస్తుందేమో చూడాలి.

*****

(సశేషం)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.