
స్ఫూర్తి
-కప్పగంటి వసుంధర
రాత్రి పది దాటింది. బహుళ త్రయోదశి చంద్రుడు ఆకాశంలో నురగలలాంటి మేఘాలను దాటుకుంటూ తెప్పలాగా వెళ్తున్నాడు. నగరపులైట్ల పోటీని తట్టుకుంటూ అనాదిగావున్న ఎల్లలులేని తల్లిప్రేమలా వెన్నెల అన్నివైపులా వ్యాపించింది. రెండో అంతస్తు డాబామీద డాక్టర్ అపర్ణ, శైలజ విశ్రాంతిగా కూర్చున్నారు. అపర్ణ భర్త భాస్కర్ ఆఫీసు పనిమీద ఢిల్లీ వెళ్ళాడు. ఆమె తల్లి సీతమ్మ రెండువారాలు ఉండిరావడానికి పెద్దకొడుకు దగ్గరికి చెన్నైకి వెళ్ళింది. అపర్ణ నాలుగేళ్ల కొడుకు నిశాంత్ అమ్మమ్మతో పాటు వెళ్ళాడు.
చిన్నప్పుడు ఆ పల్లెటూరి వెన్నెలరాత్రి నిశ్శబ్దంలో పెరట్లో చాపమీద పిల్లలు నలుగురూ అమ్మచుట్టూ పడుకుని అమ్మచెప్పే కథలనువిని ఉత్తేజితం కావడం గుర్తొచ్చి అపర్ణ కళ్ళు చెమర్చాయి.
శైలజ భాస్కర్ చెల్లెలు, అపర్ణకు ఆడపడచు. కలకత్తాలో పెద్దకంపెనీలో పనిచేస్తోం ది, ఇంకా పెళ్లవలేదు. నెలరోజుల ఆఫీసు పనిమీద ఇక్కడికి వచ్చింది. వదినతో చనువు గా ఉంటుంది. శైలజ వొళ్ళో ఏదో ఇంగ్లీషు పుస్తకం ఉంది.
“ఏం పుస్తకమది?” అడిగింది అపర్ణ.
“వ్యాపారప్రపంచంలో ఇప్పుడు గొప్ప విజయాలు సాధించి ప్రసిద్దులైనవారి జీవిత చరిత్రల పుస్తకం. స్ఫూర్తి కలిగించడం కోసం అందరితో చదివిస్తూవుంటా. లండన్నుంచి తెప్పించా” అంది శైలజ పుస్తకాన్ని అపురూపంగా చూస్తూ.
“మంచిపని చేస్తున్నావు, మనదేశం వాళ్ళెవరైనా అందులో వున్నారా?”
“ఇద్దరో ముగ్గరో ఉన్నారు, తెలుగువాళ్ళెవరూ లేరు” అని తనకేదో మెస్సేజ్ రాగానే ఫోన్ లోకి చూసింది.
“మీఅమ్మా నాన్నా కలకత్తాకు అలవాటు పడ్డారా?” అడిగింది అపర్ణ.
శైలజ ఫోనులోంచి తలెత్తి “ఏమన్నావు వదినా? సారీ.. వినలేదు. నాఫ్రెండు ఒక విషయంలో సలహా కావాలంటే పంపుతున్నాను” అంది. అపర్ణ నవ్వుతూ మళ్లీ అడిగింది.
“బావున్నారొదినా. నీకు తెలుసుగా మా అమ్మానాన్నా క్రమశిక్షణతో ఉంటారు. మొదట్నుంచి సిటీల్లో ఉండడంవల్ల మేమందరం పద్ధతిగా, ఆధునికంగా ఉండడం అలవాటైంది” అంది శైలజ గంభీరంగా.
“మంచిదేగా” అపర్ణ మెచ్చుకుంది.
“మా యింట్లో ఎవరిపని వాళ్ళే చేయాలి. ఇక్కడికొచ్చాక చూశాను. అత్తయ్య, అదే మీ అమ్మ, మీరొద్దన్నా అన్నిపనులూ చేస్తోంది. భాస్కరన్నయ్యకు ఇంట్లో పనిలేక బద్దకం పెరిగిపోతోంది” అంది శైలజ నవ్వి.
“ఊరికే కూర్చుంటే అనారోగ్యమని అన్నీ తనేచేస్తుంది. అమ్మ ఎవరి దగ్గరుంటే వాళ్ళు హాయిగా ఉంటారు” చంద్రుడిని చూస్తూ చెప్పింది అపర్ణ.
“చిన్నవాడు నిశాంత్ అత్తయ్యను వదిలి ఒక్కనిముషం ఉండడంలేదు”
“ఎదిగే పిల్లలకి బొమ్మలు, ఫోన్లు కాకుండా మనిషి తోడు, మాతృభాష అవసర మంటుంది అమ్మ, అదో చాదస్తమనుకో పోనీ”
“నీకొకటి చెప్పాలి. ఏమీ అనుకోవుగదా?” అడిగింది శైలజ తడబడుతూ.
“చెప్పు. అరమరికలు లేకుండా మాట్లాడుకోవడం మా యింట్లో అలవాటు” అంది అపర్ణ ప్రసన్నంగా.
“మరేంలేదు, అత్తయ్య నిశాంత్ ని మరీ ముద్దుచేస్తోందని నా భయం. బలమైనవి తినాలంటూ పాతకాలం తిండి వండిపెడుతుంది. వాడికి కొత్తరకం వంటకాలు, స్నాక్స్ తెలియడం లేదు. మొన్న వాణ్ణి బర్త్ డే పార్టీకి తీసుకెళ్లినప్పుడు నాకు సిగ్గేసింది” అంది శైలజ మోహమాటంగా.
“అంతేనా?” అంది అపర్ణ నవ్వి.
“అంతేకాదు, నిశాంత్ ని అత్తయ్య పార్కుకి తీసుకెళ్తుందా? వాణ్ణి విడిగా ఆడించ కుండా అక్కడున్న పిల్లలతో అడుకోమంటుంది. వాళ్ళెలాంటివాళ్ళో తెలియదు కదా! అందర్నీ కూచోబెట్టి ఏనాటివో చరిత్ర కథలు చెప్తుంది. వాటిల్లో నేర్చుకోవడానికి ఏముంది? స్పూర్తి కలిగించే ఇప్పటి గొప్పవాళ్ళ విషయాలు చెప్పాలికదా? నేనదే అడిగితే ‘వాటికింకా టైముంది’ అంటుంది”
“ఇంకా?”
“వాడు స్కూలుకి డుమ్మాకొట్టినా, అల్లరిచేస్తున్నా ‘పిల్లలతో బలవంతంగా ఏపనీ చేయించకూడదు’ అని వాణ్ణే సపోర్ట్ చేస్తుంది. పైగా వెనకటికాలంలోలాగా తెలుగు పాటలు పాడుకుంటూ, అర్థంకాని బొమ్మలు, పజిళ్ళు తయారుచేస్తూ ఇద్దరూ కాలక్షేపం చేస్తారు. నేను వాణ్ని మందలించబోతే ‘ఇది తెలుసుకుంటూ ఎదిగే వయసు, కోప్పడితే మనసు గాయపడుతుందమ్మా’ అని నాకే బోధిస్తుంది అత్తయ్య”
“మరి మీ అన్నయ్యతో చెప్పలేదా?”
“చెప్పాను, ‘మీ అమ్మ విషయం కాబట్టి నీకే చెప్పమన్నాడు’. అందుకే చెప్తున్నాను. ఇలాపెరిగితే నిశాంత్ చదువుకోకుండా పెడసరంగా తయారై ఎందుకూ కొరగాకుండా ఉండిపోతాడు. చదువుల్లో, ఉద్యోగాల్లో పోటీపడుతూ ఎవరికివాళ్ళు ఎంతో ఎదుగుతున్న ఈ రోజుల్లో వాడిని ఇంత వెనకబడిన భావాలతో పెంచితే ఎలా?”
“అమెవి వెనకబడిన భావాలని ఎందుకు అనుకుంటున్నావు?”
“కంపెనీఇచ్చే ట్రైనింగ్ లో మాకు ఉద్యోగంలో పైకెదగాలంటే ఆడవాళ్ళు పిల్లల నెలా పెంచాలో చెప్తారు. సిటీలో మా ఫ్రెండ్సుమధ్య పోటీనీ గమనిస్తున్నాను. చూస్తున్నారుగదా.. అత్తయ్య పాతకాలం మనిషి. డబ్బు ఆదాచేయాలని ఓమంచి చీరా కట్టుకోదు, నగా పెట్టుకోదు. పల్లెటూర్లో ఉండిపోవడంవల్ల పాపం ఇంగ్లీషు నేర్చుకోలేక ఆమెకు ఆరోగ్యం, చదువు, ఆధునికత వీటి గురించి తెలియదనుకుంటా. మీ అమ్మ గురించి ఇలా అంటున్నానని ఏమీ అనుకోకు. ఆమె ప్రభావంతో నిశాంత్ ఏమైపోతాడో అని నాభయం” అంది శైలజ ఆందోళనగా.
కాసేపు మౌనం తర్వాత “నీకీ ఆదివారం సెలవేకదా! ఒకపని మీద శనివారంరాత్రి మావూరు వెళ్తున్నా, సోమవారం పొద్దునే వచ్చేస్తాను. నాతో రాకూడదూ? నువ్వింతవరకూ మావూరు చూడనేలేదు. పల్లెటూళ్ళో నీకూ మార్పుగా ఉంటుంది. అక్కడ తీరిగ్గా మాట్లాడు కోవచ్చు” అంది అపర్ణ.
అయోమయంగా చూసి “అలాగే” అంది శైలజ.
***
అపర్ణ, శైలజ శనివారంరాత్రి రైల్లో బయలుదేరి ఆదివారం తెల్లవారుఝామున టౌన్లోదిగి బస్సు ఎక్కారు. అక్కడి నుంచి మూడుగంటల ప్రయాణం.
“ఇప్పుడు రోడ్లు బావున్నాయి, ఒకే బస్సు. మేం చిన్నప్పుడు గతుకులరోడ్లు, వాగులకు సరైన వంతెనలు లేవు. మూడుబస్సులు మారి కష్టపడి టౌనుకు రావాల్సి వచ్చేది” చెప్పింది అపర్ణ.
సూర్యోదయమయ్యాక శైలజ బస్సు కిటికీలోంచి అందమైన కొండలు, తెల్లటి ఇసుకలో పారుతున్న వాగులు, పచ్చటిపొలాలు, తోటలు, చెరువుల్లో కొంగలు, ఎగురు తున్న పక్షుల్ని కళ్లువిప్పార్చి చూసింది. మధ్యలోవచ్చే పల్లెటూళ్ళలో యూనిఫాం వేసుకుని, పుస్తకాల బ్యాగులతో, క్యారేజిలతో బస్సుకోసం ఓపికగా ఎదురుచూస్తున్న హైస్కూలు పిల్లలు కనిపించారు.
“పరిస్థితులు ఎంతోమారినా, ఇంకా చదువుకోసం ఈ పిల్లలు ఎలా కష్టపడుతున్నారో చూడు. పౌష్టికాహారం లేక ఆడపిల్లలు ఎంత బలహీనంగా ఉన్నారో!” అంది అపర్ణ విచారంగా.
ఊరుచేరేసరికి ఎనిమిదైంది. బస్సు సీతమ్మ ఇంటిముందున్న గుల్మొహర్ చెట్టుకింద ఆగింది. అపర్ణ ముందుగా మెస్సేజి పంపడంవల్ల అక్కడే ఎదరుచూస్తున్న ఆమె చిన్నప్పటి స్నేహితులు శారద, దీప, రాగిణి వాళ్ళని ఆదరంగా ఇంట్లోకి తీసుకెళ్లా రు. అది చుట్టూచెట్లున్న పాతపెంకుటిల్లు. శారద, రాగిణి టీచర్లు, దీప పోస్టుమాస్టరు.
స్నానాలుచేసి టిఫిన్ తిన్నాక అపర్ణ తన ఫ్రెండ్స్ కి శైలజను అప్పజెప్పి పాతపేషంట్లను చూడ్డానికి వెళ్ళింది.
“మీరిదే పల్లెటూరు రావడం, అలా తిరిగొద్దాం రండి” అంటూ శైలజను పెరట్లోకి తీసుకెళ్లారు శారద, దీప. భోజనాల తయారికోసం తనయింటికి వెళ్లింది రాగిణి.
ఇంటిచుట్టూ మందారాలు, గన్నేర్లు, పారిజాతం, బోగన్ విల్లా .. పెరట్లో తులసికోట దాటాక మల్లె, జాజి, నందివర్ధనం, కనకాంబరాలు, చేమంతులు.. బావివెనక మామిడి, అరటి, దానిమ్మ, బొప్పాయి, కరివేప, మునగ.. ఇలాంటివి ఉన్నాయి. ఇంకావెనక పశువులపాక అనవాళ్ళు, పచ్చగడ్డి పెరుగుతున్న ఒకప్పటి కూరగాయల పెడలు, కనిపించాయి. చెట్లపాదులన్నీ తడిగావున్నాయి. అంతకుముందే పాలు తెచ్చియిచ్చిన మనిషి పెడల్లోని పచ్చగడ్డిని కోసి కట్టలుగా కడుతోంది.
“ఈమొక్కలని ఇంతచక్కగా నువ్వే చూసుకుంటున్నావా?” అడిగింది శైలజ ఆశ్చర్యంగా.
“లేదమ్మా, మీ అత్తగారొక మనిషిని పెట్టినాది. ఆమె చెట్లకు రోజూ నీళ్ళుపెడతాది, వారానికొకసారి ఫోన్లో యీడియో సూపించి ఆయమ్మ సలహాలు తీసుకుంటాది” అని చెప్పింది.
పొద్దున యధాలాపంగా చూసిన శైలజ ఇప్పుడు ఇంటినంతా విశదంగా చూసింది. కిటికీ కర్టెన్లకు, కుర్చీల కవర్లకు కుట్టిన లతలు, గుమ్మాలకి కట్టిన లేసులు, ఫ్రేములు కట్టించి గోడలకు తగిలించిన ఎంబ్రాయిడరీలు, షోకేసులో స్వంతంగా తయారు చేసుకున్న రంగుల బొమ్మలూ కనిపించాయి. ఇల్లంతా శుభ్రంగా హాలుమధ్యలో వేలాడు తున్న పట్టెమంచం ఉయ్యాలతో కళగా ఉంది. ముందుగదిలో ఆల్మరాలో పుస్తకాలు, చాక్ పీసులు, గోడకు మ్యాపులు, నల్ల బోర్డు, ఒకమూలన చుట్టిన చాపలు ఉన్నాయి. ఆ గది ట్యూషన్లకు అద్దెకిచ్చారేమో అనుకుంది శైలజ.
“మామయ్య చనిపోయి చాలయేళ్లయింది. సీతమ్మత్తయ్య ఏడాదిలో ఇక్కడ నెల కూడా ఉండదుకదా! ఇంతగా మెయింటెయిన్ చేయడమెందుకు?” శైలజ అడిగింది.
“యీ యింటిని మేం రాత్రి స్కూలుగా వాడుతున్నాం! ఫెయిలైన పిల్లలను చేరదీసి ఫ్రీగా యిక్కడ చదువు చెబుతాం. మనుషుల్నేకాదు చెట్లను, వస్తువులను కూడా స్వార్థంతోకాక ప్రేమతో స్నేహితుల్లా చూడకపోతే నచ్చదు సీతమ్మకు. ఏదో అవస్తలు పడుతున్నాం లెండి” అంది దీప నవ్వుతూ.
చివరన సామాన్లగదికి వెళ్ళిన శైలజకు అక్కడి అల్మరాల నిండా పాతపుస్తకాలు, ఫోటో ఆల్బంలు కనపడ్డాయి. పాతగుడ్డతో పల్చటి దుమ్ముతుడిచి పుస్తకాలు తీసింది. అందులో కొన్ని సాహిత్యం, సైన్సు, ఆధ్యాత్మిక పుస్తకాలు. మరికొన్ని అప్పటి పత్రికల్లో వచ్చిన వ్యాసాలు, కథలు, సీరియల్సు కత్తిరించి బైండ్ చేసినవి.
“ఈ పుస్తకాలెవరివి?” అనడిగింది కిచెన్లోవున్న శారదను పిలిచి.
“సీతమ్మవే. ఖర్చులు తగ్గించుకొని పత్రికలు, పుస్తకాలు పోస్టులో తెప్పించుకుని శ్రద్ధగా చదివేది. మాలాంటి చుట్టుపక్కల పిల్లల్నీ చేరదీసి గుండె ఎలా పనిచేస్తుందో, రాకెట్టు ఎలాపైకెళ్తుందో, సినిమాలు ఎలాతీస్తారో ఇలాంటివన్నీ చెప్పేది. పేపర్లు చక్కగా చింపడం, ప్రింటు లోపలికి పోకుండా పుస్తకాలుగా కుట్టడం నేర్పించింది. తేడావస్తే వీటి విలువ తెలుసుకోండి అని మెత్తగా మందలించేది” అంది శారద.
“ఈ చిన్నపిల్లల ఇంగ్లీషు బొమ్మల పుస్తకాలు బావున్నాయి. ఎవరో స్వంతంగా చేత్తో తయారుచేసినట్టున్నారు”
“అప్పట్లో అలాంటివి సిటీల్లోగాని దొరికేవి కావు. సీతమ్మకు టీచరు ఫ్రెండ్సు ఉండేవాళ్లు. వాళ్ళ సలహాలతో ఆమే తయారుచేసుకుని మాతో చదివించేది. ఇవేకాదు, కథలు చెప్పేది, పాటలు నేర్పించేది. ఒక్కమనిషి ఇన్ని చెయ్యడం మాకు వింతగా ఉండేది. అదే అడిగితే, మనసు పెట్టిచేస్తే ఆడుతూపాడుతూ ఎన్నయినా చెయ్యచ్చు అనేది. పైచదువులకు వెళ్లలేకపోయినా తెలుగు బాగావచ్చు. ఆ అద్వైతం పుస్తకాలు గురువుగారి సాయంతో అర్థం చేసుకునేది. మేమప్పుడు వాటిజోలికి వెళ్ళేవాళ్ళం కాదనుకో” అంది శారద నవ్వుతూ.
“మీ మామయ్యకు వ్యవసాయం, గ్రామవిషయాలే లోకం. పుట్టింటి పరిస్థితిని బట్టి పద్దెనిమిదేళ్లకే పెళ్లై యీ పల్లెటూరికి సీతమ్మ కాపురానికొచ్చే సమయానికే పాపం అత్తామామా లేరు. ఇంటిని ఏదో తోచినంతలో సంప్రదాయంలోనే ఆధునికంగా ఇలా మార్చుకుంది. ‘ఇంకా బాగా ఎలాచెయ్యచ్చు?’ అని అస్తమానం ఆలోచించేది. ‘డిగ్రీలు లేని పల్లెటూరివాళ్లుకదా’ అని వాళ్ళను తక్కువ అంచనా వెయ్యడానికి లేదండోయ్” చెప్పింది అక్కడికొచ్చిన దీప కళ్ళు పెద్దవిచేసి.
“రండి ఫోటోలు హాల్లో చూద్దాం” అంటూ వాటిని తీసుకుని హాల్లోకి వెళ్ళింది శారద.
ఫోటోలు చూస్తూ వివరాలు తెలుసుకుంటూ “వదినావాళ్ళు టౌన్ స్కూల్లో చదువుకునే రోజుల్లో ప్రైజులు బాగానే తెచ్చుకున్నారు” శైలజ మెచ్చుకుంది.
టైం పదకొండవుతుండగా ఊరిచివర ఏటిగట్టునున్న గుడికి వెళ్లారు. ఆ పక్కనే బాటసారుల కోసం అత్తామామా పేర్లతో సీతమ్మ కట్టించిన మంచినీళ్ళ బావిని, విశ్రాంతి మండపాన్ని చూసింది శైలజ. దారిలో కనపడినవారు శైలజ ఎవరో తెలుసుకుని ఆప్యాయంగా పలకరించారు. “ఇవన్నీ పల్లెటూళ్ళ అభిమానాలు” అంది దీప. ఇంటికి తిరిగి వస్తూండగా కర్రసహాయంతో నడుస్తూ ఎదురొచ్చిన రిటైర్డ్ టీచరు రాఘవులు, పెద్ద వాడైపోయిన టైలరు కాశీం శైలజను చూసి ఆగారు. శారద ఆమె గురించి వివరించి “ఈమె కలకత్తాలో పెద్దాఫీసరు” అని చెప్పింది.
“మీరు సిటీల్లో చదువుకున్న అదృష్టవంతులమ్మా. అప్పట్లో సీతమ్మ పిల్లల చదువు కోసం ఎంత కష్టపడిందనుకున్నావ్? దగ్గర్లో హైస్కూలు లేదు, బస్సులు అంతంతమాత్రమే. డబ్బు ఇబ్బందులున్నా, భర్త ప్రోత్సాహంతో ఆమె ఎంతో సాహసించి దూరంగావున్న టౌన్లో ఇల్లు అద్దెకు తీసుకుని, బంధువులను గార్డియన్లుగాపెట్టి తన పిల్లలనే కాకుండా దగ్గరివాళ్ళను కూడా చదివించింది. మీ మామయ్య తరచుగా చూసివచ్చేవాడు. సీతమ్మ బియ్యం, పప్పుల్లాంటి దినుసులు తీసుకుని బస్సుల్లో అవస్తలుపడుతూ నెలకోసారి వెళ్ళి పదిరోజులైనా ఉండివచ్చేది” అని నిట్టూర్చాడు రాఘవులు.
“ఆ రోజుల్లో సాహసమే! ఆమె పిల్లలు కూడా బాధ్యతగా చదువుకోవడమేకాక ఎప్పుడూ ఎవరికో ఒకరికి సాయం చేస్తూనే ఉంటారు” ఒప్పుకుంది శైలజ.
“వాళ్ళలో చిన్నప్పుడే అలాంటి ఆత్మవిశ్వాసం కలిగేట్టు చేసింది మా సీతమ్మ. ‘మనతోపాటు పదిమందీ ఎదగాలని’ చెప్పేది” అన్నాడు రాఘవులు.
“ఆమెంటే వూర్లో అందురికీ ఇష్టమే తల్లీ. ఎంతోమంది ఊరోళ్ళు ఆమెతో కష్టాలు చెప్పుకునేదానికి వచ్చేటోళ్ళు. ‘మనం ఓపిగ్గా యింటే ఎదుటోళ్ల బాధ సగమైనా తగ్గుతాది కాశీం’ అనేది. యిని ఊరుకునేదా? చాతనైనంతలో వోళ్ళకు సాయం చేసేది.
అవుసరమైన పిల్లలకు పాలు, కూరలు, మందులు, పొస్తకాలు అంపించేది. పిల్లల్నే కాదు, ఎవుర్నీ కటినంగా ఏమీ అనేదికాదు” చెప్పాడు కాశీం అభిమానంగా.
“క్రమశిక్షణ లోపల్నుంచి రావాలి అనిచెప్పేది. మరీ చాదస్తంలేండి, అంత మెత్తగా ఉండడం ఎవరివల్లా కాదు” అంది దీప నవ్వి.
రాఘవులు, కాశీం గుడివైపు వెళ్లిపోయారు. శైలజావాళ్ళు ఇల్లు చేరేసరికి మధ్యాహ్న మైంది. కాసేపటికి అపర్ణ వచ్చింది. భోజనాల తరువాత “అమ్మ ఆదాచేసిన డబ్బుతో నాన్నపేరుతో ఇక్కడి ఆస్పత్రిలో రూములను కట్టిస్తున్నాము, ఆ పనిమీద వెళ్తున్నాను. నువ్వు కాసేపు రెస్టుతీసుకో” అని శైలజకు చెప్పి వెళ్ళింది.
శైలజకు తనేదో కొత్తలోకంలో ఉన్నట్టనిపించింది. గదిలోకెళ్ళి పడుకోగానే మగత నిద్రపట్టేసింది. నిద్రలో ఆమెకు సీతమ్మ గుర్రబ్బండిలో ఎక్కడికో వెళ్లిపోతున్నట్టు, ఊరివాళ్ళంతా ఆ బండివెనకే వెళ్తున్నట్టు, నిశాంత్ ను పట్టుకుని తనొక్కతే ఉండి పోయినట్టు, వాడు తనని బండివైపు లాగుతూ ఏడుస్తున్నట్టు కలవచ్చింది. మెలుకువ వచ్చి లేచికూర్చుంది. తేరుకుని టైంచూస్తే నాలుగౌతోంది. హాల్లో చాలామంది ఉన్న సందడి వినిపించి, మొహం కడుక్కుని వచ్చింది. హాల్లో ఇరవైమందికి పైగా ఊరివాళ్ళు అపర్ణకోసం వేచివున్నారు. సగంమంది వయసు పైబడినవాళ్లే, కొంతమంది పిల్లలుకూడా ఉన్నారు.
శైలజను చూసి “లేచారా” అంటూ, వచ్చినవాళ్ళకి పరిచయం చేసింది శారద.
‘సీతమ్మ అల్లుడి చెల్లెలంటూ’ అందరూ ఆప్యాయంగా పలకరించారు. ఆదరంగా కుటుంబ క్షేమాలు అడిగారు. ఇంతలో అపర్ణ వచ్చింది. వాళ్ళందరూ ఆమెచుట్టూచేరి సీతమ్మను తమవూరికి పంపడం లేదని నిష్టూరం చేశారు. పాతరోజులను గుర్తు చేసుకున్నారు. తమను కష్టంలో ఆమె ఎలా ఆదుకుందో తల్చుకుని కొందరు కన్నీళ్ళు పెట్టుకున్నారు. అపర్ణ అందరితో అనునయంగా మాట్లాడి, ఆరోగ్యాల గురించి అడిగి, తగిన సలహాలిచ్చాక “మా బస్సుకు టైం అవుతోంది. ఈసారి అమ్మను తీసుకొని తీరిగ్గా వస్తాను” అని నచ్చజెప్ప పెరట్లోకి వెళ్ళింది.
శైలజ గదిలో సామాన్లు సర్దుకుంటూ “అత్తయ్య ఊరిని వదిలేసి చాలాయేళ్ళైనా అందరూ ఇంకా ఇంత అభిమానంగా తల్చుకోవడం అబ్బురంగా ఉంది. దూరపు బంధువైన నన్నే ఎంతో ఆదరంగా పలకరించారు” అంది.
“స్ఫూర్తికోసం ఎక్కడో చూసేపన్లేదు. మా అందరికీ మీ సీతమ్మే స్ఫూర్తి ” అంది శారద చెమ్మగిల్లిన కళ్ళతో.
“మనచుట్టూ తెరవెనక ఇలాంటి సీతమ్మలు ఎందరోవున్నారు. ఓపికగా పనిచేస్తూ, పదిమందికీ సాయపడుతూ, పిల్లల్ని సరిగ్గా తయారుచేసి సమాజ వికాసానికి సాయపడే ప్రతి తల్లీ ఒక సీతమ్మే!” స్వగతంలా పలికింది రాగిణి.
వచ్చినవాళ్ళలో చాలామంది అక్కడేవుండి అపర్ణ, శైలజలను బస్సు ఎక్కించారు. కిటికీలోంచి వస్తున్న చల్లగాలికి అపర్ణ నిద్రలోకి వెళ్ళింది.
***
రైల్లోఎక్కి బెర్తులమీద సర్దుకున్నాక “సారీ శైలజా, ఎపుడొచ్చినా ఇంతే, ఊరివాళ్ళు ఇంటికొచ్చి హడావుడి చేస్తారు. పాతపేషెంట్లూ ఈసారి పెరిగారు. నీతో మాట్లాడడానికి కుదరనే లేదు” అంది అపర్ణ.
శైలజ ఏదోఆలోచిస్తూ బదులివ్వలేదు.
“మొన్న నువ్వేదో నిశాంత్ గురించి చెప్పావు. ఏంచేయాలో ఇప్పుడు వివరంగా చెప్తావా? ఏమిటంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు?” అడిగింది అపర్ణ నవ్వుతూ.
“వెంటనే అత్తయ్యను చూడాలనివుంది. ఇక్కడ పనవగానే మొదట చెన్నైవెళ్ళి అత్తయ్యతో ఒకరోజు గడిపి కలకత్తా వెళ్తాను. ఆమె దగ్గర చాలానేర్చుకోవాలి, మళ్లీ ఈవూరొస్తాను!” అంది శైలజ కొంత అపరాధభావనతో, కొంత ప్రసన్నంగా.
*****