అనుసృజన

సూఫీ కవిత్వం

అనుసృజన: ఆర్ శాంతసుందరి

 
సూఫీ కవిత్వం – 2 
సూఫీ కవిత్వంలో – భగవంతుడితో కలయిక, ప్రేమ, మానవ చైతన్యంలోని అతి లోతైన భావాలు కవుల హృదయాలలో నుంచి పొంగి పొరలి,  వారి కలాలలో నుంచి కవితలుగా జాలువారాయి. ఈ కవితలు పర్షియన్, టర్కిష్ భాషలలో మొదట రాసేవారు కాని, ఈ రోజుల్లో ఉర్దూ, హిందీ భాషలలోనూ రాస్తున్నారు -అవి అనువాదాలుగా కూడా దొరుకు తాయి. ఆంగ్లంలో కూడా సూఫీ కవితలు రాస్తున్నారు. కొంతమంది ప్రముఖ సూఫీ కవుల కవితలని తెలుగులో స్వేచ్ఛానువాదంగా పరిచయం చేసే ప్రయత్నమే ఇది….
 
జలాలుద్దీన్ రూమీ (1207-1273) పర్షియన్ సున్నీ ముస్లిం కవి, న్యాయమూర్తి, తాత్వికుడు, ఇస్లాంని క్షుణ్ణంగా అధ్యయనం చేసిన సూఫీ మార్మికవాది (మిస్టిక్). రూమీ ప్రధానంగా పర్షియన్ భాషలో రాసినప్పటికీ, టర్కీ, అరబిక్, గ్రీకు భాషల్లో కూడా కవితలు రాశాడు.
 
1. “ఈ రోజు కూడా ప్రతిరోజులాగే మనం శూన్యంతో నిండినట్టు భయంగా నిద్రలేస్తాం
పుస్తకాల గది తలుపు తెరిచి చదవడం ప్రారంభించకండి. ఒక వాయిద్యాన్ని అందు కోండి. మీరు చేసే పనిలో మీరు ప్రేమించే విషయం తాలూకు అందం కనిపించ నివ్వండి. కొన్ని వందల రకాలుగా మోకరిల్లి మట్టిని మూర్కొనవచ్చు.
 
2″ రోజంతా దాని గురించే ఆలోచిస్తాను. చివరికి రాత్రి నన్ను నేనిలా ప్రశ్నించుకుంటాను ః
నేనెక్కణ్ణించి వచ్చాను, నేను చెయ్యవలసిందేమిటి? నాకు తెలీదు. నా ఆత్మ మరెక్కణ్ణించో వచ్చింది, అది మాత్రం ఖచ్చితంగా తెలుసు. నాకు ముగింపు కూడా అక్కడే జరగాలని నా ఆశ. నా కళ్ళతో పైకి చూసేదెవరు? ఆత్మ అంటే ఏమిటి? అలా ప్రశ్నించటం మానలేకుండా ఉన్నాను. దీనికి ఒక్క గుక్కెడు సమాధానం రుచి చూడగలిగినా ఈ తాగుబోతుల ఖైదు నుంచి బైట పడగలుగుతాను. నా అంతట నేనై ఇక్కడికి రాలేదు, నా అంతట నేను బైటికి కూడా పోలేను. నన్నిక్కడికి ఎవరైతే తీసుకొచ్చారో వాళ్ళే మళ్ళీ నన్ను ఇంటికి చేర్చాలి.
 
3. ఎండలోని ధూళిని నేనే.
సూర్యగోళాన్ని నేనే.
వేకువ పొగమంచుని,
సాయంకాలపు శ్వాసని నేనే.
రాతిలోని నిప్పురవ్వని నేనే,
లోహంలోని బంగారపు తళుకుని నేనే.
గులాబిపూవునీ దాని పరిమళంతో మత్తెక్కి
తీయగా పాడే పక్షినీ నేనే.
అస్తిత్వానికి కొనసాగింపుని నేనే
గోళాల వలయాన్ని,
సృష్టి పరిమాణాన్ని,
ఉన్నతి అవనతి నేనే.
ఉన్నదీ లేనిదీ నేనే.
అందరిలో ఉన్న ఆత్మని నేనే. *
 
          ఎప్పుడో రాబోయే వరదలో నేను ఇప్పుడే తడిసి ముద్దయాను. ఇంకా ఉనికి పొందని కారాగారంలో నేను బందీగా ఉన్నాను. చదరంగం ఇంతవరకూ ఆడలేదు కానీ నా ఆట కట్టయింది. నీ దివ్య ఎర్రద్రాక్షాసవాన్ని ఒక్క చుక్క రుచి చూడకపోయినా, నేను మత్తెక్కి ఉన్నాను. యుద్ధభూమిలో కాలు మోపలేదు కాని నేను గాయపడి మరణించాను. కల్పనకీ వాస్తవానికీ ఇక నాకు భేదం తెలియటంలేదు. ఒక నీడలా నేను ఉండీ లేనట్టే ఉన్నాను.
 
***
          హిందువులూ ముసల్మానులూ ఒకటే “జ్ఞానులైనా మూర్ఖులైనా అన్వేషణలో ఉన్నప్పుడు సమానమే. ప్రేమ అనే మతంలో అపరిచితులూ, మిత్రులూ ఒకటే. ప్రేమించిన వ్యక్తితో పునఃసమాగమం పొందిన వ్యక్తి ఆ ప్రేమరసాస్వాదనలో మైమరచి ఉన్నప్పుడు, అతను ఏ మతానికి చెందినవాడైనా , అల్లా దర్బారులో ఉన్న ముస్లిం అయినా, దేవాలయాల్లోని విగ్రహారాధన చేసే హిందువైనా , ఇద్దరూ సమానమే.
 
***
రూమీ ఇచ్చే ఏడు సలహాలు
1.ఔదార్యంలోనూ, పరోపకారం చెయ్యటంలోనూ నదిని పోలి ఉండు.
2. సహానుభూతినీ , అనుగ్రహాన్నీ అందించటంలో సూర్యుణ్ణి పోలి ఉండు.
3. ఇతరుల తప్పులని కప్పిపుచ్చటంలో రాత్రిని పోలి ఉండు.
4.క్రోధం, ఆగ్రహం చూపించటంలో మరణించినవారిని పోలి ఉండు.
5. వినయమూ, అణకువా ప్రదర్శించటంలో మట్టిని పోలి ఉండు.
6. ఇతరుల మతాన్ని అంగీకరించి సహనం చూపించటంలో సముద్రాన్ని పోలి ఉండు.
7.ఇతరుల ఎదుట నిన్ను నువ్వు ప్రకటించుకునేటప్పుడు నువ్వు ఎలా ఉన్నావో అలా కనిపించు, లేదా నువ్వు ఎలా కనిపిస్తున్నావో అలా ఉండు.(అంటే నిజాయితీగా ఉండు). 
 
***
నరకానికి భయపడి నిన్ను నేను ఆరాధించినట్టయితే
నరకంలో నన్ను కాల్చివెయ్యి !
స్వర్గం కోసం నిన్ను నేను ఆరాధించినట్టయితే
అందులోకి నాకు ప్రవేశమ్ లేకుండా చెయ్యి.
నీ కోసమే నిన్ను ఆరాధించినట్టయితే మాత్రం
నీ శాశ్వత సౌందర్యాన్ని చూసే భాగ్యం కలగకుండా చేయకు.
 
***
ప్రేమలో రెండు హృదయాల మధ్య ఇంకేమీ ఉండదు.
మాటలు ఆకాంక్షలోనుంచి పుడతాయి
నిజమైన వర్ణన నిజమైన అభిరుచి నుంచి పుడుతుంది.
రుచి చూసినవారికి తెలుస్తుంది;
వివరించేవారు అబద్ధాలు చెపుతారు.
ఒక వస్తువు అసలు స్వరూపాన్ని నువ్వెలా వర్ణించగలవు?
దాని సమక్షంలో నువ్వు పూర్తిగా మాయమైపోవా?
ఇక ఎవరి అస్తిత్వంలో ఉంటుంది నీ ఉనికి?
నీ ప్రయాణానికి సంకేతంగా ఎవరు జీవించి ఉంటారు?
 
***
రెండు రకాలుగా నిన్ను ప్రేమించాను నేను
ఒకటి స్వార్థపూరితమైనది, మరొకటి నీకు తగినది
స్వార్థంతో నిండిన ప్రేమలో
నీతోబాటు నేను కూడా ఉంటాను,
ఇంకెవరినీ ఉండనివ్వను.
కానీ నీకు ఏ ప్రేమకైతే అర్హత ఉన్నదో
నేను నిన్ను చూడగలందులకు నువ్వే ముసుగు తొలగిస్తావు.
అయినప్పటికీ ఇందులో గాని అందులో గాని నా గొప్పేమీ లేదు
ఆ రెండింటిలోనూ ఉన్న గొప్పంతా నీదే.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.