ఆకలి చావుల కమీషన్ రిపోర్ట్ – 9

(ఒరియా నవలిక )

మూలం – హృసికేశ్ పాండా

తెనుగు సేత – స్వాతీ శ్రీపాద

          నాకు తెలుసు నేనిచ్చే ఈ నివేదిక ఎవరికీ సరిపడదు. ఈ కేస్ ఆకలి చావేనని నేను ధృవీకరిస్తే ప్రతిపక్షాలు పండగ చేసుకుంటారు. అది ఆకలి చావు కానే కాదని నేను నొక్కి చెప్తే రూలింగ్ పార్టీ ఆనందపడుతుంది. దాదాపు ఒక ఏడాదిగా ప్రేమశిల తిండి లేక మాడుతోందని చెప్పడం అతిశయోక్తి కాదు. ఆమెకు ఏడాది క్రితమే ఆహారం అందించి ఉండాల్సింది.

          మంచిది. ప్రతివాళ్ళూ, స్థానిక సర్పంచ్ మొదలు నా వరకూ ప్రతివాళ్ళూ ఈ దోషం అంగీకరించక తప్పదు. కాని, ఒకవేళ సర్పంచ్, తాసిల్దార్, బీడీవో, కలెక్టర్, స్టార్వేషన్ కమీషనర్ లను ఉరితీస్తే  ప్రేమశిల ఆకలిచావు నేరారోపణ దోషవిమోచన జరుగు తుందా?

          ఇది పుర్తిగా దిక్కుమాలిన సమస్య. ఈ దారిద్ర్యీకరణ విధానంలో వడ్డీ వ్యాపారులు, మనుషులను వలస కూలీలుగా అక్రమ రవాణా చేసే బ్రోకర్లు, మిల్లర్లు, ప్రజా పంపిణీ విధానం అధికారులు, అందరూ భాగస్తులే. ఈ సమూహాల లీడర్లు ఇప్పుడు మన ప్రజాస్వామ్య రాజ్యాంగంలో అంతులేని అధికారాన్ని ఆనందంగా అనుభవిస్తున్నారు. వారి వారి పాత్రల వివరణ లేకుండా ప్రేమశిల ఆకలి  చావు వెనకాల నిజాన్ని వివరించ లేము. దయచేసి నన్ను రూలింగ్ పార్టీ ఏజంట్ గానో లేదా ప్రతిపక్షాల సభ్యుడిగానో అనుకోకండి. దయతో నన్ను గుమస్తాల దౌర్జన్యంగానో ప్రభుత్వ అధికారుల నిరసనగానో నిందించకండి.

          అందువల్ల,  ప్రియమైన పాలకులారా, మీరు నన్ను విచారణ జరపమని పంపిం చారు. నేను గమనించినదంతా పేపర్ మీద పెట్టాను.  నేను ఈ ప్రపంచంలో సర్వజ్ఞుడను కాను. ఆ మాటకొస్తే ఈ ప్రపంచంలో ఎవరూ సర్వజ్ఞులు కారు. నేను కావాలని ఏదీ తప్పుడు సమాచారం ఇవ్వలేదు. ఏదీ అతిశయోక్తిగా చెప్పలేదు. ఏ సత్యాన్నీ దాచలేదు.

          అందుకని ఈ నివేదికను ఆసాంతం చర్చించండి. దయచేసి లోపాలను చూపించండి. కాని దయచేసి దీన్ని చెత్తబుట్టలోకి విసిరెయ్యకండి. నేను కేవలం ఒక రాయబారిని అంతే. రాయబారిని హత్య చెయ్యడం రాచమర్యాదకు తగినది కాదు. రాయబారిని హత్య చెయ్యకండి.

          ఈ విచారణ అడుగుతున్న ఒకే ఒక ప్రశ్నకు నేను నిర్ధిష్టమైన జవాబు చెప్పడానికి ప్రయత్నిస్తాను. ప్రేమశిల మరణం తిండి లేకపోడం వల్లనా కాదా? ఇప్పుడు జహంగీర్ రూలింగ్ పార్టీ లో ఉన్నాడు. ఈ  నిందారోపణ పనికి మాలిన చెత్తకింద తీసిపారేస్తాడు. ప్రతిపక్షంలో ఉన్న జలంధర్ ఈ చావు తిండిలేక  మాడిపోడం వల్లనే అంటాడు. మూడేళ్ళ క్రితం ఇదే గ్రామంలో ప్రేమశిల భర్త పూర్ణ మరణించాడు. జహంగీర్ అప్పుడు అతని మరణం తిండిలేక అని అన్నాడు.

          జలంధర్ అతని మరణం తిండిలేక కాదని ఎదిరించాడు. అప్పట్లో జలంధర్ రూలింగ్ పార్టీలో జహంగీర్ ప్రతిపక్షంలో  ఉండేవారు.

          మనం ఆకలి చావు అన్న మాట వాడిన క్షణం అది న్యాయమైన నిష్పక్షపాతమైన తీర్పు సరిహద్దులకు దూరంగా తప్పించుకుంటుంది. నిజం చెప్పాలంటే ఈ మాటలు నిష్పక్షపాత తీర్పు విధానాన్ని ప్రమాదంలోకి నెట్టేసాయి. నేను ఇప్పటికే ప్రేమ శిల బాధపడిన  తిండిలేకపోడం, అర్ధాకలితో ఉండటం, సరైన పోషకాహారం లేకపోడం  గురించి చెప్పాను. ప్రేమశిల మరణానికి కొన్ని రోజుల ముందు నేను గమనించినది ఆమె ఆమె పిల్లలను కూడా గ్రామంలో  ఫ్రీ కిచెన్లో చేర్చుకున్నారు. ఇలాటి ఫ్రీ కిచెన్ లు దారిద్ర్యాన్ని ఆపలేవు గాని ప్రజాస్వామిక ప్రభుత్వంలో ఇలా డబ్బు లేకుండా ఆహారాన్ని అందించి తీరాలి. కొందరు, ముఖ్యంగా ప్రభుత్వ అధికారులు దీని గురించి ఒక ప్రశ్న లేవనెత్తారు. ఎంతకాలమని మనమిలా పేదవారికి  తిండి పెడుతూ ఉంటాము? సర్పంచ్ పదిరోజులు అహారాన్ని ఇస్తాడు, ప్రభుత్వ అధికారులు ఒక నెలో రెండు నెలలో ఇస్తారు. ఆ తరువాత  మాటేమిటి?

          ఈ జనాలకు నా జవాబు: ఎంత కాలం అవసరం ఉంటే అంతకాలం. పూర్వ కాలంలో జమీందారులు , భూస్వాములు బీదవారికి, అవసరం ఉన్న వారికి ఆహారం ఏర్పాటు చేసేవారు. ప్రేమశిల తండ్రిలాటి వారిని, మన సమాజానికి అవసరమైన వారిని వాళ్ళు చూసుకునే వారు. నేనేమీ భూస్వామ్యానికి పట్టం కట్టడం లేదు. కాని ఆ విధానం నిర్మూలించాక నిరుపేదలకు ఆహారం ఇవ్వవలసిన బాధ్యత ప్రజాస్వామికంగా ఎన్నుకున్న ప్రభుత్వానిది.

          ఈ నివేదిక ప్రెస్ లో కూడా కొన్ని విభాగాలను అసంతృప్తికి లోనుచేస్తుంది. నిస్సందేహంగా ఆకలి చావేనని గట్టిగా నిర్ణయించి హెడ్ లైన్స్ లో నిందించకుండా ఉండాల్సింది. కాని పూర్ణ,  ప్రేమశిల మరణ ఘటనలు అటవీ నిర్మూలన, అప్పుల వలయం,  అడవులను ఖాళీ చేసేందుకు వలలు విసిరిన వేటగాళ్ళూ, దొంగల వల్ల … ఎంత సంక్లిష్టమైనదంటే దాన్ని న్యూస్ పేపర్ హెడ్ లైన్స్ లో ఇమడ్చలేరు. వారికి వినమ్రంగా నేనిచ్చే జవాబు : ఆకలి చావు నేరం నిర్ధారణో, నిరాకరణో ఈ సమస్య పరిష్కారానికిరాని దారి చూపదు.

          ” నాకు భయం కనక నేను ఈ అపరాధం ఆకలి చావుగా అంగీకరించను. ” అలా మీరంటే ఆ సమస్య తీరుతుందా?

          ” నేను ఆకలి  చావనే నింద నిజమేనని ధృవీకరిస్తే ఒక రోజు వార్తా పత్రికలలో నేనొక హీరోగా కనిపిస్తానేమో, నిజమే కాని అది సమస్యను తీరుస్తుందా?”

          నేను జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ఒకరోజు అందుబాటులోనే ఉన్నాను, జనం వారి సాక్షం నాకు ఇవ్వడానికి. ఒక్క సాక్షి కూడా రాలేదు. దీనికి ప్రజలను కారణం అడగండి. కాని ఇదో చిన్న విషయం. అతి ముఖ్యమైన ప్రశ్న జలంధర్, జహంగీర్ లాంటి వాళ్ళు ఈ ఆకలి చావులకు అసలు కారకులు. ప్రతిసారీ ఎన్నికల్లో ఎలా గెలుస్తున్నారు? ప్రజలు వారికెందుకు ఓట్లు వేస్తున్నారు? ఇది ప్రజాస్వామ్యం.

          మీరు ఈ ప్రశ్న జనాలను అడగాలి.

*****

(సశేషం)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.