
ఆరాధన-9 (ధారావాహిక నవల)
-కోసూరి ఉమాభారతి
ఆత్మీయ కలయిక
ఏంజెల్, శైలజల ఆహ్వానం పై సోమవారం నాడు వారింటికి బయలుదేరాను.
నలభై నిముషాల డ్రైవ్ తరువాత భవంతిలా ఉన్న వారి నివాసంగేటులోనికి వెళ్ళి, పోర్టికోలో కారు పార్క్ చేసి, ఇంటివైపు నడిచాను. బయట సిట్-అవుట్ లో కూర్చును న్నారు శైలజ, ఏంజెల్.
నన్ను చూస్తూనే పరిగెత్తుకుని వచ్చి, నన్ను వాటేసుకుంది ఏంజెల్. నవ్వుతూ నన్ను లోనికి ఆహ్వానించింది శైలజ.
సుందరమైన లోగిలి అద్భుతంగా అలంకరించి ఉంది. ఫైర్-ప్లేస్ పై నిలువెత్తు పెయింటింగ్ ఉంది. ఆ చక్కని చిత్రంలో ఆసనం పై కూర్చుని ఉన్న స్త్రీ చేతుల్లో అందమైన పాప. ఆమె భుజం పై చేయి వేసి నిలబడి ఉన్న ఆమె భర్త.
నేను ఆ చిత్రం వంక చూస్తుండగా.. “ఉమా ఆంటీ, ఆ పెయింటింగ్ లో నన్ను గుర్తు పట్టారా? వారు నా మమ్మీ, డాడీ. నేను అప్పుడు చిన్న బేబీ” అంది ఏంజెల్.
“అవునా? నువ్వు చాలా ముద్దుగా ఉన్నావుగా! నేను గుర్తు పట్టాను.” అంటుండగా నా చేయందుకుని, పక్కనే ఉన్న విశాలమైన హాలులోనికి తీసుకువెళ్ళింది. అక్కడ కనులపండువుగా ఉంది. ఓ పక్క నాట్యభంగిమల్లో అందమైన నర్తకి నిలువెత్తు చిత్రాలు, మరో పక్క వేదికపై వీణ ఉన్నాయి.
“ఆంటీ, మా అమ్మ మీలా గొప్ప డాన్సర్. చూడండి ఈ ఫోటోలు. అమ్మ వీణ కూడా వాయిస్తుంది. ఈ వీణ అమ్మదే. నా చిన్నప్పుడే మమ్మల్ని వదిలి అమ్మ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది. నేను అచ్చంగా మా అమ్మలా వీణ వాయించాలి. డాన్స్ చేయాలి. అలాగే నాన్నలా డాక్టర్ అవ్వాలి.” అంది ఏంజెల్.
ఆ అమ్మాయి తల్లి లేని పిల్లన్నమాట. బాధనిపించింది. ఏమనాలో తోచక మిన్నకుండిపోయాను.
శైలజ కలగజేసుకుంది. “ఏరా ఏంజెల్, ఆంటీని లంచ్ కి కదా మనం ఆహ్వానిం చాము. వెళ్ళి మేరీకి చెప్పి ఏర్పాట్లు చేయించు.” అని మనమరాలితో అనడంతో ఆ అమ్మాయిలోనికి వెళ్ళింది.
“నీ మనమరాలు ముద్దుగా ఉంది. స్వచ్ఛమైన తెలుగులో ఆరిందాలా మాట్లాడు తుంది. తన తల్లి విషయం విని చాలా బాధనిపించింది. ఏంజెల్ తండ్రి ఏం చేస్తుం టారు? అసలు ముందు నీ విషయం చెప్పు. అమెరికాకి ఎప్పుడు వచ్చావు?” అడిగాను శైలజని.
అందుకు శైలజ చెప్పిన దాన్ని బట్టి .. డిగ్రీ చదువు ముగుస్తూనే తాను ప్రేమించిన కృష్ణ మేనన్ ని పెళ్లి చేసుకుందట. “వృత్తి పరంగా ఆయన కంటి వైద్యులు. నేత్ర దాన శిబిరాలు నిర్వహిస్తూ సమాజ సేవ దిశగా కూడా పనిచేశారు. మాకు ఒక్కడే బిడ్డ, వరుణ్. జీవితం ప్రశాంతంగా సాగిపోతున్న సమయంలో.. కాకినాడలో నేత్రదాన శిబిరాలు నిర్వహించి, వైజాగ్ తిరిగి వస్తూ.. రోడ్డు ప్రమాదంలో కృష్ణ అశువులు బాసినప్పుడు వరుణ్ పదహారేళ్ల వాడు.
… నా భర్త అకస్మిక మరణం నా తలరాతని మార్చేసింది. బాగా క్రుంగిపోయి.. డిప్రెషన్ లోకి వెళ్లిపోయాను. మా అక్క హిమబిందు సైకియాట్రిస్ట్ కూడా అవడంతో, నన్ను ఆదుకుని నేను కొలుకునేందుకు సాయం చేసింది. ఆ పైన వరుణ్ ని చదివించి వృద్దిలోకి తేవడమే ధ్యేయంగా జీవించాను. ఇప్పుడు తల్లి లేని ఏంజెల్ ప్రాపకంలో మునిగితేలుతున్నాను. నా కొడుకు వరుణ్ గురించే నా దిగులంతా.” అంటూ వాపోయింది శైలజ.
వరుణ్ గురించి మరిన్ని వివరాలు చెప్పసాగింది. బి.ఎస్.సి చదివి, తండ్రి అడుగుజాడల్లోనే నడవాలని మెడిసిన్ చేసి, వైద్య వృత్తిని చేబట్టాడట. చిన్నప్పటి నుండే అతనికి సంప్రదాయ కళల పట్ల ఆసక్తి ఉండేదట. కొన్నాళ్ళు కర్ణాటక సంగీతంలో తర్ఫీదు పొంది సాంస్కృతిక కార్యక్రమాల్లో పాడేవాడట కూడా. ఆ సమయంలోనే కాదంబరి అనే ఓ కూచిపూడి నర్తకిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడట.
నా వంక చూస్తూ, “కాదంబరి యోగ్యురాలు. వాడికి తగిన భార్య. పెళ్ళయిన మూడేళ్లకి ఏంజెల్ పుట్టింది. ఆ తరువాత అమెరికా వచ్చి స్థిరపడ్డారు. అంతా సవ్యంగా ఉందనుకున్న సమయంలో…
రెండేళ్ల క్రితం హఠాత్తుగా నా కోడలు బ్రైన్-హెమరేజ్ స్ట్రోక్ వచ్చి మరణించింది.” అంటూ భావోద్వేగానికి గురయింది శైలజ. వింటున్న నా కళ్ళు కూడా తడయ్యాయి.
“… అప్పుడే నేను కూడా అమెరికా వచ్చేశాను. వరుణ్ కి తోడుగా పాపని దగ్గరుండి పెంచుకుంటున్నాను. తన భార్య కాదంబరి ఆలోచనల నుండి వరుణ్ ఇంకా కోలుకో లేదు. వాడు ఎప్పుడు మామూలు మనిషి అవుతాడో అని దిగులుగా ఉంటుంది.” అని వాపోయింది ఆమె.
‘కాలేజీ రోజుల్లో మేమంతా అభిమానించే మా కాలేజ్ బ్యూటీ శైలజ, ఇలా వొడు దొడుకులు నడుమ జీవనం సాగిస్తుంది.’ అని బాధనిపించింది.
విన్న విషయాలని ఆకళింపు చేసుకుంటూ.. కాసేపు మౌనంగా ఉండిపోయాను. “ఐ యాం వెరీ సారీ.. శైలజా. లైఫ్ ఈజ్ నెవర్ ఈజీ. నీవు ధైర్యంగా కొడుకుని పెంచి పెద్దవాణ్ణి చేసి, ఇప్పుడు తల్లి లేని కొరత తెలియనీకుండా మనమరాలిని సాకుతున్నావు.” అన్నాను.
ఇంతలో “నాన్నమ్మా, లంచ్ రెడీ” అంటూ ఏంజెల్ రావడంతో, వెళ్ళి అందరమూ కబుర్లు చెప్పుకుంటూ.. లంచ్ తిన్నాము.
ఏంజెల్ డాన్స్ మొదలు పెట్టేందుకు ముహూర్తం కూడా ఖరారు చేసి, అక్కడి నుండి బయలుదేరి పోయాను.
***
మరో నాలుగు వారాల్లో లాస్-ఏంజలీస్ లో జరగనున్న ‘తానా ప్రపంచ తెలుగు మహాసభల్లో మా ప్రదర్శనకి.. ‘భరతముని భూలోక పర్యటన’ అన్న నృత్యనాటికను రచించి… ఎనిమిదిమంది శిష్యులకి తర్ఫీదు నిచ్చాను.
***
తానా’సభలు ప్రారంభ రోజునే సాయంత్రం ఎనిమిదింటికి.. చక్కగా జరిగింది మా అకాడెమీ ప్రదర్శన. వేలాది ప్రేక్షకులతో పాటు ప్రముఖులు… అక్కినేని నాగేశ్వరావు గారు, గుమ్మడి గారు, మురళీ మోహన్ గారు, ఇంకా ఎందరెందరో కళాకారులు, కళా ప్రియులు ఆసక్తిగా మా ప్రదర్శనను వీక్షించారు. మేమందుకున్న ప్రశంశల వెల్లువ అంతా ఇంతా కాదు.
అక్కినేని గారు తన ప్రసంగంలో సమయం తీసుకుని .. ‘నేనెరిగిన ఉమాభారతి’ అంటూ నా నృత్యాన్ని కొనియాడిన తీరు… నాకు వారందించిన ఆశీస్సులుగా భావించాను. గుమ్మడి గారు, మురళీమోహన్ గారు కూడా నా కాన్సెప్ట్ ని, కొరియాగ్రఫీ ని కొనియాడారు.
ఎంతో గర్వంగా అనిపించింది. మరునాడు ఆ సభా ప్రాంగణంలో ఎక్కడికి వెళ్ళినా, మమ్మల్ని అభిమానంతో ఆత్మీయంగా ప్రశంసించిన వారే. మా అమ్మాయి ఎనిమిదేళ్ల శిల్ప నృత్యం మా ప్రదర్శనకి హైలైట్’ అని అసంఖ్యాక ప్రేక్షకులు చెప్పగా కూడా వినీ వినీ.. మనసు ఉప్పొంగి పోయింది.
రెండవ రోజు సభ ముగింపుకి ముందు.. ‘ఆమెరికా నుండి – అర్చన ఫైన్-ఆర్ట్స్ వారి ‘భరతముని భూలోక పర్యటన’ మరియు భారత్ నుండి జూనియర్ ఎన్. టి. ఆర్ ‘కూచిపూడి నృత్య ప్రదర్శన’ లని ‘అత్యుత్తమ ప్రదర్శనలు’గా నిర్ణయించి ‘శ్రీమతి గుత్తికొండ అరుణ స్మారక అవార్డులు’ ఇవ్వనున్నాము.’ అని ప్రకటించారు సభాధిపతి. చుట్టూ ఉన్న వారంతా అభినందనలు తెలిపారు.
విజయోత్సాహంతో మేమంతా తిరుగు ప్రయాణమయ్యాము. అకాడమీకి, నా రచనకి గుర్తింపు రావడం కళామతల్లి దీవెనగా భావించాను.
***
హూస్టన్ వచ్చేశాక.. తిరిగి నేను టెలీ-ఫిల్మ్ ప్రాజెక్టు పై దృష్టి సారించాను.
ప్రవాస భారతీయుల జీవన విధానంలో భారతీయ కళలు – సంస్కృతి – సాంప్రదాయాలకున్న ప్రాముఖ్యత’ ప్రధాన అంశంగా మేము నిర్మించబోయే టెలి-ఫిలింప్రాజెక్టుకి ‘ఆలయనాదాలు’టైటిల్ ని ఖరారు చేశాము.
ప్రాజెక్ట్ తలపెట్టగానే, నా స్టూడెంట్స్, వారి తల్లితండ్రులు కూడా మద్దతునం దించారు. వారిలో కొందరుటెలి- ఫిలింలో ప్రవాసాంధ్ర యువతగా నటించారు.
అడిగీ అడగ్గానే,హూస్టన్ లోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (NASA JOHNSON SPACE CENTER)అంతర్జాతీయ విమానాశ్రయం, గాలరియా ఐస్-స్కేటింగ్రింక్ మేనేజ్మెంట్ వారు.. ఫిల్మ్ షూటింగ్ కి మాకు అనుమతినిచ్చి ఎంతగానో సహకరించారు. సగభాగం ఫిల్మ్ హ్యూస్టన్ లోనే తీసాము. మొట్టమొదటిసారి దర్శకత్వ బాధ్యతలు చేపట్టినప్పుడు.. ఓ గొప్ప అనుభవం, అనుభూతి ఫీలయ్యాను.
భాగం చిత్రాన్ని పూర్తి చేసేందుకు నా శిష్య బృందంతో కలిసి భారత్ కి వెళ్ళాము. రెండునెలలపాటు చిత్రాన్ని హైదరాబాద్, శ్రీశైలంలో చిత్రీకరణ ముగించి ప్రాజెక్టు పూర్తి చేశాము.
మొత్తానికి… నా ఆలోచన, ఆశయం సార్ధకమయి, ‘ఆలయనాదాలు టెలీ-ఫిల్మ్ పూర్తయింది.
నిర్మాత: అర్చనా ఫైన్-ఆర్ట్స్ అకాడెమీ
దర్శకత్వం: నాగేంద్ర ప్రసాద్, ఆదోని రాము, ఉమాభారతి
మూల కథనం: వోలేటి పార్వతీశం, లాలిత్య
పాటలు: డా. సి. నారాయణరెడ్డి, సంప్రదాయ సాహిత్యం
సంగీతం : గోపి, రాధ
నటీనటులు: ఉమాభారతి, ముక్కు రాజు, బి. అశోకరావు, మేజర్ సత్యనారాయణ, AVN ప్రసాద్, పొట్టి వీరయ్య, ఆయేషా జలీల్, శిల్ప కోసూరి (USA), కొండవేటి సంగీత, సాగరిక రావు (USA), నిషా భల్లా (USA), మాధురి విశ్వనాధం (USA), మురళీ అహోబిల, గిరిజ వంగూరి, విమలా అహోబిల మరియు అకాడెమీ శిష్యురాళ్ళు.
‘ఆలయనాదాలు’ టెలీఫిల్మ్ ని జెమిని వారు పద్నాలుగు దేశాల్లో పదహారు వారాలపాటు సీరియల్ గా ప్రసారం చేయగా… అకాడెమీ తరఫున అమెరికాలో వీడియో కేసెట్స్ పంపిణీకి ఏర్పాట్లు చేశాను.
***
షూటింగ్ ముగించుకుని భారత్ నుండి తిరిగి అమెరికా చేరుకున్నాక, క్లాసులతో పాటు టెలీఫిల్మ్ గురించిన పత్రిక ప్రకటనలు, ప్రమోషన్ లో నిమాగ్నమయ్యాను.
‘ఆలయనాదాలు’ కి మంచి స్పందనతో పాటు వీడియో పంపిణీ కూడా సంతృప్తి కరంగా జరిగింది. చిన్నప్పటి కథానాయకిగా మా అమ్మాయి శిల్ప నటనకి, నృత్యానికి గొప్ప ఆదరణ లభించింది. అప్పటికే అమెరికాలో పలు కార్యక్రమాల్లో నృత్యం చేసిన శిల్పకి ‘చైల్డ్ ప్రాడిజీ’ అని, ‘ట్వింకల్ టోస్’ అని పేరు రావడం.. తల్లిగా నాకు, మా కుటుంబానికి కూడా ఆనందదాయకం అయింది.
టెలీఫిల్మ్ ప్రోజెక్ట్ తో అమెరికాలోని భారతీయ కళారంగంలో… కళాకారిణిగా నాకు, మేటి కూచిపూడి నృత్యకళా సంస్థగా ఆకాడమీకి కూడా గొప్ప గుర్తింపు వచ్చేయనే చెప్పాలి.
కొనసాగింపుగా, నృత్యశిక్షణ శిబిరాల నిర్వహణలో మార్పులు చేసి.. యేడాదిలో ప్రతి సెలవులకాలంలో నిర్వహించడం, థియరీ, మేక్-అప్ లోనూ శిక్షణనివ్వడం మొదలుపెట్టాను.
శిక్షణ నిర్వహణలో మాధవన్, రాగిణీలతో పాటు సీనియర్ స్టూడెంట్స్ కూడా సహాయకారులుగా పనిచేసేవారు. దేశ నలుమూలల నుండి ఔత్సాహికులు, శిష్యురాళ్ల సంఖ్య గణనీయంగా పెరిగింది.
ప్రతియేడు హైదరాబాదుకి వెళ్ళి రావడం, అక్కడ మ్యూజిక్ రికార్డింగులు చేయించడం, పలు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడం కూడా పరిపాటయింది.
వ్యయప్రయాసాలకి, త్యాగాలకి వెనుకాడక, నా ఆశక్తికి అనుగుణంగా నన్ను ఓ కళా కారిణిగా తీర్చిదిద్దినందుకునా తల్లితండ్రుల సంతోషించేలా నిరంతరం కృషి చేస్తూ, ఆ కృషిలోనే ఆనందాన్ని చవిచూస్తూ.. మరో పుష్కరకాలం గడిచిపోయింది.
*****
(సశేషం)

నా పేరు ఉమాభారతి… నేను ఓ కళాకారిణి. కూచిపూడి నాట్యకారిణి.. నృత్య గురువు… రచయిత్రి. చలన చిత్రాల్లో నటించాను : సుడిగుండాల్లో బాలనటిగా, చిల్లరదేవుళ్ళులో కధానాయికగా, యమగోలలో ఊర్వశిగా. జెమినీ TV పై “ఆలయ నాదాలు” అనే సీరియల్ కి, సింగపూర్, జోహనాస్బర్గ్ TV లకి నృత్య సంబంధిత చిత్రాలకి, కూచిపూడి నృత్య డాక్యుమెంటరీలు మరియు నృత్యాభ్యాసన వీడియో చిత్రాలకి నిర్మాణ, దర్శకత్వ బాధ్యతలని నిర్వహించాను. USA లోని హ్యూస్టన్ మహా నగరంలో ‘అర్చన ఫైన్_ఆర్ట్స్ అకాడెమీ’ స్థాపించి మూడు దశాబ్దాలు దాటింది. రచయిత్రిగా మూడు నవలలు, రెండు కధా సంపుటాలు, ఒక వ్యాసా సంపుటి వెలువడ్డాయి. మా తల్లితండ్రుల పేరిట “శ్రీ శారదా సత్యనారాయణ మెమోరియల్ ఛారిటబిల్ సొసైటీ’ (సాహిత్య-సాంస్కృతిక-సామాజిక సేవా సంస్థ) స్థాపించి మూడు సంవత్సరాలుగా .. ‘కధా-కార్టూన్-కవిత’ల పోటీలు కాక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. మూగాజీవాల సంక్షేమార్ధం నిత్యం కృషి చేస్తుంటాను. యోగాభ్యాసన నా అభిరుచి. నృత్యమే జీవితంగా, సాహిత్యం ఊపిరిగా, మూగజీవుల సంరక్షణ నా జీవితాశయంగా మనుగడ సాగిస్తున్నాను. నేను B.A Economics M.A Political Science చేసాను. USA కి 1980 లో వచ్చాను… నాకు ఓ కొడుకు, ఓ కూతురు. నా భర్త తో సహా వారు కూడా Health care workers..