‘ఎవరో మేధావి అననే అన్నాడు. కథలూ, నవలలకన్నా వాస్తవ జీవితమే ఎంతో ఉత్కంఠ భరితంగా ఉంటుంది.’ అని. యథా రీతిన జరిగిపోతున్న జీవితంలో అనుకోకుండా జరిగే కొన్ని ఘటనల వల్ల ఎంతటి మార్పులు వస్తాయో ఊహించుకుంటే చిత్రంగా ఉంటుంది. తన జీవితంలో ఇటువంటి సంఘటనలు ఎన్నెన్నో! ఈ విధంగా ఆలోచించుకుంటూ విశ్లేషించుకుంటే, ప్రతి జీవితమూ, ఒక చరిత్రే కదా!’ తన ఆలోచనలు తనకే నవ్వు తెప్పించాయేమో, పుట్టపర్తి పెదవులు విచ్చుకున్నాయి.
‘తానూ వాస్తవ జీవితంలోకి అప్పుడప్పుడైనా వెళ్ళి వస్తుండవలె.’ అనుకుంటూ, నాగ చెయ్యి పట్టుకుని బయలుదేరారు పుట్టపర్తి సీతారామయ్య స్కూల్ కు!
ఎన్నడూ లేనిది, యీ విధంగా భుజాన తువ్వాలుతోనే కూతురు చెయ్యి పట్టుకుని బైటికి వెళ్తున్న భర్తను చూసి ఆశ్చర్యపోవటం కనకవల్లి వంతైంది.
***
టీకాల పర్వం ఇంకా కొనసాగుతూనే ఉన్నట్టుంది సీతారామయ్య బడిలో! నామ మాత్రపు ఫీజుతో నడిచే వీధి బడి ఇది. తమకు తెలిసినప్పటి నుంచీ సీతారామయ్యే యీ పాఠశాల హెడ్ మాస్టర్.
చాలా గంభీరమైన మూర్తి. ఆయనను చూడగానే తెలిసి పోతుంది చాలా కరుకు మనిషి అని. తక్కిన ఉపాధ్యాయులందరూ కాస్త అటూ ఇటూగా ఉన్నా ఆయన మాత్రం, ఎప్పుడూ చిరునవ్వు కూడా చిందించని మహానుభావుడు. బోధనలోనూ అదే కాఠిన్యం! విద్యార్థులందరికీ ఆయనను చూస్తే చచ్చేంత భయం. ఇవన్నీ అర్ధాంగి వల్ల అప్పుడ ప్పుడూ తెలిసిన సంగతులు.
టీకాలు వెనుక ఉన్న వసారా వరండాలో వేస్తున్నారేమో, అటు నుంచే పిల్లల అరుపులు, పెద్దల గదమాయింపులు, వినిప్స్తున్నాయి. అటుకేసి నడిచారు పుట్టపర్తి.
అయ్య తనను చేయి పట్టుకుని అటువైపు తీసుకుని వెళ్తుంటే, నాగ చెయ్యి వణకటం మొదలైంది. టీకాలు వేసేవాళ్ళ ముందు వరుస క్రమం ప్రకారం పిల్లలను పంపుతున్నారు వాళ్ళు టీచర్లు అన్నది నాగ అయ్య ప్రశ్నకు జవాబుగా! చాలా మంది పిల్లలు ఏడుపు ముఖాలతోనే టీచర్ల మాటకు అడ్డు చెప్పకుండా వరుస క్రమంలో సాగుతున్నారు.
టీకాలు వేసేవాళ్ళకిది బాగా పరిచయమైన కథే కాబట్టి తాము తెచ్చిన సరంజమాతో పిల్లల భుజాలమీద తాము తెచ్చిన పరికరాలతో యాంత్రికంగా వేసేస్తున్నారు. పళ్ళు బిగబట్టి పిల్లలు ముందుకు సాగుతున్నారు.
ఆ టీకలు వేసేవాళ్ళల్లో ఒకళ్ళు భుజం గట్టిగా కదలకుండా పట్టుకోగానే, ఏడుపు మొదలు. టీచర్లు కూడ ఆ టీకాలు వేసేవాళ్ళలాగే పిల్లల ఏడుపును యాంత్రికంగా నియంత్రించే ప్రయత్నం చేస్తున్నారు. వేడి వేడి పరికరం లేత చర్మాలకు తగలగానే పాపం పిల్లల బాధ చూసి, పుట్టపర్తికి కూడా గుండె కలుక్కుమంది. అయ్య చెయ్యి సడలగనే నాగ కూడా ఏడుపు మొదలెట్టింది. పుట్టపర్తి నాగ చెయ్యి మళ్ళీ పట్టుకుని అక్కడి వాళ్ళలో తనకు తెలిసిన ముఖాలేమైనా ఉన్నాయా అని పరికించి చూస్తున్నారు. ఇంతలో, పొడుగ్గా కాస్త బలిష్టంగా తెల్లటి పాంటూ, షర్టూ వేసుకున్నతను పుట్టపర్తి దగ్గరికి వచ్చేశాడు, చిరునవ్వు ముఖంతో చేతులు మోడ్చి!
‘నమస్కారం స్వామీ! మీరేమిటి స్వామీ, ఇక్కడ?’ అన్నాడు.
అతనెంతో పరిచయం ఉన్నవాడి వలె మాట్లాడేసినా పుట్టపర్తికి వెంటనే తట్టలేదు అతగాడెవరో! ఐనా సర్దుకుని,’ఏముందప్పా! మా నాగ ఒకటే భయపడుతూ ఉంది టీకాలంటే! ఇంటికి పరిగెత్తుకోని వచ్చేసింది.
ఆ తతంగమేందో చూస్తామని..అవునూ నీ పేరేమప్పా?’
‘భాస్కరరావు స్వామీ, జీ. నారాయణ రావు రామకృష్ణా హై స్కూల్ హెడ్ క్లర్క్ కదా, ఆయన తమ్ముణ్ణి. ఏమ్మా నాగా, భయమెందుకు? నేను చూసుకుంటాను స్వామీ, మీరెందుకిక్కడ మీ పనులు వదులుకొని? మీ శివతాండవం చాలా సార్లు విన్నాను స్వామీ! ఎంతో బాగుంటుంది. విన్నప్పుడల్లా మనసంతా ఊగిపోతుంది, భక్తితో!’
‘ చాలా సంతోషం భాస్కరరావ్! అదంతా ఆ శివాశివుల కృప! అది సరే కానీ, మా నాగే కాదులే, అసలిక్కడ యీ టీకాలు ఎట్లా వేస్తున్నారో చూడాలని వస్తినప్పా! తీరా చూస్తే, పాపం పిల్లలందరూ భయపడుతూనే ఉన్నారు కదా! ఏమి టీకాలో ఏమో!’ పుట్టపర్తి మాటల్లో బాధ.
‘అట్లా అనుకోకూడదు స్వామీ! పిల్లల ఆరోగ్యం కోసమే కదా ఇదంతా! ఈ చిన్న నొప్పికే భయపడితే ముందు ముందు పెద్ద బాధ బారిన పడితే జీవితాంతమూ బాధ పడవలె కదా! రెండ్రోజులు ఏడుస్తారు టీకా వేసిన చోట నొప్పితో!, జ్వరమూ రావచ్చు! ఆ రెండ్రోజులూ చూసుకుంటే యీ అమ్మవారూ, పోలియో అవన్నీ రావట! ప్రభుత్వం పాఠశా లల్లో తప్పకుండా పిల్లలకు వేయించాలని రూల్ పెట్టింది.మేమంతా అదే చూసు కుంటున్నాం. ఏమ్మా, నాగా, నేనుంటే చాలు కదా!!
నాగ అయ్య చెయ్యి గట్టిగా పట్టుకుంది. అయ్యొక్కడే యీ బాధనుంచీ రక్షించే వారని, తనకు యీ టీకాలు వేసుకోనవసరం లేదని చెబుతారని చిన్నారి నమ్మకం.
పుట్టపర్తి ఆలోచనలో పడ్డారని తన ఆ మనసుకు తెలియలేదు. పుట్టపర్తి ఆలోచిస్తు న్నారు.’నిజమే, చిన్నప్పుడు తమ వీధిలో, ఒకతన్ని చూస్తే భయపడి పోయే వాళ్ళు తామంతా! ఒక్క కళ్ళు తప్ప ముఖమంతా అమ్మవారు మచ్చలే! చూడటనికా విధంగా ఉన్నా, మనిషి పాపం సౌమ్యుడే, కానీ ఆ మనిషిని అంత దూరంలో చూస్తే చాలు, పిల్లలంతా పరుగో పరుగు! చిన్నప్పుడు తనకూ తట్టు మూడు నాలుగు సార్లు పోసింది. దానివల్ల యీ అమ్మవారు వలె, శరీరం మీద ముఖ్యంగా ముఖం మీద మచ్చలు రాకున్నా, శరీరం బాగా బలహీనమైపోయి, నీరసపడిపోవడం గుర్తుంది. పడుకున్న చోటులో, చుట్టూ వేపాకు లేతాకులు పరిచేవాళ్ళు. వేప ఆకులు పసుపు వేసి నూరిన చిన్న చిన్న గుండ్లు మింగడం, మజ్జిగాన్నం తినడం, మజ్జిగ తాగడం – ఇవే చేసినట్టు గుర్తు! అదృష్టం కొద్దీ అమ్మవారు పోయలేదు తనకు!
శిరోమణి చదువుతున్నప్పుడు తిరుపతిలో కూడా అటువంటి వాళ్ళను చాలా మందినే చూసినా, అప్పటికి తనకు వయసు పెరగటంతో, భయం పోయినా వాళ్ళను చూస్తే బాధనిపించేది. ఇప్పుడు యీ టీకాలవల్ల ఆ వ్యాధులు పిల్లలకు రాకుండా వుండేందుకు పాఠశాలలకే సంబంధిత ఉద్యోగులను పంపే ఏర్పాటు చేయడం బాగుంది.’
నాగ మెల్లిగా చెయ్యి విడిపించుకుని, అయ్యకు కాస్త దూరంగా జరిగింది. ఈ లోగా భాస్కర రావు సారు ఆ చిన్నారి చెయ్యి పట్టుకున్నాడు, ‘ఇక నా మీద యీ భారం వదిలేయండి స్వామీ!’ అంటున్నట్టు!
నాగ ముఖంలో మళ్ళీ భయం! ‘ఈ సారు, తానామధ్య చూసిన సినిమా..అదేదో గుర్తు రావడం లేదే! ….ఏం సినిమాబ్బా!! ఆ..గుర్తొచ్చింది..వాడుక మరచెదవేలా…అంటూ పాట పాడుతూ ఉండే హీరో. ఆయన పేరేదో ఉంది. ఆయన మాదిరే ఉంటాడు. నేనూ రామ సుబ్బలక్ష్మీ అనుకుంటూ ఉంటాం. అరె..అచ్చం అట్లే ఉన్నాడే యీ సారు? ఈయనే ఆ సినిమాలో ఉన్నాడా అని అనుమానం కూడా!! కానీ యీయనే నాకు దగ్గరుండి టీకాలు వేయిస్తాడా, పాపం చిన్న పిల్ల, నొప్పితో ఏడుస్తుంది కదా, పోనీలే అనుకోకూడదా? ‘ రామసుబ్బలక్ష్మి ఇంటికి పరిగెత్తి పోయినా వాళ్ళమ్మే వచ్చి టీకాలు వేయించింది. ఇప్పుడు అయ్యే వచ్చినా తనకీ టీకాలు తప్పేట్టు లేదు.’ కళ్ళనిండా ధారాపాతంగా నీళ్ళు!
భాస్కర రావు సారు, టీకాల వేసే వాళ్ళదగ్గరికి తీసుకుని పోతుంటే, అయ్య ఆపేసరికి మళ్ళీ ఏదో ఆశ. కానీ ఆయన అన్నారు, ‘నొప్పి ఎక్కువ కాకుండ వెయ్యమని చెప్పవయ్యా వాళ్ళకు, లేత చర్మం కదా!’
అయ్య మాటలతో ఆఖరి ఆశ కూడ ఎగిరిపోయింది నాగకు.
భయమేమీ లేదని చెబుతున్నట్టు, చెయ్యి ఊపి, భాస్కర రావు సారు, టీకాలు వేస్తున్న చోటికి తీసుకుని పోయి వరుసలో ముందు నిల్చోబెట్టినప్పుడూ వెనక్కు తిరిగి అయ్యను చూస్తే, ఆయన కూడ టీకాలు వేస్తున్న వైపే చూస్తున్నట్టుగా ఉంది.
వేడి వేడి గుండ్రటి పరికరం చర్మం మీద నొక్కగానే కెవ్వున ఏడుస్తూన్న పిల్లలు, వెంటనే వాళ్ళకు చాక్లెట్ ఇచ్చి ఓదారుస్తూ పంపుతున్న పెద్దలు! ఇదీ అక్కడి దృశ్యం! నాలుగైదు రోజులు యీ టీకాల మీద నీళ్ళు పడకుండా చూసుకోవలె! పథ్యం తిండి. పప్పు తినకూడదు. చారన్నం, మజ్జిగాన్నం కాస్త! ఇడ్లీ చక్కెర వేసుకుని తినొచ్చు. ఇటువంటి సూచనలిస్తున్నారు, పిల్లల వెంట వచ్చిన పెద్దలకు!
టీకా భుజమ్మీద పడగానే, గట్టిగా ఏడ్చేసింది నాగ,’అమ్మా..!’ అని కేక పెడుతూ!
పక్కనున్న టీచర్ నాగ చేతిలో రెండు చాక్లెటు పెట్టి సముదాయిస్తున్నట్టు దగ్గరికి తీసుకుంది. (అప్పట్లో ఆడవారైనా మగవారైనా అందరినీ టీచర్లు అనే అనేవారు.)
ఒక చాక్లెట్ కవర్ తీసి నోట్లో పెట్టుకుని, మరో చాక్లెట్ చేతిలో గట్టిగా పట్టుకుని, అయ్య దగ్గరికి వచ్చింది.
ఆమెను దగ్గరికి తీసుకుంటున్న పుట్టపర్తి కళ్ళలోనూ నీళ్ళు!!
తాను టీకా వేసుకుంటే అయ్య కళ్ళల్లో నీళ్ళెందుకొచ్చాయో అర్థం కాలేదు నాగకు! భుజమంతా ఒకటే నొప్పిగా ఉంది. తన చిన్నారి కూతురు చెయ్యి మెత్తగా పట్టుకుని, నొప్పి తలియకుండా తన స్కూల్ విశేషాలు అడగటం మొదలెట్టారు పుట్టపర్తి.
‘అవునూ..మీ స్కూల్ పక్కన ఒక బిల్దింగ్ ఉంది కదా, అది ఏమిటి?’
కళ్ళనీళ్ళు తుడుచుకుంటూ నాగ చెబుతున్నది. ‘దివ్య జ్ఞాన సమాజం అని రాసుంటుంది. దాని మీద బోర్డ్ లో! అక్కడ కింద భాగంలో లైబ్రరీ ఉందయ్యా! అక్కడికి నేనూ పోతుంటా! పుస్తకాలు చదువుకుంటా!
మంచి కథల పుస్తకాలుంటాయి. టాల్ స్టాయ్ కథలు నాకు భలే ఇష్టం. ఇంకా క్యారం బోర్డ్ కూడా ఆడుకోవచ్చు.’
‘మరి అక్కడ మిద్దె మీద హిందీ ప్రేమీ మండలి అని రాసుందే?’
‘ఔను. అక్కడ హిందీ క్లాస్ లు సాయంత్రం పూట చెప్పుతూ ఉంటారు. తులజక్కయ్య అక్కడే కదా హిందీ క్లాస్ లకు వస్తుంటుంది.’
‘ఔనౌను. మర్చిపోయినాను. నువ్వూ హిందీ క్లాస్ లో చేరుతావా మరి? హిందీ చిన్నప్పుడే చదువుకోవడం మంచిది. పెద్దైతే దానివల్ల లాభాలు తెలుస్తాయి నీకే! చేరుతావా?
నాగ నొప్పి సంగతి మర్చిపోయింది. ఈ లోగా రెండో చాక్లెట్ కూడా తియ్యగా ఆమె నోట్లో హొయలుపోతున్నది మరి.
*****
(సశేషం)