కాదేదీ కథకనర్హం-13

 ఈడపిల్లే!

-డి.కామేశ్వరి 

          కష్టాల్ని భరిస్తూనే కట్టుకున్నవాని కనుసన్నలలోనే కడతేరాలని సోకాల్డ్ పాతివ్రత్య భావన నుంచి క్రొత్త జీవితానికి ద్వారాలు తెరిచిన కధ.

          గాడాంధకారం …..ఆ చీకట్లో పాపని ఎత్తుకుని వగరుస్తూ పరిగెడ్తోంది రేణుక. “అమ్మా! ….అమ్మా!’ అంటూ చేతులు చాచి పిలుస్తుంది…..’అయ్యో, రేణూ , ఏం జరిగిం దమ్మా … ఎందుకలా అరుస్తున్నావు….” కన్నపేగు…..పేగు తెంచుకుని వస్తున్నకేక!

          సావిత్రికి ఒళ్ళంతా చెమట పట్టింది భయంతో. చటుక్కున మెలుకవ వచ్చింది. చుట్టూ చీకటి. ఒక్క క్షణం ఏం అర్ధం కాలేదు. అది కల అని అర్ధం చేసుకునే లోపలే “అమ్మా…..అమ్మా!” రేణు పిలుస్తుంది. తలుపు చప్పుడవుతుంది….. చుట్టూ ఇంత చీకటేమిటి ! కరెంటు పోయిందా! అమ్మా….. కలకాదు నిజంగానే తలుపు కొడ్తూ పిలుస్తుం ది. చటుక్కున లేచి “ఎవరూ’ అంది సావిత్రి తలుపు దగ్గర కెళ్ళి.

          “నేనమ్మా , తలుపు తీయి.” ఆ గొంతు రేణుదే. సావిత్రి చటుక్కున తలుపు తీసింది.

          “రేణూ , ఏమిటి తల్లీ ఇంత రాత్రి ఇలా వచ్చేవేమిటి. ఏమయిందమ్మా? ఆవిడ భయంతో వణికిపోతూ అంది.

          “ఎంత సేపటి నించి పిలుస్తున్నానమ్మా…..ఈ చీకటేమిటి , లైట్లు లేవా, కాలింగ్ బెల్ నొక్కా , ఎవరూ పలకలేదు.” పిల్ల నెత్తుకుని ఇంట్లో అడుగు పెట్టింది.

          ఇంట్లో మాటలకి, హడావుడికి మెలకువ వచ్చి చేతిలో బ్యాటరీ లైటుతో వచ్చాడు ప్రసాదరావు గాబరాగా. “ఏమిటి ఏం అయింది?” రేణుకని చూసి తెల్లపోతూ ——“రేణూ నీవా,ఇప్పుడు ఈ వేళప్పుడు….”

          “రైలు మూడు గంటలాస్యం అయింది నాన్నా, తొమ్మిదికి రావాల్సింది.”

          అయన అప్రయత్నంగా బ్యాటరీ లైటుతో గోడమీద గడియారం చూశారు పన్నెండు.

          ‘అదిసరే ఇంత హటాత్తుగా , ఒంటరిగా…..” అయన ప్రశ్నలు పూర్తికాక మునుపే లైట్లు వెలిగాయి. వాడిపోయిన మొహంతో, వాచిన కళ్ళతో, కుడి కంటి కింద కమిలిన నల్లమచ్చతో …..కూతురి అవాతారం చూడగానే కడుపులో దేవింది. కన్నవాళ్ళకి . రేణుక చెప్పక ముందే సంగతి అర్ధమైంది మళ్ళీ ఏదో గొడవయింది. ఉన్నపాటున అర్ధరాత్రి ఒంటరిగా ఇలా వచ్చిందంటే పెద్ద గొడవే అయి ఉంటుంది. సావిత్రి ఆందోళనగా ఏదో అడగబోతుంటే అయన కళ్ళతోనే వారించి, “పిల్లని తీసికెళ్ళి పడుకోబెట్టు…..ఏదన్నా తినడానికి ఉంటె పెట్టు దానికి . అర్ధరాత్రి అయింది…..వెళ్ళమ్మా రేణూ…..రేపు మాట్లాడుదాం.” అన్నారు ప్రసాదరావు.

***

          ఎప్పుడూ చలాకీగా, రాజాగా అప్పుడే విరిసినా పువ్వులా కలకలా కూతురు కళా కాంతులు పెళ్ళితోనే పోయాయి అన్నది ఎనిమిది నెలలకే అర్ధమయింది వాళ్ళకు. ఎత్తి ఎత్తి ఎంగిలాకు మీద అడుగేసినట్టు వెతికి వెతికి మంచి సంబంధం ——-ఇంజనీర్లు, ఉన్నవాళ్ళు అని మురిసిపోయిన వాళ్ళ మురిపం పట్టుమని ఏడాది నిలవలేదు. పెళ్ళయ్యాక ఎనిమిది నెలలకి పుట్టింటికి వచ్చిననాడే అర్ధమయింది. మొహంలో కాంతి పోయి, నిస్తేజమైన కళ్ళతో, నవ్వే కరవయిన కూతురి అవతారం చూసి, బెంబేలు ఎత్తి పోయారు తల్లితండ్రులు. నెల తప్పింది. వేవిళ్ళు కాబోలనుకున్నారు. అడిగితే “ఏం లేదు. ఏం ఉంది” అని నిర్లిప్తంగా అంటున్న కూతురిని అనుమానంగా చూశారు . వేవిళ్ళయితే శరీరానికి అనారోగ్యమే కానీ, నెల తప్పిన అనందం. మొహంలో కళ కరువై నిస్తేజంగా ఉన్న కూతురు ఏదో భాదపడుతోంది అన్నది అర్ధమైంది.

          “ఏం తల్లీ అలా ఉన్నావు? రమేష్ కూడా వచ్చి ఉంటే బాగుండేది . పెళ్ళయ్యాక మొదటి పండగ కన్నా రాలేదు పిల్చినా. ఇప్పుడన్నా నీతో వచ్చి నాల్గురోజులుండి వెడితే బాగుండేది’ అంది సావిత్రి కూతురేమన్నా బయట పెడ్తుందేమో నని.

          “ఏమిటో అయన, అయన పని తప్ప సరదాలు లేవమ్మా ఆయనకి.”

          ‘అదేమిటే పెళ్ళయి పట్టుమని ఆరునెలలకే సరదాలు లేకపోవడం ఏమిటే?”

          హటాత్తుగా రేణుక మొహం ఎర్రబడి కళ్ళలో నీళ్ళు చిప్పిల్లాయి. తల్లికి కనపడ కూడదని మొహం తిప్పుకోబోయింది. సావిత్రి చూడనే చూసింది. “ఏమిటి, రేణూ ఏమయింది , చెప్పమ్మా అతనేమన్నా అన్నాడా/ ఇద్దరూ మాట మాట అనుకున్నారా – వచ్చిందగ్గర నించి చూస్తున్నాను.’ ఆరాటంగా, ఆందోళనగా అడిగింది.

          ‘అమ్మా” బావురుమంది రేణుక. ఇంక కడుపులో దాచుకోలేని దుఃఖం వెల్లువలా బయటికి వచ్చింది. “అమ్మా ఇంక నేనక్కడికి వెళ్ళనమ్మా, ఆ కాపురం ఇంక నేను చెయ్యలేనమ్మా! నేనింక అక్కడికి వెళ్ళనే వెళ్ళను. ఐ హేట్ హిమ్ —హీ ఈజ్ ఏ శాడిస్ట్ . ఓ సరదా, సరసం తెలియని మృగం” ఏడుపు ఆవేశంగా మారింది.

          “రేణూ!” సావిత్రి మొహం వివర్ణమయింది.

          “అవునమ్మా చదువు చూశారు. ఉద్యోగం చూశారు, హోదా చూశారు వంశం అన్నారు. అన్నీ చూశారు . వీటన్నింటినీ మించిన సహృదయత , సున్నితత్వం , లాలిత్వం అన్నవి కూడా మనిషిలో ఉండాలన్నది మనం ఎవరం చూడలేదమ్మా . రూపం చూసి మోసపోవడం అంటే ఏమిటో నాకర్ధమయింది’ ఆవేశంగా అంది రేణుక.

          కూతురి వంక నిర్ఘాంతపోతూ చూడడం మినహా ఏం అనలేకపోయింది సావిత్రి.

          ‘అమ్మా సరసత, సౌమ్యత లేని మనిషితో కాపురం అంటే ఏమిటో అనుభవించిన వాళ్ళకే అర్ధం అవుతుందమ్మా లోకానికి నేను అదృష్టవంతురాలిలా కనిపించవచ్చు. కానీ, నాకేం లోటన్నది ఎవరికీ అర్ధం కాదమ్మా.’ ఆమె గొంతు రుద్దమయింది.

          “రేణూ నీవు అన్నింటినీ మరీ ఏదో ఊహించుకుని బాధపడుతున్నావేమో . సంసారం అన్నాక, ఒక ఇంట్లో ఇద్దరు కొత్తవాళ్ళు కల్సి బతకాల్సి వచ్చినప్పుడు అభిప్రాయబేధాలు వస్తాయమ్మా సామరస్యంగా సర్దుకోవాలి. అందరు భార్యాభర్తలు మాటామాట అనుకుంటూనే ఉంటారు. మీ నాన్నా నేను దెబ్బలాడుకోమా – ‘ సావిత్రి కూతురికి సర్ది చెప్పాలనుకుంది.

          ‘అమ్మా నాకివన్నీ తెలియవంటావా. నేనేం చదువుకోని మొద్దునా. నాన్న, నీవు దెబ్బలాడుకుంటారు. కానీ, మీ మధ్య ప్రేమానురాగాలనే పునాది ఉందమ్మా. ఆ పునాది ఉన్నప్పుడు అప్పుడప్పుడు వీచే గాలులకి, తుఫానులకి ఆ ఇల్లు పడిపోదమ్మా – పునాదులు కదిలిపోవు. మీరు ముప్పై ఏళ్ళుగా సంసారం చేస్తున్నారు. ఏదో రోజు మాట మాట అనుకున్నా వెంటనే “సావిత్రీ’ అంటూ నాన్న నీ వెనక పడతారు వెంటనే ….. అలాంటి అండర్ స్టాండింగ్ మా మధ్య లేదమ్మా.”

          “అతను సరదాగా ఉండడా, కోపిష్టా, అర్ధం చేసికోడా, ఏమిటసలు ప్రాబ్లం అతనితో, అసలు సంగతి ఏమిటో చెప్పమ్మా.”

          రేణుక నిట్టూర్చింది. “ఏమిటి చెప్పడం?ఎన్నని చెప్పడం? చెప్పడానికి ఎంతో సిల్లీగా ఉంటాయి. కూరలో ఉప్పెక్కువైతే ఏదో కావాలని వేసినట్టు రుసరుసలాడే మొగుడ్ని – అదీ పెళ్ళయిన నెల్లాళ్ళకే కొత్త పెళ్ళాన్ని కసిరే మొగుడ్ని ఏ ఆడది ప్రేమించగలదు! టిఫిను పెట్టి మంచినీళ్ళు మర్చిపోతే మొగుడంటే లేక్కలేకపోవడం అంటూ ఎగిరే భర్తని, బొత్తాం కుట్టడం మర్చిపోతే మొగుడి మాటంటే నిర్లక్ష్యం అంటూ దుమధుమలాడే భర్తని ఓ కొత్త భార్య గౌరవించగలదా, అభిమానించగలదా? సినిమాకి వెడదాం అని కొత్త భార్య ముచ్చటగా అడిగితే , వెధవ సినిమాలు బోరు. నీవు వెళ్ళు కావలిస్తే పక్కింటావిడతో అనే మొగుడి మనస్తత్వాన్ని భార్య ఎలా అర్ధం చేసికోవాలి? మంచి వెన్నెల బాగుంది – డాబా మీద పడుకుందామా అంటే, నాకు వళ్ళు పట్టేస్తుంది అంటూ చిరాకుపడే భర్తని చూసి ఎన్నో ఆశలతో , కలలతో , కోరికలతో వచ్చిన అ నవ వధువు మనసు ముక్కలవదా? ఓ మంచి చీర కట్టుకుంటే భర్త పొగడాలని, మంచి టిఫినో, కూరో చేస్తే భర్త మెచ్చుకోవాలని కొత్త భార్య ఆశించడం అత్యాశా? సెలవు రోజన్నా భార్యతో ఏ గార్డెనుకో వెళ్ళి హోటల్లో భోంచేసి రావాలన్న చిన్న కోరికలని కూడా తీర్చని మొగుడిని ఏ భార్య ప్రేమిస్తుంది? భార్య పుట్టిం రోజు కనీసం మొదటి సంవత్సరం అన్నా గుర్తు పెట్టుకొని భర్తని ఏమనుకోవాలి? సరదాగా జోక్ చేస్తే కుళ్ళి పోయి మొహం గంటు పెట్టుకునే సెన్సాఫ్ హ్యూమర్ లేని భర్త పట్ల అనురాగం కలగమంటే కలుగుతుందా! మాటలో సౌమ్యత, మనసులో అనురాగం , పలకరింపులో ఆప్యాయత కరవయిన ఆ కాపురంలో భార్య మనసు ఎలా స్పందిస్తుంది!

          ప్రతి ఆడపిల్ల పెళ్ళి గురించి భర్త గురించి ఎన్నో కలలు కంటుంది. అందులో కాస్త  అందం , చదువు  అన్నీ ఉంటే తనంటే భర్త ఎంతో ప్రేమానురాగాలు కురిపిస్తాడని, మురిపిస్తాడని, అలరిస్తాడని , గుండెల్లో పోదువుకుంటాడని ఆశించడం అత్యాశ కాదు! సినిమాలలో మాదిరి డ్యూయెట్లు పాడుకోకపోయినా , ఏ సాయంకాలం చీకటి వేళో పెరట్లోనో, డాబా మీదో కూర్చుని సన్నగా ట్రాన్సిష్టర్ వింటూ, నీలాకాశం కింద పిల్లగాలుల మధ్య ఒడిలో తలపెట్టుకు పడుకుంటే, ఆ చేతులు తన కురులు మృదువుగా సవరిస్తుం టే పులకరించాలనుకోదా ఏ అమ్మాయి అయినా. అలా సెలవు రోజులు ఏ గార్డెనులోనో చేతులు కలుపుకుంటూ నడవాలన్న చిన్నకొరిక ఏ కొత్త భార్యకి ఉండదు? తను వంట చేస్తుండగా వచ్చీ రాని పనులు చేస్తూ తనని విసిగెత్తిస్తుంటే తను మురిపెంగా కసరడం లాంటి సరదాలు దాంపత్యంలో చోటు చేసుకోవాలని కోరుకోవడం దురాశా! ఉదయం నిద్ర లేవగానే ఒక్క అరక్షణం భార్యని దగ్గరికి లాక్కుని చిన్న ముద్దు పెడితే , “గుడ్ మార్నింగ్ డార్లింగ్ ” అంటే ఆ ముద్దు టానిక్ లా పనిచేసి రోజంతా ఏ భార్య అయినా ఆ భర్తకి గొడ్డు చాకిరీ చెయ్యదా!

          భార్య ముందు తల దించి తల దువ్వించుకోవడం, స్నానం చేస్తూ తువ్వాలు మర్చిపోయిన వంకతో భార్యని స్నానాల గదిలోకి లాగి సరిగంగ స్నానాలు చెయ్యడం, అన్నం తింటూ తింటూ భార్య పళ్ళెంలోది లాక్కుని తినడం, ఆఫీసు నించి రాగానే కాఫీ కప్పుతో పాటు భార్య చేయి పట్టి దగ్గరికి లాక్కుంటే రోజంతా నీరిక్షణకి అర్ధం కనపడదా? ఇలాంటి చిన్న చిన్న సరదాలకి డబ్బు ఖర్చు లేదు. భార్య భర్త నించి కోరేది ప్రేమాను రాగాలు కానీ, సెక్స్ కాదన్నది అర్ధం కాదా, ప్రేమలేని చోట స్త్రీకి సెక్స్ నరకం అన్నది ఈ మగాళ్ళకి అర్ధం కాదా. రాత్రి అరక్షణం పని. భర్తకి తృప్తి నివ్వచ్చు గాని భార్యకి కాదన్నది ఈ మగాళ్ళు ఎందుకు గ్రహించరు? ఆమెకి కావాల్సింది భర్త గుండెల మీద తలపెట్టి పడుకుంటే ఆ చేతులు అనురాగంతో శరీరాన్ని వీణగా చేసి మీటుతూ ఉంటే పులకింత కావాలి అన్నది ఎప్పటికీ అర్ధం చేసుకోలేరా! పత్రికలలో సెక్స్ సందేహాలు చూస్తె నవ్వు వస్తుంది. ఆడదాన్ని ఇంప్రెస్ చెయ్యడానికి అదే మార్గం అనుకునేవాళ్ళు తెలివి తక్కువ తనానికి నవ్వు వస్తుంది. వాళ్ళ శక్తి సామర్ధ్యాలు , ప్రతాపాలు చూసి ఆడది ప్రేమించదని , స్త్రీకి అది సెకండరీ థింగ్ అన్న నిజం వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం ఎందుకు చెయ్యరు? మగాడు నపుంశకుడు అయినా ప్రేమానురాగాలు చూపి గుండెల్లో దాచుకుంటే చాలనుకుంటుంది ఆడది!

          ఓ చిన్న చిరునవ్వుతో , ఓ మధుర వచనంతో భార్యని బానిసని చేసుకోవచ్చని ఈ పిచ్చి మొగవాళ్ళు ఎప్పుడు అర్ధం చేసుకుంటారు? సరసం తెలీని మొగుడి కటువైన మాట కత్తిలా గుండెల్ని కోసి బాధపెడ్తుంది స్త్రీని. ఇవన్నీ ఎవరికి చెప్పడం? ఎలా చెప్పడం?”

          ఎత్తి ఎత్తి ఎంగిలాకు మీద అడుగేసినట్టు వెతికి వెతికి మంచి సంబంధం —-ఇంజనీరు , ఉన్నవాళ్ళు అన్న మురిపం ఏడాది నిలవలేదు. ఎనిమిది నెలలకి పుట్టింటికి వచ్చిననాడే అర్ధమయింది.

          “రేణూ , ఏం జరిగిందో చెప్పకపోతే మాకేలా తెలుస్తుంది? మీ నాన్నగారిని వెళ్ళి మాట్లాడమనాలన్నా అసలు సంగతి తెలియాలి కదా –చెప్పు రేణూ. అతను నీ మీద చెయ్యి కూడా చేసుకుంటూన్నాడా!” ఆందోళనగా అడిగింది.

          ‘అమ్మా ప్రేమ ఉంటే చెంపదెబ్బ వేసినా ఆడది సహిస్తుంది. కోపం వచ్చినప్పుడు ఓ దెబ్బ వేసి తర్వాత దగ్గరికి లాక్కునే భర్తని ఎప్పుడూ క్షమిస్తుంది. అన్నింటికన్నా ఆడదాన్ని బాధించేది ఇండిఫరెంట్ అటిట్యూడ్, భార్యా అన్నదాన్ని ఇగ్నోర్ చేసి, ఆవిడ కా ఇంట్లో వండిపెట్టే , పిల్లలని కనే స్థానం మాత్రమే అనే యాటిట్యూడ్ ఏ ఆడది భరించ లేదమ్మా. ప్రతి ఇంట్లో భార్య భర్తా అరుచుకుంటారు. కానీ, తరువాత మర్చిపోవాలి. ఓ చిన్న విషయాన్ని పట్టుకుని రోజుల కొద్ది సాగదీసి సాధించి ముంగిసలా మాట్లాడకుండా కూర్చునే మనస్తత్వం నాకు సరిపడదమ్మా. ఊ అంటే , ఆ అంటే కోపం. మొగుడితో కూడా డ్రాయింగు రూములో గేస్టులా మాట్లాడాలి . తక్కడలో మాటలు తూచినట్టు అటు ఇటు ఓ మాట ఎక్కువ ఆడకూడదంటే ఎలా అమ్మా? ఏదీ సర్దుకునే మనస్తత్వం కాదు. ఇవతలివాళ్ళు చెప్పేవి, చేసేవి తప్పులు. అయన చేసేవి రైటు . తను ఇతరులను ఎన్నైనా అనవచ్చు. తనని ఎవరూ ఏమనకూడదు. మేమూ చదువుకుంటున్నాం. మాకూ ఓ వ్యక్తిత్వం ఉంటుంది. మాకూ కొన్ని అభిప్రాయాలు, టేస్టులు ఉంటాయి. ప్రతిదానికి భార్యే సర్దుకోవాలంటూ ఎన్నాళ్ళమ్మా? అందరూ నీతులు చెపుతారు. పెళ్ళి కోసం , సంసారం కోసం తల వంచి ఎన్నాళ్ళు భరించాలి? భర్త సహృదయుడైతే ఎంత చదువు కున్న ఆడదైనా తనని తాను అర్పించుకొని ఏమన్నా భరిస్తుంది. ప్రేమలేని చోట పెళ్ళికి కట్టుబడి, ఈ మగాళ్ళ జులుం సహిస్తూ ఎన్నాళ్ళయినా పడుండాలాంటావా!” రేణులో ఆవేశం కట్టలు తెంచుకుంది. ఆర్నెల్లుగా మనసులో అణగదొక్కిన ఆవేశం లావాలా పెల్లుబికింది.

          “రేణూ , నీవు చెప్పిందంతా నిజమే – సామరస్యం లేని కాపురం స్త్రీకి నరకమే. కానీ, ఈ దేశంలో ఓసారి పెళ్ళయ్యాక ఆడదాని అదృష్టం మంచిదయితే అనుకూలుడైన భర్త దొరుకుతాడు. లేదంటే దురదృష్టం అని సరిపెట్టుకు బతకాల్సిందే.”

          ‘అదంతా ఇదివరకటి రోజుల మాటలు. ఏం పెళ్ళి, సంసారం, ఇల్లు, పిల్లలు, భార్య మొగుడికి అక్కరలేదా? మగాడికి ఆడదాని అవసరం లేకపోతే ఆడదీ ఈనాడు మగాడి అవసరం లేకుండా తన కాళ్ళ మీద తను నిలబడగలదు.’ పౌరుషంగా అంది రేణుక.

          రేణు మాటలతో అర్నేల్లకే కూతురి మనసు ఎంత విరిగిపోయిందో అర్ధం చేసికో గల్గింది సావిత్రి. కానీ, పెళ్ళయ్యాక , అందులో నెల తప్పిన పిల్ల కాపురం వదులుకోడం అంత సులువా! పెళ్ళయిన అర్నేల్లకే ఆ కాపురం వద్దన్న ఆడపిల్ల మనసు ఎంత గాయపడి ఉండాలి! ఇద్దరబ్బాయిల తరువాత ఒకతే కూతురని గారాబంగా పెంచి, పెద్ద చేసి ఇంజనీరని, బాగున్నాడని ఎంచి పెళ్ళి చేస్తే ఇలా జరిగిందేమిటి? సావిత్రి మనసులో వ్యధ బయటపడితే, కూతురు ఇంకా అధైర్యపడ్తుందని అప్పటికి ఏం మాట్లాడ లేదు.

          ఆ రాత్రి భర్తతో అంతా చెప్పింది సావిత్రి. ప్రసాదరావు చకితులై విన్నారు. ‘అయ్యో, ఇదేమిటి నిజంగానా? రమేష్ అలాంటివాడా? “రేణు అంత బాధ పడ్తోందా?” ఆయనకా క్షణంలో నిస్సహాయత తప్ప ఏం చెయ్యాలన్నది తట్టలేదు.

          “ఏం చేద్దాం? మనం చెపితే వింటాడా! అసలు మనిషి నేచర్ మనం ఎలా మార్చ గలం? ఏదో అట్టే మాటకారి కాదనుకున్నాను గాని ఇలా…..’ అయన తల పట్టుకున్నారు.

          “పోనీ వియ్యంకులతో మాట్లాడితే…..’ ఆరాటంగా అన్నారు ప్రసాదరావు.

          “ప్రత్యేకం ఏముందని చెపుదాం, మీ అబ్బాయి సరసుడు కాడని ఎలా చెపుతాం? చెప్పినా, వాళ్ళు మాత్రం ఏం చెయ్యగలరు? భార్యాభర్తల అన్యోన్యత అన్నది వాళ్ళిద్దరి మధ్య విషయం అంటే……’ సావిత్రి సందేహంగా అంది.

          “అదీ నిజమే….. కొడుకుని వాళ్ళు ఏమన్నా అలా ఉండమన్నారా- వాడి స్వభావం అంతే అంటే మనం ఎమంటాం? ఏదో కొడ్తున్నాడు, హింసిస్తూన్నాడంటే కంప్లైంట్ చేస్తాం గాని , ఇలా వాళ్ళ మధ్య ప్రేమ లేదని ఏం చెప్తాం? ఇంతకీ రేణు ఏమంటుంది?”

          “వెళ్ళనంటూ ఏడుస్తుంది. నన్నక్కడికి వెళ్ళమనద్దు అని ఏడుస్తుంది. దానికి ఆరు నెలలకే మనసు విరిగి పోయిందండి.”

          “ఖర్మ దాని ఖర్మ. ఎంచి ఎంచి అపురూపంగా పెళ్ళి చేస్తే ఇలా జరగడం…..దానికి తోడు నెల తప్పిందంటున్నావు…..ఈ పరిస్థితిలో మనం ఏం చెయ్యాలి?”

          “అదే నేనూ అన్నాను. కాపురం, మొగుడు వద్దనుకోవడం అంత సుళువు కాదు, అందులో పిల్ల పుట్టబోతుంటే మరీ ఇబ్బంది అని నచ్చచెప్పాను.”

          “అతన్ని కాస్త సౌమ్యంగా మార్చుకోడానికి ప్రయత్నించమని నచ్చ చెపుదాం. పెళ్ళి, సంసారం అన్నాక రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి మరీ సెన్సిటివ్ గా వర్రీ అయిపోతే ఎలా? సాల్వ్ చేసుకోడానికి ప్రయత్నించాలి గాని. ఊ ఆ అంటే విడిపోతే తరువాత ప్రాబ్లమ్స్ ఆలోచించాలి గదా…..దాంతో మాట్లాడుతాను రేపు ‘ నిట్టూర్చి అన్నారు ప్రసాదరావు.

          తరువాత వారం రోజులు తల్లి, తండ్రి రకరకాలుగా కూతురికి నచ్చజెప్పి ‘ సంసారం వదులుకుంటే ఎదుర్కోవాల్సిన ఇబ్బందులు , పిల్లతల్లి కాబోతున్న తరుణంలో భర్తని వదిలితే వచ్చే ప్రాబ్లమ్స్ రకరకాలుగా చెప్పి, కూతుర్ని సామరస్యంగా అతన్ని మార్చు కోడానికి ప్రయత్నించమని ఓ విధంగా బలవంతంగానే పంపించారు. ప్రతి తల్లితండ్రుల మాదిరిగానే అలోచించి.

***

          కూతుర్ని ఏడో నెలలో సారే ఇచ్చి పుట్టింటికి తీసుకువచ్చేనాటికి రేణుక కాపురం బాగుపడడం అటుంచి, పరిస్తితులు మరింత దిగజారాయి. కడుపుతో ఉన్న పిల్ల కళా కాంతులేకుండా చిక్కి శల్యమై బతుకు భారంగా ఈడుస్తున్న దానిలా ఉన్న రేణు అవతారం చూసి సావిత్రి తల్లడిల్లి పోయింది. కాపురం పేరుతొ కూతుర్ని కాటికి పంపామా అన్న ఆవేదన కలిగింది. ఏం అడిగినా రేణు అదోలా నవ్వి, “ఎందుకు అమ్మా అడుగుతావు? మీకు చెప్పుకుని ఏం లాభం? కష్టమో, నష్టమో నేనక్కడే పడుండాలని  గదా అన్నారు” అంది.

          సావిత్రి మనసు విలవిల్లాడింది . “రేణూ , మా ఉద్దేశం అది గాదమ్మా….. కాపురం…..”

          “అర్ధం అయిందమ్మా , పెళ్ళయ్యాక ఆ కాపురం నరకం అయినా చచ్చే వరకూ అక్కడే వుండాలి అనే గదా మన పెళ్ళిళ్ళలో అర్ధం …..” పట్టుకున్న గొంతుతో అంది.

          సావిత్రి విచతురాలైంది . ఈ పరిస్థితిలో ఏం అనాలో అర్ధం గాలేదు. రేణుక ఏ మాత్రం సుఖంగా లేదన్నది మాత్రం అర్ధం అయినా, తాను ఏమని భరోసా ఇవ్వాలో, ఈ పరిస్థితి ఎలా చక్కదిడ్డాలో, దిద్దగలిగే అవకాశం తమకి ఉందా….. లక్ష ప్రశ్నలు ఆమెని చుట్టుముట్టాయి.

          ‘అమ్మా, ఆయన్ని సౌమ్యంగా మార్చుకోవాలన్నారు. భార్యాభర్తల మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఉండకూడదని మనసు విప్పి మాట్లాడిమన్నావు ——మంచయినా చెడయినా , నచ్చనిదైనా నెమ్మదిగా చెప్పి అర్ధం అయ్యేట్టు చూడమన్నావు. కానీ మీరు చెప్పినవి ఏ మాత్రం పనిచెయ్యలేదు గాబట్టి ఈ “సూత్రబంధం ‘ నించి ఇప్పటికయినా నేను తప్పుకోవచ్చా?” జవాబు చెప్పమన్నట్టు చూసింది.

          “నీవు చెప్పినా అతను…..అతను వినలేదా?”

          “చెప్పానమ్మా , ఆయనకర్ధం అవాలని మనసు విప్పి చెప్పాను. ఆప్ట్రరాల్ భార్యా తనకు జవాబు చెప్పేది. భార్యా తన లోటు పాట్లు ఎత్తి చూపేది అన్న పౌరుషం వచ్చే సింది. దాంతో నోరేకాక చెయ్యి చేసుకోడం మొదలుపెట్టారు.”

          “కడుపుతో ఉన్న ఇల్లాలిని కొట్టడమా, అంతకి దిగజారడా? ఏదో చిన్నతనం – తెలియచేపితే సర్దుకుని కాపురం బాగు చేసుకుంటారని …..’ సావిత్రికి కోపంతో మాటలు తడబడ్డాయి. “ఉండు రానీ , నిలేసి అడుగుతాను.”

          ‘ఇంక నువ్వు, అయన అరుచుకోవడం ప్లీజ్, నీవు ఆయనతో మాట్లాడకు. నిన్ను కూడా ఏదో అని అవమానించితే సహించలేను. ముందీ నరకంలోంచి ఈ పురిటి వంకనైనా నాలుగైదు నెలలు నన్ను బయటపడనీ. తర్వాత సంగతి ఆలోచిద్దాం. ఇప్పుడేదన్నా అంటే ఆ కోపంలో పురిటికి పంపననవచ్చు ఈ మూర్ఖుడు.” భర్త తత్త్వం తెలిసిన రేణుక తల్లిని వారించింది.

          కోడలికి సారె పెట్టించడానికి వచ్చిన వియ్యపురాలితో మాత్రం చూచాయగా కొడుకు సంగతి చెప్పింది సావిత్రి. ఆవిడ ఆశ్చర్యంగా కోడలి వంక చూసింది. “రేణూ నీవన్నా ఎప్పుడూ మా దగ్గిర ఏం అనలేదు.” “ఏం చెప్పను” అన్నట్లు చూసి తలదించుకుంది రేణు.

          “వదినగారూ , ఏదో మాట మాట అనుకోవడం ప్రతి సంసారంలో ఉంటాయి. కానీ పెళ్ళయిన కొత్తలోనే ఇలా ఉంటే, ఎడమొహం పెడ మొహంతో నూరేళ్ళ కాపురం ఎలా సాగుతుంది? ఈ కాలం అమ్మాయిలా చదువుకుంటున్నారు. వాళ్ళకీ ఆత్మాభిమానం ఉంటుంది కదా. చీటికి మాటికి భర్త అంటుంటే, ఇంట్లో నీదెం లేదు నాదే అంటే మన కాలంలో మాదిరి ఈ అమ్మాయిలూరుకుంటారా? కాస్త అబ్బాయితో మాట్లాడండి మీరు. వాళ్ళ సుఖం, అనందం కంటే మనకేం కావాలి” అంటూ మెత్తగా చెప్పింది సావిత్రి.

          ‘చిన్నప్పటి నుంచి వాడు కాస్త ముభావి, కోపిష్టి — ఎంతసేపూ వాడన్నదే జరగాలి అన్న పంతం ఉండేది. ఎప్పుడూ చదువు తప్ప ఎవరితోనూ కలిసేవాడు కాదు. చదువులో ఎప్పుడూ ఫస్ట్ కనక మిగతావి మేమూ పట్టించుకోలేదు. పెళ్ళి సంసారం అయితే వాడు సరదాలు నేర్చుకుంటాడు అనుకున్నాం గాని ఇలా …… రేణూ మాకు ఓ ముక్క చెప్పద్డా…..’  ఆవిడ నొచ్చుకుంటూ అంది.

          “వదినగారూ మేం వెళ్ళాక కాస్త మాట్లాడండి ——రేణు భయపడుతుంది . సంసారంలో సంతోషం కరవయితే అతనికి మాత్రం సుఖమా?” వియ్యపురాలు తల పంకించింది.

***

          అమ్మాయి నెత్తుకుని మూడో నెలలో వెళ్ళేసరికి భర్త మారకపోతాడా అన్న చిన్న ఆశ కాస్తా అడియాస అయింది. పైగా తన గురించి అందరికీ చెప్పిందనే కసి ఇంకాస్త పెంచు కున్నాడు. ఆర్నెల్లు దూరంగా వున్నా తల్లి మంచిగా చెప్పినా మారని భర్తని చూసి హతాశురాలైంది. “ఏం అక్కడే ఉండకపోయావా? నేనంత చెడ్డవాడినని ఊరంతా చాటిన దానివి. మళ్ళీ ఏం మొహం పెట్టుకు వచ్చావు” అని చెప్పి పొడిచాడు.

          తనేకాక , తన పిల్ల కూడా కన్నవారి మీద కొన్నాళ్ళయినా అధారపడాలన్న నిజం వెనక్కి లాగింది. తనో ఉద్యోగం చూసుకోవాలి. ఒంటరిగా పిల్లని పెంచుకోవాలి అన్న స్థితికి ఆలోచన రేణుని వెనక్కి లాగకపోతే …..ఛా…..తనైనా కాస్త  జాగ్రత్తపడి పిల్లని కనకుండా ఉండాల్సింది.

          రోజూ దేనికో గొడవ . అర్గ్యూమెంట్లు, అరుచుకోడాలు, దెప్పి పొడవటాలు, కేకలు, శృతి మించిన రోజు చెయ్యి చేసుకోడం, మనశ్శాంతి కరవై , ద్వేషాలు పెరిగి, దూరాలు పెరిగి ఈ బతుకు కంటే బయటికి వెళ్ళి ఏ అవస్థలన్నా ఎదుర్కోవచ్చు నన్న నిర్ణయానికి వచ్చింది రేణుక.

          ఏ బతుకయినా ఇంతకంటే అధ్వాన్నంగా ఉండదన్న నిబ్బరం కలిగింది. ఆ నిర్ణయం, నిశ్చయం పెద్దవాళ్ళకు తెల్సి అమలు పరచాలనుకునేలోగా — ఉన్న పాటున చేతిలో దమ్మిడి లేకుండా పసిపిల్లతో సాయంత్రం ఇంట్లోంచి తరమబడ్తుందని ఊహించ లేదు. ఆ రోజు ఇద్దరి మధ్య తగవు పరాకాష్టకి చేరుకుంది. జుట్టు పట్టుకు ఈడ్చి కళ్ళ ముందు మెరుపులు మెరిసేటట్లు కొట్టిన రమేష్ ని ఎదుర్కొంది. వంటింట్లోంచి కత్తి చేత్తో పట్టుకుని అడుగు ముందుకు వేస్తె చస్తావు అని బెదిరించింది. దాంతో ఆ పురుష పుంగ వుడు ఉగ్రరూపుడై పులిలా గర్జించి, పులిలా దూకి, కత్తి విసిరేసి ఆ చేత్తో రేణుకని బయటికి ఈడ్చి తలుపేశాడు. ఏడుస్తున్న పిల్లని గుమ్మంలో పడేసి, తలుపు మూసుకున్నాడు. కాసేపు ఏం చెయ్యాలో దిక్కుతోచని స్థితిలో నిలబడి, తనకు కాస్త తెల్సిన ఎడురింటావిడ దగ్గర డబ్బు అప్పు చేసి రైలెక్కింది.

***

          “ఏమిటి దారుణం? ఉన్నపాటున ఇలా ఇంట్లోంచి వెళ్ళగోడతాడా?” కోపంతో వణికిపోయారు ప్రసాదరావుగారు, మర్నాడు రేణుక చెప్పింది విని.

          “పోలీసులకి రిపోర్టు ఇస్తాను. పెళ్ళాన్ని వీధిలోకి నెట్టేయడం అంత సుళువను కుంటున్నాడా? పెళ్ళంటే , భార్యంటే ఏమనుకుంటున్నాడు వాడు? వాడి అంతు తేలుస్తాను.” ప్రసాదరావు ఆవేశంలో హుంకరించాడు.

          “నాన్నా ….ఆ కాపురం నాకింక వద్దు. అతన్ని ఏం చేసినా, ఏం అన్నా మారే మనిషి కాదు. అలాంటి కాపురం చచ్చినా చేయ్యనింక. డాడీ, దయచేసి నన్నక్కడికి వెళ్ళమన కండి. ప్లీజ్ – నేనేదో ఉద్యోగం చూసుకునే వరకు కొన్నాళ్ళు నాకశ్రయం ఇవ్వండి…..ప్లీజ్ , నేను నిలదొక్కుకునే వరకు ఆదుకోండి….. పెళ్ళయిన దానివి, ‘ఆడపిల్ల ” వి గాని ఇంక “ఈడపిల్ల ” వి గాదు అనకండి……ఒక్క ఏడాది నాకేదో దారి దొరికే వరకు .” దీనంగా కన్నీళ్ళతో చేతులు జోడించి అంది రేణుక.

          “రేణూ!” దెబ్బతిన్న పక్షిలా అరిచారు ప్రసాదరావుగారు. “రేణూ! ఏమిటమ్మా ఈ మాటలు. నిన్నేదో ఇంట్లోంచి పోమ్మన్నట్టు మాట్లాడుతున్నావు . నీ తల్లీ, తండ్రీ ఇంకా బతికే ఉన్నారు. అయన రుద్దకంఠంతో అన్నారు.

          సావిత్రి కళ్ళు తుడుచుకుంది. “రేణూ, ప్రతి తల్లి, తండ్రి పిల్ల బరువని పెళ్ళి చేసి పంపరమ్మా. కూతురు సుఖపడాలని , తనకో ఇల్లు, సంసారం , భర్త పిల్లలు అండ ఉండి సుఖించాలని చేస్తారు. అంతమాత్రాన ఆడపిల్ల కష్టంలో ఉంటే ఆదుకోరనా అలా మాట్లాడుతున్నావు…..?”

          “రేణూ…..పిల్లని కన్నాకయినా కన్న మనసు అర్ధం కాలేదా….?”

          ‘డాడీ , నిజమే పెళ్ళి చేశారు. సుఖపడాలనే కానీ, ఆ పెళ్ళి పెటాకులూ అయి రక్షించాల్సినవాడే నరకం సృష్టిస్తుంటే , “ఆడపిల్లకి ఇంకా ‘ఆడే” స్థానం అనడం న్యాయమా?” ‘ఆడపిల్ల” పుట్టిందగ్గర నుంచి ఎప్పటికయినా ‘ఆడదే” అన్నట్టు, ఆడపిల్లకి పెళ్ళి చేసి పంపడం ఒక్కటే ధ్యేయం అన్నట్టు ఎందుకనుకుంటారు? ఏం, ఆడపిల్లని మగపిల్లాడితో సమంగా చదివిస్తున్నారు. సమంగా ఉద్యోగాలు చేస్తున్నారు. మగపిల్లవాడి గురించి లేని తొందర, ఆరాటం , ఆందోళన ఎందుకు? ఎంత తొందరగా పెళ్ళి చేసి బాధ్యత వదుల్చుకుందామనుకుంటుంటారు?”

          ప్రసాదరావుగారు నవ్వారు. ‘అమ్మా! నీవూ ఒక ఆడపిల్లని కన్నావు కదా, అది పెద్దదవుతుంటే అప్పుడు నీకర్ధం అవుతుంది. తల్లిదండ్రుల ఆరాటం. సరే పోనీ, మా తరంలో లేని ధైర్యం మీ తరం చూపుతుందని ఆశిస్తాను రేణూ. ఏ తరం అయినా, ఎప్పటి కయినా సృష్టిలో ఆడదాని స్థానం మారదమ్మా శారీరకంగా బలహీనురాలైన స్త్రీకి ప్రతి దశలోనూ పురుషుని అండదండలుంటాయి.”

          “రబ్బిష్ డాడీ. ఆపండి. చదువుకున్న మీరూ అలా మాట్లాడకండి. ఆడపిల్ల బలహీనురాలెందుకు అయింది? పుట్టిందగ్గర నించి, అసలు పుట్టక ముందు నించి ఆడపిల్ల పుడ్తుందని భయం. వీలయితే పుట్టకుండా చెయ్యడం, పుడితే ఆడపిల్లా అని బాధపడడం – ఆడపిల్లను ఏదో కాస్త చదివించి తొందరగా పెళ్ళి చేసి బాధ్యతవదుల్చు కుందామన్న ఆరాటం – ఆడపిల్లలకి, మగపిల్లలకి ఇంట్లో ఎంత తేడా చూపుతారు. అది చెయ్యకు, అలా నవ్వకు , అలా గెంతకు , అలా చెట్టెక్కకు, ఆడపిల్లవు గాదూ – ఆ నవ్వేమిటి? మగపిల్లాడితో సమంగా ఆ గెంతులు ఏమిటి? వొద్దిక నేర్చుకో, అత్తవారింటికి వెళ్ళాల్సిన దానివి. రేపు పొద్దుట మొగుడితో కాపురం ఎలా చేస్తావు? మగరాయుడులా ఆ బట్టలేమిటి? ప్రతి క్షణం అమ్మాయిలకి ఆడపిల్ల, ఆడపిల్ల అని గుర్తుచేస్తూ అన్నింటి లోనూ మగాడి కంటే తను తక్కువ అన్న న్యూనతాభావం బీజం నాటుతారు. ఆడపిల్ల పెళ్ళి చేశాక , ఇంక నీ స్థానం అక్కడే ఈ ఇంట్లో నీకు స్థానం లేదు. మంచయినా, చెడయినా , చావయినా, బతుకైనా అక్కడే అంటూ చేతులు దులుపుకుంటారు. పాపం అమ్మాయి ఏం చేస్తుంది? చిన్నప్పటి నుంచి విని విని , నరాల్లో జీర్ణించుకుని తను ఏం చేసినా మగవాడితో సమంగా అవలేదని, పెళ్ళయ్యాక భర్త ఏం చేసినా ఆ ఇల్లు వదిలితే అధోగతని, పుట్టింటి వారు అదుకోరని, వంటరి బతుకు కంటే ఏ మొగుడో ఓ మొగుడు అంటూ సర్దుకు బతకడానికి మెంటల్ గా ప్రిపేర్ చేస్తారు.” రేణుక ఆవేశం కట్టలు తెంచు కుంది.

          “రేణూ! ‘ సావిత్రి అడ్డబోయింది.

          “ఉండమ్మా నన్ను చెప్పనీ – ఏ తల్లీ , తండ్రయినా కూతురికి తామన్నా భరోసా ఇస్తే నరకం లాంటి కాపురం నించి బయటపడడానికి సాహసిస్తుంది. అమ్మా కావాలని ఏ ఆడపిల్లా సంసారం వదులుకోదమ్మా. సహనం ఆఖరి మెట్టుకు వచ్చాక , ఆడది గడప దాటుతుంది. అలా గడప దాటిన ఆడపిల్లకి కన్నవాళ్ళు చెయ్యి అందించి కొన్నాళ్ళ యినా ఆశ్రయం ఇస్తే ఈ దేశంలో ఇన్ని ఆడపిల్లల చావులుండవు. అలా తల్లి, తండ్రి ఆశ్రయం ఇస్తారు అంటే ఆ మొగుడు భయపడతాడు. ఎవరాదుకుంటారు దీన్నీ? నేనే గతి , చచ్చి నట్టుపడి ఉంటుంది అనుకునే గదా మొగుళ్ళు విర్రవీగుతున్నారు. ఆమె ఇల్లు వదిలిపోతుందేమోనన్న భయం ఉన్ననాడు ప్రతి భర్తా భార్యని హింసించే ముందు కాస్త సంకోచిస్తాడు. ఓ ఆడపిల్ల కాపురం వదిలితే లోకంలో అన్ని దారులూ మూసుకు పోతాయని , ఎందుకనుకుంటారు? అమ్మాయిలూ చదువుతున్నారు. నాల్గురోజులు ఆదుకుంటే ఏ ఉద్యోగమో చేసుకుంటారు. పెళ్ళయ్యాక అమ్మాయి అంత బరువై పోతుందా? ఊరికే కూచుని ఆమె తింటుందా? తనూ ఏదో చేసి నాలుగు రాళ్ళు సంపాది స్తుంది. కాస్త నీ వెనక మేం ఉన్నామన్న నిబ్బరం ఇస్తే చాలమ్మా. ఏం, పెళ్ళి – సంసారం ఆడదానికేనా , మగాడి కక్కరలేదా? మగాడు లేకపోయినా డబ్బుంటే ఆడది నిక్షేపంలా బతుకుతుంది. అదే ఆడదిలేని సంసారం మగాడు చెయ్యలేడు. పిల్ల తల్లితండ్రులు ఊరుకోరు, నిలేస్తారు అన్న భయం ఉన్న నాడు మగాడు ఇంత తెగించడు.’

          “రేణూ , ఈ మాటలన్నీ వినడానికి, వాదించడానికి బాగుంటాయి. ప్రాక్టికల్ గా ఉండే ఇబ్బందులు అనుభవంలోకి వచ్చాకే అర్ధమవుతాయి. మగాడికేం నాల్గు రోజులు పొతే మరో పెళ్ళి చేసుకుంటాడు. కానీ, పిల్లతల్లిని నిన్నెవరు చేసుకుంటారు. నూరేళ్ళ జీవితం వంటరిగా ….’

          “ఏం పెళ్లికాకపోతే చచ్చిపోతానా, బతకలేనా? అవును ఆడపిల్లని వదుల్చుకుంటే చాలని మగాడి కోసం ఎగబడి కట్టబెట్టే ఆడపిల్లల తల్లితండ్రులుంటే ఎందుకు చేసుకోడు మగాడు. ఓ పిల్లని ఇచ్చే ముందు మొదటి ఇల్లాలు ఆ ఇంట్లోంచి ఎందుకు వెళ్ళింది అని అరక్షణం అయినా ఆలోచించరు. చూస్తా . నేనూ చూస్తా మరో పెళ్ళి ఎలా చేసుకుంటారో నేనూ చూస్తా. “ఫలానా వాడి సంగతి ఇది పిల్లనిచ్చే ముందు జాగ్రత్త అంటూ పేపర్లో వేసి వీడి బండారం బయటపెడ్తా.” ఎర్రబడ్డ మొహంతో , అదురుతున్న పెదాలతో అంది.”

          “నీ ఆవేశం అర్ధం అవుతుందమ్మా కానీ….”

          “కానీ లేదు, అర్ధం కాలేదు. మీరెన్ని చెప్పినా నేనింక అక్కడికి వెళ్ళను. నా ఆశలు, కోరికలు, సమూలంగా నరికేసిన అలాంటి మొగుడు నాకక్కరలేదు. నన్ను మీరు ఆదుకోలేమంటే నా దారి నేను చూసుకుంటా. అక్కడ చేసే పని ఇంకో ఇంట్లో చేస్తే ఇంత తిండి దొరక్కపోదు. పదిమంది పిల్లలకి ట్యూషను చెప్పుకుంటాను. ఏం లేకపోతే చస్తాను…..’ స్థిర నిశ్చయంగా అంది రేణుక. సావిత్రి భర్త వంక చూసింది. అయన నిట్టూర్చి , “రేణూ మేం ఉన్నన్ని రోజులూ నీకంత ఖర్మ పట్టదు – కానీ తర్వాత .’

          “ఏం ఈలోగా ఏదో ఉద్యోగమే దొరకదా? నా కాళ్ళ మీద నేను ఈలోగా నిలబడలేనా?”

          ‘అమ్మా రేణూ, ఒకవేళ అతను పిల్లనివ్వనని కోర్టు కెక్కితే!” సావిత్రి సందేహం.

          “హు- ఆడదాని ఈ బలహీనత మీదే గదా మగాళ్ళు ఆటలాడుతున్నారు. మహా రాజులా తీసికెళ్ళి పెంచుకోమంటాను. ముందు ఆడవాళ్ళు ఈ విషయంలో గుండె దిటవు పరచుకోవాలి…..నీకేం పిచ్చా అమ్మా. ఈ పసిపిల్లని తీసికెళ్ళి ఆయనెందుకు పెంచు తాడు. ఊరికే బెదిరిస్తాడు. గట్టిగా ఉండి సరే అంటే అప్పుడే బండారం బయటపడ్తుంది .” రేణు నిబ్బరంగా అంది.

          “రేణూ , భగవంతుడు నీకింత అన్యాయం చేసినందుకు కనీసం మగపిల్లాడి నన్నా ఇస్తే బాగుండేది. రేపొద్దున పిల్ల పెళ్ళి…..ఈ సమస్యలు అన్నీ ఎలా నెగ్గుతావు?”

          “హు…..డాడీ ఇంత చెప్పినా మళ్ళీ అదే మాట. అసలు ‘ఆడపిల్ల” అన్న మాట మన డిక్షనరీ లోంచి తీసేయాలి. “అమ్మాయి” అనండి, “కూతురు” అనండి. “ఆడపిల్ల” “ఆడది” అంటూ పుట్టిం దగ్గరనించి పరాయిగా చూసే ఆ పదం నా నిఘంటువులో ఉండదు. ఈ రోజు నుంచి నా కూతురుని ఎవరూ ‘ఆడపిల్ల” అంటే వప్పుకోను. అమ్మాయి అంటే “ఈడపిల్లె ” అనేట్టు పెంచుతాను నా కూతురిని.” పంతంగా పౌరుషంగా అంది.

          ‘మంచిదే తల్లీ, మీ బతుకులు మార్చి, ఆ మాటకి అర్ధం మారితే నా కంటే సంతోషించేవాళ్ళెవరుంటారు. కానీ చూద్దాం , కాలం ఏం నిర్ణయిస్తుందో . మా తరంలో మేం చెయ్యలేనిది మీరు చేసి చూపిస్తే మాకు మాత్రం సంతోషంగాదూ…..”మరీ మారని కాలంలో ఓ తండ్రిగా ఆయన ఇంకేం అనలేదు కూతురి నిశ్చయం నిర్ణయం అర్ధం అయి.

(ఇండియా టుడే)

*****

( సశేషం)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.