కాళిదాస్ కన్న నేల ఉజ్జయిని

-డా.కందేపి రాణి ప్రసాద్

          మేము మెడికల్ కాన్ఫరెన్స్ నిమిత్తం జనవరి 2014లో మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ కు వెళ్ళాము. అక్కడి సాయాజీ గ్రాండ్ హెూటల్ లో దిగాము. ఇండోర్ లో చాలా చిన్న ఎయిర్పోర్టు. దాని పేరు ‘దేవి అహల్యాబాయి హెూల్కర్ విమానాశ్రయం’. ఈ మాల్వా ప్రాంతమంతా హెూల్కర్ రాజ వంశస్థుల పాలనలో అభివృద్ధి చెందింది. ఇండోర్ తో మా కాన్షరెన్స్ అయాక చుట్టు ప్రక్కల ప్రాంతాలైన ఉజ్జయిని. ఓం కారేశ్వర్, మాండూ కోట, మహేశ్వర్ కోట చూడాలనుకున్నాం. ఇందులో ఉజ్జయినీ, ఓంకారేశ్వర్ లు రెండూ జ్యోతిర్లింగ క్షేత్రాలు, ఉజ్జయిని ఇండోర్ కి 55 కి.మి దూరంలో ఉన్నది. ఈ క్షేత్రం జ్యోతిర్లింగమే కాకుండా అష్టాదశ శక్తి పీఠాలలో ఇది ఒకటి. ఇక్కడ కొలువై ఉన్న శివుడిని మహాకాలేశ్వరుడనీ, పార్వతీ మాతను ‘హర సిద్ధి మాత’ అనీ పిలుస్తారు. దక్ష యజ్ఞంలో అవమానం పాలై అగ్నికి ఆహుతైన సతీదేవి శరీరాన్ని భుజంపై వేసుకొని శివుడు తాండవ మాడినపుడు ఆమె దేహం ముక్కలై 18 చోట్ల పడిపోయాయి. అవే శక్తిపీఠాలుగా అవతరిం చాయి. ఈ ఉజ్జయినిలో సతీదేవి పెదవులు పడిపోయినాయి. ఇక్కడ అమ్మవారు ‘హరసిద్ధి మాత’ గా కొలువై భక్తుల కోరికలు తీర్చుచున్నారు. మేము దర్శనం కోసం టిక్కెట్లు తీసుకునేటపుడు “బ్యాగులు లోపలికి తీసుకెళ్ళనివ్వరు. అక్కడి లాకర్లో పెట్టండి” అని చెప్పారు. సరేనని లాకర్ కౌంటర్ దగ్గర కెళ్ళి బ్యాగ్ పెట్టాలని చెప్పాము. అక్కడి కంప్యూటర్లో బ్యాగును, వ్యక్తినీ వీడియోలో చిత్రించి, మరల అదే ప్రింటవుట్ ను మనకు రిసిప్ట్ ఇస్తున్నారు. ‘ఏ మనిషి ఏ బ్యాగును పెట్టారు’ అన్న విషయం సులభంగా తెలిసి పోతుంది. ఈ సిస్టమ్ చాలా బాగుంది. నేను ఇంత వరకూ ఎక్కడా చూడలేదు. ఇది చాలా పెద్ద గుడి. లోపల్లోపలే చాలా వంకలు తిరిగాక పెద్ద హాలులా ఉన్నచోట శివలింగం ఉన్నది. చక్కగా గుండ్రంగా నున్నగా ఉన్నదీ శివలింగం. ఏ గుడిలోనైనా గర్భగుడి చిన్నగా ఇరుకుగా ఉన్నట్లుంటుంది. ఇక్కడ చక్కగా పెద్ద హాలులో ఎవరు ఎంతసేపు స్వామిని తనివి తీరా చూసినా అభ్యంతర పెట్టడం లేదు. ఈ విషయంలో మాత్రం మాకు చాలా ఆనందంగా ఉన్నది. అక్కడే మేము రుద్రాభిషేకం చేయించాము
 
          ఉజ్జయిని నగరంలోకి వెళ్ళబోయే ముందు పెద్ద శిలాతోరణం ఉన్నది. దాని మీద మహా మృత్యుంజయ ద్వారం అని వ్రాసి ఉన్నది. ఉజ్జయినిలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన గుడులు ఎన్నో ఉన్నాయి. అందుకే దీనిని “సిటీ ఆఫ్ టెంపుల్స్” అంటారు. మహా కాలేశ్వర ఆలయం, హరసిద్ధి మాతా ఆలయం, కాలభైరవ ఆలయం చాలా ముఖ్యమైనవి. మహాకాలేశ్వర ఆలయంలో వేకువ జామున జరిగే భస్మారతి చాలా అద్భుతంగా ఉంటుంది. దీనిలో పాల్గొనే భక్తులు ధోవతి, కండువా, చీర ధరించి మాత్రమే ఆలయ ప్రవేశం చేయాలి. గుడిలో నుదుటి నిండా గంధం పూసి ఇక్కడ వినాయకుడు, మన ఆంజనేయస్వామిలా నారింజ రంగులో ఉంటాడు. మహా కాలేశ్వర ఆలయం చుట్టూతా ఎన్నో శివలింగాలు ఉన్నాయి. గుడి ముందు ఫొటోగ్రాఫర్లు ఉండటంతో మేము ఫొటో తీయించుకున్నాము. ఇక్కడి శివలింగం దక్షిణం వైపుకు తిరిగి ఉంటుంది. అందుకే ఇక్కడి శివుడిని దక్షిణామూర్తి అంటారు. అలాగే పడమరవైపు వినాయకుడు, ఉత్తరాన పార్వతీదేవి, తూర్పున కార్తికేయుడి విగ్రహాలు ఉన్నాయి. ఈ దేవాలయం ‘క్షిప్రా’ నది ఒడ్డున ఉన్నది.
 
          మహాభారత కాలంలో అవంతీ రాజ్యం యొక్క రాజధాని ఉజ్జయినీ నగరం. పన్నెండు ఏళ్ళకోసారి జరిగే కుంభమేళాలు ఈ ఉజ్జయినీ నగరంలోనూ జరుగుతాయి. భారతదేశంలో కుంభమేళాలు జరిగే నాలుగు ప్రాంతాలలో ఉజ్జయిని కూడా ఒకటి. హరిద్వార్, నాసిక్, ప్రయాగ క్షేత్రాలు మిగతా మూడు. ఈ నాలుగు క్షేత్రాలలోనే కుంభ మేళాలు ఎందుకు జరుగుతాయంటే దీనికొక కథ ఉన్నది. దేవ దానవులు క్షీరసాగర మథనం జరిగినప్పుడు వెలువడిన అమృత భాండానికై తగువులు పడుతూ ఆ అమృత కలశాన్ని తీసుకొని పరుగెడుతుండగా ఆ భాండం ఒలికి నాలుగు చుక్కలు అమృతం ‘హరిద్వార్, ప్రయాగ, నాసిక్, ఉజ్జయినీ’ అనే నాలుగు ప్రదేశాలలో పడ్డాయట. అందుకే ఈ నాలుగు చోట్ల మాత్రమే కుంభమేళాలు జరుగుతాయి. బెనారస్, గయ, కంచి వంటి మత కేంద్రాలతో సమానస్థాయి కలిగినది ఉజ్జయిని కూడా. స్కంధ పురాణంలోని అవంతీ ఖండంలో మహాశక్తి యొక్క అనేక రూపాలతో ఇక్కడ లెక్కలేనన్ని ఆలయాలు నిర్మింప బడినట్లు తెలుస్తున్నది. క్షిప్రా నది ఒడ్డున మాండూ సుల్తానులు 1458లో ‘కాలిడే ప్యాలెస్’ను నిర్మించారు. దీనిని పిండారీలు నాశనం చేశాక గ్వాలియర్ రాజైన మాధవ రావు సింథియా మరల కట్టించాడు. ఈ ప్యాలెస్ పర్షియన్ ఆర్కిటెక్చర్ కు ఒక గొప్ప ఉదాహరణగా నిలిస్తుంది. సాందీపని మహర్షి దగ్గర శ్రీకృష్ణుడు, బలరాముడు సుధాము డితో కలసి విద్యాభ్యాసం చేసింది ఈ ఉజ్జయినీ నగరంలోనే. ఉజ్జయినీకి చాలా పురాతన మైన చరిత్ర ఉన్నది. ఇదంతా మాల్వా ప్రాంతం. ఈ ప్రాంతాన్ని మౌర్యులు, గుప్తులు పరిపాలించారు. వారి రాజరిక వైభవాన్ని, పతనాన్ని కూడా ఉజ్జయిని చూసింది. ఇక్కడి అధికార భాష హిందీ అయినప్పటికీ ప్రజలు ‘మాల్వీ’ కూడా మాట్లాడతారు. ఇక్కడ సుమారు 5 లక్షల మంది ప్రజలుంటారు.
 
          మహాకాలేశ్వర ఆలయం నుంచి వెలుపలికి వచ్చి హరసిద్ధిమాత ఆలయానికి వెళ్ళాం. ఇది అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి. ఇక్కడ అమ్మవారు చాలా సులభంగా దర్శన మిస్తారు. పూజారులు ఎవ్వరినీ విసుక్కోరు. ఎంతసేపు దణ్ణం పెట్టుకున్నా, ఎన్నిసార్లు దర్శనం చేసుకున్నా ఏమీ అనరు. ఇది చాలా ఆనందించవలసిన విషయం. ఈ గుడి ముందు రెండు ప్రమిదల గోపురాలు చాలా ఎత్తుగా ఉన్నాయి. గుడి అంత ఎత్తుగా ఉన్న ఈ గోపురాల చుట్టూ ప్రమిదలు ఉంటాయి. దాంట్లో నూనె పోసి వత్తులు వెలిగిస్తుంటారు భక్తులు. ఆ గోపురాలు నూనెతో జిడ్డుగా దీపాల మంటకు మసితో నల్లగా ఉంటాయి. ఇక్కడ ఒక విశేషం ఉన్నది. పూలు తీసుకువచ్చి దణ్ణం పెట్టుకొని ఒక్కో పువును పైకి విసిరేస్తున్నారు. మనం వేసిన పూవు గోపురానికి అతుక్కుంటే మనం మొక్కుకున్న పని జరుగుతుందట. చాలా గమ్మత్తుగా ఉందీవిషయం. పువ్వులు అతుక్కునే వరకు అందరూ విసురుతూనే ఉన్నారు. ఆ విషయం తెలుసుకొని మేమూ కొన్ని పూలు తెచ్చుకొని మనసులో కోరిక కోరుకుని పూలు విసిరేశాము. మా పూలు కూడా అతుక్కు న్నాయి కాబట్టి మా మనసులోని కోరిక కూడా తీరుతుందని సంతోషపడుతూ బయటకు వచ్చాం. ఇక్కడ గుళ్ళలో చెప్పులకు డబ్బులు వసూలు చేయకుండానే ఆలయం స్టాండ్లలో పెడతారు. ఉజ్జయినిలో జంతర్మంతర్ అనబడే వేదశాల ఉన్నది. ఇదొక అంతరిక్ష పరిశోధన కేంద్రం. భారతదేశంలోని అంతరిక్ష పరిశోధనాశాలల్లో ఉజ్జయిని మొట్టమొదటిది. గ్రహాల చలనాలను, కక్ష్యలను పరిశీలించడానికి ఈ వేదశాల ఉపయోగ పడుతుంది. ఈ ఉజ్జయినీ నగరం ఎందరో మహానుభావులను కన్నట్టి నేల. మేధావులైన బ్రహ్మగుప్తుడు, భాస్కరాచార్యుడు, ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన చంద్రగుప్తుడు 2, మరియు జగమెరిగిన మహాకవి కాళిదాసు ఈ ఉజ్జయినీ నగర పుత్రులే. ప్రపంచ వ్యాప్తంగా భారత దేశ ఖ్యాతిని ఇనుమడింపజేసిన మహాకవులలో కాళిదాసు ఒకడు. ఏమాత్రం అక్షర జ్ఞానం లేనివాడైనప్పటికీ కాళీమాత అనుగ్రహంతో మహాకవిగా మారినటువంటివాడు. ఈయన విద్యావతి అనే రాజకుమారిని పెళ్ళి చేసుకున్నాడు. భారతీయ సంస్కృత మహాకవి కాళిదాసు రచించిన ‘అభిజ్ఞాన శాకుంతలం’ ప్రపంచ ప్రఖ్యాతి పొందిన వాటిలో ఒకటి. యూరప్ కు చేరిన తొలి భారతీయ సాహిత్యం అభిజ్ఞాన శాకుంతలం. ఇంగ్లీషులోని అనువాదమైన మొదటి రచన ఇది. తర్వాత జర్మన్ భాషలోకి ఆ తర్వాత మిగతా ప్రపంచ భాషల్లోకీ అనువాదమైన ఇందులో శకుంతలా దుష్యంతుల కథ అత్యంత రమణీయంగా వర్ణించబడింది. రఘు వంశం, మేఘదూతం, విక్రమోర్వశీయం, కుమార సంభవం, రుతు సంహారం మొదలగునవి కాళిదాసు యొక్క అద్భుత రచనలు. కాళిదాసు క్రీ.శ 4వ శతాబ్దంలో ఉజ్జయినీ నగరంలో పుట్టినట్లు, 5వ శతాబ్దంలో మరణించినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. రుతు సంహారం, మేఘదూతం రెండూ కూడా ఖండ కావ్యాలు. ఇందులో రుతు సంహారంలో ఇద్దరు ప్రేమికులు ఆరు రుతువులలోనూ వారి ప్రేమ భావాలను వ్యక్త పరచుకునే విధానాన్ని చిత్రించారు. కుమార సంభవంలో పార్వతీదేవి జననం, బాల్యం పెరిగిపెద్దై పరమశివుడ్ని వివాహమాడటం వరకు కథనం ఉంటుంది. ఇంతటి మహాకవి జ్ఞాపకార్థంగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం, రాష్ట్ర సాంస్కృతిక శాఖ కలిసి “కాళిదాసు అకాడమి”ని 1978లో స్థాపించారు. ఈ అకాడమీలో కేవలం కాళిదాసు రచనలను పరిశోధించటమే కాకుండా అనేక మంది విద్యార్థులకు సాంప్రదాయ, సాంస్కృతిక, భాషా విద్యలను అందించవలెనని తలపెట్టారు. కాళిదాసు జీవిత చరిత్ర ఆధారంగా కన్నడం లో మహాకవి కాళిదాసు కవిరత్న కాళిదాసు అని రెండు సినిమాలు తీశారు. మొదటి సినిమాలో హెూనప్ప భాగవతార్, బి. సరోజాదేవి నటించగా రెండవ సినిమాలో రాజ్కుమార్, జయప్రద నటించారు. తమిళంలో కూడా ఆర్.ఆర్ చంద్రన్ ‘మహాకవి కాళిదాస్‘ అనే సినిమాను 1966లో తీశారు. అదే విధంగా తెలుగులోనూ 1960లో ‘మహాకవి కాళిదాసు’ పేరుతో వచ్చిన సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు నటించారు. ఈ సినిమాలో నటనకుగాను మధ్యప్రదేశ్ ప్రభుత్వం వారు ‘కాళిదాస్ సమ్మాన్’ పేరుతో అక్కినేనిని సత్కరించారు. బెంగాలీ కవి అయినటువంటి రవీంద్రనాథ్ టాగూరు కాళిదాసుతో పోలుస్తూ ‘కాళిదాస్ ఓ రవీంద్రనాథ్’ పేరుతో విష్ణుపాద భట్టాచార్య తులనాత్మక అధ్యయనం చేశారు. ఉజ్జయినిలో ఇలా కాళిదాసును మననం చేసుకున్నాం.ఉజ్జయినీ నగరంలో పూర్వకాలం నుంచే విద్యాలయాలున్నట్లు ప్రఖ్యాతి. భారతదేశంలో అత్యంత ప్రాధాన్యత వహించిన తక్షశిల, నలంద, కాశీ విద్యాలయాలతో పాటు ఉజ్జయినీ కూడా సమాన పేరు ప్రతిష్టలు కలిగినటువంటిది. ప్రాచీన కాలం నుంచే ఎంతో అభివృద్ధి సాధించిన ఉజ్జయినిలో ఇప్పుడు ‘నాలెడ్జ్ సిటీ’ ని ఏర్పాటు చేశారు. ఆధునిక విద్య, అభ్యాసము కొరకు 448 హెక్టార్ల భూమిలో నాలెడ్జ్ సిటీని నిర్మించేందుకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టింది. 2041 సంవత్సరం నాటికి ఈ కేంద్రం 50,000 మంది విద్యార్థు లతో, నాలుగు వేల మంది ఆచార్యులతో భాసిల్లనుంది. అత్యుత్తమ విద్యాకేంద్రంగా పూర్వ వైభవాన్ని ఉజ్జయిని త్వరలోనే చాటుకోనున్నది. ఇలాంటి ఉజ్జయినిని సందర్శిం చుకున్నందుకు మేమెంతో భాగ్యశాలులుగా భావిస్తున్నాము.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.