జీవితం అంచున -28 (యదార్థ గాథ)
(…Secondinnings never started)
-ఝాన్సీ కొప్పిశెట్టి
నా ప్లేస్మెంట్స్ నోటిఫికేషన్ వచ్చింది. మొదటి వారం AM షిఫ్టు, రెండో వారం PM షిఫ్టు వేసారు. AM షిఫ్టు ఉదయం ఆరుకి ప్రారంభమయి మధ్యాహ్నం రెండుకి ముగుస్తుంది. తరువాతి షిఫ్టు నర్సుకి హ్యాండోవర్ చేసేసరికి దాదాపు మూడవుతుంది. PM షిఫ్టు మధ్యాహ్నం రెండు నుండి రాత్రి పది వరకు. ట్రైనింగ్ అవుతున్న విద్యార్థులకు నైట్ షిఫ్టులు లేవు. ఈ ప్లేస్మెంట్స్ పూర్తయితే నా చేతికి నర్సింగ్ సర్టిఫికేట్ వస్తుంది.
నన్ను ఎస్టియా హెల్త్ సెంటర్లో వేశారు. నేను అదేదో ఆసుపత్రి అనుకున్నాను. కాని అది వృద్ధాశ్రమం. వృద్ధాశ్రమం అనగానే ముసలి ముక్క పక్కమీదే మగ్గిపోతూ, వాసన గొడుతూ ఎలా వుంటారో అని చాలా కంగారు పడ్డాను. పైగా మిస్ కేట్ వాసన తెలియ కుండా ముక్కు చివర విక్స్ అద్దుకుని వెళ్ళమని సలహా ఇచ్చింది. ఆశుద్దాన్ని Alzheimer’s తో రోజుకో కొత్త విషయాన్ని ఊహించుకుని ప్రతీ రోజు నన్ను ఇబ్బంది పెట్టే అమ్మ ఇవాళ ఏ అలికిడి లేకుండా మంచాన పడి వుంటే ఆ నిశ్శబ్దాన్ని భరించటం కష్టంగా వుంది…
వృద్దాప్యం ఎంత వేదనాభరితం కదూ…?
మనం భౌతికంగా వచ్చే మార్పులను జీర్ణించుకునే ప్రయాసలో వుండగానే, ఛాతి ఎక్స్రే లో ఏ మచ్చ బయట పడుతుందో… అల్ట్రా స్కాన్లో ఏ కంతి కాన వస్తుందో… ఏ జాయింట్ల మధ్య జిగురు లోపిస్తుందో… ఏ రక్త పరీక్షలో RH ఫ్యాక్టర్ రెట్టింపు అవుతుందో. కేరుమంటూ రోదిస్తూ జననం, నవ్వులు రువ్వే పసితనం, కల్మషం తెలియని బాల్యం, ఉవ్విళ్ళూరే యవ్వనం, జీవన సమరంలో ఎత్తుకి పై ఎత్తు వేస్తూ పోరాటం, అంచెలంచెలుగా ఎదిగే మేధా చాతుర్యం…
ఎన్నో యుద్దాలు గెలిచి, అన్ని అవాంతరాలు దాటుకుని, ఓటమిని జయించి, విజయ కేతనం ఎగరేసిన వారైనా సరే, చివరాఖరుకు వృద్దాప్యపు కోరల్లో చిక్కవలసిందే.
తన ఉనికినే విస్మరింప చేసే మతిమరుపుతో కూడిన వృద్దాప్యం మరీ వేదనా భరితం.
రోజింత దగ్గరయే మరణం.
ఒక చివరి రోజున సెలవు కోసమేనా అసలు ఈ వ్యధా పూరిత జన్మం..?
సరే… చేసెడి వాడు, చేయించెడి వాడు… కర్త, కర్మ, క్రియ అంతా చిద్విలాసుడే అనుకుందాం.
పుట్టుట గిట్టుట కొరకే.
ఒప్పుకోక తప్పదు.
అయితే ఈ జనన మరణాల మధ్య జీవనవేదన అర్థవంతమైతే సూత్రధారిని సమర్థించవచ్చు.
దారిద్ర్యంలో దైన్యం, విద్యార్జనలో బాధ, ఉద్యోగావసరాల తపన, కల్యాణంలో కష్టం, సంతానం కోసం పరితాపం, సంసారంలో దుఃఖం, అనారోగ్యంలో ఆవేదన, ఆప్త వియోగం, ఒంటరితనంలో వైరాగ్యం…. ఈ దుఃఖ సాగరాన్ని మానవ జీవన నౌక ఈదక తప్పదు. ఇదంతా struggle for the best existence లో అర్థవంతమైన వేదన.
మానవ జన్మలో అర్ధవంతమైన అంతర్భాగం.
ఈ అర్థవంతమైన వేదన కాకుండా అర్ధరహిత వేదన మరొకటి వుంది.
నేను మార్చ్ నెలలో నా నర్సింగ్ కోర్సులో భాగంగా ఒక వృద్ధాశ్రమానికి వెళ్ళాను. అక్కడ అది నా రెండో రోజనుకుంటా. ఇంకా నేను ఫైవ్ స్టార్ హోటల్ గదుల్లాంటి వృద్దుల గదుల, ఖరీదయిన వసతుల, ఆ గదుల ప్రత్యేక అలంకరణల తాదాత్మ్యం నుండి బయటపడలేదు. వున్నట్టుండి 200 నంబరు గదిలో నుండి పెద్ద పెట్టున శోకండాలు నన్ను కలవరపెట్టాయి. సాధారణంగా ఏ గదిలోకయినా బజర్ విని డిస్ప్లే అయిన నంబరు గదిలోకి వెళ్తాము కాని కర్ణభేరిని కదిలించిన శోకం నన్ను ఆ గదిలోకి కదిలించింది.
గులాబి వర్ణంలో వున్న ఓ డెబ్బయ్ ఏళ్ళ వృద్ధురాలి చంపలు, ముక్కు కన్నీటి రాపిడితో ఎర్ర మందారమైవున్నాయి. నా భర్త చనిపోయాడంటూ భోరునఏడుస్తూ పసిపిల్లలా నన్ను వాటేసుకొంది. నా వెన్ను జలదరించి ఒంటి మీద రోమాలన్ని నిక్క పొడుచుకున్నాయి.
‘ఎప్పుడు.. ఎలా పోయారు..’ అంటూఓదార్పుగా ఆమె వెన్ను నిమిరాను.
‘ఇవాళే…ఇప్పుడే… నేను ఆయనను చూడాలి….’ అంటూ వెక్కివెక్కి ఏడవసాగింది.
ఆమె దుఃఖానికి నా మనసు ద్రవించిపోయింది. ఎన్నో వసంతాలు తనతో పంచు కున్న పెనిమిటి అంతిమ దశలో తను అతని పక్కన లేకపోవటం నాకు దుఃఖాన్ని కలిగించింది. ఓల్డ్ ఏజ్ హోం నియమనిబంధనలు ఏమేని గాని ఆమెకు నేను తన భర్త ఆఖరి చూపు దక్కించాలని నిర్ణయించుకున్నాను.
నేను ఆమెను తన ఇంటికి, ఆమె భర్త దగ్గరకు తీసుకువెళ్తానని వాగ్దానం చేసి గుండె చిక్క బట్టుకుని రిసెప్షన్లో వున్న RN దగ్గరకు వెళ్ళి ఎంతో బాధగా విషయం చెప్పాను.
ఆ నర్సు నా మొహంకేసి ఓ సారి తేరిపార చూసి ‘ఆమె డెమెన్షియాతో బాధ పడుతోంది’ అంది.
‘అయితే కావచ్చు.. ఆమె భర్త పోయారట’ అన్నాను నేను.
‘అతను క్యాన్సర్ పేషెంట్…202 లో వున్నాడు’ అంది.
షాకు నుండి తేరుకున్న నేను ‘మరి ఇద్దరినీ ఒకే గదిలో వుంచొచ్చు కదా… ఆమెకు ఆ భ్రమలు, ఆ వేదన లేకుండా’ అన్నాను.
‘అతనికి కీమోట్రీట్మెంట్ జరుగుతోంది. పూర్తి విశ్రాంతి అవసరం. ఆమె అతనిని అసలు కనురెప్ప వాల్చనీయదు’ అంది.
నా దుఃఖం రెండింతలయ్యింది.
‘అయినా ఒక్కోసారి అందరి కళ్ళు కప్పి అతని రూములోకి జొరబడుతుంది. తెలిసిన వెంటనే బలాత్కారంగా ఆమెను తన గదిలోకి తీసుకు వస్తాము’ అంది.
ఆమె భర్త పోయాడనుకోవటం అబద్దం. అయినా ఆమె పడే వేదన నిజం కదా…
అలాంటి వేదనతోనే ఇప్పుడు నిత్యం నా మనసు తడిసి ముద్దవుతోంది.
నిన్న దుఖవదనంతో, కంటికిమింటికి ఏకధాటిగా ఏడుస్తూ, దీనాతి దీనంగా చేతులు జోడించి నా పదేళ్ల మనుమరాలు ఆన్యని అమ్మ ప్రాధేయపడుతోంది.
“నీకు పుణ్యం వుంటుందే… నా డబ్బులు నాకు ఇచ్చేయవే… దొంగతనం మంచి అలవాటు కాదే. నీకు స్కూల్లో ఇదే నేర్పారా.. ఇలా ముసలిదాన్ని ఏడిపిస్తే ఆ దేముడు నిన్ను క్షమించడే.. ఆ కాస్త డబ్బు దగ్గర వుంటే ఆకలి వేసినప్పుడు నేను పకోడీలు కొనుక్కుంటానే…”
అమ్మ మాటలకు గుండె చెరువై పోతుంది.
లేని డబ్బును ఆన్య తస్కరించటం. అందుకు ఆమె రోదించటం.
ఊహ అబద్దం. కాని దుఃఖం మాత్రం నిజం.
డబ్బు పోయిందని ఏడ్చి ఏడ్చి వాచి ఎర్రబారినకళ్ళే సాక్ష్యం.
అసలు దేనితోనూ compensate చేయలేని దుఃఖం.
అమ్మ దుఃఖానికి పిల్లా పెద్దల గుండెలవిసి పోతున్నాయి…
ఇరవై నాలుగు గంటల ప్రతిరోజూ ఎన్నెన్ని కల్పనలో… ఎంతెంత వేదనో.
తనదైన ఊహాలోకంలో ఆ చిన్ని ప్రాణానికి అన్నీ కల్పిత సమస్యలే కదా.
పరిష్కారం లేని వేదన.
Is this suffering inevitable..?
Now my weakened heart is getting immuned to her suffering…
*****
(సశేషం)