దేవి చౌధురాణి

(మొదటి భాగం)

మూలం – బంకిమ చంద్ర ఛటోపాధ్యాయ

తెనుగు సేత – విద్యార్థి

          భవానీ పాఠక్ ప్రఫుల్లతోనీ ఐదు సంవత్సారాల శిక్షణ పూర్తి అయ్యింది. ఇప్పుడు నీ ధనం తీసుకుని నీ ఇష్టం వచ్చినట్లు వాడుకోవచ్చు, నేనేమీ అడ్డు చెప్పను. నేను ఒక మార్గదర్శకుడిని మాత్రమే. నేను చూపిన మార్గం నీకు సమ్మతం అవవచ్చు, కాక పోవచ్చు. అది నీ ఇష్టం. ఇప్పటి నుంచీ నీ అన్నవసతులూ కట్టుబట్టలూ నీ బాధ్యతే. ఇప్పుడు నువ్వు మార్గం ఎంచుకుంటావో నీ ఇష్టంఅన్నాడు.

          “నేను కర్మయోగం ఎంచుకుంటున్నాను; జ్ఞానయోగం నా విధానం కాదుబదులు ఇచ్చింది ప్రఫుల్ల.

          “మంచిది. బాగా ఎంచుకున్నావు. కానీ, నిష్కామకర్మ ఉండాలి. నిష్కామము అంటే నీకు తెలుసా? ఇందులోని మొదటి నియమము ఇంద్రియ నిగ్రహణము, ఇది నీకు నేను గత ఐదు సంవత్సరాలుగా అభ్యాస పరిచాను. రెండవది నిరహంకారం, ఇది లేక ధర్మాచరణ జరగదు. జ్ఞానం  కూడా అహంకారానికి హేతువు అవుతుంది. నువ్వు పని చేసినా, నీ గుణగణాల వలనే చెయ్యగలిగానని అనుకోవద్దు. మూడవది నీ కర్మ ఫలాన్ని కృష్ణపర్మాత్మకు అర్పించు. కర్మ ఫలితము మీద అనాసక్తత వుండాలి. మాతా, ఇప్పుడు చెప్పు, ధనరాశిని ఏమి చెయ్యదలుచుకున్నావో?”

          “నేను ఎప్పుడైతే నా కర్మ ఫలాన్ని కృష్ణార్పణ చేయటానికి నిర్ణయించుకున్నానో, అప్పుడే నేను ధనాన్ని కూడా కృష్ణార్పణం చెయ్యటానికి  నిశ్చయించుకున్నాను.” 

          “మొత్తానికి మొత్తం?”

          “సందేహమా?”

          “కానీ, అలా మొత్తం ఇచ్చివేసినంత మాత్రాన నిష్కామకర్మ జరగదు, కర్మ నీతోనే వుండిపోతుంది. ఆఖరికి నువ్వు అన్నపానాల కోసం భిక్షాటన చేసినా కర్మ ఫలితం నీ వరకే చేరుతుంది. భిక్షాటన మీదనే నీకు ఆసక్తి పెరుగుతుంది. అందు వలన, నువ్వు ధనములో కొంత భాగాన్ని నీ అవసరానికి వినియోగించుకో. మిగిలిన ధనం కృష్ణార్పణం అనుకో. అలా చేసినా, ఫలితం కృష్ణుని పాదారవిందాలకు ఎలా చేరుతుందో అని ఆలోచించావా?”

          “ఆయన సర్వభూతాలలో ఉపస్థితుడు కదా, నేను సర్వభూత శ్రేయస్సుకూ వితరణ చేస్తాను.”

          “సరే, భగవంతుడు చెప్పినది ఇదేనా? వితరణ చేసినప్పుడు అది ధార్మికమైన రీతిలో వినియోగపడాలి. అది చాలా శ్రమతో కూడిన పని. శ్రమ నువ్వు పడగలవా?”

          “నేను ఇంతవరకు మీ శిక్షణలో నేర్చుకున్నదేమిటి?”

          “నేను శరీర కష్టాలు గురించి చెప్పటంలేదు. ఒక దుకాణాదారుడివలె కొన్ని విషయాలలో లాభనష్టాల గురించి బేరీజు వెయ్యాలి  కూడా. ఒకొక్కసారి కొంత దర్పాన్ని కూడా ప్రదర్శించవలసి వుంటుంది. అది కూడా కష్టంతో కూడుకున్నదే. చెయ్యగలవా మరి?”

          “అది ఎటువంటిది?”

          “నేను బందిపోటునని ఇంతకు ముందే చెప్పాను, గుర్తుంది కదా!”

          “ ధనంలో నుండి మీరు కూడా కొంత భాగాన్ని తీసుకోండి. దోపిడీలు మాని వేయండి.”

          “నా దగ్గర చాలానే ధనం వున్నది. నేను ధనం కోసమే దోపిడీలు చెయ్యటంలేదు.”

          “మరి దేనికోసం దోపిడీలు?”

          “నేను ఒక రాజ్యాన్ని పాలిస్తున్నాను.”

          “బందిపోటు రాజ్యమా?”

          “రాజదండము ఎవరి చేతిలో ఉంటే వారిదే రాజ్యం.”

          “రాజదండము రాజుల చేతిలోనే ఉంటుంది కదా!”

          “ దేశంలో ఇప్పుడు రాజులెవ్వరూ లేరు. ముస్లింల రాచరికం ముగిసింది. ఇంగ్లీషువాళ్లు ఇప్పుడే వచ్చారు. నేను ఇక్కడ రాజును అయ్యి దుష్టశిక్షణ శిష్టరక్షణా చేస్తున్నాను.”

          “అదేమిటి? బందిపోటు దోపిడీలతోనే రాజ్యపాలన చేస్తున్నారా?”

          “విను చెబుతాను” అని భవానీ పాఠక్ దేశ దుర్దశను, జమీందారుల అత్యాచారాలని వివరించాడు. “జమీందారులు సామాన్యులను దోపిడీ చేస్తున్నారు, పిల్లలని కాళ్లు పట్టుకుని ఈడ్చుకుపోతున్నారు, యువకుల ఛాతీ మీద తంతున్నారు, ముసలివాళ్లని చంపుతున్నారు. యువతులని కచ్చేరీలకి పట్టుకుపోయి వివశ్త్రలని చేసి నగ్నంగా నిలబెడుతున్నారు, కొడుతున్నారు, స్తనాలని కోస్తున్నారు, ఎన్నో అవమానాలకి గురి చేస్తున్నారు. నేను దురాత్ములని దండిస్తున్నాను. అనాధులని దుర్బలులని రక్షిస్తున్నాను. నువ్వు రెండు రోజులు నాతో వుంటే నీకే విషయం బోధపడుతుంది.” 

          ఇది విని ప్రఫుల్ల మనసు భారమయ్యింది. “నేను కూడా మీ మార్గన్నే నడుస్తాను. నా ధనములో కొంత భాగాన్ని దుర్భాగ్యుల శ్రేయస్సుకు వినియోగిస్తాను.”

          “నేను చెప్పేది ఏమిటంటే, నువ్వు నా మార్గాన్ని ఎంచుకుని నాతో రావటం గురించి ఒకసారి జాగ్రత్తగా ఆలోచించుకో. సన్యాసినిగా వస్తే కుదరదు.”

          “నేను కర్మ ఫలితాన్ని కృష్ణార్పణం చేస్తున్నాను. ఆయన నిర్ణయించిన కర్మకు పూర్తిగా అంకితమై వున్నాను.”

          భవానీ పాఠక్ కోరిక పూర్తి అయ్యింది. ఆయన మళ్లీ బందిపోటు వ్యవహారం మీద నిమగ్నమయ్యాడు, ప్రఫుల్ల తన ధన రాసులతో ఆయన వెంట నడిచింది. నిశి కూడా ప్రఫుల్లతోనే బయలుదేరింది.

          భవాని పాఠక్ ఐదు సంవత్సరాలు కష్టపడి ప్రఫుల్లని ఒక తీక్షణమైన శస్త్రముగా మలిచాడు. ఎవరైనా పురుషుడిని మలుచుకుందామనుకున్నాడు. కానీ ప్రఫుల్ల వంటి గుణగాణలు వున్న వ్యక్తి అతనికి అంతకు ముందు దొరకలేదు. విధి నిర్ణయాలు కూడా తీక్షణమైనవే

          భవానీ పాఠక్‌కు అన్ని విషయాలను సూక్ష్మదృష్టితో చూడగలిగిన వాడే. కానీ ఒక విషయాన్ని మాత్రం గమనించి విశ్లేషించుకోలేకపోయాడు. ప్రఫుల్ల ఏకాదశి రోజున చేపలు తప్పని సరిగా ఎందుకు తింటుందా అని!

*****

(సశేషం)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.