నడక దారిలో-52

-శీలా సుభద్రా దేవి

జరిగిన కథ:-
       (తండ్రి మరణానంతరం ఆర్థిక సంక్షోభంలోనే డిగ్రీ చదువుతో బాటు సాహిత్యం , సంగీతం బాపూ బొమ్మలు చూసి వేయటం. శీలా వీర్రాజుతో కలంస్నేహం ,రోణంకి అప్పలస్వామి గారి అధ్వర్యంలో సభావివాహం.మా జీవితంలో పల్లవి చేరింది.తర్వాత రెండో పాప, బాబు అనారోగ్యంతో చనిపోయారు. వీర్రాజు గారు స్నేహితునితో కలిసి అడ్వర్టైజ్ ఏజెన్సీ పెట్టటం, నేను ఆర్టీసి హైస్కూల్ లో చేరాను. వీర్రాజుగారు స్వచ్ఛంద విరమణ చేసారు.కొంత అనారోగ్యం .విజయవంతంగా ఎమ్మెస్సీ పూర్తిచేసాను.అమ్మ చనిపోవటం,పల్లవి వివాహం,నాకు హిస్టెరెక్టమీ ఆపరేషన్ జరగటం, పల్లవికి పాప జన్మించటం, మా అమెరికా ప్రయాణం,నా ప్రమోషన్ ప్రహసనం.పాప రెండవ పుట్టినరోజు వేడుక , కొత్త ఇంటి గృహప్రవేశం వరుసగా జరిగాయి. తిరిగివెళ్ళిన రెండు నెలలకే అజయ్ చనిపోవడంతో ఆషీని తీసుకుని పల్లవి వచ్చేసింది.అజయ్ కి ఇంతకుముందు ఆపరేషన్, మ పదేళ్ళే బతుకుతాడని చెప్పకుండా మోసం చేసారు. ఒంటరితల్లిగా తిరిగి వచ్చిన పల్లవి ఉద్యోగంలో చేరింది.నేను హెచ్చెమ్ గా అనుభవాలు, పదవీ విరమణ, పెద్దక్క మరణం . తర్వాత—)

***

 
          హైదరాబాద్ నగరంలోనే కాదు దేశమంతటినీ ఉలికి పడేలా చేసిన జంట పేలుళ్ళ సంఘటనలు 2007 ఆగష్టు 25 న జరిగాయి.
         
          కోఠి ప్రాంతంలో మూడు దశాబ్దాలుగా పేరున్న గోకుల్ చాట్ షాపులో సాయంత్రం పూట విపరీతమైన జనం కూడి వుంటారు. అక్కడి చాట్, పానీపూరీ వంటి వాటికి చాలా డిమాండ్ వుంది. అటువంటి చోట సాయంత్రం 7:40 ప్రాంతంలో బాగా రద్దీగా ఉన్న సమయంలో గోకుల్ చాట్ సెంటరులో బాంబు పేలింది. పదిమందికి పైనే అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మరో 23 మందికి పైగా ఆసుపత్రుల్లో మరణించారు. 50 మందికిపైగా గాయపడ్డారు. మా మారింది కూతురు క్లాస్ మేట్ ఎమ్మెస్ కోసం యూఎస్ వెళ్ళటానికి సిద్ధపడుతూ స్నేహితులతో గోకుల్ చాట్ కి వెళ్ళి గాయపడి పద్దెనిమిది యేళ్ళు దాటినా ఇప్పటికీ వీల్ చైర్ కే అంకితమై శారిరకంగానే కాదు మానసికంగా కూడా వైకల్యంతో వున్నాడు. మానవత్వంలేని రాక్షసులు జనసమ్మర్థ ప్రాంతాలలో ఈ విధంగా చేయటం వలన ఎంతమందికి కడుపు కోత అయిందో కదా‌
 
          అదే సమయంలో సచివాలయానికి ఎదురుగా ఉన్న లుంబినీ పార్కులో బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో మొత్తం 44 మంది ప్రాణాలు కోల్పోగా వందలాది మంది తీవ్రంగా గాయపడ్డారు. బాంబుల్లో  ఇనుప ముక్కలు వుపయోగించటం వలనే  చాలామంది శరీర అవయవాలు కోల్పోయారని  తెలిసింది. ఈ సంఘటనలతో ఒక్క సారిగా నగరం భయం గుప్పిట్లోకి వెళ్ళిపోయింది. తలచుకున్నప్పుడల్లా గుండె భారమై పోతుంది.
 
          పల్లవి సాధారణంగా అదేసమయంలో  ఇల్లు చేరేది. హైటెక్ సిటీలో బస్సెక్కి లక్డికాపూల్ లో దిగి వనస్థలిపురం బస్ ఎక్కుతుంది. ఇలా ఇంటికి రాగానే ఈ పేలుళ్ళ ఘటన టీవీలో చూసి హమ్మయ్య పిల్ల ఇంటికి చేరిందని వూపిరి తీసుకున్నాం.
 
          మా ఇంట్లో ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది వరకూ రేడియోలోంచి గానీ టేప్ రికార్డర్ లోంచి గానీ పాటలు ఇల్లంతా వ్యాపిస్తూనే వుంటాయి. స్వర్ణకమలం, తాల్ పాటలే కాకుండా ఒక చిన్నపిల్లల ఇంగ్లీష్ పాటలు కేసట్ కూడా వేస్తూ వుంటాం. అవి వేసినప్పుడు ఆషి భలే బాగా ఆపకుండా కేసెట్ పూర్తి అయ్యేవరకూ చక్కగా రిథంకి తగినట్లుగా డాన్స్ చేసేది.
 
          నాకు సరేసరి పల్లవికి కూడా క్లాసికల్ డాన్స్ నేర్పించలేక పోయాము. పల్లవి చదివే స్కూల్ లో కో కరిక్యులర్ యాక్టివిటీ క్రింద డాన్స్ క్లాస్ కూడా వుండేది. పల్లవి భరత నాట్యం తీసుకుందామనుకుంటే అందులో ఎక్కువమంది వున్నారని కథక్ లో చేర్చారు. అదికూడా పల్లవి బాగానే నేర్చుకుంది. పదో తరగతి అయ్యాక వదిలేసింది.
 
          ఆషీ బాగా చేస్తుంది కదా నేర్పించుతే బాగుండును అనుకున్నాను. పల్లవి ఉదయం ఎనిమిదిన్నరకి హైటెక్ సిటీ వుద్యోగానికి వెళ్తే తిరిగి వచ్చేసరికి ఏడో ఎనిమిదో  అయ్యేది. అందుచేత నాకూ ఆషీకీ దోస్తానీ పెరిగింది. సూపర్ బజార్ వెళ్ళాలన్నా, కూరలకైనా మేమిద్దరమే. వెళ్ళినప్పుడల్లా నన్ను కబుర్లతో మెప్పించి తనకు కావలసిన రకరకాల పెన్నులు, రకరకాల సెంట్ రబ్బర్లూ కొనిపించుకునేది.
 
          ఒక రోజు మోర్ సూపర్ బజార్ వెళ్ళి వస్తుంటే ఎల్.ఐ.సి కాలనీ పార్కులో పిల్లలు డాన్స్ చేస్తుండటం చూసి ఆషీని డాన్స్ నేర్చుకుంటావా అని అడిగాను.నేర్చుకుంటాను అనేసరికి  పార్క్ లోకి వెళ్ళాను.
 
          పదిమంది వరకు అన్ని వయసుల పిల్లలకూ ఒక అమ్మాయి డాన్స్ నేర్పుతోంది. ఆషీని చూపించి డాన్స్ లో చేర్చాలనుకుంటున్నట్లు చెప్పాను. వారానికి మూడురోజులు క్లాసులు ఉంటాయనీ తెల్లని పంజాబీ డ్రెస్ వేసుకొని రావాలని చెప్పింది.
 
          సరే నని  మర్నాటి సాయంత్రానికి నేను ఇంట్లో వున్న క్లాత్ తో తెల్ల పంజాబీ డ్రెస్ కుట్టేసి రెడీ చేసాను. ఆషీ స్కూల్ నుంచి రాగానే కొత్త డ్రెస్ వేసుకొని తనకోసం తయారు చేసిన అప్పచ్చులు తిని పాలు తాగిన తర్వాత అయిదు గంటలకు పార్కులో  డాన్స్ క్లాస్ కి తీసుకు వెళ్ళాను. దారిపొడవునా హుషారుగా కబుర్లు చెప్తూ నడిచింది.
 
          డాన్స్ టీచర్ తీసుకువచ్చిన పండుతాంబూలం తీసుకుని ముందు చేయాల్సిన వందనం నేర్పింది. తర్వాత హస్తముద్రలూ లాంటి వేవో నేర్పింది. ద్వితీయవిఘ్నం వుండొద్దు రేపు కూడా తీసుకుని రమ్మంది.
 
          మర్నాడు కూడా తీసుకు వెళ్ళాను. డాన్స్ పాఠం అయ్యేవరకూ అక్కడే వుండి తిరిగి రోజూ ఇంటికి వస్తున్నాము‌. ఒక నెల రోజుల పాటూ ఆసక్తి తో ఆషీ క్లాసు ఇష్టపడింది. ఆ డాన్స్ టీచరు పాఠం కన్నా రోజూ ఎవరినో ఒకరిని తిట్టటం ఎక్కువ. దాంతో ఆషీ డాన్స్ క్లాస్ కి బయలు దేరిన దగ్గర నుండి ఇంటికి తిరిగి వచ్చే వరకూ స్వర్ణకమలంలో భాను ప్రియలా ముఖంలో “ఎందుకొచ్చిన డాన్స్ రా బాబూ ” అన్నట్లు ఎక్స్ ప్రెషన్స్ పెట్టేది. అప్పటికీ దారిపొడవునా నేను కబుర్లు చెప్తున్నా మూడీగా వుండేది. కావాలని క్లాస్ లో తప్పులుగా చేసేది.
 
          డాన్స్ క్లాస్ మానేస్తావా అని అడిగితే వెళ్తాననే అనేది. అంతలో వినాయకచవితి దగ్గర పడింది. డాన్స్ టీచర్ ” మీకు గణపతి మీద ఒక డాన్స్ నేర్పిస్తాను. గణపతి మంటపంలో చేయిస్తాను.” అని పిల్లలను అందరినీ ఒక ఆర్డర్ లో నిలబెట్టి పాట తన టేబ్ లో ఆన్ చేసింది. ఎలా చేయాలో నేర్పటం మొదలెట్టింది.
 
          “ఏకదంతాయ వక్రతుండాయ ….” అంటూ మొదలైన శంకర్ మహదేవన్ పాట, ఆ రాగమాధుర్యం అప్పటి నుండి ఇప్పటికీ విన్నప్పుడల్లా వెంటాడుతునే వుంటుంది. అంత గొప్పగా వుంటుందా పాట.
 
          సరే మళ్ళా డాన్స్ కి వద్దాం. ఒక బొద్దుగా వున్న అమ్మాయిని గణపతిగా ఎంపిక చేసింది. ఆ పిల్ల మర్నాటి నుంచి రావటం మానేసింది. ఈ డాన్స్ కూడా ఆషీ ఆసక్తిగా చేయటం లేదనిపించింది.
 
          ఆ ప్రోగ్రాం ఎక్కడో అర్థరాత్రి జరుగుతుందంటే మా పాప అంత దూరం రాలేదని చెప్పేసాను.
 
          ఆ తర్వాత నెలరోజులన్నా తిరగలేదు.కెనడాలో వున్న భర్త దగ్గరకు వెళ్ళటానికి వీసా వచ్చిందని ఆ అమ్మాయి డాన్స్ పాఠాలకు మంగళం చెప్పేసింది.
 
          మా ఆషీకి డాన్స్ పాఠాలు తప్పిపోయాయి. ఇప్పటికీ స్వర్ణకమలం సినీమా చూస్తే డాన్స్ క్లాసులోని ఆషీ ముఖం గుర్తువచ్చి నవ్వుకుంటాం.
 
          నేను,మా క్రింద ఇంటిలోని సరోజిని గారూ కలసి రోజూ మా యింటికి దగ్గరలోని పార్క్ లో వాకింగ్ కి వెళ్తాం. ఆషీ కూడా మాతో వచ్చి అక్కడే ఆడుకుంటుంది. పార్కు ఎదురుగా ఒక ఇంట్లో అమ్మాయి కీబోర్డు నేర్పుతుంది తెలిసి ఆషీని నేర్చుకుంటావా అని అడిగి అక్కడ చేర్చాను.
 
          ఆ అమ్మాయి సినీ గాయకుడు హేమచంద్ర బంధువట. పాడుతా తీయగాలో పాల్గొన్నానని చెప్పింది. ఆషీ కోసం కీ బోర్డు పల్లవి కొన్నది. వారానికి మూడు రోజులు ఆషీని వాళ్ళింట్లో దింపి నేను నా వాకింగ్ పూర్తిచేసుకుని తిరిగి ఇంటికి తీసుకు వచ్చే దాన్ని.
 
          కీబోర్డు చాలా ఆసక్తిగా ఆషీ నేర్చుకుంది. సరళీస్వరాలు, జంట స్వరాలు, పిళ్ళారి గీతాలేకాక జనగణమన,హేపీ బర్త్ డే పాట కూడా చక్కగా వాయించటం నేర్చుకుంది. బాగా వాయించటం చూసి పల్లవి సినిమా పాటలకు కీబోర్డ్ నొటేషన్లు ఎవరి దగ్గరో డౌన్ లోడ్ చేసి తీసుకు వస్తే అందులోంచి ‘ చిన్నిచిన్ని ఆశ ‘ కూడా నేర్చుకుంది.
 
          ఆషీ కీబోర్డు నేర్చుకుంటుందని తెలిసి కృష్ణారెడ్డిగారు కూడా తన పిల్లలిద్దరికీ కీ బోర్డు కొని క్లాస్ లో చేర్పించారు.
 
          ఆషీ ఆసక్తిగా నేర్చుకుంటుందని సంతోషించేలోగానే కొన్ని నెలలు గడిచాక ఆషీ కీబోర్డు నేర్పించే టీచరు భర్తని సాఫ్ట్వేర్ ఉద్యోగం ద్వారా కంపెనీ వాళ్ళు అమెరికాకి  పంపుతున్నారట. అతనితో పాటు ఆమె కూడా వెళ్తున్నానని చెప్పటంతో ఆషి సంగీత పాఠాలకీ మంగళం పాడేయాల్సి వచ్చింది.
 
          కానీ తర్వాత కూడా ఆషీ చాలాకాలం కీ బోర్డు ప్రాక్టీస్ చేస్తూనే వుండేది.
 
          మొత్తం మీద ఆషీకి సంగీతం, డాన్స్ నేర్పించాలన్న నా కోరిక మొదట్లోనే గండి కొట్టింది. కానీ పుస్తకం పఠనాభిరుచి మాత్రం రోజురోజుకూ, ఏడాదిఏడాదికీ పెరిగింది. అది సంతోషం.
 
          ఇంకా చదవటం రాక ముందు నిద్రపుచ్చే సమయంలో తప్పని సరిగా నేనో, పల్లవో కథలు చెప్పేవాళ్ళం. ఒకొక్కప్పుడు మేము కథ చదువుతూ చెప్పేవాళ్ళం. చదవటం వచ్చాక ఆషీ చేతే చదివించి వివరించే వాళ్ళం. ఆ అలవాటు ఆషీ నేటికీ మానలేదు. పరీక్షల సమయంలో కూడా తానే ఒకటో రెండో కథలు చదివి నిద్రకి ఉపక్రమించటం ఆషీకి అలవాటైపోయింది. తెలుగు పుస్తకాలు తక్కువే కానీ ఇంగ్లీషులో మాత్రం పెద్దపెద్ద పుస్తకాలు చదివేస్తూవుంటుంది. తన ఫోన్ లో కూడా కొన్ని పుస్తకాలు డౌన్లోడ్ చేసి పెట్టు కుంటుంది. అయితే ఆ వయసు పిల్లలు చదివే రొమాంటిక్ నవలలు కాకుండా కాన్స్పిరసీ నవలలు, చారిత్రక నవలలూ,బయోగ్రఫీలు అటువంటి పుస్తకాలే చదువుతుంది. ఏమైతేనేం పుస్తకాలు చదివే అలవాటు మంచిదే.
 
          ఒకరోజు వార్తాపత్రికలో గుజరాత్ లోని ఆనందనగరం అనే వూరికి పిల్లలు లేని విదేశీ దంపతులు క్యూ కడుతున్నారనీ, సరోగసీ పద్ధతిలో పేద మహిళలను ధనాన్ని ఆశ చూపి ఒప్పిస్తున్నారనే కథనాన్ని చదివి ఒక రాత్రంతా నిద్రపట్టలేదు. అంతకు ముందు పాలమూరు కార్మికులు మధ్యదళారీలను నమ్ముకొని అరబ్ దేశాలకు వెళ్ళి పడరాని కష్టాలు పడుతున్నారనే వార్త చదివి ఎలా అయినా వీరిమీద కథ రాయాలనుకున్నాను. కానీ వివరాలు సేకరించ లేక మానేసాను. ఇప్పుడు అద్దెకు గర్భం విషయం చదివిన తర్వాత ఈ రెండింటినీ కలిపి రాయాలనే ఆలోచన వచ్చి “గోవు మాలచ్చిమి ” కథ రాసాను.
 
          అప్పడే అనుకోకుండా బ్రౌన్ అకాడమి నవ్య వార పత్రికతో కలిసి నిర్వహిస్తున్న కథలపోటీ ప్రకటన చూసి పోటీకి కథ పంపించాను. ప్రత్యేక బహుమతి వచ్చింది.
ఈ కథ నవ్య వార పత్రికలో ప్రచురితం అయినప్పుడు చాలా మంచి స్పందన నాకు వచ్చింది. ప్రముఖ రచయిత విహారి గారు ప్రతీ సమావేశంలోనూ ఈ కథ గురించి ప్రస్తావిస్తూ ఈ  ఏడాది మేటికథ అని ప్రశంసించేవారు.
 
          బ్రౌన్ అకాడమివారు బహుమతికి ఎంపికైన కథలన్నీ కలిపి “బహుమతి కథలు” పేరిట పుస్తకంగా ప్రచురించారు . కేంద్ర సాహిత్య అకాడమీ వారికి  పి.సత్యవతి గారు తన సంపాదకత్వంలో కూర్చిన ఆంగ్లానువాద కథల సంకలనంలో పాపూరి జయలక్ష్మిగారు చేసిన నా గోవు మాలచ్చిమి కథ ఆంగ్లానువాదం కూడా చేర్చారు.
 
          నా మొదటి కథలసంపుటి 1990 లో వచ్చింది. పద్ధెనిమిదేళ్ళ తర్వాత రాసిన కథలన్నీ కలిపి నా రెండవ కథల్ని ఆషీ క్రయాన్స్ తో వేసిన చిత్రాన్ని ముఖచిత్రంగా వేసుకుని కొత్తకథాసంపుటిని రెక్కల చూపు పేరుతో ప్రచురించాము. కానేటి మధుసూదన్ గారూ , జి.ఎస్.చలం గారూ ఈ పుస్తకావిష్కరణ విజయనగరంలో గానీ, వైజాగ్ లో గానీ పెడతామని అన్నారు. నేను సాధారణంగా ఆవిష్కరణ సభలు పెట్టుకోను. కాని పుట్టిన ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఆవిష్కరణ జరగటం ఒక అనుభూతి కదా.
 
          పెద్దక్కయ్య సంవత్సరీకాలకి ఎలాగూ వెళ్తాం కనుక అప్పుడు ఏర్పాటు చేయమని వీర్రాజు గారు వాళ్ళతో చెప్పారు.
 
          అదేవిధంగా మేము వైజాగ్ రాగానే యూనివర్సిటీ కేంపస్ లోనే రూం కేటాయిం చారు. ఉత్తరాంధ్ర రచయితలు వచ్చి అక్కడ కలిసారు.
 
          ఆ సాయంత్రం  వైజాగ్ లో ఆంధ్రా విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో తెలుగు శాఖాధిపతి సత్యనారాయణగారి అధ్యక్షతన, తెలుగు ప్రొఫెసర్ డా.సజ్జా మోహనరావు గారు నా “రెక్కల చూపు” కథా సంపుటి ఆవిష్కరణ జరిగింది. వి.ప్రతిమ నా పుస్తకాన్ని పరిచయం చేసింది. ఆవిష్కరణ అద్భుతంగా జరిగింది.
 
          ఆ మర్నాడు వీర్రాజు గారి బాల్యమిత్రుడి ఇంటికి వెళ్ళి సాయంత్రానికి విజయనగరం వెళ్ళిపోయాం. సంవత్సరీకాల కార్యక్రమం అయ్యాక  హైదరాబాద్ కి తిరుగు ప్రయాణం కట్టాము.
 
          లేఖిని రచయిత్రుల సంస్థ అధ్యక్షురాలు వాసా ప్రభావతి తెలుగు భాషా సాంస్కృతిక శాఖ కె.వి.రమణాచారి గారి సహకారంతో ఒక రోజు సదస్సు నిర్వహణ తలపెట్టారు. రాష్ట్రేతర రచయిత్రుల్ని కూడా ఆహ్వానించి, వయోధికులైన ఆరుగురు రచయిత్రులను ఘనంగా సత్కరించారు. ఒక సదస్సులో నేను కె.రామలక్ష్మి గారి కథల గురించి ప్రసంగ వ్యాసం చదివాను.
 
          లేఖిని సంస్థ కనుక అందులోని సభ్యులచేతే వాసా ప్రభావతి గారు ప్రసంగ పత్ర సమర్పణ చేయించారు.
 
          కె.రామలక్ష్మి గారు మా ఇంటికి దగ్గరలోనే పది నిమిషాల నడక దూరంలో ఒక అపార్ట్మెంట్ లో తన సోదరితో పాటు వుంటున్నారు. అందువలన తరుచూ కలిసే దాన్ని.నేను ఆమె కథల గురించి వ్యాసం రాసానని తెలిసి చాలా సంతోషించారు.
 
          ఎప్పటినుంచో స్త్రీ జీవితాన్ని పుట్టిన దగ్గర నుండి వృద్ధాప్యం వరకూ చాప్టర్లుగా విడదీసి దీర్ఘకవిత రాయాలనే ఆలోచన వుంది. దానిని రాయటం మొదలు పెట్టాను. శైశవం, బాల్యం, కౌమారం,యవ్వనం, ప్రౌడత్వం,వృద్ధాప్యం, ముగింపుగా ఏడు చాప్టర్లు చేసి రాయటం ప్రారంభించాను. స్త్రీ జీవితంతో పోలుస్తూ విత్తనం మొలకేసిన దగ్గర నుండి మోడుగా కావటం వరకు,సూర్యోదయం నుండి సంధ్యాసమయం వరకూ ప్రతీ చాప్టర్ నీ  మొదలు పెడుతూ స్త్రీ జీవితాన్ని సాదృశ్యం చేస్తూ రాస్తున్నాను. బాగానే వస్తోందనిపించింది.
 
          ఒకరోజు ఇద్దరు అమ్మాయిలు ఫోన్ చేసి నా కవితా సంపుటాల మీద ఎమ్.ఫిల్ చేసామని అందుకని కలవాలనుకుంటున్నామని ఇంటి చిరునామా అడిగారు. నాకు భలే ఆశ్చర్యం అంతులేని సంతోషం కలిగింది. తమ రచనల మీద పరిశోధన జరిగిందంటే ఎవరికి మాత్రం ఆనందం కలుగదూ?
 
          మర్నాడు ఆ ఇద్దరూ వచ్చారు. నా యుద్ధం ఒక గుండె కోత దీర్ఘ కవిత మీద కె.భాగ్యలక్ష్మీ, నా మొదటి సంపుటి ఆకలి నృత్యం మీద బి.నాగలక్ష్మి మధుర కామరాజ్ విశ్వవిద్యాలయంలో చేసిన ఎమ్.ఫిల్ పరిశోధనల కాపి తీసుకుని వచ్చి ఇచ్చారు. అది చదివి నా అభిప్రాయం తెలుపుతూ ఒక ఉత్తరం రాసి ఇవ్వమన్నారు. ప్రాచ్యకళాశాలలో లెక్చరర్ పి.జగన్నాథరావుగారు వారికి గైడ్ అని చెప్పారు.            
 
          చాలా ఏళ్ళ క్రితం ఏదో సందర్భంలో కేబి లక్ష్మీ నాతో ” సదస్సులలో పాత్ర సమర్పణ చేయటానికి అకడమీషియన్లనే తీసుకుంటారు. అందుకే తాను పీహెచ్డీ చేయాలని రిజిస్టర్ చేయించుకున్నానని” చెప్పటమేకాక “నువ్వు కూడా చెయ్యవోయ్” అని సలహా యిచ్చింది. ఆలోచిస్తుంటే లక్ష్మి అన్నది నిజమే అనిపించింది.
 
          అకాడమీలు గానీ, యూనివర్శిటీలు గానీ అకడమీషియన్లకే పత్రసమర్పణ అవకాశాలు కల్పిస్తాయి.
 
          అప్పట్లోనే ఒక రోజు ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళి పి హెచ్ డి అప్లికేషన్ ఫాం కూడా తెచ్చుకున్నాను. వీర్రాజుగారితో చెప్తే “నీ రచనల మీద పరిశోధనలు చేయగల స్థాయి రచయిత్రిగా ఈ నాడు నువ్వు వున్నావు. నువ్వు చేయటం ఏమిటి” అన్నారు. ఆయన మాట నచ్చక పోయినా,పేరు ముందు డాక్టర్ తగిలించుకోవాలనే కోరిక వున్నా,  అప్పటికే ఎమ్మెస్సీ చేయటానికి  చాలా శ్రమ పడి వున్నానేమో. మళ్ళా చదువులోకి దిగే సాహసం చేయలేక పోయాను.
 
          ఈ నాడు నా రచనల మీద ఇద్దరు విద్యార్థులు ఇచ్చిన ఎమ్ ఫిల్ పరిశోధన గ్రంథాలు చూస్తుంటే నా మనసు ఉప్పొంగి పోయింది.
*****
Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.