తమిళ రచయిత్రి రాజమ్ కృష్ణన్ శతజయంతి సంవత్సరం సందర్భంగా పుస్తక పరిచయం: ”నవజీవన వైతాళికులు”
ప్రచురణ: పోలిశెట్టి అమ్మాజీ స్మారక సమితి, జగన్నాథగిరి, కాకినాడ జిల్లా
47 ఏళ్ల క్రితం(1978) విశాలాంధ్ర తొలిసారిగా ప్రచురించిన ఈ పుస్తకం ఇప్పుడు తోలేటి జగన్మోహనరావుగారూ, సామాజిక కార్యకర్త గౌరవ్ ల ముందు మాటలతో వెలువడింది.
రాజమ్ కృష్ణన్ 1925 మార్చి నెలలో తమిళనాడులోని తిరుచిరాపల్లిలో పుట్టారు. స్కూలు చదువు 10 వతరగతే! కానీ ఇంటి చదువు ఇంగ్లిష్ సాహిత్యం వరకూ కొనసాగింది. కలం పట్టి 1987 వరకూ40 నవలలూ, అనేక కథలూ వ్యాసాలూ నాటికలూ రాశారు.ఎన్నో అవార్డులందుకున్నారు. ఏదైనా ఒకజాతి జీవన విధానం గురించి రాసే ముందు దాన్ని స్వయంగా చూసి రాయడం ఈమెకున్న ప్రత్యేకత. గజదొంగల గురించి పుస్తకం రాయడానికి విచారణలో ఉన్న ఖైదీలను ఇంటర్వ్యూ చేశారు. చంబల్ లోయలోకి వెళ్లి వాళ్ళ ఆచార వ్యవహారాలను స్వయంగా పరిశీలించారు. తమిళనాడు ప్రభుత్వం 2009 లో 3 లక్షల పరిహారం చెల్లించి ఆమె రచనలను జాతీయం చేసింది. (సాధారణంగా మరణించిన రచయితల పుస్తకాలను మాత్రమే జాతీయం చేస్తారు) ఈమె 2014 మరణించారు.
రాజమ్ కృష్ణన్ గారు ‘గోవాలో స్వాతంత్ర పోరాటం గురించి రాసిన ‘గాజుల చెయ్యి’ కి సోవియట్ భూమి నెహ్రూ బహుమతి లభించింది. దరిమిలా 1976 లో సోవియట్ యూనియన్ సందర్శించారు. అక్కడి స్త్రీలు సాధించిన ప్రగతిని వివరిస్తూ తమిళంలో ఒక పుస్తకం రాశారు. దాని అనువాదమే ‘నవజీవన వైతాళికులు’
సోవియట్ యూనియన్ లో 90 శాతం మహిళలు ఉద్యోగాల్లోనో చదువుల్లోనో ఉండటం వల్ల కిండర్ గార్టెన్ లో చాలా మంది పిల్లల్ని చూశారామె.అనారోగ్యంగా, బలహీనంగా ఉన్నవాళ్ళూ, ఉద్యోగ విరమణ చేసిన స్త్రీలూ మాత్రమే ఇళ్ళలో ఉంటారు.‘ఉద్యోగం కోసం పౌరులు వెతకడం కాదు, ఉద్యోగాలే పౌరులను వెతుకు తుంటాయి’ అంటారు రాజమ్ కృష్ణన్.
(రాజమ్ కృష్ణన్ గారి తరువాత పదేళ్ళకు అనువాదకుడిగా వెళ్ళిన ఆర్వీయార్ గారు “మాస్కోలో షాపుల్లో లాండ్రీల్లో హెయిర్ కటింగ్ సెలూన్లో రెస్టారెంట్లలో కెఫేలలో ఆఖరికి వోడ్కా వైన్ అమ్మే చోటుల్లో కూడా ఆడవాళ్లే పనిచేస్తూ ఉంటారు. ట్రామ్ లు , బస్సులు కూడా ఆడవాళ్ళే నడుపుతారు. “నేనున్న పదేళ్ళలో హెయిర్ కటింగ్ కి ఒక్క మగాడు కూడా కనబళ్ళేదు. అలాగే స్త్రీలకు ప్రపంచంలో ఏ నగరంలోనూ లేనంత భద్రత అక్కడ ఉందని చెప్పవచ్చు” అన్నారు ‘తొలగిన స్వర్గం’ లో.)
రాజమ్ కృష్ణన్గారు 65 ఏళ్ల మహిళా టాక్సీ డ్రైవర్ తో మాట్లాడారు. 45 ఏళ్లుగా టాక్సీ నడుపుతూ ఉత్సాహంగా ఉందామె. ఒక్క ప్రమాదమూ జరక్కపోవడం విచిత్రం. షోల్ఫాన్ అనే కవయిత్రి గురించి చెప్పారు. షోల్పాన్ఒక పేద రైతు కుమార్తె. 14 వ ఏట ఒక ధనికుడు బలవంతంగా పెళ్ళాడాడు. అతని ఇంటి నుంచి పారిపోయింది. ఆమెను సేవకులు గుర్రాల మీద వెంటాడి ఆ ధనికుడి కాళ్ళ ముందు పడేశారు. ఆ ఇంట్లో కుక్క ఎంతో షోల్ఫాన్ కూడా అంతే. గంజి తాగి ప్రాణాలు నిలుపుకుంది. కొరడా దెబ్బలు, తిట్లూ భరించింది. విప్లవం తరువాత ధనికుడి చెరలోని మహిళలతో బాటు ఆమెకీ స్వేచ్ఛ లభించింది. అప్పుడు 17 ఏళ్ళు ఆమెకి. రాయడం, చదవడం నేర్చుకుని కవిత్వం, వ్యాసాలూ రాసింది. టీచర్ గా పని చేసింది. మొట్టమొదటి కజక్ కవయిత్రి ఆమె.
స్త్రీలలో వైద్యులూ, పశువైద్యులూ ఉండటం సహజం. కానీ సోవియట్ యూనియన్ లో వాలెరియా అనే మహిళ మాస్కో జంతు ప్రదర్శన శాలలోని పులులు, సింహాలు వంటి వన్యప్రాణులకు వైద్యం చేసింది. తాజా మాంసం ముద్దల్లో మాత్రలు పెట్టి వాటితో మింగించేది. ఒకరోజు పులికి మంత్రసానిగా పనిచేసింది. జ్వరంతో బాధపడుతున్న జిమ్మీ అనే ఆఫ్రికా ఏనుగుకి, కీళ్ళ నొప్పితో బాధపడుతున్న ఖడ్గ మృగానికి సముద్ర జీవి వాల్రస్ కీ చికిత్స చేసింది. ఒకరోజు రాత్రి ఆమె ఇంటికి వెళుతుంటే కాళ్ళకు ఒక కొండ చిలువ తగిలింది. అది జూ నుంచి తప్పించుకుని మంచుకి గడ్డకట్టి చలనం లేకుండా పడి ఉంది. డానికి ఆల్కహాల్ మర్దన చేసి మామూలు స్థితికి తెచ్చింది. ఇంకో సారి సర్కస్ చింపాంజీకి వైద్యం చేయాల్సొచ్చింది. దానికి భోజనం తరువాత సిగరెట్ కాల్చడం అలవాటు. సిగరెట్ ఇవ్వకపోతే గందరగోళం చేసేది. వాలెరియా కష్టపడి ఆ అలవాటు మాన్పించింది.
సోవియట్ లోని బ్యాలే కళాకారిణి అన్నా పావ్లోవా. బాల్యంలో ఎన్నో అవమానాలను ఎదుర్కొంది. కానీ పట్టుదలతో బాలే నృత్యాన్ని అభ్యసించింది. ప్రపంచమంతా నృత్య ప్రదర్శనలు చేసి కీర్తి సంపాదించింది. ఆమె 1928 లో భారతదేశం వచ్చినపుడు తమిళనాడులో ఒక నృత్య కళాకారిణి ఆమెని కలిసి ప్రేరణ పొందింది. ఆ పావ్లోవా గురువు నే తన గురువుగా భావించి బ్యాలేనాట్యాన్ని నేర్చుకుంది. భరత నాట్యం దేవదాసీల కోసమే అని నమ్ముతున్న రోజుల్లో కర్ణాటక సంగీతం, బాలే, భరతనాట్యాలలో ప్రతిభను ప్రదర్శించి పద్మభూషణ్ బిరుదు పొందింది. ఆమె పేరే రుక్మిణీదేవి అరండేల్.
భార్య గ్రామ సర్పంచ్ గానో ఎమ్మెల్యే గానో ఉంటే భర్త పెత్తనం చలాయించడం మనం చూస్తుంటాం. కానీ రాజం కృష్ణన్ గారు సోవియట్ లో ఒక మహిళా యజమాని దగ్గర ఆమె భర్త కార్మికుడుగా పనిచేయడం చూశారు. అది ఒక సమిష్టి వ్యవసాయ క్షేత్రం.
బాలబాలికలకు అక్కడ వేరువేరు విద్యాసంస్థలు లేవు. రైళ్ళలోనూ బస్సుల్లోనూ సీట్లు వారికి రిజర్వ్ చేయరు. స్త్రీల బానిసత్వ చిహ్నంగా నిలిచిన పరదాపై ఇప్పటికీ మనదేశంలో వాదోపవాదాలు జరుగుతున్నాయి. రష్యాలో పూర్వం బురఖా తొలగించిన భార్యలను చంపే హక్కు మతం భర్తలకుఇచ్చింది. ఆ పరదాలు గుర్రపు వెండ్రుకలతో అల్లేవారు. అవి చూపుకీ ఊపిరి తీసుకోడానికీ కూడా అసౌకర్యంగా ఉంటాయి. 1928 మార్చి 8 న వేలమంది మహిళలు లెనిన్ విగ్రహం ముందు చేరి అంతర్జాతీయ కార్మిక గీతం ఆలాపిస్తూ పరదాలు గుట్టలుగా పోసి పెరాఫిన్ చల్లి అంటించారు.
రాజమ్ కృష్ణన్ ఇలా చాలా అంశాలు చెప్పారు. మెట్రిక్యులేషన్ చదువుకుని ఫిల్మ్ స్టూడియోలో స్వీపర్ ఉద్యోగం కోసం దేవుళ్ళాడిన దినారా అనే ఓ యువతి, ఆ తరువాత ప్రముఖ మహిళా దర్శకురాలిగా ఎదిగి, ‘వుడ్ పెకర్స్ నెవర్ గెట్ హెడేక్’ (తలనొప్పి ఎరుగని వడ్రంగి పిట్ట) అనే సినిమా తీసి విదేశాల్లో కూడా ప్రశంసలందుకోవడం గురించి చెప్పారు. ఒక ట్రాక్టర్ డ్రైవర్ కూతురైన వాలెంతినా తెరిస్కోవా, టైర్ల ఫ్యాక్టరీలోనూ టెక్స్ టైల్ మిల్లులోనూ పని చేసి, కుటుంబానికి తెలియకుండా పేరాచూట్ డైవింగ్ లో శిక్షణ పొంది, ధైర్య సాహసాలతో రోదసిలో విహరించే స్థాయికి ఎలా ఎదిగిందో వివరించారు. మనకు జానపద సినిమాల్లో తప్ప కత్తిసాము చేసే మహిళలు కనిపించరు. కానీ సోవియట్ లో అలెగ్జాండ్రా జబెలినా మొదటి సారి కత్తిసాములో ప్రపంచ చాంపియన్ షిప్ సాధించింది.
నోనా 5 ఏళ్ల వయసులో చదరంగం నేర్చుకుని రెండుసార్లు సోవియట్ యూనియన్ జాతీయ చాంపియన్ షిప్ గెలుచుకుంది. 15 ఏళ్ల పాటు ప్రపంచ మహిళల చదరంగంలో చాంపియన్ గా ఉంది. ఎలెనావా ప్రొక్లోవా 11 వ ఏట నటనలో అడుగు పెట్టిన నాలుగో తరగతి చదివే విద్యార్ధిని పాత్ర ధరించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. 1965 లో జరిగిన అఖిల యూనియన్ చిత్రోత్సవంలో ఉత్తమ బాలనటి అవార్డు గెలుచుకుంది.
అక్కడ విడాకులు పొందిన స్త్రీకీ, పెళ్లి కాకుండా గర్భం దాల్చిన స్త్రీకీ ప్రభుత్వం అండగా నిలబడుతుంది. లలితకళలు డబ్బు సంపాదన కోసం ఉపయోగించడం లేదు. ఆ రంగంలోని మహిళలు తమ కళాత్మక నైపుణ్యాలను సమాజ ప్రయోజనానికి వినియోగి స్తున్నారు.
ఆడవాళ్ళు అన్ని రంగాల్లోనూ పని చేసే అవకాశం ఉండటం వల్ల వాళ్లకి ఇంటి చాకిరీ తగ్గాలి. కానీ 1981-91 మధ్య అక్కడ అనువాదకుడిగా పనిచేసిన ఆర్వీయార్ గారు ఏమంటున్నారో చూడండి. “ ఒక ట్రామ్ డ్రైవర్ మా ఆవిడతో ‘ మీ ఇండియన్ ఆడవాళ్ళు బయట పనులు చేయక్కర్లేదట కదా! అందట కొంచెం అసూయతో. ‘ కానీ ఇంటిపని ఉంటుంది కదా! ‘ అంది ఈవిడ. అప్పుడామె ‘ మేం ఇంటాబయటా కూడా పని చెయ్యాలి’ అందట. మహిళలు సాంఘిక జీవితంలో ప్రగతి సాధించాలంటే మగాళ్ళు ఇంటి పనిలో భాగస్వామ్యం వహించాలి. అందుకు మనస్తత్వంలో మార్పు రావాలి’
సోవియట్ యూనియన్ లో సమసమాజ నిర్మాణ ప్రయత్నం ప్రారంభంలోనే విఫలమైంది. ‘నవజీవన మహిళలు’ పుస్తకం దేనికి పనికొస్తుంది? సోషలిజం సాధించిన విజయాలనూ మహిళల జీవితాలలో తీసుకొచ్చిన మార్పులనూ అర్ధం చేసుకోడానికి పనికొస్తుంది.
(శ్రీమతి పోలిశెట్టి అమ్మాజీ వర్ధంతి సందర్భంగా ఆమె భర్త రామకృష్ణ పాఠకులకు ఉచిత పంపిణీ కోసం ఈ పుస్తకాన్ని వెయ్యి కాపీలు ప్రచురించారు. కాజులూరు మండలం జగన్నాథగిరిలో ఫిబ్రవరి 9 న డా. చెలికాని స్టాలిన్ అధ్యక్షతన ఆవిష్కరణ సభ జరిగింది. డా. కవిత పుస్తకాన్ని ఆవిష్కరించి పరిచయం చేశారు.)
*****