నా అంతరంగ తరంగాలు-25

-మన్నెం శారద

నా పేరు నాకిష్టం !

ఆమాటకొస్తే  ఎవరిపేరు ఎవరిష్టం ఉండదు చెప్పండి ! అయితే ముఖ్యంగా చదువులతల్లి సరస్వతి పేరు కావడం అందుకు కారణం .

          మేము నలుగురు ఆడపిల్లలం. మా అక్కపేరు హేమలత. ఆ పేరంటే మా నాన్నగారికి ఇష్టం  అట.

          అక్కకు ఆయనే పెట్టారట. ఇక మిగతా ముగ్గురికి అమ్మే పేర్లు పెట్టారు. వరుసగా లక్ష్మి ,సరస్వతి ,పార్వతి  ఇల్లంతా నడయాడాలని  నాకు శారద. మా మిగతా చెల్లెళ్లకి ఇందిర ,లలిత అని .అందరూ ఇల్లంతా నడయాడారో లేదో గాని నేను మాత్రం నా అల్లరితో కొంపంతా ఓ కొలిక్కి తెచ్చేదాన్ని .

          నా చిన్నప్పుడు  ఎక్కడయినా “మది శారదాదేవి మందిరమే “అన్న పాటవిన్నా “జయజయశారదా  జయకళా విశారదా అన్న పాటలు …ఇలా శారద పేరుతో ఏ పాటలొచ్చినా నన్ను ఉద్దేశించే అని ఒకింత గర్వం ,మరింత సంతోషంతో అందరి కళ్ళలో పడేట్లు గిర గిరా తిరిగేదాన్ని .

          ఎప్పుడూ  మట్టిలో పడి ఆటలూ,పాటలూ ఆడుతూ  మురికిగొట్టుకుని తిరిగే నన్ను ఎవరూ గుర్తించే వారు కాదుగాని నేను మాత్రం నా మానాన నేను ఆనందపడుతూనే వుండే దాన్ని .

          దానికితోడు సినిమాల్లో అష్టకష్టాలు పడే పాత్రలు ,మంచి అమ్మాయిల పేర్లు శారద అని ఉండడంతో నాకిక తిరుగు లేదని భావించి ఎప్పటికన్నా నాకు మంచి గుర్తింపు వచ్చి తీరుతుందని  దొడ్లో కొబ్బరి చెట్లు  మామిడి ,జామ చెట్లూ పట్టుకుని భోరుమని విలపిస్తూ  ఆ పాటలు పాడుకుని నటిస్తూ ఉండేదాన్ని .

          ఎవరయినా పనిమీద పెరట్లోకొచ్చినా  నా వంక చూసి లైట్ గా తీసుకుని  అసలు నా నటనా ప్రాభవాన్ని గుర్తించ కుండానే  వెళ్లిపోయే వారు .

          వాళ్ళ నిర్లక్ష్యానికి నాకు ఒకింత కోపం వచ్చినా “ఏడ్చారు ,వీళ్ళ బోడి గుర్తింపు ఎవరికీ కావలి ,అశేషజనవాహిని కదా నన్ను గుర్తించాల్సింది “అనుకుని పట్టుదలగా నా కృషి నేను చేసుకుంటూండేదాన్ని .

          నాగార్జునసాగర్ హై స్కూల్లో 7th క్లాస్ చదివేటప్పుడు  నా పక్కన శారమ్మ  అనే క్రిస్టియన్ ఫ్రెండ్  కూర్చునేది .

          శారమ్మ [ఎక్కడుందో ఇప్పుడు ] చాలా జోక్స్ వేసి నవ్వించేది .తాను మాత్రం అసలు నవ్వేది కాదు హాస్యం అంటే పడి  చచ్చే నేను ఆమె పక్కనే కూర్చుని ఆమె జోక్స్ కి పడి పడీ నవ్వేదాన్ని.

          మాకు ఇద్దరు తెలుగు పండితులుండేవారు .

          ఒకరు చంద్రశేఖరశర్మ గారు ,మరొకరు వెంకటసుబ్బయ్య పంతులు గారు. ఇద్దరూ తెలుగు బ్రహ్మాండంగా చెప్పేవారు . కాకపోతే చంద్ర శేఖరశర్మగారు నవ్విస్తూ జోవియల్ గా పాఠాలు చెబితే సుబ్బయ్య మాస్టారు యమ సీరియస్ !

          ఆయన క్లాస్ లో బిర్రబిగుసుకుని  ఊపిరాడనట్లుగా ‘ఎప్పుడు క్లాసయిపోతుందిరా  దేవుడా!’అన్నట్లుగా కూర్చునేవాళ్ళం.

          ఆ రోజు సుబ్బయ్య మాస్టారు పాఠం చెబుతుంటే  శారమ్మ మెల్లిగా ఏదో జోక్ చేసింది .నేను కిసుక్కున నవ్వాను .మాస్టారు చూడనే చూసారు .

          వెంటనే స్టెండప్  అని అరిచారు .

          ఇద్దరం లేచి నిలబడ్డాం ఏడుపు మొహాలతో.

          ”  క్లాస్ కి పళ్ళికిలించడానికి వచ్చారా!”అన్నారు కోపంగా.

          క్లాస్ ఫస్ట్ అని నా మీద నాకు మంచి నమ్మకం, కొంత గర్వం కూడా ఉండేది.

          నాకు మళ్ళీ ఇకిలించాలనిపించిదిగాని  ,మేటర్ సీరియస్ అవుతుందని తలదించుకుని నిలబడ్డాను .

          ఈ లోపున పాతకక్షలున్న కొందరు మగపిల్లలు మమ్మల్ని చూసి నవ్వుతున్నారు.

          అందులో బోస్ మరీ!

          ఎప్పుడూ అన్ని సబ్జెక్ట్స్ లోనూ జీరోలే తెచ్చుకుని డస్టర్ దెబ్బలు తినే బోస్ కి నా మీద ఏదో చెప్పలేని కక్ష!

          “ఒకరి పేరు శారమ్మ  శార అంటే అక్షరాలు. ఆవిడగారు చదువులతల్లి .

          మరొకరు శారద. చదువులు దానం చేస్తుంది .

          ఇద్దరూ కలిసి క్లాసు తగలెడుతున్నారు “అని తిట్టారు .

          మాకు చాలా అవమానమనిపించింది.

          నేనుండేది రైట్ బేంక్. శారమ్మ ఉండేది పైలాన్ కాలనీ. మాస్కూల్ ఉండేది హిల్ కాలనీ. బస్సు రెండు ట్రిప్స్ హిల్ కాలనీ నుండి రైట్ బేంక్ కు తిరుగుతుంది. దారిలో శారమ్మా దిగి పోతుంది.

          ఆఁ రోజు అంతటి అవమానానికి గురయిన మేం వెంటనే మొదటి ట్రిప్ లో ఇంటికి వెళ్లలేకపోయాం.

          ఇద్దరకీ ఏడుద్దామని ట్రై చేసినా నవ్వే వస్తున్నది.

          ఆయనలా  క్లాసులోపరమ బేవార్సు చవట లందరిముందూ మా పరువు తీసినా  కొంత బాధ పడి ఆ పిమ్మట  కొంత  ధైర్యం  తెచ్చుకుని  మా పేరుల అర్ధం ,పరమార్థం  గ్రహించినవారమయి  క్లాసయ్యాకా ప్రేయర్ హాల్ వెనుక  గోడకి జారబడి వడి నిండా పోసుకున్న ఉడకబెట్టిన పల్లీలు వలుచుకుతింటూ “ఇక మనం ఇదివరకులా కాదు ,మనపేర్లకి తగ్గట్టు మనం ఏదన్నా సాధించి తీరాలి “అని గట్టిగా అనుకున్నాం.

          తొందరలోనే మాకా అవకాశం లభించింది.

          ఆ యేడు   స్కూల్ యానివర్సరీ కి మా ఝాన్సీలక్ష్మి స్క్వాడ్ పెట్టిన ఆడపిల్లల ఎక్సిబిషన్ కి నేను లీడర్ గా ఉండి ఝాన్సీలక్ష్మీ బాయ్ బొమ్మ వేసాను .

          దానికి అప్పటి చీఫ్ ఇంజనీర్ జెనరల్ గారు వచ్చి ప్రారంభోత్సవం చేసి  నేను రాసి నటించిన హాస్యనాటకం  కూడా [ఎత్తుకుపై ఎత్తు ] చూసారు.

          అందులో నేను నటించిన  పనిమనిషి పాత్రని చూసి కడుంగడు సంతోషపడి వారి విలువైన పార్కర్ పెన్ నాకు బహుమతి గా ఇచ్చి మెచ్చుకుని  ‘బహుముఖప్రజ్ఞాశాలి’ అని దీవించారు .

          అప్పుడు మా నాన్నగారి కళ్ళు సంతోషంతో మెరిసాయి గాని అమ్మమాత్రం “దీని కోతి వేషాలు ఆయనకేం తెలుసు!” అని తీసి పారేసింది.

          కొసమెరుపు  ఏమిటంటే  ఎంతో మంచి తెలుగు మాస్టారు చంద్ర శేఖర శర్మ గారు ఒకరోజు నన్ను దగ్గరకి పిలిచి “శారదా  ఆ నాటకం నువ్వే రాశావా ,నిజం చెప్పు !అని అడిగారు.

          ఆయన ప్రశ్నకు నేను తెల్లబోయాను.

          నాకు వెంటనే కళ్ళ నీళ్లొచ్చాసాయి.

          “అయ్యో నేనెవరికీ చెప్పనులే ,నిజం చెప్పు “అన్నారు మళ్ళీ .

          నేనే రాసానండి అన్నాను దీనంగా  ఏడుపుని అదుపు చేసుకుంటూ.

          అయినా ఆయన చూపులోని అపనమ్మకం నాకింకా గుర్తుంది

          ఇంటికెళ్లి నాన్నకి చెబితే ఆయన ఊరడిస్తూ “ఇందులో బాధ పడాల్సింది ఏమీలేదు .ఆయనకీ అపనమ్మకం కలిగిందంటే నువ్వు చాలా బాగా రాసినట్లు ” అని చెప్పారు .

          తర్వాత కాలంలో ఇదే నాటిక ‘గుణపాఠం ‘అనే పేరుతో ఆలిండియా రేడియో విజయవాడ కేంద్రం నుండి ప్రసారమయ్యింది.

          నాకు మొదటిసారి నంది అవార్డు వచ్చినప్పుడు నాన్న ఈ సంగతి గుర్తు చేసుకున్నారు .

          వంట్లో బాగోక పడుకుంటే ఇన్ని సంగతులు గుర్తొస్తుంటాయి మరి !

*****

(సశేషం) 

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.