నా జీవన యానంలో- రెండవభాగం- 52

-కె.వరలక్ష్మి

          అక్టోబర్ లో ఒకరోజు హిమబిందు ఫోన్ చేసి చాలాసేపు మాట్లాడింది. భీమవరంలో అజో-విభో సభలో చూసిందట. అక్కడికి 80 మైళ్ల దూరంలో ఉన్నారట. వీలుచూసుకుని వాళ్లింటికి రమ్మని పిలిచింది.

          ఒకరోజు జి.వి.బి. ఫోన్ చేసినప్పుడు చెప్పేడు, నిడదవోలు జవ్వాది రామారావుగారు నెలక్రితం కాలం చేసాడట. ‘అయ్యో’ అని దుఃఖంగా అన్పించింది. అతనికి నాపైన ఎనలేని సోదర ప్రేమ. మొన్న జనవరిలో నిడదవోలులో ఆయన జరిపిన అవార్డు ఫంక్షన్ కీ వెళ్లలేదు. ఈ మధ్యకాలంలో ఫోనూ చెయ్యలేదు. మనుషులు మన కళ్ల ఎదుట తిరుగు తూనే ఎప్పడు నిష్క్రమిస్తారో తెలీదు –

          గీతకు పెద్దవాళ్లను ఎలా చూసుకోవాలో తెలుసు. నన్నేకాదు, బైటవాళ్లనైనా. అందుకు తల్లిగా నేను గర్వంగా ఆనందంగా ఫీలయ్యాను. నాకేం కావాలో అడిగికొన్నీ, అడగకుండా కొన్నీ తెచ్చి ఇంట్లో పెడుతుంది. ఆ వయసులో నాకు నీరసం రాకుండా ఉండేందుకు జాగ్రత్త తీసుకునేది.

          అక్టోబర్ 16న సాయంత్రం మిల్ పిటాస్ – స్వాగత్ హోటల్లో యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారితో ముఖాముఖీ అని గొర్తి బ్రహ్మానందం పిలిస్తే నేనూ గీతా పాపాయిని తీసుకుని వెళ్లేం. ఆ రోజు బాగా చలిగా ఉంది. అన్నటైంకి వెళ్తే అక్కడ గొర్తి తప్ప ఎవరూ లేరు, తర్వాతైనా మల్లాది రఘు, మృత్యుంజయుడు, కిరణ్ ప్రభ, వాళ్లబ్బాయి వచ్చారు. హాల్ కేన్సిల్ చేసి పక్కనే ఉన్న తానా ఆఫీసు గదిలో పెట్టేరు సమావేశం. లక్ష్మీప్రసాద్ గారు మమ్మల్ని చక్కగా పలకరించి, పాపాయిని ఎత్తుకున్నారు. నేను మాత్రమే ముఖామిఖీ అన్నారు కదా అని ‘ద్రౌపది’ నవల గురించి ఏవో ప్రశ్నలు వేసాను. డిన్నర్ అన్నారు. అదీలేదు, రాత్రి 10 కి ఇంటికొచ్చి అన్నం వండుకుని తిన్నాం. తెల్లవారేసరికి ఆకాశమంతా మబ్బుల్తో నిండిపోయి ఉంది. ఆగి ఆగి సన్నని వాన, ఏ మాత్రం సూర్యుడు కనపడని ఆకాశం, నేనెళ్లాక మొదటిసారి వచ్చిన ఆ కొత్త ప్రకృతిని ఓసారి అలా ఫ్లాట్స్ చుట్టూ నడిచి ఆ అందమైన అనుభూతిని మనసులో నింపుకొన్నాను.

          నేను అమెరికాలో ఉండగానే అక్టోబర్ 24 నా పుట్టినరోజు వచ్చింది. నేను పుట్టినప్పటిలానే ఈ 2010లో కూడా ఆదివారం అయ్యింది చాలా ఏళ్ల తర్వాత నా పుట్టిన రోజు సందడిగా చేసింది గీత. ఇండియా టైం ప్రకారం ముందురోజు రాత్రి పన్నెండుకే గ్రీటింగ్స్ చెప్పింది. ఇండియా నుంచి రవి, స్వప్న పిల్లలు, ఇక్కడ సత్య, కోమల్ గ్రీటింగ్స్ చెప్పేరు. రాత్రి బెలూన్స్ కట్టి ఇల్లంతా అలంకరించేరు. తెల్లవారేక సేమ్యా పాయసం, చికెన్ బిర్యానీ, చికెన్ కర్రీ, మైసూర్ బజ్జీ, గారెలు వగైరాలన్నీ చేసింది గీత. నేను అపర్ణ గునుపూడి ఇచ్చిన జరీచీర కట్టుకున్నాను. ఎదుట ఫ్లాట్ లోని గోపి, గోకుల అనే కొత్త దంపతుల్ని లంచ్ కి పిల్చింది గీత.  వాళ్లొస్తూ ఒక అందమైన ఫ్లవర్ బొకే తెచ్చేరు, భోజనాలయ్యేక దమ్ షరాట్స్, అంత్యాక్షరి ఆడుతూ చాలా నవ్వుకున్నాం. 3 గం.కు రేణుకగారు (లలితాశేఖర్ పిన్ని), వాళ్ల కోడలు శశి వచ్చాక గోపివాళ్లు వెళ్లేరు. రేణుకగారు, గీత బోలెడన్ని పాటలు పాడేరు. శశి కూడా బాగా కలిసిపోయింది. సాయంత్రం హాట్ హాట్ టిఫిన్స్, పాయసం, టీ ఇచ్చింది గీత అందరికీ. బోలెడన్ని ఫోటోలు, వీడియోలు తీసుకున్నాం. వాళ్లు వెళ్లేటప్పుడు బిర్యానీ పేక్ చేసి ఇచ్చింది గీత. రోజంతా హేపీగా గడిచింది.

          నా పెళ్లయ్యే వరకూ పుట్టిన రోజును సెలబ్రేట్ చేసుకుంటారని తెలీదునాకు. మోహన్ చెప్తే మొదటిసారిగా నా అసలు పుట్టిన రోజుకోసం వెతికేను. మా అమ్మవాళ్ల దేవుడి గదిలో ఓ ఫోటో వెనక మానాన్న రాసింది కన్పించింది. అప్పటికింకా చదువుకొంటూ ఉండడం వల్ల నా స్కూల్ ఫ్రెండ్స్ ని పిలిచి ఓ చిన్న టీ పార్టీలాంటిది చేసాం. కొత్తబట్టల ప్రసక్తే లేదు.

          చిన్నారి సిరివెన్నెల నేను ఎత్తుకున్నప్పుడల్లా నా కళ్లలోకే చూస్తూ ఆప్యాయత, అర్థంకాని చిరునవ్వులు కురిపిస్తూ ఉంటుంది. ‘నాకెందుకో మోహన్ మళ్లీ తన కూతురి కడుపున ఇలా పుట్టేడా’ అన్పించసాగింది. ఒకోసారి సెన్సిటివ్ నెస్ మనల్ని అలా మనకిలేని నమ్మకాల్లోకి నెట్టిపడేస్తుంది. అపురూపమైన, అద్భుతమైన అందాల జీవితాన్ని అస్తవ్యస్తం చేసి పడేసాడు కదా! దాంట్లో నా తప్పేంటో నాకు తెలీదు. అతని మూలంగా నేను ఒక ప్రేమరాహిత్యంలోకి జారిపోయాను.

          ఒకరోజు వాకింగ్ కి వెళ్లినప్పుడు హైదరాబాద్ నుంచి వాళ్లమ్మాయి దగ్గరకు వచ్చిన ఇందిర అనే ఆవిడ పరిచయమైంది. మన వాళ్లు ఎవరు కన్పిస్తారా మాట్లాడుకోడానికి అని ఎదురుచూస్తోందట. రమణానందస్వామి గురించీ, సాయిబాబా గురించీ చాలా చెప్పింది. నాతోబాటు నడుస్తూ గీత ఇంటికి వచ్చింది. అప్పుడప్పుడు అలా వస్తూండేది.

          ఆ సంవత్సరం అన్నవరం నుంచి పూజారులు విగ్రహాల్తో సహా వచ్చి అమెరికాలోని చాలా ప్రదేశాల ఆలయాల్లో సత్యనారాయణ స్వామి వ్రతాలు చేయించారు, గీత వాళ్లకి దగ్గర్లో ఉన్న మిల్ పిటాస్ ఆలయంలో 160 డాలర్లు కట్టించుకుని వ్రతాలు ఏర్పాటు చేసారు, గీతావాళ్లూ వ్రతం చేసుకున్నారు. ముఖ్యంగా మా ఊరికి దగ్గర్లోని అన్నవరం దేవుడు కదా!  లైటింగ్, విగ్రహాల అలంకరణ అద్భుతంగా అన్పించింది. ఆలయ కమిటీ మెంబర్స్ లో ఒకడైన మా ఊరి అబ్బాయి కరుటూరి శ్రీనివాస్ కూడా కన్పించాడు. ఆ అక్టోబర్ 31న అక్కడి నేటివ్ పండగ ‘హాలోవెన్’ వచ్చింది. అందరూ గ్రాండ్ గా చేసుకునే ‘దెయ్యాలపండగ’ అది. వరు స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సాయంకాలం అందర్నీ ట్రీట్ కి పిల్చింది, పిల్లల్తో బాటు పేరెంట్స్ – రకరకాల వేషధారణల్తో చాలా మంది వచ్చారు. బైట వేసిన టేబుల్స్ మీద ఒక్కొక్కళ్లూ ఒక్కొక్క డిష్ తయారుచేసో, కొనో తెచ్చిపెట్టేరు. అవి తింటూ పిల్లలు ఆటల్తో, పెద్దవాళ్లు కబుర్లతో గడిపేరు. సాయంత్రం 5 గం.లకి గ్రూప్ ఫోటో సెషన్. అదయ్యాక పేరెంట్స్ తో పిల్లల్ని ఒక్కొక్క కుటుంబాన్ని విడిగా ఫోటోలు తీసారు. రకరకాల మాంసాహార పదార్థాలు, పళ్లు, డ్రైఫ్రూట్స్, నట్స్, పంప్ కిన్ కేక్స్ (మన తీపి మినప రొట్టెలాగా చాలా రుచిగా ఉన్నాయి), ఫ్రూట్ జూసెస్, తాగేవాళ్లకోసం బీర్ టిన్స్ వగైరాలన్నీ పెట్టేరు. ప్రతి ఇంటి ముందూ ఒకళ్లని మించి ఒకళ్లు పెద్ద పెద్ద డ్రమ్స్ అంతటి గుమ్మడిపళ్లు పెట్టేరు. కొందరు వాటికి ముక్కు, కళ్లు లాంటివి భయంకరంగా కర్వింగ్ చేసి పెట్టేరు. కొందరు మన పొలాల్లో పెట్టేలాంటి దిష్టిబొమ్మలకి తెల్లని ముసుగులు కప్పిపెట్టేరు. కొందరు ఇంటిముందున్న చెట్ల కొమ్మలకి దెయ్యాల బొమ్మలు వేళ్లాడదీసేరు. సాయంత్రం 6 తర్వాత చలి భరించలేక నేను, సిరి పాపాయి ఇంటికొచ్చేసాం. గీత వరూకి సాయంగా ట్రిక్ అండ్ ట్రీట్ కి వెళ్లింది. ఒక చిన్న గుమ్మడికాయ లాంటి ప్లాస్టిక్ బేస్కెట్ పట్టుకుని పిల్లలు ఇంటింటికీ వెళ్లి ట్రిక్ ఆర్ ట్రీట్ అని అరుస్తారు. వాళ్లు ట్రిక్ చెయ్యొద్దు, ట్రీట్ నే ఇస్తాంలే అని ఆ బేస్కెట్ లో చాక్లెట్లు వేసి పంపిస్తారు.

          అక్టోబర్ 30న వనజ, వేణుగోపాల్ లకి కొడుకు పుట్టేడట, నెట్ లో ఫోటోలు చూసి నేనూ గీతా ఫోన్ చేసి కంగ్రాట్స్ చెప్పేం. నవంబర్ రాగానే కాలిఫోర్నియాలో సీజన్ మారిపోయింది. తెల్లారి 8కి గాని వెలుతురు రావడం లేదు. సాయంకాలం 5 కే చీకటి మొదలౌతోంది.

          మా పెద్ద తమ్ముడు వాళ్లూ గీతకి దగ్గర్లో ఉన్న వాళ్ల చిన్నకూతురు ఇంటి నుంచి సిరిపాపాయిని చూడడానికి వచ్చారు. నాకెప్పుడూ వాడితో మాట్లాడితే ఏదో గుహలోకి వెళ్లినట్లుంటుంది. తోడేలు వెంటాడినట్లుంటుంది.

          నవంబరు 5న దీపావళి వచ్చింది. ఓ కంచంలో ఇసుకపోసి కొవ్వొత్తులు గుచ్చి వెలిగించి, బైట సీరియల్ బల్బ్స్ వెలిగించి, ఓ నాలుగు పెట్టెల కాకరపువ్వొత్తులు వెలిగించి; చక్కెర పొంగలి, పుల్హార, వడలు చేసి గీత అందరి చేతా దీపావళి సెలబ్రేట్ చేయించింది, నా తిరుగు ప్రయాణం దగ్గరకు వచ్చింది. గీత నెట్ నుంచి నా టిక్కెట్టు ప్రింట్ తీసింది.

          ప్లెసెంటన్ లో ఉన్న కథా రచయిత కె. గిరిధరరావు గారు వాళ్లింటికి లంచ్ కి పిలిచేరు. ఆయన స్వయంగా చేసిన చికెన్ దమ్ బిర్యానీ, చికెన్ కర్రీ, వేయించిన ప్రాన్స్, కొన్ని వెజ్ ఐటమ్స్, ఎంతో రుచిగా ఉన్నాయి. అతని భార్య రజిత, ఒక బాబు, పాప. మమ్మల్ని ఎంతో బాగా రిసీవ్ చేసుకున్నారు. వాళ్ల ఫేమిలీ ఫ్రెండ్స్ హరిచరణ్, సుకన్య కూడా వచ్చారు. వాళ్లది హైద్రాబాద్ ప్రగతినగరట, హరిచరణ్ ‘కమ్లీ’ ‘ఇష్’ సినిమాలు ప్రొడ్యూస్ చేసాడట, కోటిరూపాయలపైన పోగొట్టుకున్నాడట. భోజనాల తర్వాత కవి శివచరణ్ వచ్చేడు. అందరం కథల గురించీ, సినిమాల గురించీ, బోలెడన్ని కబుర్లు చెప్పుకొన్నాం. రజిత రూంఫ్రెషనర్ బోటిల్ ఒకటి ప్రెజెంట్ చేసింది. ఆ రోజు నుంచీ అక్కడి టైం ఓ గంట వెనక్కి వెళ్లింది వాచీల్లో.

          నవంబరు 30 న రేణుకగారు ఇండియాకు బయలుదేరతారని తెలిసి మధ్యాహ్నం 2 కి సారటోగాలోని రేణుకగారబ్బాయి హరి ఇంటికి వెళ్లేం. శశికి ఆఫీసులో వర్క్ ఉండి రాలేదు. వాళ్లకి ఇద్దరమ్మాయిలు. 5, 3 చదువుతున్నారు. గీత, రేణుకగారు అయిదారు పాటలు పాడేరు. సాయంత్రం 5 దాటేక తిరిగి వచ్చేం. దారిలో గీత పెర్సిమాన్ ఫ్రూట్స్ కొన్నది. చూడ్డానికి మన దేశవాళీ టమాటాలాగా ఉండి మామిడిపండు రంగులో ఉంది, గింజలు లేవు. తియ్యగా గుజ్జుతో ఉంది. ఆ పళ్లను చూడ్డం, తినడం అదే మొదటిసారి నాకు.

          నవంబరు 13న కుపర్టినోలో ఉన్న గొర్తి సాయిబ్రహ్మానందంగారింటికి లంచ్ కి పిలిస్తే వెళ్లేం. అపర్ణ గునుపూడి, వాళ్లాయన సుబ్బారావుగారు, అనిల్ రాయల్ దాసరి, అతని వైఫ్ చైతన్య, వాళ్ల 7 నెలల పాపాయి మనస్విని వచ్చారు. పుల్హార, డబుల్ కా మీఠా, రెండు కూరలు, రెండు పచ్చళ్లు, సాంబారుతో మంచి రుచికరమైన వెజిటబుల్ మీల్స్ పెట్టేరు. తర్వాత అమెరికా గురించిన కబుర్లతో చాలా ఎంజాయ్ చేసాం. బ్రహ్మానందం గీసిన బాపూగారి అనుకరణ చిత్రం ‘బ్రహ్మకడిగిన పాదము’ ఫ్రేమ్ కట్టించి గోడకు తగిలించారు. బ్రహ్మానందం మంచి వైణికుడు కూడా అని అప్పుడే తెలిసింది. వీణమీద నాలుగైదు కృతులు చాలా బాగా వాయించాడు. ఆయన భార్య లలిత అందరికీ పళ్లు, జాకెట్టు ముక్కలు ఇచ్చారు. నాకిష్టమని రెండు కేండిల్ బోటిల్స్ కూడా ఇచ్చారు. ఆ రోజంతా చాలా బాగా గడిచింది. నా ప్రయాణం నవంబరు 17న. ఇంక ఎవరు పిలిచినా సారీ, థేంక్స్ చెప్పేసాం. సామాను సర్దుకోవాల్సి ఉంది కదా! గీతకు బేక్ పెయిన్ పట్టుకుంది. అయినా గాని కోమల్ సాయంతో రెండు సూట్ కేసులూ సర్దేసి, వెయిట్ కూడా చూసి పెట్టేసింది. 16న అందరూ ఫోన్లు చేసి హేపీ జర్నీ చెప్పేరు. కోమలైతే ఆ నాలుగు రోజులూ స్కూలుకెళ్లే ముందు నామెడచుట్టూ చేతులు వేసి, నా భుజం మీద తలవాల్చి ఉండి పోయేవాడు. నాకూ కళ్లు నీళ్లతో నిండిపోయేవి, సిరి పాపాయికి కిలకిలా నవ్వడం వచ్చింది. నన్ను చూస్తే చాలు మీదికి ఉరికి వచ్చేది. నా జీవితంలో లీజర్ గా, హేపీగా గడిపినవి ఆ ఆరునెలలే అన్పించింది. తెలిసీ తెలీని బాల్యాన్ని వదిలేస్తే అన్నీ ముళ్లే, అన్నీ గాయాలే. ఉదయం 10 కి ఇంట్లోంచి బయలుదేరబోతూండగా పక్కింటి చైనా జంట ఒక బ్రెడ్ ట్రే ఇచ్చి బైబై చెప్పేరు. శాన్ ఫ్రాన్సిస్కో ఎయిర్ పోర్ట్ లో బేగేజి వెయిట్ వేయించి వాళ్లకు అప్పగించేసి స్లిప్స్ తీసుకుని నాకిచ్చింది గీత. అక్కడున్న చెయిర్స్ లో కూర్చుని గీత తెచ్చిన ప్రాన్స్ బిర్యానీ తిన్నాం. కస్టమ్స్ చెకింగ్ లో కెళ్లేముందు అంతవరకూ ఉగ్గబట్టుకున్నదుఃఖం ఆగలేదునాకు. గీత నన్ను కౌగలించుకుని ఉండిపోయింది చాలాసేపు. సిరిపాపాయి అమాయకంగా చూస్తోంది. చెకింగ్ పూర్ర్తై నేను మలుపు తిరిగే వరకూ అద్దాల బైటి నుంచి చెయ్యి ఊపుతూనే ఉంది గీత. పొడవైన ఎయిర్ పోర్ట్ లో నడుచుకుంటూ వెళ్లి గేట్ నెం 100 కి లిఫ్ట్ లో దిగి వెళ్లేను. లుఫ్తాన్సాలాంజ్ లో కూర్చుని ఫ్లైట్ నెం 455 కోసం అందరితో బాటు వెయిట్ చేసాను. శాన్ ఫ్రాన్సిస్కో లోకల్ టైం ప్రకారం మధ్యాహ్నం 2.25 కి ఫ్లైట్ బయలుదేరింది, నా సీట్ నెం. 50G మధ్య సీట్ల వరసలోది.

          అలా 6 నెలల నా మొదటి అమెరికా ప్రయాణం ముగిసింది.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.