“పద…అలా నడిచొద్దాం భావుకతలోకి” పెనుగొండ సరసిజ కవిత్వ సమీక్ష

  -గిరి ప్రసాద్ చెలమల్లు

          పెనుగొండ సరసిజ గారి పద… అలా నడిచొద్దాం కవితా సంపుటిలోని కవితలు కొన్ని సమాజంపై ఎక్కుపెట్టిన అస్త్రాలు కాగా మరికొన్ని సమాజంలో మనుగడకు ప్రేమ ఆయుధమంటూ సాగాయి. అనుభూతులను కవితాత్మకంగా మలిచే ప్రయత్నంలో కొన్ని చోట్ల సఫలీకృతం కాగా కొన్ని శైలిలో కొత్తదనం కొరవడినదని చెప్పవచ్చు. పేజీలు తిరగేస్తుంటే ఒకే భావం కొన్ని కవితల్లో వ్యక్తమైంది. అలాంటి కవితలని ఒకే పుస్తకంలో కాక వేర్వేరు పుస్తకాల్లో ముద్రిస్తే బావుండేది. రచయిత్రి ఊహలను అక్షరాల్లోకి ఒంపేటప్పుడు గాఢత కన్నా సరళాన్ని ఎక్కువగా ఎంచుకున్నారు.
 
          తాకి పో మిత్రమా కవితలో మిత్రుని కై నిరీక్షిస్తూ పడే మానసిక స్థితిని పలికిస్తూ “నువ్వొస్తే నిప్పు కుండ నీరై కురిసి నీ గుండెలను తడపడానికి సిద్ధంగా ఉంది “ అంటూ స్పర్శతో వేదనబరువును దించేసుకుంది 
 
          మౌన యుద్ధం కవితలో ఆమెను ఆవిష్కరిస్తూ “కనురెప్పల్లో కరిగిపోయిన రక్త కన్నీరు ఆ యుద్ధ చరిత్రలను లిఖిస్తుంది” అంటూ సాగిన కవిత మలుపులు తిరుగుతూ…”వదిలి వెళ్ళనంటున్న జ్ఞాపకాలు మాత్రం ఒంటరి స్టేషన్లా ఎదురు చూస్తాయి” అని ఆమె మదిని తొలుస్తున్న తీరును కళ్ళ ముందుంచారు వ్యాకరణం కవితలో ఆమెను పరిచయం చేస్తూ నామ సర్వ నామాలతో మొదలెట్టి  విశేషణాల్లో తిట్లను భరిస్తూ “ఈ వ్యాకరణ గ్రంథ సారాన్ని గ్రహించుకోలేక గడ్డ కట్టుకు పోతాను” అనటంలో నిర్లిప్తత ను చాటారు.
 
          ఇంటికో బిడ్డుండాలె కవిత తెలంగాణలో ఆడపిల్లను గౌరవించే విధానాన్ని తనదైన ప్రత్యేక శైలిలో అభివర్ణించి పాఠకులకు చక్కని సందేశం ఇచ్చారు. “తియ్యని అరిశె అసొంటి బిడ్డుండాలె”అనే ఆశలో ఎంతో ఆనందం వుంది. “బిడ్డంటే పండుగనాడు పచ్చని ముగ్గు దినాం కడుపు నింపే బువ్వకుండ బిడ్డ యాడున్నా కంటిపాపల తడిలెక్క “ అనే ముగింపు బిడ్డ ఆవశ్యకతను నేటి సమాజానికి తెలియచేసారు.
 
          ఎవరైనా చెప్పండి కవిత గాజా యుద్ధ నేపథ్యంలో వ్రాస్తూ యుద్దోన్మాదికి ప్రాణం విలువను చెప్పే ప్రయత్నంలో సఫలీకృతురాలైంది. “ప్రాణం పోవడమంటే తెలియని ఆ పసిపాప పట్టుకున్న పుస్తకాలను గుండెలకు హత్తుకోనివ్వండి” అంటూ చిన్నారుల భవిష్యత్తును చిదిమేస్తున్న సామ్రాజ్య వాదాన్ని ఎండగట్టుతూ “అభివృద్ధంటే రాక్షస కౌగిళ్ళు కావు” అని తూలనాడారు.
 
          మె (పు) ట్టినూరులో “జాడ మరిశినమనుకుంటే పొలాల జాగల ప్లాట్లు పరేశాన మైనమని పానమంతా తండ్లాడే” అని వ్రాయటంలో అంతర్వేదన మెండుగా ఉంది. పచ్చని పొలాలన్నీ రాళ్ళు పాతి చెరలో వుండటం రుచించని రచయిత్రి కలాన్ని ఝుళి పించారు.”రాంగ రాంగ పోషవ్వ గుడికి పోతే రాళ్ళతో నున్న గుడిని రాయల్ కాంక్రీట్ తో కట్టిరి” లో బహుజన కొలువుల హైందవీకరణను లోగుట్టుగా వెలిబుచ్చారు. కలిసి తడుద్దాంలో “నీవు రాలేదని విరహంతో కురుస్తున్న మేఘాలు మనిద్దరిని కలిసి రమ్మం టున్నాయి” లో మేఘాలతో రాయబారం పంపిస్తూ “కాసింత వానకు కాపలా కాయవోయి కలిసి తడుద్దాం” అంటూ ప్రియమైన వానకోసం పరితపించిన మనసును స్వేచ్ఛగా విహరింప చేసారు.
 
          బిడ్డ నవ్వులో “ఆ మెరిసే కళ్ళు నా ఇంట దిగుట్ల దీపాలు” బిడ్డ జ్ఞానానికి ప్రతీకలు అనే అర్థంలో వ్రాస్తూ “నా ఇంట్ల నా బిడ్డ నవ్వు నా ప్రేమ దూప తీర్చే బిందెడు నీళ్ళు” తల్లి బిడ్డ నవ్వు కై పడే తపనను ఒలికించారు.
 
          అమీబా కవితలో ఆమెకి ఆమె యే వనరు అనుకుని “ఈమె  ఏక కణజీవే” మరో డార్విన్ కూడా రాడు ఆమె కోసమనే ధోరణిలో ఈమె రూపాంతరం చెందక పోగా “కొందరి కొత్త చివుర్ల కోసం ఈమె చినుకై మళ్లీ మళ్లీ కురుస్తుంది” అని ఆమె నిస్వార్థాన్ని ప్రపంచం ముందుంచారు.
 
          నాంది కవిత రైతు పోరాటం దృష్ట్యా వ్రాస్తూ “రక్త ధారలతో తడిచిన రహదారులు కార్చిన కన్నీటి చారికల కథేంటో ఇక చరిత్రలో చెక్కబడాల్సిందే”అని నిర్ద్వందంగా నినదించారు.”ఇక ఈ పాదాలు విప్లవ విత్తనాలు నాటే నాగళ్ళు” అని ప్రజాపోరాటాలను శ్లాఘిస్తూ రేపటి తరానికి దిశా నిర్దేశం చేసారు.
 
          అ (క) న్నీటిని కడగబడును కవిత “లేవగానే ముఖం కంటే ముందు అద్దాన్ని చూస్తాను ఎంత మలిపినా మరికొన్ని మరకలు మిగిలి పోతాయి మరకలు నావి కావు రాత్రంతా కార్చిన నీ కన్నీటి చారికలు అంటుంది”అంటూ ఆమె అంతర్మథనాన్ని అద్దంతో ప్రతిబింబించారు.
 
          ఏడుంది మరుగు కవితలో తరాలుగా ఆమె పడుతున్న మరుగు దొడ్ల కష్టాలను ఏకరువు పెడుతూ శారీరక ఇన్ఫెక్షన్ లకి మూలమైన విసర్జన ప్రక్రియ ఆపుదల యేననే సత్యాన్ని గుర్తించి నేటికీ పడుతున్న ఇక్కట్లను అక్షరీకరించారు.
 
*****
Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.