పౌరాణిక గాథలు -28

-భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి

గర్వభంగము – విశ్వామిత్రుడు కథ

          పూర్వం గాధి కొడుకు విశ్వామిత్రుడు కన్యకుబ్జానికి రాజు. అతడు గొప్ప పరాక్రమవంతుడు. అతణ్ని ఎదిరించి నిలబడ గలిగిన రాజు భూమండలంలో లేడు.

          అందువల్ల నిర్భయంగా రాజ్య పాలన చేస్తూ ఉండేవాడు. తను క్షత్రియుడవడం, తనను ఎదిరించే రాజు మరొకడు లేకపోవడం వల్ల క్షాత్రియుడి బలమే బలమని అనుకుంటూ గర్వపడుతూ ఉండేవాడు.

          బ్రాహ్మణుల్నిగాని వారి తపశ్శక్తినిగాని కొంచెమైనా గౌరవించేవాడు కాదు. చాలా అహంకారంతో జీవించేవాడు. విశ్వామిత్రుడికి ఒకరోజు వేటాడాలన్న కోరిక కలిగింది.

          సైన్యాన్ని తీసుకుని బయలుదేరి వేట కోసం అడవికి వెళ్లాడు. చాలా సేపు వేటాడ్డం వల్ల అలిసిపోయాడు.

          అప్పటికే చాలా పొద్దెక్కడంతో ఎక్కడైనా విశ్రాంతి తీసుకోవాలని అనుకున్నాడు. అందుకు అనువుగా ఉండే ప్రదేశం దొరుకుతుందే అని చుట్టూ చూశాడు.

          కొంచెం దూరంలో అతడికి ఒక మహర్షి ఆశ్రమం కనిపించింది. అక్కడే తిరుగు తున్న మునికుమారుల్ని పిలిచి దూరంగా కనిపిస్తున్న ఆ ఆశ్రమం ఎవరిదని అడిగాడు.

          ముని కుమారులు అది వసిష్ఠ మహర్షి ఆశ్రమం అని చెప్పి విశ్వామిత్రుణ్ని ఆశ్రమానికి తీసుకుని వెళ్లారు.

          విశ్వామిత్ర మహారాజు వచ్చాడని తెలుసుకున్న వసిష్ఠ మహర్షి అతడికి ఎదురు వెళ్లి లోపలికి తీసుకుని వచ్చి అర్ఘ్యపాద్యాలిచ్చి గౌరవించాడు.

          మహారాజు, అతడి సైన్యం కూడా వేటలో అలిసిపోయి ఉన్నారని అర్ధం చేసు కున్నాడు. వాళ్లందరికి భోజన సదుపాయాలు ఏర్పాటు చెయ్యమని కామధేనువుకి  పురమయించాడు.

          మహర్షి నోటి నుంచి మాట వచ్చిందో లేదో వెంటనే నదిలా ప్రవహించేట్టు నెయ్యిని సమకూర్చింది. అన్న రాశుల్ని పర్వతాల వరుసల్లా పేర్చింది.

          తాగేందుకు రకరకాల రసాలు ఏర్పాటు చేసింది. భక్షించడానికి అనువైన భోజ్యాలన్నీ కామధేనువు కొరత లేకుండా సృష్టించింది.

          మహారాజు విశ్వామిత్రుడు అతడి సైన్యం వాటిని తృప్తిగా తిని విశ్రాంతి తీసుకున్నారు.

          తనకు, తన సైన్యానికి క్షణంలో అద్భుతంగా అనేక పిండివంటలతో పంచభక్ష్య పరమాన్నాలు సిద్ధం చేసింది.  తృప్తిగా భోజనం పెట్టిన కామధేనువుని ఆశ్చర్యంగా చూశాడు విశ్వామిత్రుడు.

          దాని వైపే చూస్తూ మనస్సులో “శంఖాలవంటి చెవులు, మెత్తని నిండైన పొదుగు, కురుచగా పదునుగా ఉన్న కొమ్ములు, మృదువైన రోమాలు, శరత్కాల చంద్రుడి కాంతి వంటి శరీర ఛాయ కలిగిన ఈ కామధేనువు పెన్నిధి దొరికినట్టు మహర్షికి దొరికింది. దీన్ని ఎలాగయినా తను దక్కించుకోవాలి” అనుకున్నాడు.

          విశ్వామిత్రుడికి కామధేనువుని దక్కించుకోవాలన్న కోరిక అంతకంతకి పెరిగి పెద్దదయింది. దాన్ని తనకు ఇవ్వమని అడుగుదామని వసిష్ఠ మహర్షి దగ్గరికి వెళ్లాడు.“

          ““మహాత్మా! మీరిచ్చిన ఆతిథ్యంతో మా ఆకలి బాధ తీరింది. మీరు సంకల్పించగానే మీ కామధేనువు మాకు అందరికి ఆరు రుచులతో రుచికరమైన భోజనం పెట్టి మమ్మల్ని తృప్తి పరిచింది.

          భోగాలు వద్దనుకుని అడవిలో చేరి కందమూలాలు తిని జీవించే మీకు ఈ కామధేనువు వల్ల ఉపయోగం ఏముంటుంది? ఇది ఇక్కడ ఉండడం వల్ల ప్రమాదం కూడా. ఈ కామధేనువు కల్పించే భోగాలవల్ల మీకు వాటి మీద ఇష్టం పెరిగి మీ తపస్సుకి భంగం కలగచ్చు.

          హోమాలకి ఉపయోగించే ఆవులు ఉండవలసిన చోట ఇటువంటి కామధేనువు ఉండకూడదు. కాబట్టి దీన్ని నాకు ఇవ్వండి. దీని బదులుగా లక్ష ఆవుల్ని మీకు ఇస్తాను!””” అన్నాడు.

          అతడి మాటలు విని వసిష్ఠుడు చిరునవ్వుతో “ “ “రాజా! ఇంత చిన్న కామధేనువు కోసం మీరు నాకు లక్ష ఆవుల్ని ఇవ్వడం ఎందుకు? వాటిని నేను ఎలా పోషించగలను, ఎలా కాపాడగలను?

          పితృదేవతల్ని, మీ వంటి అతిథుల్ని తృప్తిపరచడానికి ఇది నాకు చాలా ఉపయోగంగా ఉంది. దీన్నినేను ఏ పరిస్థితుల్లోను ఎవరికీ ఇవ్వను””” అని చెప్పాడు.

          కోప స్వభావం కలిగిన విశ్వామిత్రుడు వసిష్ఠుడితో“ ““మహర్షీ! నేను క్షత్రియుణ్ని. ఏదైనా చెయ్యగల సమర్ధుణ్ని. నువ్వు బ్రాహ్మణుడివి శాంత స్వభావం కలవాడివి. దీని బదులుగా లక్ష ఆవుల్ని ఇస్తానని చెప్పాను. వాటిని కూడా నువ్వు వద్దన్నావు. దాన్ని నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా లక్ష ఆవుల్ని ఇవ్వకుండానే దీన్ని బలవంతంగా తీసుకుని వెళ్లగలను””” అని చెప్పి నందినిని తీసుకుని రమ్మని సైనికులకి పురమాయించాడు.

          మంచివాళ్లని ఇతరుల వల్ల బాధ కలగకుండ రక్షించ వలసినవాడు  రాజు. అటువంటి రాజే మంచి వాళ్లని బాధిస్తున్నప్పుడు ఇంక ఎవరికి చెప్పుకోవాలి?

          గాధిరాజు చెప్పినట్టు సైనికులు కామధేనువు చుట్టూ చేరారు. అది సైనికులకి దొరక్కుండా వాళ్లు కొట్టే దెబ్బల నుంచి రక్షించుకుంటూ బాధతో అరుస్తూ వసిష్ఠుడి దగ్గరకు వచ్చింది.

          “ “ “మహాత్మా! ధర్మరక్షణ తెలియని వాళ్ల దగ్గరికి నన్ను ఎలా పంపిస్తున్నారు. మీరు వాళ్లని దండించకుండా ఎందుకు ఉపేక్షిస్తున్నారు? ఇది మీకు ధర్మంగా అనిపిస్తోందా?””  అని అడిగింది.

          కామధేనువు మాటలకి వసిష్ఠమహర్షి సమాధానం చెప్పలేదు.

          మహర్షి ఏ సమాధానం ఇవ్వక పోవడంతో ఆయన మనస్సు తెలుసుకుని తనని వాళ్లకి ఇవ్వలేదని గ్రహించింది.

          వెంటనే తన తోకని పట్టుకున్న సైనికుల వైపు పరుగెత్తింది. సైనికులు కామధేనువు వెనక పరుగెత్తారు.

          మండు వేసవి కాలంలో మధ్యాహ్న సమయంలో మండిపడే సూర్యబింబంలా కనిపిస్తున్న కళ్లతో ఒక్కసారి ఆ సైన్యం వైపు చూసింది.

          వెంటనే వాళ్ల మీద అగ్ని వర్షం కురిసింది.

          అదే సమయంలో దాని తోక నుంచి శబర సేనలు, శుక్ర మూత్రాల నుంచి శక, యవన, పుండ్ర, పుళింద, ద్రవిడ, సింహళ  సేనలు పుట్టుకొస్తున్నారు.

          అలా పుట్టుకొచ్చిన సైన్యం శత్రుసైన్యం కంటే ఎక్కువగా ఉన్నారు. ఆ సైన్యం విశ్వామిత్రుడి సైన్యాన్ని ఒక్క నిముషంలో చీల్చి చెండాడి అదృశ్యమయింది.

          బ్రహ్మ తేజస్సుతో పుట్టిన సైన్యాన్ని దాని ప్రభావాన్ని చూసి విశ్వామిత్రుడు సిగ్గుతో తలవంచుకున్నాడు. తన క్షత్రియ బలం కంటే తపో బలమే గొప్పదని తెలుసు కున్నాడు.

          తనను ఎదిరించి నిలవ గలిగిన రాజు లేడని గర్వంతో విర్రవీగిన తనకి ఈ కామధేనువు గుణపాఠం చెప్పిందని అనుకుని తిరిగి తన రాజ్యానికి వెళ్లిపోయాడు.

గర్వంతో విర్రవీగేవాడు పశువు కంటే హీనం!!

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.