
బాడీ షేమింగ్
-కందేపి రాణి ప్రసాద్
“అమ్మా మన వీపుమీద మూటలా ఇదేమిటి? చాలా అసహ్యంగా ఉన్నది ఏమీ బాగా లేదు. గుర్రాలు చాలా అందంగా ఉన్నాయి. మనమలా లేము ఎందుకమ్మా” పిల్ల ఒంటె తల్లిని భాధగా అడిగింది.
అక్కడొక బీచ్ ఉన్నది. బీచ్ ఒడ్డున ఒంటెలు తిప్పేవాడు మనుష్యులను ఎక్కించు కుని తిప్పుతూ ఉంటాడు. నాలుగు ఒంటెలున్నాయి వాడి దగ్గర ఉన్న ఒంటెలతో పిల్లలను పెద్దలను ఎక్కించుకుని అటు ఇటు తిప్పుతూ వాళ్ళిచ్చే డబ్బులతో జీవనం సాగిస్తూ ఉంటాడు. అదేబీచ్ లో మరొకతను గుర్రాలను తిప్పుతూ ఉంటాడు. ఆ బీచ్ కు ప్రయాణీకులు బాగా వస్తుంటారు. అందుకే వీళ్ళు గుర్రాల మీదా, ఒంటెల మీదా ప్రయాణీకుల్ని ఎక్కించుకుని తిరుగుతూ ఉంటారు.
తల్లి ఒంటె సేదతీరుతూ ఉన్నది. పిల్ల ఒంటె అడిగిన ప్రశ్నకు తీరుబడిగా సమాధానం చెప్పింది. “చూడమ్మా! మనం ఎడారిలో బతికే జంతువులం. ఎడారి వాతావరణానికి అనువుగా మన శరీర నిర్మాణం ఉంటుంది. ఎడారిలో ఇసుక ఎక్కువగా ఉంటుంది. ఇసుకలో కూడా మనం చక్కగా నడవగలం.
సరే అమ్మా! ఇంతకీ వీపు మీద మూట గురించి చెప్పలేదు. గుర్రం పిల్ల నన్ను ‘గూనిదానా’ అని వెక్కిరించింది”అని పిల్ల ఒంటె చెప్పింది. “దాన్ని మూట అనకూడదమ్మా. దాని పేరు మూపురం. మన శరీరం దాంట్లో మాంసకృత్తులను దాచు కుంటుంది. అందువల్ల ఎత్తుగా ఉంటుంది. కానీ గూనికాదు. ఈ సారి గుర్రపిల్ల ఎగతాళి చేస్తే చెప్ప్పు. మనకు ఎడారిలో ఎక్కడంటే అక్కడ ఆహారం దొరకదు కాబట్టే ప్రకృతి మనకీ ఏర్పాటు చేసింది. ‘ వివరంగా పిల్ల ఒంటెకు అర్థమయేలా చెప్పింది తల్లి ఒంటె.
“మరి మనం ఎడారిలో ఉండకుండా ఇక్కడ ఎందుకున్నాము. ఇక్కడ ఈ మనుష్యులను ఎక్కించుకుని అటుఇటు తిరగాలి. మాటిమాటికీ కింద కూర్చుని మరల లేవాలంటే చాలా కష్టం కదమ్మా!” తన మనసులోని సంశయాన్ని బయట పెట్టింది పిల్ల ఒంటె.
“నిజానికి మన పూర్వీకులు ఎడారుల్లోనే ఉండేవారు. ఎడారుల్లో ఇసుక తుఫానులు బాగా వస్తుంటాయి. ఒకసారి వచ్చిన పెద్ద ఇసుక తుఫానులో మా అమ్మానాన్నా అందరూ చనిపోయారు. ఆ తర్వాత ఆ దారిన వెళుతున్న ఒక వ్యాపారి నన్ను తీసుకుని ఊర్లోకి వచ్చాడు. అప్పట్నుంచి అతనే నాకు తిండి పెడుతున్నాడు. నేను ఇక్కడే అతనికి సహాయం చేస్తున్నాను.” అంటూ తన పూర్వీకులు సహారా ఎడారిలో ఎలా చనిపోయారో గుర్తుకొచ్చి కళ్ళ వెంట నీళ్ళు కార్చింది.
‘అమ్మా నేను నిన్ను బాధపెట్టానా!’ భాధగా అడిగింది పిల్ల ఒంటె తల్లి కళ్ళ నీళ్ళు తుడుస్తూ. “లేదమ్మా! మా అమ్మానాన్నా గుర్తుకొచ్చారు. ఇప్పుడేమీ ఏడవడం లేదు. నాకు నువ్వు ఉన్నావుగా” అంటూ తల్లి ఒంటె తన పిల్ల మూతిని ముద్దుపెట్టుకున్నది.
“అమ్మా అమ్మా ! మరో సందేహం. మన పెదవులు ఎందుకు ఇంత లావుగా ఉన్నాయి. నాకు నచ్చడం లేదు” పిల్ల ఒంటె అసహ్యంగా మొహం పెట్టి అన్నది.” నీతో ఎవరన్నారు ఈ మాట. నిన్నెందుకు బాధపెడుతున్నారు.” అని తల్లి తన బిడ్డ బుగ్గలు నిమురుతూ అన్నది.
“మొన్న ఆడుకోవటానికి వెళ్ళినపుడు కోతిపిల్ల అన్నదమ్మా! నా మూతి లావుగా బండగా ఉన్నదట ” పిల్ల ఒంటె చెపుతూ బాధపడింది. ఆ రోజు విషయం మనసులోకి రాగానే మొహం కాంతి హీనంగా మారిపోయింది.
తల్లి ఒంటె తన పిల్లను దగ్గరకు తీసుకున్నది. వీపు మీద నిమరింది. తర్వాత మెల్లగా చెప్పింది. “చూడమ్మా మనం ఎడారుల్లో జీవించే వాళ్ళం కదా! ఎడారుల్లో ఎక్కువగా ముళ్ళమొక్కలే ఉంటాయి. ఎందుకంటే అక్కడ నీరు దొరకదు కాబట్టి. అలాగే మనం కూడా ముళ్ళున్న చెట్లను తినవలసి వస్తుంది. కాబట్టి పలచటి పెదవులుంటే మూతి కోసుకుపోతుంది. కాబట్టి మన పెదవులు లావుగా ఉంటాయి. దాంతో ఎలాంటి ముళ్ళ చెట్టునైనా తినేయవచ్చు.
అలాగే ఇంకా సదుపాయాలున్నాయి. “ఎన్ని రోజులైనా అలసిపోకుండా నడవ గలం. నీరు, ఆహారం లేకపోయినా నెలల తరబడి ఓర్చుకోగలం రోజుకు ఇరవై మైళ్ళు అలసిపోకుండా ఎవరైనా నడవగలరా! మనం నడుస్తాం తెలుసా! నీళ్ళను కడుపులో దాచుకోగలం” అంటూ తల్లి ఒంటె ఉత్సాహంగా చెప్తూ ఉన్నది.
అమ్మ అమ్మా! అంటూ తల్లిని కుదుపుతూ ఏదో గుర్తుకు వచ్చిన దానిలా పిల్ల ఒంటె తల్లిని పిలిచింది. ఒంటెల గొప్పదనాన్ని గొప్పగా చెబుతున్న తల్లి ఒంటె తల తిప్పి పిల్ల వంక చూసింది “అమ్మా మన కను బొమ్మలు అందంగా ఉండవట కదా! దళసరిగా ముళ్ళ పంది ముళ్ళలా ఉన్నాయని ఎలుక పిల్ల అన్నది” అంటూ పిల్ల ఒంటె బుంగమూతి పెట్టుకున్నది.
“నిన్ను ఇన్నన్ని మాటలు ఎవరంటున్నారే తల్లీ! అయినా మన జంతువుల క్కూడా మనుష్యుల బుద్ధులు వచ్చాయి. పక్కన వారిని ఎగతాళి చేయడం వాళ్ళకో దుర్గుణం. మనుష్యులతో సావాసం చేసి జంతువులూ చెడిపోయాయి. ఇదేం పాడుబుద్ధి! పిల్లలందరూ కలసి ఆడుకోవాలి గానీ ఇలా వెటకారంగా మాట్లాడతారా! అంటూ తల్లి ఒంటె బాధ పడింది. పిల్ల ఒంటెకు ఇవేమి పట్టలేదు. తన కళ్ళ మీద ఉన్న వెంట్రుకల్ని పట్టుకుని చూసుకుంటూ ఉన్నది. మళ్ళీ తనే అడిగింది. ‘కనుబొమ్మలు బాగాలేవా’ అన్నది.
తల్లి ఒంటెకు అర్థమైంది వాళ్ళన్న మాటలు పిల్ల మీద ఎంత ప్రభావం చూపాయో! పిల్లలు ఎప్పుడూ అంతే ప్రక్కన వారి మాటలకు ఎక్కువ విలువిస్తారు. అయినా తల్లి దండ్రులు పిల్లల్ని పెంచేటప్పుడు తోటి పిల్లల్ని ఎగతాళి చేయకూడదని నేర్పించాలి కదా! అసలు తప్పు తల్లిదండ్రులదే పిల్లలకెలా తెలుస్తుంది. ఏం మాట్లాడాలో, ఏం మాట్లాడకూడదో! బహుశ ఆ తల్లిదండ్రలు పిల్లల ముందు వేరే వారితో ఇలా ప్రవర్తించి ఉంటారు. అందుకే వాళ్ళు అలా తయారు అయ్యారు. అని మనసులో ఆలోచిస్తూ ఉన్నది.
పిల్ల ఒంటె అమ్మను తట్టి ఏమైందన్నట్లుగా కనుబొమ్మలు ఎగరేసింది. తల్లి ఒంటెకు కను బొమ్మల విషయం గుర్తోచ్చింది. చిట్టి తల్లీ! మన కళ్ళకు మూడు పొరల్లో రెప్పలు ఉంటాయి. ఎడారుల్లో ఉండే ఇసుకను తట్టుకోవడానికి ఈ ఏర్పాటు జరిగింది. ఒక రెప్పను మూసుకుంటే ఇసుక లొపలికి వెళ్ళదు. కానీ వెలుతురు కవిపిస్తుంది. అలాగే ముక్కులో నుంచి కూడా ఇసుక లొపలికి వెళ్ళకుండా వెంట్రుకలు దట్టంగా ఉంటాయి. ఇవన్నీ మన జీవన విధానానికి అనుకూలంగా ఏర్పడిన పరిణామాలు మన శరీరాల గురించి ఎవరు ఏమన్నా పట్టించుకోకూడడు. జీవితాలకు తగినట్లుగా శరీర నిర్మాణం జరుగుతుం.ది చెప్పింది తల్లి ఒంటె పిల్లను ఉద్దేశించి.
పిల్ల ఒంటెకు కొంత అర్థమయింది. కొంత అర్ధం కాలేదు. అయినా తలూపింది అర్థమైనట్లుగా.
చూడమ్మా! “వేరే పిల్లలు నీ శరీరం గురించి ఎగతాళిగా మాట్లాడితే నీకు బాధనిపిం చింది కదా, అందుకని నువ్వు వేరే జంతువుల పిల్లల్ని ఎగతాళి చేయకూడదు. అందర్నీ ప్రేమగా పలకరించాలి. నచ్చితే కలసి ఆడుకోవాలి. లేదంటే దూరంగా ఉంచాలి. నువ్వెప్పుడూ ఎవర్నీ బాధించవు నాకు తెలుసు” అంటూ తల్లి ఒంటె తన పిల్లకు చక్కగా చెప్పింది.
పిల్ల ఒంటె “నిజమేనమ్మా నేనెప్పుడూ ఎవర్నీ ఎగతాళి చేయను. ఎవరైనా ఎగతాళి చేసినా నేను కూడా బాధ పడను. పట్టించుకోను సరేనా అమ్మా! అంటూ తల్లి ముఖానికి తన ముఖాన్ని ఆనించి చెప్పింది.
*****

నేను ప్రధానంగా బాలసాహిత్యం రాస్తాను.నేను సుమారుగా 40పుస్తకాలు రచించాను. బాలసాహిత్యం_విజ్ఞానికరచనలు అంశంపై PhD చేశాను.తెలుగు విశ్విద్యాలయం వరి ఉత్తమ రచయిత్రి పురస్కారం అందుకున్న ను.20 ప్రక్రియలలో రచనలు చేశాను.టీచింగ్ aids,memontoes, బొమ్మలు చార్టులు,చేయటం ఇష్టం. మిల్కీ museum nu నిర్వహిస్తున్నాం.sweety children library nI pillala kosam pettanu.