
బొమ్మల్కతలు-29
-గిరిధర్ పొట్టేపాళెం
వెన్నెల రాత్రి – నల్లని ఆకాశంలో మెరిసే తెల్లని నిండు జాబిలి ప్రసరించే వెండి కాంతుల తీగలు మెల్లగ మీటే చల్లని గాలి, ఆ వెన్నెల గాలిలో విహరిస్తూ పొందే అనుభూతిని మాటల్లో వర్ణించటం అంటే ఎవరికైనా కష్టతరమే. ఏ కవి హృదయానికైనా అనుభవం పొందితే తప్ప ఆ వర్ణన అంత సులభంగా అందదు. అలాంటి ఆ అనుభూతిని రెండు పదాల్లో వర్ణించాల్సి వస్తే – ఇది అసలు సాధ్యమేనా అనిపిస్తుంది.
“వెన్నెల్లో ఆడపిల్ల” – ఒకవేళ ఇవి ఆ వర్ణన రెండు పదాలు అయితే? పక్కపక్కన చేరిన ఈ రెండు పదాలు ఏ మనసునైనా తప్పక ఊహల పదనిసల్లోకి తీసుకుపోయి వెన్నెల తోటలో విహరింపజేస్తాయి. మనసు ఊహల విహారాలకి కవి కానవసరం లేదు, ఆ ఊహల అనుభూతిన ఊయలలూగగల హృదయముంటే చాలు.
సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజి, విజయవాడ – మరవలేని, మరపురాని నా ఒంటరి పెయింటింగ్ పయనానికి నాంది. అప్పటి వార పత్రికల్లోని కథలు, సీరియల్స్, నవలలు, వాటిల్లోని బొమ్మలు ఎంతో మందిని ప్రభావితం చేస్తున్న, చేసిన రోజులవి. అప్పటికి నేనూ కొన్ని తెలుగు నవలలు చదివున్నా కానీ, “యండమూరి వీరేంద్రనాథ్” గారి “వెన్నెల్లో ఆడపిల్ల” నవల గురించి వినటమే తప్ప ఇంకా చదవలేదు. మా హాస్టల్ లో కొందరు కాలేజి పక్కనే ఉన్న “తాడిగడప” లో ఒక చిన్న షాప్ నుంచి నవలలు రెంట్ కి తెచ్చి చదువుతూ ఉండేవాళ్ళు. అలా ఒకసారి ఎవరో తెచ్చిన ఈ నవల చేతులు మారుతూ నా చేతికొచ్చింది. ఓ మధ్యాహ్నం మొదలు పెట్టి ఏకబిగిన చదవటం పూర్తి చేసినా పూర్తిగా అందులో నుంచి బయటికి రావటానికి చాలా సమయం పట్టింది. చాలా రోజులు ఆ నవలలోని సన్నివేశాలు నున్ను వెంటాడుతూనే ఉండిపోయాయి. ఏ పత్రిక అయినా, నవల అయినా అక్షరాలకన్నా నేను మొదట చూసేది మాత్రం అందులోని బొమ్మల్నే. చదవక ముందు ఆ నవలపైన చూసిన ముఖచిత్రానికీ, చదివాక పరిశీలించి మరీ మరీ చూసిన అదే ముఖచిత్రానికీ తేడా మనసు మాటల్లో చెప్పటం చేతకాని అప్పటి నా ఆ అనుభూతి నాతో ఆ బొమ్మని వేయించింది. “వెన్నెల్లో ఆడపిల్ల” – పొందికైన ఈ రెండు పదాల కి ఆర్టిస్ట్ “చంద్ర” గారు వేసిన ఆ బొమ్మ అంతే పొందికగా కుదిరింది అనిపించింది. ఆ కథా, కథనం నన్నెంతగా కదిలించాయో, ఆ ముఖచిత్రమూ అంతగానే కదిలించింది.
ఈ నవల్లో పాత్రల పరిచయం, వాటిని నడిపించిన తీరూ ఒక అద్భుతమైన అనుభూతిని మిగిలిస్తుంది. కథా నాయకుడు “రేవంత్”, ఒక చెస్ ఛాంపియన్ ప్లేయర్. అందం, తెలివీ, చదువూ ఉన్న కథానాయకి “రమ్య” అతనికి కనపడకుండా, దోబూచు లాడుతూ అతని మేధస్సుకి పెట్టే చిన్న చిన్న చిక్కుముడి లాంటి పరీక్షలు, వాటిని విడదీస్తూ వివరిస్తూ చెప్పే సమాధానాలూ, ఆమెని చూడాలన్న కుతూహలం పెరుగు తున్నా అతనికి కనపడని ఆమె, వారిద్దరి మధ్యా జరిగే సంఘటనలు ఇవన్నీ పాఠకుల్ని వెన్నెల తోటల్లో దోబూచులాడుతూ కనిపించినట్టే అనిపిస్తూ, కనిపించక అక్కడక్కడా కట్టిపడేస్తూ, మనసుని సుతిమెత్తగా తాకుతూ వెళ్ళిపోయే చల్లని వెన్నెల పిల్ల గాలుల్లానే అనిపిస్తూ సాగిపోతాయి.
కథానాయకి తన ఫోన్ నంబర్ కనిపెట్టమని అతనికి క్లూలు ఇస్తూ, అతని మేధస్సు కు పరీక్షలు పెడుతూ ఇలా చాలా ఆసక్తికరంగా వారిద్దరి మధ్యా కథనం సాగిపోతుంది. చివరికి కనిపెట్టి చెప్పాలనీ, ఆమెని చూసే ఘడియలు సమీపిస్తున్న వేళ అతని చేతికి అందించిన ఆమె రాసిన ఆఖరి ఉత్తరం, అప్పటికే వెన్నెల కిరణం వీడి చీకటిలో కలసి వెళ్ళి పోయిందని తెలిసీ, దగ్గరికెళ్ళి ఆమెని ఒకసారి చూడాలని మనసు బలంగా లాగుతున్నా, గులాబి రేకుల మధ్యన ఆమె చేతిని మాత్రమే చూసి, ఇంతదాకా తనని ఊహల్లోనే ఊహించుకుటూ వస్తున్న తన రూపంని మది ఊహల్లోనే నిలుపుకోవాలని, కాలిన చితి ఆరేదాకా అక్కడే ఉండి వెనుదిరిగినపుడు రాలిన ఒక కన్నీటిబొట్టు మాటున మౌనం మాట్లాడే మాటలు ముగింపుగా ఆగే ఆఖరి పేజీతో పాఠకుని గుండె తడైపోతుంది. ఒక్కసారి చదివితే ఎప్పటికీ తడి ఆరని ఆ అనుభూతి మదిలో సజీవంగా మిగిలిపోయేలా ఆ ముగింపు ఇచ్చిన రచయితకి హ్యాట్సాఫ్ చెప్పక తప్పదు. ఆద్యంతమూ వాళ్ళిద్దరి పాత్రలనీ కథలో నడిపించిన తీరు, అన్నిటికీ మించి ముగింపు, చివరికి ఆఖరి వాక్యమూ అన్నీ ఒక మధురానుభూతిలా ఎప్పటికీ గుర్తుండిపోతాయి.
“వెన్నెల్లో ఆడపిల్ల” అన్న పేరు ఈ నవలకి ఎంత చక్కగా అమరిందో, ఆ రెండు తెలుగు పదాల కలయికకి ఆ చంద్రుని పేరున్న ఆర్టిస్ట్ “చంద్ర” గారు వేసిన ముఖచిత్రం బొమ్మ వెన్నెలంత పొందిగ్గా ఒద్దిగ్గా ఒదిగి మెరిసింది. అప్పటి నా జ్ఞాపకాల్లో ఆ నవలకి ప్రముఖ ఆర్టిస్ట్ “చంద్ర” గారు వేసిన బొమ్మ ఆరెంజ్ కలర్ బ్యాక్ గ్రౌండ్ లో నలుపు తెలుపు సన్నని చెస్ బోర్డ్ గళ్ళలో కలిసి, పెద్ద పెద్ద కళ్ళతో, నుదుటిన పెద్ద బొట్టుతో, అందం మేధస్సూ రెండూ కలిసి, ముగ్ధ మనోహరంగా కనిపించే ఒక అమ్మాయి క్లోజప్ ఫేస్. చూడగనే “వెన్నెల్లో ఆడపిల్ల” అనిపిస్తుంది. తీర్చి దిద్దినట్టున్న ఆ బొమ్మ ఇప్పటికీ నా కళ్ళకి కట్టినట్టే ఉంది. ఆ నవల, ఆ నవలా ముఖచిత్రం మిగిల్చిన ఆ మధురాను భూతిని, అప్పుడప్పుడే కుంచె తడబడుతూ బుడి బుడి గీతల అడుగులు వేస్తున్న నా బొమ్మల ప్రయాణంలో పదిలపరచాలని చేసిన ప్రయత్నమే ఈ ఇండియన్ ఇంక్ తో వేసిన “వెన్నెల్లో ఆడపిల్ల” బొమ్మ. మెడని తాకుతూ ఎడమ చెంప కింది వంపు దగ్గర పడ్డ కష్టం మాత్రం గుర్తుంది. ఈ బొమ్మ నాడి అక్కడే ఉంది. పూర్తి గా “ఇండియన్ ఇంక్” లో కుంచె ముంచి అద్దిన బ్లాక్ అండ్ వైట్ చిత్రం ఇది. ఇంక్ ని నీళ్ళల్లో కలిపి పలుచని గ్రే కలర్ షేడ్స్ అక్కడక్కడా కనిపిస్తాయి. కుంచె తడబాటు అడుగులూ స్పష్టంగా కనిపిస్తాయి.
ఇప్పుడు మార్కెట్ లో దొరికే ఈ నవల కొత్త ప్రింట్ ముఖచిత్రం బొమ్మ అలానే ఇంకెవరో వేసినా “చంద్ర గారు” వేసిన బొమ్మంత అందంగా మాత్రం లేదు. నా జ్ఞాపకాల్లో నిలిచిన అప్పటి ఈ నవల ముఖచిత్రం తర్వాతెక్కడా కనిపించలేదు. రీప్రింట్ కి వేసిన ముఖచిత్రం ఒరిజినల్ “చంద్ర” గారు వేసిందైతే కాదు, ఆ ఫీల్ కూడా రాలేదు. ఆర్టిస్ట్ “చంద్ర” గారు అంటే నా మదిలో మెదిలే అతికొద్ది బొమ్మల్లో ఇది ఒకటి. దీనికి ముందు ఇంటర్మీడియట్ లో ఉన్నపుడు “చంద్ర” గారు వేసిన ఒక బొమ్మ అచ్చుగుద్దినట్టు వేశాను, కాలంతో ఎక్కడో కనపడకుండా వెళ్ళి పోయిన ఆ బొమ్మే మొదటిది.
తెలుగు అక్షరానికే కాదు, తెలుగుదనానికీ వన్నెలు అద్దిన అందరి అభిమాన ఆర్టిస్ట్ “బాపు” గారు మెచ్చిన ఇప్పటి తరం ఆర్టిస్ట్ “అన్వర్” గారు, పదిహేనేళ్ళక్రితం నా బ్లాగ్ లో నా ఈ “వెన్నెల్లో ఆడపిల్ల” బొమ్మని చూసి, “ఆ గడ్దం కింది వంపుని ఒడిసి పట్టటం అంత సులభం కాదు గిరిధర్ గారూ!” అంటూ చేసిన వ్యాఖ్య నా ఈ బొమ్మకి లభించిన ఒక గొప్ప కితాబు. “చంద్ర” గారి “డెబ్బయ్యవ” పుట్టినరోజుకి “ఒక చంద్రవంక” అన్న టైటిల్ తో ఆర్టిస్ట్ “అన్వర్” గారు పూనుకుని ప్రచురించిన పుస్తకంలో “ఒక చెరగని ముద్ర చంద్ర” అని చంద్రగారి బొమ్మలతో నాకున్న అనుభవాల్ని నెమరువేసుకుంటూ నేను రాసిన వ్యాసానికి ఓ రెండు పేజీలు చోటు దక్కటం నా బొమ్మలు నాకందించిన వరం. ఆ వ్యాసం లోని ఆఖరి వాక్యం – “ఆయన ఎరుగని ఆయన కోట్లాది అబిమానుల సమూహంలో ఒక గిరిధర్”. కానీ అది ప్రచురణ అయిన తరువాతి సంవత్సరం అదే ఆర్టిస్ట్ “అన్వర్, “మోషే దయాన్” గార్లతో కలసి 2017 లో హైదరాబాదులోని “చిక్కడపల్లి” లో నివాసం ఉంటున్న “చంద్ర” గారి ఇంటికి వెళ్ళి ఆయనతో రెండు గంటలపాటు ముచ్చటించిన నా అనుభవం, “చంద్ర” గారి బొమ్మలతో నాకున్న నా రెండు బొమ్మల ఫలితమే అన్న బలమైన నా విశ్వాసం. ఆయన ఎరుగని ఆయన కోట్లాది అబిమానుల సమూహంలో ఆ రోజు నన్నెరిగిన ఆ “పున్నమి తెలుగు వెన్నెల చంద్రుడు” తనచేత్తో ఒక కాపీ నాకివ్వగా, మీ సంతకం పెట్టివ్వండి చంద్రగారూ, పదిలంగా దాచుకుంటాను అని నేనడగ్గా, నేను ఆయన పక్కన కూర్చుని చూస్తుండగా స్వయంగా నా కోసం ఆ పుస్తకంలో “‘గిరి’ కి చంద్రుడు” అని రాసి నా చేతికివ్వటం ఈ జన్మలో నా బొమ్మల పుణ్య ఫలం.
ఇపుడున్నంతగా కమ్యూనికేషన్ వసతులు లేని ఆ రోజుల్లో హైదరబాదులో ఎంత కష్టపడినా ఒక్క అభిమాన ఆర్టిస్ట్ నైనా కలిసే అవకాశమే రాలేదన్న “చిన్న బాధ” ఆ రోజు “చంద్ర” గారిని కలిశాక కాస్తంత తీరింది. అదీ నాకు పరిచయం అయిన ఇప్పటి తరం గొప్ప ఆర్టిస్ట్ లు “అన్వర్ గారు”, “మోషే దయాన్ గారు” తో కలసి వారి సమక్షంలో “చంద్ర” గారిని కలవ(గలగ)టం.
ఆ రోజు వారి ముగ్గురితో కలిపి గడిపిన సమయం ఎప్పటికీ అపూర్వం. గడచిన కాలంలో వెలుగు చూడని నా బొమ్మల అనుభవాల అనుభూతుల్లో ఈ “వెన్నెల్లో ఆడపిల్ల” అందించిన అనుభూతి ఎప్పటికీ ఓ ప్రత్యేకం…
“గత కాలపు కిరణాల్లో ఇప్పటికీ కదలాడే అందమైన జ్ఞాపకం – వెన్నెల్లో ఆడపిల్ల.”
“వెన్నెల్లో ఆడపిల్ల”
Indian ink on Paper
*****

గిరిధర్ పొట్టేపాళెం – వృత్తి రీత్యా సాఫ్ట్ వేర్ ఇంజనీర్. బోస్టన్, USA లో భార్య డా|| జయలక్ష్మి, కొడుకులు రిత్విక్, భువన్ లతో నివాసం. పుట్టిన ఊరు కావలి, నెల్లూరు జిల్లా, పెరిగిందంతా ఇంటికి దూరంగానే. విద్యాభ్యాసం- కొడిగెనహళ్ళి రెసిడెన్షియల్ స్కూల్, హిందూపురం లో హైస్కూల్, ఆంధ్ర లొయోలా, విజయవాడ లో ఇంటర్, సిద్ధార్థ ఇంజనీరింగ్ కళశాల, విజయవాడ లో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, జె.యన్.టి.యు హైదరాబాద్ లో కంప్యూటర్ సైన్స్ మాస్టర్స్. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా T.C.S. India, పలు USA సంస్థల్లో అనుభవం.
హాబీలు – బొమ్మలు వెయ్యటం, నేర్చుకున్న విషయాలు, అనుభవాలు రాయడం, పుస్తకాలు చదవడం.