
భూలోక స్వర్గం
-డా.కె.గీత
అబ్బాజాన్ అలవాటు ప్రకారం వేకువజామునే లేచి దువా మొదలుపెట్టేడు.
ఆయన నిశ్శబ్దంగా వంగి, లేచి దువా చేస్తూ ఉంటే నాకు మా పక్కనే ఉన్న బొమ్మ జెముడు చెట్టు కదిలి నా వైపు తరుముకొస్తున్నట్టు అనిపించి ముసుగు మీదికి లాక్కున్నాను.
నా పక్కనే చలికి వణుకుతున్న ఛోటా భాయీ అకీం మీదికి నా ముసుగుని కాస్త కప్పి వాడి దగ్గరికి జరిగి పడుకున్నాను.
అమ్మీజాన్ కూడా లేచినట్టుంది. బయలుకి పోవడానికి నడుస్తున్నట్టు ఇసుకలో మెత్తని అడుగుల చప్పుడు వినవచ్చి నెమ్మదిగా తగ్గింది.
ఎంత దూరం వెళ్లిందో మరి పొద చాటు కోసం!
మామూలుగా ఇంటిదగ్గిర అయితే అమ్మీ కూడా దువా చేసేది ఈ సమయంలో.
నాలుగు నెల్ల కిందటి వరకు మా జీవితాలు ఎంత బావుండేవి!
అందరిలాగే వీథిలో పిల్లలందరితో ఆడుకుంటూ, పాడుకుంటూ బడి నుంచి వచ్చి పుస్తకాలు విసిరేసి జులాయిగా తిరిగేవాళ్ళం.
నేను, భాయీ మా రేకుల ఇంటి కప్పు చిల్లుల్లోంచి నుంచి గదిలో అక్కడక్కడా ముద్దల్లా పడే సూర్యకాంతి వెలుతురులో ఆడుకునే వాళ్ళం. వాటిల్లోంచి రాత్రుళ్ళు నక్షత్రాల్ని దీక్షగా చూసేవాళ్ళం. వర్షం వచ్చినపుడు ధారాపాతంగా కురిసే నీళ్ళని గిన్నెల్లో పట్టేవాళ్ళం.
అబ్బాజాన్ పనామా దేశానికి పనికి పోయి నాలుగేళ్లయింది.
అమ్మీజాన్ పాటే కోడ్ (Pate Kòde) రొట్టెలు చేసి అమ్మేది.
అప్పుడప్పుడూ అమ్మీ మా మట్టి ఇంటి నేలలో ఓ మూల తవ్వి చిన్నపెట్టెలో ఏదో దాచిపెట్టడం నాకు విచిత్రంగా అనిపించేది. అదేవిటో చూడాలని మనసెంతో తహతహ లాడేది.
ఉత్సాహం ఆపుకోలేక అడిగేసాను ఓ రోజు.
“బేటీ! అది భూలోకస్వర్గానికి మనందరం పోవడానికి కష్టపడి నేను, అబ్బా సంపాదించి దాస్తున్న డబ్బు. ఏదో ఓ రోజు మీ అబ్బాజాన్ వచ్చి మనల్ని తీసుకువెళ్తాడు. అక్కడ పెద్ద పెద్ద భవంతులు ఉంటాయి. కడుపు నిండా తిండి ఉంటుంది. కట్టు కోవడానికి దర్జాయైన బట్టలు, కార్లు… “ అంటూ చెప్తుంటే మొదటిసారి అమ్మీ కళ్ళల్లో మెరుపు చూసేను.
ఆ రోజు నేను అడిగిన “అబ్బా ఎప్పుడొస్తారు? మనం హైతీని వొదిలి ఎప్పుడెళ్లి పోతాం?” అనే ప్రశ్నలకి సమాధానం ఇంత త్వరగా వస్తుందనుకోలేదు.
ఆ వారంలో హైతీ దేశపు ప్రెసిడెంట్ మోజేని హత్య చేసేరు. ఎక్కడ చూసినా అల్లర్లు చెలరేగేయి. ఎప్పుడు ఎవరికి మూడుతుందో అనే భయం. ఇల్లు వదిలి బయటికి వెళ్లడానికి భయపడే పరిస్థితి దాపురించడంతో అమ్మీ దగ్గిర పాటేలు కొనుక్కోవడానికి ఎవ్వరూ రావడం మానేసేరు.
పుండు మీద కారంలా ఆ రోజు భూకంపం మమ్మల్ని భయంకరంగా వణికించింది.
అదృష్టం కొద్దీ మా ఇల్లు కూలలేదు. కానీ పెద్ద పెద్ద భవంతులెన్నో నేలమట్ట మయ్యేయి. ఎక్కడచూసినా జనం… గగ్గోలుగా పరుగెత్తే జనమే.
ఆ రోజంతా అమ్మీ నన్ను, తమ్ముణ్ణి రెక్కల్లో పొదువుకుని కూచుండిపోయింది.
మమ్మల్ని నిద్రపుచ్చడానికి తనెప్పుడూ పాడే జోలపాట అదేపనిగా పాడసాగింది.
“దోదో టీటీ మామా
దోదో టీటీ పాపా
సిలిపా దోదో క్రాబ్ లా వా మాన్జే…..”
(Sweet sleep, mommy’s little one
Sweet sleep, daddy’s little one
If you do not sleep, the crab will eat you….)
వారం రోజులపాటు మతిలేనిదానిలా తనలో తాను మాట్లాడుకుంటూ కూచునే అమ్మీని చూసి భయం వేసేది.
నేను మొదటిసారి ఇల్లు చక్కబెట్టడం నేర్చుకున్నాను. ఇదే మామూలప్పుడయితే “ఎనిమిదేళ్లకే ఇల్లంతా చక్కబెట్టేస్తుంది మా బేటీ” అని గొప్పలు పోయేది అమ్మీ చుట్టుపక్కల వాళ్లతో.
ఉన్న కాసిన్ని గట్టి పాటేలేవో తమ్ముడికి తినిపించి, నేనూ కాస్త తింటూ ఎలాగో గడుస్తున్న సమయాన …
ఓ రోజు అనుకోకుండా హఠాత్తుగా తలుపు తీసుకుని వచ్చిన అబ్బాజాన్ ని చూస్తూనే ఒక్క ఉదుటున మీదికి దుమికి ఏడుపు మొదలుపెట్టేసేను.
అప్పటికి గానీ అమ్మీ ఈ లోకంలోకి రాలేదు.
భూకంపం వచ్చిందని తెలుస్తూనే అబ్బాజాన్ ఉండబట్టలేక వెంటనే బయలు దేరేడట. కానీ అడ్డంకుల మీద అడ్డంకుల్తో అతికష్టమ్మీద హైతీకి చేరుకోవడానికి ఇన్నాళ్లు పట్టిందట.
రాత్రికి రాత్రే మేం దేశం వదిలి బయలుదేరేం.
హైతీ నుంచి పనామాకి పది రోజుల సముద్ర ప్రయాణం.
మాతోబాటూ కిక్కిరిసిన జనం ఒకళ్ళనొక్కళ్ళు తిట్టుకుంటూ, తోసుకుంటూ.
భయానికి వణుకుతున్న నా చేతిని గట్టిగా పట్టుకుని భూలోకస్వర్గం అంటే ఎన్ని నరకాలు దాటాలో అబ్బాజాన్ మొదట మేం పడవ ఎక్కగానే చెప్పడం నాకు బాగా గుర్తుంది.
“బేటీ! మన కాళ్ల కింద సముద్రాన్ని చూసి భయపడకు. మనం అగాధం లాంటి మన జీవితాల్ని సుఖమయం చేసుకోవడానికే ఈ అఖాతాన్ని దాటుతున్నాం. మనకి ఎక్కడికెళ్లినా అదుగో కనిపిస్తున్న ఆ నక్షత్రంలా అల్లా తోడుగా ఉంటాడు. జీవితంలో ఎప్పుడూ కిందికి చూడకు. తలెత్తి పైకి మాత్రమే చూడు.”
హైతీలో సముద్రం ఒడ్డున బతికిన మాకు సముద్రం కొత్తకాకపోయినా సముద్ర ప్రయాణం కొత్తే.
పదిరోజులు ప్రయాణం చేసేసరికి కడుపులో పేగులు చుట్టుకుపోయినట్లు తెలీని నొప్పి. ఏం తిన్నా అరగని పరిస్థితి. పైగా చుట్టూ సముద్ర ప్రయాణం పడక కక్కుకునే మనుషులు. ఇక మా మొహాలయితే చెప్పనే అక్కరలేదు. ఉప్పుదేరి, గాలికి బిరుసెక్కి పోయేయి. పగలంతా నీళ్లలో ప్రతిబింబించే సూర్యుణ్ణి చూళ్లేక అమ్మీ ఒళ్ళో చెరోవైపు అతుక్కుని నిద్రపోవడం, రాత్రుళ్ళు అబ్బా చెప్పినట్లు ఆకాశంకేసి చూస్తూ నక్షత్రాలు లెక్కబెట్టడం. ఎప్పుడెప్పుడు నేలమీద కాళ్ళుపెడతామా అని ఎదురుచూసేం.
అయితే నేలమీద కాలుపెట్టిన మా సంతోషం ఎక్కువ రోజులు నిలవలేదు.
పనామాలో మేం ఎక్కువరోజులు ఉండడానికి కాదు, అక్కణ్ణించి భూలోకస్వర్గానికి వెళ్ళడానికి అది దారి మాత్రమే అని అబ్బాజాన్ చెప్పినపుడు ఏమో అనుకున్నాను కానీ ఇంత కష్టమని తెలీదు.
పనామాలో గట్టిగా పదిరోజులు కూడా లేకుండా ఓ తెల్లారగట్ల బయలుదేరదీసేడు అబ్బా.
అసలు ఏమీ అర్థంకాలేదు నాకు.
అదే అడిగాను.
“ఎక్కడికెళ్తున్నాం అబ్బాజాన్?”
“భూలోకస్వర్గానికి”
“ఎందుకెళ్తున్నాం?”
“కడుపు నిండా తిండి కోసం”
“పనామా భూలోకస్వర్గం కాదంటావా?”
“అలా అనుకునే నేను ఇక్కడికి చేరడానికి ఎన్నో కలలు కన్నాను బేటీ! కానీ ఇక్కడా నిరాశే. పూట గడిచే పని దొరకడానికి ఇక్కడా అగచాట్లే. ఒక తేడా ఏవిటంటే ఇక్కడ పడే కష్టానికి మన దేశంలో కంటే ఎన్నో ఎక్కువ రెట్లు డబ్బులొస్తాయి. నిజానికి గొప్ప భూలోక స్వర్గం అనేది మరొకటుంది. దానికి ఈ మధ్యే గేట్లు తెరుస్తున్నారని దక్షిణ అమెరికాలోని మన హైతీయులంతా ప్రయాణమవుతుంటే నాకూ ఆశ పుట్టింది.”
మారు మాట్లాడకుండా వెంట నడిచేను.
రాత్రి అబ్బాజాన్ తో అమ్మీ గొడవపడడం విన్నాను.
“పనామాలో నాలుగు సంవత్సరాలు పనిచేసి సంపాదించిందంతా ఏవయ్యింది?”
“పిచ్చిమొహమా! పిల్లలకి, నీకు నా కష్టం తెలవకుండా ఉండడం కోసం తిన్నగా పనామాకి పనికి పోయానని అబద్ధం చెప్పేను. నిజానికి నేను వెళ్ళింది బ్రెజిల్ కి శరణార్థుడిగా. పదేళ్ల కిందట హైతీలో భూకంపం వచ్చినపుడు శరణార్థుడిగా వెళ్లిన అన్నయ్య కుటుంబం ఉంది కదా అని ధైర్యం చేసి వెళ్లేను. కానీ వాళ్లు అప్పటికే బ్రెజిల్ నుండి పనామా దేశానికి వలస వెళ్లిపోయారని తెలిసింది. బ్రెజిల్ లో రాత్రనక, పగలనక నానా కష్టాలూ పడి సంపాదించి మొత్తానికి పనామాకి ప్రయాణమయ్యేను. బ్రెజిల్ నుంచి చిలీకి, అక్కణ్ణించి కొలంబియాకి అడ్డదారిన ప్రయాణించవల్సి వచ్చింది. బ్రెజిల్ నించి పనామా ప్రయాణమయ్యిన నా తోటి హైతీయులతోబాటూ కలిసి బయలుదేరేను. కొలంబి యాలో బ్రెజిల్ నించి చిలీకి వలస వెళ్లిన వాళ్లు, ఎరిట్రియా, కామెరూన్, ఘనా, సెనెగల్ వంటి ఆఫ్రికా దేశాల నుంచి నుంచి ఈక్వెడార్ శరణార్థులుగా వచ్చినవాళ్లు కూడా కలిసేరు. మా ప్రయాణంలో చివరి పదిరోజులు కొలంబియా, పనామా సరిహద్దుల్లోని 93 మైళ్ళ దుర్భర అరణ్యమార్గమైన డేరియన్ పాస్ గుండా కొనసాగాయి. దొంగతనంగా ఈ డేరియన్ పాస్ ని దాటేటప్పుడు ప్రాణాలు పోతాయనే అనిపించేది. మమ్మల్ని అడవి దాటిస్తామని నమ్మబలికి డబ్బు గుంజిన మనుషులు మొదటిరోజు రాత్రే పరారయ్యేరు. మర్నాడే దారి దోపిడీ దొంగలు మమ్మల్ని నిలువునా దోచేసేరు. ఆడవాళ్ళని మా కళ్ల ఎదుటే దుర్మార్గంగా చెరిచేరు. ఎదురు తిరిగిన వాళ్లని నిర్దాక్షిణ్యంగా కాల్చి పడేసేరు. అలాగే డ్రగ్ మాఫియాదార్ల గుంపు కళ్లబడ్డామంటే చచ్చినట్టే. ఇక ఈత రాకపోతే దార్లో దాటాల్సిన కాలువల్లో మునిగి చావాల్సిందే. ఇదంతా ఒక ఎత్తు, క్రూరమృగాల బారి నించి, విషపూరిత మొక్కల బారి నించి తప్పించుకోవడం మరొక ఎత్తు. ఇవన్నీ తట్టు కున్నా తిండి, నీళ్ళు లేకుండా నడవలేక ప్రాణాలు పోగొట్టుకున్న మనుషుల శవాలు దారి పొడవునా దీనంగా పడి ఉండి ఒళ్ళు గగుర్పొడిచేవి. మాతో వచ్చిన వాళ్లలో కొందరు దార్లో ఆగిపోయేరు. కొందరు వెనక్కి వెళ్ళిపోయేరు. ప్రాణాలకు తెగించి ముందుకు బయలుదేరిన కొందర్లో నేను బతికి బయటపడ్డానంటే నాకే నమ్మశక్యంగా అనిపించ లేదు. ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని, చెట్టుచాటునా, పుట్టచాటునా దొరికిన ఆకులు అలములు నమిలి ఆకలి తీర్చుకుని ఎలాగోలా పనామా చేరుకున్నాను. పనామా బోర్డర్ లో దొరికిపోయిన వాళ్ళని డిటెన్షన్ సెంటర్లలో పడేస్తారు. అయితే కొలంబియా, పనామా దేశాల కంట్రోల్ ఫ్లో ఒప్పందం ప్రకారం రోజుకి వెయ్యో పదిహేను వందల మందినో వదులుతున్నారని విన్నాను. కానీ నాలాగా ఇలా దొంగత్రోవన వచ్చి బతికి బట్టకట్టిన వాళ్లు, బోర్డర్ పెట్రోల్ వాళ్ళకి దొరక్కుండా ఉండేవాళ్లంతా అదృష్టవంతులే. మొదట్లో బాగా ఇబ్బంది అయినా ఇక్కడ అన్నయ్య ఉన్నాడు కాబట్టి మొత్తానికి పనిలో కుదురుకో గలిగేను. అన్నయ్యకి తెలిసిన దళారీ మనుషుల ద్వారా పని కాగితాలు సంపాదించ గలిగేను. వచ్చేటపుడు పనామా వెళ్తున్నానని నీకు చెప్పిన అబద్ధం నిజం అయ్యింది. నిన్ను పిల్లల్ని తీసుకురావాలని ఎన్ని రాత్రుళ్ళు వేదనపడ్డానో నాకే తెలుసు.”
అమ్మీ దుఃఖ పడడం, అబ్బా ఓదార్చడం వినిపిస్తూనే ఉంది.
“ఏడవకు, నీకు తెలుసు కదా మనం ఈ రోజుల కోసం ఎన్నాళ్లుగా ఎదురు చూస్తున్నామో. సంపాదించిన ప్రతి పనామేనియన్ బల్బోవా మీ కోసమే దాచేను. ఇక పనామా నించి ఎలాగోలా టెక్సాస్ బోర్డర్ వరకు వెళ్లగలగడమే మన ధ్యేయం. మధ్యలో ఉన్న దేశాల బోర్డర్లన్నీ ఈ మధ్య కరుణించి మెక్సికోకి వెళ్ళడానికి అనుమతిస్తున్నారని విని అన్నయ్య కుటుంబం నెల కిందట బయలుదేరి వెళ్లేరు. ఇవాళో రేపో మనమూ బయలుదేరుదాం.”
పనామా నించి కోస్టారికా, నికరాగ్వా, ఎల్ సాల్వెడార్, గ్వాటమాలా, మెక్సికో… రోజూ మేప్ చూపిస్తూ అబ్బాజాన్ పదేపదే చదువుతున్న దేశాల పేర్లన్నీ కంఠస్థం వచ్చేసేయి నాకు.
నడుస్తూ ఆకాశంకేసి చూస్తూ దేశాల పేర్లు చెప్పసాగేను.
“జీవితంలో ఎప్పుడూ కిందికి చూడకు. తలెత్తి పైకి మాత్రమే చూడు.” అబ్బాజాన్ పడవలో చెప్పిన మాట గుర్తుకు వచ్చింది.
మేం దాటి వచ్చిన ప్రతి దేశం జ్ఞాపకం వచ్చింది.
పనామా నించి మెక్సికోకి దర్జాగా కార్లో వెళితే 45 గంటల పాటు ప్రయాణమట. అంటే ఎంత ఆగుకుంటూ వెళ్లినా అయిదారు రోజుల ప్రయాణం.
మరి మేం వెళ్లింది తుక్కు బస్సుల్లోను, చిన్నా చితకా వ్యానుల్లోనూ, చిన్న పడవల్లో, డింగీల్లో, నడకదారుల్లోనూ.
ప్రతి దేశపు సరిహద్దూ దాటడానికి రోజుల తరబడి వేచి ఉండాల్సి వచ్చేది.
అంతలోనే అబ్బా, అమ్మీ దార్లో ఎక్కడ చిన్నపని దొరికినా చెయ్యడానికి ప్రయత్నించేవాళ్లు.
వాళ్లొచ్చేదాకా నా పని తమ్ముణ్ణి కనిపెట్టుకుని ఉండడం. మా దగ్గిర ఉన్న సామాన్లల్లా ఓ చిరుగుల టెంటు, కొద్దిగా వంటసామాగ్రి, మాసిపోయిన చలి కంబళీలు . ఎక్కడంటే అక్కడ సమతలంగా ఉన్నచోట నేలమీద టెంటు వేసి మమ్మల్ని కూర్చోబెట్టి అబ్బా ముందు వెళ్లే వాడు. తరువాత వచ్చి అమ్మీని కూడా తీసుకువెళ్లేవాడు.
ఇంతలోనే అమ్మీ చుట్టుపక్కల వాళ్లని మా హైతియన్ క్రియోల్ భాషలో “మే కొన్ ఫే మాజీ” (I know make food) అంటూ పని అడిగేది.
మేం వచ్చీ రాని స్పానిషు భాషలో దారిన పోయే వాళ్ళని ఏదైనా అడుక్కుని తెచ్చుకుని తినేవాళ్ళం.
ఎల్ సాల్వెడార్ లో తిన్న ‘పపూసా’లు తల్చుకుంటే ఇప్పటికీ నోట్లో నీళ్లూరుతు న్నాయి.
ఈ ప్రయాణంలో దేశద్రిమ్మరుల్లా బతకడం మాకు బాగా అలవాటయ్యిపోయింది.
నికరాగ్వాలో అమ్మీ ఒళ్ళంతా కొట్టుకుపోయి, రక్తం ఓడుతూ, ఏడుస్తూ వచ్చింది.
వెనకే వచ్చిన అబ్బా ఒగురుస్తూ, ఏడుస్తూ, ఓదారుస్తూ ఉన్నాడు.
“దొంగ లంజా కొడుకులు! నాదగ్గిర డబ్బు గుంజుకోవడమే కాకుండా నిన్నూ పొదల చాటుకి లాక్కుపోయేరు. ఇదే మన దేశంలో అయితే లమ్డీకొడుకుల్ని నరికిపారేసేవాణ్ణి.”
అమ్మీ రాత్రంతా పిచ్చిదానిలా నెత్తి బాదుకుని ఏడుస్తూనే ఉంది.
అబ్బా గుసగుసగా సముదాయించడం వినిపిస్తూనే ఉంది.
“తప్పదు మరి. ఓర్చుకో. ఇలాంటివి ఎన్నో జరుగుతాయి మన లాంటి బతుకుల్లో. మన లక్ష్యం ముందు ఇవన్నీ చిన్న విషయాలు. ఒక్కసారి మనం స్వర్గానికి చేరేమంటే మన బతుకే మారిపోతుంది. బాధపడకు.”
దారిపొడుగునా అబ్బా దళారులెవరో సాయం చేస్తారని డబ్బు సమర్పించడం, సగం దార్లో మోసపోయామని తెలుసుకోవడం, అమ్మీ నిశ్శబ్దంగా ఏడవడం.
చివరికి ఎలాగోలా మెక్సికో చేరగానే అదృష్టం కొద్దీ మేం మాలాగా భూలోకస్వర్గాన్ని చేరడానికి అప్పటికే త్రోవ వెంట బయలుదేరిన మరికొన్ని కుటుంబాల్ని కలిసేం.
అందులో పసిపిల్లల దగ్గరనించి దాదాపు యాభై ఏళ్ల వారి వరకూ ఉన్నారు.
దాదాపు అబ్బా వయసున్నతను అకీం ని తెగ ముద్దుచేయసాగేడు.
అతనూ హైతీ నించే వచ్చేడట. మొదట పనామాకి విజిటింగ్ వీసాలో వచ్చి క్రమంగా ఉద్యోగ వీసా తెచ్చుకున్నాడు. పెద్దకొడుకు అమెరికా దయాదాక్షిణ్యాల వల్ల శరణార్థుడిగా రెండేళ్ల కిందట వెళ్లగలిగేడట.
భార్యా, మరి ఇద్దరు చిన్న పిల్లలు ఇప్పటికీ హైతీలోనే ఉన్నారు. వాళ్లకి ఇటు పనామా వీసా రాలేదు, అటు అమెరికా వెళ్లేందుకు అవకాశం రాలేదు. ఇక పనామాలో అతను ఒక్కడూ బతకలేక కనీసం పెద్దకొడుకుతోనైనా కలిసి ఉందామని ఈ ప్రయాణం మొదలుపెట్టేడట. మా అకీంని చూస్తే అతని చిన్నకొడుకే జ్ఞాపకం వస్తున్నాడంటూ కంట తడి పెట్టుకున్నాడు.
“కుటుంబం అంతా ఒక్కచోట ఉండడం కంటే స్వర్గమేముంది?” అన్నాడు అతను దార్లో అబ్బాని ఉద్దేశించి.
అబ్బా తల పంకించి “నిజమే, కానీ పిల్లలకి మంచి భవిష్యత్తునివ్వడమే కదా తండ్రి బాధ్యత. నా పిల్లలూ నాలా అడ్డమాలిన కష్టాలూ పడకూడదనే నా తాపత్రయం” అన్నాడు.
అప్పుడెందుకో అబ్బా ముఖంలో విషాదం తాండవించింది. గొంతు దుఃఖంతో వణికింది.
నేను స్పష్టంగా అర్థం చేసుకోగలుగుతున్నాను. ఈ ప్రయాణంలో చివరికి గమ్యం చేరుతామో లేదో ఎవరికీ తెలీదు.
వేసే ప్రతీ అడుగులోనూ భయమే. ఎట్నుంచి ఏం పొంచి వస్తుందో అన్న భయం.
ఇప్పటివరకు మేం చేసిన మొత్తం ప్రయాణం ఒక ఎత్తు. మెక్సికో ఒక్కటీ ఒక ఎత్తని మమ్మల్ని మరొక గుంపు హెచ్చరించేరు.
“ఈ మధ్య అమెరికా ఒత్తిడితో మెక్సికోలో దొరికిన వాళ్ళని దొరికినట్టు నరకంలాంటి డిటెన్షను సెంటర్లలో పడేస్తున్నారు. ఇంతకుముందు వరకు మెక్సికో శరణార్థులుగా నమోదు చేసుకున్న వారికి అక్కడి పోలీసులే దగ్గరుండి ఎస్కార్టుగా ఉండి మరీ సాయం చేసేవారట. నిజానికి ఇలా శరణార్థులకి దేశం దాటి వెళ్లే అనుమతి ఉండదు.
అయినప్పటికీ అమెరికాలో కొత్త అధ్యక్షుడు రావడం, వస్తూనే సానుకూల ప్రతి పాదనలతో వార్తలు రావడంతో మెక్సికో ప్రభుత్వం శరణార్థులకి అండదండగా నిలిచింది. మన దురదృష్టం కొద్దీ ఈ మధ్య అమెరికా ఒక్కసారిగా నిబంధనలు కఠినతరం చేసి మెక్సికో దేశమ్మీద శరణార్థుల్ని కట్టడి చెయ్యమని ఒత్తిడి తేవడంతో మెక్సికో ప్రభుత్వం ప్లేటు ఫిరాయించింది. ఇప్పటికే ఎనిమిదివేల మందికి పైగా ‘రియో గ్రాందే’ నదిని దాటి అమెరికాలో టెక్సాస్ రాష్ట్రంలోని ‘దెల్ రియో’ ఊళ్లో వంతెన కిందకి చేరేరు. వాళ్లంతా అదృష్టవంతులు” అన్నాడొకతను అబ్బాతో.
ఆ రాత్రి మమ్మల్ని ఆదుకున్న మెక్సికను కుటుంబం వాళ్లు మాకు పెరట్లోని షెడ్లో పడుకోవడానికి చోటిచ్చినపుడు నేనూ, తమ్ముడు దూరం నించి వాళ్ల టీవీలో వంతెన కింద లీలగా కనిపిస్తున్న వందలాది మందిని చూసేం.
ఎలాగైతేనేం మా యాత్ర చివరి 500 మైళ్ళకి చేరింది. మెక్సికను పోలీసులకి దొరక్కుండా ఉండాలంటే గుంపుగా వెళ్లకూడదని అంతా చెప్పుకోసాగేరు.
ఇక మేం విడిగా నడక ప్రారంభించేం. అక్కడక్కడా అదృష్టం కొద్దీ ఎవరైనా ఆదుకుని మమ్మల్ని ఏ గాడిద బండిమీదో, వ్యానులోనో ఎక్కించుకుని పక్క ఊళ్ళో దించేవాళ్లు.
అయితే నడిచిన లెక్కలేనన్ని మైళ్ళన్నీ పైకి మాత్రమే చూస్తూ నడిచేం.
తమ్ముడు నడవలేనని పేచీ పెట్టినపుడల్లా మెడమీద ఎక్కించుకుని ముందుకు అడుగులేసే అబ్బాజాన్ ని చూస్తే అంత శక్తి ఎక్కడి నుంచి వస్తుందో అని ఆశ్చర్యంగా అనిపిస్తుంది.
అమ్మీ కూడా తక్కువ శక్తి గలదేమీ కాదు. కాళ్ళ కంటే బలమైన మానసిక శక్తి ఉంది తనకి.
లేకపోతే ఇన్ని కష్టాల్ని ఎలా ఓర్చుకుంటుంది?
ఉన్నట్టుండి పూర్తిగా ఎడారిలో ప్రవేశించేసరికి దిక్కూ తెన్నూ తోచక నిలబడి పోయిన మాకు అటుగా గాడిద మీద పోతున్న మెక్సికను కుర్రాడొకడు తగిలేడు.
‘తలకి ముప్ఫయి డాలర్లు ఇప్పుడు, మిగతావి అమెరికా వెళ్ళేక’ అన్న బేరం కుదిరింది.
అబ్బా వెనగ్గా నడుస్తున్న తమ్ముణ్ణి భుజాన ఎత్తుకుంటూ త్రోవ చూపిస్తున్న కుర్రాడికి వినిపించకుండా “వీడికి బొత్తిగా బుర్ర లేనట్టుంది. అమెరికా వెళ్ళేక వీడికి సొమ్ము పంపాలట. అప్పటికి మనకి వీడు గుర్తుండినప్పటి మాట.” అన్నాడు.
అమ్మీ “అయ్యో పాపం! వీడేం కష్టంలో ఉన్నాడో” అంది మురికి కొట్టుకుపోయిన వాడి అవతారం వైపు చూస్తూ.
రెండు పగళ్లు నడిచేసరికి కాళ్లు పుళ్ళు పడిపోయేయి. కన్నాలు పడ్డ బూట్ల నుంచి దుర్గంధం వస్తూ ఉంది.
రాత్రిపూట ఎడారిలో ఎక్కడో ఓ చోట శోషొచ్చినట్టు పడిపోవడం, పొద్దుట లేచి మళ్లీ నడవడం.
“ఎన్నాళ్ళు నడవాలి అబ్బాజాన్?”
“భూలోకస్వర్గం సరిహద్దు వరకు”
“అసలీ భూలోకస్వర్గం గురించి నీకెలా తెలిసింది అబ్బాజాన్?” ఉండబట్టలేక ఎన్నాళ్ళుగానో దొలుస్తున్న ప్రశ్నని అడిగేసేను.
“బేటీ, ఇది ఈ నాటి కలకాదు. అసలు హైతీ కాకుండా ఏదైనా స్వర్గమే. నా చిన్న నాటి నించి చూస్తున్నాను. మనదేశంలో ఉన్నంత చెత్త బతుకు ఇంకెక్కడా ఉంటుం దనుకోను. ఎక్కడచూసినా దుర్మార్గపు రాజకీయాలు, తిరుగుబాట్లు, చంపుకోవడాలు, పుండు మీద కారప్పొడిల్లా భయంకరమైన ప్రకృతి వైపరీత్యాలొక వైపు. అయితే భూకంపాలు, లేకపోతే తుఫానులు. ఇక అతితక్కువగా ఉన్న మన ముస్లిములకి డబ్బు లేకపోతే అధోగతే. అనుక్షణం వివక్ష వల్ల ప్రాణ భయమే. ఎక్కడన్నా కాస్తయినా మనశ్శాంతి ఉందా? 2010 లో భూకంపం వచ్చిన తరవాత తేరుకోలేని కుటుంబాల్లో మీ పెదనాన్న కుటుంబం కూడా ఒకటి. బ్రెజిల్ దయ వల్ల శరణార్థులుగా వాళ్లు దక్షిణ అమెరికాకి వెళ్లిపోగలిగేరు. దురదృష్టం కొద్దీ నాకు అప్పట్లో అవకాశం రాలేదు. ఎప్పటికైనా అమెరికాకి చేరాలన్నదే నా లక్ష్యంగా పెట్టుకున్నాను. మీ అమ్మ నన్ను పెళ్లి చేసుకునే టప్పుడు నా మొదటి ఒప్పందం అదే.……. ”
అబ్బాజాన్ మాటలు వినబడడం లేదు నాకు. ప్రతి మాటలో ఆత్మవిశ్వాసమే ధ్వనిస్తూంది.
మూడో రోజు ఉదయానికి కాస్త పచ్చగా ఉన్న నేల కనిపించింది. దూరంగా ఊరు కనిపించింది. మాకూడా వచ్చిన కుర్రాడు ఊరు పొలిమేర కూడా రాకముందే పలాయనం చిత్తగించేడు.
“పొద్దున్న నిద్ర లేస్తూనే వాడు డబ్బులు అడిగినప్పుడే అనుకున్నాను” అన్నాడు అబ్బా.
అప్పటివరకు ఉన్న ఎడారి మాయమై ‘రియోగ్రాందే’ నది నిశ్చలంగా కనిపించింది.
“ఇదేవిటి అచ్చం మా హైతీ లోని ‘ఆహ్తి బొనీత్’ నదిలా ఉంది? అటు తీరమేనా భూలోకస్వర్గం?” నా గుండె ఆగి కొట్టుకోసాగింది.
నదికటూ ఇటూ తీరం వెంబడి జనమే జనం. పట్టుబడితే ఏం జరుగుతుందోనన్న భయం లేని జనం.
అబ్బాజాన్ “నిండా మునిగిన వాడికి చలేవిటి?” అని మేం వచ్చిన దార్లో ఎవరితోనో అన్నప్పుడు నాకు అర్థం బోధపడలేదు. ఇప్పుడు అర్థం అవుతూంది.
మెక్సికో వైపు నించి యుఎస్ వైపుకి తాడుని అటువైపు ఎవరో గట్టిగా పట్టుకున్నారు. ఒంటి మీద సగానికి మాత్రమే బట్టలేసుకుని, పీకె లోతు నీట్లో నెత్తిన మూటలు పెట్టుకుని, పిల్లల్ని భుజాలకి ఎక్కించుకుని ఇటు నించి అటు, అటు నించి ఇటు గబగబా మనుషులు దాదాపు ఈదుకుంటూ దాటుతున్నారు.
అబ్బా నన్నూ, తమ్ముణ్ణీ దగ్గరికి తీసుకున్నాడు.
అమ్మీ మమ్మల్నే చూడసాగింది.
“ఇలా వినండి ఫాతిమా, అకీం! నదిని దాటడానికి భయంగా ఉందా?”
ఇద్దరం అవునన్నట్టు భయంగా తలలూపేం.
“భయపడకండి. మనం ఎన్నో కష్టాలకి ఓర్చి ఇక్కడికి చేరేం. సంవత్సరాల మన కల నెరవేరే సమయం ఇది. మీ అబ్బాజాన్ ఇంతవరకు ఏం చేసినా మీ మంచి కోసమే చేసేడు. ఎప్పటికీ అబ్బాజాన్, అమ్మీ మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటారు. నదిని దాటడాన్ని మించిన ప్రమాదం ఆవలి ఒడ్డున ఉంది. మనం నది దాటిన తరవాత ఏం జరుగుతుందో మనకే తెలియదు. మనందరినీ ఒకటే చోట కూడా ఉండనివ్వకపోవచ్చు. అయినా భయపడకూడదు, సరేనా?”
అబ్బాజాన్ భుజాన్ని గట్టిగా కరుచుకుని నదిని దాటేటప్పుడు కూడా తనెప్పుడో చెప్పినట్టు నేను పైకే చూడసాగేను.
ఆకాశం ప్రశాంతంగా ఉంది. ఏం పట్టనట్టు.
“అవునూ అబ్బాజాన్! కొందరు మళ్లీ వెనక్కి మెక్సికో వైపుకి ఎందుకు దాటుతు న్నారు?” అన్నాను ఒడ్డు చేరగానే.
మా పక్కనే అప్పుడే నీటిలోకి దిగబోతున్నావిడ “ఏం చేస్తాం? ఈ ఒడ్డున కనీసం తిండి కూడా దొరకడం లేదు. ఆవలితీరంలోనే ఏ మొక్కజొన్నలో కొనుక్కోవడానికైనా దొరుకుతున్నాయి. అందుకే పిల్లల్ని అదుగో ఆ వంతెన కింద మా చెల్లి దగ్గిర వదిలి మళ్లీ వెనక్కి వెళ్తున్నాను. తిరిగొస్తానో లేదో” కళ్ల నీళ్లు పెట్టుకుంటూ అంది.
ఉన్నట్టుండి గుర్రాల మీద బోర్డర్ పోలీసులు కనబడ్డ వాళ్ళని కనబడ్డట్టు బాదుకుంటూ వెళ్లిపోతున్నారు.
నేను గబుక్కున అమ్మీని కౌగిలించుకున్నాను. ఒక్క ఉదుటున అబ్బా మమ్మల్ని లాక్కుంటూ వంతెన వైపు పరుగు ప్రారంభించేడు.
ఎట్టకేలకి వంతెన కింద ఉన్న వేలాది మందిలో మేమూ చేరేం. ఎక్కడ చూసినా తొక్కిసలాట. ఎవరికి వాళ్ళు ఆశతో ఎదురుచూస్తున్నవారే. ఒకరి కథలు ఒకళ్ళకి చెప్పు కుని కన్నీళ్లు పెట్టుకుంటున్న వాళ్ళే. ఇక్కడ జనమే ఓ పెద్ద నదిలా ఉన్నారు. ఆ రాత్రంతా ఎవరికీ కంటి మీద కునుకు లేదు.
మర్నాటికల్లా మాలో ఎందరినో డిటెన్షన్ సెంటర్లలో పడేస్తున్నారని, అక్కణ్ణించి ఆఘమేఘాల మీద హైతీ తిప్పి పంపేస్తున్నారన్న వార్త దుమారం రేపింది.
తిరిగి వెళ్లిపోవడం తప్ప శరణ్యం లేదని అర్థమయ్యింది.
అంతే కాకుండా దాదాపు పదడుగుల ఎత్తున ఆ సాయంత్రానికే మైలు దూరం పొడవున తాత్కాలిక ఫెన్సు ఎదురుగా ప్రత్యక్షమయింది.
ఇక అన్ని ఆశలూ అడియాసలయిపోయేయి.
“మీ బతుకులు తగలడా, మీరంతా నాశనం కానూ….” అమ్మీ దుఃఖం పూడుకు పోయిన గొంతుతో దుమ్మెత్తిపోస్తూ పోలీసుల్ని శాపనార్థాలు పెట్టడం ప్రారంభించింది.
ఆ రాత్రి బాగా నిద్రపోతుండగా అబ్బాజాన్ నన్ను శబ్దం చెయ్యొద్దని, నిశ్శబ్దంగా వెంట నడవమని నిద్రలేపేడు. భుజమ్మీద అకీం నిద్రపోతున్నాడు.
మేం వచ్చే దార్లో మాకు ఎదురై అకీంని ముద్దు చేసినతను మరొకణ్ణి వెంట బెట్టుకుని మాతో వచ్చేడు.
ఏం జరుగుతుందో తెలిసే లోగా బోర్డర్ పెట్రోల్ సిబ్బంది కన్నుగప్పి క్షణంలో కంచె ఎక్కి నన్ను, తమ్ముణ్ణి అటువైపు జారవిడిచేసేరు ముగ్గురూ కలిసి.
నాకు నోట మాట రావడం లేదు.
అబ్బాజాన్ నన్ను నడిపిస్తూ అన్న మాటలే గుర్తుకు వస్తున్నాయి.
“ఎక్కడా మీ అబ్బా, అమ్మీ ఎవరనేది, మీరెక్కణ్ణించి వచ్చిందీ ఎప్పుడూ, ఎవరికీ చెప్పొద్దు. మీరిద్దరూ ఇక మీదట్నుంచి అనాథలు. గుర్తుపెట్టుకో. తమ్ముణ్ణి ఎప్పటికైనా నువ్వే చూసుకోవాలి.”
ఒళ్ళు దులుపుకుని, ఏడుస్తున్న తమ్ముణ్ణి ఎత్తుకుని ముందుకు అడుగువేసేను పైకి మాత్రమే చూస్తూ.
బోర్డర్ పెట్రోల్ వాళ్ళ లైట్లు మా ముఖాల మీద పడుతుండగా చివరిసారి ఫెన్సింగ్ కి అటువేపు చూసేను.
దూరంగా కనుమరుగవుతున్న అబ్బా రూపం నా కళ్ళలోని నీళ్లతో కలిసిపోయి మసక మసకగా కనిపించింది.
అమ్మీ జోలపాట గుర్తుకురాసాగింది!
“దోదో టీటీ మామా
దోదో టీటీ పాపా
సిలిపా దోదో క్రాబ్ లా వా మాన్జే…..”
కుటుంబం అంతా కలిసి ఒక్కచోట ఉండడమే కదా భూలోక స్వర్గం అంటే!
ఏమో!
***
(వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా 27వ ఉగాది కథల పోటీ, 2022 లో “ఉత్తమ కథానిక” గా ఎంపికైన కథ -)
(కౌముది అంతర్జాల పత్రిక మే 2022 సంచికలో ప్రచురింపబడింది.)
*****
[2021 సెప్టెంబరులో అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని టెక్సాస్ సమీపంలోని డెల్ రియో బ్రిడ్జి (DEl Rio Bridge) దగ్గర ప్రాణాలకు తెగించి సరిహద్దు దాటొచ్చిన దాదాపు 12000 మంది హైతీయుల్లో కొందరు పిల్లలు ఈ కథలోలా విసిరి వెయ్యబడి తల్లిదండ్రుల్ని శాశ్వతంగా కోల్పోయేరు. వేలాది మంది పెద్దవాళ్లు, పిల్లలతో సహా బోర్డరులోని జైళ్లలో మగ్గుతున్నారు. వేలకొద్దీ వెనక్కి తిరిగి హైతీ పంపివేయబడ్డారు. నిజానికి ఇందులో ఎందరో హైతీ నించి ఎప్పుడో దక్షిణ అమెరికాకి వలస వచ్చి స్థిరపడ్డ వారు. అసలిప్పుడు హైతీ పౌరులు కారు. కానీ తమ పౌరసత్వాల్ని నిరూపించుకునే కాగితాల్ని కోల్పోవడంతో చేసేదేం లేక వీళ్లంతా హైతీలో దయనీయ పరిస్థితుల్లో జీవితాల్నీడుస్తున్నారు. దాదాపుగా పిల్లలందరూ ఇతర దేశాల్లో జన్మించిన వారే. ఇలా హైతీ చేరిన వేలాదిమంది పిల్లల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. దక్షిణ అమెరికా దేశాల నించి యూ.ఎస్.ఏ వెళ్లిన కొందరు అతికష్టమ్మీద ఎలాగో బోర్డరు పెట్రోల్ ఏజెంట్లని తప్పించుకుని వెనక్కి తిరిగి మళ్ళీ దక్షిణ అమెరికా చేరే ప్రయత్నంలో దాటాల్సిన దేశాల్లో అడుగడుగునా సంభవించే అపాయాలు, దోపిడీల వల్ల ప్రాణాల్ని పోగొట్టుకుంటే, మరి కొందరు కుటుంబసభ్యుల్ని కోల్పోయేరు. కొందరు మధ్య, దక్షిణ అమెరికాల్లోని దేశాల సరిహద్దుల్లో ప్రవేశాల కోసం అలమటిస్తూ ఉన్నారు.
భూలోక స్వర్గమని ఆశపడి యూ.ఎస్.ఏ చేరాలనుకుని అన్నీ కోల్పోయి అష్టకష్టాలు అనుభవిస్తున్న హైతీయులందరికీ ఈ కథ అంకితం!]
*****

డా|| కె.గీత పూర్తిపేరు గీతామాధవి. వీరు “నెచ్చెలి” వ్యవస్థాపకులు, సంపాదకులు. తూ.గో.జిల్లా జగ్గంపేటలో జన్మించారు. ప్రముఖ కథా రచయిత్రి శ్రీమతి కె. వరలక్ష్మి వీరి మాతృమూర్తి. భర్త, ముగ్గురు పిల్లలతో కాలిఫోర్నియాలో నివాసముంటున్నారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయంలోఇంగ్లీషు, తెలుగు భాషల్లో ఎం.ఏ లు, తెలుగు భాషా శాస్త్రం లో పిహెచ్.డి చేసి, 10 సం. రాల పాటు మెదక్ జిల్లాలో ప్రభుత్వ కళాశాల అధ్యాపకురాలిగా పనిచేసారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నించి 2006 లో “ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ” పొందారు.అమెరికాలో ఇంజనీరింగ్ మేనేజ్ మెంట్ లో ఎం.ఎస్ చేసి, ప్రస్తుతం సాఫ్ట్ వేర్ రంగంలో భాషా నిపుణురాలిగా పనిచేస్తున్నారు.
ద్రవభాష, శీతసుమాలు,శతాబ్దివెన్నెల, సెలయేటి దివిటీ, అసింట కవితాసంపుటులు, సిలికాన్ లోయ సాక్షిగా కథాసంపుటి, వెనుతిరగనివెన్నెల నవల, At The Heart of Silicon Valley -Short stories (2023),Centenary Moonlight and Other Poems(2023) ప్రచురితాలు. నెచ్చెలి ప్రచురణ “అపరాజిత” – గత ముప్పయ్యేళ్ల స్త్రీవాద కవిత్వం (1993-2022) పుస్తకానికి సంపాదకులు & ప్రచురణకర్త. ‘యాత్రాగీతం’ ట్రావెలాగ్స్, ‘కంప్యూటర్ భాషగా తెలుగు’ పరిశోధనా వ్యాసాలు కొనసాగుతున్న ధారావాహికలు. అజంతా, దేవులపల్లి, రంజనీ కుందుర్తి, సమతా రచయితల సంఘం అవార్డు, తెన్నేటి హేమలత-వంశీ జాతీయ పురస్కారం, అంపశయ్య నవీన్ పురస్కారం మొ.న పురస్కారాలు పొందారు.
టోరీ రేడియోలో “గీతామాధవీయం” టాక్ షోని నిర్వహిస్తున్నారు. తానా తెలుగుబడి ‘పాఠశాల’కు కరికులం డైరెక్టర్ గా సేవలందజేస్తున్నారు. కాలిఫోర్నియా సాహితీ వేదిక “వీక్షణం”, తెలుగు రచయిత(త్రు)లందరి వివరాలు భద్రపరిచే “తెలుగురచయిత” వెబ్సై ట్ వ్యవస్థాపకులు, నిర్వాహకులు.