మా తాతదీ గుండె కోతనే!

-బాలాజీ పోతుల

నా రాతలు చూసీ,
ఈనికో పెద్ద నౌకరీ అస్తే,
మంచిగుండనీ,
మా తాత దినాం దేవులడుతడు
ఆరిన, నా బతుకు దివిటీ ఎల్గించన్కి.

చేత్లకు పైసరాని పని అదేం పనిరా అని కసురుకుంటడే గానీ,
ఉన్నకాడికి కడుపు నింపుతడు.

ఒగని కడుపుగొట్టి గాదు బిడ్డ్యా!
ఆ కొట్టినోళ్లని మొకం మీద కొట్టినట్టు బతుకాలంటడు.

ఏం చెప్తవే రోజూ,
అని నేనంటే –
ఇయ్యాల మేమున్నం, రేపట్పొద్దు ఉంటమో లేమో
బుద్ధులు చెప్పనికి ఒగడుంటే,
బతుకు బంగారం అయితదిరా అనేటోడు
ఇట్ల అన్న మా తాత మొకం జూస్తే,
నా కళ్ళెంట కన్నీరు గాదు,
మది పన్నీరయ్యేది.

నడిపి బిడ్య పోయినంక,
మా తాత రొండి ఇరిగినట్టయింది
కాళ్ళకి జోళ్ళు జారిపోయి,
పానం చేత్లకచ్చింది
బుక్క దిగక,
ఉస్వాసం ఆడక,
ఎండిన గొంతుని
తండ్లాడే పాటకునిలెక్క
సవురిచ్చుకుంట,
ఒట్టి ఎండిన చెట్టయ్యిండు – మా తాత!

బిడ్యల మీద పానం గుంజితే,
తెల్లారి ఆళ్ళ ఆకిల్ల సాన్పయితడు.
గుండె సెరువుని నింపుకొనొచ్చి,
మా నాయినమ్మ కొంగుధూప తీరుస్తడు.

పెద్దల్లుడు పోయినంక,
బిడ్య గోస చూడలేక,
మా తాత జీవి దినాం కొట్టుకుంటది.
పానం ఉన్నన్ని దినాలు,
మా తాతదీ గుండె కోతనే!

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.