యాత్రాగీతం

అమెరికా నించి ఐరోపాకి (ఇంగ్లాండ్ -ఫ్రాన్స్ – ఇటలీ) ట్రావెలాగ్ భాగం-1

-డా||కె.గీత

          మనం చిన్నప్పటినించీ ఎన్నో కలలు కంటూ ఉంటాం. కానీ కొన్ని కలలు మాత్రమే సాకారమవుతాయి. కాదు కాదు సాకారం చేసుకునే దిశగా ప్రయాణిస్తాం. అలా నిజం చేసుకున్న ఒక అద్భుతమైన కల ఈ యూరప్ యాత్ర.

          యూరప్ వెళ్లాలి- లండన్, ప్యారిస్, రోమ్, వెనీస్ మొదలైన ప్రదేశాలను చూసి రావాలి అనేది చిన్ననాటి కల. ప్రత్యేకించి  “లండన్ బ్రిడ్జ్ ఈజ్ ఫాలింగ్ డౌన్” అంటూ కిండర్ గార్డెన్ లో ఆడుతూ పాడినప్పటి నుంచి, బ్రిటిష్ మ్యూజియం గురించి, ఇంగ్లాండ్ మహారాణి కిరీటంలోని కోహినూర్ వజ్రం గురించి తెలుసుకున్నప్పటి నుంచి, “బెగ్-బారో-  స్టీల్”,  “టు బి ఆర్ నాట్ టు బి” అంటూ మా నాన్నగారు షేక్స్పియర్ డైలాగులు చెప్తుంటే ఆశ్చర్యంగా విన్నప్పటి నుంచి, షేక్స్పియర్ “మర్చంట్ ఆఫ్ వెనిస్”, చార్లెస్ డికెన్స్ “ఆలివర్ ట్విస్ట్” నాన్ డీటేయిల్డ్ గా చదువుకున్నప్పటి నించి, చిన్నప్పుడు బిజినెస్ ఆటలో భాగంగా లండన్, పారిస్, రోమ్, ఆమ్ స్టర్ డామ్ లని సునాయాసంగా కొని, అమ్మినప్పటినించి,  టెక్స్ట్ పుస్తకాల్లో పారిస్ లోని ఈఫిల్ టవర్ ని ఆశ్చర్యంగా చూసినప్పటి నుంచి, ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఫ్రెంచ్ డిప్లమాలో భాగంగా బోంజు, బోంస్వా అంటూ ఫ్రెంచ్ పలకరింపులతో ఆసక్తి పెంచుకున్నప్పటి నుంచి,  చిన్నప్పటి చరిత్ర పాఠాల్లో రోమ్ నగర ప్రాభవ పతనాల గురించి అనేకసార్లు చదువుకున్న దగ్గర నుంచి,  సైన్సు పాఠాల్లో పీసా టవర్ మీది నించి గెలీలియో చేసిన గురుత్వాకర్షణ ప్రయోగం గురించి, ప్రపంచ పటంలో ఎక్కడ ఏ కాలమానం ఉంటుందో నిర్ణయించిన లండన్ లోని గ్రీన్ విచ్ ప్రధాన రేఖాంశం గురించి, చరిత్ర పూర్వ కాలం నాటి మానవ నిర్మిత అద్భుతం స్టోన్ హెన్జ్ గురించి తెలుసుకున్నప్పటి నించి, సరోజినీ నాయుడి కవితల్లో స్విట్జెర్లాండ్, ఆల్ఫ్స్ పర్వతాల అందాలు,  ఆల్బర్టో మొరావియా నవలల్లోని ఇటలీ పరిసరాలు, రెండు ప్రపంచ యుద్ధాల్లో అతలాకుతలమైన జీవితాలు, రవి అస్తమించని బ్రిటిషు సామ్రాజ్యంగా కొల్లగొట్టిన ప్రపంచ సంపదలు,  మొత్తంగా చరిత్రని తమ వైపు నించి మాత్రమే రాసుకున్న పశ్చిమ దేశాలు…… ఇవన్నీ చూడాలనుకున్నా కనీసం కొన్నయినా చూడడానికి, సావకాశం కుదరటానికి ఇన్నాళ్లు పట్టింది. 

ప్రణాళిక: 

ముందు ఆస్ట్రేలియా యాత్రాకథనంలో చెప్పినట్లుగా గ్రీన్ కార్డు రావటమే తరువాయిగా చెయ్యాలనుకున్న యాత్రల్లో ఇదే మొదటిది. అయితే యూరప్ కి వేసవిలో వెళ్లాలంటే కనీసం ఆరు నెలల ముందు నించి ప్లాన్లు మొదలుపెట్టాలి. 

          డిసెంబరులో ఆస్ట్రేలియా నించి రాగానే “మరి యూరప్ ప్రయాణానికి సిద్ధం అవుదామా?” అంటున్న నన్ను చూసి సత్య, పిల్లలు “అమ్మబాబోయ్, నీలాగా మాకు తిరగడానికి సత్తువ లేదు కనీసం ఆరునెలలు సమయం కావాలి” అన్నారు. 

          “అదే నేనంటున్నదీ” అన్నాను. 

          అర్థం కానట్టున్న వాళ్లకి అప్పటికే గూగుల్ చేసి సిద్ధంగా ఉంచుకున్నసమాచారాన్ని వివరించాను. 

          “ముందుగా యూరప్ లో మనం ఏ ప్రదేశాలు చూడాలో నిర్ణయించుకోవాలి. ఒకవేళ యూ.కే లో లండన్, యూరప్ లో ఫ్రాన్స్, స్విట్జర్లాండ్  వంటివి ఒకేసారి చూడాలంటే  యూకే వీసా అలాగే ఫ్రాన్స్ లేదా స్విస్ వీసా  రెండూ కావాలి. ఒకదాని తర్వాత ఒకటి అప్లై చేసుకోవాలి.” అన్నాను. 

          “ఎందుకు ఒకదాని తర్వాత ఒకటి అప్లై చేసుకోవాలి?” అంది మా వరు. 

          “ఎందుకంటే ప్రతి వీసా ఆఫీసుకి పాసుపోర్ట్ జతచేసి పంపాలి కాబట్టి. యూకే వీసాకి అమెరికాలోని మనకు దగర్లో యూకే కాన్సిలేటులో అప్లై చేసుకోవాలి. ఇక యూరప్ వీసాకి ఒక చిన్న తిరకాసు ఉంది. మనం ఏ దేశంలో ఎక్కువ రోజులు ఉంటామో ఆ కాన్సిలేటుకి అప్లికేషను పెట్టుకోవాలి. అయితే ఈ వీసాలన్నిటికీ హోటళ్లు, ఫ్లైట్ల టిక్కెట్లు ముందుగా బుక్ చేసి, ఆ టిక్కెట్లు పెట్టాలి. కాబటి అసలు ఏ దేశాలు, ఎన్ని రోజుల్లో చూడాలి, ఏ తారీఖుల్లో వెళ్లాలి వగైరాలన్నీ నిర్ణయించుకున్న వెంటనే ముందు టిక్కెట్లు బుక్ చేసుకోవాలి.” అన్నాను.  

          “ఆర్నెల్ల తర్వాత నాకు సెలవులు ఎప్పుడు ఉంటాయో ఇప్పుడు చెప్పటం కష్టం. మీకు తెలుసు కదా నేను వేసవి సెమిస్టర్ కూడా క్లాసులు తీసుకుంటున్నాను మహా అయితే వారం రోజులుంటాయి హాలిడేస్. కాబట్టి మీరు నన్నొదిలేసి మీ ప్లాన్లు మీరు చేసుకోండి.” అంది వరు. 

          ఇక కోమల్ సరేసరి. దూరాభారాన ఉన్న వాడి నివాసం, ఉద్యోగంతో ఎప్పుడూ మాతో రావడానికి కుదరడమే లేదు. 

          పిల్లలు కాలేజీలకి, ఉద్యోగాలకి వెళ్లేక సెలవులంటూ తల్లిదండ్రులతో గడపడమే చాలా అరుదైన రోజులివి. 

          ఇక నేను, సత్య, మా చిన్నమ్మాయి సిరిని మాత్రం తీసుకుని వెళ్దామని నిర్ణయించు కున్నాం. 

          ఎప్పటిలానే యూట్యూబు వీడియోలు ఒక నెల రోజుల పాటు, చూసి, వివరాలన్నీ ఇంటర్నెట్టులో  రీసెర్చి చేసి మొత్తానికి వెళ్లొద్దామని నిర్ణయించుకున్నాం. 

          అవన్నీ చూసేక సత్య “చూడబోతే యూరప్ అంతా చర్చిలు, కోటలు మాత్రమే ఉన్నట్టున్నాయి. ఏం చూస్తాం?” అని నిరాశ పడ్డా,  నా ఉత్సాహం చూసి సరేననక తప్పింది కాదు తనకి.

          ఇక చూడాల్సిన ప్రదేశాల దగ్గర్నించి, ఎప్పుడు వెళ్లాలి అనేదాకా తర్జన భర్జనలు తప్పలేదు. 

          అయితే ఒక్క విషయానికి మాత్రం ఇద్దరం ఏకనిర్ణయానికి వచ్చాం. అదేవిటంటే-

*****

(సశేషం)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.