ప్రియ మిత్రులందరికీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ విశ్వావసు నామ సంవత్సరం విశ్వానీకంతటికి శాంతిని, సుఖసంతోషాలను అందించాలని కోరుకుంటున్నాను. ఈ నెల మనము ఘనరాగ పుష్ప గుచ్ఛములోని ఆరభి రాగ సౌరభాన్ని ఆఘ్రాణిద్దామా?
ఆరభి రాగం క్రీస్తు శకము 7వ శతాబ్దం నాటిదిగా భావించబడుతోంది. తమిళ సంప్రదాయంలో “పజాంతక్కం” గా పిలువబడేదట. పూర్వం షాడ్జి, అర్షభి, గాంధారి, మాధ్యమి, పాంచమి, దైవతి, నైషది అనే జాతుల ద్వారా రాగాలు ఏర్పడేవట. అంటే రాగ యుగమునకు ముందు జాతి యుగముగ ఉండేదట. ఆయా జాతుల ప్రధానంగా రాగాలు ఏర్పడేవట. ఈ విధంగా అర్షభి రిషభ ప్రధాన జాతి. ఆరభి రాగం రిషభ ప్రధానంగా ఉద్భవించి కాలక్రమేణా ఆరభి అయిందని కొందరు శాస్త్రకారుల ఉద్దేశ్యము.
ఆరభి రాగం 29 వ మేళకర్త ధీర శంకరాభరణ రాగ జన్యము. ఈ రాగం ఆరోహణ అవరోహణలు క్రింది విధంగా ఉన్నాయి.
“స రి మ ప ద స”
“స ని ద ప మ గ రి స”
ఆరోహణలో గాంధార నిషాదములు వర్జములు అవటం వలన 5 స్వరాలే ఉన్నాయి. అవరోహణ అన్ని స్వరాలతో సంపూర్ణంగా ఉంది. అందువలన ఔడవ సంపూర్ణ రాగం అయింది. జన్య రాగం అవటం వలన ఉపాంగ రాగము.
ఇందులో స్వరములు షడ్జమ్, చతుశృతి రిషభం, అంతర గాంధారం, శుద్ధ మధ్యమం, పంచమం, చతుశృతి దైవతం, కాకలి నిషాదం. ఒకానొక కాలంలో ఈ రాగం నిషాద వర్జ రాగంగా ఉండేది. తదుపరి కాలంలో “స ని ద ప” ప్రయోగం గ్రహించబడింది. త్యాగరాజ స్వామి తన ఆరభి పంచరత్న కీర్తనలో నిషాదం వాడలేదు. నిషాద వర్జ ప్రయోగాలు రాగ శోభను ఇనుమడింప చేస్తాయి.
మొదట తెలిపినట్టు ఇది ఘన రాగ గుచ్చములో ఒకటి. నాట, గౌళ, ఆరభి, శ్రీ, వరాళి రాగాలు ఐదు ఘన రాగ పంచకముగా పిలువబడుతాయి. ఈ ఐదు రాగాలలో త్యాగయ్య పంచరత్న కీర్తనలు అద్భుతంగా రచించారు. త్యాగయ్య వర్ణములు రచించ లేదు. శిష్యుల కోరిక మేరకు వర్ణములను పోలిన పంచరత్న కీర్తనలను రచించారట. త్యాగరాజ ఆరాధనోత్సవాలలో కర్ణాటక సంగీత విద్వాంసులు ఈ పంచరత్న కీర్తనల గోష్టి గానం జరుపుతారు.
ఈ రాగం సర్వ స్వర గమకవరీక రక్తి రాగము. త్రి స్థాయిలలో పాడదగినది. మంద్ర గతిలో కొన్ని గమకాలు దేవా గాంధారి రాగాన్ని స్పురింపజేస్తాయి. దేవగాంధారి రాగంలో కైశికి నిషాదం అన్య స్వరంగా వస్తుంది. అలాగే గాంధారం దేవా గాంధారిలో దీర్ఘస్వరంగా ఉంటుంది. ఆరభి రాగం అన్ని వేళలా పాడదగినది. కచ్చేరిలలో మొదట పాడటానికి అనుకూలం. ఈ రాగం భక్తి, వీర రస ప్రధానమైనది. ఉత్సాహాన్ని, సానుకూల ధృక్పధాన్ని పెంపొందింపజేస్తుంది.
ఈ రాగం గంభీరమైనది కనుక సినిమాలలో కొంత ఉపయోగించినా లలిత సంగీతంలో ఎక్కువ కనిపించదు.
ఈ రాగం శ్లోకాలకు, చూర్ణికలకు ప్రశస్తము. త్యాగయ్య గారు తమ ప్రహ్లాద విజయము సంగీత నాటకములో నారదుడు ప్రహ్లాదునికి వైకుంఠాన్ని వర్ణించే సన్నివేశాన్ని అద్భుతమైన చూర్ణికగా మలచారు. పద్మశ్రీ అరుణ సాయిరాంగారు గానం చేసిన చూర్ణిక వీడియోను పొందుపరుస్తున్నాను.
కొన్ని రచనలను పరికిద్దామా?
శాస్త్రీయ సంగీతం
- గీతం రేరే శ్రీరామ చంద్ర త్రిపుట
- వర్ణం సరసిజ ముఖిరో ఆది
- కృతి సాధించేనే ఆది త్యాగయ్య గారు
- కృతి నాదసుధారసం రూపక త్యాగయ్య గారు
- కృతి చూతము రారే రూపక త్యాగయ్య గారు
- కృతి చాలా కల్లలాడుకొన్న ఆది త్యాగయ్య గారు
- కృతి శ్రీ సరస్వతి రూపక దీక్షితులు గారు
- చూర్ణిక జయతు జయతు ఆది త్యాగయ్య గారు
అన్నమాచార్య కీర్తనలు
- ఆరగించి కూర్చున్నాడల్లవాడే బాలకృష్ణ ప్రసాద్ గారు
- దాచుకో నీపాదాలకు బాలకృష్ణ ప్రసాద్ గారు
లలిత సంగీతం
- మతమంటే మరి పుట్టపర్తి నారాయణా చార్యులు చిత్తరంజన్ గారు
సినిమా సంగీతం
- జయ జయ కాళహస్తి మహత్యం ఘంటసాల గారు
- నమో నారసింహ భక్త ప్రహ్లాద బాల మురళి గారు
- సాధించేనే సీతారామయ్య గారి మనవరాలు SPBగారు
- సుందరాంగులను అప్పుచేసి పప్పుకూడు లీలగారు, రాజా గారు
ఇవండీ అత్యంత పురాతనమైన ఘనరాగము ఆరభి రాగ విశేషాలు. మరొకసారి నూతన వత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, వచ్చే నెల మరొక రాగ విశేషాలతో మీ ముందుకు వస్తాను