
లంకంత ఇల్లు
-కె.వరలక్ష్మి
ఫోన్ రింగైంది.
“హలో”
“ఉమా…”
“అవును, చెప్పండి”
“ఉమా, గుర్తు పట్టలేదా?” నేను శేషూని”
“చెప్పండి”
ఏంటి చెప్పండి చెప్పండి అంటావ్. ఈ అండీ ఎక్కణ్నుంచొచ్చింది మధ్యలో. చిన్నప్పటి లాగా శేషూ అనొచ్చుగా”
“…….”
“మాట్లాడు ఉమా”
“ఏం మాట్లాడను!”
“నా ఉత్తరం అందిందా? ఫోన్లో అన్నీ సరిగా చెప్పలేనని ఉత్తరం రాసేను”
“ఊ…”
“ఈ పొడి పొడి ఊ..ఆ…లేంటి, నీ ఉద్దేశం చెప్పొచ్చుగా”
“నువ్వు చాలా ఆలోచించుకుని టైం తీసుకుని ఆ ఉత్తరం రాసేవు. నేనూ ఆలోచించుకోవాలిగా”
“ఏం ఆలోచిస్తావ్, నీ బదులు కూడా నేనే ఆలోచించి ఆ ఉత్తరం రాసేనని నీకర్థం కావడం లేదా? నీకు గుర్తుందా, చదువుకునే రోజుల్లో నేను నీ వెంట ఎలా తిరిగేవాడినో”
“హ హ్హ హ్హా…..”
“ఎందుకంత నవ్వొస్తా ఉంది?”
“ఏమీ లేదు, డెబ్భైయ్యవ పడిలో చదువుకునే రోజుల ప్రస్తావన తెస్తేనూ….నవ్వు ఆగడం లేదు”
“నువ్వు నా కన్నా నాలుగేళ్లు చిన్నదానివి, నా ఫ్రెండు చెల్లెలివి. మా నాన్న అడిగినంత కట్నం మీ నాన్న ఇవ్వకపోబట్టి కాని నువ్వే నా పెళ్లానివై ఉండేదానివి కాదూ! అప్పట్లో ఇలా మాట్లాడేదానివి కాదు. మా క్లాస్ మేట్ గోపాలంగాడన్నట్టు ముగ్ధ మనోహరంగా ఉండేదానివి.”
” ఈ వయసులో ముగ్ధత్వమూ, మనోహరమూ ఎక్కణ్నుంచొస్తాయి?”
“ఎందుకు రావు, నేను బాగా లేనా ఫోటోలో, నువ్వు కూడా బావున్నావులే, ఆ మధ్య ఒక పెళ్లిలో చూసేను”
“నువ్వు బావుంటావులే, మొన్నమొన్నటి వరకూ నీ భార్య నీకు వండి పెట్టి చాకిరీ చేసింది కాబట్టి. అయినా ఇప్పటి ఫోటోస్ ని నమ్మకూడదులే”
“ఆవిడ చాకిరీ ఊరికే చేసిందా? ఎన్ని నగలు, ఎన్ని పట్టుచీరలు కొనిచ్చేను తనకి. పిల్లల కోసం నేను కూడబెట్టిన ఆస్తులు చూసి గొప్ప సంతృప్తితో పోయింది. వాళ్లు ఇవేళ అంత హైలెవెల్లో బతుకుతున్నారంటే కారణం నేనే కదా! ఇద్దర్నీ మంచి ఉద్యోగాల్లో సెటిలయ్యేలా చేసేను. అఫ్ కోర్స్ నా ఉద్యోగం అలాంటిదనుకో”
“అంత సెటిలైన పిల్లలు ఈ వయసులో నిన్ను చూసుకోవడం లేదా?”
“వాళ్లేంటి నన్ను చూసేది! లంకంత ఇల్లు, బోలెడంత పెన్షను. మన్లో మన మాట చాలా ఫ్లాట్లు కొన్నాను. వాటి మీద అద్దెలెంతొస్తాయో నువ్వు ఊహించలేవు. చవకలో కొన్ని ప్లాట్లు కొని పడేసేను. వాటి రేటు ఇప్పుడు కోట్లలో ఉంటుంది. నా కొడుకులు ఈ పాత కొంపలో ఉండలేమంటూ కొత్త ఇళ్ళలోకి దూరంగా పోయారు. పోతే పొండి అని వంట మనిషి చేత వండించుకు తింటూ కాలక్షేపం చేస్తున్నాను. ఆ వంటలు తినలేక చస్తున్నాననుకో”
“అర్థమైంది, ఇప్పుడు నీకు కమ్మగా వండిపెట్టే వంట మనిషి కావాలన్నమాట!”
“కాదు కాదు, ఈ మధ్య సిటీలో లివింగ్ టుగెదర్ అనే మాట బాగా వినబడతా ఉంది. ఒకట్రెండు మీటింగ్స్ కి వెళ్లేననుకో. నాకెవరూ నచ్చలేదు. అప్పుడు వెంటనే నువ్వు గుర్తుకొచ్చావు”
“అవునా…”
“అవును. నీ గురించి వాకబు చేస్తే తెలిసింది. పిల్లలు పుట్టకుండానే గోపాలం పోయాడనీ, అతనికి స్థిరమైన ఉద్యోగం లేక నీ బతుకు వీథిన పడితే ఇప్పటికింకా ఓ ప్రైవేటు స్కూల్లో పంతులమ్మగా కష్టపడుతున్నావనీ, అందుకే నీకో దారి చూపిం చాలనీ…..”
“అంటే నన్ను కూర్చోబెట్టి పోషిస్తావన్నమాట! వంట కూడా చెయ్యక్కర్లేదేమో”
“అదేవన్నమాట, ఆడవాళ్లన్నాక వంటావార్పూ తప్పవు కదా! ఈ వయసులో నోటికి రుచిగా మనకి మనం వడుకు తింటే బాగుంటుంది కదా! నీకు తిండికీ, బట్టకీ లోటుండ దు. నగలు మాత్రం కోడళ్లిద్దరూ పంచేసుకున్నారనుకో.”
“ఇప్పుడు నగలమాటెందుకులే. నీ హెల్త్ ఎలా ఉంది? ప్రోబ్లమ్స్ ఏం లేవు కదా!”
“హమ్మయ్య, ఇంతసేపటికి నా గురించి అడిగేవు. ఈ వయసులో ప్రోబ్లమ్స్ లేకుండా ఎలా ఉంటాయి చెప్పు. బి.పి, షుగర్ కామన్. నా ఊపిరితిత్తుల వల్ల కొంత ప్రమాదం ఉంది. ఒక్క మోకాళ్ల నొప్పులే ఎప్పట్నుంచో వేధిస్తున్నాయి. మా ఆవిడున్నప్పుడు రోజూ కాళ్లు పట్టేది పాపం. కాని, నాకు హెల్త్ కాన్షస్ ఎక్కువ. మూడు నెల్లకోసారి అన్ని టెస్టులూ చేయించుకుని మందులు వాడుతుంటాను. ఆరునెల్లకోసారి తిరపతి వెంకన్న దగ్గరకెళ్లి వస్తుంటాను.”
“అవునా….ఇంకా నీ హాబీస్ గురించి చెప్పు”
“హాబీస్ ఏముంటాయ్, ఒకప్పుడు బాగా స్మోక్ చేసేవాణ్ణి. డాక్టర్లు వద్దన్నాక మానేసాను. వారానికోరోజు పదిమంది స్నేహితులం కలుస్తుంటాం. దానికేముందిలే. ఆడవాళ్లే తాగుతున్న రోజులివి. ఆ రోజు కాస్త స్నేక్స్, వేయించిన జీడిపప్పు లాంటివి సిద్ధం చేసి పెడితే బావుంటుంది. అన్నట్టు నువ్వు పరిపూర్ణ ఆరోగ్యంతో ఉన్నావు కదా, ఎలాంటి ప్రోబ్లమ్స్ లేవు కదా!”
ఉంటే ఏం, నువ్వు బాగు చేయిస్తావు కదా!”
“అది కుదరదనుకుంటా. మా చిన్నోడికి అంతా లెక్కే. నాకెంత ఖర్చవుతుందో అంతా ఇచ్చి మిగతా పెన్షను డబ్బు పట్టుకుపోతాడు. అయినా నీకు పెన్షనొస్తుందిగా! ఏమంటావోనని. ఇందాక ఊరికే అలా అన్నాను కానీ, గవర్నమెంటు సర్వీసులో రిటైరై, ఓపికుంది కాబట్టి ప్రైవేటు స్కూల్లో చేస్తున్నావట కదా!”
“ఓహో నా గురించి చాలా ఎంక్వైరీ చేసావే! నా ఖర్చులు నేను పెట్టుకుని నీతో సహ జీవనం పేరుతో సేవలు చేస్తూ ఉండాలన్నమాట! ఒకవేళ మీ అబ్బాయి పెన్షను డబ్బు పట్టుకుపోతే అప్పుడు నేనే నిన్ను పోషించాలన్నమాట. బావుంది, ఇంకా చెప్పు”
“ఛ..ఛ…అలా ఎందుకు చేస్తాడు? చెయ్యడు. నీకా భయమేమీ అక్కర్లేదు”
“నాకా భయమేమీ లేదులే. ఒక మనిషికి ఆ మాత్రం అన్నం పెట్టలేకపోను గానీ…. అన్ని లెక్కలు చూసుకునే మీ చిన్నబ్బాయి అడిగితే నా గురించి ఏం చెప్తావు, కొత్త వంట మనిషి అనా?”
“నువ్వు చాలా షార్ప్ ఉమా, అది నువ్వే చెప్పాలి. ఒకసారేమైదంటే నా భార్య పోయిన ఏడాదికి నా ఇబ్బందులు చూసి మా క్లాస్మేట్ మురళి లేడూ, వాడొక సలహా ఇచ్చేడు. తనకి తెలిసిన ఒక పేద విడో ఉందని, చిన్న వయసులో ఉంది కాబట్టి ఓపికగా అన్ని పనులూ చేసిపెడుతుందని. ఆమెని పెళ్లాడితే నా తదనంతరం నా పెన్షను ఆమెకి జీవనాధారం అవుతుందని. నా కొడుకులిద్దరూ ససేమిరా అన్నారు. ఇన్నిన్ని ఆస్తుల్లో వాటా కావాలని అడిగితే ప్రోబ్లమైపోతుందని నాకూ అన్పించింది. అందుకే అది వద్దను కున్నాం.”
“…….”
“ఉమా, మాట్లాడవేంటి”
“ఏం మాట్లాడమంటావ్, ఒక పేద అమ్మాయికి నీ తర్వాత ఒక జీవికను ఏర్పాటు చెయ్యలేకపోయావు. శేషూ, దాన్ని స్వార్థం అంటారని తెలుసా నీకు?”
“అసలు ప్రోబ్లం అది కాదు కదా! మళ్లీ పిల్లలు పుట్టొచ్చు. లేదా ఆ మనిషే ఆస్తి కోసం….”
“ఇంక ఆపు శేషూ, అసహ్యం వేస్తోంది. ఆస్తి ఆస్తి అంటున్నావు. ఆస్తిని వెంట కట్టుకుపోయినవాళ్లనెవర్నైనా చూసేవా? నా మీద కూడా నీకూ, నీ కొడుకులకే అలాంటి అభిప్రాయమే వచ్చి ఉండాలి కదా”
“మనది సహజీవనం కదా, అయినా ఈ వయసులో నీకు పిల్లలెలా పుడతార్లే. హహ్హహ్హ”
“ఛీ శేషూ, నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమౌతోందా?”
ఇప్పుడు నేనేమన్నానని? అయినా చిన్నప్పట్నుంచి నువ్వెంత మంచిదానివో నాకు తెలుసు కదా ఉమా”
“అందుకని నన్ను ట్రాప్ చెయ్యాలనుకున్నావన్నమాట”
“ఇది ట్రాప్ కాదు ఉమా, నీ మీద గుడ్ విల్. నా అంతటి వాడు నిన్ను నమ్మి ఇంత పెద్ద బంగ్లాలో చోటిస్తున్నాడంటే ఇది నువ్వెంతో సంతోషించాల్సిన విషయం.
నీలో అమాయకత్వం ఇంకా అలాగే ఉంది. అందుకే నీకు అర్థం కావడం లేదు.
ఇంకెవర్నైనా ఇలా ఆహ్వానిస్తానా నేను?”
“లివింగ్ టుగెదర్ మీటింగ్స్ కి వెళ్లేవుగా. అక్కడెవరైనా నచ్చి ఉంటే ఆహ్వానించే వాడివేగా”
“లేదు లేదు అప్పటికే నువ్వున్నావు నా మనసులో”
“మనసులో నేనుండీ వేరే వాళ్లని చూడ్డానికి వెళ్లేవన్నమాట”
“కాదు కాదు నీ విషయంలో నా ఉదారత్వం వేరు”
“అయితే ఈ ఉదారత్వం వెనక కూడా ఇంకేదో ఉందన్నమాట”
“ఇది నీకు నచ్చుతుందో లేదో తెలీదు. నా స్నేహితులు ఈ మాట నీకు చెప్పి తేల్చుకోమన్నారు. మా పెద్దవాడి కూతురు గిరిజ భర్త యాక్సిడెంట్లో పోయాడు. అతడొక నిలకడైన ఉద్యోగం చెయ్యక దాని బతుకిప్పుడు గాలిలో దీపంలా ఉంది. నా రిక్వెస్ట్ ఏంటంటే, మనం రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం. కీడెంచి మేలెంచమన్నారు కదా! నాకేమైనా అయితే నా తదనంతరం నా పెన్షను నీ చేతికొస్తుంది కాబట్టి దాన్ని నువ్వు గిరిజకి ఇవ్వాలి”
“హారి ముసలాడా శేషూ, నువ్వూ, నీ స్నేహితులూ ఒక్కలాగే ఉన్నారే”
“ఏంటి, ఏవంటున్నావ్, సరిగా వినపడలే”
“మరి నువ్వు చాలా సంపాదించి నీ కొడుకులకిచ్చేవు కదా, భర్త పోతే మాత్రం ఆ అమ్మాయికి లోటేంటి?”
“ఆడపిల్లకి అలాగెలాగ దోచిపెడతాం?”
“పెళ్లై వెళ్ళిపోతే మీ ఇంటి ఆడపిల్ల పరాయిదైపోతుందన్నమాట! పోనీ, తన కాళ్ల మీద తను నిలబడేలా చెయ్యొచ్చు కదా”
“అవన్నీ దాని వల్ల కావులే. అంత చదువూ, తెలివీ కూడా లేవు”
“అయితే మళ్లీ పెళ్లి చెయ్యండి, లేదా తనకి నచ్చిన వాడితో జీవితాన్ని పంచుకో నివ్వండి. చిన్న వయసేనేమో కదా”
“ఎంత మాటన్నావ్, అలాంటివి మా ఇంటా వంటా లేవు”
“మరిప్పుడు నువ్వు చెయ్యబోతున్నదేంటి?”
“నేను మొగోణ్ణి. ఏ వయసులోనైనా ఏమైనా చెయ్యగల హక్కున్నోణ్ణి”
“శేషూ, నువ్వు గురజాడ అప్పారావు గారి కాలంలో పుట్టవలసిన వాడివి”
“అవునవును, నాకు ఆయనంటే చాలా ఇష్టం”
“నీ మొహంలే”
“ఆ…ఏవంటున్నావ్? మళ్లీ విన్పించడంలే”
“అదే మంచిదిలే”
“నేనడిగిందానికి సమాధానం చెప్పలేదు. నా ఫేమిలీ పెన్షను గిరిజకి… హలో…హలో… ఉమా…..హలో…..లంకంత ఇల్లు. ఆలోచించుకోమరి”
“నాకు లంకలూ, ద్వీపకల్పాలూ వద్దులే శేషూ! లంకంత ఇంట్లో ఉండి ఏం లాభం మనసులు ఇరుకైపోయాక?
నీకు తెలియని విషయం ఒకటుంది. నువ్వన్న ప్రైవేటు స్కూలు, కాలేజీ, దానికి అనుబంధంగా వృద్ధాశ్రమం నేను నడుపుతున్నవేనని. గిరిజను మీరు చూడకపోతే నా దగ్గరకు పంపించు. కంటికి రెప్పలా చూసుకుంటాను. నువ్వు మరో లివింగ్ టుగెదర్ మీటింగ్ కి వెళ్లు”
ఫోన్ కట్ చేసింది ఉమ.
*****

కె వరలక్ష్మి జన్మస్థలం, ప్రస్తుత నివాసం తూర్పుగోదావరి జిల్లాలోని జగ్గంపేట. ప్రముఖ కవయిత్రి, “నెచ్చెలి” సంస్థాపకసంపాదకురాలు డా||కె.గీత వీరి అమ్మాయి. నాలుగు నవలికలు, 140 పైగా కథలు, చాలా కవితలు, రేడియో నాటికలు, వ్యాసాలు రచించారు. జీవరాగం (1996), మట్టి బంగారం (2002), అతడు నేను- (2007), క్షతగాత్ర (2014), పిట్టగూళ్లు (2017) కథా సంపుటులు, ఆమె (2003) కవితా సంపుటి, కథ, కథావార్షిక, రంజని, రచన, విశాలాంధ్ర, కవిత, కవితా వార్షిక, నీలిమేఘాలు మొ.లైన వెన్నో సంకలనాలు. చాసో స్ఫూర్తి పురస్కారం, రంగవల్లి, విమలా శాంతి పురస్కారం, సహృదయ సాహితీ, బి.ఎస్ రాములు, హసన్ ఫాతిమా పురస్కారాలు, పొట్టి శ్రీ రాములు తెలుగు యూనివర్శిటీ ధర్మనిధి పురస్కారం , రంజని, పులికంటి, ఆర్.ఎస్ కృష్ణమూర్తి అవార్డులు, అప్పాజోస్యుల- విష్ణుభొట్ల పురస్కారం, శ్రీమతి సుశీలా నారాయణ రెడ్డి సాహితీ పురస్కారం, ఆటా, తానా పురస్కారాలు మొ.నవి కథలకు అవార్డులు. శ్రీ శ్రీ, దేవుల పల్లి కృష్ణ శాస్త్రి అవార్డు మొ.నవి కవితలకు అవార్డులు. శాస్త్రీయ సంగీతం, గజల్స్ వినడం, మంచి సాహిత్యం చదవడం అభిరుచులు.