
వెనుతిరగని వెన్నెల(భాగం-69)
–డా||కె.గీత
(*“కౌముది” లో ధారావాహిక నవలగా 2015 నుంచి 2020 వరకు ప్రచురించబడిన “వెనుతిరగని వెన్నెల” ఇప్పటివరకు చదవని వారి కోసం కౌముది సౌజన్యంతో నెల నెలా ఆడియోతో బాటూ ఇక్కడ ఇస్తున్నాం.)
***
జరిగిన కథ: అమెరికాలో తన తల్లికి స్నేహితురాలు, స్త్రీలకు సహాయం చేసే సంస్థ “సహాయ”ను నడిపే ఉదయినిని కలవడానికి వస్తుంది సమీర. నాలుగు నెలల గర్భవతైన సమీర, తనకు విడాకులు తీసుకోవాలని ఉందని, అందుకు దోహదమైన పరిస్థితుల్ని చెపుతుంది. ఉదయిని “తన్మయి”కథ చెపుతాను, విన్నాక ఆలోచించుకోమని చెప్తుంది సమీరతో. చుట్టాల పెళ్లిలో కలుసుకున్న తన్మయి, శేఖర్ లకు పెద్దవాళ్ల అనుమతితో పెళ్లిజరుగుతుంది. పెళ్లయిన మరుక్షణం నించే శేఖర్ అసలు స్వరూపం బయట పడుతుంది. మొదటి సంవత్సరంలోనే అబ్బాయి పుడతాడు. శేఖర్ తో ఒక పక్క కష్టాలు పడుతూనే తన్మయి యూనివర్శిటీలో ఎమ్మే పాసయ్యి, పీ.హెచ్.డీలో జాయినవుతుంది. శేఖర్ తో ఎన్నో రోజులు పోరాడి, చివరికి తన్మయి విడిపోతుంది. హైదరాబాదుకు దగ్గర్లో తన్మయికి లెక్చరర్ గా ఉద్యోగం వస్తుంది. చిన్ననాటి స్నేహితుడు ప్రభుతో మళ్లీ పెళ్లి జరుగుతుంది. ప్రభుతో బాటూ అతని కుటుంబం కూడా వచ్చి చేరి, హింస మొదలవు తుంది.
***
మర్నాడు పొద్దున్న ముందుగా దివాకర్ ఇంటికి బయలుదేరేరు. తన్మయి తమ స్కాలర్స్ హాస్టల్ దగ్గిర ఆగి వెళ్దామని పట్టుబట్టింది.
పిచ్చి మొక్కలు మొలిచిన ఆవరణలో గేటు నుంచి బిల్డింగు ఎంట్రెన్సు వరకు ఉన్న కాలిబాట కిరుపక్కల దట్టంగా మొలిచిన గడ్డిలోకి పరుగు తియ్యబోయిన బాబు చేతిని గట్టిగా పట్టుకుంది తన్మయి.
“వద్దు నాన్నా, పురుగూ పుట్రా ఉంటాయి” అంటూ.
మెట్లెక్కి రిసెప్షను హాలులోకి అడుగుపెట్టగానే ఎప్పటిలాగే నైటీలు వేసుకుని స్కాలర్స్ టీవీలో నిమగ్నమై ఉన్నారు. తన్మయికి నవ్వు వచ్చింది. సంవత్సరాలు మారినా హాస్టలు పరిస్థితి మారనందుకు.
ప్రశ్నార్థకంగా తన వైపు చూసిన అమ్మాయితో “వార్డెను మేడంని కలవడానికొచ్చేం” అంది.
ఆ అమ్మాయి చిన్న నవ్వు కూడా లేని నిరాశ ముఖంతో “ఆవిడ లేదు, రేపు రండి” అని ముఖం తిప్పుకుంది.
ప్రభు అప్పటికే బయటికి తిరిగెళ్లిపోయేడు.
తన్మయి బాబు చెయ్యి పట్టుకుని “ఒక్కసారి మేం లోపలికెళ్లి చూసి రావొచ్చా? నేనిక్కడ ఒకప్పుడు రెసిడెంట్ స్కాలర్ని” అంది.
“ఏం చూస్తారూ?” అంది సాగదీస్తూ ఆ అమ్మాయి.
“మా రూము, ఇక్కడే పక్కనే ఉంటుంది. ఊరికే బయటి నించి చూసి వచ్చేస్తాను” అని ఆ అమ్మాయి సమాధానం కోసం ఎదురుచూడకుండా లోపలికి అడుగుపెట్టింది.
లోపల చుట్టూ గదులతో ఉన్న పెద్ద విశాలమైన రెండస్తుల భవనం చూసి నోరు తెరిచేడు బాబు “అమ్మా ఇంత పెద్దదా” అంటూ.
కానీ ఎక్కడికక్కడ మాసిపోయిన గోడలు, పెళ్లలు ఊడిన గచ్చులు. తమ గది దాటి, పొడవాటి వరండా దాటి మెట్లెక్కి డైనింగు హాల్లోకి అడుగుపెట్టేరు. పిల్లుల వాసనకి ముక్కు మూసుకున్నాడు బాబు. ఇదీ మారలేదు. క్యాంటీను నించి వేళకి భోజనాన్ని గదికి తెచ్చి ఇచ్చే కొండమ్మ మనసులో మెదిలింది. అప్పటికే వయసైపోయి వంగిన నడుముతో అతికష్టంగా పనిచేసేది. ఇప్పుడు ఎలా ఉందో?
అప్పటికే పది దాటుతుండడంతో టిఫిన్ల వేళ అయిపోయినందున ఎవ్వరూ లేరు.
హాలు కిటికీలోంచి ఒక వైపు విశాలమైన హాస్టలు ప్రాంగణం, మరోవైపు పిచ్చి మొక్కల రాళ్ల గుట్టతో అంగుళం కూడా మారలేదు ఆ స్థలం.
మేరీ, తను ఉన్న గది దాటి వస్తూండగా జ్ఞాపకాలు కిటికీలకు వేలాడుతున్న పరదాల్లా కదిలేయి.
మొదటిరోజే ప్రేమగా తనని తన గదిలోకి ఆహ్వానించిన మేరీ చిరునవ్వు ముఖం గుర్తుకు వచ్చింది. గది తలుపు తడదామని అంతలోనే ఆగిపోయింది. తమ స్థానంలో వేరే ఎవరో ఉండి ఉంటారు. ఆ గదిలో తామిద్దరూ అలంకరించుకున్న ప్రత్యేక జ్ఞాపకాలు చెదిరిపోకుండా ఉండాలంటే చూడకపోవడమే మంచిది. వరండాలో నుంచి నడుస్తుంటే ఆ గదిలో మేరీ ప్రతి రాత్రీ నిశ్శబ్ద ప్రార్థన చేస్తున్నట్టే ఉంది.
పది నిమిషాల్లో బయటికి వచ్చేరు.
పాపని మెట్ల మీద కూర్చోబెట్టి ఆడిస్తున్న ప్రభు నవ్వుతూ లేచి “జ్ఞాపకాల్ని వెంట తెచ్చుకోవడం అయ్యిందా పర్సు బరువుగా ఉంది” అన్నాడు నవ్వుతూ.
తన్మయి నిశ్శబ్దంగా బయటికి నడిచింది.
తన జీవితంలో అపురూపంగా దాచుకున్న క్షణాలు ఇక్కడివి. ఇక్కడి నుంచి వెళ్లేక జీవితం ఎక్కడి నుంచి ఎక్కడికో ఊహించని మలుపులు తిరిగింది. పదహారేళ్ళ వయసులో తన చుట్టూ ఉన్న వాళ్ళలాగే తన భావి జీవితం ఎప్పుడూ ఒక్కలాగే ఉంటుందని విశ్వసించేది తను.
నిజానికి తన చేతులారా తను ఎప్పుడూ ఉన్న జీవితాన్ని పాడు చేసుకునే ప్రయత్నం చెయ్యలేదు. మార్చుకునే ప్రయత్నమూ చెయ్యలేదు. అయినా తనకి తెలియకుండానే జీవితం అస్తవ్యస్తం అయ్యింది. అయినా ఓటమిని, జయాన్ని ఒక్కలాగే స్వీకరించింది.
శేఖర్ తనని మోసం చేసి మొత్తం జీవితాన్నంతా అల్లకల్లోలం చేసాడు. అలిసి పోయిన జీవితానికి దొరికిన అరుదైన సాంత్వన ప్రభు అని మనస్ఫూర్తిగా నమ్మింది.
అయినా సమస్యలు అతని వాళ్ల వైపు నుంచి ముంచుకొచ్చాయి. మొత్తానికి బాధైతే తప్పడం లేదు. తను మళ్లీ పెళ్లి చేసుకున్న పాపానికి చెయ్యని తప్పుకి పసివాడు శిక్ష అనుభవించాల్సి వస్తూంది.
హాస్టలు బయటికొచ్చి రోడ్డు దాటి చిన్న వినాయకుడి ఆలయం దగ్గర ఆటో కోసం నిలబడ్డారు. సైడ్ వాక్ మీద గుడేవిటో అని ఒకప్పుడు నవ్వుకునేది. ఎన్ని పూజలు చేసినా మనిషికి కష్టాలేవీ తీరకపోయినా, బహుశా: ఏ దేవుడో తీరుస్తాడనే నమ్మకం వల్ల కష్టాలు గట్టెక్కగలిగే ధైర్యం వస్తుందనుకుంటా. రెండు చేతులూ జోడించి నమస్కరించింది.
“భగవంతుడా! నా కడుపున పుట్టిన పాపం అంటకుండా ఈ పసివాణ్ణి దయతో కాపాడు.”
వినాయకుడికి వినబడిందో లేదో తెలియదు కానీ కనీసం ప్రభుకి వినబడితే బావుణ్ణు. కనీసం తన బాధ అర్థమైతే బావుణ్ణు. నిట్టూర్పు విడిచి ఆటోలో ఎక్కింది తన్మయి.
జగదాంబా సెంటరు వైపు దూసుకుపోతున్న ఆటోలో నుంచి బయట కదిలిపోతున్న రోడ్ల వెంట, వీథుల వెంట జ్ఞాపకాలు చిందర వందరగా, రణగొణ ధ్వనులు చేసుకూంటూ పడీ, లేచీ దొర్లసాగేయి. తను ఎన్నో కలలతో అడుగుపెట్టిన నగరం, తనని అనుభూతుల వెల్లువతో తడిపేసిన నగరం, తనకి విద్యతోబాటూ విజయాల్ని ఇచ్చిన నగరం. తనని నిలువునా దోచుకుని, దూరంగా విసిరేసిన నగరం. తనని దుఃఖపూరితురాల్ని చేసిన నగరం. విజయాల్నీ, అపజయాలనీ సరిసమానంగా ఒకదానిమీదొకటి పేర్చుకుంటూ పోతున్న జీవితం తనకి వరమో, శాపమో.
ఆటో దివాకర్ వాళ్లిల్లు చేరే వరకు నిశ్శబ్దంగా ఆలోచించుకుంటూనే ఉండి పోయింది. పాప ప్రభు ఒళ్లో నిద్రపోతూ ఉంది. బాబు మధ్యలో కూచుని తన్మయి భుజాన్నానుకుని బయటికి చూడసాగేడు.
దివాకర్ వాళ్లింట్లో అతని తల్లిదండ్రులు తన్మయిని చూసి ఎంతో సంతోషించేరు.
తమని చూస్తునే బయటికి పరుగెత్తుకెళ్ళి కూల్ డ్రింకులు తెచ్చేడు దివాకర్. టిఫిన్లు చేసొచ్చేమన్నా వినకుండా వేడివేడిగా ఉప్పుడు పిండి పళ్లేల్లో వేసి పట్టుకొచ్చేరు దివాకర్ అమ్మగారు. దివాకర్ అక్క బాబుని ప్రేమగా పిల్చుకెళ్లి పెరట్లో జామకాయలు తెంపి ఇచ్చింది. పాపని ఎత్తుకుని ముద్దాడింది. వాళ్ల ఆప్యాయతకు ముగ్ధురాలయ్యింది తన్మయి.
ఇలా కొద్దిమందైనా ప్రేమపూరిత వ్యక్తులు లభించడం తనకి జీవితంలో ఇచ్చిన అరుదైన వరం. వాళ్ల సహృదయ ఆశీస్సుల వల్లే తనకి ప్రభు వంటి ప్రేమమూర్తి లభించేడు. తిరిగి వస్తూ దివాకర్ తల్లిదండ్రుల కాళ్లకు నమస్కరించేరు తన్మయి, ప్రభు. మనసారా దీవించి వీథి చివరంటా వచ్చి మరీ సాగనంపేరు వాళ్లు.
***
అట్నించటే ఋషికొండ బీచ్ కి బయలుదేరేరు. అప్పటికే కొద్దిగా నలతగా ఉన్న తన్మయికి బీచ్ కి చేరే సమయానికి పొంగుకుంటూ జ్వరం వచ్చేసింది. ప్రభు వెనక్కి వెళ్లిపోదామని అన్నా పిల్లలు సరదా పడ్తుండడంతో వాళ్లు ముగ్గుర్నీ వెళ్లి రమ్మని ఒడ్డుకి కాస్త దూరంలో సరుగుడు చెట్ల నీడన దుప్పటీ పరుచుకుని ఇసుకలో పడుకుండి పోయింది తన్మయి.
అరగంటలో పిల్లలతోబాటూ వెనక్కి వచ్చేసి కొబ్బరి బొండాం తీసుకొచ్చి పట్టించేడు తన్మయికి ప్రభు. దార్లో ఆటో మెడికల్ షాపు దగ్గిర ఆపి మాత్రలు, గ్లూకోజు కొన్నాడు. రూముకి రాగానే తన్మయిని నిద్రపోమని పిల్లలకి స్నానాలు, భోజనాలు అన్నీ తనే చూసుకున్నాడు.
ప్రభు తన తల మీద తడి గుడ్డ వేసి తల పట్టడం, కాళ్లు పట్టడం వంటి సపర్యలు చేస్తున్నంతసేపూ “నువ్వు నన్ను వొదిలి ఎప్పుడూ వెళ్లద్దు, నేనెప్పుడూ నిన్నొదిలి వెళ్లను” అంటూ జ్వరంలో ఏవేవో మాట్లాడసాగింది.
“ఉష్… అలాగేలే. కళ్లు మూసుకుని నిద్రపో” అంటూ ఉన్నాడు ప్రభు. రాత్రంతా జ్వరం మత్తులో ఏవేవో కలవరిస్తునే ఉంది తన్మయి. తెల్లారి లేస్తూనే తల మీద అరచేయి వేసి చూస్తున్న ప్రభు చెయ్యి పట్టుకుని మౌనంగా రోదించసాగింది.
“ఏవిట్రా, కాస్త జొరానికే ఏడుస్తావా చిన్న పిల్లలాగా” అని “ఇవేళ సాయంత్రం రైలు టైము వరకూ ఎక్కడికీ వెళ్లొద్దు మనం. రెస్టు తీసుకో” అంటున్న ప్రభు చేతిని పట్టుకుని “ఈ చేతిని మాత్రం ఎప్పుడూ వదలను” స్థిరంగా మనసులో అనుకుంది.
***
హైదరాబాదు చేరగానే “ఏం బాబూ! ఆపీసు ట్రిప్పు బాగా జరిగిందా?’ అంటూ ఎదురొచ్చింది ప్రభు తల్లి బేబమ్మ.
ఆశ్చర్యపోయింది తన్మయి. అంటే తామెక్కడికి వెళ్లామో, ఎందుకు వెళ్లామో ఏమీ నిజం చెప్పలేదన్నమాట వాళ్లకి.
అంటే తను పీ.హెచ్. డీ వంటి పై చదువులు చదివితే వాళ్లకు నచ్చదనా? లేదా తనకి సాయంగా అతను రావడం వాళ్ళకి ఇష్టం ఉండదనా?
అసలు ఎందుకు వాళ్లకు ఇంత భయపడతాడు? ఇంత భయపడేవాడు వాళ్లకు తెలీకుండా తనని పెళ్లి ఎలా చేసుకోగలిగాడు?
బొత్తిగా అర్థం కాని ప్రభు ప్రవర్తనకి విసుగు వచ్చినా తమాయించుకుని నిశ్శబ్దంగా ఉండిపోయింది తన్మయి.
అయినా అతని తల్లిదండ్రుల దగ్గిర అతనెలా నటిస్తే తనకెందుకు? తనకు కావలసిందల్లా మనశ్శాంతి.
బహుశా: అతనికే అదే అవసరమేమో. వాళ్లకు నిజాలు చెప్పి వాళ్ల ఏడుపులు, గోలలు, గొడవలు పడేకన్నా అబద్ధాలతో మనశ్శాంతి పొందుతున్నాడేమో.
కిందనే ఆగిపోయిన ప్రభుతో అతని తల్లి అంటున్న మాటలు మెట్లెక్కుతున్న తన్మయికి వెనకే చెవినపడుతూనే ఉన్నాయి.
“ఏం బాబూ, ఆ పిల్లోణ్ణి అటు నించటే ఆళ్ల అమ్మమ్మ కాడ దించీసి వత్తారను కున్నాం. మళ్లీ తీసుకొచ్చేరేటి? ఆ మాత్రం దానికి ఆణ్ణి ఎంటెట్టుకుని ఎందుకు తీసు కెళ్ళేరు? ఆఫీసు మీటింగులుక్కూడా ఆడు ఎంట రావాలేటీ?”
వింటున్న తన్మయికి రక్తం మరగసాగింది. ప్రభు మౌనంగా వింటూ కూచోవడం మరింత చికాకు కలిగించసాగింది.
లాభం లేదు. ఇక వాళ్లకి, తనకి మధ్య ఉన్న సమస్యల్ని తనే పరిష్కరించు కోవాలి. ప్రభుతో ఇటువంటి విషయాలు మాట్లాడడం కూడా అనవసరం.
ప్రయాణపు బడలిక వల్ల ఆ రోజు కూడా సెలవు పెట్టింది తన్మయి.
ప్రభు మాత్రం కాస్సేపట్లోనే హడావిడిగా ఆఫీసుకి బయలుదేరి వెళ్ళిపోయేడు. నిజంగా ఆఫీసు పని ఉన్నా లేకపోయినా ఇంట్లో గోల నుంచి బయట పడడానికి అతను ఎంచుకున్న మార్గమది.
బాల్కనీలోంచి వీథి చివరి వరకూ ప్రభు వెళ్లిన వైపే చూసి నిట్టూర్చింది తన్మయి.
పిల్లలకి స్నానాలు చేయించి, తను కూడా తలారా స్నానం చేసింది.
పొడవైన జుట్టుకి సాంబ్రాణి పొగ వేసుకుంది.
వేడివేడిగా కాసిన్ని పాలు కాచుకుని తాగేసరికి నిద్ర ముంచుకు వచ్చింది.
అసలే ముందు రోజంతా జ్వరం పడి లేచిందేమో మధ్యాహ్నం భోజనం సమయా నికి రాణి వచ్చి లేపేవరకు నిద్రపోతూనే ఉంది.
కిందికి వెళ్లేసరికి అంతా అప్పటికే భోజనాలు కానిచ్చినట్టున్నారు. టీవీ ముందు కూచున్నారు.
తన కోసం ఒక ప్లేటులో అన్నీ సర్దిపెట్టి మూతపెట్టిన భోజనాన్ని నిశ్శబ్దంగా తిన సాగింది తన్మయి.
స్కాలర్స్ హాస్టలు గుర్తుకొచ్చింది. అక్కడ కూడా ఇలాగే ఎవరి భోజనం వాళ్లకి పళ్లేలు మూతలు పెట్టి ఉంచేవారు.
అక్కడికి ఇక్కడికి ఈ విషయంలో మాత్రం ఏవీ తేడా లేదు.
తనకీ, వాళ్లకి ఉన్న ఒకే ఒక్క సంబంధం ప్రభు. అంతే. తను ఎంత మామూలుగా ఉండాలనుకున్నా వాళ్లకీ, తనకి ఏవీ సంబంధం లేనట్టే ప్రవర్తిస్తారు అందరూ.
పాపని మాత్రమే ముద్దు చేస్తూ, ఆ పిల్లతో మాత్రమే మాట్లాడుతూ ఉంటారు.
బాబు అప్పటికే అన్నం తిని బయటికి ఆడుకోవడానికి వెళ్ళిపోయేడు.
భోజనం చెయ్యగానే వెళ్లి వాళ్ళ దగ్గరగా కుర్చీ జరుపుకుని కూర్చుంది తన్మయి.
అంతా బిత్తరపోయి చూస్తుండగానే “ఆ టీ.వీ కట్టండి మీతో మాట్లాడాలి నేను” అంది సాధ్యమైనంత మామూలుగా.
ఏవిటన్నట్టు అంతా సర్దుక్కూర్చున్నారు.
తన్మయి ప్రభు తల్లిదండ్రుల వైపు సూటిగా చూస్తూ “ఇలా చూడండి. మీకు నాతో ఏ సమస్య ఉన్నా ఇకమీదట నాతోనే మాట్లాడండి. మీకు, నాకు మధ్య మీ అబ్బాయి రాయబారం అవసరం లేదు.” అని “ఊ, చెప్పండి, బాబు విషయంలో మీకున్న ప్రాబ్లెమ్ ఏవిటి?” అంది.
ప్రభు తండ్రి వెంటనే తేరుకున్నట్టు “పిల్లోడితో పోబ్లమ్ అంటన్నావా? అసలు పిల్లోడే పోబ్లమ్ అని మేం అనుకుంటంటే” అన్నాడు గారపళ్లు బయటపెట్టి.
“వాడెందుకు ప్రాబ్లెమ్?” అంది సీరియస్ గా.
“ఎంతుకా? మా వోడు ఎండనకా, వాననకా ఎర్రని రత్తం మరిగిపోయి కరిగిపోయిలాగా కట్టపతన్నది నీ కొడుకుని పెంచటానికే సరిపోతంది గదా” అని అరిచింది ప్రభు తల్లి.
తన్మయి గొంతు పెంచి “నేను మీతో మాములుగా మాట్లాడుతున్నాను. మీరెందుకు అరుస్తున్నారు? మీ అబ్బాయే కాదు, నేను కూడా ఎర్రని రక్తం మరిగిపోయి కరిగిపోయి లాగా కష్టపడుతున్నాను. నా కష్టం, అతని కష్టం అంతా మిమ్మల్నందరినీ పోషించ టానికే సరిపోతూవుందని నేనూ అనగలను. కానీ ప్రభు మాటకి విలువిచ్చి, అతని బాధ్యత లన్నీ నా బాధ్యతగా భావిస్తూ ఏనాడూ ఎటువంటి అడ్డు చెప్పలేదు. నేను, నా కొడుకు మీ కుటుంబంలో భాగమని మీరు అంగీకరించకపోయినా నేను మిమ్మల్నందరినీ నా కుటుంబంగా భావించాను….”
ఇంకా తన్మయి మాట పూర్తవకుండానే అందుకుంది బేబమ్మ. “నా కొడుకు సొమ్ము మాకే సెందుతాది. అది మా అక్కు. నువ్వెవరు అడ్డుసెప్పనీకి? సెప్పకపోనీకి? అందులో నీకన్నా వాటా ఉందేమో గానీ నీ కొడుక్కి లేదు. గుర్తెట్టుకో”
తన్మయి అడ్డొచ్చి “నా సహనాన్ని చాతగానితనంగా తీసుకోవద్దు. మీకు ఒక విషయం సీరియస్ గా చెపుతున్నాను. నా కొడుకుని కేవలం నా డబ్బులతో మాత్రమే పెంచుకొస్తు న్నాను. మీ అబ్బాయి సొమ్ముతో కాదు. అయినా ఈ ఇంట్లో మీ అందరికంటే ఎక్కువ హక్కు ఉన్నది నాకు, నా కొడుక్కే. వాడిని ఈ ఇంట్లో నుంచి దూరంగా పంపడం అనే ఆలోచన మానెయ్యండి. వాడు ఎప్పుడూ నాతోనే ఉంటాడు. మీరు అనవసరంగా వాడిని, నన్ను మాటలని, ఇలా అయిన దానికి, కాని దానికీ గొడవలు చెయ్యడం, మమ్మల్ని హెరాస్ చెయ్యడం చేస్తే ప్రభు తల్లిదండ్రులని కూడా చూడను. పోలీస్ రిపోర్టు ఇచ్చి ఊసలు లెక్క పెట్టిస్తాను. మీతో బాటూ మీ అబ్బాయికి, మీ పిల్లలందరికీ కూడా అదే గతి పడుతుంది. పైగా మీ అబ్బాయి ఉద్యోగం కూడా ఊడుతుంది. నేనిన్నాళ్ళు ప్రభు మొహం చూసి ఊరుకున్నాను. మీ ఇష్టం నన్ను నా మానాన నన్ను ఉండనిస్తారో, లేదా నాతో గొడవ పడి జైలుకి వెళ్తారో తేల్చుకోండి.” గబగబా అని అవాక్కయిన వాళ్ళ వైపు తీవ్రంగా చూస్తూ …
“ఇదంతా మీ అబ్బాయి వచ్చేక చెప్పి నాకు అతనితో చెప్పించాలని ప్రయత్నం గానీ, మళ్లీ ఈ విషయంలో రాద్ధాంతం గానీ, లేదా నాకు మీ నించి ఏవిధంగానైనా హాని జరిగిందంటే ఇదిగో ఇది నేను కమిషనర్ ఆఫ్ పోలీసుకి రాసిన ఉత్తరం డూప్లికేట్ కాగితం. నేను కాలేజీకి రేపు మాములుగా వెళ్ళకపోతే పోస్టు చెయ్యమని నా స్నేహితు రాలికి ఆల్రెడీ పంపించాను.” అని వాళ్ల సమాధానం కోసం ఎదురుచూడకుండా మెట్లెక్కి గబగబా వెళ్లి తలుపేసుకుని చేతిలోని ఖాళీ కాగితాన్ని టేబులు మీద గిరాటేసి మంచ మ్మీద వాలిపోయింది.
ఒక పక్క ఇలా వార్నింగ్ ఇవ్వడం వల్ల వాళ్లింకా రెచ్చి పోయే అవకాశం ఉన్నా, ఒక వార్నింగ్ ఇచ్చి చూడడం వల్ల నష్టమైతే ఏవీ లేదనిపించింది.
వాళ్లు తనని పోలీస్ రిపోర్టు వరకు తీసుకు రానిచ్చే మూర్ఖులే అయితే అసలు ఇంట్లో చేరేవారే కాదు.
మహా అయితే ఏం చేస్తారు? వాళ్ళబ్బాయి రాగానే విషయం చెప్పి మళ్లీ రాద్ధాంతం చేస్తారు.
ప్రభు ఈ విషయంలో ఏం గొడవ చేసినా ఎదిరించడానికి సిద్ధంగానే ఉంది తను.
కానీ తను మాత్రం ప్రభుతోనే ఉంటుంది ఏదేమైనా.
“తనది” అనే ఇంటిని నిలబెట్టుకుంటుంది. ‘చూద్దాం ఎవరేం చేస్తారో‘ అని గట్టిగా ఊపిరి పీల్చుకుంది.
ఒక పక్క ఎక్కడో కాస్త భయం వేస్తున్నా, పోరాడడానికి సిద్ధపడినపుడు పిరికితనం పనికిరాదని తనకి తాను ధైర్యం చెప్పుకుంది.
ఆ సాయంత్రం ప్రభు వచ్చే వరకూ గదిలోంచి బయటికి రాకుండా ఉండిపోయింది. బాబుని, పాపని కూడా కిందికి పంపడం మానేసింది.
ప్రభు వస్తూనే పాపని ఎత్తుకుని కిందికి తీసుకెళ్లి వాళ్లకిచ్చి వచ్చేడు. అప్పుడే అర్థం అయ్యింది. వాళ్లు ఆల్రెడీ ప్రభుతో ఫోను చేసి మాట్లాడేరని.
వాళ్లు ఏం చెప్పారో, తను ఏం మాట్లాడవలసి వస్తుందో అని ఆలోచిస్తున్న తన్మయి తో ప్రభు యథావిధిగా ఆ ప్రసక్తి తీసుకురాలేదు.
వాళ్లు అసలు మొత్తం చెప్పేరో, లేదో కూడా తెలియదు.
ఒకవేళ వాళ్లు చెప్పి ఉంటే తనతో అనవసరమైన చర్చలు పెట్టని అతని మీద తన్మయికి గౌరవం కలిగింది. బహుశా: తన బాధ అతనికి అర్థమై, వాళ్ళకి ఆ మాత్రం తెలిసిరావాలని అర్థం చేసుకుని ఉండాలి.
వాళ్లు ప్రభుతో ఏమీ చెప్పి ఉండకపోతే కొంతైనా వాళ్లలో భయం, ఆలోచన కలిగిందని అనుకోవచ్చు. లేదా వాళ్లు తనని మరేదైనా విధంగా ఎదుర్కోవాలని ప్రణాళికలు వేస్తూ అయినా ఉండొచ్చు.
ఏదేమైనా తన్మయికి మొదటిసారి ఎంతో సంతోషం కలిగింది.
ఈ పని ఎప్పుడో చేసి ఉండవలసింది. వాళ్ళేమన్నా ఎదురు చెప్పవద్దన్న ప్రభు మాట విని ఇన్నాళ్లు అనవసరంగా ఉపేక్షించింది.
వాళ్లని ఎదిరించి దైర్యంగా సమాధానం చెప్పినందుకు ఆ రాత్రి తన్మయికి ప్రశాంతంగా నిద్రపట్టింది.
***
ఇంట్లో ఆ తర్వాత ఎవరూ బాబుని, తనని ఏవీ అనకపోవడం స్థిమితాన్నిచ్చింది తన్మయికి.
త్వరత్వరగా పీ హెచ్ డీ పని పూర్తి చేసి మరో మూణ్ణెల్లలో సబ్మిట్ చేసింది.
థీసిస్ సబ్మిట్ చెయ్యడం కోసం విశాఖపట్నానికి వెళ్లి తిరిగి వచ్చిన వారాని కి ప్రభుకి అనుకోకుండా ఉద్యోగం సంబంధిత కష్టమొచ్చిపడింది.
తను పనిచేస్తున్న ఆఫీసు మూతపడి కొత్త ఉద్యోగం వెతుక్కోవాల్సిన పరిస్థితి వచ్చిపడింది.
ఆఫీసు మూతపడే ముందు ఇచ్చిన గడువు పూర్తయిపోయినా మరో ఉద్యోగం రాలేదు ప్రభుకి.
ఎప్పటికప్పుడు ప్రభు జీతమంతా ఖర్చు పెట్టేస్తూ ఉండడం, సేవింగ్సు ఏవీ లేకపోవడం వల్ల ఇల్లు మొత్తం తన్మయి జీతమ్మీద ఆధారపడింది.
మొదట్లో ఇద్దరి జీతాలు మొత్తం ఇంటికే పూర్తిగా ఖర్చు పెట్టేసేవారు. ఎప్పుడై తే ప్రభు తరఫు వాళ్ల ఖర్చులు బాగా అధికమై బొత్తిగా సేవింగ్స్ కూడా లేకుండా అయి పోతున్నాయో, పైగా ప్రభుకి ఇంటి ఖర్చులకి సరిపడా జీతం పెరగగానే ఇక తన్మయి జీతం ఇంట్లో ఖర్చు పెట్టవద్దని తనకి నచ్చినట్టు చేసుకోమని చెప్పేడు. ప్రభు ఒకసారి మాట అన్నాడంటే దానికి కట్టుబడి ఉంటాడు.
అప్పటి నుంచి మళ్లీ ఇదే మొదటిసారి తన్మయి ఇంటి కోసం ఖర్చు పెట్టాల్సి రావడం.
ప్రభు అడక్కుండానే తనే “ఉద్యోగం వెంటనే దొరక్కపోయినా టెన్షన్ పడొద్దు. ఇంటి ఖర్చులు నేను చూసుకుంటానని” ధైర్యం చెప్పింది తన్మయి.
హైదరాబాద్ వచ్చిన దగ్గరనించి ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకుంటూ విలాస వంతంగా బతకడానికి అలవాటు పడ్డ అందరికీ ఇప్పుడు ఖర్చుని నియంత్రించుకుని బతకడం గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టు అయ్యింది.
” మాకు ఊరికే తిండి ఒకటీ పెడితే సరిపోయిందా? ఏం ఆవిడ మా ఖర్చులన్నీ ఎందుకు భరించదూ అంట?” అని అరుస్తున్న తల్లి మీద ఆ సాయంత్రం మొదటిసారి ప్రభు గట్టిగా అరవడం వింది.
“తను మనందరినీ ఆదుకుందని సంతోషించడం పోయి ఇంకా డబ్బు గురించి పీడించడం కూడానా? ఇన్నాళ్లూ మీరేం చేస్తున్నా నా కన్నవాళ్లని భరిస్తూ వస్తున్నాను. అసలే ఉద్యోగం దొరక్క నా వ్యథలో నేను ఉన్నాను. నన్ను ఇంతకంటే బాధకి గురి చెయ్యకండి అమ్మా….” ప్రభు గొంతు జీరబోయింది.
తన్మయికి బాధ కలిగింది. కొడుకు మీద ఇంత భారం మోపి చోద్యం చూస్తున్న ఆ తల్లితండ్రుల పట్ల కూడా అతనికి ఎంత ప్రేమ! చిన్న వయసులో పెద్ద కుటుంబభారం మోస్తున్న అతని పట్ల అట్నుంచి వాళ్లకి మాత్రం కించిత్ కూడా దయ లేదు.
ఆ రాత్రి తన్మయి ప్రభుని హత్తుకుని “బాధపడకు. అన్నీ సర్దుకుంటాయి. ఇంట్లో ఎవరికి ఏం కావాలన్నా నేను చూస్తాను” అంది మనస్ఫూర్తిగా.
తన్మయిని అలాగే కౌగలించుకుని మౌనంగా రోదించసాగేడు ప్రభు.
తన మీద ఆధారపడ్డ పసివాడిలా రోదిస్తున్న ప్రభు మీద అమితమైన ప్రేమాను రాగాలు కలిగేయి తన్మయికి.
“మనం ఎవ్వరికీ అన్యాయం చెయ్యలేదు. మనకెప్పటికీ అన్యాయం జరగదు. చూస్తూ ఉండు నీకు ఇంత కంటే ఉన్నతమైన ఉద్యోగం తప్పకుండా లభిస్తుంది. అసలు అందుకే ఇదంతా జరిగింది” అని అతనికి ధైర్యం చెప్పసాగింది.
*****
(ఇంకా ఉంది)

డా|| కె.గీత పూర్తిపేరు గీతామాధవి. వీరు “నెచ్చెలి” వ్యవస్థాపకులు, సంపాదకులు. తూ.గో.జిల్లా జగ్గంపేటలో జన్మించారు. ప్రముఖ కథా రచయిత్రి శ్రీమతి కె. వరలక్ష్మి వీరి మాతృమూర్తి. భర్త, ముగ్గురు పిల్లలతో కాలిఫోర్నియాలో నివాసముంటున్నారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయంలోఇంగ్లీషు, తెలుగు భాషల్లో ఎం.ఏ లు, తెలుగు భాషా శాస్త్రం లో పిహెచ్.డి చేసి, 10 సం. రాల పాటు మెదక్ జిల్లాలో ప్రభుత్వ కళాశాల అధ్యాపకురాలిగా పనిచేసారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నించి 2006 లో “ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ” పొందారు.అమెరికాలో ఇంజనీరింగ్ మేనేజ్ మెంట్ లో ఎం.ఎస్ చేసి, ప్రస్తుతం సాఫ్ట్ వేర్ రంగంలో భాషా నిపుణురాలిగా పనిచేస్తున్నారు.
ద్రవభాష, శీతసుమాలు,శతాబ్దివెన్నెల, సెలయేటి దివిటీ, అసింట కవితాసంపుటులు, సిలికాన్ లోయ సాక్షిగా కథాసంపుటి, వెనుతిరగనివెన్నెల నవల, At The Heart of Silicon Valley -Short stories (2023),Centenary Moonlight and Other Poems(2023) ప్రచురితాలు. నెచ్చెలి ప్రచురణ “అపరాజిత” – గత ముప్పయ్యేళ్ల స్త్రీవాద కవిత్వం (1993-2022) పుస్తకానికి సంపాదకులు & ప్రచురణకర్త. ‘యాత్రాగీతం’ ట్రావెలాగ్స్, ‘కంప్యూటర్ భాషగా తెలుగు’ పరిశోధనా వ్యాసాలు కొనసాగుతున్న ధారావాహికలు. అజంతా, దేవులపల్లి, రంజనీ కుందుర్తి, సమతా రచయితల సంఘం అవార్డు, తెన్నేటి హేమలత-వంశీ జాతీయ పురస్కారం, అంపశయ్య నవీన్ పురస్కారం మొ.న పురస్కారాలు పొందారు.
టోరీ రేడియోలో “గీతామాధవీయం” టాక్ షోని నిర్వహిస్తున్నారు. తానా తెలుగుబడి ‘పాఠశాల’కు కరికులం డైరెక్టర్ గా సేవలందజేస్తున్నారు. కాలిఫోర్నియా సాహితీ వేదిక “వీక్షణం”, తెలుగు రచయిత(త్రు)లందరి వివరాలు భద్రపరిచే “తెలుగురచయిత” వెబ్సై ట్ వ్యవస్థాపకులు, నిర్వాహకులు.