
షెహనాజ్
शहनाज
హిందీ మూలం – డా. గిరిరాజశర్మ`గుంజన్’
తెలుగు అనువాదం – డా. కూచి వెంకట నరసింహారావు
నేను ఈ ఊరికి పూర్తిగా కొత్తవాడిని. మా అబ్బాయి స్కూలుకి వెళ్ళడం మొదలు పెట్టాడు. మా ఆవిడ ఇంట్లో ఒంటరిగా ఉండి `బోర్’ అవుతోంది. ఏదయినా ప్రైవేటు సంస్థలోనైనా సరే, తనకి ఏదయినా ఉద్యోగం వెతకమని తను నాతో చాలాసార్లు చెప్పింది. ఇంక ఇంతకన్నా ఎక్కువ `బోర్’ అయే ఓపిక తనకి లేదని అంది. మా ఆవిడ ఉద్యోగం చెయ్యడానికి నాకేమీ అభ్యంతరం లేదు కాని, పిల్లవాడు ఎక్కడ ఉంటాడు? వాడి స్కూలు ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకూ ఉంటుంది. స్కూలు సమయం అయిపోయాక సాయంత్రం మేమిద్దరం ఇంటికి వచ్చే వరకూ ఇంతసేపు మూడేళ్ళ చిన్న పిల్లవాడు ఎవరిదగ్గర ఉంటాడు? అదొక్కటే సమస్య.
మా అబ్బాయిని స్కూల్లో దిగబెట్టి మళ్ళీ అక్కడి నుంచి తీసుకురావడానికి, దానితో బాటు మేము ఇంటికి తిరిగి వచ్చేవరకు వాడితో ఉండటానికి ఎవరైనా మహిళ వాళ్ళ దృష్టిలో ఉంటే చెప్పమని నేను మా ఆఫీసులో కొంతమందికి చెప్పాను.
ఒకరోజున మా ఆఫీసులోని ఒక ప్యూన్ తనదృష్టిలో నిరాశ్రయురాలైన ఒక వితంతువు ఉన్నదని చెప్పాడు. పోయిన సంవత్సరమే ఆమె భర్త ఒక యాక్సిడెంటులో మరణించాడని, ఆమెకి ఇంచుమించు మూడేళ్ళ కొడుకు కూడా ఉన్నాడని చెప్పాడు. కొన్ని ఇళ్ళలో తుడిచే పని, గిన్నెలు తోమే పని చేసుకుంటూ అతికష్టం మీద రోజులు వెళ్ళబుచ్చుతోందని, చాలా మంచి మనిషి అని కూడా చెప్పాడు.
“కాని సార్, ఒక సంగతి.” నాకు దగ్గరగా వచ్చి తన గొంతు తగ్గించి చెవుల్లో చెప్పాడు.
“ఏమిటది?” నేను జాగ్రత్త పడుతూ అడిగాను.
“ఆవిడ ముస్లిం. మీకేమీ అభ్యంతరం ఉండదు కదా?” అతను కాస్త సందేహిస్తూ అన్నాడు.
“లేదు-లేదు. అటువంటిదేమీ లేదు” నేను కొంచెం జాగ్రత్తగా అన్నాను. “అయినా, నీకు నేను ఏ సంగతీ గట్టిగా రేపు చెబుతాను.” అలా అని నేను అతన్ని వదిలించు కున్నాను. కాని నా మనస్సు కొంచెం కలత చెందింది. నేను కులాలూ అవీ పట్టించుకునే వాడిని కాను. కాని మా ఆవిడ ఇటువంటి విషయాల్లో కాస్త పాతకాలపు ఆలోచనలతో ఉంటుంది.
సాయంత్రం నేను ఇంటికి చేరుకున్నప్పుడు నా భార్య గుమ్మం దగ్గరే నిలబడి నా కోసం ఎదురు చూస్తోంది. మా అబ్బాయి పక్కవాళ్ళింట్లో వాళ్ళ పిల్లలతో ఆడుకుంటు న్నాడు. కాని నా స్కూటరు చప్పుడు విని “డాడీ వచ్చేశారు – డాడీ వచ్చేశారు” అంటూ పరుగెత్తుకుంటూ ఇంట్లోకి వచ్చాడు.
“ఏమన్నా తెలిసిందా?” నేను ఇంట్లోకి అడుగు పెట్టగానే మా ఆవిడ మొట్టమొదటగా ఇదే అడిగింది.
“కాస్త ఊపిరి పీల్చుకోనీ. అలిసిపోయి వచ్చాను ఆఫీసు నుంచి.”కాస్త వేళాకోళం చేస్తూ అన్నాను,
“నాకేమో ఇక్కడ ఒక్కదాన్నీ ఊపిరాడకుండా ఉంది. మీరేమో ఊపిరి పీల్చుకోవా లంటున్నారు.” కొంచెం విసుగు చూపిస్తూ తను అంది.
కొంచెంసేపు ఈ మాటలూ-ఆ మాటలూ అయిన తరువాత నేను ఆ ముస్లిం వనిత గురించి మా ఆవిడకి చెప్పాను. ఆమెకి ఒక చిన్న పిల్లవాడు కూడా ఉన్నాడని, మన అబ్బాయికి ఒక ఫ్రెండు కూడా దొరుకుతాడని అన్నాను. ఈ విషయంలో కాస్త సంతోషం కలిగించేలా ఉంటుందని ఈ ఆఖరిమాటని కొంచెం నొక్కి చెబుతూ అన్నాను.
మా ఆవిడ ఈ సంతోషం కలిగించే విషయాన్ని పట్టించుకోకుండా, నేను అనుమానిస్తున్నట్టే, ఆ వనిత సముదాయం గురించి విని ఆమె ఉత్సాహం అంతా చల్లారిపోయింది. అందుకే ఇలా అంది- “ఇంకెవరూ దొరకలేదా మీకు? దొరికినా నాకు చెప్పరు. అన్నీ తెలిసికూడా నాకేది నచ్చదో అదే చెబుతారు. నిజానికి నేను ఉద్యోగం చెయ్యడం మీకు ఇష్టం లేదు. మీ మగవాళ్ళు ఇంతే. ఆడది ఫ్రీ గా ఉంటే అసలు చూడలేరు.”
“కులం లేదా మతం ఆధారంగా ఎవరూ మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు కారు. ప్రతి కులంలోనూ, మతంలోనూ మంచివాళ్ళు-చెడ్డవాళ్ళు – అనే ఈ రెండురకాల వారూ ఉంటారు. దేవుడు కేవలం మనిషిని సృష్టించాడు. కులాలు, మతాలు అనేవి మనుషులు తమ సౌకర్యంకోసం ఏర్పరుచుకున్నారు. ఆవిడ పేదరాలు, నిస్సహాయురాలు. ఆమెకి పని ఇస్తే మనకి పుణ్యమే వస్తుంది.” మా ఆవిడకి నచ్చజెబుతూ నేను అన్నాను.
చాలాసేపు ఆలోచించుకున్న తర్వాత చివరకి మా ఆవిడ నేను చెప్పింది ఒప్పుకోక తప్పలేదు. ఒకపక్క ఉద్యోగం చెయ్యాలనే తన తీవ్రమైన అభిలాష, మరోవైపు ఆ వనితనే పనికి పెట్టుకోవాలనే నా పట్టుదల.
ఆ మర్నాడే నేను ప్యూన్ కి సాయంత్రం మాట్లాడుకునేందుకు ఆవిడని మా ఇంటికి పంపించమని చెప్పాను. మాట కుదిరితే ఎల్లుండినుంచే ఆవిడ పనిలోకి రాగలుగు తుంది. మా ఆవిడకి ఉద్యోగం దొరికేవరకు మా పిల్లవాడు కూడా ఆవిడకి అలవాటు పడతాడు.
మా ఆవిడకి ఒక ఇన్సూరెన్సు కంపెనీలో ఉద్యోగం దొరికింది. షెహనాజ్ రోజూ పొద్దున్నే పిల్లాడిని స్కూలులో దిగబెట్టి వస్తోంది. మధ్యాహ్నం రెండు గంటలకి స్కూలుకి వెళ్ళి వాడిని తీసుకువస్తోంది. ఆ తరువాత మేము ఇంటికి చేరుకునేవరకు పిల్లవాడు ఆమె దగ్గరనే వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నాడు. పగలు పిల్లాడికి పెట్టడానికి మా ఆవిడ ఆమెకి కొన్ని బిస్కట్లు, టాఫీలు, ఫ్లాస్క్ లో పాలుపోసి నింపి ఇస్తోంది. సాయంత్రం ఆరు గంటలకి ఆమె పిల్లాడిని మా ఇంటిదగ్గర దిగబెడుతోంది. మా అబ్బాయి కూడా ఆమెతో బాటు సంతోషంగా వెడుతున్నాడు, తిరిగి వస్తున్నాడు. షెహనాజ్ కొడుకు కూడా మా వాడికి సమవయస్కుడే. అందువల్ల వాళ్ళిద్దరిలో మంచి స్నేహం ఏర్పడింది. మావాడు ఇప్పుడు మాటల్లో ఉర్దూ పదాలు కూడా మాట్లాడుతున్నాడు. ఆవిడ మన పిల్లాడిని మతం పాడుచెయ్యదుకదా అని నా భార్య అనుమానం వ్యక్తం చేసింది.
“అదెలా సాధ్యం?” నేను అడిగాను.
“చూడండి. ఉర్దూ పదాలు చెబుతున్నాడు. మాట్లాడే యాస కూడా కొద్ది-కొద్దిగా ఆవిడలాగా ఉంటోంది. కొంపతీసి తన ఎంగిలి ఏదీ పెట్టడంలేదు కదా వీడికి? ఇలాగే నడుస్తూ ఉంటే ఏదో ఒక రోజున ఈ పిల్లాడు మన చేతుల్లోంచి బయటికి వెళ్ళిపోగలడు. చూడండి. మీరు ఎవరైనా మరో పనిమనిషిని చూడండి. డబ్బులు కొంచెం ఎక్కువ అయినా ఫరవాలేదు. ఇప్పుడు నేను కూడా కొంత సంపాదిస్తున్నాను కదా. మనకి వీడొక్కడే పిల్లాడు. ఏమయినా, పరాయివాళ్ళు పరాయివాళ్లే కదా. అందులోనూ ఆ మనిషి…”
“సరే… సరే” నేను మాటని మధ్యలోనే తుంచేశాను. అదంతా నాకు అసలు నచ్చలేదు. అందుకని ఆ మాటని అక్కడే ముగించాలనే ఉద్దేశంతో నేను అన్నాను –“సరే, నేను ఇంకా వాకబు చేస్తాను. వీలయితే తొందరగానే పనికి ఇంకో మనిషిని పెట్టుకుందాం.”
ఇలా అంతా బాగా నడుస్తోంది. ఒక రోజున ఉన్నట్టుండి నగరంలో మతకలహాలు విజృంభించాయి. నలువైపులా ఉద్రిక్తత నెలకొంది. ఎక్కడ చూస్తే అక్కడ మంటలు, పొగ కనిపిస్తున్నాయి. మా ఆవిడ రొప్పుకుంటూ మా ఆఫీసుకి వచ్చి చెప్పింది- “విన్నారా మీరు? ఊరంతా మతకలహాలు, కొట్లాటలు ఒక్కసారిగా పెచ్చుపెరిగాయి. పిల్లాడు ఎల్లావున్నాడో? పదండి. తొందరగా ఇంటికి రండి.”
నాకు ఏం చెయ్యాలో అర్ధం కాలేదు. ఇంటికి వెడితే మాత్రం ఏమవుతుంది.
“ఇంటికి వెళ్ళిమాత్రం ఏం చేస్తాం?”నేను మందగించిన స్వరంలో మా ఆవిడని అడిగాను.
“పిల్లాడిని ఇంటికి తీసుకురారా? ఈ కాలంలో స్వంత మనుషుల మీదనే నమ్మకం లేనప్పుడు పరాయివాళ్ళని ఎలా నమ్మగలం? తొందరగా పదండి…ప్లీజ్.”
నేను ఇంకేమీ మాట్లాడకుండా మా ఆవిడ వెనకాలే నడిచాను. స్కూటరు దగ్గరికి వెళ్ళి నేను స్కూటరు స్టార్ట్ చేశాను. మా ఆవిడకి కూర్చోమని సంజ్ఞ చేస్తూ స్కూటరు ముందుకి నడిపాను. రోడ్డు బాగా నిర్మానుష్యంగా ఉంది. లోలోపలే నాకు భయంగా ఉంది. కాని ఇల్లు ఎక్కువ దూరం కాకపోవడం వల్ల మేము త్వరగానే అక్కడికి చేరుకున్నాము.
మేము ఇంటికి చేరుకునేందుకు ముందే మా ఇరుగు-పొరుగు వాళ్ళు తమ-తమ ఇళ్ళకి చేరుకున్నారు. తమ పిల్లలని వాళ్ళ స్కూళ్ళకి వెళ్ళి ఇంటికి తెచ్చుకున్నారు కూడా. నేను మా ఆవిడని ఇంటి దగ్గర దిగబెట్టి స్కూటరు నడుపుకుంటూ మా అబ్బాయి స్కూలుకి వెళ్ళాను. స్కూలుకి సెలవు ప్రకటించారనీ, పిల్లలంతా వాళ్ళ తల్లిదండ్రు లతోనూ, పనివాళ్ళతోనూ ఇళ్ళకి వెళ్ళిపోయారని తెలిసింది.
టీచర్లు ఇంకా అక్కడే ఉన్నారు. మా అబ్బాయి గురించి వాళ్ళ క్లాసుటీచరు మేడంని అడిగితే, పనిచేసే ఆవిడతో వాడు కూడా ఇంటికి వెళ్ళిపోయినట్లు తెలిసింది.
నేను స్కూటరు తిన్నగా పనిఆవిడ ఇంటివైపుకి తిప్పాను. ఆమె ఇల్లు ముస్లింల పేటలో ఉంది. అక్కడ చాలా మంది గుమికూడి వున్నారు. వాతావరణంలో ఒకవిధమైన ఉద్రిక్తత నెలకొని ఉంది. నేను స్కూటరు కొంచెం దూరంలోనే ఆపుజేశాను. ముందుకి వెళ్ళనా వద్దా అని ఆలోచిస్తూ ఉండగానే ఒక పరిచయస్తుడు వచ్చి చెప్పాడు- “మీరింక ముందుకి వెళ్ళకండి. ప్రాణానికి ముప్పు కలుగుతుంది.”
“కాని మా అబ్బాయి…!” నా నోట్లోంచి ఈ మాట వచ్చిందో లేదో పది-పన్నెండుమంది నావంక చూసి గుసగుసలాడుకుంటూ కనిపించారు. వాళ్ళు మెల్లమెల్లగా నావైపుకి రాసాగారు. నాతో మాట్లాడుతున్న వ్యక్తి వాళ్ళ సంకేతాన్ని అర్ధం చేసుకున్నాడు. వెంటనే నాతో అన్నాడు- “మీరు ఇప్పుడేమీ ఆలోచించకండి. ఇక్కడి నుంచి వెంటనే పారిపొండి.” నేను ఇంకేమీ ఆలోచించకుండా స్కూటరును వెనక్కి తిప్పి ముందుకు సాగాను. పది నిమిషాల్లో ఇంటికి చేరుకున్నాను.
ఇంటికి బయటనే మా ఆవిడ దిగులుపడుతూ నిలబడివుంది. నాతో మా అబ్బాయి లేకపోవడం చూసి బాధ భరించలేక కెవ్వుమని అరిచి ఒక్కసారిగా నేలమీద పడిపోయిం ది. తరువాత గట్టిగా కేకలు పెడుతూ, విలపించసాగింది. ఆమె రోదన విని ఇరుగుపొరుగు వారంతా అక్కడికి చేరుకున్నారు. వారివారి పద్ధతిలో అందరూ మా ఆవిడకి ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇంక నేను కూడా తట్టుకోలేని బాధతో కంగారుపడుతున్నాను. కాని నేను మాత్రం చెయ్యగలిగేదేముంది?
నగరంలో కర్ఫ్యూ విధించినట్లు ప్రకటన వినిపిస్తోంది. మరోపక్క నా భార్య స్పృహ తప్పి నేలమీద పడివుంది. ఇరుగు-పొరుగువారు కూడా నెమ్మదిగా తమతమ ఇళ్ళకి వెళ్ళిపోయారు. ఆ చీకటిరాత్రి ఇలాగే గడిచిపోయింది. నా భార్య అలాగే పడివుంది. నేను ఒక పిచ్చివాడిలాగా ఇంట్లోనే అటూఇటూ తిరుగుతూ ఉన్నాను.
తెల్లవారుతూ ఉండగానే ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకూ అంటే రెండుగంటల పాటు కర్ఫ్యూలో విరామం ఇస్తున్నట్లు ప్రకటన వినిపించింది. ఏమయినా సరే, ఈ సమయంలోనే షెహనాజ్ ఇంటికి వెళ్ళి మా అబ్బాయి గురించి తెలుసుకోవాలని నేను మనస్సులోనే నిర్ణయించుకున్నాను. నేను నెమ్మదిగా కిటికీ తలుపు ఒకటి తెరిచి చూశాను. బయట బాగా చీకటిగా ఉంది. మళ్ళీ నేను గదిలో తిరుగుతూనే, బయట కాస్త వెలుతురు వచ్చాక బయలుదేరి వెడదామని అనుకున్నాను.
ఇంతలోనే నాకు మా యింటి తలుపు మీద ఎవరో చాలా నెమ్మదిగా కొడుతున్నట్లు అనిపించింది. నేను కిటికీ తలుపు తెరిచి బయటికి తొంగి చూస్తే ఎవరో బుర్కా ధరించిన మహిళ కనుపించింది. ఉన్నట్టుండి నాకేదో చెప్పలేని అనుమానం కలిగి మనస్సు తల్లడిల్లింది. తలుపు తెరవకూడదని అనిపించింది. ఇంతలోనే నా భార్య కూడా “ఎవరూ-ఎవరూ” అంటూ లేచి కూర్చుంది. నేను చెయ్యి చాపి తనని కూర్చోమని సంజ్ఞ చేశాను. ముందుకి వచ్చి నెమ్మదిగా తలుపు తెరిచాను. తలుపు తెరుస్తూనే ఆ మహిళ వేగంగా అడుగులు వేస్తూ తిరిగి వెళ్ళిపోతూ కనిపించింది. తలుపు దగ్గరగానే ఒక పిల్లవాడు భయపడుతున్నట్లుగా ఏమీ మాట్లాడకుండా నిలబడి ఉన్నాడు. నేనా పిల్ల వాడిని తొందరగా లోపలికి తీసుకున్నాను. చిరిగిపోయిన పాత బట్టల్లో ఉన్న ఆ కుర్రాడు ఏమీ మాట్లాడలేకపోతున్నాడు. మా ఆవిడ “నాన్నా-నాన్నా” అంటూ వాడిని కౌగలించు కుని పిచ్చిదానిలాగా వాడిని మాటిమాటికీ ముద్దులు పెట్టుకుంటోంది. కాని నా మనస్సు ఏదో తుఫాను వచ్చేముందు పరిస్థితిలాగా శంకించి తల్లడిల్లుతోంది. ఎన్నో ప్రశ్నలు మనస్సుని మథిస్తున్నాయి. మచ్చుకి- పిల్లవాడు స్కూలు యూనిఫారంలో ఉండాలి కదా అని. ఈ పిల్లవాడు ఏమీ ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు? పిల్లాడిని బుజ్జగిస్తూ నేను నా గుండెలకి హత్తుకుని అడిగాను- “బాబూ, నీకేమయిందిరా, ఎందుకు మాట్లాడలేక పోతున్నావు. నిన్ను ఇక్కడ దిగబెట్టడానికి వచ్చిన ఆవిడ ఎవరు?” ఈసారి కుర్రవాడు ఏదో చెప్పడానికి ప్రయత్నించాడు. వాడి పెదవులు కొంచెం కదిలాయి. కాని నోట్లోంచి మాట వెలువడలేదు.
నేను నా మనస్సులోనే ఒక నిర్ణయం తీసుకుని బయటికి వచ్చాను. ఆ వనిత వెళ్ళిన దిక్కువైపుగా పరుగెత్తాను. అప్పటికే ఆలస్యమైపోయింది. బుర్కా ధరించిన ఆ మహిళ ఎంత దూరానికీ కనుపించలేదు. అందుకని నేను షెహనాజ్ ఇంటికే వెళ్ళి అసలు విషయమేమిటో తెలుసుకుందామని అనుకున్నాను.
నేను కాలి నడకనే షెహనాజ్ ఇంటివైపు ముందుకి సాగాను. దారి నిర్మానుష్యంగా ఉంది. ఒకరూ-ఇద్దరూ జనం చాలా భయపడుతున్నట్లుగా, ఒకరినొకరు అనుమానంగా చూస్తూ వెడుతున్నారు. ఆ పేటకి చేరుకుని నేను షెహనాజ్ ఇంటివైపు చూశాను. చూడగానే నాకు ఆశ్చర్యంతో కూడిన భయం కలిగింది. యూనిఫారంలో ఇద్దరు-ముగ్గురు పోలీసులు అక్కడ నిలబడివున్నారు. నేను నా నడకవేగాన్ని పెంచాను. “ఏమయింది, ఏమయింది” అంటూ నేను వేగంగా ఇంట్లోకి ప్రవేశించాను. అక్కడ నిలబడ్డ జనం నన్ను చూసి కొంచెం వెనక్కి జరిగారు. పేటలోని ఇంకా నలుగురైదుగురు వ్యక్తులు కూడా అక్కడ ఉన్నారు. వారిలో ఒక వ్యక్తి నన్ను గుర్తు పట్టాడు. అతను అంతకుముందురోజు నా దగ్గరికి వచ్చి నన్ను అక్కడి నుంచి వెంటనే పారిపొమ్మని సలహా ఇచ్చినవాడే. గదిలో ఒక మూల బట్టతో కప్పివున్న ఒక చిన్న పిల్లవాడి నిర్జీవ శరీరం పడివుంది. పైన కప్పిన గుడ్డ కూడా రక్తసిక్తమై వుంది. శంకిస్తున్న మనస్సుతో నేను ఆ బట్ట తొలగించి చూశాను. క్షత-విక్షతమైన ముఖంతో పాటు ఒంటిమీద స్కూలు యూనిఫారం చూసి నేను హతప్రభుడినై పోయాను. నేను పిల్లవాడి శవం మీద పడి గట్టిగా అరిచాను- “అయ్యో…నా బిడ్డ… నా కొడుకు…” అటూఇటూ నిలబడివున్న మనుషులు నన్ను పట్టుకుని లేవదీశారు. వారిలో ఒకడు సానుభూతితో నిండిన స్వరంతో అన్నాడు- “వీడు మీ అబ్బాయి కాడు. షెహనాజ్ కొడుకు.” నాకు ఒక్కసారిగా నమ్మకం కలగలేదు. జేబులోంచి కర్చీఫ్ తీసుకుని కన్నీళ్ళు తుడుచుకున్నాను. గదిలో ఇటూ-అటూ పరికించి నేను షెహనాజ్ ని వెతకసాగాను. కాని ఆమె నాకు ఎక్కడా కనిపించలేదు. షెహనాజ్ నా కొడుకుని రక్షించడానికి తన కొడుకుని పణంగా పెట్టిందా అని నేను ఆలోచిస్తున్నాను. ఇంతలోనే ఒక కానిస్టేబిల్ నావంక చూస్తూ అన్నాడు- “మీరు మాతో స్టేషన్ కి రావాలి.”
నేను మౌనంగా పోలీసుల వెంట నడిచాను.
***
డా. గిరిరాజశర్మ `గుంజన్’– పరిచయం
4 ఏప్రిల్ 1948 న ఉదయపుర్, రాజస్థాన్ లో జన్మించిన డా. గిరిరాజశర్మ `గుంజన్’ సాహిత్యరంగంలో నిష్ణాతులు. `హిందీ నాటకాలు : మారుతున్న విలువలు’, `1960 తరువాత హిందీ నాటకసాహిత్యం’ వీరి ప్రసిద్ధ సమీక్షాగ్రంథాలు. `బరసోం అంధకార్ కే బాద్’ (సంవత్సరాల అంధకారం తరువాత) వీరి ప్రఖ్యాత కవితాసంకలనం. ఇవికాక, అనేక పత్రికలలో వ్యాసాలు, కవితలు, కథలు ప్రచురితమయ్యాయి. ఆకాశవాణి ఉదయపుర్ కేంద్రం నుంచి కవితలు, గువాహాటీ కేంద్రం నుంచి వివిధ విషయాల పై ప్రసంగాలు, పుణే కేంద్రం నుంచి `ప్రేమచంద్ సాహిత్యం యొక్క సమయౌచిత్యం’ విషయంపై సమూహచర్చ ప్రసారితం. జూలై 1970 నుంచి మే 1978 వరకు ప్రముఖ విద్యాసంస్థలో లెక్చరర్ గా చేసిన తదుపరి జూన్ 1978 నుండి ఏప్రిల్ 2008 వరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసరుగా ఇండోర్, ముంబయి, గువాహాటీ కేంద్రాలలో సేవలందించి, సీనియర్ మానేజిమెంటుతో సంబద్ధులై 2008 లో రిటైర్ అయ్యారు. ప్రస్తుతం స్వతంత్ర రచనావ్యాసంగంలో సక్రియంగా ఉన్నారు. డా. శర్మ ఉదయపుర్, రాజస్థాన్ వాస్తవ్యులు.
*****

బహుభాషావిదులైన డా. రావు (1948) గారి చాలా స్వీయ, అనువాదిత కథలు, వ్యాసాలు, కవితలు తెలుగు, హిందీలలో ప్రచురితమయ్యాయి. తెలుగు, హిందీ, ఇంగ్లీషుల మధ్య అనువాదంలో సుదీర్ఘ అనుభవంతో ఒక నవల, 200కి పైగా కథలు, కవితలు అనువదించారు. త్రిభాషా నిఘంటువులో సహసంపాదకత్వం చేశారు. వేరువేరు సమయాల్లో రిజర్వ్ బ్యాంక్ కి చెందిన కొన్ని పత్రికలకు సంపాదకునిగా ఉన్నారు. మధ్యప్రదేశ్ గవర్నర్ ద్వారా పండిత్ శివసేవక్ తివారీ స్మృతి పతకంతోనూ, అరసం గుంటూరు జిల్లా యూనిట్ ద్వారా శారదాంకిత స్వర్ణపతకంతోనూ సన్మానితులు. రష్యన్ కవితల అనువాదానికి ముంబయిలోని రష్యన్ ఎంబసీ ద్వారా ప్రశంసించ బడ్డారు. తెలుగు కవితలకు వేరువేరు సంస్థల ద్వారా సన్మానం పొందారు. రిజర్వ్ బ్యాంక్ లో జనరల్ మేనేజరు స్థాయిలో రిటైర్ అయ్యాక ముంబయిలో ఉంటున్నారు.