సస్య-8

– రావుల కిరణ్మయి

చాలెంజ్

(జరిగిన కథ : సస్య తల్లి తీసుకున్న డబ్బులకు న్యాయం చేయమని చెప్పడంతో శ్రావణ్ వాళ్ళ ఇంటికి మళ్ళీ వెళ్ళింది. అప్పుడు అక్కడ…..)

***

పరోపకారాయ ఫలన్తి వృక్షాః పరోపకారాయ వహన్తి సద్యః

పరోపకారాయ దుహన్తి గావః పరోపకారార్థ మిదం శరీరం

పరోపకారము కొరకే వృక్షములు ఫలముల నిచ్చుచున్నవి. పరోపకారము కొరకు నదులు ప్రవహించు చున్నవి. పరోపకారము కొరకే గోవులు పాలనిచ్చుచున్నవి. కాబట్టి వాటిచే వృద్ధిపొందిన ఈ శరీరము కూడా వాటివలెనే పరోపకారము కొరకు ఉపయోగపడవలెను. అని తరగతిలో పాఠంలో భాగంగా పరోపకారానికి సంబంధించిన శ్లోకం రాగ, భావయుక్తం గా పాడి వినిపించిన సస్యను అభినందిస్తున్నట్టుగా గది బయట నుండి చప్పట్లు వినిపిం చడంతో ఎవరని చూసింది.

ఎదురుగా భార్గవ్ సర్.

          ఈ భావం ఇంత బాగా తెలిసిన వారు కావడం చేతనే మీరు మీ శరీరాన్ని  అని ఆగి … అదే… అదే… మీ సమయాన్ని వేరే వారి కొరకు వెచ్చిస్తున్నారా ? అని వెకిలిగా నవ్వి వెళ్ళిపోతుండగా,

          ఆగండి.. అంది. గట్టిగా.

          వెనుతిరిగిన అతనితో, మీరేం మాట్లాడారు ? దీనిపై నేను HM గారికి కంప్లెంట్  ఇస్తాను. అంది. ఏమని? నేను అభినందించినందుకు పనిష్మెంట్ ఇప్పిస్తారా ?

          అభినందనా ? అవును. కాదా? మీరు ‘మరోలా” అనుకున్నారా? అని మళ్ళీ.. వెకిలినవ్వు.

          ఏమిటి ఈయన? నోటితో పొగుడుతూ నొసటితో వెక్కిరిస్తున్నాడు. అది తనకు స్పష్టంగా తెలుస్తున్నది. కానీ,ఎలా నిరూపించడం అని లోలోపల అనుకుంటూనే క్లాస్ లోకి నడిచింది. గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టుగా తానెందుకు తొందరపడింది. తను ఊహిస్తున్నట్టుగా అతను నిన్న శ్రావణ్ ను తనను చూసి ఉంటాడా ? లేక మామూలుగానే అడిగాడా? లేదు.. లేదు.. అతను చూశాడు కాబట్టే అంత వెటకారం గా మాట్లాడాడు. దీనిని ఏమని కంప్లెంట్ ఇవ్వగలదు. కంప్లైంట్ పేరుతో తనే తన గురించి చెప్పుకుంటే, వీళ్ళు అర్ధం చేసుకోరు సరికదా ! వాళ్ళూ అతనికి వంత పాడుతా రేమో ! ఏమైనా తను భార్గవ్ని పట్టించుకోక పోవడమే మంచిది. దారెంట పోతుంటే మొరిగే కుక్కలా అతనిని వదిలివేస్తే సరి. అనుకుంది. కానీ, ఇదే అదనుగా అతను దాడి చేస్తుంటే మాత్రం సహించకూడదని నిర్ణయించుకుంది.

          పాఠశాలలో బాగు చేయవలసింది ముందుగా ఉపాధ్యాయులనేనని సాటి స్త్రీ పట్ల వారి ప్రవర్తన ఎలా ఉండాలో చెప్పాలను కుంది. ‘తా దూర సందు లేదు మెడకి డోలన్నట్టు” తనకే విలువ, రక్షణ లేకుండా ఉండగా, విద్యార్థులకు తానేం చెప్పగలుగు తుంది? ఎలా మార్పు తీసుకురాగలుగుతుంది? ఆలోచనలతో మెదడు పని చేయడం మానేసి తలనొప్పి మొదలయింది. ఇంటికి వెళ్ళగానే హాయిగా స్నానం చేసి పడుకో వాలనుకుంది. అంతలోనే శ్రావణ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలని గుర్తుకు వచ్చి నీరసం కమ్మేసింది.

***

          బడి అయిపోగానే శ్రావణ్ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. శ్రావణ్ వాళ్ళ అమ్మగారి చీరలన్నీ శుభ్రంగా పిండి ఆరేస్తున్నాడు.

          హాల్లో  సస్య గారూ ! వెల్కమ్! అన్నాడు నవ్వుతూ.

          మీరు బట్టలు పిండడం ఏమిటండీ ? పనిమనిషి ఉన్నట్టుందిగదా? అడిగింది.  లేదే.! అటువంటి వారెవరూ లేరే. ఉన్నా.. నేను మా అమ్మ పనులు మాత్రం నేను చేస్తేనే నాకు అదో  తృప్తి.

          అమ్మగారు లేరా ?

          ఉన్నారు.. పదండి అని ఇంట్లోకి వెళ్ళిన తరువాత టీ..పెట్టడం, పూలు మాల కట్టడం, కూరగాయలు తరగడం ఇలా ప్రతీ పని చక చకా చేసుకుపోతున్న శ్రావణ్ ను ఆశ్చర్యంగా చూడసాగింది.

          శ్రావణ్ గమనించి, సస్య గారూ! మీరు ఎందుకో, దేనికో ఆడగడానికి చెప్పడానికో సంశయిస్తున్నట్టున్నారు. ఏమిటి విషయం? అడిగాడు.  విషయం ఎలా అడగాలా ? అనేది సంశయం.

          పోనీ వదిలెయ్యండి.

          లేదు. ఖచ్చితంగా తెలుసుకోవలసింది.

          ఏది ఏమైనా ఇప్పుడు మాత్రం మీరు మీ ఇంటికి వెళ్ళ వలసిన సమయం ఆసన్న మైంది. ఇక బయలు దేరండి. అన్నాడు.

          ఒక్క నిమిషం . -ఆగండి . మీకు బొమ్మ చేపలు చాలా చాలా ఇష్టమని తెలిసి మీ కోసం నేను ఉదయం వండిన ఫ్రై ఉంచాను. పట్టుకెళ్ళండి అని పెద్ద టిఫిన్ బాక్స్ అందించాడు.

          ఇదే నేను అడగాలనుకున్నది. నా ఇష్టాఇష్టాలు మీకు ఎలా తెలుసును ? అని ఇంకా…

          మళ్ళీ మొదలు పెట్టకండి. మీరు ఈ ఆదివారం వీలైతే, మీకు నా మీద నమ్మకం ఉంటే ఒక దగ్గరికి నాతో పాటు రండి. ఇప్పుడు  నేను అమ్మ పనులు చూసుకోవాలి.  అంటూ రోడ్డు వరకు వచ్చి ఆటో ఎక్కించి వెళ్ళిపోయాడు.

          సస్య ఆదివారం ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తూ రోజుఎప్పటిలానే వెళ్ళి వస్తున్నది.

          మునుపు  ఆ  ఇంటికి వెళ్లాలంటే భయపడే తను ఇప్పుడు కాసేపు ఉందామను కుంటున్నా శ్రావణ్  ఉండనీయడం లేదు. అనుకున్న -అదివారం రానే వచ్చింది.

***

          ఉదయం చాలా ఉత్సాహంగా విదుషి తనకోసం కొనిపెట్టిన చీర కట్టి రోజటి కంటె ఎక్కువగా తయారవడం చూసి సస్య వాళ్ళ అమ్మ,..

          ఏమిటమ్మా ? ఈ రోజు ప్రత్యేకంగా ముస్తాబవుతున్నావు.

          ఎటు వెళ్తున్నావు అని అనుమానంగా అడిగింది.

          నేను ట్యూషన్ చెప్పే పిల్లల బర్త్ డే పార్టీ అమ్మా! కలిగిన వారు కదా, కొంచెం మనకున్నంతలో మనం  కూడా వెళ్తే బాగుంటుందని అన్నది.

          ఓహో ! అలాగా, సరే కానీ, చీకటి పడేంతవరకు ఉండకమ్మా అని హెచ్చరించింది.

          సరే ! అమ్మా! అని  శ్రావణ్ వాళ్ళ ఇల్లు  చేరింది.

          వచ్చే దారంతా ఒకటే కలవరం. తను అమ్మకు అంత సులభంగా అబద్ధం చెప్పడం. అంత అవసరముందా? శ్రావణ్ ను పరిచయం చేసిన విదుషి జాడ తెలియ డం లేదు. అయినా తాను అది పట్టించుకోవడమే మానేసి శ్రావణ్ వైపు మొగ్గు చూపడం ఏమిటి ? ఈ రోజే చివరి రోజు కావాలి. ఇక ఎప్పుడూ ఇలా రాకూడదు అనుకొంది.

          శ్రావణ్  వాళ్ళ అమ్మగారు ముగ్గురూ కలిసి గంట ప్రయాణం తరువాత సేవాశ్రమం లాంటి ఒక చోటుకు చేరుకున్నారు. ఆ పరిసరాలు చూసి సస్య ముగ్ధురాలయింది.

          సవ్య గారూ! మీరిక్కడే ఉండండి. నేను, అమ్మా లోపలికి వెళ్ళి వస్తాం అని చెప్పి వెళ్ళారు.

          ఆలా పది నిమిషాల్లో శ్రావణ్ ఒక్కడే వచ్చాడు.

          సస్య అడుగుతున్నంతలో మాట్లాడవద్దని సైగ చేసి ఇంకా లోపలకి నడిపించుకు పోయాడు.

          రకరకాల చెట్లు, పక్షులు, చిన్న చిన్న జంతువుల సవ్వడులతో ఆ ప్రాంతం ఆహ్లాదకరంగా అనిపిస్తుండగా శ్రావణ్ ఒక దగ్గర వేసి ఉన్న సిమెంటు బెంచ్ పై కూర్చుని తననూ కూర్చోమన్నాడు. సస్య కూర్చుంటూనే,

          శ్రావణ్ గారు !ఈ రోజు మీరు నాకు సంగీత పాఠం మొదలు పెట్టాల్సిందే అన్నది.

          శ్రావణ్ పగలబడి నవ్వుతూ… సంగీతమా ? నాకా? |సంగీతం రాదు, సరిగమలూ రావు. అన్నాడు.

          అంతే, సస్య .. ఎంత మోసం ! అని నిశ్చేష్టురాలైంది.

          అది చూసి శ్రావణ్. మీకు అన్ని విషయాలు వివరంగా తెలియ జెప్పడానికే  ఇక్కడకు రమ్మన్నాను.

          విదుషి, నేను చిన్నప్పుడు కలిసి చదువుకున్నాం. ఆ తరువాత మొన్నీ మధ్యే మా మధ్య ఆసక్తికరమైన చర్చ ఒకటి వచ్చింది. అదేమిటంటే మనో నిగ్రహం. ఆ విషయంలో విదుషికి నాకు ఒక పందెం పడింది. పరిస్థితులు ఎంత అనుకూలించినా, నేను నా వ్యక్తిత్వాన్ని కోల్పోకుండా ఒక రాత్రంతా ఒక అందమైన అమ్మాయితో గడపాలి. నేనూ చాలెంజ్ చేశాను. గెలిచి తీరుతాను అని. అయితే  నాతో గడిపే అమ్మాయి సంగతేమిటని ? నేనూ అడిగాను.

          అమ్మాయిలకు అబ్బాయిల కంటె ఆత్మ నిగ్రహం రెండు పాళ్ళు’ఎక్కువేనని  మీరేమీ భయపడనవసరం  లేదని నేను పంపించే అమ్మాయి ఆ విషయంలో ఓడిపోయే ప్రసక్తే లేదని నాతో చాలెంజ్ చేసింది.. అలా మా ఇద్దరి మధ్య చాలెంజ్ పర్యవసానమే ఆ రాత్రి వారి తోటలో మన కలయిక. అంటే మీ సరదా కోసం నన్ను బలిపశువును చేశారా ? పేదవాళ్ళంటే మీకు అంత చులకనా? అని అరిచింది. ఇదే మీ వాళ్ళమయితే ఇలాగే పంపేవాళ్ళ? స్నేహం అనే ముసుగు వేసి జీవితాన్ని నాశనం చేయబోయారు. అంది ఆవేశంగా,

          ఇంకా, అత్యాచారం జరిగిన అమ్మాయిల మనస్సు ఎంత వేదన పడుతుందో మగవారు మీకెలా తెలుస్తుంది? ఆడదైనా.. విదుషికే తెలియనప్పుడు, ఎప్పుడూ అమ్మ… అమ్మ… అని కబుర్లు చెప్పే మీకు ఆ రోజు మీ అమ్మ గుర్తుకు రాలేదా? అయినా అమ్మాయి తో అనగానే అమ్మను బొమ్మలా వదిలేసి ఎగురుతూ వచ్చేశారా ? నా ప్రాణ స్నేహితురాలు అందుకే ముఖం చాటేసిందా? ఇలా నోటికి వచ్చినట్టు ఆవేదన, ఆక్రోశం కలగలసిన  మాటలన్నీ తూటాల్లా పేల్చేసింది.

          అలా కొంచెం శాంతించాక. శ్రావణ్

          మీరు నమ్మినా నమ్మకపోయినా మీకు చెప్పాల్సిన నిజాలు వినండి. నేను, విదుషి యూట్యూట్ లో ఒక మహాత్ముడు తనను తను ఏ విధంగా బ్రహ్మ చర్య దీక్షను దీక్షగా కొనసాగించాడో విన్నప్పుడు, చూసినప్పుడు మాకూ అంతటి నిగ్రహం ఉంటుందా ? అనే విపరీత బుద్ధి పుట్టింది. అలా పందెం వరకూ వచ్చింది.

          అప్పుడు నేనే విదుషిని నీ ఆత్మీయులతో మాత్రమే గడుపుతానని షరతు పెట్టాను. అందుకు కారణం విదుషి పందెం తప్పుకొని ఓడిపోతుందనుకున్నాను. ఎవరూ అటువంటి పరిస్థితులకు తమ వారిని ఒప్పుకోరని నా ప్రగాఢ విశ్వాసం. కానీ, ఆశ్చర్యంగా తాను అంగీకరించింది.

          ఇక అమ్మా… అమ్మా…. అని ఎప్పుడూ అమ్మన్ను గురించే మాట్లాడే  నేను ఆ రోజు కూడా విడిచిపెట్టలేదు. ఆ రాత్రి జరగరానిది ఏదీ జరుగకూడదనే అమ్మా, విదుషి అక్కడే ఉన్నారు. అమ్మకు మాత్రం ఇదేమీ తెలియదు. అత్యాచారం జరిగిన అమ్మాయి ఆవేదన ఎలా ఉంటుందో మగవాడి నైనా నాకు బాగా తెలుసు.

          ఒకప్పుడు అలాంటి బాధితురాలు మా అమ్మే. నేను పుట్టిన తరువాత నాన్నకు ఆరోగ్యం బాగా లేనప్పుడు సహాయంగా ఉండడానికి వచ్చిన ఒక పెద్దమనిషి మద్యం మత్తులో అమ్మ పై చేసిన అఘాయిత్యం, కళ్ళెదుటే దారుణం జరుగుతున్నా ఆపలేని, చూడలేని నాన్న దీనత్వం నా పగవారికి కూడా రాకూడదు. దాని ఫలితంగా అమ్మ మళ్ళీ తల్లి కాబోతున్న దన్న వార్త. ఏ  మగవాడూ ఒప్పుకోని పరిస్థితి. అమ్మ కూడా ఇష్టపడని సందర్భం. . కానీ నాన్న  ఇచ్చిన మనోధైర్యం, కడుపులోని పిండాన్ని నిర్ధాక్షణ్యంగా చిదిమేయడం ఎంత పాపమో మనుషుల దురాగతానికి ఒక ప్రాణిని చంపే హక్కు మనకెవరికీ లేదని, జన్మించిన తరువాత ఎక్కడైనా దూరంగా ఉంచి పెంచుదామన్న ఆలోచన అమ్మను మారు మాట్లాడనీయక మానసకు జన్మనిచ్చేలా చేసింది. కథ ఇక్కడితో ఆగినా బాగుండేది. అమ్మ పట్ల క్రూర ప్రవర్తనకు ఆ దేవుడే విధించిన శిక్షలా ఆ మనిషికి జరిగిన రోడ్డు ఆక్సిడెంట్. మరణానికి దగ్గరవుతున్న కొద్దీ అతనిలో వచ్చిన ప్రాయశ్చిత్తం,

          చేసిన తప్పుకు పరిహారంగా క్షమాభిక్ష పెట్టుమని, తన ఆస్తిని భార్య ను చూసుకొమ్మ నంటూ వచ్చిన ఉత్తరం, ఆస్తిపత్రాలు. మానసను వారికి అప్పగించేయాలనుకున్నా వారు ఒప్పుకోలేదు.

          తమ చూపు తనపై పడకూడదని దుర్మార్గుని సంతానంగా తెలియకూడదని వేడుకోవడం  అతను చనిపోవడం .

          ఆయన భార్య ఎంతో మనోధైర్యంతో క్యాన్సర్ ను జయించినా గుండె పోటుకు బలైపోయింది. ఆమె తరువాత వారసురాలిగా అమ్మను చేర్చటంతో అమ్మ ఆమె ఉండగానే అన్ని విధాలా ఆసరా అవసరమున్న వారికోసమని ఈ సేవాసదన్ స్థాపించింది. దీని బాధ్యత అంతా అమ్మదే. మానసకు ఇవేవీ తెలియవు. ఆమెకు గతం చెప్పడం అనవసరమని చెప్పలేదు. ఆమె ఎప్పటికీ కడిగిన ముత్యంలా ఉండాలన్నదే మా కాంక్ష . ఇలా అతను చెప్పుకుపోతూనే ఉన్నా సస్య ఒక విషయం దగ్గరే ఆగిపోయింది. అత్యాచార బాధితురాలైన బిడ్డను అంగీకరించిన ఆ శ్రావణ్ నాన్న గొప్పతనం దగ్గర.

          తన తండ్రి విదుషి వాళ్ళింట్లో మానకుండా పనిచేయడమే పెద్ద అనుమానం చేసుకొని అల్పుల మాటలకు జడిసి సడీసప్పుడు కాకుండా వెళ్ళిపోయిన తండ్రి కళ్ళుండీ మంచితనం చూడలేక పోయాడు.

          శ్రావణ్ తండ్రి మంచితనం మనసు నేత్రంతో చూసి మరీ ప్రాణానికి ఆయువు  పోశాడు. ఎంత వ్యత్యాసం ఇద్దరి మధ్యా ? ఆనుకోకుండా ఉండలేక పోయింది.

*****

(సశేషం)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.