స్వీయ సంరక్షణా బాధ్యత

మూలం: జసింటా కేర్కెట్టా (ఆదివాసీ కవి)

ఆంగ్లానువాదం: భూమికాచావ్లా డిసౌజా

తెలుగు సేత: వారాల ఆనంద్

వాళ్ళు వాళ్ళ భగవంతుణ్ణి తీసుకొచ్చారు
మీ పాపాల్నుంచీ మిమ్మల్ని విముక్తుల్ని చేస్తామన్నారు
‘మేమేం పాపాలు చేశామని’ అడిగాం
వాళ్ళు దిక్భ్రమ చెందారు
పాపాల్ని మోక్షాల్నీ పేర్కొనకుండా
వారి భగవంతుని ఉనికిని ఎట్లా స్థాపిస్తారు

‘మీరేంత పేదవాళ్ళుగా, వెనకబాటుగా వున్నారో చూడండి’
అన్నారు వాళ్ళు
ఇదంతా మీ మీ పాపాల ఫలితమే అన్నారు

మా విశాలమయిన మా పొలాల్ని అడవుల్నీ
నదులనీ సెలయేళ్లనీ
ధాన్యాగారాల్లో నిండిన ధాన్యాన్నీ వాళ్ళకు చూపించాం

‘మీ మరణానంతరం మరో గొప్పలోకం మీకోసం
ఎదురుచూస్తోంది’ అన్నారు
దీని తర్వాత మరో లోకమేదీ లేదు
మా పూర్వీకులు మేమూ మా రానున్న సంతతీ
ఇక్కడే వుంటాం

వాళ్ళు భయాందోళనలకు గురయ్యారు
వారికి ఏం చేయాలో తోచలేదు

ఈ జనం పాపాల్ని చూడలేదు స్వర్గమో నరకామో
మరో లోకం మీద విశ్వాసం లేదు

అప్పుడు వాళ్ళు మీ భగవంతుణ్ణి చూపించండని
మమ్మల్ని అడిగారు

మేం మా పర్వతాల్ని వృక్షాలనీ చూపించాం
మీ స్వంతమయిన వాటిని చూపించమని
అడగ్గానే వాళ్ళు మళ్ళీ భయభ్రాంతులయ్యారు
భగవంతుణ్ణి ఎట్లా చూపించాలో తెలీక ఆశ్చర్యపోతున్నారు

ఒక రోజు అప్పులిచ్చేవాణ్ణి తీసుకొచ్చి
కుదువబెట్టిన మా భూముల్ని తిరిగి ఇప్పించారు
ఇదో ఇదీ మా దేవుడి శక్తి అన్నారు

స్వర్గం ముందు తల వంచుకుని ఎంతోకాలం వుండిపోయాం
శతాబ్దాలపాటు మా భావితరాలూ తలవంచుకునే వున్నారు

కానీ భగవంతునితో పాటు వాళ్ళు
రహస్యంగా ఆయుధాలూ తెచ్చారని
సారవంతమయిన భూమి, అడవులూ, నూనెలూ
వున్న ప్రపంచం నలుమూలలా వాటితో యుధ్హాలు చేస్తున్నారని
ఆ ఆనందంలో పడి తెలుసుకోలేక పోయాం

కానీ ఈ విషమ స్థితికి వ్యతిరేకంగా
ఎట్లా పోరాడగలం?

మా స్వీయ సంరక్షణ బాధ్యతని వారి
భగవంతునికి మేమే ఇచ్చేసినం
నేరం మాదే అనుకుంటాను

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.