నాన్నా!! ప్లీజ్…

– సువర్ణ మారెళ్ళ

  ” హాలు అంతా చాలా నిశ్శబ్దంగా ఉంది . తుఫాన్ తర్వాత ప్రశాంతత లాగా…

  కుముద హాలులో ఒక మూల దోషిలా, మౌనంగా తన తప్పు ఏమిటో తెలియని అయోమయ స్థితిలో నిలుచుంది. వాళ్ళు చెప్పాల్సిన విషయం చెప్పేసి ఆమె సమాధానం కోసం ఎదురు చూస్తూ  సోఫాలో కూర్చుని కుముదనే చూస్తున్నారు అమ్మ, నాన్న, అత్త, మావయ్య.

   ఆ మౌనాన్ని చేదిస్తున్నట్టుగా ఆమె మావయ్య 

     “చెప్పు కుముదా!! ఏమి మాట్లాడకపోతే మేము ఎలా అర్థం చేసుకోవాలి. నువ్వేమి చిన్న పిల్లవు కాదు. పి.జీ పూర్తయింది. ఉద్యోగం కూడా చేస్తూ ఆరునెలలు అవుతోంది. పాతికేళ్ళు దాటాయి. చక్కటి సంబంధం, నువ్వు వాళ్లకు నచ్చి వాళ్ళంతట వాళ్ళు వెతుక్కుంటూ వచ్చిన సంబంధం. పోని పిల్లాడు అందంగా లేడా అని అనుకుందాం అన్నా, అతను చాలా అందగాడు, చక్కటి ఉద్యోగం, హోదా, నీకు ఎందులోని తీసిపోడు.” అని ఒక రెండు క్షణాలు ఆగి మళ్ళీ ఇలా అన్నాడు.

 ” సరే ఈ సంబంధం నీకు ఎందుకో నచ్చలేదనుకుందాము. నీకు ఎలాంటి సంబంధం కావాలో చెప్పు అలాంటిదే తీసుకు రావడానికి  ప్రయత్నిస్తాము. అదికూడా కాదు!! నీ మనసులో ఇంకెవరైనా ఉన్నారా? ఉంటే చెప్పు ,మేము  పరిశీలిస్తాము. అంతే గాని ఇలా ‘నిమ్మకు నీరెత్తినట్టు’ నించుంటే ఏమిటి అర్ధం?”

 అసహనాన్ని వ్యక్త పరుస్తూ…

       ఆమాటలన్నీ మౌనంగా వినడం తప్ప ఒక్క మాట కూడా మాట్లాడలేదు కుముద. ఆమె ముఖం లోని భావాలను చదవడానికి ప్రయత్నిస్తున్న ఆమె తండ్రికి నిరాశే ఎదురయింది.

         ఏమనుకున్నాడో ఏమో ఆమె తండ్రి  కుముద కళ్ళలోకి సూటిగా చూస్తూ ప్రేమ, ఒకింత బాధ మిళితమైన గొంతుతో..

        ” తల్లీ!! నీ మనసులో ఏమి అనుకుంటున్నావో  కాని, అల్లారు ముద్దుగా పెంచిన మేము తెలుసుకోలేక పోవడం మా నిస్సహాయత. కానీ నీ మనసులో ఏదో ఉందని మాత్రం తెలుస్తోంది. ఎందుకు నువ్వు బయట పడట్లేదో మాకు అర్ధం అవ్వట్లేదు. ఒకసారి నా మాట విను తల్లీ!! సరైన వయసులో నీకు పెళ్లి చేసి నీ సుఖ సంతోషాలలో పాలుపంచుకోవాలని ఆశించడం తల్లితండ్రులుగా మాకు ఉండటం తప్పు కాదు కదా? ఇప్పుడు ఇలా మా ముందు దోషిగా నించోవడం నాకు ఇష్టం లేదు. నీ మనసులో ఉన్న భావాలను ఉన్నపలంగా మాకు చెప్పనవసరం లేదు. కొంత సమయం తీసుకుని మాతో పంచుకుంటావని అనుకుంటున్నాను.” అన్నాడు.

       అందరి వైపు ఒకసారి చూసి ,

“శ్రవణ్, అక్క ట్రైన్ కి టైమ్ అవుతోంది. స్టేషన్ కి డ్రాప్ చేసి, రా!” అని చెప్పి “వెళ్ళిరామ్మ!! ” అని కుముదకి చెప్పి అక్కడ నుంచి లోపలకు వెళ్ళడానికి లేచాడు.

        ” సరే బావ అయితే మేము ఇంక వెలతాము.” అని కుముద మావయ్య, అత్తా కూడా ఇంటికి బయలుదేరారు.  

 ****     

  కుముద వేగంగా కదులుతున్న  ట్రైన్ కిటికీలోంచి చిక్కటి చీకటిని చూస్తోంది..ఆమె మనసు అంత కన్నా వేగంగా కదులుతోంది ఎన్నో ఆలోచనలతో…

      ఏదో ఆలోచన స్పృశించి నట్లు ఉంది, అప్పటి వరకు ఏ భావమూ లేకుండా శూన్యంలా ఉన్న ఆమె ముఖంలో ఏదో తెలియని  ఒక చిన్న కదలిక , అంతకంటే వేగంగా ఆమె చేతులు కదిలి ప్రక్కన ఉన్న బ్యాగ్ లోంచి గబ, గబా లాప్ టాప్ తీసి మైల్ బాక్స్ ఓపెన్ చేసి టైప్ చేయడం మొదలు పెట్టింది.

 ****

        డియర్ నాన్న!!

                ఈ రోజు జరిగిన సంఘటనలో నేను మౌనంగా ఉండిపోవడం మీకు మనస్తాపం కలిగించిందని నాకు తెలుసు. మీ పెంపకంలో లోపం ఉందేమోననే నిస్సహాయత మీ ముఖంలో నేను గమనించాను. అందుకే కూతురిగా నా మనసులో విషయాలు మీకు చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది.

          పుట్ట బోయేది ఆడపిల్ల అని తెలిసి కడుపులోనే చిదిమేసే తల్లితండ్రులతో మిమ్మల్ని పోల్చి తక్కువ చేయలేను. ఎందుకంటే తొలిచూరు ఆడపిల్ల పుట్టిందని సంబరాలు జరుపుకున్నారు. ఇప్పటికీ నన్ను చూసి నటింట్లో లక్ష్మి దేవి తిరుగుతోందంటూ మీ కళ్ళలో మతాబు వెలుగులు కనబరుస్తారు. 

       కూతురుకు ఒక గుడ్డు, వంశాంకురం అంటూ కొడుకుకి రెండు గుడ్లు వండి పెట్టే వాళ్లు మీ కాలి గోరుకు కూడా సరిపోరు. ఏమంటే అడిగిందే తడువుగా తమ్ముడుతో సమంగా అన్నీ అమరుస్తారు. 

         ఆడపిల్లనని ప్రతీ విషయానికీ ఆరాలు తీయలేదు, హద్దులు పెట్టలేదు. పై చదువులకు దూరంగా వెలతానంటే వద్దన లేదు. ఉద్యోగం వచ్చిన మూడు నెలలకే కెనడా వెలతానంటే కాదనలేదు. 

           తమ్ముడినే కాదు నన్ను కూడా వంట పని, ఇంటి పనికి దూరంగా ఉంచారు. ఇంకా చెప్పాలంటే ఇద్దరినీ సమానంగా చూసారు. కాదు కాదు తమ్ముడు కన్నా నన్ను కాస్త ఎక్కువ సమానంగా చూసారు. ఇంటికి సంభందించిన భాద్యతలు, పనులు అమ్మా, మీరు చూసుకుని మా లక్ష్యాల మీద మా దృష్టి సడలిపోకుండా చూసారు.  అందుకే నా లక్ష్యంలో నేను ఎప్పుడూ ఉన్నత స్థానం లోనే ఉన్నాను. కానీ కూతురు, కొడుకు  సమానత్వం పేరుతో మా ఇద్దరినీ ఇంటి బాధ్యతలుకు దూరంగా ఉంచారు.

      ” సరియయిన వయసులో పెళ్లి చేసి నీ సుఖసంతోషాలలో పాలు పంచుకోవాలనే ఆశ నాకు ఉండదా!!” అని నన్ను అడిగారు.  అపురూపంగా పెంచుకున్న మీకు,  నాకు సరియైన జీవిత భాగస్వామినీ తోడుగా ఇవ్వాలనే ఆలోచన సబువే నేను కాదనట్లేదు. కానీ నాన్న! పెళ్లి అంటే ఇద్దరు కలిసి ఒక ఇంట్లో ఉండటం కాదు. ఇద్దరు వ్యక్తులు, రెండు కుటుంబాల సమంగా బాధ్యతలను పంచుకోవడం.    మీరు నాకు  అందం, హోదా,  భావజాలం అన్ని సరిపోయే అబ్బాయిని వెతికి తేగలరు. నేను, తమ్ముడు పెరిగిన విధంగానే నన్ను చేసుకోబోయే వాడు కూడా పెరిగి ఉంటాడు. ఇద్దరికీ ఇంటి బాధ్యతలు అంటే వంట, ఇంటి మెంటైన్నెన్స్ రాకపోతే ఆ సంసారం ఎలా ముందుకు సాగుతుంది.  అలాగని ఇప్పటి అబ్బాయిలు పనులు చేయట్లేదు అని అనడటం లేదు. మీ తరంలో తండ్రులు స్కూల్ కి వెళ్ళే పిల్లలు వాటర్ బాటిల్స్ పట్టడం, షూ లేస్ కట్టడం కి పరిమితం అయితే, ఇప్పటి తండ్రులు పిల్లల డైపర్లు మార్చే స్థాయికి వచ్చారు. ఈ విషయం ఒప్పుకోక తప్పదు. వారికి ఇష్టమైన సమయంలో గిన్నెలు కూడా తోమగలుగుతారు కానీ, అది వాళ్ళ బాధ్యతగా స్వీకరిచలేక పోతున్నారు. వారికి ‘మేము సాయం చేస్తున్నాం కదా!’ అని అనిపిస్తోంది కానీ అది తమ పనే కదా అని అనుకోవట్లేదు. భార్య ఆఫీస్ నుండి ఆలస్యంగా అలసి వస్తె   ఆ రాత్రి భోజనం బయటనుండి తెప్పించుకుంటున్నారే తప్ప, ఆమె వచ్చేసరికి ఇంత వంట చేసి పెట్టాలనే ఆలోచనే వారికి రావట్లేదు. దీనికి కారణం తల్లి తండ్రుల పెంపకం. వారు సమానత్వం పేరుతో అమ్మాయికి ఇదివరకటిలా వంట, వార్పు, ఇల్లాలిగా సంసారం సర్దుకోవడం నేర్పటం మానేసి చదువు, ఉద్యోగం, గమ్యం అంటూ వారి మనసులోకి చోప్పించారు. ఇలా చెయ్యబట్టే కదా?  ‘వంటింట్లో మగ్గి పోవలసిన ఆడవారిని స్వేచ్ఛగా వారి ఆశలు నెరవేర్చుకునెలా చేసాము.’ అని మీరు అనచ్చు. అది నిజం కూడా!! కానీ అలాకాకుండా  ఆడ, మగ తేడా లేకుండా ఇద్దరికీ అన్నీ పనులు, భాద్యతలు నేర్పిస్తే ఈ సమస్యే రాదు కదా? అనేది  నా వాదన. అలా కాక కుటుంబంలో భార్యాభర్తలులో ఏ ఒక్కరికీ భాధ్యత లేక పోతే ఇక కుటుంబ వ్యవస్థకు విలువేది, వారి తరువాత తరానికి దిక్కేది. ‘హా!! వంటకేముంది హోటల్స్ ఉన్నాయి. లేదా వంట వాళ్ళను పెట్టుకుంటాం. ఇంట్లో పనికి పని వాళ్ళను చూసుకుంటాం. పిల్లలు పుట్టాక ఆయాలకు అప్పచేబుతాము. ‘ దీంట్లో ఏంటి నష్టం అనిపిస్తుంది అందరికీ. కానీ ఇక్కడ సమస్య పని చెయ్యడం కాదు, బాధ్యత తీసుకోవడం. అదే ఇప్పుడు తరానికి లేకుండా పోయింది. అయినా సమానత్వం ఎక్కడ వచ్చింది. ఒక ఉద్యోగం లేని ఆడపిల్లని వారి అబ్బాయికి  ఇచ్చి పెళ్లి చేయడానికి ఇష్టపడుతున్నారు తప్ప, ఉద్యోగం లేని మగపిల్లాడికి తమ ఆడ పిల్లని తల్లిదండ్రులు పెళ్లి చేయాలనుకోవడం లేదు.  కుటుంబ సమస్యలు వచ్చినా, ఉద్యోగం వదిలేసి ఇంటి పట్టున ఉండటానికి మొదటి ఎంపిక భార్య మాత్రమే.. ఒక వేళ భర్త ఆ నిర్ణయం తీసుకున్నా, సమాజం హర్షిస్తోందా? లేదు. అతనిని చేతకాని వాడిగా ముద్ర వేస్తోంది. 

        చిన్నప్పటి నుంచి ఎన్నో ఆశలతో, ఆశయాలతో కష్టపడి చదువుకుని, ఉద్యోగం సంపాదించుకున్న ఆమె అర్ధాంతరంగా ఉద్యోగం వదిలెయ్యాలంటే ఎంత నరకయాతన అనుభవిసస్తుందో గుర్తించే వారే ఉండరు.

        మరి అలాంటప్పుడు నాలా పెరిగిన మరొక అబ్బాయిని పెళ్లి చేసుకుని ఒక ప్రక్క ఉద్యోగం, రెండో ప్రక్క కుటుంబం అనే బండిని ఒంటెద్దులా నేను లాగ లేను. అలాగని కష్టపడి సంపాదించి, ఇష్టపడి చేస్తున్న ఉద్యోగాన్ని వదులుకోలేను. అందుకే “నాన్న!! ప్లీజ్..!! నాకు పెళ్ళి వద్దు”. ఈ నా నిర్ణయం మీకు మనస్తాపం కలిగించ వచ్చు కానీ నేను తీసుకున్న ఈ ధృడ నిశ్చయం నేను మార్చుకోలేను. ఈ నా నిర్ణయం మీరు అడిగినప్పుడు చెప్పచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. ఇలా మైల్ లో చెప్పడానికి కారణం మీ ఎదురురుగా నిలుచుని మీ ముఖంలోని కదలాడే భావాలు నా మాటలను గొంతు దాటనివ్వం. మీ కళ్ళలో కనిపించే ప్రేమ నా నిర్ణయాన్ని మీ చెవులకు చేరనివ్వదు. అందుకే ఈ ఉత్తరం.  నా మనసులో గూడుకట్టుకున్న ప్రతీ భావం వాదనలకు తావు లేకుండా మీకు సూటిగా ఇలా చేర్చ గలిగాను. 

           నా కోరికను, నిర్ణయాన్ని ఆమోదిస్తారు అని ఆశిస్తూ..

మీ 

కుముద.

****

 కుముద టైప్ చేసిన మైల్ నాన్నకు సెండ్ చేసి, లాప్ టాప్ క్లోజ్ చేసింది. మనసులో భారం అంతా మైల్ లో నింపేయడం వలనేమో మనసు ఒక్కసారిగా దూదిలా తెలీక అయిపోయింది. ఈ సారి  కిటికీలోంచి కనిపించే చీకటి మెల్లగా కరుగుతూ  వెలుతురు వైపుకు పయనిస్తున్నట్ట అనిపించింది. అలా ఎలా తన ప్రయాణం గడిచిందో తెలీకుండానే తన గమ్యానికి చేరువైంది. ఆఫీస్ మైల్ చెక్ చేసుకోవటం కోసం మైల్ బాక్స్ ఓపెన్ చేసింది. ఫోన్ చేసి మాటాడుతారు అనుకున్న నాన్న నుంచి వచ్చిన మైల్ ఆశ్చర్యాన్ని, ఏమి రాసి ఉంటారో అనే ఆతృతని కలిగించాయి. మరో సెకను కూడా ఆలస్యం చెయ్యకుండా ఓపెన్ చేసింది.

   డియర్ కుముద,

                 నీ మైల్ చదివాను. పెళ్లి విషయంలో నీ మౌనం నాలో ఎన్నో ప్రశ్నలను రేకెత్తించింది. ఆ ప్రశ్నలకు సమాధానాలు నీ  మైల్ చదివాక  నాకు దొరికాయి. పాతికేళ్ల వయసులో కుటుంబం, వివాహ బంధం గురించి నీకు ఉన్న స్పష్టతకు సంతోషించాలో, ఇలా పెళ్లి వద్దు అంటూ నువ్వు తీసుకున్న  నిర్ణయం వలన మా పెంపకాన్ని అనుమానపడాలో అర్ధం అవటం లేదు. నువ్వు చెప్పిన అన్ని విషయాలు అక్షర సత్యాలు. నేను ఒప్పుకుంటున్నాను. తమ్ముడినీ, నిన్ను సమానంగా పెంచాము అని అనుకున్నామే తప్ప, ఇద్దరికీ బాధ్యతా రాహిత్యం మప్పాము అని అనుకోలేదు. నేనే కాదు మా తరం వాళ్ళు అందరూ తెలీకుండా చేసిన అతి పెద్ద తప్పు ఇది. ఇద్దరికీ బయట పనులుతో పాటు, ఇంటి పనులు నేర్పి ఉంటే ఎంతో బాగుణ్ణు. కానీ ఆలస్యం జరిగి పోయింది. 

   కానీ తల్లి!! మరి నువ్వు? ఇంత తెలిసిన దానివి నువ్వు ఈ నిర్ణయం తీసుకోవడం ఎంత వరకు సరి అయింది. తరువాత తరాన్ని ఆ విధంగా మార్చ వలసిన ఈ తరం ప్రతినిధివి ఇలా పలాయన వాదం చెయ్యడం మంచి విషయం కాదు. నువ్వు నన్ను అడగచ్చు ‘నేనే ఎందుకు ఆ త్యాగం చెయ్యాలి?’ అని. చెబుతాను చూడు. సమానత్వం కోసం ఎప్పటి నుంచో పోరాటం జరుగుతూనే ఉంది. వాళ్ళు నీలాగే ఆలోచిస్తే ఆడవాళ్ళు ఇప్పటికీ  వంటింటికి పరిమితంగా  ఉండిపోయేవారు. ఉద్యోగాలలోకి ఆడవారు ప్రవేశించిన తొలినాళ్లలో వారు పడ్డ వివక్షత, వ్యతిరేకత మాటల్లో తెలపలేనిది. వారి వ్యక్తిత్వాన్ని కూడా కించపరిచే వారు. కానీ ఆ అవమానాలు కొందరైనా ఓర్చుకుని ముందుకు సాగారు కాబట్టే ఇప్పుడు ఆడ పిల్లలు నైట్ షిప్ట్ ఉద్యోగాలు కూడా చేసుకునే స్వేచ్ఛ వచ్చింది. నీ నిర్ణయం తప్పో ఒప్పో నేను నిర్ణయించ లేను. ఒక తండ్రిగా ఆ నిర్ణయంలో అన్నీ కోణాలను నీకు తెలియ పరిచాను. నీ జీవితం మీద పూర్తి హక్కు నీకు ఉంది. అలాగే ఏ నిర్ణయం తీసుకోవాలో నిర్ణయించుకునే పరిపక్వత కూడా నీకు ఉంది. నీ నిర్ణయం నీ భవిష్యత్తుకు బంగారు బాటలు వెయ్యాలని ఆశిస్తూ.. 

   మీ

నాన్న

        మైల్ చదవడం పూర్తి అయ్యింది. మైల్ లో రాసిన పదాలు చాలా తక్కువే అవ్వచ్చు కానీ ఆ పదాల పదును కుముద ఆలోచనలను చాలా ప్రభావితం చేసింది. ఆలోచనలు ఒక కొలిక్కి రాకముందే గమ్యం వచ్చేసింది.  ట్రైన్ దిగి తన భవిష్యత్తు కోసం వేసే తొలి అడుగు కోసం ఆలోచించనలను కొనసాగిస్తూ ముందుకు అడుగులు వేసింది కుముద.

****

Please follow and like us:

2 thoughts on ““నాన్నా!! ప్లీజ్…” (కథ)”

  1. ఆడా మగా పిల్లలకు సమంగా చదువులు చెప్పించి వారిని ఉద్యోగం చేయటానికి ప్రేరేపించి, వివాహ విషయంలో స్వాతంత్రము ఇచ్చి , నా తరం తల్లి తండ్రులు చాలా చక్కగా తమ బాధ్యత నిర్వహిస్తున్నామని అనుకోవాం లో మనం చేస్తున్న పొరపాటు ని ఎత్తి చూపినందుకు రచయిత్రి నీ అభినందిస్తున్నాను. చదువు ఉద్యోగాలలో సమంగా ఉంటూ వివాహానంతరం సంసార బాధ్యతలని కూడా సమంగా పంచుకున్నప్పుడే మన సంఘంలో స్త్రీ పురుషులకి సమానత్వం వచ్చిందని తృప్తి పడవచ్చు. ఆ రోజులు కూడా త్వరగా వస్తాయని ఆశిస్తూ,

  2. మంచి కథాంశం, కథనం, ముగింపు.. కుముద సందేహాలను ప్రశ్నలుగా సంధించి, యువతరానికి వచ్చే అనుమానాలను ఆమె లేఖలో సూచించారు.. తల్లిదండ్రులు తమ బాధ్యతలను ఎలా నిర్వహించాలో, అందులో తాము చేసే పొరపాట్లను ఒప్పుకుంటూ కూతురికి మార్గదర్శనం చేస్తూ ఎలా నడుచుకోవాలో తండ్రి లేఖలో పొందుపరిచారు.. చూడటానికి చిన్న అంశంగా అనిపించినా, ఈ తరానికి తమ భావి జీవితానికి కావలసిన మంచి విషయాలను కథగా మలిచారు.. అది కూడా సంక్లిష్టంగా రాయనవసరం లేకుండా చక్కటి రెండు లేఖల ద్వారా. ఇంతే సులభంగా కథను రాయవచ్చును, అని చూపించారు… అభినందనలు..💐💐💐

Leave a Reply

Your email address will not be published.