అమ్మా! వెలుతురు కెరటం నీ సువర్ణ

– శాంతి ప్రబోధ

వాళ్లు  చెప్పేది నిజమేనా? నిజం కాదని ఎవరైనా చెప్తే ఎంత బాగుండునని  బస్ ఎక్కే లోపల ఎన్నిసార్లు అనుకుందో. ఉరుములు మెరుపులు లేని ఆకాశం పిడుగుని వర్షించినట్లుగా ఉందా వార్త ఆమెకు.
కిటికీలోంచి కదిలిపోతున్న ఉషోదయ దృశ్యాలు ఆమెను ఏ మాత్రం ఆకట్టుకోవడంలేదు.  అమ్మ మొఖమే సినిమా రీలులా అటూ ఇటూ కదులుతూంటే. నా జీవితంలో కొత్త రాగాల్ని, రుచుల్ని పండించాలని ఎంతో ఆశపడింది అమ్మ.  అవి ఫలించేలోపునే వెళ్లిపోయిందా? అస్సలు నమ్మబుద్ధి కావడంలేదు.  

అమ్మ నిజ్జంగా చనిపోయిందా? అదెలా, ఎలా సంభవం?  నిన్నటివరకూ బాగానే ఉందిగా! రాత్రి పదిగంటల సమయంలో కూడా మాట్లాడింది. అవే అమ్మ చివరి మాటలు. 

ఆ క్షణంలో తాను అనుకుందా? తెల్లవారేసరికి పరిస్థితి తలకిందులవుతుందని?! రేపు అందుకోబోయే గ్రూప్ వన్ ఫలితాలని తలుచుకుని, “అమ్మా!  ఇకనుంచి మనకన్నీ మంచిరోజులే,” అంటే; 
“అవునే. నిజమే కావచ్చు. సర్కారు  3 ఎకరాలు ఇస్తదట. ఊర్లోకి పోతే కచేరి కాడ అంటున్నరు.  కానీ నేను తీసుకోవద్దనుకుంటున్న,” అని మనసులో మాట చెప్పి హాయిగా నవ్వింది. 

ఎందుకమ్మా! అన్న ప్రశ్నకు,  ఇయ్యాల్నో రేపో నా బిడ్డ సర్కారీ నౌకరీలకు ఎక్కుతది కదా. ఆ భూమి ఇంకెవరికన్నా అక్కర్ల ఉన్నోళ్లకు ఇత్తరని మరోసారి నవ్వుతూ వివరించింది.

ఏమీ చదువుకోని అమ్మ ఎంత సంస్కారయుతంగా, బాధ్యతగా ఆలోచించింది? వెయ్యిమైళ్ల వేగంతో  చెలరేగే ఆలోచనల నడుమ చేతిలో ఫోన్ మోగడాన్నే గమనించడం లేదు సువర్ణ.

అది చూసింది శారద.  వెంటనే సువర్ణ  చేతిలోని  మొబైల్  నెమ్మదిగా తన చేతిలోకి తీసుకుని అవతల నుండి ఏమన్నారో కానీ, “ఇప్పుడే బస్సెక్కాము. ఈ పరిస్థితిలో ఒక్క దాన్ని ఎట్లా పంపిస్తామండీ!  మీరు కంగారు పడకండి.  సువర్ణని నేను వెంటబెట్టుకుని వస్తున్నాను,” అంటూ  అవతల ఉన్న వాళ్లకి నెమ్మదిగా చెప్పింది శారద.  
శారద మాటలేవీ చెవికెక్కని సువర్ణకి రాత్రి అమ్మ ఫోన్ చేసినప్పటి మాటలే వినిపిస్తున్నాయి.
అమ్మ ఇంకా ఏదో మాట్లాడబోయింది. తనే కట్ చేసింది “రేపు మాట్లాడుకుందాం అమ్మా! నిద్రొస్తోంది,” అని చెప్పి.  లేకపోతే అమ్మ ఏం చెప్పేదో?

వర్షాకాలంలో సుడిగాలిలా ఏమిటిది? ఆశల పల్లకిలో ఊరేగుతున్న సమయాన పడమటి సూరీడు తూరుపు దిక్కు చేరకుండానే అమ్మ కానరాని లోకాలకు తరలి పోయిందని వార్త. నమ్మ లేకపోయింది.  అసలే నమ్మలేకపోతోంది. అమ్మకి హార్ట్ ఎటాక్ వచ్చి చనిపోయింది అంటున్నారు.  సన్నగా ఎండిపోయిన పుల్లలాగా ఉండే అమ్మకి హార్ట్ ఎటాక్ రావడం ఏంటి?  

సువర్ణ హృదయం బాధతో మెలిపెడుతోంది.  ఎక్కడో చిన్ని ఆశ మినుకు మినుకు మంటూ. అమ్మకి ఏమీ కాలేదనే వార్త ఈ ఫోను మోసుకురాకపోతుందా అనిపించి ఆశగా మొబైల్ వైపుచూసింది. మళ్లీ  మళ్లీ  అవే ప్రశ్నలు అలల సమూహంలా ఒకదాని వెంట ఒకటి  చేరి రొదపెడుతూ. ఆమె ఎక్కిన నాన్ స్టాప్ బస్సు వేగం కంటే ఎన్నో రెట్ల వేగంతో పరుగులు పెడుతూ  సాగుతున్నాయి సువర్ణ  ఆలోచనలు. 

పాలిపోయిన ఆమె కంటి నుండి చుక్క నీరు కారడం లేదు కానీ హృదయంలోనే ఆమె దుఃఖిస్తున్న తీరు శారదని కలచివేసింది.   శారద, సువర్ణలు ఒకే పిజి హాస్టల్ లో, ఒకే రూంలో ఉండడం వరకూ మాత్రమే వారి పరిచయం. వ్యక్తిగత విషయాలు పంచుకునేంత దగ్గరతనం, స్నేహం లేవు. ఎవరి లక్ష్యాలని చేరుకునే ప్రయత్నంలో వాళ్లు  తీరిక లేకుండా ఉండడం వల్లనో, తమకు తాము ఏర్పాటు చేసుకున్న చట్రంలో బందీలుగా ఉండడం వల్లనో, వయస్సులో వ్యత్యాసం వల్లనో కానీ వారి మధ్య పెద్దగా  స్నేహం పెరగలేదు.  మంచి నిద్రలో ఉండగా సువర్ణ ఫోన్, శారదని డిస్ట్రబ్ చేసింది. విషయం తెలిసి ఆ పరిస్థితుల్లో ఒంటరిగా పంపించడం ఇష్టం లేక సువర్ణ వద్దన్నా తనూ బయలుదేరింది శారద.   కళ్లు మూసుకుని కణతల దగ్గర ఒత్తుకుంటున్న సువర్ణని చూసి  శారద నెమ్మదిగా భుజం తట్టింది. పొడారిపోతున్న ఆమె పెదాలు గమనించి కొంచెం నీళ్లు తాగమంటూ వాటర్ బాటిల్ మూత తీసి తాగించబోయింది శారద.  వద్దంటూ కొద్దిగా కదిలి తిరిగి కళ్లు మూసుకుంది సువర్ణ.  

వారి వెనక సీట్లో పసిపాప ఎందుకో గుక్కపట్టి ఏడుస్తోంది ఆమె ఆలోచనలకి భంగం కలిగిస్తూ. బహుశా ఆకలేసిందేమో! 

“పాలసీసా తెచ్చుకోవడం తెలీదా?” ఆ బిడ్డ తండ్రి భార్యని కసురుకుంటున్నాడు. “తెచ్చా. ఆ బ్యాగ్ మీరు పైన పెట్టారు,”  కొద్ది దూరంలో వెళ్తున్న ట్రైన్ చూపుతూ ఊరుకోబెట్టే ప్రయత్నం చేస్తూనే భయపడుతూ నెమ్మదిగా చెప్పింది తల్లి. ఆ పీల గొంతులో అతనంటే ఉన్న భయం స్పష్టంగా తెలుస్తోంది.  “ఆ ముక్క ముందే ఏడవచ్చుగా!” గర్జించాడు భర్త.  “కొద్దిగా ఆ చారల బ్యాగ్ తీసిస్తారా?” భయం భయంగా  నసిగినట్లుగా ఆమె.  తల్లి అందించిన  స్తన్యం తన ఆకలి తీర్చలేదేమో పాప ఓ క్షణం ఏడుపు ఆపి మళ్లీ గట్టిగా గొంతు పెంచింది. పాల కోసం తడుముకుంటూనే ఉంది. అపుడప్పుడే వస్తున్న పళ్లతో పాప కసిగా కొరికిందేమో. అబ్బా! అని బాధ పంటికింద నొక్కి  పెట్టింది తల్లి. అదేమీ పట్టనట్టే  కూర్చున్నాడతను మొహం విసుగ్గా పెట్టి.  లేచి పైన పెట్టిన బ్యాగ్ తీసే ప్రయత్నం చేయకపోవడంతో నిస్సహాయంగా అతనికేసి చూసింది ఆ యువతి.   అతను అదేమీ పట్టనట్టు ఉండడంతో చంకలో బిడ్డతో సహా తానే లేవబోయింది. 
“బిడ్డ గుక్కపట్టి ఏడుస్తంటే అట్లా కసురుకుంటావేమయ్యా. లేచి ఆ సంచీ ఇవ్వరాదూ?”కొద్దిగా గట్టిగానే అంది వాళ్ల వెనక సీటులో ఉన్న నడివయస్సు స్త్రీ.  ఒక్క క్షణం ఆవిడకేసి తీక్షణంగా చూసి,  మౌనంగా లేచి, సంచి భార్యకి అందించాడు.  పాలసీసా నోటికందగానే పాప ఏడుపాగిపోయింది. 

హైదరాబాద్ నిజామాబాద్ బస్సు వేగంగా కదులుతోంది. ఆ బస్సుకంటే వేగంగా కదులుతున్నాయి సువర్ణకి అమ్మ జ్ఞాపకాలు. 

ఈ  అమ్మలాగే తన తల్లీ నా కంట తడి రానీయలేదు. తనకోసం అమ్మ ఎన్ని కష్టాలు పడింది. ఎన్నెన్ని అవమానాలు భరించింది. సంప్రదాయం ముసుగులో చీమూ నెత్తురూ లేని పరాన్నభుక్కులు లూటీ చేసిన తన శరీరంలాగా, ఆమె జీవితపు పత్రహరితాన్ని పీల్చేసిన పురుగుల బారిన కన్నబిడ్డ పడకూడని ఆరాటపడింది. జాగ్రత్త పడింది.  ఆ జీవితం తాలుకు ఛాయలు పడని హాస్టల్ లో ఉంచి చదివించింది. తన బతుకు నాకు తెలియకూడని అనుకుంది.

సువర్ణ చేతిలో ఫోన్ బీప్ శబ్దం చేసింది. చూడకుండానే శారద చేతికిచ్చింది.  ఆమె మెసేజ్ ఏదో వచ్సినట్లుందని చూసి ఏదో ప్రమోషన్ మెసేజ్ అని అట్లాగే పట్టుకుంది.  మళ్లీ తల్లి తలపుల్లోకి పోతున్న సువర్ణకి అంతరాయం కలిగిస్తూ ముందు సీట్లోంచి వినిపిస్తున్నాయి మాటలు. 

“నాకు ఈ రోజు సెలవు పెట్టడానికి కుదరదు.  తప్పని సరిగా ఫీల్డ్ విజిట్ కి పోవాలి,” బతిమాలుతునట్లుగా ఆమె గొంతుక.   “నువ్వు  ఇంట్లో ఉన్నావని నన్ను సెలవు పెట్టమనడం బాగోలేదు హరీ! అట్లా అయితే జాబ్ మానేస్తాలే. అది  కుదరదంటే ఎలా. నాకేమన్నా సరదానా. నాలిగింటికి లేచి వండి వార్చి ఊరు నిద్రలేవకుండానే హ్యాండ్ బ్యాగ్ తగిలించుకుని బయటపడడం,” ఆమె గొంతు పదును దేరుతోంది.    

అవతల్నించి ఏమన్నాడో గానీ ఫోన్ గొంతు నొక్కి బ్యాగ్లో పడేసింది.  “హాయిగా, విశ్రాంతిగా, ఆనందంగా బతకాలని ఎవరికుండదు?  ఈ మగాళ్లకి పెళ్లాం తెచ్చే జీతం కావాలి. అన్నీ అతని చెప్పు చేతుల్లో నడవాలి.  ఆఖరికి ఆమె ఉద్యోగం కూడా అతని కనుసన్నల్లోనే చేయాలి.” గొణుక్కుంటోంది ఆ స్త్రీ. 

ఆ మాటలు సువర్ణ చెవిన పడ్డాయి.  తాను చూసిన ఆడవాళ్లలో చాలామందిని; కట్టుకున్న భర్త, తండ్రి, అన్న తమ్ముడు, కొడుకు ఎవరో ఒకరు తమ జన్మహక్కుగా అజమాయిషీ చేస్తారు.  కానీ తన తల్లి పరిస్థితి అది కాదే. 
చెడ్డీ వేసుకున్న ప్రతి మగాడూ. ఎట్లా భరించిందో అమ్మ.  జీరబోయిన  గుండె గొంతుకలోంచి ఎగిసిపడే దుఃఖాన్ని అదిమిపడుతూ ఆది కనిపించనీయకుండా  చేసే ప్రయత్నంగా కిటికీలోంచి బయటకు మొహం పెట్టింది  సువర్ణ.

కొద్ది క్షణాల అనంతరం శారదతో ఏదో చెప్పబోయి  అటు తిరిగి ఆగిపోయింది సువర్ణ.  

అవతల పక్క సీటులోని నడివయస్కుడు శారదనే  తదేకంగా కొరికి తినేసేలా చూస్తున్నాడు. అది గమనించిన శారద అతన్ని చురచురా కాల్చేసేలా చూసి చేతిలోని దినపత్రికలో మొహం దూర్చింది. 
ఎవరైనా నన్ను అలా చూస్తే అమ్మ రగిలిపోయేది- సువర్ణ మనసులో మాట అప్రయత్నంగా పైకి తన్నుకొచ్చేసింది. 

విస్మయంగా పేపర్లోంచి తల తిప్పి సువర్ణకేసి చూసిన శారద ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని  ఆత్మీయ స్పర్శ అందించింది.  సువర్ణ మనస్థితి అమ్మ చుట్టూరా తిరుగుతోందని అర్థం చేసుకుంది.  అదిమి పెట్టిన ఆమె దుఖాన్ని బయటికి తెచ్చే అవుట్ లెట్ కావాలి.   ఒక్క సారిగా బద్దలయిందంటే ఆమెని ఆపడం తన తరం కాదని భావించిన శారద “ఇంకా,”’ అంది.

“ఎదుగుతున్న క్రమంలో నన్ను ఇతరులు చూసే దృష్టి అమ్మని చాలా కలవరపరిచేది.  కాలేజిలో సామాజికాంశాలపై ఊరూరు తిరిగి వీధినాటకాలు వేసేదాన్ని. అది అమ్మకు అస్సలు నచ్చేది కాదు.  బహుశా ఆడామగా కలిసి ఒకే బృందంగా వెళ్లడంవల్ల కావచ్చు.  ఊరూరా తిరుగుతూ ప్రదర్శనలిస్తున్నానని ఓ రోజు చాలా పెద్ద గొడవపెట్టుకుంది. బాగా చదువుకుని నీడ పట్టున ఉద్యోగం చేసుకుంటావనుకుంటే ఈ తిరుగుళ్లు ఏమిటి? అంటూ బాధపడింది. నేను తప్పు పని చేయడంలేదని, అందరికీ మంచి జరగడంకోసమేనని ఎంత చెప్పినా ఆమెకు అది ఎక్కలేదు. నన్ను ఎంతో స్వేచ్ఛగా పెంచిన అమ్మ  ప్రవర్తన నాకెంతో ఆశ్చర్యంగానూ, కొత్తగానూ అనిపించి అదే డిగాను.  నేను చేసే పని మంచిది కాదని ఆమె ఖఛ్చితమైన అభిప్రాయం.   నాకు నచ్చచెప్పడానికి చాలా ప్రయత్నించింది.  గొడవ పడింది. అమ్మ అంత గట్టిగా వాదించడం; నా ఆలోచనని, పనిని  సరిచేయాలని ప్రయత్నించడం  నా జీవితంలో అది రెండోసారి,” బయటకు దీర్ఘంగా చూస్తూ చెప్పింది సువర్ణ. 

“అవునా?” శారద ప్రశ్నార్థకం 

“ఒకసారి దీర్ఘ శ్వాస  తీసుకుని వదలుతూ  “అవును! నా కులంలో చాలా మంది ఆడపిల్లలాగా నేనెప్పుడూ లేను. అందుకు భిన్నంగా పెంచింది అమ్మ.  బుడిబుడి నడకల నన్ను చదువుల తల్లి ఒడిలో చేర్చింది.  ఊళ్లో నాతోటివాళ్లు  తమ్ముళ్లను సాకుతూనో, కడవలతో నీళ్లు మోస్తునో, బండెడు చాకిరీ చేస్తునో, అడవికిపోయి కట్టెలు తెస్తూనో ఉంటే. నేను మాత్రం అలా కాదు. 

“సెలవుల్లో ఇంటికి వచ్చినప్పుడు ఒకసారి పొరుగింటి రాజమణితో కల్సి  కట్టెలకు పోయాను.  అమ్మకి పని భారం తగ్గిద్దామనే ఉద్దేశంతో. అందుకు అమ్మ సంతోషపడలేదు సరికదా చెడామడా తిట్టింది. అమ్మ ఎప్పుడూ అట్లా తిట్టలేదు.  ఎందుకట్లా చేసిందో చాలా సేపు అర్థం కాలేదు. అమ్మ కోపం తగ్గాక సారీ చెప్పి, మన చుట్టుపక్కల ఆడపిల్లలంతా రోజూ చేస్తున్న పనేకదా. వర్షాలు దగ్గరపడుతున్నాయ్.  పొయ్యిలో కట్టెలు లేవు. నీకు కష్టం కావద్దని, సాయం చేద్దామని  నేను వాళ్లతో పాటు వెళ్తే  తప్పేమిటన్న నా  ప్రశ్నకు  ‘మనసొంటి మాదిగోళ్ల  ఆడపిల్లలపై అచ్చోసిన ఆంబోతుల్లెక్క తిరిగేటోల్ల కళ్లు పడతయ్ బిడ్డా!  మనసొంటి ఆడోల్లని చెరబట్టే కీచక మూకలు  అవకాశం కోసం ఎదురు చూస్తనే ఉంటయ్ బిడ్డా. జర బద్రం.  ఊర్ల పెరిగిన పిల్లలకు ఎవరెసొంటోల్లో అంతో ఇంతో ఎర్కుంటది. నువ్వా  సుడాబోతే పట్నం పిల్లలెక్క, పెద్దిండ్లల్ల పిల్ల లెక్క సక్కదనాంముంటివి. ఈ గుడిసెల్ల కాపాడుడు నాతోని అయితదా. గందుకే మందిలకు పోకు,’ అని విశదపరిచింది.  ఆనాడు అమ్మ మాటలు అర్థమయ్యి అవనట్లుగా  అంతగా పట్టించుకోలేదు కూడా.  ఇప్పుడాలోచిస్తుంటే ఎర్నాకులంలో న్యాయ విద్యార్థిని జిషకి జరిగిన అన్యాయం తెలిసిన తర్వాత గానీ నేను రియలైజ్ అవలేదు ఆనాడు అమ్మ ఎందుకంతగా చెప్పిందో,” అంటూ శారద మొహంలోకి  ఓ క్షణం అలా  చూసి చూపు తిప్పుకుంటూ “గర్భదరిద్రంలో  మోసిన బరువుల మోత, రంపపు కోత అనుభవించిన అమ్మ అంతకు మించి లాలిత్యంతో ఎలా చెప్పగలదు?  ఏ గుడ్లగూబ ఆబగా కబళిస్తుందోనన్న భయంతో  తల్లి కోడి  రెక్కల కింద పిల్లను దాచుకునే ప్రయత్నం ఆమెదని అర్థం చేసుకునే వయసు కాదు నాదప్పుడు,”’ అంటూ చెప్పడం ఆపి సీరియస్ గా వింటున్న శారద మొహంలో భావాల్ని చదవడానికి ప్రయత్నం చేస్తోంది సువర్ణ. 

“తర్వాత?”  అన్నట్లు చూస్తున్న శారద, తన చేతిలోని సువర్ణ చేతిని నెమ్మదిగా వదిలి  గాలికి చెల్లాచెదురవుతున్న సువర్ణ  జుట్టుని సవరించింది.   ఆ చర్య  తల్లి ఆత్మీయస్పర్శ  పొందిన అనుభూతి కలిగించింది సువర్ణకి.  శారద భుజంపై తలవాల్చిందల్లా లేచి చిన్నపిల్లలా శారద మొహంలోకి చూసింది. శారద ఆమె తలను తన ఒడిలోకి తీసుకుంది. చెమర్చిన కళ్లు  కనిపించనీయకుండా  ఓ క్షణం కళ్లు మూసి తెరిచింది సువర్ణ. ఎంత వద్దన్నా ఓ కన్నీటి చుక్క ఆమె కనుకొలుకుల్లోంచి  పక్కకు జారింది.

నెమ్మదిగా మళ్లీ చెప్పడం మొదలుపెట్టింది.   ట్రాన్స్ లో మాట్లాడుతున్నట్లుగా ఉంది ఆమె తీరు చూస్తుంటే.  
“నా ఇంటర్ ఎగ్జామ్స్ ముందు జరిగిన సంఘటన అమ్మని ఎంత ఆందోళనకు గురి చేసిందో. చిగురుటాకులా వణికిపోయింది,” 
“ఏమైంది?” శారద కళ్లతోనే ప్రశ్నించింది 

“ఇంటర్ ఎగ్జామ్స్ లో   సాధారణంగా వచ్చే ముఖ్యమైన  ప్రశ్నలు చెప్తానని  చెప్పి మేకతోలు కప్పుకున్న తోడేలు లెక్చరర్  లైంగిక దాడికి పాల్పడడంతో అతన్ని ఎదుర్కుంటున్న క్రమంలో అతను అన్న మాటలు సూదుల్లా గుచ్చుకున్నాయి.

“ఏమిటే. అంత నీల్గు తున్నావు?  పత్తిత్తయినట్టు. అయ్యెవడో తెల్వకుండా పుట్టినదానివి అంటూ సైంధవుడిలా వెంటపడి దుర్భాషలాడినప్పుడు ఆ క్షణంలో వచ్చిన ఆవేశంతో లెక్చరర్ అని కూడా  చూడకుండా చెప్పు తీసుకుని చెడామడా వాయించేసాను.  కానీ భవిష్యత్ పరిణామాల్ని ఊహించలేదు. ఆ అవమానాన్ని భరించలేక తెల్లారితే పరీక్ష ఉన్నదనే విషయం పట్టించుకోక ఇంటికి పరిగెత్తుకుపోయాను.  అమ్మని ఒక బిడ్డ అనరాని మాటలన్నాను. ఎన్నిమాటలన్నా అమ్మ ఒక్క మాట తూలలేదు.  మనసులోపల ఉప్పొంగుతున్న సునామీ అలల్ని ఎలా అదిమిపెట్టగలిగిందో. ఆమెలో ఎన్ని నెత్తుటి నదులు పారాయో. ఎంత తప్పుగా అర్థం చేసుకుంది. ప్చ్ పాపం. అమ్మ.

  “చీర చెంగు మాటున అలవికాని అవమానాలు, విషాదాలు దాచేస్తూ; ఎక్కడి బాధల్ని, బెంగల్ని  అక్కడే పాతరేస్తూ నాకోసం నిభాయించుకుంది. ఆశావహంగా  నాకోసం  ముందుకు నడుస్తూనే ఉంది.  మరిప్పుడెందుకు ఆ నడక ఆగిపోయిందో? విధి ఆమెను ఏ తీరాలకు విసిరేసిందో?” సువర్ణ కళ్లలో నీళ్లు చిప్పిల్లాయి. గొంతు జీరబోయింది. 
తన ఒళ్లో  ఉన్న సువర్ణ  భుజంపై ఓ చేత్తో  తడుతూ మరో చేత్తో ఆమె తలపై చేయి వేసి అనునయంగా నిమురుతోంది శారద.

కొద్ది సేపు ఇద్దరి మధ్యా మౌనం. ఆ తర్వాత  శారద ఒడిలోని తల లేపి ఆమె మొహంలోకి చూస్తూ 
“తాత చనిపోకముందు తన పేర ఉన్న అరెకరం చేను పండించుకొమ్మని అమ్మకి ఇచ్చాడు. చెట్టు, పుట్టలతో అడవిలాగా ఉన్నదాన్ని చంటిబిడ్డలా సాకింది.  ఒంటి చేత్తో సాగులోకి తెచ్చింది. తిండిగింజలకి ఇబ్బంది లేకుండా చేసుకుంది.  తాత చనిపోయాడు. అమ్మమ్మ నోరులేని జీవి. అది అలుసుగా తీసుకుని పెద్దమామ, చిన్న మామ ఆ పొలం గుంజుకున్నప్పుడు, ఆబోతుల్లా కొమ్ములతో కుమ్మి, కొట్టి  హింసించినప్పుడ; కుటుంబంలో, సమాజంలో వచ్చే ప్రతి సంకెలని తెంచుకుంటూ సాగిన అమ్మకి ఇప్పుడు ఏమయింది శారదా?” బేలగా అడిగింది సువర్ణ.   మళ్లీ ఆమే  ‘నా కోసం,  నా కోసమే,  పొగచూరిన కళ్లలో ఒత్తులేసి నాకు బాట చూపే ప్రయత్నం చేస్తూనే ఉండేది అమ్మ.  ఎటు నుండి ఏ కష్టం వచ్చి మీదపడుతుందో అని అమ్మ కాపు కాస్తూనే ఉండేది. అయినా ఈ మగాళ్లకెంత అలుసో కద శారదా ఆడవాళ్లంటే. అందునా మా లాంటి వాళ్ళంటే.”

అవునన్నట్లు తలూపుతూన్న శారద చేతిని చేతిలోకి తీసుకుంటూ,  ‘పేదలం, దళితులం. జోగినీ కుటుంబం. ఆడవాళ్లం. ఒంటరి ఆడవాళ్లం.   వాళ్లు  అట్లనే ఉంటరు బిడ్డా. అలుసు తీసుకుంటరు బిడ్డా. ఒంటి బలుపు తీర్సుకుంటరు బిడ్డా.  మనం  యుద్ద తంత్రాలు నేర్వాలే బిడ్డా!’ అని చెప్పిందో నాడు  నేను అడిగిన ఓ  ప్రశ్నకి సమాధానంగా. 

“అక్షరం చదవని అమ్మ నాకెన్ని జీవిత పాఠాలు చెప్పిందో?”  ఆకాశంలో అలుముకుంటున్న చీకటి మేఘాల్లాటి జ్ఞాపకాల్లోంచి తొలుచుకొస్తున్న సువర్ణ మాటలు పూర్తి కాకుండానే,  

“నిజమే సువర్ణా! ఎంత బాగా చెప్పింది మీ అమ్మ. ఆమె అనుభవం చెప్పిన పాఠాలు ఎన్ని డిగ్రీలు చదివినా వస్తాయా?  ఎంతటి గడ్డు స్థితినైనా ఎదుర్కొనే ధైర్యం, విశ్వాసం లేకే కదా యువత ఆత్మహత్యలు చేసుకునేది.”  సాలోచనగా అంది శారద.  

అదేమీ పట్టించుకోనట్టే తన ధోరణిలో తను చెప్పుకుపోతోంది సువర్ణ. 

“అమ్మ జోగిని అని అనడం చిన్నప్పుడు విన్నాను. కానీ జోగినీ అంటే ఏమిటో  తెలియదు. తెల్సుకోవాల్సిన అవసరమూ రాలేదు. నాకు  అమ్మ పోలికలున్నా రంగు రాలేదు. అమ్మది నాణ్యమైన నలుపు.  నేను చిన్నప్పటి నుండి హాస్టల్ లో ఉండి చదువుకోవడం, సెలవులకి  ఇంటికి వెళ్లినా మళ్లీ  హాలిడే కాంప్ లకు వెళ్లడంతో సరదాగా గడచిపోయేది. లేదంటే ఉపాధి పనులకు అమ్మతో పాటే వెళ్లేదాన్ని. ఆ పనులకు తీసుకెళ్లడం, నాతో పని చేయించడం అమ్మకు అస్సలు ఇష్టముండేది కాదు. నేను కమిలిపోతానని, నా రంగు మాసిపోతుందని అనేది.  కానీ ఇంటి దగ్గర ఒంటరిగా ఉండడం అస్సలు మంచిది కాదనే ఉద్దేశం. అమ్మే నన్ను చూడాలనిపించినప్పుడల్లా నా దగ్గరకు వచ్చేది.   “బడి  పాఠాల్లో మంచి మార్కులు తెచ్చుకునే నేను అమ్మ చెప్పిన జీవిత పాఠాలను ఆనాడు సరిగ్గా బుర్రకు ఎక్కించుకోలేదేమో! అర్థం చేసుకోలేదేమో! నాకు పెళ్లి చేసెయ్యాలని ఎంతో  తపన పడింది.  పెళ్లి లేని తల్లిగా ఎన్ని అవమానాల్ని తన గరళంలో బిరాడాతో బిగించేసిందో?ప్చ్!” నిట్టూర్చింది  కనుకొలకుల్లో దాగిన కన్నీటి చుక్కని చున్నీతో తుడిచేస్తూ.

అప్పటివరకూ జోగిని అంటే అర్థం కాని శారద ఏదో అర్థమయిన దానిలా సానుభూతిగా చూసింది సువర్ణ వైపు.
“నేను చెప్పింది నీకు అర్థమయ్యే ఉంటుందనుకుంటున్నా. అమ్మ ఆరాటానికి  కారణం అప్పుడు నాకు అర్థం కాలేదు. తనకి లేని దాన్ని కూతురికి అందించాలని ఆమె తపన, తాపత్రయం అందులో సంతోషం వెతుక్కునే ప్రయత్నం కావచ్చని ఇప్పుడనిపిస్తోంది.  ఉద్యోగం వచ్చిన తర్వాతే పెళ్లి అని భీష్మించుకు కూర్చున్న ‘నన్ను బాగా చదువుకున్నావు. మంచీ చెడూ నాకంటే నీకే ఎక్కువ తెలుసు,’ అంటూ సరిపెట్టుకుంది.

ఎక్కడిదాకా వచ్చారని చిన్నమామ ఫోన్ కి కామారెడ్డి దగ్గరలో ఉన్నామని సమాధానం చెప్పిన సువర్ణకేసి చూస్తూ  “నువ్వూ మాలాగే పేదింటి పిల్లవనుకున్నా కానీ  ఎంతటి గడ్డు పరిస్థితుల్లోంచి ఎదిగొచ్చావో తెలుస్తుంటే ఆశ్చర్యంగానూ గర్వంగాను  ఉంది సువర్ణా! నీవసలు అలా కనిపించవు.”  ఆశ్చర్యంగా, ఆప్యాయంగా సువర్ణ చేతిని  గట్టిగా పట్టుకుంది శారద. 

“నీకు నేను చెప్పింది చాలా తక్కువ శారదా! పన్నెండో ఏడు వెళ్లిందో లేదో అమ్మకి  నేను పుట్టానట.   ఆ తర్వాత ఏడాదిన్నరకి తమ్ముడు. ఆమె ప్రమేయం లేకుండానే, మా పుట్టుక గురించి ఆమె ఆరాటపడకుండానే; ఎవరెవరి శరీరతాపం తీర్చుకునే క్రమంలోనో, సాంప్రదాయపు చట్రంలో చిక్కి విలవిలాడే అమ్మ రక్తం పంచుకుని మేమీ లోకంలోకి వచ్చేశాం. కానీ ఏమైందో కానీ తమ్ముడు ఏడాదిలోపే మమ్మల్ని వదిలిపోయాడు.

“నాకు ఊహ తెలిసినప్పటినుండీ నాన్నంటే  తెలియదు.  అమ్మని అడిగితే వదిలి వెళ్లిపోయాడంది.  ఒంటి చేత్తోనే మమ్మల్ని పెంచింది అమ్మ.  ప్రభుత్వం జోగినులకు ఇచ్చే పునరావాస కార్యక్రమాల్లో కుట్టుపని నేర్చుకుంది. జాకెట్లు, గౌన్లు, లంగాలువంటివి కుట్టడం నేర్చుకుంది.  కానీ అమ్మ దగ్గర కుట్టించుకోవడానికి వచ్చేవారు కాదు. కారణం అప్పటికే ఆమె జోగినులకోసం కట్టించిన ఆశానగర్ కాలనీలో ఉండడమే.  ప్రభుత్వం, హాస్టళ్లకు కుట్టే బట్టలు వీళ్లతో కుట్టించింది.  జోగినుల కాలనీ అని ముద్ర పడడంతో  అల్లరి చిల్లరి  మగవాళ్లు  అక్కడ చేరి అల్లరి పెట్టడం మొదలు పెట్టారు. ఇక అక్కడ ఉండలేక అమ్మలాగే మిగతావాళ్లు  చాలామంది అక్కడి నుండి వెళ్లిపోయారు.  అమ్మకి మళ్లీ పని లేదు.  కూలికి వెళ్లేది. మొదట్లో కూలికి కూడా రానిచ్చేవారు కాదట.  అటువంటి పరిస్థితిలోంచి వచ్చిన అమ్మ ఎంత గొప్పగా ఆలోచించిందో తెలుసా? తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం భూమిలేని జోగినులకు 3 ఎకరాలు ఇస్తామని చెప్పిందట. కానీ అది తీసుకోనని రాత్రి మాటల్లో చెప్పింది అమ్మ.”

“ఏం? ఎందుకని వద్దంది?” ఉచితంగా వస్తుందంటే ఫినాయిలు తాగడానికయినా సిద్ధమయ్యే ఈ కాలంలో ఇలాంటివాళ్లు కూడా ఉంటారా అనే ఆశ్చర్యంతో శారద ప్రశ్న దూసుకొచ్చింది.

“అది ఆత్మ గౌరవం కోసం కావచ్చు లేదా నేను ఉద్యోగంలో చేరితే ఆర్థికంగా ఇక ప్రభుత్వ సహకారం అవసరం లేదని ఉండవచ్చు. లేదా తన జీవితం తాలుకు  నీలినీడలు నాపై పడతాయని కావచ్చు.  ఏమైనా అమ్మ తీసుకున్న నిర్ణయం గొప్పదే కదా! కొన్ని క్షణాలు అలా కళ్లు మూసుకు తెరిచి మళ్లీ తానే  సమాజంలో ఉండే హెచ్చుతగ్గులు, సమాజపు అంతఃస్వరూపం  బడిలో ఉన్నప్పుడు అంతగా తెలియదు. కారణం నేను సంస్కార్ బడిలో చదవడం కావచ్చు. అక్కడ అందరినీ ఒకే విధంగా చూడడం కావచ్చు.  కబడ్డీ, ఖో ఖో; రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్నప్పుడు, కొన్ని సామాజిక కార్యక్రమాలకోసం, బాల జర్నలిస్టుగా గ్రామాల్లోకి వెళ్లినప్పుడు మనుషుల మధ్య ఉండే అంతరాలను గమనించినా అంత సీరియస్ గా తీసుకోలేదు. బహుశా అంతగా అర్థం చేసుకునే వయసు కూడా కాదేమో.” 

“ఎప్పుడయితే నేను బాలల హక్కులపై  రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి సదస్సులకి హాజరయ్యానో అప్పటి నుండి నా మెదడు మరింత ఆలోచించడం మొదలు పెట్టింది. పదును అవడం ఆరంభమైంది.  చెప్పాను కదా ఇంటరులో ఉండగా జరిగిన సంఘటన. ఆ తర్వాత ఒంటరి స్త్రీగా తల్లి పడుతున్న కష్టాలు కొద్ది కొద్దిగా అవగతమవుతూ వచ్చాయి. నా తల్లిలానో,  గ్రామంలోని మహిళల్లాగానో బతకకూడని అప్పుడే నిశ్చయించుకున్నాను.  అమ్మ హేమలతా లవణం స్ఫూర్తి నిచ్చేది. అట్లా నలుగురికీ ఉపయోగపడేలా బతకాలని నాకు నేనే చెప్పుకునేదాన్ని.  ఆ క్రమంలో అన్నింటా చురుకుగా పాల్గొంటూ, వచ్చిన ఏ  అవకాశాన్ని వదులుకోకుండా ముందుకు దూసుకుపోయేదాన్ని. అప్పటికప్పుడు ఏ విషయమైనా నదురుబెదురూ లేకుండా ఎంతమంది ముందయినా మాట్లాడేదాన్ని. విశ్లేషించేదాన్ని. సూటిగా చెప్పే దాన్ని. బహుశా ఇవన్నీ నేను చదివిన బడి, అక్కడి మనుషులు, వాతావరణం నాకిచ్చాయని అనుకుంటున్నా.  

 “ఆ లక్షణాలే, అమెరికా దాకా వెళ్లే అరుదైన అవకాశాన్నిచ్చాయి.  నేనెప్పుడూ ఊహల్లో కూడా కనని కలని నిజాన్ని చేస్తూ నా ముందుకు వచ్చిన అవకాశం అది. కానీ అప్పుడు అమ్మ పంపడానికి చాలా భయపడింది.  తెలిసిన వాళ్లు,  తెలియనివాళ్లు అమ్మని చాలా భయపెట్టారు.  తన భయాలన్నీ తనలోనే పెట్టుకుని  హేమలతా లవణం మ్మమ్మపై ఉన్న గౌరవంతో, నమ్మకంతో అమెరికాలో జరిగే సదస్సుకి నన్ను పంపించింది.”

గాలికి ఎగురుతున్న ముంగురులను సవరించుకుంటూ చెప్తున్న సువర్ణ మాటలు పూర్తి కాకుండానే అందుకుని  “ఏమిటీ! చిన్నప్పుడే నీకు అమెరికా వెళ్లే అవకాశం వచ్చిందా?”  చెప్పలేనంత ఆశ్చర్యం కళ్లలో నిండగా అడిగింది శారద. 

“అవును! ఆ రోజు నా జ్ఞాపకాల్లో ఇంకా పచ్చిగానే,  అప్పుడప్పుడూ ముల్లులా గుచ్చుకుంటూనే ఉంది. పాస్పోర్ట్ కోసం హైదరాబాద్ వెళ్లినప్పుడు తండ్రి పేరు లేదని పాస్ పోర్ట్ ఇవ్వనని చెప్పారు.  తండ్రి ఇప్పుడు మీకు లేక పోవచ్చు కానీ నీ పుట్టుకకి కారకుడైన వ్యక్తి పేరు చెప్పమన్నారు. ఏమి చెప్పను. ఏమని చెప్పను. భారమైన హృదయంతో తప్పుచేసిన దానిలా తల వంచుకున్నాను.  అప్పటికీ నన్ను తీసుకెళ్లిన ఆంటీ పరిస్థితి వివరించింది. వాళ్లకి జోగిని అంటేనే తెలియదు. చెప్పింది అర్థం చేసుకోరు. వాళ్ల టైం వేస్ట్ అవుతోందని మాట్లాడారు. ఆంటీ చాలా రిక్వెస్ట్ చేశారు. ఒప్పుకోలేదు.   అప్పటికప్పుడు అమ్మని పిలిపించి జోగిని అంటే ఏంటో తెల్పుతూ ఒక అఫిడవిట్ తయారు చేయించి అమ్మతో సంతకం చేయించి పాస్ పోర్ట్ ఆఫీసర్ కి ఇచ్చి వివరించిన తర్వాతే  పాస్ పోర్ట్ అప్లికేషన్ తీసుకున్నారు. మొదటిసారిగా నేను జోగిని కూతురుగా పుట్టినందుకు బాధపడ్డాను. కానీ అప్పటికి జోగినీ జీవితం ఎలా ఉంటుందో తెలియదు.” 

“అవునా!  తండ్రి పేరు లేకపోతే ఇలాంటి కష్టాలుంటాయా?” విస్మయంగా శారద. 

అవునన్నట్లుగా తలూపి “ఆంటీ వాళ్లు చొరవ చూపక పోతే నాకు వచ్చిన అవకాశం నేను కోల్పోయేదాన్ని. నేను కాకుండా మరెవరికి ఈ అవకాశం వచ్చినా తండ్రి పేరు లేదన్న కారణంగా పాస్ పోర్ట్ అప్లికేషన్ వెనక్కి ఇచ్చేసేవారు కాదు కదా. అప్పటి నుండి నాలో ఎన్నెన్నో ప్రశ్నల తుఫానులు రేగడం మొదలయ్యాయి.  కానీ అమ్మని అడిగి తెలుసుకునే అవకాశమే రాలేదు. పాస్ పోర్ట్ వచ్చాక రెండుసార్లు దిల్లీ వెళ్లి వచ్చా వీసా కోసం.  అక్కడ కూడా జోగిని బిడ్డగా, తండ్రి లేని బిడ్డగా మళ్లీ రుజువు చేసుకోవాల్సి వస్తుందేమోనని భయపడ్డా. కానీ  వాళ్లు  తండ్రి పేరు లేదని అభ్యంతర పెట్టలేదు. కానీ, నేను మైనర్ ని కాబట్టి అమ్మ అడ్రెస్స్, నివాస ధృవీకరణ చేసుకునే పత్రాలు కావాలన్నారు. తెల్లవారే సరికి అమ్మ విమానం ఎక్కి దిల్లీ వచ్చింది.  ఎక్కడో పొలాల్లో పని చేసుకుంటున్న అమ్మని పిలిపించి అప్పటికప్పుడు తోడిచ్చి దిల్లీ పంపించారు  సంస్కార్ వాళ్లు.”

 ‘బిడ్డా! నిజామబాద్ మొకం జూడని నాకు మీది మోటార్ ఎక్కిపిచ్చినవ్. నీకంటే ముందు నేనే గాలి మోటార్ ఎక్కిన’ అంది  అమ్మ  ఢిల్లీ చేరగానే. ఇందిరమ్మ ఇక్కడే ఉండేదా. ఉక్కిరిబిక్కిరి అవుతూ ఏవేవో అమాయకపు ప్రశ్నలు వేసింది.  ‘నిన్న ఈ వరకూ చేన్ల ఉంటి. ఇగో ఇప్పుడు డిల్లి గల్లిలల్ల’ అంటూ ఆశ్చర్యపోతూనే ఉంది. 

“మా జీవితాలు ఆ మట్టి లోంచి, బురదలోంచి పైకి వచ్చి అంబరాన్ని  అందుకోవాలని;  మేమంతా సంబరాన్ని పంచుకోవాలని సంస్కార్ చాలా చాలా చేసింది. 

“మా రజిత టీచర్ వాళ్ల అబ్బాయిని అమెరికా చదువుకు పంపుదామంటే వీసా రాలేదట. చాలా బాధపడిందా. నాకు వీసా వచ్చిందని  ఈర్ష్య పడింది కూడా. బడిలో వాళ్లకి, సంస్థలో వాళ్లకి, ఊళ్లో  వాళ్లకి  అందరికీ ఆశ్చర్యమే. 

“చుట్టుపక్కల ఊళ్ల వాళ్లు కొందరు అమ్మని అదృష్టవంతురాలివి అని పొగిడితే కొందరు ఈర్ష్య పడ్డారు.  తమ ఊర్లో ఉన్న పెద్దరెడ్డి కొడుక్కి కూడా వీసా రాలేదట. తన కొడుకు వెళ్లలేని చోటుకు నేను వెళ్తున్నందుకు తమ పీఠం కదిలిపోతున్నంత బాధపడిపోయారు. లేని పోనివి ప్రచారం చేశారు.  విపరీతంగా భయపెట్టారు. తన భయాలన్నీ గుప్పిట బంధించి కళ్ల నిండిన నీటిని నా కళ్ల పడకుండా తుడిచేస్తూ అమ్మ నన్ను పంపింది.  కానీ, నేను తిరిగి వచ్చేవరకూ కంటి నిండా కునుకు లేకుండా గడిపింది.”  

సువర్ణ  అమ్మ తలపులను భంగపరుస్తూ సెల్ ఫోన్ మోగింది. 

“హార్టీ కంగ్రాట్స్ సువర్ణా!”

“ఏంటి?” 

“రిజల్ట్స్ వచ్చాయిగా. ఇంకా చూసుకోలేదా.?  ట్రీట్ ఎప్పుడిస్తున్నావ్? స్టేట్ సెకండ్ రాంక్ కొట్టేశావ్’ రిజర్వేషన్ లో చూస్తే నీదే ఫస్ట్ కంగ్రాట్స్ అగైన్ సెలెబ్రేషన్ ఎప్పుడు?”

కళ్లలోంచి నీరు కారిపోతోంది.  

ఏమిటే మౌన వ్రతం చేస్తున్నావా? లేక  ఫస్ట్ రాంక్ రాలేదనా?”

అంతలో సువర్ణ చేతిలోని మొబైల్ లాక్కున్న శారద “సారీ! ఇప్పుడీ విషయం చెప్తున్నందుకు. సువర్ణ వాళ్ల మదర్ ఎక్స్ పైరెడ్,” అని చెప్పింది. 

“ఓ అయాం సారీ! తర్వాత మాట్లాడతా.” పెట్టేసింది.  ఆ తర్వాత వెంట వెంటనే చాలా ఫోన్లు. ఏవీ రిసీవ్ చేసుకునే స్థితిలో లేదు సువర్ణ.  అప్పటికి  హై వే దిగి డిచ్ పల్లి క్రాస్ చేసింది బస్సు. 

-ఒక్క  రోజు ముందుగా ఈ వార్త అందితే అమ్మ ప్రాణం నిలిచేదేమో. రక్త సంబంధీకులు, పేగు తెంచుకు పుట్టిన నేనూ  ఉండీ లేనట్లు బిక్కుబిక్కుమంటూ బతికింది  అమ్మ.   మనసులో జరిగే సునామీ విధ్వంసాన్ని, హృదయంలో ఉడికే నెత్తుటి మూటల్ని మూటకట్టి  దాచేసేది. లోపల జరిగే యుద్ధపు కన్నీటిచారికల్ని కనిపించనీయకుండా చిరునవ్వు లేపనం పూసుకు తిరిగేది. నన్ను శిఖరాగ్రంపై చూడాలని కలలు కనేది.   ఆ కలలు నిజమవుతున్న వేళ. అమ్మా!  ఏంటమ్మా? ఆంక్షల పంజరాలను  విప్పుకుని ఆశల రెక్కలతో విహరిద్దామని వెళ్లిపోయావా!  దుఃఖం తన్నుకొస్తోంది  ఆమెకి.

వాళ్ల మాటలు చెవిన పడ్డాయేమో. కొందరు సానుభూతిగా సువర్ణకేసి చూస్తున్నారు.  బద్దలవుతున్న అగ్నిపర్వతాల్ని లోలోనే ఆర్పే ప్రయత్నంలో గట్టిగా కళ్లు మూసుకు కూర్చుంది సువర్ణ. మనసులో మూగగా తల్లితో మాట్లాడేసుకుంటోంది.
-నీ దారి పొడవునా ఉన్న ముళ్ల జెముళ్లను ఏరేసి పూల పాన్పు పరచాలనుకుంటున్న  నా ఆశల్ని పేకమేడల్లా కూల్చేసి పొలిమేరలు దాటి పడమటి కొండల్లోకి  చేరిపోయావా అమ్మా!  చిక్కటి చీకటి పాయల్లో చిల్లు పిడతలా నన్నిలా వదిలేసి?!

-ఊహూ! కాదు, నే చిల్లు కుండని కాదు. కాకూడదు. నిండు కుండను.  నీవిచ్చిన సప్తవర్ణాలని నింపుకుని ఉదయపు వెలుతురు కెరటం అవుతుందమ్మా నీ సువర్ణ.  

ప్రేమంతా నింపుకుని వేళ్లు జుట్టులోకి పోనిచ్చి సవరిస్తూ లాలించే అమ్మ మొహం కళ్లలో మెదులుతుండగా సువర్ణ ఆలోచనలకు భంగం కలిగిస్తూ నిజామాబాద్ బస్ స్టేషన్ లో బస్ ఆగింది. 

****

(మాతృక సౌజన్యంతో-)

Please follow and like us:

2 thoughts on “అమ్మా! వెలుతురు కెరటం నీ సువర్ణ”

  1. అమ్మా ! వెలుతురు కెరటం నీ సువర్ణ కథ చదువుతుంటే .. ఆనాటి జోగినుల జీవితం కళ్ళకు కట్టినట్లు కనిపించింది. ఆచారం పేరిట బలైన స్త్రీ మూర్తి తన కూతురు కు అలాంటి దుస్థితి రాకూడదనే ఆరాటంతో , కూతురు ఉన్నతికి తల్లి చేసిన కష్టం,శ్రమ, త్యాగం , నేర్పిన విలువలు కూతురు ను ఉన్నత స్థాయి లో నిలపడం.. చాలా చాలా బాగుంది .
    శీర్షిక: అమ్మా! వెలుతురు కెరటం నీ సువర్ణ
    తేదీ:25-06-2021

Leave a Reply

Your email address will not be published.