బహుళ-9
మరియ(డాక్టర్ వినోదిని మాదాసు కథ)
– జ్వలిత
వివక్ష ఏ రూపంలో ఉన్న వ్యతిరేకించాల్సిందే. కానీ… వివక్ష లోనే పుట్టి, వివక్ష జీవితంలో ఒక భాగమై హింసిస్తున్నప్పుడు. చుట్టూ ఉన్న అంతరాలేవి అర్థం చేసుకోలేని పసిహృదయాలు ఎంత ఉక్కిరిబిక్కిరి అవుతాయో మాటలతో చెప్పలేము.
రాజస్థాన్ లోని భన్వరీబాయి అనే దళిత మహిళపై ఆధిపత్య వర్గం సామూహిక అత్యాచారం చేసిన కేసులో.. న్యాయస్థానం ఇచ్చిన తీర్పులోని వివక్ష తన జీవితంలో తన సొంత అక్క దయనీయంగా మరణించిన తీరు గుర్తుకు వస్తుంది ఒక విద్యార్థికి. సమాజంలోని అంతరాలను అర్థం చేసుకోలేక ఆ విద్యార్థి ఎంత వేదనకు గురి అయిందో కళ్లకు కట్టినట్టుగా తన రచనా పటిమతో కథలో వివరించారు రచయిత్రి.
ఈ నెల బహుళలో డాక్టర్ వినోదిని మాదాసు రాసిన కథ ‘ మరియ’ గురించి.
కొన్ని వార్తలు చదివినప్పుడు, కొన్ని సంఘటనల గురించి విన్నప్పుడు మనకు తెలిసిన వారి జీవితాలలో జరిగిన అటువంటి సంఘటనలు గుర్తుకు వచ్చి మరొకసారి అత్యంత వేదనకు గురి చేస్తాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం చుంచుపల్లిలో జరిగిన సంఘటన అందుకు ఉదాహరణ. సొంతం అన్న బాల్యం నుండి చెల్లిపై అత్యాచారం చేస్తుంటాడు. తల్లికి చెప్పిన పట్టించుకోకపోవడం, పెద్దమ్మకు చెప్పాలని ఆమె దగ్గరికి పోతే పెద్దమ్మ కొడుకు కూడా అత్యాచారం కొనసాగించడం, ఎవరికైనా చెబితే చంపేస్తానని అనడం….
ఇదంతా వింటుంటే ఎక్కడున్నాము మనం? అడవిలో జంతువులు సైతం ఆపదలో ఉన్న వారిని కాపాడే నైజాన్ని కలిగి ఉంటున్నాయి. బంధువులు రక్త సంబంధీకులు కేవలం బాలిక అయినందువలన చెరపట్టడం, చివరకు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పెద్దమ్మ కొడుకు ఉరేసుకుని చచ్చాడు.
.వివక్ష ఎక్కడ ఉన్నది అనేవాళ్ళు… ఒక్కసారి కళ్ళు తెరవండి చుట్టూ ఏమి జరుగుతుందో తెలుసుకోకుండా అజ్ఞానంలో బతకకండి.
ఇక కథలోకి వస్తే డాక్టర్ వినోదిని మాదాసు ‘బ్లాక్ ఇంక్’ కథల రచయిత్రి. ఆమె రాసిన ‘మరియ’ కథ చదివి రెండు రోజులు మనశ్శాంతిగా ఉండలేకపోయాను. పల్లెటూర్లలో హోటళ్ళు లాడ్జిలు ఉండవు. కనుక రకరకాల ఉద్యోగులు పల్లెలకు వెళ్లినప్పుడు ఎవరో ఒకరి ఇంట్లో బస చేస్తారు. ఆ ఇంటి ఇల్లాలు చేసిన వంట తింటారు. ఆ ఇంటి పిల్లల సేవలు పొందుతారు. చివరికి వారినే కాటేస్తారు. ఇంటి యజమానులు కూడా గొర్రె కసాయిని నమ్మినట్టు, వారినే నమ్ముతారు. జీవితాలు నాశనం చేసుకుంటారు.
కథంతా ఉత్తమ పురుషలో సాగుతుంది. ఒక హాస్టల్లో కరెంటు పోయిన సమయంలో అమ్మాయిలంతా భయంతో వాచ్ మెన్ కోసం కేకలు వేసే సంఘటనతో కథ మొదలవుతుంది. చీకట్లో కూర్చొని కథ చెబుతున్న మార్తా గతంలో తన అక్కకు జరిగిన సంఘటనల గురించి, తన కుటుంబాన్ని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఆరోజు పేపర్లో ఒక వార్త చదివినప్పటి నుండి ఆమె మనసు విచలితం అయిపోయింది.
వారిది ఒక చిన్న పల్లెటూరు. అందులో ఒక దళిత కుటుంబంలో ఇద్దరు ఆడపిల్లలు. తండ్రి ఎలిమెంటరీ స్కూల్లో ఫ్యూన్. తల్లి కూలి పని చేసేది. ఆదివారం నాడు తల్లి చర్చికిపోయేది. తండ్రి తన స్నేహితులతో జల్సా చేసుకునేవాడు. అటువంటి కుటుంబంలో ఆర్థిక పరమైన సమస్యలతో భార్యాభర్తల మధ్య గొడవలు జరిగేవి.
“ఇద్దరు ఆడపిల్లలు ఉన్న తండ్రివి బాధ్యత లేకుండా తాగుతావు ఎందుకు” అని తల్లి అడిగేది.
పెద్దబిడ్డ మరియకు మేనరికం ఉన్నదని, చిన్న బిడ్డ చాలా తెలివైనది, బాగా చదువుతుంది, ఉద్యోగం సంపాదిస్తుంది కనుక భయపడాల్సింది లేదని, తండ్రి అనేవాడు. అటువంటి కుటుంబంలో ఒక చిన్న సంఘటనతో తల్లి చంటిపిల్లాడిని తీసుకుని పుట్టింటికి పోతుంది. తండ్రి ఊరు వదిలి పిల్లలతో వేరే పంచకు చేరుతాడూ. వారి చేతిలో పెద్ద బిడ్డ అత్యాచారానికి గురై మరణిస్తుంది. చివరకు బాధితులే నిందితులుగా అనేక అవమానాలను ఎదుర్కోవడం, అన్యాయానికీ గురవడం, ఈ కథలో రచయిత్రి చక్కగా వివరించారు.
గ్రామాల్లో నిరుపేద కుటుంబాల పై పట్నం నుండి వచ్చే అధికారులు అదనపు భారంగా మారి ఎలా కాటేస్తారో కింది పేరా తెలియజేస్తుంది.
గుంటూరు నుండి ఎవరొచ్చినా తిరిగి ఊరు వెళ్ళే టప్పుడు సినిమాకు పొమ్మని మాకు డబ్బులు ఇచ్చే వాళ్ళు “ఇంట్లో అన్ని రోజులు తిని యళతా పిల్లల చేతిలో రెండు రూపాయలు అన్నా పెట్టడేంది” అనేది మా అమ్మ వెంకటేశ్వరరావుగారు వెళ్లిన వెంటనే.
మా అమ్మకి నాన్నకి డబ్బులు దగ్గర ఎప్పుడూ గొడవలు జరిగేయి. ఒకసారి అలా గొడవ మొదలైంది. చూస్తుండగానే మా నాన్న అమ్మని జుట్టు పట్టుకొని ఈడ్చుకొచ్చి ఎగిరెగిరి తన్నాడు. మా అమ్మకు నోట్లో నుంచి ముక్కుల నుంచి ఒకటే మయినంగా రక్తం కారింది. చీరంతా రక్తం మరకలయి చిరిగి పోయింది. ఇంటి పక్కన రత్తమ్మత్తమ్మ వచ్చి, “చంపుతావా ఏందన్నా ..” అనుకుంటా అమ్మను వాళ్ళింటికి తీసుకెళ్ళింది. ఆ రాత్రి మా అమ్మ మాకు తెలియకుండా మా తమ్ముని తీసుకొని మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళి పోయింది. ఆ రాత్రంతా నేను దిగులు దిగులుగా భయంభయంగా అయిపోయాను. మరియా నా వీపుకి తన పొట్ట నానిచ్చి, నా చుట్టూ చేతులువేసి గట్టిగావాటేసుకొని “అమ్మ వస్తది వస్తది” అనుకుంటా మెలుకువగా గడిపింది.
పై విధంగా ఒక కుటుంబం అకారణంగా పతనమవడానికి కారణమైన సంఘటనను వివరించింది కథయిత్రి. ముఖ్యంగా శూద్ర కుటుంబాల్లో ఆడపిల్లలు బలికావడానికి ఇటువంటి రాత్రులే కారణాలు.
గొర్రె కసాయిని నమ్మినట్టు ఆ వెంకటేశ్వరరావును నమ్మి పిల్లలతో పట్నం చేరతాడు మరియ తండ్రి. వెంకటేశ్వరరావు భార్యకు పనులు చేసిపెడుతూ చిన్నతనంలోనే పనిమనిషిగా మారిన మరియ.. వెంకటేశ్వరరావు కొడుకు చేతిలో లైంగిక వేధింపులకు గురై చివరికి వెంకటేశ్వరరావు చేతిలో అత్యాచారానికి గురై తల్లి ఇంటికి చేరకముందే బావిలో పడి చనిపోయింది.
కథలో రచయిత్రి దళిత కుటుంబాల్లోని ఆహార పద్ధతులు తాగుబోతు తండ్రుల బాధ్యతారాహిత్యం, తనపై జరిగిన హింసకు పిల్లలను వదిలి పుట్టింటికి వెళ్ళిన తల్లి నిస్సహాయత, నిరుపేద కుటుంబాల్లో పుట్టిన ఆడపిల్లలకు ఇంటిపని వంటపనితో పాటు ఇతరుల ఇళ్లల్లో వెట్టి చేయవలసి రావడం. తల్లి తండ్రుల రక్షణలేని పసిపిల్లలకు “పెద్ద కుటుంబాలు చదువుకున్న ఉన్నత వర్గాలు చేసే ద్రోహాలు, దాష్టీకాలను” చాలా చక్కగా చెప్పింది
కానీ మరియ చావుకు కారణమైన వెంకటేశ్వరరావు పెద్దన్న చెప్పిన మాటలు రచయిత్రి మాటల్లోనే “మాది నిప్పును కడిగే వంశం, నియమనిష్ఠలతో ఆచార సంప్రదాయాలతో జీవితాన్ని గడిపే వాళ్ళం. మా ఒక్కగానొక్క చెల్లెలు శూద్రుడిని పెళ్లాడిందని దానికి పిండం పెట్టాం… ఇప్పటికీ మడి లేకుండా వంట చేయం. అలాంటిది ఒక కడజాతి ఆడపిల్లను నా తమ్ముడు తాకుతాడా… ఇంట్లో లక్ష్మీదేవిలాంటి భార్యను పెట్టుకొని అలాంటి అప్రాచ్చపు పని చేయడు గాక చెయ్యడు. నీతి జాతి లేని కులం తక్కువ ముండాకొడుకుల్లారా… పాపమని ఇంట్లో పెట్టుకొని ఆదరిస్తే… నా తమ్ముడు మీద నిందలు మోపుతారా.. ఇరవై నాలుగు గంటల్లో ఇల్లు ఖాళీ చేయాలి” అంటూ చిటికెలు వేస్తూ చూపుడు వేలు చూపిస్తూ మాట్లాడుతాడు.
ఇదంతా మర్చిపోలేని మరియు చెల్లెలు మార్తా.. చదువుకుంటూ హాస్టల్లో చేరుతుంది. కానీ రాజస్థాన్ లోని అగ్రకులానికి చెందిన కొందరు సామూహికంగా అత్యాచారం చేసిన భన్వరీదేవి కేసులో తీర్పునిస్తూ “ఒక అగ్రకులానికి చెందిన వ్యక్తి, తక్కువ కులం స్త్రీని రేప్ చేయడం ద్వారా తనని తాను కించపరచకోడు” అని న్యాయమూర్తి కేసును కొట్టివేశాడు.
ఆ వార్త విన్న మరియా చెల్లెలు మార్తా తన జీవితంలో జరిగిన సంఘటన మరొకసారి గుర్తు చేసుకుంటుంది..
సమాజంలో దళిత మహిళలపై జరుగుతున్న వివక్ష, హింస గురించి రచయత్రి కళ్ళకు కట్టినట్టు వివరించారు.. అందరూ చదవాలిసిన కథ. నల్లపొద్దు కథాసంపుటిలో 318 నుండి కథ చదవచ్చు.
*****
కలం పేరు జ్వలిత. అసలు పేరు విజయకుమారి దెంచనాల. స్వస్థలం పెద్దకిష్టాపురం,ఉమ్మడి ఖమ్మం. విశ్రాంత ప్రభుత్వ ఉపాధ్యాయిని. ప్రస్తుతం సాహితీవనం మిద్దెతోట సాగు.
రచనలు-
1)కాలాన్ని జయిస్తూ నేను-2007(కవిత్వం)
2)మర్డర్ ప్రొలాంగేర్-2008 (కవిత్వం,ఆంగ్లానువాదం)
(3)సుదీర్ఘ హత్య-2009(కవిత్వం)
(4)ఆత్మాన్వేషణ -2011(కథలు )
5)అగ్ని లిపి- 2012(తెలంగాణ ఉద్యమ కవిత్వం )
6) జ్వలితార్ణవాలు- 2016(సాహిత్య సామాజిక వ్యాసాలు)
7) సంగడి ముంత- 2019(కవిత్వం)
8) రూపాంతరం – 2019 (కథలు)