యాత్రాగీతం

నా కళ్లతో అమెరికా

అలాస్కా

-డా||కె.గీత

భాగం-11

తల్కిట్నా ఊరు

హిమానీనదమ్మీద స్వయంగా అడుగుపెట్టిన విమాన ప్రయాణం పూర్తయ్యి బయటికి వచ్చేసరికి మమ్మల్ని తీసుకెళ్లేందుకు రిసార్టు వెహికిల్ సిద్ధంగా ఉంది.  పేకేజీ టూరు తీసుకోవడం వల్ల ఇదొక చక్కని ఏర్పాటు. ఎక్కడికి వెళ్లినా పికప్ , డ్రాప్ ఆఫ్ లకి తడుముకోనవసరం లేదు. ఇక వెనక్కి రిసార్టుకి చేరుకునేసరికి

దాదాపు రెండున్నర కావస్తున్నా అదృష్టం కొద్దీ రిసార్టులోనే ఉన్న లంచ్ రెస్టారెంట్  తెరిచే ఉంది. మెక్సికన్ టాకోస్, మొక్కజొన్న గింజలు ఆర్డర్ చేసి ఆకలితో ఆదరాబాదరా తిన్నాం. 

భోజనం కాగానే తల్కిట్నా ఊరు చూసి వద్దామని అనుకున్నాం.  పిల్లల్ని తీసుకువెళ్లాలని అనుకుంటే సిరి అడుగు తీసి అడుగు వెయ్యనని మారాం మొదలుపెట్టింది.  వరు సరేసరి, గదిలో టీవీకి అతుక్కుపోయి కూచుంది. ఇక మేమిద్దరమే బయలుదేరేం. 

రిసార్టు నుంచి ఊర్లోకి, ఊర్లో నుంచి రిసార్టుకి ప్రతి పది పదిహేను నిమిషాలకి వెహికిల్స్ వెళ్తూ ఉండడంతో మాకు ట్రాన్స్పోర్టు సమస్య కాలేదు. 

తల్కిట్నా ఊరు చాలా చిన్నది. అయినా అందమైనది. ముఖ్యంగా ఊరునానుకుని ప్రవహించే కాలువలు, కాలువ ఒడ్డునే ఉన్న డౌన్ టౌన్. 

రిసార్టు నుంచి బయలుదేరి సరిగ్గా పదినిమిషాల ప్రయాణం తర్వాత డౌన్ టౌన్ లో దిగి నడక మొదలుపెట్టేం. పాతకాలపు ఇళ్లవంటివే చిన్న షాపులుగా మార్చినట్టున్నారు. ఒక్కొక్కటి చూసుకుంటూ ముందుకు వెళ్లసాగేం. అంతలోనే చిన్న చినుకులు మొదలయ్యేయి. అయినా ఇద్దరం లక్కీగా చలికి, వర్షానికి ఆగే జాకెట్లు వేసుకుని వచ్చినందువల్ల ధీమాగా ముందుకు నడిచేం. 

చుట్టూ మట్టిరోడ్లతో ఆ ప్రాంతం మేం పుట్టి పెరిగిన ఊరులా అనిపించడంతో ఆనందించాం. 

ఒక చిన్న నాలుగు రోడ్ల జంక్షనులో అటూ ఇటూ పదేసి నిముషాలు నడిచేసరికి ఊరు అయిపోయింది. 

అందులో ఒక వైపుగా కాలువ ఒడ్డుకు నడిచే దార్లో అటూ ఇటూ టెంట్లు వేసి తాత్కాలికమైన దుకాణాలు తెరిచి గిఫ్ట్ ఐటమ్స్ అమ్ముతున్నారు.  

అందులో అధికభాగం అలాస్కా చేనేత కళాకారులు తయారు చేసిన దుస్తులు, టోపీలు, బ్యాగులు వంటివి, స్థానిక ఆదివాసీ సంస్కృతిని ప్రతిబింబింపజేసే టోటెమ్ ల దారు శిల్పాలు, పనిముట్లు వంటివి ఆకర్షణీయంగా ఉన్నా బాగా ఖరీదుగా ఉన్నాయి. నేను ఆ ఊరు గుర్తుగా జంక్షనులో తల్కిట్నా డౌన్ టౌన్ అని రాసి ఉన్న చిన్న బొమ్మ కొన్నాను. అప్పటికే సాయంత్రం కావస్తుండడంతో అంతా దుకాణాలు మూసేసి హడావిడిలో ఉన్నారు. 

కాలువ ఒడ్డుని చూసి వద్దామని దుకాణాలు దాటి ముందుకు నడిచేం. దుకాణాలకు, కాలువ ముఖద్వారానికి మధ్య పార్కు కట్టి ఉంది. అది దాటి కాస్త ఎత్తు గడ్డి లోంచి  నడవగానే కాలువ ఉధృతంగా ప్రవహిస్తూ తీరాన్ని ఒరుసుకుంటూ బురద రంగులో దర్శనమిచ్చింది. 

కాలువ అంటే మరీ పిల్లకాలువ కాదు. చిన్న సైజు నదిలానే ఉంది. ఒడ్డున నిలబడి ఫోటోలు తీసుకుందుకు దగ్గరికంటా వెళ్ళేం. కాలువ ఒడ్డున మట్టి చెమ్మగా ఉండడంతో నేను కాస్త ఎత్తుగా ఉన్న ప్రదేశంలో నిలబడ్డాను. సత్య వద్దన్నా వినిపించుకోకుండా ఒడ్డున ఒరుసుకుని నిలబడ్డ చెట్టు మొదలు వంటిది ఎక్కి నిలబడడానికి వెళ్ళేడు. సరిగ్గా మొదలు మీద కాలువేసేడో లేదో అప్పటివరకు కదలకుండా మోడులా ఉందని భ్రమింపజేసే ఆ చెట్టు ఒక్కసారిగా బోల్తా పడింది. సత్య చప్పున ఒడ్డుకి ఒక్క గెంతు గెంతాడు. లేకపోతే కాలువలో ఆ మోడుతో బాటూ కొట్టుకుపోయేవాడే. గట్టు మీంచి ఫోటో తీస్తున్న నాకు ఒక్క నిమిషం భయంతో గొంతు తడారిపోయింది. అప్పటికే దుకాణాలు కట్టేసుకుని అంతా వెళ్లిపోవడం వల్ల కనీసం పిల్లవాడు కూడా దగ్గర్లో ఎవరు లేరు. పిల్లల్ని వదిలొచ్చి ఇంకెప్పుడూ అలాంటి సాహసాలు చెయ్యొకూడదని అర్థమయ్యింది. నాకు ఇప్పటికీ తల్చుకుంటే ఒళ్ళు గగుర్పొడిచే సన్నివేశం అది.  అదృష్టం కొద్దీ ఆరోజు అలా ప్రమాదం తప్పింది. ఇక నేను అక్కడ ఒక్క క్షణం ఉండొద్దని బయలుదేరదీసేను. 

తిరిగి రిసార్టుకి వచ్చేసరికి వచ్చి భోజనం కానిచ్చి అర్థరాత్రయినా తగ్గని వెలుతురు వల్ల నిద్రపట్టక మళ్లీ కాస్సేపు రిసార్టు ఆవరణలో  పచార్లు చేస్తూ కబుర్లు చెప్పుకున్నాం. అద్దాల్లోంచి దూరంగా కనబడుతున్న కాలువ వైపు మాత్రం చూడడానికి మనస్కరించలేదు నాకు. మర్నాడు మేం మొదట బస చేసిన ఎంకరేజ్ మీదుగానే ప్రయాణం చేసి ఎంకరేజ్కి దక్షిణంగా ఉన్న సీవార్డ్ అనే ఊరికి పొద్దున్నే ప్రయాణం చెయ్యాల్సి ఉంది. 

****

(ఇంకా ఉంది)

ఫోటోస్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.