నిండైన నిజాయితిని సొంతం చేసుకున్న కథా రచయిత
– శారద
చెన్నపట్నం నుండి తెనాలి వచ్చిన ఒక పందొమ్మిదేళ్ల కుర్రాడు తెలుగు నేర్చుకుని, తెలుగు దేశంలో ఒక హోటల్ లో సర్వర్ గా పగటి పూట పని చెస్తూ, రాత్రి పూట సాహిత్య సృజన చేస్తూ జీవించాడు. 32 ఏళ్ళకే మూర్చ రోగం రూపంలో మృత్యువు లోబర్చుకునే దాకా దీక్షగా రాసుకుంటూ వెళ్ళాడు. తనది కాని భాషని, తనది కాని ఊరును తనవాటిగా చేసుకుని సాహిత్యానికి భాషాభేధాలుండవని చాటి చెప్పాడు. అతనే శారద అనే కలం పేరుతో రచనలు చేసిన ఎస్. నటరాజన్. వీరి కథలతో పరిచయం ఉన్న వారు వీరు తెలుగులో ఒక అద్భుతమైన రచనాకారుడని ఒప్పుకుంటారు. శారద గారి 35 కథలను ఇలా ఒక సంపుటిగా తీసుకొచ్చారు వీరిని అభిమానించే తెనాలి మిత్రులు. జులై 1998 లో ప్రధమంగా ముద్రించిన ఈ కథా సంపుటిలో వీరి “రక్తస్పర్శ” సంపుటిలోని పన్నెండు కథలతో పాటు ఆ రోజుల్లోని వివిధ పత్రికలలో ప్రచురింపబడిన వీరి ఇతర కథలని సేకరించి ఒక సంకలనంగా తీసుకు వచ్చారు. శారద సాహిత్య వేదిక తెనాలి వారు ప్రచురించిన ఈ కథా సంపుటి శారద గారి కథన శక్తికి, వారి అద్భుత పరిశీలనా శక్తికి నిదర్శనం. వీరి పై కొడవటిగంటి కుటుంబరావుగారి ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తుంది. కొన్ని పాత్రలు కో.కో గారి పాత్రలను గుర్తుకు తీసుకువస్తాయి. చలాన్ని వీరు అభిమానించారని వారు తన కథల మధ్య అప్పుడప్పుడు తీసుకునివచ్చిన చలం గారి ప్రస్తావనతో అర్ధం అవుతుంది. అయితే చలం గారి శైలికి చాలా భిన్నంగా ఉంటుంది శారద గారి శైలి, స్త్రీ జీవితం, స్వేచ్చ, సమాజంలో మనుష్యుల ద్వంద్వ వైఖరిని తన కథలన్నిటిలో ప్రస్తావిస్తు కూడా వీరు ఆవేశ పడక ఆలోచనతో కలాన్ని ఉపయోగించినట్లు అనిపిస్తుంది. వీరి కథలలోఒక వ్యంగ్య వైఖరి కూడా కనిపిస్తుంది. సైంటిఫిక్ ఫిక్షన్ ద్వారా కూడా సమాజంలోని కొన్ని సమస్యలను చర్చించే ప్రయత్నం చేసారు. రెండు భిన్న ఇతివృత్తాలను ఒక తాటి మీద నడుపుతూ కథను చెప్పడానికి కథకుడికి గొప్ప ప్రతిభ ఉండాలి. లేకపోతే రాస్తున్న కథ అర్ధవంతంగా ఉండడు. శారదగారు కొన్ని కథలను ఆ శైలిలో రాసి తన ప్రతిభను చాటుకున్నారు కూడా.
“రక్తస్పర్శ” అన్న మొదటి కథలో నీతికి నిర్వచనం ఏంటీ అన్న ప్రశ్న కనిపిస్తుంది. ఒక ఒంటరి మహిళ, తండ్రి లేక, భర్త చనిపోయి తమ్ముడి మీదే ప్రాణాలన్నీ పెట్టుకుని జీవిస్తుంటుంది. తమ్ముడు ప్రసాదరావు విలాసంగా జీవించాలని అతని గొంతెమ్మ కోర్కెల కోసం అక్కను డబ్బు అడుగుతూ ఉంటాడు. తమ్ముడి సరదాలు తీర్చాడానికి అనసూయ చాలా కష్టపడుతుంది. పొలం మీద వచ్చే ఆదాయం చాలా తక్కువ. ఆ పరిస్థితులలో ఇద్దరు మగవారికి ఆమె దగ్గరవుతుంది. వారి వద్ద ఆర్ధిక సహాయం పొందుతుంది. కొంత ధనం వెనకేసుకుంటుంది. ఊరి వారందరూ ఆమెను అభిమానిస్తారు. ఆమె వ్యక్తిత్వంలో, స్వభావంలో ఎక్కడా కూడా విమర్శించే ఏ కోణం కనిపించదు. నిరాడంబరంగా జీవిస్తుంది. తన అనుకున్న వారికి తనవంతు సహాయం చేస్తూ ఉంటుంది. పెద్దలంటే భక్తీ, గౌరవం. తమ్ముడి భవిష్యత్తును తీర్చడమే తన జీవిత లక్ష్యం అన్నట్లు కష్టపడుతుంది. ప్రసాదరావు సీత అనే పేదింటి అమ్మాయిని ప్రేమ పేరుతో మోసం చేసి ఆమెను గర్భవతిని చేసి పెద్ద చదువులకు పట్నం వెళ్ళిపోతాడు. విషయం తెలియని అక్క ఒక గొప్పింటి సంబంధం తీసుకువస్తే ఆ అమ్మాయిని పెళ్ళి చేసుకుంటాడు. సీత ఆత్మహత్య చేసుకుంటుంది. కాని తరువాత అతని భార్య అనసూయ సంపాదించిన డబ్బు వివరాలు అడిగి లోకం అనుకునే మాటలను విప్పి చెప్పినప్పుడు ప్రసాదరావు అక్క నీతిని ప్రశ్నిస్తాడు. అప్పటి దాకా తన ఖర్చులకు డబ్బు వస్తుంటే అది ఎలా వస్తుందో పట్టించుకోక తన అవసరాలు తీరితే చాలు అనుకుని చేయరాని పనులు చెసిన అతను కూడా పెళ్ళితో వచ్చిన పెద్ద మనిషి హోదాతో అక్కను ప్రశ్నించడానికి సందేహించడు. లోకంలో నీత మంతులు నీతి అనే విషయాన్ని ఉపయోగించుకునే విధానాన్ని, నీతి అనే ముసుగు చాటున దాక్కుని ఉన్న నిజమైన మానవ నైజాన్ని రచయిత ఈ కథలో చూపే ప్రయత్నం చేస్తారు.
‘వింత లోకం” అనే కథలొ ప్రపంచం నాశనమయి నాలుగు దేశాలనుండి ప్రాణాలతో బైటపడిన నలుగురు తాము జీవించిన దేశాలలో మానవ తప్పిదాలను, మానవ స్వార్దాన్నిగురించి మాట్లాడుకుంటూ చివరకు జీవితం అంటే ప్రతి ఒకరి సహకారంతో అందరూ ఆనందంగా జీవించడం అని, భవిష్యత్ తరాల వారికి చెబుదాం” అనుకుని తిరిగి తమ జీవితాలను నిర్మించుకునే ప్రయత్నంలో పడటం కనిపిస్తుంది. “అద్రుష్టహీనుడు” అన్న కథలో ధనానికి, మానవ సంబంధాల మధ్య ఊగిసలాడుతూ, మన వారంటూ లేని ప్రపంచంలో ధనం సుఖాన్నివ్వదని తెలుసుకోవడం కనిపిస్తుంది. “క్షణంలో సగం” అనే కథ రాజకీయాలలో ని అవినీతిని చూపిస్తుంది. “వింత ప్రేమ”కథలో శృంగారంలో శారీరిక హీంస ను ఆనందించే ఒక జంట ను చూపిస్తారు రచయిత. 1963 లో రాసిన ఈ కథలో ఇప్పుడు కూడా చర్చించుకోవడానికి సిద్దపడని మాసోచిస్ట్ బిహేవియర్ గురించి రచయిత బాహాటంగా చెప్పుకొచ్చారు. ఇటువంటి లక్షణాలు స్త్రీ పురుషులిద్దరిలో కూడా ఉంటాయి అని చెప్పడానికి ఆ రోజుల్లో చాలా ధైర్యం ఉండాలి. శారద గారిలో సూటిగా విషయాలను చెప్పే నైజం కనిపిస్తుంది. “స్వార్ధపరుడు” అనే కథలో ఒక డబ్బున్న కుంటి అమ్మాయిని తన ఉన్నతి కోసం పెళ్ళి చేసుకున్న ఒక యువకుడు కనిపిస్తాడు. కాని అతని ధన దాహానికి లొంగక అతను తనను వదిలేస్తాడన్నా భయపడని ఆ స్త్రీ ధైర్యాన్ని చూపుతూ ఏ మాత్రం ఇన్పీరియారిటి కాంప్లెక్స్ లేని కారణంగా ఆమె కథ దుఖాంతమయిందని వ్యంగ్యంగా చెబుతూ, ఎన్నో సుఖాంతమయినా కాపురాల గుట్టు విప్పుతారు రచయిత. ‘ఆకర్షణ” అనే కథలో వివాహానికి ముందు సెక్స్ ని ఎంజాయ్ చెసే ఒక జంట కనిపిస్తారు. చివరకు వీరే వివాహంతో ఒక్కటవ్వడం చూస్తాం. వివాహం ముందు పురుషునితో సంబంధాన్ని ఇష్టపూర్వకంగా అంగీకరించి మరో వివాహానిని పురుషుని వలే సిద్దపడిన ఒక స్త్రీ కథను అరవైలో రాసిన ఈ రచయిత ఈ నాటీ బోల్డ్ రచయితలకెక్కడా తీసిపోడు. అలాగే ఒకరినొకరు మోసం చెసుకుని తమ అసలు విషయాలని దాచిపెట్టి మోసంతో దగ్గరయిన ఒక విటుడు ఒక వేశ్యల కథ “హరిశ్చంద్రుడు”. మనిషి జీవితం ఎన్ని అబద్దాల మధ్య ఎన్ని రకాల పరదాల చాటున నడుస్తుందో చెప్పే కథ ఇది.
“మరలోచక్రం” అత్యద్బుతమైన కథ. ఈ సమాజంలో స్త్రీపై జరుగుతున్న కండీషనింగ్ గురించి చెప్పిన గొప్ప కథ ఇది. సాంప్రదాయబద్దంగా ఒక తండ్రి కూతురుని పెంచుతాడు. ఆ తండ్రి భావాలనే తన భావాలుగా చెసుకుని, తాను అలాగే సాంప్రదాయబద్దంగా ఉండాలని కోరుకుని, అలానే జీవిస్తుంది ఆ అమ్మాయి. ఆమెకు ఒక ఆధునిక భావాలున్న అన్న ఉంటాడు. అతను ఆ అమ్మాయికి సమాజాన్ని చూపించి తన కళ్లతో దాన్ని అర్ధం చేసుకోవడం చెల్లెలికి నేర్పిస్తాడు. జీవితం లో పెళ్ళి పిల్లలు ముఖ్యం కాదని సమాజానికి సేవ చేయాలని ఉద్యమంలో పని చేయాలని అదే జీవితాదర్శం అని చెప్తాడు. అన్న ప్రభావంతో ఆమె సామాజిక కార్యకలాపాలలో పాల్గొంటుంది. అదే జీవితం అని నమ్ముతుంది. అలాగే జీవిస్తుంది. ఉద్యమంలో పని చేస్తున్నప్పుడు ఆమెకు ఒక దళిత యువకుడు పరిచయం అవుతాడు. ఇద్దరూ వివాహం చేసుకుంటారు. అతను స్తీ సంస్కరణ అని సమాజాన్ని మార్చాలి అని ఆమె చదివే సాహిత్యం మొదలుకుని, ఆమెకు సంబంధించిన ప్రతి చిన్న విషయంలో తన భావజాలాన్ని చొప్పిస్తాడు. ఆమె జీవితం అతని పంధాలో నడుస్తుంది. అతన్ని పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు తప్పని పరిస్థితులలో ఒక హోటలతని ఉంపుడుగత్తెగా ఆమె మారుతుంది. చివరకు తనకు అక్కడే జీవితం సుఖంగా ఉందని చెబుతుంది “అతనికేమీ ఆదర్శాలు లేవు. వాటి వెనకాల నేను తిరగక్కర్లేదు. నన్నేమన్నా అంటే ఇంకెక్కడికన్నా పోతానేమో అనే భయంతొ నన్నేమీ అనకుండా ఊరుకుంటున్నడతను. ప్రస్తుతం నేపు పూర్వం ఏ రోజు కన్నా కూడా లేనంత స్వేచ్చగా, కులాసాగా ఉన్నానని చెప్పగలను” అంటుంది. స్త్రీ మెదడును స్వయంగా ఎదగనీయకుండా ఎవరు తోచిన భావాల్తో వారు స్త్రీల జీవితాలను నియంత్రించడం, తమకేం కావాలో తెలియని జీవితాలను స్త్రీలు అర్ధం కాని అయోమయంలో జీవించడాన్ని ఎంతో సున్నితంగా ఒక తండ్రి, అన్న, భర్త వద్ద కూడా లేని స్వేచ్చను ఉంఛుకున్నవాడి దగ్గర అనుభవిస్తున్న ఒక సామాన్య మహిళ జీవితం ద్వారా శారద గారు చెప్పారు. స్త్రీ జీవితంలోని విషాదాన్ని ఇంతకన్నా గొప్పగా ఎవరూ చెప్పలేరేమో కూడా.
“వింత ప్రకృతి” అన్న కథలో భర్త నుండి పారిపోయి ప్రియునితో జీవిస్తున్న ఒక స్త్రీ మళ్ళి భర్త కనిపించినప్పుడు కేవలం శారీరిక తోడు కోసం అతనితో రాత్రి గడపడం చూస్తాం. శారీరిక సుఖం స్త్రీకి కూడా అవసరం అని, అ ఆవసరాన్ని సహజం అని నమ్మి దానికి నైతికత అనే ముసుగు వేయకుండా తీర్చుకునే స్త్రీలు కూడా ఉంటారని చెప్పగలిగారు రచయిత ఈ కథలో. రచయిత రాసే కథలకు అతని జీవితానికి పొంతన ఉండక్కర్లేదని, తన కథలలో స్వర్గం సృష్టించే రచయిత నిజజీవితం స్వర్గంలా ఉండదనే వాస్తవాన్ని చూపే కథ “చిరంజీవి కథ”
“గొప్ప వాడి భార్య” గాంధీ కస్తూర్బాల మధ్య సంబంధం పై రచయిత ప్రయోగించిన వ్యంగ్యాస్త్రం. గాంధీ గారి సుగుణాల మధ్య భార్య స్థానంలో ఉండి ఆవిడ పడిన బాధను తన దైన శైలిలో చెప్తారు రచయిత. ఇది కేవలం ఒక్క పేజీ కథ. కథలోపాత్రల పేర్లు రావు. కాని వారి గుణలను ప్రస్తావిస్తూ , ఆ కథ ఎవరి గురించి రాసారో అందరికీ అర్ధం అయేలా రాసారు రచయిత. ఈ కథను 1948 లో రాసారు. అప్పట్లో గాంధేయవాదులు దీన్ని ఎలా స్వీకరించారో కాని ఒక గొప్ప స్త్రీ వాద కథగా దీన్ని పరిగణించవచ్చు. “పరిశోధన” కథలో కూడా ఎన్ని ప్రయోగాలు చేసినా కూడా స్త్రీని అర్ధం చేసుకోవడానికి పురుషుడింకా అర్హత సాధించలేదనే విమర్శాత్మక సందేశాన్ని ఇస్తారు. “సంస్కరణ” అనే కథలో సంస్కరణల పేరుతో మూర్ఖంగా ప్రవర్తిస్తున్న సంస్కర్తల పై వ్యంగ్యంగా ప్రశ్నలను గుప్పిస్తారు.
“పిరికి ప్రియుడు” కథలో ఒక వివాహిత తో సంబంధం పెట్టుకుని ఆమెను అండగా ఉండవలసిన సమయం వచ్చినప్పుడు ఆ ప్రియుడు పారిపోతే ఆ యువతి ఆ మోసాన్ని తట్టుకోలేక, భర్త క్రూరత్వాన్ని ఎదుర్కోలేక కాల్చుకుని చనిపోతుంది. అయితే ఆమె మరణం, కనిపించకుండా పోయిన ఆ ప్రియిడి విషయం తెలిస్తే లోకానికి వారి మధ్య ఉన్న సంబంధం తెలిసిపోతుందని, దానితో తన పరువు పోతుందని ఆ ప్రియుడిని వెతికి పిల్చి బ్రతిమాలి తిరిగి తన వద్ద ఉద్యోగంలో చేర్చుకోవాలని ప్రయత్నిస్తున్న ఆ నీతిమంతుడైన భర్త లోని లోకభయం ముసుగులో దాగున్న స్వార్ధం కనిపిస్తుంది. వివాహేతర సంబంధాల పై లోకం ప్రదర్శించే అత్యుత్సాహం “రహస్యం” అనే కథలో తెలుస్తుంది. స్వతంత్ర్యం ఎంత అర్ధరహితంగా మారిందో చెప్పే కథ “స్వాతంత్ర స్వరూపం”. నైజాం సైనికులు కూడా ప్రజా ఉద్యమంలోకి రావడం చెప్పిన కథ “కొత్త వార్త”. అదే నేపద్యంలో ప్రజాసైనికుల మధ్య నిజాం సైనికుల మధ్య జరిగిన ఒక పోరును “గెరిల్లా గోవింధు” అన్న కథలో చూస్తాం. మద్రాస్ రాష్ట్రం మాది, కాదు మాది అని కొట్టుకున్నఒక తెలుగువాడు మరో అరవవాడు చివరికి రాష్ట్రాలు ఎవరివైనా తమ జీవితాలలో మార్పు ఉండదని తమ పాట్లు తామే పడాలని అర్ధం చేసుకోవడం కనిపిస్తుంది “అసలు సమస్య” అన్న కథలో. “దేశమును ప్రేమించుమన్నా” అన్న అరపేజీ కథలో హిందీ నేర్చుకోవడం, నూలు వడకడం దేశభక్తి ఎలా అవుతుంది అన్న ప్రశ్న కనిపిస్తుంది. “ఆదర్శాల చిమ్మ చీకటి” అన్న కథలో ఎవరి కోసం మరణిస్తున్నామో తెలుసుకోవాలని ప్రయత్నిస్తూ ప్రాణాలు వదిలే సైనికులు కనిపిస్తారు. ఆంధ్ర జాతి విడిపోతే అభివృద్ది సాథించవచ్చనే ఆశావాహ దృక్పధంతో రాసిన కథ “కోరికలే గుర్రాలయితే” తమిళుడైన ఒక యువకుడు రాసిన కథ ఇది అని చదివితే రచయిత విష్పక్షపాత వైఖరి అర్ధం అవుతుంది. బిడ్డల పెంపకంలో స్వార్దాన్ని చూపే తల్లి కథ “సంస్కారం” ఒక తిరుగుబోతు తన భార్య తన బలహీనతలను క్షమించి తనను ఆదరించింది అని సంతోషిస్తాడు. భార్య వివాహానికి పూర్వం అత్యాచారానికి గురయి ఒక బిడ్డను కనింది అని తెలిసి ఆమెను క్షమించలేకపోవడం, “సంస్కార హీనుడు” అన్న కథలో చూస్తాం. నీతిమంతుడైన ఒక అన్న, అవినీతిపరుడైన ఒక తమ్ముని కథ చెబుతూ వారిలోని నిజమైన వ్యక్తిత్వాలను చూపిస్తారు “మర్యాదస్తుడు” అన్న కథలో.
వీరి కథలన్నిటిలో కూడా ఒక కామన్ పాయింట్ కనిపిస్తుంది. అది మర్యాద ముసుగులో మనుష్యులు ఒకరినొకరు మోస పుచ్చుకోవడం. వీరి పాత్రలన్నీ కూడా మధ్యతరగతి కి సంబంధించినవి. అంతులేని అభద్రత వారిలో కనిపిస్తూ ఉంటుంది. సమాజం తమని ఆమోదించాలనే పిచ్చ ప్రయత్నం ప్రతి ఒక్క పాత్రలో ఉంటుంది. సహజమైన భావలను అణిచి అసహజంగా జీవించే అసహాయిలు కనిపిస్తారు. వీరి మధ్య ఉన్న ధైర్యవంతులు కూడా తమ జీవితాలను ఎదుర్కుంటూ కనిపిస్తారు కాని ప్రతిఘటించే మనస్తత్వం కనిపించదు. ప్రతిఘటించడం కన్నా పరిస్థితులను తమకు అనుకూలంగా తిప్పుకుని, లౌక్యంతో ఆ ముసుగులోనే జీవించే సహజమైన మనుష్యులు వారంతా.
వీరి కథలలో మనలను ఆకట్టుకునేది కథను వీరు ముగించే విధానం. ఒక గొప్ప మాటతో, ఆలోచనతో, ఆ కథలు ముగుస్తాయి. చాలా కథలలో ఆఖరి వాక్యాలు మనసుకు తగులుతాయి. ఆ కథ వెనుక ఉన్న ఉద్దేశాన్ని చాలా సూటీగా ఆ చివరి వాక్యాలు ప్రకటిస్తాయి. కథకు ముగుంపు చాలా ముఖ్యం. కథలో వివరాలు కొన్ని రోజులు మరచిపోయినా ఆ ముగింపు వాక్యాలు మాత్రం చాలా కాలం వెంటాడుతాయి. ఉదాహరణకు “శవం విలువ” అన్న కథలో ఆఖరి వాక్యం చూడండి “లోకం తనను తాను మభ్యపెట్టుకుంటుంది. ఆ లోకాన్నే మభ్యపెట్టడం కొందరి కవసరం అవుతుంది” ఇలా ముగించిన ఆ కథ ను మర్చిపోలేం. అలాగే “జీవిత సారం” అనే మరో కథలో “వేలుకి, కాలుకి ఐతే విలువకట్టగలం కాని ప్రాణానికి విలువేమిటీ” అని ప్రశ్నిస్తారు. “ఎగిరే పళ్ళేం” అనే మరో కథలో “మానవ జాతిచరిత్ర పరస్పర ఆత్మవిశ్వాసాలతో ప్రారంభమై నడుస్తుంది” అని అంటారు. ఆ ఆఖరి వాక్యాలు చాలా పదునుగా ఉంటాయి. సూటిగా ఉంటాయి. చాలా కథలలో ఆ చివరి వాక్యాలలో అదే శైలిని వారు ఉపయోగిస్తారు.
సమాజాన్ని ఎంతో దగ్గరగా పరిశీలించి, మానవ స్వభావాన్ని అధ్యయనం చెసి తన కలంతో మనిషి మనసులోని పొరలను దాటి అతని నిజమైన వ్యక్తిత్వాన్ని నిజాయితీగా ప్రకటించే ప్రయత్నం రచయిత చేసారు. అందుకే వీరి కథలు చదవడం అంటే మనిషిని చదవడం, మనసుల్ని చదవడం. జీవితాన్ని చదవడం. తెలుగువారందరూ రుణపడి ఉండవలసిన గొప్ప రచయిత శారద. వీరి రచనలలో మనలను ఆకట్టుకునేది వీరి నిజాయితీ. రచయిత నిజాయితీగా రాయడానికి బలమైన వ్యక్తిత్వం, ధీటైన అనుభవాలు కావాలి. శారద గారిని ఆ రెండూ రచయితగా నడిపించాయని వీరి కథలు చదువుతుంటే అర్ధం అవుతుంది.
****
హిందీలో పీ.ఎచ్.డీ చేసారు. రైల్వే జూనియర్ కాలేజీలో హిందీ లెక్చరర్ గా పనిచేస్తున్నారు. స్ప్రెడింగ్ లైట్ పేరుతో తార్నాకలో బుక్ క్లబ్ నడుపుతున్నారు. దాదాపు 1000 పుస్తక సమీక్షలు, 1500 సినిమా సమీక్షలు రాసారు.