“ప్రేమా….పరువా”
(ద్వితీయ వార్షిక సంచిక కథల పోటీ రచన)
– వడలి లక్ష్మీనాథ్
“మేఘనా! ఇంకొకసారి ఆలోచించుకో… ఈ ప్రయాణం అవసరమా! ఇప్పటికైనా నీ నిర్ణయాన్ని మార్చుకో, చందు చెప్పిన ప్రతీపని చెయ్యాలని లేదు” కదులుతున్న బస్సు కిటికీ దగ్గర నుండి చెబుతున్నాడు కార్తీక్.
“నేను ఆలోచించే బయల్దేరాను, డోంట్ వర్రీ! చందు చెప్పబట్టే కదా! నేను నిన్ను పెళ్ళి చేసుకున్నాను” చెప్పింది మేఘన. మాటల్లో ఉండగానే బస్సు హారన్ కొట్టుకుంటూ బయలుదేరింది.
బస్సు పొలిమేరలు దాటి రోడ్డు ఎక్కింది. మేఘన ఆలోచనలు వెళ్ళబోయే ప్రయాణం చుట్టూ తిరుగుతున్నాయి.
“ఎక్కడి దాకా వెళ్తున్నారు?” పక్క సీట్లో ఉన్న స్త్రీ
అడగడంతో ఉలిక్కిపడింది మేఘన.
” శివపురం” చెప్పింది మేఘన.
శివపురం తలచుకొనే సరికి మేఘన మనసులో ఏవేవో గుర్తులు, ఆలోచనలు కొన్ని ఏళ్ల వెనక్కి వెళ్లిపోయాయి……
” ఆ ఊరు గురించి వాకబు చేస్తే అది పల్లెటూరని తెలిసింది. నువ్వు ఇప్పటి వరకు పట్నం దాటి వెళ్లలేదు. ఏ సౌకర్యాలు లేని అలాంటి పల్లెటూరులో ఉండడం చాలా కష్టం. నీకు ఇష్టమని డాక్టర్ చదివిస్తే, ఇప్పుడు ఇలా పల్లెటూర్లలో సర్వీస్ చెయ్యాలి అంటున్నావు. పెళ్లి కాని ఆడపిల్లవి, ఒక్కదాన్ని అంత దూరం పంపించడం ఎంత వరకూ సబబు” అన్నాడు అన్నయ్య చందు.
“ఒక సంవత్సరము తప్పనిసరిగా రూరల్ సర్వీసు చెయ్యాలి అన్నయ్య. నాకు అలాంటి చోట పని చేయడము ఇష్టమే. ఇప్పుడు ఇంకా నాకు పెళ్లి కాలేదు, ఏ బాదరబందీ లేదు. అవన్నీ ఉన్నప్పుడు ఇటువంటి సర్వీస్ చేయడం చాలా కష్టం” సమాధానమిచ్చింది మేఘన.
“అదే కదా! మేము కూడా అనుకుంటున్నది. నిన్ను ఒక అయ్య చేతిలో పెట్టాక, నువ్వు ఎక్కడికి వెళ్లినా మాకు ఇబ్బంది లేదు. కానీ, ఆడపిల్లని ఒంటరిగా అలా వదలలేక పోతున్నాము” అన్నది అమ్మ.
“ప్రతీ పనికి పెళ్ళితోనే లింకు పెడతారు, వీళ్లిద్దరూ. చూడండి నాన్నా!” అంది తండ్రి వైపు చూస్తూ గోముగా.
“సంవత్సరం ఎంతలో తిరిగి వస్తుంది. జాగ్రత్తగా వెళ్ళిరా తల్లి” అన్నాడు తండ్రి.
శివపురానికి మేఘన, వాళ్ళ అమ్మ కమల ఇద్దరూ కలిసి, సామాను సర్దుకుని బయలుదేరారు.
మేఘన శివపురంలాంటి పల్లెటూరుని పుట్టినప్పటినుంచి చూడలేదు. ప్రైమరీ హెల్త్ సెంటర్ లో డాక్టర్ విధులు నిర్వహించడానికి వచ్చింది. ఊరులో అందరూ తమ ప్రాణాలు కాపాడటానికి వచ్చిన దేవతను చూసినట్టు స్వాగతం పలికారు. హాస్పటల్లో పక్కనే ఒక రూమ్ ఉంటే ఇచ్చారు. రూము చిన్నదైనా అన్ని సౌకర్యాలు ఉన్నాయి. కమల రెండు రోజులు ఉండి, అన్నీ సర్దిపెట్టి, ఇంటి పనిలో సహాయం చేయడానికి హాస్పటల్లోనే ఆయాగా పనిచేసే గంగని మాట్లాడి వెళ్ళింది.
బయలుదేరే ముందు కమల “ఇంతవరకు చాలా సార్లు చెప్పాను, చెప్పిందే మళ్లీ చెప్తున్నాను అనుకోకు. సరేనా! నీ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. మీ మేనత్తను చూసావు కదా! ఆవిడ ప్రేమించిన పాపానికి, పరువు కోసం పెళ్ళైన పదిహేను రోజులకే భర్తని పోగొట్టుకుంది. పరువు కోసం ప్రాణమిచ్చే కుటుంబం మనది. కాబట్టి, నువ్వు నీ జాగ్రత్తలో ఉంటావని నాకు తెలుసు. కానీ ఇంకొకసారి చెప్తున్నాను” అని హెచ్చరించింది.
“ఈ ఊరు చూసి కూడా నీకు ఇలాంటి ఆలోచన ఎలా వచ్చింది. నేను ప్రేమించడానికి సరిపడా హీరోలెవరూ ఇక్కడ దొరకరు. నువ్వు బెంగ పెట్టుకోకు. నేను కాలేజీలోనే జాగ్రత్తగా ఉన్నాను. ఇప్పుడూ జాగ్రత్తగానే ఉంటాను” నవ్వుతూ అంది మేఘన.
తల్లి వెళ్ళిన దగ్గర్నుంచి మేఘనకి చాలా ఒంటరిగా అనిపించడం మొదలైంది. హడావిడిగా ఉండే జీవితంలో, పల్లెటూరి నిశ్శబ్దంతో తోచేది కాదు. ఆ ఊరిలో నిరక్షరాస్యత ఎక్కువ. ఉన్న ఒక్క బడిలో చదువు అంతంత మాత్రంగానే ఉండేది. ఊరిలో జనాలు ఎక్కువమటుకు అనారోగ్యం వస్తే, నాటు వైద్యం, తాయత్తులు కట్టించుకోవడం మీద ఆధార పడే వాళ్ళు.
అడపా దడపా వచ్చే పేషెంట్లతోనూ, ఇంటి పని కోసం వచ్చే గంగతోనూ మాత్రమే కాలక్షేపం అయ్యేది మేఘనకి.
గంగ కొడుకు కుమార్ యుక్తవయసువాడు. గంగ గురించిన వివరాలు తెలుసుకొని ఆశ్చర్యపోయింది మేఘన. ప్రేమించిన యాదగిరితో లేచి పోయి, పెళ్ళిచేసుకుంది గంగ. దాని ఫలితంగా పుట్టినవాడు కుమార్. యాదగిరి అకాల మరణంతో గంగ పిల్లవాడితో సహా వంటరి జీవితం సాగిస్తోంది. ఊరిలో ఎవరు ఎన్ని చెప్పినా మళ్లీ పెళ్లి చేసుకోలేదు.
“ఇలా ఒంటరిగా ఎన్నాళ్ళుంటావు? మళ్లీ పెళ్ళి చేసుకోవచ్చు కదా!” అని అడిగింది మేఘన.
“నా కొడుకుని చూసుకుంటూ బతుకుతాను. వాడు నాకు యాదగిరి ఇచ్చిన గుర్తు. మళ్ళీ పెళ్ళి చేసుకుంటే, వచ్చిన వాడు నన్ను ఇష్టపడతాడేమో కానీ, నా కొడుకుని చూసుకోడు. అటు తండ్రిని పోగొట్టుకుని, ఇటు నేను వదిలేస్తే వాడు దిక్కు లేని వాడు అయిపోతాడు” అని సమాధానమిచ్చింది గంగ.
ఒకనాడు గంగ “అమ్మా! కుమార్ ని పిలిచి కొంచెం బుద్ధి చెప్పండి. నా ఆశలన్నీ వాడి మీదే పెట్టుకొని బతుకుతున్నాను. వాడు బడికి వెళ్ళకుండా, చదవక, అల్లరిచిల్లరిగా తిరుగుతున్నాడు. ఇలా తిరిగితే వాడు రేపు యోగ్యుడు ఎలా అవుతాడు? కొంచెం మీరైనా చెప్పండి” బతిమిలాడింది.
మేఘన వాడిని కూర్చోబెట్టి, చదువు విలువలు చెప్పి “అమ్మ నీకోసం ఎంత కష్టపడుతుంది. పెద్దయ్యాకా నువ్వు ప్రయోజకుడవై అమ్మను సుఖపెట్టాలి” అని హితవు పలికింది.
మేఘన చెప్పే తీరుకి మంత్ర ముగ్ఢుడై వినసాగాడు కుమార్.
అటు తర్వాత మేఘన మాట అంటే వాడు
వేదవాక్కులా, తూచా తప్పకుండా పాటించేవాడు. ఏం చెప్పినా వినేవాడు. దాంతో మేఘన కుమార్ యందు ప్రత్యేక శ్రద్ధ పెట్టి, వాడికి విద్యాబుద్ధులు నేర్పించేది.
అప్పుడే, ఆ ఊర్లోకి ప్రవేశించాడు బెనర్జీ. ఆ వూరిలో ప్రబలి ఉన్న మూఢనమ్మకాల మీద రీసెర్చ్ చేయడానికి వచ్చిన రీసెర్చ్ స్టూడెంట్. బెనర్జీకి సహకరించడానికి ఆ ఊరిలో ఎవరికీ భాషరాదు. దాంతో ఊరి పెద్దల, మరియు బెనర్జీ కోరిక మీద అతనికి సహకరించడానికి ఒప్పుకొంది మేఘన. తీరిక సమయంలో బెనర్జీతో పాటు అతని రీసెర్చ్ కావాల్సినవి, ఊరి వాళ్లని అడుగుతూ తర్జుమా చేసి చెప్పేది.
కుమార్ కూడా వాళ్లతో పాటు తిరుగుతూ ఉండేవాడు. వీళ్లిద్దరి మాటలు విని కుమార్ చురుగ్గా తయారవ్వడంతో గంగ ఉప్పొంగి పోయింది. మేఘన కూడా బెనర్జీతో ఊరిలో ఉన్న మూఢనమ్మకాల మీద కొంతసేపు డిస్కషన్స్ పెట్టుకునేది. బెనర్జీ తొందర్లోనే మేఘనకి చాలా దగ్గరయ్యాడు.
మేఘన, బెనర్జీకి ఆకర్షితురాలవుతుందనే విషయం గ్రహించి, తనకు తానే ఆశ్చర్యపోయింది. జీవితంలో యుక్తవయసు నుంచి ఇప్పటి దాకా ఎంత మంది పురుషులు ఎదురుపడినా తనని ఆకర్షించలేక పోయారు. కానీ, బెనర్జీ విషయంలో తన మనస్సు తన మాట వినటంలేదు. ఎప్పుడూ బెనర్జీ సాన్నిహిత్యాన్నే కోరుకుంటోంది. మొదటి సారిగా కుటుంబాన్ని, అమ్మ మాటలను తలచుకొని భయపడింది.
బెనర్జీ రూపము, భాషా ఇవేమీ తనను ఆకట్టుకోలేదు. అమితమైన అతని మేధాశక్తి మేఘనను అతని గురించి ఆలోచించేలా చేసాయి.
బెనర్జీ కూడా తనతో ఉన్నప్పుడు చాలా ఉత్సాహంగా, ప్రేమగా ఉండడం గుర్తించింది మేఘన.
అతని ప్రేమలో నిజాయితీ, ఆరాధన కనిపించింది మేఘనకి. ఒక స్త్రీ, ఒక పురుషుడి చూపులో తనపై ఉన్నది ప్రేమా, ఆరాధన, ఆకర్షణా లేక కామమా అన్నది, ఆ పురుషుడి ప్రవర్తనలో ఆ స్త్రీ మాత్రమే పసిగడుతుంది.
ఒకనాడు గంగ మేఘనతో, “అమ్మా! బెనర్జీ గారు తమరంటే చాలా ఇష్టపడుతున్నారు. మా కుమార్ తో చెప్పి, నన్ను ఒక్కసారి మీ మనసులోని విషయము తెలుసుకోమని చెప్పారు. మనసుపడ్డ వాడిని మనువాడితే, అతనితో ఒక రోజు జీవితం గడిపినా జీవితకాలమంతా గుర్తుంటాయి. మనసు లేని మనువు ఎన్ని సంవత్సరాలున్నా అది అంత తృప్తినివ్వదు” అని చెప్పింది.
అప్పుడు ఆమెకి వాళ్ళమ్మ హెచ్చరికలు గుర్తుకు వచ్చాయి. ఈ విషయంలో మేనత్త భర్తలాగే బెనర్జీని కూడా ముక్కలు, ముక్కలుగా చేస్తారు.
” ఒక ప్రేమ ఒక మనిషిని బలి తీసుకుంటుందని తెలిసినప్పుడు…….ప్రేమ కంటే మనిషిని కాపాడుకోవడం ముఖ్యం……నేను అతన్ని పెళ్ళి చేసుకుని, వాళ్ల నుండి అతన్ని కాపాడ లేను….ఎక్కడున్నా అతని శ్రేయస్సు నాకు కావాలి” అని చెప్పి ఆలోచనలో పడింది మేఘన.
ఆ తరువాత బెనర్జీ అంతే చనువుగా వున్నా, ప్రేమ ప్రస్తావన కానీ, పెళ్ళి ప్రస్తావన కానీ తీసుకొని రాలేదు.
ఒక ఆరునెలలు గడవగానే బెనర్జీ ప్రాజెక్ట్ అయిపోయింది. అతను వెళ్ళిపోతున్నాడు.
బెనర్జీ మనసు విప్పి, “నీ స్నేహం నాకు కొత్త
ఊపిరి నింపింది. నేను నిన్ను
ఇష్టపడుతున్నాను. ఆ ఇష్టాన్ని నా తోడుగా మార్చుకోవాలని ఉంది. మన ఇద్దరి కలయిక ఒక మంచి జీవితాన్నిస్తుందని అనుకుంటున్నాను ” అన్నాడు.
“పరువు కోసం హత్య చేసే కుటుంబం మాది. నీ అభిమానాన్ని నేను నా మనసులో పదిలంగా భద్ర
పరచుకోవాలని అనుకుంటున్నాను. బెనర్జీ! నిన్ను నా స్వార్ధం కోసం పోగొట్టుకోలేను” చెప్పింది.
“వాళ్ళని ఒప్పించి పెళ్ళి చేసుకొందాము” అన్నాడు బెనర్జీ.
“అది జరిగే పని కాదు. మా అత్త జీవితం మోడుబారి, ప్రేమించిన వాడిని పొగొట్టుకొని….కన్న వాళ్ళ కర్కశత్వం తో వాళ్ళని దూరం చేసుకొని….ఎటుగాని జీవితాన్ని…… కళ్ల ఎదురుకుండా చూస్తూనే ఉన్నాను…..అటువంటి జీవితం నేను కోరుకోవటంలేదు. ఇక్కడితో వదిలెయ్యడము ఉత్తమము” చెప్పింది మేఘన.
చేసేది లేక తిరుగు ప్రయాణమయ్యాడు బెనర్జీ.
వెళ్ళిపోతున్నప్పుడు, అతనితో ఎంత అనురక్తి ఏర్పడిందో అన్నది తన మనసులోనే అనుకుని హతాశురాలై పోయింది మేఘన.
ఒకనాడు బెనర్జీ తిరిగి శివపురం ఊర్లో
ప్రత్యక్షమయ్యాడు. కారణం ఏమిటి అని మేఘన అడిగితే రీసెర్చ్ లో ఇంకా కొంచెం మిగిలి ఉందని చెప్పాడు. కానీ, అది కల్పించుకుని చెప్పిన సమాధానంలాగా అనిపించింది మేఘనకి.
బెనర్జీతో కలయిక తన జీవితంలో ఒక సుందర స్వప్నం లాగే దాచుకోవడం మంచిది. ఇంత ఇష్టుడైన అతని జీవితాన్ని అర్ధాంతరంగా ముగించ కూడదని గట్టిగా తనకు తానే చెప్పుకొంది.
ఓ రోజు సాయంత్రం బెనర్జీ మేఘన మీద ఉన్న ఇష్టాన్ని మళ్ళీ వ్యక్తపరుస్తూ “మేఘనా! మనిద్దరం కలిసి ఒక మంచి జీవితం గడపాలని నాకనిపిస్తోంది. ధైర్యంగా నిలబడుదాము, నేను మీ పెద్దలతో మాట్లాడుతానుగా ” అంటూ చెప్పాడు.
దానికి మేఘన తనకి అటువంటి ఉద్దేశం లేదని దాటవేసింది.
దానికి బెనర్జీ “నీ మనసులో ఏముందో తెలుసుకోలేనంత వెర్రివాడినయితే కాదు. మేఘన! నువ్వు కాదు అని చెప్తున్నావ్ కాబట్టి, నేను దాన్ని గౌరవిస్తున్నాను. నీకు ఎప్పుడైనా జీవితంలో నేను కావాలనిపిస్తే, నీ కోసం నేను ఎదురు చూస్తూనే ఉంటాను కాదనకు ” అంటూ సెలవు పుచ్చుకున్నాడు.
తర్వాత ఆమెకి పోస్టింగ్ హైదరాబాద్ రావడంతో, అక్కడి తీపి జ్ఞాపకాలను వెంటబెట్టుకొని ఊరు వదిలి బయలుదేరింది. అటుతర్వాత చాలా రోజులు పెళ్ళి చేసుకోవాలని లేదని మొండికేసింది .
బెనర్జీని మర్చి పోవడానికి చాలా కష్టపడింది, కేవలం బెనర్జీ ఎక్కడైనా క్షేమంగా బ్రతకాలని ఆశతో.
అన్నయ్య చిన్ననాటి స్నేహితుడు అయిన కార్తీక్, మేఘన మీద అభిమానం పెంచుకొని, చందు ప్రోద్భలంతో పెళ్ళి చేసుకుంది మేఘన.
కార్తీక్ ని పెళ్ళి చేసుకున్నా, బెనర్జీని ఒక స్నేహితుడిగా తన మనసులో పదిలంగా పెట్టుకుంది.
ఆ తర్వాత మళ్లీ శివపురం గుర్తు తెచ్చుకోవడమే గాని, అక్కడికెళ్ళడం ఇప్పుడే.
“మీ ఫోన్ రింగ్ అవుతుంది ఇందాకట్నుంచి “అంటూ పక్కనున్న మహిళ చెప్పేదాకా ఆ శబ్దం కూడా వినపడలేదు మేఘనకి.
ఒక నిట్టూర్పు విడిచి బ్యాగ్ లో ఉన్న ఫోన్ తీసి చూసింది……అన్నయ్య చందు నుంచి ఫోన్…… ఒక్కసారి అప్రమత్తమై “అన్నయ్య చెప్పు, అంది.
” నువ్వు బయల్దేరావా” అడిగాడు.
“ఆ, బస్సులో ఉన్నాను, అన్నయ్యా!” చెప్పింది.
“ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదు. నువ్వు వెళ్లి, వాడు ఎక్కడున్నా వాడి అడ్రస్ కనుక్కొని రావాల్సిందే. నాకు వాడు కావాలి” అంటున్నాడు చందు ఆవేశంగా.
ఆలోచనలోంచి నిద్రలోకి జారిపోయింది. తెల్లవారుజామున అందరూ దిగుతుంటే మెలకువ వచ్చింది మేఘనకి. శివపురం బస్స్టాప్….. ఇన్నేళ్ళ తర్వాత కూడా ఏ మార్పు లేదు. నెమ్మదిగా బస్సు దిగి ప్రైమరీ హెల్త్ సెంటర్ వైపుకు అడుగులేసింది. దూరం నుండే గుర్తుపట్టింది గంగ.
“అమ్మ, బాగున్నారా?” అంటూ వచ్చి చేతిలోని బ్యాగ్ ని అందుకుంది. గంగ ముఖము పట్టలేనంత ఆనందంగా ఉంది.
గంగ తనకున్న చిన్న పెంకుటింట్లోకి తీసుకొని వెళ్లింది. ఇంటిని చాలా తీరువుగా సర్దుకుంది.
ఉన్నది ఒక్క రూమ్ ఐనా శుభ్రంగా ఉంచుకుంది. స్నానము అవగానే కొంతసేపు అలసట తీర్చుకున్న మేఘన, “గంగ, కుమార్ ఎక్కడున్నాడు? ఏం చేస్తున్నాడు?” అడిగింది.
గంగ ” ఎక్కడో ఉన్నాడమ్మా. ఏదన్నా నాది ఒంటరి జీవితం” అంటూ దాటేసింది.
“అమ్మ, మీరు పెళ్లి చేసుకున్నట్టున్నారు” అంది గంగ.
“అవును గంగా! ” ముక్తసరిగా చెప్పింది మేఘన. ఆ వివరాలు చెప్పడం ఇష్టం లేనట్టు.
“నువ్వు ఇప్పటికీ ఒంటరి గానే ఉన్నావా? మళ్ళీ పెళ్లి చేసుకోలేదు” అడిగింది గంగని.
“మనస్సుకు నచ్చిన వారితో మనువు కలకాలం మనస్సులోనే ఉంది. నా యాదగిరి గుర్తులు నాతోనే ఉన్నాయి, నాకు మళ్లీ పెళ్లి ఏంటమ్మా” పేలవంగా నవ్వుతోంది.
చందు నుండి ఫోన్ “దొరికాడా? ఏమైనా వివరాలు తెలిసాయా? చెప్పు” కంగారుగా అడుగుతున్నాడు.
“లేదు అన్నయ్యా! వాకబు చేస్తున్నాను….నువ్వు ఎక్కువ ఆలోచించకు” అని ఫోన్ పెట్టేసింది.
“అమ్మా, మీరు రెస్ట్ తీసుకోండి. నేను ఆసుపత్రికి వెళ్ళి వచ్చేస్తాను. భోజనము అక్కడ ఉంది…ఈ పేదింటి భోజనం ఎలా ఉందో రుచి చూడండి” అంది.
“అదేంటి గంగా అలా అంటావు. నువ్వు వెళ్లిరా, నేను భోజనము చేసి రెస్టు తీసుకొంటాను” చెప్పింది మేఘన.
భోజనము చేసి ఆలోచనలో పడింది మేఘన….
వచ్చిన పని ముగించుకొని తొందరగా వెనక్కి వెళ్లాలి…..అందరికీ చాలా మంచిగా కనపడే కార్తీక్, తన మాట కాదన్నప్పుడు తనకి నరకం చూపిస్తాడు.
అతని ఆ రూపం ఎవరికీ తెలియదు…..అన్న
స్నేహితుడు కదా…ఒకళ్ళని చూస్తే ఇంకొకరిని చూడక్కరలేదు.
సాయంత్రం పని ముగించుకుని ఇంటికి వచ్చాకా, గంగ కూరలు తరుగుతూ,
” అమ్మా, మీరెళ్ళిన కొన్ని రోజులకు బెనర్జీగారు మళ్ళీ వచ్చారు.”
మేఘన ఆ మాట విని “ఎలా ఉన్నారు? ఇప్పుడు ఎక్కడ ఉన్నారు?” అడిగింది ఆసక్తిగా.
“అవన్నీ తెలీదమ్మా! మీరు ఏమన్నా ఈ ఊరు వైపు వచ్చారేమోనని అడిగి తెలుసుకుందికి వచ్చారు. ఆయన ఇంకా పెళ్లి చేసుకోలేదు” మేఘన ముఖం పాలిపోయింది.
రాత్రి పడుకోపోయే ముందు గంగని అడిగింది మేఘన.
“గంగా! ఈ వూరిలో కొత్తగా పెళ్ళి చేసుకున్న దంపతులు ఎవరైనా వచ్చారా” అని.
“ఈ సారి అమ్మోరి జాతరలో అశుభం తగిలినాది…. అమ్మోరు పూని, వచ్చే జాతర దాకా ఎవరూ ఈ ఊరిలో మనువాడరాదని ఆజ్ఞ పెట్టింది” అంది.
మేఘన ఒక్కసారిగా నిరాశకు గురైంది.
“చిన్న ఊరు కదా గంగా! ఎవరైనా లేచిపోయి వచ్చి ఊరిలో తలదాచుకొన్నారా?” అడిగింది.
“అలాంటిదేమీ వినిపించలేదు. ఏ విషయము నన్ను దాటి పోదు” అంది.
“పడుకుందే కానీ, నిద్ర పట్టటం లేదు మేఘనకి.
గోడ మీద ఉన్న ఫోటోలను చూస్తోంది మేఘన.
గంగ కొడుకు కుమార్ తల్లితో ఉన్న ఫోటో…. ఎంత బాగున్నాడు… మంచి హుందాగా ఉన్నాడు.
గంగ వాడి గురించి అంత బాగా చెప్పలేదు…ఫోటో చూస్తే విద్యావంతుడిలాగా, ముఖంలో పరిపూర్ణత కనిపిస్తోంది.
ఫోన్ శబ్దంతో ఉలిక్కి పడి లేచింది మేఘన. బారెడు పొద్దెక్కింది.
“ఇంకా నిద్ర లేవలేదా? నీకు నిద్ర ఎలా పడుతోంది” అడిగాడు.
“లేస్తున్నాను” చెప్పింది మేఘన.
“వాళ్ల ఆచూకీ దొరికిందా?” అడిగాడు.
“అడిగాను… ఇప్పటివరకూ వరకూ ఏ సమాచారం దొరకలేదు” చెప్పింది.
“నాకు ఒక గంటలో చెప్పు మనుషులు రెడీగా వున్నారు…వాడిని వేసెయ్యడానికి” అని ఫోన్ పెట్టేసాడు.
గంగ వంట పూర్తి చేసుకొని, తన పనికి వెళ్లిపోయింది.
మేఘనకి ఆలోచనలతో ఎటూ పాలుపోవట్లేదు.
ఒక్కగానొక్క మేనకోడలు కీర్తన….ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నారు…..ఇంట్లోంచి మాయమయ్యే వరకు తెలియదు, ప్రేమలో ఉందని. రోజూ అన్న చందూనే కాలేజీలో దింపి ఇంటికి తీసుకొని వచ్చేవాడు….. పరీక్షలయ్యి స్నేహితులతో సినిమాకి వెళ్తానన్న మనిషి మళ్ళీ కనబడలేదు.
వివరాలు కనుక్కొంటే తన సీనియర్ అయిన యస్వంత్ అనే అబ్బాయితో ప్రేమలో ఉన్నట్టు తెలిసింది….
అన్న తన పరపతిని ఉపయోగించి పోలీసుల సహాయం కోసం వెళితే, “మా దగ్గరకు నిన్ననే వాళ్ళు వచ్చి ఇద్దరమూ మేజర్లమే….అంటూ ఈ పెళ్ళి సర్టిఫికెట్ జత చేసిన కాగితము మా చేతితో పెట్టి వెళ్ళారు. ఇద్దరూ మేజర్లు కాబట్టి మేము ఏమీ చెయ్యలేము” అని చేతులెత్తేసారు.
ఎంక్వయిరీ చెయ్యగా యస్వంత్ ఊరు శివపురం అని తేలింది.
దాంతో మేఘన అయితేనే వాళ్ళని పట్టుకోగలదని ఆ ఊరు పంపించాడు చందు.
సాయంత్రం గంగ ఇంటికి వచ్చింది. “గంగా! నేను వచ్చిన పని అవ్వలేదు. నేను బయలు దేరుతాను” అంది మేఘన.
“అమ్మా! రాత్రి బస్సుకి వెళ్ళండి” అని స్నానానికి వెళ్లింది.
ఏమీ తోచక గూట్లో ఉన్న ఫోటోలు చూడసాగింది మేఘన.
బెనర్జీ, కుమార్ లు కలిసి తీసుకొన్న ఫొటోలు కనిపించాయి.
బెనర్జీలో యే మార్పు లేదు….అదే అందం… అదే హుందా. ఏదో కోల్పోయానన్న చిన్న భావన కలిగింది మేఘనకి.
అలా ఫొటోలు తీసి చూస్తుంటే ఒక్కసారిగా మేఘన గుండె జల్లు మంది.
తన మేనకోడలు కీర్తన, కుమార్ లు ఆర్య సమాజ్ లో పెళ్ళి చేసుకొన్న ఫోటోలు.
అప్పుడే వచ్చిన గంగ ఒక్క ఉదుటున చేతిలోని ఫొటోలు లాక్కుంది.
“గంగా! నా దగ్గర కూడా దాపరికమా?” అడిగింది మేఘన.
“ఇది పిల్లల జీవితం అమ్మా!…..నా కళ్ల ముందు నిన్ను చెల్లెలిగా చూసుకున్నాను. బెనర్జీని ఎక్కడ చంపేస్తారో, అని మీరు మీ మనసులోని ప్రేమని చంపుకొన్నారు. కాని, బెనర్జీ మీకోసం అలాగే ఉండి పోయారు……యస్వంత్ కుమార్ నా కొడుకు.
మీరెళ్ళి పోయాకా బెనర్జీ, కుమార్ ని తీసుకొని వెళ్ళి పై చదువులు చదివించి ప్రయోజకుడిని చేసాడు.
కీర్తన,కుమార్ లు ఇష్ట పడుతున్నారని తెలుసుకొని , కీర్తన గురించి ఆరా తీశాడు…బెనర్జీ.
కీర్తన మీ మేనకోడలు, మీ కుటుంబ నేపధ్యం తెలుసుకొని….తన ప్రేమ లాగా కుమార్ ప్రేమ పరువు కోసం సమాధి కాకూడదని ధైర్యం చెప్పి……వాళ్ల ప్రేమను కాపాడడానికి, వాళ్ళకి దగ్గరుండి పెళ్ళి చేసాడు బెనర్జీ” చెప్పింది గంగ.
“ఇప్పుడు ఎక్కడన్నారు? అడిగింది మేఘన.
“ఎక్కడున్నా నేను చెప్పేది లేదు..
కావాలంటే నన్ను చంపుకొండి. తండ్రి లేకుండా కొడుకుని ఇంత విద్యావంతుడిని చేసింది చంపుకోవడం కోసం ఐతే కాదు… పిల్లలను కాపాడటం కోసమే కదా! పిల్లల్ని ఇంతకాలం పెంచి, ఇష్టమైనవన్నీ ఇచ్చినప్పుడు, మన తర్వాత జీవితకాలమంతా తోడు ఉండేవాడు, భాగస్వామిని కోరుకొన్నవాడిని ఎందుకు ఇవ్వలేము ?
ఏ దేశంలో ఉన్నారు? అని అడగకండి. నా పిల్లల్ని నేనే తప్పించాను. ఇద్దరికీ నా దగ్గర ఉన్న కొంచెం బంగారంతో పెళ్ళి చేసి, దేశం దాటించాను.
వదిలేయండి, వాళ్ళని కలకాలం బతకనివ్వండి. నాకు ఆధారమైన ఒక కొడుకుని వదులుకున్నాను, వారి ఆనందం కోసం. నాతో యాదగిరితో గడిపిన ఒక్క ఏడాది జీవితంతో, ఆ గుర్తులతో నేను ఇంత కాలం ఇష్టంగా బతుకుతున్నాను. అలాంటిది వాళ్ళకిష్టమైన జీవిత భాగస్వామితో కలకాలం సంతోషంగా ఉండేలాగ దీవించాలి” అంది గంగ.
“నీలాంటి దారి చూపే తల్లి లేక, ఆరోజు నా మనసుకి నచ్చిన వాడిని పోగొట్టుకున్నాను……బెనర్జీ విషయంలో ఈ తెగింపు లేకపోయింది….నా మేనకోడలు జీవితం అలా కానివ్వను. పరువు కోసం ప్రేమను త్యాగం చేయడం నా తరంతో ఆఖరు. మనసుకు నచ్చిన వారిని మనువాడాలి.”
అంత లోపల ఫోన్ మోగింది “వాళ్ల ఆచూకీ దొరికిందా? మేఘన! చెప్పు వాడిని నరికేయాలి” అంటున్నాడు అన్నయ్య.
“ఆ పేరుగల వాళ్ళు ఈ ఊరిలో లేరు. నువ్వు వాకబు చేసింది కరెక్ట్ కాదు, అన్నయ్యా! అది ఈ శివపురం కాకపోవచ్చు. వాళ్ల ఆచూకీ దొరకలేదు” సంతోషంగా ఫోన్ పెట్టేసింది మేఘన.
****
నా పేరు సుబ్బలక్ష్మి రాచకొండ, కలం పేరు వడలి లక్ష్మీనాథ్, స్వస్థలం. హైదరాబాద్. కథలు, కవితలు కలిపి 125 పైన రాసాను. నా రచనలు ప్రతిలిపి, కహానియా, తెలుగు కథలు.కాం., మొంస్ప్రెస్సొ వెబ్సైట్ లలో, తపస్వి మనోహరం,నెచ్చెలి పత్రికలలో ప్రచురితమయ్యాయి. మహిత సాహితి సంస్థ & నెచ్చెలి అంతర్జాల వనిత మాస పత్రిక సంయుక్తంగా నిర్వహించిన “తమిరిశ జానకీ కథా పురస్కారం ” ఉగాది కథల పోటీ 2021 కి విజేత గా నిలిచి సాధారణ ప్రచురణకు ఎన్నికైన కథ “సర్దుకొని పో”. నవ తెలుగు తేజం పత్రిక నిర్వహించిన ఉగాది కథల పోటీలో 2021 సాధారణ ప్రచురణ కు ఎన్నికైన కథ “కదలిక”. ప్రతిలిపి వారి లేఖాస్త్రం పోటీలో గెలిచి నగదు బహుమతి పొందడం నాకెంతో ఉత్సాహాన్నిచ్చింది. తపస్వి మనోహరం వారిచే “బెస్ట్ స్టోరీ రైటర్ అవార్డు” ,మరియు నా కవిత తానా సాహిత్య వేదిక వారు నిర్వహించిన కవితా లహిరి పోటీలో ఎంపిక కాబడి అంతర్జాల సమావేశంలో పాల్గొనడం జరిగింది.
నమస్తే అండి సుబ్బలక్ష్మి గారు ప్రేమ పరువా కధ ఆఖరి
క్షణం వరకు ఏమి జరుగుతుందో అని ఆలోచింపచేశారు.
ప్రేమ తప్పుకాదు పరువు ముఖ్యమే.మనం పెట్టుకున్న
ఆచారాలు పాటిస్తు జీవితం సుఖంగా వుండేలా చూసుకోవాలి మేఘన ఇంట్లో వారికి ప్రేమ పెళ్లి వల్ల నష్టం జరగటం బాధాకరమైన విషయం. తను అన్న మాట జవదాటకుండా పెళ్ళి చేసుకోవడం ఎక్కడ వైద్య సేవలు చేసిందో అక్కడకి కొంత కాలం తర్వాత తిరిగి రావటం మేనకోడలి గురించి వాకబు చేయటం కధ మలుపులతో చక్కగా సాగింది ఊహించని విధంగా కధని రచయిత్రి గారు సుఖాంతం చేశారు తనకి విధి నిర్వహణలో పరిచయం అయిన స్నేహితుడు పెళ్ళి పెద్ద గా తన దగ్గర పనిచేసే పనిమనిషి కొడుకు ఇచ్చి మనువు చేయటం ఈ నిజం తెలిసి నిర్ఘాంతపోయిన మేఘన.కక్ష్యలు కులాలు దాడులు ఇవి ఏ ప్రేమని ఆపవు కన్నతల్లి తండ్రులని గౌరవిస్తూ వారి జీవితం
ఫూదోట చేసుకోవాలి .అభినందనలు అండి.
కథ చాలా బాగుంది. మీ ప్రతీ రచనలో ఓ కొత్తదనం కనిపిస్తుంది