“మరోజన్మ”
(ద్వితీయ వార్షిక సంచిక కవితల పోటీ రచన)
– రూపరుక్మిణి.కె
వొళ్ళంతా బాలింత వాసనలు
మాసిన జుట్టు, ముతక బట్ట
అర అరగా ఆరబోసిన ఆడతనం
తానమాడి పచ్చి పుండుని ఆరబెట్టుకునే అమ్మని చూసి ముక్కుపుటలిరుస్తూ..
నొసటితో వెక్కిరిస్తూ..
పుట్టిన బిడ్డకి బారసాల చేస్తున్నం కదా!!
రక్తాన్ని అమృతంగా పంచేటి
పాలిండ్ల బరువుల సలపరింతలనెరుగుదువా..!!
పసిబిడ్డ నోట కరిచిన చనుమొనలకు నలుగురి చూపు తగిలిందంటే ఎట్లా!!
బొడ్డు తాడు తెంపుకున్న పేగు సాగివేళ్ళాడే పొట్టకు నడికట్టు బిగువులో ఊపిరిసలపలేని ఆమెకు చారల మరకలంటినయ్ అంటే ఎట్లా.!
ఆ అమ్మను ఏనాడైనా అడిగామా!
ప్రేమ అంటే పంచడమే కాదు నిన్ను నువ్వు ప్రేమించుకోవడంకూడా అని
తనవంటికైన నొప్పిని ఎప్పుడైనా తడుముకుందో లేదో..
నిన్ను నన్ను, నీకు, నాకు మాత్రం నొప్పిని అంటకుండా అంత దూరంగా నిలిపిందిగా…
తొలకరి వానకు మట్టి సువాసనలా..
మరోజన్మ ఎత్తి వచ్చే పచ్చివంటిని మల్లెసుగంధం అంటుకోదని మరిస్తే ఎట్లా!
****