“ప్రైజు” (తమిళ అనువాదకథ)
తమిళం: సుజాత
అనువాదం: గౌరీ కృపానందన్
ఆ సందులో ఒక్క కారు వెళ్ళడానికి మాత్రమే చోటు ఉంది. సైకిల్ మీద వెళ్ళేవాళ్ళు మురికి కాలువ పక్కగా నిలబడ్డారు. ఆ ఏరియాలో కారు ప్రవేశించడం పొంతన లేకుండా ఉంది. తెల్లని దుస్తులు, టోపీ ధరించిన డ్రైవర్. వెనక సీటులో ఉన్న యువకుడు టై కట్టుకుని ఉన్నాడు. నుదుటన పట్టిన చెమటను తుడుచుకుంటూ ఒక చోట ఆపమని చెప్పి అద్దాలను క్రిందికి దింపి , “36/48 ఏ ఇల్లండి?” అన్నాడు,
“అదిగో సగం గేటు మాత్రమే ఉంది చూడండీ. పోస్ట్ బాక్స్ బైట వ్రేలాడుతూ ఉందే. దానికి పక్క ఇల్లు. అందులో ఎనిమిది కుటుంబాలు ఉంటున్నాయి. మీరు ఎవరిని చూడాలి?”
“కృష్ణస్వామి అని స్టేట్ వేర్ హౌసింగ్ కార్పోరేషన్ లో…”
“అక్కడే… వెళ్ళండి.”
ఆ ఇంటి ముందు పోర్షన్లో ఒక తాతగారు దారి చూపించారు. “లోపలి వెళ్ళండి. ఆఖరి పోర్షన్. దాని తరువాత బాత్ రూమ్.”
మెల్లిగా వసారాను దాటుతూ ఉండగా ఇరు వైపులా చిన్న చిన్న గదుల నుంచి బనియన్ ధరించిన కృష్ణమూర్తులు, రామస్వాములు తొంగి చూసారు. బోర్ పైపు ఉన్న చోట వాళ్ళ వాళ్ళ భార్యామణులు పిల్లలకు కడుగుతున్నారు. ఒక ఇంట్లో కుట్టు మిషిను, ఇంకో ఇంట్లో ట్రాన్సిస్టర్ చప్పుడు చేస్తూ ఉన్నాయి. వయస్సుకు వచ్చిన ఆడపిల్లలు అరచేతి అద్దంలో చూసుకుంటూ నుదుట బొట్టు పెట్టుకుంటూ ఇళయరాజా పాటను కూనిరాగాలు తీస్తూ ఉన్నారు. దారికి అడ్డంగా చిన్నపిల్లల అట్ట క్రికెట్ ఆట కొనసాగుతూ ఉంది.
కృష్ణస్వామి తన పోర్షన్ వాకిట్లో మోడా వేసుకుని కూర్చుని పేపరులో లాటరీ ఫలితాలు చూస్తూ ఉన్నాడు.
“మిస్టర్ కృష్ణస్వామి?”
“అవును. మీరు?”
“నా పేరు అనిల్ కుమార్. లిండాస్ కంపెనీ నుంచి వస్తున్నాను.”
“ఏంటీ విషయం?” అన్నాడు స్వామి నుదురు చిట్లిస్తూ. ఏదైనా అమ్మడానికి వచ్చాడు కాబోలు.
“మీరు మా విన్నీ సబ్బు కంపెనీ వాక్య పోటీకి వ్రాసి పంపించారా?”
“ఆ… అవునవును. గుర్తుకు వచ్చింది.”
“క్షణంలో స్వర్గాన్ని తలపిస్తుంది విన్నీ. ఇదే కదా మీరు వ్రాసి పంపించిన వాక్యం?”
“అవును. అది వచ్చి ఏదో పిచ్చిగా వ్రాసింది.” వెర్రిబాగులవాడిలా క్షమాపణ అడుగుతున్నట్లు అన్నాడు.
“కంగ్రాజులేషన్స్! శుభాకాంక్షలు! మీకు మొదటి బహుమతి లభించింది.”
“మొదటి బహుమతి అంటే?”
“మీకూ, మీ భార్యకూ… పెళ్లి అయ్యింది కదా? ఐదు రోజులు ఢిల్లీ ఆగ్రా టూర్. ఫైవ్ స్టార్ హోటల్‍లో బస. అన్ని ఖర్చులకీ లిండాస్ కంపెనీ బాధ్యత వహిస్తుంది.”
“అలాగా. పూర్ణిమా! పూర్ణిమా! ఎక్కడికి వెళ్ళింది? ఒరేయ్ శీనూ!”
“మీ ఇద్దరికి మాత్రమే.”
స్వామి ముఖం వికసించింది. “సార్! ఏం తీసుకుంటారు? శీనూ! పూర్ణిమను పిలు. ముందు పోర్షన్‍లో మొదలియారు గారింట్లో టి.వి. చూస్తూ ఉంటుంది.”
వచ్చిన ఆ యువకుడు మోడా మీద జేబురుమలును పరిచి దాని మీద కూర్చున్నాడు. “ఇదిగో తీసుకోండి. మా మార్కెటింగ్ డైరెక్టర్ గారి నుంచి ఉత్తరం. దీని మీద సంతకం చెయ్యండి. శుక్రవారం అన్ని పేపర్లలోనూ మీ పేరు వస్తుంది. మీ ఫోటో ఒకటి కావాలి. ఉందా? అశోక్ హోటల్ వోచెర్, ఏర్ టికెట్ అన్నీ ఆరోజే మీకు పంపించేస్తాము. ఈయన?”
“శ్రీనివాసన్. నా బ్రదర్.”
శీనుకి తన కార్డును ఇచ్చాడు టై ధరించిన ఆ యువకుడు.
“కో ఆపరేటివ్ క్రెడిట్ బ్యాంకులో టెంపరరీ అసిస్టెంట్… సెలక్షన్ గ్రేడ్” అన్నాడు శీను.
“ఐ యాం మార్కెటింగ్ ఎక్సిక్యూటివ్ లిండాస్.”
“ఏర్ టిక్కెట్ అంటే ఏరో ప్లేనా?”
“అవును.”
“నిజంగానా! శీనూ! పిలవరా పూర్ణిమను.”
“శుక్రవారం సాయంత్రం వచ్చి తీసుకు వెళ్తాం. ఢిల్లీ వెళ్ళగానే విమానాశ్రయానికి నా కొలీగ్ వేణుమాధవన్ వస్తారు.”
పూర్ణిమ పరుగులాంటి నడకతో వచ్చి చేరింది. “ఏమయ్యింది?” అంది కంగారు పడుతూ.
“పూర్ణిమా! నేను వ్రాసి పంపించాను కదా. దానికి ప్రైజ్ దొరికింది.”
“తరువాత బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ కూపన్లు ఇచ్చేస్తాము.”
“ప్రైజ్ ఏంటి? ఏం వ్రాసి పంపించారు?”
“మీ హస్బెండ్ చాలా లక్కీ మిసెస్ కృష్ణస్వామి. పదివేల మందికి పైగా పాల్గొన్న వాక్య పోటీలో మొదటి బహుమతి! నాలుగే నాలుగు పదాలు.”
“క్షణంలో స్వర్గాన్ని తలపిస్తుంది విన్నీ!”
“బహుమతి ఏంటి?”
“ఒక వారం రోజులకు మనిద్దరమూ ఢిల్లీ, ఆగ్రా అన్నీ చూసి రావడానికి విమానంలో. ఫైవ్ స్టార్ హోటల్ బస… ఇంకా ఏమిటి సార్?”
“అలాగా!” అంటూ రెండు చేతులనూ గుండెలమీద అదుము కుంటూ అంది పూర్ణిమ.
“మనం ఆరోజు విన్నీ సోప్ కొన్నాం కదా? అందులో ఒక పోటీ ప్రకటించారు. నలుగురైదుగురు సినిమావాళ్ళను గుర్తించమని. చాలా సులభంగా ఉండింది. తరువాత నాలుగు పదాలతో ఒక వాక్యం వ్రాయమని అడిగారు. ఏదో తోచింది వ్రాసి పంపించాను. ప్రైజు దొరికింది.”
“నమ్మశక్యం కావడం లేదు. మనం ఏదైనా డబ్బు కట్టాల్సి ఉంటుందా?”
“అలాంటిది ఏమీ లేదు. ఇక్కడ బయలు దేరిన దగ్గరి నుంచి మళ్ళీ ఇంటికి వచ్చి చేరే దాకా అంతా లిండాస్ చూసుకుంటుంది.”
“వదినా! ఈ రోజు పేపరులో వారఫలాలలో ధనలాభం అని ఉంది. అచ్చు అలాగే ఫలించింది” అన్నాడు శీను.
“ఎందుకో ప్రైజు దొరికినా దొరుకుతుందని అప్పుడే అనిపించింది. సార్‍కి కాఫీ కలిపి ఇవ్వు” అన్నాడు కృష్ణస్వామి.
“వద్దు సార్. థాంక్స్. సెకండ్ ప్రైజు దొరికిన ఆసామిని చూడడానికి వెళ్ళాలి. దీనిమీద ఒక సంతకం పెట్టండి, ఒక ఫార్మాలిటీ కోసం!”
ఆ యువకుడు వెళ్ళగానే చాలా మంది స్వామి చుట్టూ గుంపుగా చేరారు. “ఎలా సార్ మీకు తోచింది?”
“మన స్టోర్ లోనే మొదటి సారిగా ప్రైజు వచ్చింది.”
“నారాయణకు ఒకసారి భూటాన్ లాటరీలో ప్రైజు దొరికిందిగా.”
“నూరు రూపాయలు!”
ఎదుటి పోర్షన్‍లో ఉంటున్న పట్టమ్మాళ్ “ఏంటి పూర్ణిమా! ప్రైజు దొరికిందటగా! ఢిల్లీకి వెళ్తున్నావా?”
“ఇంకా సరిగ్గా తెలీదు వదినా.”
“పూర్ణిమా ఆంటీ! కంగ్రాజులేషన్స్! ట్రీట్ ఎప్పుడు?”
“నాకు రెండు మోడాలు, చలవరాతి చపాతీ పీట కొని తీసుకుని రా. డబ్బులు ఇచ్చేస్తాను.”
“దానిదేముంది?”
“ఢిల్లీలో అల్బకోడా పళ్ళు చవక అట కదా?” అన్నారు ఆది నారాయణ.
“ఇప్పుడు సీజన్ కాదు లెండి” అన్నాడు శీను.
“నమ్మకం కుదరడం లేదు పూర్ణిమా.”
“ఏదైనా ట్రిక్కు అయి ఉండొచ్చు. రానూ పోనూ అంతా విమానమేనా?”
“అవును.” ఉత్తరాన్ని విప్పి చూశాడు శీను. “అన్నయ్యా! వదినా! ఇందులో అంతా క్లియర్ గా ఉంది.”
“ప్రియమైన కృష్ణస్వామి గారికి,
లిండాస్ తరపున స్వాగతం. నవంబరు నెలలో మేము నిర్వహించిన పోటీలో మీరు మొదటి ప్రైజు గెలుచుకున్నారు అన్న విషయం తెలియ జేయడానికి సంతోషిస్తున్నాము. అభినందనలు. ఈ ప్రైజు ప్రకారం మీకునూ, మీ భార్యకూ లేకపోతే స్నేహితుడు… ఇద్దరికీ విమాన టిక్కెట్లు రానూ పోనూ చెన్నై- ఢిల్లీ, ఆగ్రా జైపూర్, ఢిల్లీ – చెన్నై ఇస్తాము.
ఐ.టి.సి. కంపెనీకి చెందిన హోటల్‍లో డీలక్స్ రూం, టూరిస్ట్ బస్సుకు ప్రయాణపు రుసుము, ఉదయం బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం టీ, రాత్రి డిన్నరు అన్నింటినీ సంతోషంతో మా కంపెనీ బాధ్యత వహిస్తుంది.
మీ దారి ఖర్చుల కోసం రోజూ చెరొకరికి 300 రూపాయలు భత్యం ఇవ్వబడుతుంది.
మీ ఉల్లాస ప్రయాణం సంతోషంగా సాగాలని ఆశిస్తున్నాం.
ఇట్లు
అరుణ్ శివదాసాని
శీను ఉత్తరాన్ని మడతపెట్టి తలెత్తి చూశాడు. “అన్నయ్యా ! నిజంగా నీకు ఎక్కడో పుట్టుమచ్చ ఉంది. నాలుగంటే నాలుగు పదాలకు ఇంత అదృష్టమా? వదినా! నువ్వు వెళ్లి తీరాలా? లేకపోతే నేను వెళ్ళనా?”
“ఆశ చూడు! మొదటి సారిగా మీ అన్నయ్యగారితో ఈ ఎలుక కలుగు నుంచి బైటికి వెళ్ళడానికి అవకాశం వచ్చింది.”
“ఊరికే అన్నాను. సంతోషంగా వెళ్లి రండి.”
“శీనూ! మొదట మేప్‍ను చూడు, ఆగ్రా ఎక్కడ ఉంది అని. ఐ.సి. ఎఫ్. దాటి ఉత్తరం వైపు నేను వెళ్ళింది లేదు.” అన్నాడు స్వామి.
“నేను వీధి మలుపును దాటింది లేదు” అంది పూర్ణిమ.
“అబద్దం! హైదరాబాదుకు వెళ్లావు కదా?”
“ఎప్పుడో చిన్నప్పుడు.”
“చలిగా ఉంటుందా?”
“ఢిల్లీలోనా? అంతా ఉత్తరంలో వ్రాశారు చూడు.” శీను ఉత్తరంతో జతపరిచిన సూచనలను చదివాడు. “వాతావరణం సమతుల్యంగా ఉంటుంది. స్వెట్టర్ గానీ శాలువా గానీ ఉంటే చాలు.”
“శాలువా అంటే?
“షాల్! చుట్టూ కప్పుకోవడానికి. నీ దగ్గర ఉందిగా.”
“ఏంటీ? వేళాకోళంగా ఉందా? చిరిగి పోయిన భవానీ జంపఖానాను కప్పుకుంటున్నాను.”
“అదెక్కడ చిరిగింది? ఊరికే చెప్పకు.” అన్నాడు స్వామి.
“పూర్ణిమా! ఆ హోల్డాల్ ఏమయ్యింది?”
“అది ఎప్పుడో చిరిగి పోయి ఇల్లు తుడవడానికి తీసేసు కున్నానుగా.”
“నా పచ్చరంగు స్వెట్టర్?”
“సగానికి పైగా పురుగులు కొట్టేశాయి.”
“అన్నయ్యా! ఢిల్లీకి వెళ్లాలంటే కనీసం ఒక స్వెట్టర్, మంచి చెప్పులు, డీసంటుగా ఒక షూ, వదినకు మైసూరు సిల్క్ చీర తప్పకుండా కొని తీరాలి.”
“చిన్నగా ఒక లిస్టు తయారు చేద్దాం.”
బుధవారం నాటికి ఆ లిస్టు చాంతాడంత అయ్యింది. టార్చి లైటు, ఉల్లన్ సాక్సు, కంది పొడి లాంటి ఉపరి వస్తువులు అందులో చేరాయి. పూర్ణిమ మూడు రోజులుగా పాకింగ్ చేస్తూనే ఉంది. మిగిలిన పోర్షన్‍లలో ఉంటున్నవాళ్ళ లిస్టు కూడా కొల్లేటి చాంతాడులా పెరుగుతూనే వుంది. ఊలు దారం, చలవరాతి తాజ్ మహల్, నెమలీకల విసనకర్ర, మోడా, చలవరాయి చపాతీ పీట, మడత కుర్చీ, ఫోటో ఆల్బం, అర చేతుల స్వెట్టరు వగైరా వగైరా…
“సంబర పడుతూ అందరికీ తల ఊపెయ్యకు వదినా. మీరిద్దరూ వెళ్లి ఎంజాయ్ చేసి రండి.”
గురువారం రాత్రి పూర్ణిమ, శీనూ పాకింగ్ ముగించేశారు.
“పెళ్లి అయినప్పటి నుంచి మేం హనీమూన్‍కు కూడా వెళ్ళింది లేదు శీనూ. నేరుగా ఇక్కడికి వచ్చేసాను. వివిధభారతి, మొదలియారు ఇంట్లో టి.వి. ఇవి తప్ప వేరే కాలక్షేపాలు లేవు. మీ అన్నయ్య ఓవర్ టైం అంటూ డబ్బు సంపాదించడంలోనే మునిగి పోతూ ఉన్నారు.”
“ఏం చెయ్యడం వదినా? చిన్న తమ్ముడు రాజు చదువు ముగించాలి. రేవతి పెళ్లి వేరే ఉంది. అమ్మకు ఆపరేషన్ చేయించాలి. నాకు ఉద్యోగం పర్మనెంట్ అవ్వాలి.”
“నేను ఎవరినీ తప్పు పట్టడం లేదు. ఢిల్లీ వెళ్ళడం, తాజ్ మహల్ చూడడం అంతా కలలో కూడా ఊహించలేని ఈ పరిస్థితుల్లో ఉన్నట్లుండి ఏడుకొండలవాడు ఒక ప్రైజు ఇచ్చాడు చూడూ. దానినే చెబుతున్నాను. లేకపోతే నా లాంటి వెర్రి బాగులదానికి ఆగ్రా దర్శనం కలుగుతుందా?”
“ఎందుకు వదినా అలా అంటావు? అన్నయ్యను చూడు. ఇంకో రెండేళ్ళు ఓపిక పడితే, నాకు ఉద్యోగం స్థిరం అయ్యి, మీకూ అన్ని బాధ్యతలూ తీరి పోతాయి. సొంత ఖర్చులతోనే పది ఊళ్లకు నిన్ను తీసుకు వెళ్తాడు. చూస్తూ ఉండు.”
“ఎవరు చూడ వచ్చారు? అప్పుడు ఏదైనా చెల్లెలికి ప్రసూతి ఖర్చులు వస్తాయో ఏమో? దేని గురించీ ఆశలు పెట్టుకోకూడదు. తాహతుకు మించి ఎదురు చూడనూ కూడదు.”
శుక్రవారం టిక్కెట్ మొదలైన సమాచారాలను ఇవ్వడానికి లిండాన్ ఆసామి వచ్చే ముందే, పూర్ణిమ అన్ని ఏర్పాట్లనూ ముగించేసింది. పక్క పోర్షన్ నిత్య దగ్గర శీను భోజనానికి ఏర్పాటు చేసి, పనిమనిషి ఉదయం ఒక పూట వచ్చి బట్టలు ఉతికి, గదులు తుడిచి, వాకిట్లో ముగ్గు పెట్టి వెళ్ళడానికి ఏర్పాటు చేసింది. భోజనానికి, బస్సు ఖర్చులకు అని శీనుకు నూరు రూపాయలు విడిగా ఇచ్చింది. శనివారం తలంటు కోవడానికి నువ్వుల నూనె, రోజూ అర లీటరు పాలు సప్లై, కాఫీ పొడి అంటూ అన్నింటికీ ఏర్పాట్లు చేసి పెట్టింది.
సాయంత్రం కృష్ణస్వామి ఇంటికి వచ్చినప్పుడు అలిసిపోయినట్లుగా కనబడ్డాడు. అతనికి కాఫీ తెచ్చి ఇచ్చి, గదిని పరకాయించి చూసింది. హోల్డాలు, పెట్టె, ప్లాస్టిక్ బ్యాగు, కూజా, నీళ్ళ బాటిల్ అన్నీ తయారుగా ఉన్నాయి.
“అన్నీ తయారుగా తీసి పెట్టేశావా?”
“వారం రోజుల నుంచీ తయారుగానే ఉన్నాను. శీను తలంటు కోవడానికి నువ్వుల నూనె కూడా బాత్ రూములో తీసి పెట్టాను.”
“అంతా వేస్ట్” అన్నాడు విరక్తి నిండిన గొంతుతో.
“ఏమయ్యింది? అతను రాలేదా? అంతా మోసమేనా?” అన్నది అదిరిపడుతూ.
“లేదు. నేనే ఢిల్లీ ఆగ్రా ట్రిప్ వద్దని చెప్పేసాను. వాళ్లకు ఫోన్ చేసి దానికి బదులు కాష్ ఇస్తారా అని అడిగాను. పదివేలు ఇస్తామని అన్నారు. తీసుకు వచ్చేసాను.”
“అలాగైతే మనం ఢిల్లీకి వెళ్ళడం లేదా?” ఆమె ముఖం వాడి పోయింది.
“లేదు.”
“ఈ డబ్బు ఇప్పుడు ఎందుకు?”
“శీనుకు కో ఆపరేటివ్ స్టోరులో కాషియర్ ఉద్యోగం వచ్చేటట్లు ఉంది. దానికి కాషన్ డిపాజిట్ కట్టాలి. అమ్మకు ఆపరేషన్ పెట్టుకోవచ్చని డాక్టర్ చెప్పేశారు.”
పూర్ణిమ కాస్సేపు అతనినే చూస్తూ ఉండి పోయింది.
“అన్ని ఏర్పాట్లు వేస్ట్ అయినట్లే కదా.”
గబుక్కున పొంగిన కన్నీటిని బయటికి రానివ్వకుండా జాగ్రత్త పడింది.
స్వామి ఆమె దగ్గిరికి వచ్చి చెంపలను తడుముతూ, “నీకే కాస్త నిరాశ. అంతే కదూ.”
“ఫరవాలేదు లెండి. ఇంకోసారి ప్రైజు వస్తే అప్పుడు ఆగ్రా చూసుకుందాం” అంది.
(మధ్యతరగతికి చెందిన వారి జీవితం అంటే ఇదే)
*****
1956లో దిండిగల్, తమిళనాడులో జననం. మాతృభాష తమిళం. తండ్రిగారి ఉద్యోగరీత్యా తెలంగాణాలో తెలుగు మాధ్యమంలో విద్యను అభ్యసించారు. బి.కాం. పూర్తి అవుతుండగానే వివాహానంతరం చెన్నైకి వెళ్ళవలసి వచ్చింది. ఆ తరువాతే తమిళ సాహిత్యం చదవడానికి అవకాశం లభించింది. సాహిత్యం అంటే మక్కువ. తెలుగులో తనకి నచ్చిన నవలలు, కధలు తమిళ పాఠకులకు, అలాగే తమిళంలో మనసుకు దగ్గరగా ఉన్న సాహిత్యాన్ని తెలుగు పాఠకులకు అందించాలనే కోరికతో, ఆశయంతో అనువాద ప్రక్రియను ఎంచుకున్నారు. 1995లో మొదటి అనువాద కధ యండమూరి వీరేంద్రనాథ్ గారి “ది బెట్’ తమిళంలో ప్రచురం అయ్యింది. దాదాపు ఎనబై తెలుగు నవలలు తమిళంలో వెలువడి ఉన్నాయి. (యండమూరి వీరేంద్రనాథ్, యద్దనపూడి సులోచనారాణి, D. కామేశ్వరి, ఓల్గా) తెలుగులో పెరుమాళ్ మురుగన్ గారి “పూనాచ్చి ఒక మేకపిల్ల కధ” ఈ మధ్యే వెలువడింది. 2015లో ఓల్గాగారు “విముక్త” కధా సంకలనానికి సాహిత్య అకాడమి అవార్దు అందుకున్న అదే ఏడాది, విముక్త తమిళ అనువాదం “Meetchi”కి గౌరీ కృపానందన్ సాహితి అకాడమి అనువాద పురస్కారం అందుకున్నారు. మూలానికీ, అనువాదానికీ ఒకే ఏడాది సాహిత్య అకాడమి అవార్డులు రావడం ఇదే తొలిసారి.
”ఇంకోసారి ప్రైజు వస్తే…” ఎంత నిండుగా చెప్పింది పూర్ణిమ! మధ్య తరగతి జీవితాలు!