జీవన ప్రభాతం – హేమలతా లవణం గారి నవలా సమీక్ష

   -పి.జ్యోతి

జాషువా గారి కుమార్తె సంఘ సంస్కర్త హేమలతా లవణం గారి గురించి ప్రస్తుత తరానికి తెలిసింది చాలా తక్కువ. చంబల్ లోయల్లోని బందిపోట్లు వినోభా భావే గారి వద్ద లోంగిపోతున్నప్పుడు ఆ కార్యక్రమం కోసం విశేష కృషి చేసారు హేమలతా ఆమె భర్త లవణం గార్లు. నేరస్తుల బాగు, పునరావాసం కొరకు ఎంతో కృషి చేసిన దంపతులు వీరు. జయప్రకాష్ నారాయణ్ గారి నేతృత్వంలో వీరు నేరస్థులలోమార్పు తేవడానికి చాలా కార్యక్రమాలు రూపొందించారు. సీతానగరం, స్టువర్ట్ పురం, కావలి, కప్పరాళ్ళతిప్ప లాంటి ప్రాంతాలలోని నేరస్తుల ఆవాసాల నిర్మాణం కోసం విశేషంగా పని చేసారు. ఆ కుటుంబంలోని వ్యక్తులు న్యాయబద్దమైన వృత్తులను ఎంచుకోవడానికి తోడ్పాటునందించారు. వీరి కృషితోనే 1976 లో ఈ పట్టణాలను ప్రభుత్వం స్వతంత్ర కాలనీలుగా ప్రకటించింది. స్టువర్ట్ పురం లోని కుటుంబాలతో నిరంతరం సంభాషిస్తూ వారిలో మార్పు తీసుకువచ్చే ప్రయత్నాలు చేసారు. కర్కశులుగా పేరు పొందిన ఎందరో నేరస్తులు వీరి కార్యక్రమాల ప్రభావంతో తమ పంధా మార్చుకుని న్యాయబద్దమైన జీవితాల వైపు ప్రయాణించారు.

మనిషిని శిక్షతో కాకుండా అతని ఆలోచనా ధోరణులలో మార్పు తీసుకువచ్చి అతన్ని నీతి వైపుకు తీసుకురావచ్చని బలంగా నమ్మిన వ్యక్తి హేమలతాలవణం. వారి భావాలన్నీటిని కథ రూపంలో తీసుకువస్తూ జీవన ప్రభాతం అనే నవల రాసారు. తమ ఆశయాలను కేవలం అక్షరబద్దం మాత్రమే చేయగలిగే వారు చాలా మంది కనిపిస్తారు. కాని తాము నమ్మిన పంధాలో జీవిస్తూ సమాజంలో  మార్పు కోసం నిరంతరం పని చేస్తూ ఆ మార్పు కోసం తాము ఎన్నుకున్న దారి ఎందుకు ఉన్నతమైనదో చెప్పడానికి తమ భావాలను ప్రజలతో పంచుకోవడానికి సాహిత్యాన్ని ఆశ్రయించి వారి ఆలోచనలను, తమ క్రియాశీలక జీవితాన్నిఅక్షరబద్దం చేసారు హేమలతా లవణం గారు. అంటే ఈ పుస్తకంలో వారు వ్యక్తపరచిన ఆశయాలన్నీ వారు ఆచరిస్తూ,  ఆ దిశగా పని చేస్తూ రాసినవే కావున ఈ అక్షరాలలో గొప్ప నిజాయితీ ఉంది, జీవితాన్ని అర్ధం చెసుకున్న అనుభవ సారం ఉంది. ముఖ్యంగా మనిషిలోని రాక్షసత్వాన్ని కూడా మార్చవచ్చన్న అపార నమ్మకం ఉంది. నేరస్తులు పుట్టుకతో నేరస్తులు కారని, వారిని ఆర్ధిక అసమానతలున్న వ్యవస్థ నేరస్తులుగా మారుస్తుందని, ఉన్నత వర్గానికి చెందిన వ్యక్తుల కుట్ర మోసం కూడా కొంత మంది పతనానికి కారణమవుతున్నాయని, అందువలన సమాజంలోని ఆ స్థితిగతులను మార్చగలిగితే నేరస్తులు ఉండరని బలంగా నమ్ముతారు హేమలత. ఈ నవలని అదే ఆదర్శాలకు అనుగుణంగా రాసారు. 

నల్లమల్ల అడవుల్లో ‘అడవి కోన’ అనే చిన్న గ్రామాన్ని తన కథా స్ఠలంగా తీసుకున్నారు. అది చిన్ని పూరి గుడిసెల లో నివసించే శ్రామికుల ఊరు. అందులో చిన్నయ్య నాగమ్మ అనే దంపతులు. అమాయకులు, శ్రమజీవులు. వీరికి నలుగురు పిల్లలు. పెద్ద కొడుకు బాలయ్య, తరువాత సింగన్న, ఆ తరువాత కూతురు జ్యోతి చిన్నవాడు మల్లన్న. అడవిలో కట్టెలు కొట్టూకుంటూ పని చేసుకుంటూ బ్రతికే ఈ కుటుంబానికి రోజు గడవడమే కష్టం. దొర అక్కిరాజు ఎంత పని చేసినా సమయానికి కూలి డబ్బులు ఇవ్వడు. అడిగే ధైర్యం ఎవరికీ లేదు. ఆ దొర తమ వంక కాస్త దయ తో చూస్తే చాలు ప్రాణాలే ఇవ్వవచ్చు అనే అమాయకత్వంతో పని చేస్తూ ఉంటాడు చిన్నయ్య.  అక్కిరాజు  చెల్లెలు పూర్ణిమ ఒక ఇంగ్లీషు దొరను ప్రేమించి పెళ్ళి చేసుకుంటుంది. సంస్కారవంతుడు, ఉత్తముడైన ఆ దొర వేటకువెళ్ళి చనిపోతాడు. భర్త మరణం తరువాత పూర్ణిమ అన్న నీడనే ఉంటూ భర్త ద్వారా సంక్రమించిన వంద ఎకరాల భూమి పై వచ్చే ఆదాయంతో కూతురు సుజాత ను పెంచుకుంటూ పేదలను ఆదుకుంటూ ఉంటుంది. అక్కిరాజు పరమ లోభి. అతను మాయ మాటలతో చిన్నయ్యను లోబరుచుకుని అతని కుటుంబ ఉన్నతి కోసం డబ్బు అవసరం అని నమ్మించి అతనిచేత దొంగతనాలు చేయిస్తూ ఉంటాడు. దొంగిలించిన డబ్బు అక్కిరాజుకు చేరుతుంది కాని చిన్నయ్య కు దొరికేది కాస్త తిండి గింజెలు, కొంచెం మంచి బట్టలు మాత్రమే. వీటి కోసం అనునిత్యం భయంతో ఆ కుటుంబం బ్రతుకుతూ ఉంటుంది. చిన్నయ్య తండ్రి ఆ ఊరిలో మంచి పేరు సంపాదించుకున్న వ్యక్తి. చిన్నయ్య దొంగతనాలు మానాలన్నా మానలేని స్థితికి చేరుకుంటాడు. తాను ఊబిలోకి కూరుకుపోయానని అర్ధం చేసుకునేలోపే అతను అరెస్టు అవుతాడు. మొత్తం కుటుంబానికి దొంగల కుటుంబం అని పేరు పడిపోతుంది. 

పూర్ణిమ తన కూతురు సుజాతను ఊరి నుంచి దూరంగా ఉంచి చదివించుకుంటూ ఉంటుంది. ఆమెకు చిన్నయ్య పిల్లలంటే చాలా ఇష్టం. కాని అన్న వారిని దగ్గరకు రానివ్వడు. సుజాతతో బాలయ్య జ్యోతి ఆడుకుంటారు. ఆ రోజులలో వారికి ఆ తల్లీ బిడ్డల నుండి దొరికిన ప్రెమ మాత్రమే వారి జీవితాలలోకల్లా అపురూప ధనం. దాని తరువాత జనం చీత్కారాలు అవమానాలే వారు మిగిల్చుకున్న అనుభవాలు. కొన్ని సంవత్సరాల తరువాత బాలన్న టైగర్ బాలన్న పేరుతో దోపిడిలు చేస్తూ ఉంటాడు. అతని పై పోలీసు నిఘా ఎక్కువవుతుంది. అతన్ని పట్టి ఇచ్చినవారికి బహుమతి ఇస్తాం అని ప్రభుత్వం ప్రకటిస్తుంది. సింగన్న కూడా దొంగగా మారి మరో దళంతో పని చేస్తూ ఉంటాడు. చిన్నవాడు  మల్లన్న దొంగతనం చేయకుండా నీతిగా బ్రతకాలను కుంటాడు. అన్నల అచూకి కోసం అనుమానం తో పోలీసులు అతన్ని అరెస్టు చేస్తారు. తరువాత మల్లన్న ఎవరికీ కనపడడు. ఏమయ్యాడొ తెలియదు. చిన్నవాడు కనిపించకుండా పోవడం, పెద్దపిల్లలిద్దరూ దొంగలవడం భరించలేక తల్లి నాగమ్మ పిచ్చిదయిపోతుంది. ఈ కుటుంబం అంతా కూడా వారి సొంత ఊరు వదిలేసి ప్రభుత్వం నిర్దేశించిన రేవుపట్నం అనే దొంగల సెటిల్మెంట్ లో స్థిరపడతారు. చూట్టూ ఉన్నవన్నీ దొంగల కుటుంబాలే. జ్యోతి ఈ జీవితాన్ని ఇష్టపడదు. అన్నల దొంగ డబ్బు స్వీకరించదు. పని చేసుకుంటూ బ్రతుకుతుంటుంది. కాని పోలీసుల రైడ్లు అవమానాలు ఆమెకూ తప్పవు. అప్పుడప్పుడూ దొంగతనంగా బాలన్న ను కలుసుకుంటూ ఉంటుంది. ఈ వృత్తి మానేయమని నిజాయితీగా బ్రతుకుదామని బ్రతిమిలాడుకుంటూ ఉంటుంది. 

బాలయ్య చాలా చిన్నతనం నుంచి అద్భుతంగా మురళి వాయిస్తాడు. అతనిలోని అపూర్వమైన ప్రతిభను మెరుగుపట్టుకునే అవకాశం అతనికెప్పుడూ జీవితంలో రాలేదు. తండ్రి మొదటి సారి అరెస్టు అయిన రోజే అతని ప్రధమ కచేరి ఏర్పాటూ చేస్తాడు అక్కిరాజు. కాని అవమానంతో బాధతో బాలయ్య చిన్నబోయి ఆ ఆనందాన్నిఅనుభవించలేని స్థితిలో ఉంటాడు. సింగన్న మొండివాడు మూర్ఖుడు. అతను ప్రేమించి పెళ్ళి చేసుకున్న భార్య వనమ్మ పై అతనికి అనుమానం. దొంగలు తమ కుటుంబాలను వదిలి నెలకు  నెలలు ఎక్కడో ఉండిపోతారు. కుటుంబాలను పట్టించుకునే వారు ఉండరు. వారు దొంగలించిన డబ్బు ఎన్నో రూపాలుగా వాటాలుగా విభజించిన తరువాత చివరకు వారికి  మిగిలేది కుటుంబానికి సరిపోదు. దీనికి తోడు భార్యలపై వారికి పిచ్చ అనుమానం. ఈ అనుమానం అనే బాధతో సింగన్న భార్య వనమ్మ ఆత్మహత్య చేసుకుంటుంది. ఆమె పతివ్రత అని నిరూపించుకోవడానికి నిప్పుల పై ఆమెను నడిపిస్తారు. అయినా భర్తలో మార్పు రాక వనమ్మ విసిగిపోయి ఆత్మహత్య చేసుకుంటుంది. ఆమె చావుతో ఖంగుతిన్న సింగన్న కూడా ఆత్మహత్య చేసుకుంటాడు. ఈ దుఖంతో చిన్నయ్య గుండే పగిలి చనిపోతాడు. తల్లి పిచ్చి పట్టి రాత్రిల్లు చిన్నకొడుకుని పిలుస్తూ ఊరంతా తిరుగుతూ ఉంటుంది.

బాలయ్య దొంగ అయినా ఊరి సంక్షేమం కోసం పని చేస్తూ ఉంటాడు. అతనంటే ఊరి వారందరికీ గౌరవం. ఎందరో దొంగ కుటుంబాలకు అతను కనిపించే దేవుడు. ఆ ఊరి పోలీస్ స్టేషన్ కు వచ్చిన జయచంద్ర ఆ దొంగల సెటిల్మెంట్లో ని కుటుంబాలలో మార్పు కోసం వారి పునరావాసం కోసం ప్రయత్నిస్తూ ఉంటాడు. పూర్ణీమాదేవి వద్దకు చేరి బాలయ్య తన దళంతో లొంగిపోవడం ఈ నవలకు ముగింపు.

అయితే హేమలత గారు ఈ నవలలో దొంగలుగా మారుతున్న ఈ కుటుంబాలపై బలవంతుల నియంత్రణ గురించి విస్తారంగా చర్చిస్తారు. ఈ దొంగలు చేసే దోపీడిల వెనుక పోలీసుల హస్తాలు కూడా ఉంటాయని. దొంగలుగా వీరిని మార్చి వారి ద్వారా వచ్చే ధనంతొ ధనవంతులయ్యే వ్యవస్థ మన మధ్యే ఉందని. అందులో పోలీసు వ్యవస్థ కూడా పాలుపంచుకుంటుందని ఈ ఊబి అమాయకులను తనలోకి లాగేసుకుని వారికి అన్యాయం చేస్తూ ఒక వర్గాన్ని ధనవంతులుగా చేస్తుందని, ఆ వ్యవస్థపై పోరాడవలసిన అవసరం మనందరికీ ఉందని చెబుతారు. దొంగల గ్రామాలలోని ప్రజలను చూసి ఉండడం వలన వారి కుటుంబ బాధలను విస్తారంగా చూపిస్తారు. ముందు భర్త ద్వారా బోలెడు డబ్బు వస్తుందని ఆశించే ఈ దొంగల భార్యలు తరువాత ఎలా ఆ భర్తల తెలివి తక్కువతనం కారణంగా తమ కుటుంబాలు నాశనం అయిపోవడం మౌనంగా చూస్తూ ఉండవలసి వస్తుందో చెప్పే ప్రయత్నం చేసారు రచయిత్రి.  మగవారు దొంగతనం చేయడానికి బాతినీలుగా పని చేసే స్త్రీలు ఉంటారు. వారు ఉప్పు, పసుపు, మరమరాలు అమ్మే వేషంతో గ్రామాలు తిరిగి ఈ బాతినీ సేకరిస్తూ, దొంగతనానికి అనుకూలమైన ఇల్లును కనుక్కుని మొగవారికి చెప్పి డబ్బు సంపాదిస్తూ ఉంటారు. దోంగలు దొంగతనానికి వెళుతూ దేవున్ని అంతా సజావుగా జరగాలని ప్రార్ధిస్తారట. భర్తలు భార్యలను అనుమానిస్తే నిప్పులపై నడిపిస్తారు. ఆశ్చర్యంగా ఆ గ్రామంలో ఏ స్త్రీ కూడా ఇది తప్పని వాదించదు. ఈ నవలలో ఇలా నిప్పులపై  నడిచే సమయంలోకాళ్ళు కాలకపోవడం వెనుక ఉన్న సైన్సును రచయిత్రి వివరిస్తారు. మూఢనమ్మకాల పై ఆమె చెసిన యుద్దం కొంత ఇందులో ప్రతిఫలిస్తుంది. పోలీసు వ్యవస్థలో మస్తాన్ లాంటి నీతి మంతుడిని చూపిస్తూ అంతటి కలుషితమైన వాతావరణంలో నిజాయితీగా బ్రతకడానికి సామాన్యుడు పడే బాధను కూడా ఆవిడ చర్చిస్తారు. జపాన్ లో జైలు సంస్కరణల కోసం పని చేసిన అరిమా అనే జైలర్, అలాగే హెన్రీ టిల్మన్ అనే బాక్సర్ జీవిత కథలను కూడా ఈ నవలలో రచయిత్రి పరిచయంచేస్తారు. 

1978 లో ఈ నవల ను రాయడం మొదలుపెట్టిన హేమలతా గారు దీన్ని పూర్తి చేయడానికి పద్నాలుగు సంవత్సరాలు తీసుకున్నారు. 92 లోప్రధమ ముద్రణ కు నోచుకున్న ఈ నవల ప్రస్తుతం మార్కెట్లో లభించట్లేదు. సంఘ సంస్కర్తలు తమ అనుభవసారాన్ని సాహిత్యంలో నిక్షిప్తపరచడం అన్నది అరుదుగా జరిగే పని. ఈ నవలను ఫ్రొఫెషనల్ గా చూస్తే గొప్ప నవలగా ఎంచలేం. కాని ఇందులో ప్రస్తావించిన ఆదర్శాలు, సంస్కరణల కోసం హేమలత గారు స్వయంగా పని చేసారు. కొంత విజయం సాధించారు. అలా క్రీయాశిలక సంఘసంస్కర్త గా భాద్యతలు నిర్వహించి, తమ అనుభవాల ఆధారంగా సాహిత్యంలో ఇటువంటి నవలలు రాసే వారి మాటలలోని నిజాయితీనీ అనుభవసారాన్ని జాగ్రత్త చేయవలసిన అవసరం సాహితీ ప్రియులకు ఉంది. ఒక  మహిళగా తాను ఎంచుకున్న రంగంలో పని చేసిన హేమలత వంటి మహిళామణులకు సరి అయిన గౌరవం సాహిత్య ప్రపంచంలో లభించాలి. దీని కోసం వీరి పుస్తకాలు అందుబాటులోకి తీసుకురావలసిన అవసరం ఉంది.

****

Please follow and like us:

One thought on “జీవన ప్రభాతం – హేమలతా లవణం గారి నవలా సమీక్ష”

  1. స్వతంత్యానంతరం వచ్చిన సంస్కరణలు రెండు. అవి నేరస్థుల సంస్కరణ, జోగినీ దురాచార సంస్కరణ. అవి రెండూ లవణం, హేమలతాలవణం ఆధ్వర్యంలోనే జరిగాయి. వారి కృషి ఎనలేనిది.
    హేమలతాలవణం గారు ఆవిడ పుస్తకాలు, జాషువా గారి పుస్తకాల పునర్ముద్రణ హక్కులు విశాలాంధ్ర వారికి ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published.