జ్ఞాపకాల ఊయలలో-7

-చాగంటి కృష్ణకుమారి

మాముందు పెరడు లో  పూల మొక్కలను పెంచేవారం.  చాలారకాలే వుండేవి. ప్రధానంగా  గులాబీ … దేశవాళీ గులాబీరంగు గులాబీ– సువాసనలను వెదజల్లేది,  రాటలతోవేసిన  పందిరి మీదకెక్కిన  తీగమల్లి, చామంతులు, కనకాంబరాలు. చామంతులు  చాలారకాలేవుండేవి.కానీ చామంతి,దమ్మిడి చామంతి,తెల్లచామంతి , ముందు ఎర్రగాపూసి క్రమేణా పసుపుడోలుకు మారే చామంతి. వానపడ్డాక  చామంతి  కుదపలనుండి  చిన్ని చిన్ని  మొక్కలను వేరు చేసి విడివిడిగా పాతడం చాలాసరదా గావుండేది. డిసెంబర్  పూల మొక్కలలో  కూడా నీలి. తెలుపు, రకాలుండేవి. అప్పుడు మాకు చామంతులలో నీలి చామంతి  అపురూపం అన్నమాట. చామంతులు పూతకి వచ్చి మొగ్గలు తొడిగాక  మానీలి చామంతి మొక్క బాగా ఏపుగా పెరిగి మొగ్గలు చాలా తొడిగింది.  సహజమైన పశువు గెత్తానికి  పల్లెలో ఆకాలంలో కొదవేముంటుంది కనక ! మొక్కలన్నీ చాలాఅరోగ్యంగా నిగనిగలాడుతూ వుండేవి. నీళ్లు  పొసేటప్పుడు ఆకులమీదకు చిమ్ముతూ పోయడం ఎంత ఇష్టమో!  ఇప్పుడు మన ( భారతదేశం) పట్టణాలలో చెట్ల ఆకులన్నీ దుమ్ముకొట్టుకొని వుంటాయి. మనమే దానికి కారణమనుకోండి!  ఎప్పుడైనా వరుణుడు దయతలచి వాటికి తలారా స్నానం చేయిస్తే తప్ప వాటి సహజమైన  అందాలు, రంగులు మనకంట పడవు. అన్నట్టు ముద్ద గోరింట విత్తనాలను  రంగుల వారీగా విడి విడి  మడులలో జల్లి  అవి మొలకెత్తి , కాస్త మెడపైకెత్తి నిలుచునే సమయానికి వాటిని విడదీసి వరసగా రంగులు గుర్తు పెట్టుకొని  పాతడం చాలా  ఇష్టం  ..  పూత అయ్యాక  వాటి విత్తనాలను  సేకరించడం ఎంత బాగుండేదనీ!  

          మానాన్న చాసో  ఒక కధా రచయిత గా తన “వాయులీనం”  కథలో – “ స్వభావసిద్ధంగా  సంగీతం సమ్మోహన పరుస్తుంది ,చిన్న వయసునుంచి కాస్తంత రాగ తాళ జ్ఞానం కలిగిస్తే  జీవితంలో సంగీతం ప్రవేశించి ఆనంద హేతువవుతుంది” అని చెపూతూ అదే విషయాన్ని  పదేపదే  కథ పొడుగునా  చెపుతూనే వుంటాడు.  చక్కగా పాడుకోవడం  చేతనైన  వారు  చాలా అదృష్ట వంతులు.  సంగీత జ్ఞానం  దైవదత్తం, ఆపైన అభ్యాసము.  ఆ అనందమేమిటో  దాని లోతుపాతులేమిటో  నాలాంటి  సంగీతం రాని వాళ్లకి  అనుభవంలోకి రాదు.  విని ఏదో ఆనందిస్తాము అంతే!  నేనంటానూ –  చిన్న వయసునుండీ , మట్టితో,  మొక్కలతో,పశువులతో,పశువుల పెంటతో అనుబంధం ఏర్పరుస్తే అది ఆజన్మాంతం ఆనంద హేతువవుతుందని! ఆవు పేడని  నీళ్లలో కలిపి కల్లాపి జల్లాల్లంటే  పేడని  చేతిలోకి  తీసికోవాలి కద! పల్లేలోపెరిగిన వారికి పేడను ముట్టుకోవడం అసహ్యం అనిపించదు. కల్లాపి జల్లడం ఒక కళ! ముగ్గులేయడం మరో కళ. మాఅమ్మయి  కూడా  నీటిలో పేడను కలపడానికి వెనుకాడేది కాదు. కానీ  దాని సహేలీలు కొంతమంది పేడను ముట్టుకోడానికి  ఒప్పేవారుకాదు. కల్లాపి పనిమనుషులు జల్లాల్సిందే!  చిన్ననాటి నా పల్లె  జీవితం నాకు ఆనంద హేతువైంది.  

     ఇప్పుడు నేనుంటున్నది ఒక  అపార్ట్ మెంట్  రండవ అంతస్థులో !  నాఅదృష్టం  కొద్దీ  తూర్పు వైపు  ఇంటి పొడుగునా  వరండా( బాల్కనీ)  వుంది , పైగా , ప్రక్కన వున్న   ఇంటిపైన   డాబామాత్రమే వున్నాది  ! అదీకాక   మా కిందన  ఒక లారీ సులభంగా వచ్చేంత  జాగా వదిలారు . అందువల్ల  నా గదులలోకి  రోజూ  సూర్యుడూ , చంద్రుడూ  వారి వారి సమయాలలో  తమ తమ సహజ కాంతి పుంజాలతో లోనికి వచ్చి నన్ను ఆనంద పరుస్తున్నారు . బాల్కనీ  పొడుగునా వేసుకొన్న కుండీలలో మొక్కలు …  నాపిల్లలే కదా !  పూలు పూస్తూ  ఉదయమే  నా మొఖంలో చిరునవ్వును వెలిగిస్తాయ్ !  నాస్నేహితురాలు గాయత్రి  అంటుందీ “ కృష్ణకుమారిగారూ!  మనం పెద్దపెద్దచెట్లనూ  రకరకాల మొక్కలూ అవీ  చూడాలను కొన్నప్పుడు  పార్కులన్నీ మనవేగా !  తీరిక చేసుకు  వెళదామూ!”  అంటుంది.   

       ఆ సంవత్సరం  మేము అపురూపంగా నాటిన నీలి చామంతి  ఏపుగా పెరిగి  మొగ్గ తొడిగిందని  చెప్పాకదా! అయితే ఒకే కొమ్మకి  దగ్గర దగ్గరగా,  గుత్తులు గుత్తులుగా మొగ్గలున్నాయి. ఆకాడ పొడుగునా,  మొగ్గల మొదల్లలోనూ నల్లని చీడ చేరింది. నాన్న  ఆకొమ్మకి  ఒకేఒక మొగ్గను .. మధ్యన వున్నదాన్ని-  వుంచి,  మిగిలినవన్నీ తీసేశాడు. ఓ ఆకుతో కాడను మడిచి  పట్టుకొని సున్నితంగా ఒత్తుతూ  దానికి  పట్టిన చీడను  చంపేసాడు. అలాగే మొగ్గ మొదలులో వున్న చీడనీ  తొలగించాడు.  నాన్న అటువంటి పనులు చేస్తున్నప్పుడు  ఆయన వెంటే నేనుండేదాన్ని.  “అంత దగ్గర దగ్గరగా  మొగ్గలుంటే వాటి వేటికీ  పూర్తిగా విచ్చుకోడానికి జాగా వుండదు.  బలంగా పువ్వులుండవు . కుంటి పువ్వులు , గుడ్డి పువ్వులు వస్తాయ్ “ అని చెప్పాడు . నాన్న కొమ్మకి  వదిలి పెట్టిన  మొగ్గ మనం ఆడుకొనే రింగు అంత పెద్దదిగా, పూర్ణంగా, గుండ్రంగా  విచ్చుకొంది. 

కథారచనలో  కూడా నాన్న  ఈ విధానాన్ని పాటించాడా అని నా కనిపిస్తుంది.  అనగా ఏకోన్ముఖంగానూ ,  కథకి  చీడ పట్టకుండానూ చూసుకొంటూ  స్వీయ విమర్శతో  తొలగించాల్సినవి తొలగిస్తూ చేసిన అభ్యాసంవల్ల తన కథా శిల్ప చాతుర్యాన్ని  సాధించాడా అని!  అనిపిస్తుంది. ఎంచుకొన్న వస్తువుని ఆవిష్కరించడంలో శిల్పాన్ని  చెడగొట్టే అంశాలు  రచనలో  చేరి  పొడుగు సాగితే  చాసో దానిని “ బోదకాలు పెంపకం” అనేవాడు. 

  పెద్దదిగా పూసిన  ఆ ఒకే ఒక  నీలి చామంతి  పువ్వు చాలారోజులుపాటు చెట్టునే వుంది . చెట్టునే వాడి పొయింది. నాన్న   పూవులు  కోసేయడానికి  ఇష్టపడే వాడు కాదు . చాలాపూవులు పూస్తే,  కొన్నేకోసుకొని  కొన్ని చెట్టుకి వదిలేయాలనేవాడు. మాబామ్మ  దేముని పూజకి ఎర్రమందారం పూసిన  ప్రతీపువ్వునీ  అందకపోయినా  కొక్కెంతో  కొమ్మ వంచి మరీ  కొసేసేది.! ఆవిడను నాన్న ఏమీ అనేవాడు కాదు,  కానీ ! “ చూడూ!  ఆవిడ ఒక్క పువ్వైనా వుంచకుండా  అన్నీ కోసేసింది”  అనేవాడు . కానీ అయితే ,నారెండు జడలలో  కనకాంబరాలూ, దమ్మిడీ  చామంతీ  మరువాల కదంబం  పెట్టుకొంటే ఏమనేవాడు కాదు. అవి చాలాపూలు పూస్తాయి! మొక్కకి వదిలే కోసేవారము కదామరీ! పూలతో  వున్న చెట్లను చూస్తూ వుండడం నాన్నకిష్టం.

*****

Please follow and like us:

2 thoughts on “జ్ఞాపకాల ఊయలలో (భాగం-7)”

  1. చాగంటి కృష్ణ కుమారిగారి జ్ఞాపకాలఊయల చాలా బాగున్నది అందరి అనుభవాలు బాల్యావస్ధ మనందరి మనస్సులో కలిగిస్తున్నారు

  2. జ్ఞాపకాల ఊయల రచన చాలా బాగున్నది కృష్ణ కుమారిగారు తమ జ్ఞాపకము లతో పాఠకుల నుగుాడా తమ తమ చిన్నతనానికి తీసుకొని వెళుతున్నారు ఊయలలుఊగిస్తున్నారు

Leave a Reply

Your email address will not be published.