“చెల్లీ .. చెలగాటమా? “

(ద్వితీయ వార్షిక సంచిక కథల పోటీ రచన)

– కోసూరి ఉమాభారతి

“అదేంటి? నేను కావాలన్న క్రీమ్స, షాంపూ, టాల్క్ తీసుకురాలేదేంటి? బుర్ర ఉందా లేదా? ఇడియట్.” గొంతు చించుకుని అరుస్తూ… సామాను డెలివరీ ఇచ్చిన అబ్బాయి మీద మండిపడింది రాధ.

“రేఖ గారు ఆర్డర్ చేసినవే తెచ్చాను మేడమ్.” అని వెనుతిరిగి వెళ్ళిపోయాడు వాడు.  

“రాధా ఏమిటా కేకలు?  హాస్పిటల్ నుండి ఇంటికొచ్చిన మీ నాన్న ఇప్పుడే కాస్త  తిని నిమ్మళంగా  పడుకున్నారు.” అంది వంటింట్లో నుండి పరుగున వచ్చిన సరస్వతి.

“నీ పెద్దకూతురికి పనిలేదా? నేను రాసిన లిస్టు నుండి అన్నీ తీసేసింది. అంతా దానిష్టమేనా? బోడిపెత్తనాలు అదీను. నేనే తెచ్చుకుంటాను డబ్బివ్వు.” అని నిలదీసింది తల్లిని.

“ నీకివ్వడానికి నా వద్ద ఇప్పుడు డబ్బులేదు. అయినా రేఖ లిస్టు నుండి తీసేసింది అంటే ఏదో కారణం ఉంటుంది. నీవెళ్ళు. నేను కనుక్కుంటాను.”  సర్దిచెప్పి అప్పుడే వచ్చిన లంచ్-బాక్స్ అబ్బాయికి పెద్దకూతురు రేఖకోసం పెట్టిన కేరేజీ తెచ్చిచ్చింది సరస్వతి.

“మీరిలా చేస్తే నేను అప్పుపెట్టి తెచ్చుకుంటాను. అప్పుడైనా మీరే కట్టాలి.” అనేసి రుసరుసలాడుతూ టవలందుకుని బాత్రూంలోకి వెళ్ళింది రాధ.  

‘పరిస్థితులు అర్ధం చేసుకోకుండా ప్రతిరోజూ ఇలా ఏదొకటి ..  తన ఖర్చు కోసం గొడవ పడుతున్న రాధ ఓ సమస్యగా మారింది.’  అనుకుంటూ వంటింట్లోకి నడిచింది సరస్వతి.  

సరస్వతి భర్త కేశవరావుకి ఫెర్టిలైజర్ కంపెనీ రీజనల్ మేనేజరుగా.. ప్రయాణాలతో పాటు అదనపు భత్యం ఉండేది.  అలాటిది ఆరునెల్లగా హృద్రోగంతో, విశ్రాంతిగా ఇంట్లోనే ఉండడంతో ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు.  వారం క్రితం బై-పాస్ సర్జరీ కూడా అవడంతో,  ఆరోగ్యదృష్ట్యా అతన్ని ముందుగానే పదవీ విరమణ చేయమని  కోరింది కంపెనీ.  భర్త అనారోగ్యం అన్నివిధాలా కృంగదీస్తున్న సమయంలో…  యోగా టీచింగ్, నృత్యశిక్షణ చేస్తూ.. పెద్దకూతురు రేఖ కుటుంబాన్ని ఆదుకోగలగడాన్ని మాత్రం అదృష్టంగా భావిస్తుంది సరస్వతి.

***

రాధ కాలేజీకి వెళ్ళిపోయాక,  తలుపులు వేసుకుని వెనుదిరిగిన సరస్వతి…  ”సరసా, ఓ సారి ఇటు రా.” అన్న భర్త పిలుపుకి ..  బత్తాయి రసం తీసుకుని అతని గది లోనికి వెళ్ళింది.

“ఇప్పుడే యోగా-సెంటర్ నుండి వసుంధర మేడమ్ ఫోన్ చేసింది.  ఆమె స్నేహితులు నిర్మించబోయే  ప్రయోగాత్మక చిత్రంలో.. నృత్యం, యోగాభ్యాసనలో ప్రావీణ్యత ఉన్న కొత్త నటి కోసం గాలిస్తున్నారట.  యోగా సెంటర్లో మన రేఖని వారు కలిసారట.  రేఖని నటించమని అడిగేందుకు,  నిర్మాత శర్మగారిని తీసుకుని ఇంటికి వస్తారటామె.” అంటూ సరస్వతి ఇచ్చిన జూస్ తాగి, తిరిగి గ్లాసునామెకి అందించాడు కేశవ. 

“చూడు సరసా, ఇక పొద్దుటినుండీ ఇంట్లో జరుగుతున్నదంతా విన్నాను.  రాధ తెలివి గలది. చదువుకుని డాక్టరో, టీచరో అయితే జీవితంలో స్థిరపడగలదు. అప్పు చేసైనా దాన్ని చదివించడానికి నేను సిద్దం.  ఉన్న ఒక్క తోబుట్టువు రేఖ

పట్ల..అదిలా ద్వేషం పెంచుకోడం, అక్కతో మాట్లాడకపోవడం ఎందుకో తెలీడం లేదు.” అంటూ వాపోయాడు ఆ తండ్రి. 

“అయినా రేఖ ఆసక్తులని ప్రోత్సహించడం మినహా దానికి ప్రత్యేకంగా మనం చేసిందీ లేదు.  నిబద్ధతతో స్వశక్తి పైనే ఎదిగి యోగా ఇన్స్ట్రక్టర్ గా పనిచేస్తూ, మొన్ననే భక్తిచానెల్ కి వ్యాఖ్యాతగా కూడా సెలెక్ట్ అయింది.  ప్రేమగా, అణుకువగా 

ఉంటుంది బంగారు తల్లి.” అంటూ కళ్ళు తుడుచుకుని పక్కకి తిరిగి పడుకున్నాడు కేశవ.

“అంతగా డీలా పడకండీ. అన్నీ సర్దుకుంటాయి. పెద్దదేమో..కెరియర్, ఉద్యోగం అంటూ అప్పుడే పెళ్లి చేసుకోనంటుంది. రెండేళ్ళు చిన్నదైనా, ఇరవైయేళ్ళు నిండబోతున్న మన రాధకి పెళ్ళిచేసి పంపితే మంచిదనిపిస్తుంది.” అంటూ… ఆమె తలుపు దగ్గరికి వేసి వంటింట్లోకి వెళుతుంటే హాల్లో ఫోన్ మోగింది.  

ఫోన్ తీయగానే.. అటునుండి రేఖ ‘హలోఅమ్మా, నీకు విషయం తెలిసిందిగా! వసుంధర మేడమ్ నాన్నకి ఫోన్ చేసారు కదా. అదే నా సినిమా అవకాశం గురించి.  మనం ఒప్పుకుంటే.. పాతికలక్షలు పారితోషికం ఇప్పిస్తానని మేడమ్ అంటున్నారు. అలాగయితే కాంట్రాక్టు సైన్ చేద్దామని నాన్నకి చెప్పు.”  అని ఫోన్ పెట్టేసింది.

***

రేఖ పనిచేసే ‘వేద యోగా-సెంటర్’ లో సిటీలోని సెలబ్రిటీస్, కళాకారులు, సినీరంగ ప్రముఖులు, వ్యాపారవేత్తలు లైఫ్-మెంబెర్స్.  అక్కడి యోగా-ఇన్స్ట్రక్టర్లు అందరిలోనూ ఇరవైరెండేళ్ళ రేఖ అంటే యోగా-స్టూడియో అధినేత్రి వసుంధరకి అభిమానం మెండు.  దానికి కూడా ఓ కారణముంది. మూడేళ్ళ క్రితం ‘టీచర్ ట్రైనింగు’కి రేఖ యోగా-స్టూడియోలో చేరగానే.. వసుంధర కూతురు వేదకి ఓ  స్నేహితురాలిగా దగ్గరయింది. మధుమేహ వ్యాధితో, స్థూలకాయంతో సతమవుతున్న వేద.. రేఖ ప్రోద్బలంతో జీవనశైలిని మార్చుకుని.. ఆరోగ్యానికి యోగాభ్యాసన,  సరదాకి నృత్యాభ్యాసన చేసి మూడేళ్ళలో పూర్తి ఆరోగ్యవంతురాలయింది. ఆ కృతజ్ఞతతోనే రేఖకి శ్రేయోభిలాషిగా మారింది వసుంధర.  కూచిపూడి నృత్యంలోనూ ప్రావీణ్యత ఉన్న రేఖని తన పలుకుబడితో ఓ నృత్య దర్శకురాలిగా కూడా నిలబెట్టాలన్నది వసుంధర ధ్యేయం.

***

సరదాగా జరిగింది సినీ-నిర్మాత శర్మతో సమావేశం. ‘మహేశ్వరి’ చిత్రంలో హీరోయిన్ గా నటించేందుకు రేఖ చేత ఒప్పందం చేయించి అడ్వాన్స్ కూడా ఇప్పించింది వసుంధర. “ఆరేళ్ళపాటు మాసంస్థ నిర్మించే చిత్రాల్లో నటించడానికి

 ప్రత్యేక ఒప్పందం కుదుర్చుకుంటుందా రేఖ?” అని శర్మ గారు అడిగినప్పుడు.. 

 “చిన్నప్పుడు మా అమ్మాయిలు చదివే స్కూల్లోనే వేదాంతం శర్మగారు పిల్లలకి కూచిపూడి నేర్పేవారు.  రేఖ ముచ్చట పడుతుందని నృత్యాభ్యాసనకి, వృత్తిగా చేపడతానంటే యోగాభ్యాసనకి ప్రోత్సహించాను సార్.  అంతా నాకు పైసా ఖర్చు లేకుండా స్కాలర్షిప్పులతోనే సాధించుకుంది.  ఇకపోతే,  రెండుమూడేళ్ళలో రేఖకి వివాహం చేయాలన్న ఆలోచనే తప్ప … సినీరంగంలో కొనసాగనిచ్చే ఆలోచన లేదు.” అని స్పష్టం చేసాడు తండ్రి కేశవ. 

మీ రెండో అమ్మాయికి కూడా ఈ కళల పట్ల ఆసక్తి ఉందా? అని శర్మ గారు అనడం… రాధ ఇంట్లోకి అడుగుపెట్టడం ఒకేసారి జరిగాయి. రాధని ఆయనకి పరిచయం చేసాడు కేశవ.

“రేఖలా నీవు కూడా పొందిగ్గా ఉన్నవమ్మా.  నీకు సినిమాలో నటించే ఆసక్తి ఉందా?” అడిగారు శర్మ.

“ఛాఛా, అటువంటి కళలు, ఇష్టాలు నాకు లేవు.  మా ఇంట్లో రేఖకి మాత్రమే అటువంటి ఆసక్తులు.  క్షమించండి.” అని లోనికి వెళ్ళిపోయింది రాధ.

***

రేఖకి ‘మహేశ్వరి’ సినిమా షూటింగ్ మొదలయ్యే నాటికి తోడుగా వెళ్లేందుకు.. కేశవ అక్క చిన్నమ్మని ఊరి నుండి పిలిపించారు. ముగ్గురు అక్కల్లోకి…కేశవకి చిన్నమ్మతోనే  సఖ్యత ఎక్కువ.  ఆమె పద్దతిగా ఉంటుంది. భర్త కాలంచేసి దాదాపు పదేళ్ళయింది.  ఆమె కొడుకులిద్దరూ తమ కుటుంబాలతో కడపలో స్థిరపడ్డారు.  తమ్ముడి కేశవ కుటుంబం అంటే ఆమెకి ప్రత్యేకమైన అభిమానం.  చిన్నమ్మ వచ్చి అప్పుడే వారమయింది.

***

 యోగా-సెంటర్ నుండి ఇల్లుచేరిన రేఖ ..చుట్టూ చూసి, ఇంట్లో ఎవరూ లేరేమని మేనత్త చిన్నమ్మని  అడిగింది.       “మీ నాన్న  వెనక గార్డెన్ లో ఉన్నాడు.  రాధేమో చిఫాన్ చీరలకి,  ఫారెన్ పర్ఫ్యూమ్స్ కి డబ్బు కావాలని ఇందాకే అమ్మతో గొడవపడి బయటికి వెళ్ళింది.  ఆ వెంటనే అమ్మ ఏదో గొలుసు పర్సులో కుక్కుకొని ఆటోలో వెళ్ళింది.” అంది చిన్నమ్మ.  మౌనంగా వింటుంది రేఖ.  “రాధ ఎప్పుడు ఏంచేస్తుందో అని మీ అమ్మకు భయంలా ఉంది.” అని చిన్నమ్మ అంటుండగానే గేటు ముందు ఆటో ఆగిన చప్పుడికి ఇద్దరూ ముందు గదిలోకి వెళ్ళారు.  

ఆటో దిగిన సరస్వతి గాబరాగా లోనికొచ్చి కూతురి బెడ్రూములోకి వెళ్ళింది.  చిన్నమ్మ, రేఖ ఆమెని అనుసరించారు.  ముఖం కడుక్కుని కాసిని నీళ్ళు తాగి “నాన్నెక్కడ? నాకోసం అడిగారా?” అడిగింది సరస్వతి ఆదుర్దాగా. 

తలుపులు దగ్గరికి వేసి “ముందు నువ్వు కూర్చోమ్మా” అంటూ తల్లిని మంచం మీద కూర్చోబెట్టి, ఆమె ముందు మోకరిల్లింది రేఖ. “చెప్పమ్మా..ఎందుకింత కంగారు? ఏం జరిగింది?” అని బతిమాలుతున్న కూతురి వంక చూసింది సరస్వతి.    

“ఎమి చెప్పను? అంతా నా ఖర్మనుకో.  నాన్న సర్జెరీ కోసం చేసిన అప్పు కొంచెం కట్టి, రాధకి ఓ పదివేలు సర్దుదామని గొలుసు తీసుకుని  జనరల్ బజార్ వెళ్తున్న నన్ను వెంబడించింది రాధ.  వస్తువు అమ్మగా వచ్చిన మొత్తం లక్షరూపాయలు నా చేతుల నుండి లాక్కుంది.  ఆ డబ్బు తనవద్దే ఉంటే కొన్నాళ్ళవరకు నా తోటి తిట్లు తినే అవసరం ఉండదంటూ నన్నే మాటలని వెళ్ళిపోయింది.” అంటూ దు:ఖిస్తున్న తల్లిపై జాలి కలిగింది రేఖకి.

*** 

మరునాడు మొదలవబోయే షూటింగ్ కోసం ఏర్పాట్లు చేసుకోసాగారు రేఖ, చిన్నమ్మ.  పచ్చివక్కలు, తమలపాకులు స్వయంగా చూసి తెచ్చుకుంటానని గేటవతల సూపర్-మార్కెట్టుకి వెళ్ళిన చిన్నమ్మ, పదినిముషాలలో హడావిడిగా సూట్-కేస్ సర్దుకుంటున్న రేఖ వద్దకి వచ్చింది.  “పెద్దమ్మీ, నేను షాపులో ఉండగా.. అక్కడకి ఎవరితోనో స్కూటర్ మీదొచ్చి దిగింది రాధ. చాలాసేపు అతని దగ్గరగా నిలబడి నవ్వుకుంటూ మాట్లాడి ఇంటికొచ్చిందమ్మా.” అంది స్వరం తగ్గించి చిన్నమ్మ. 

*** 

నిర్మాణం పూర్తయిన మూడు నెలలకి ‘మహేశ్వరి’ సినిమా విడులయి ప్రయోగాత్మక సినిమా విభాగంలో ‘బంగారునంది అవార్డు’ అందుకుంది. రేఖ నృత్యానికి, నటనకి గుర్తింపు లభించింది.  అందిన పారితోషకం నుండి ముందు తండ్రి మెడికల్ ట్రీట్మెంట్ అప్పులు తీర్చి,  వారి బెడ్రూములో ఎ.సి పెట్టించింది.  తల్లికి మూడులక్షల్లో నల్లపూసలు తీసుకుంది. రాధకి యాభైవేల రూపాయలు పుట్టినరోజు కానుకగా ఇచ్చి,  మిగిలిన డబ్బుని తండ్రి పేరిట ఫిక్సెడ్ డిపాజిట్ లో పెట్టింది.

***

ఆదివారం ‘ప్రత్యేకం’ అంటూ పొద్దుటే కిచిడీ, గారెలు చేసి ఇంటిల్లిపాదినీ టిఫిన్ కి పిలిచింది సరస్వతి.  అందరూ వచ్చి కూర్చున్నాక ..ముందుగా రాధకి వడ్డించి, “ఏమ్మా, నిన్నటి డాక్టర్ సంబంధం మా అందరికీ నచ్చింది.  నీవు కారణం 

చెప్పకుండా వద్దంటే ఎలా ..చెప్పు?”  అడిగింది రాధని. 

“నాకన్నా రెండేళ్ళు పెద్దదైన రేఖ పెళ్ళి చేయండి ముందు.  అదేమన్నా దిగొచ్చిందా? నేనేమో పెళ్ళిచేయండో అని 

ఏడుస్తున్నానా?” అంటూ కసరి అక్కడినుండి లేచి వెళ్ళిపోయింది.  బల్లవద్ద కూర్చున్న అందరూ ఖంగుతిన్నారు.

“సరేసరే గానీ చిన్నమ్మత్తా, నీవు తిరిగి ఊరు వెళ్ళేలోగా అమ్మానాన్నని తీసుకుని తిరుపతి, షిరిడి వెళ్లివస్తాను. రాధకి పరీక్షలట.  కాస్త కనిపెట్టుకుని ఉండు.  ఆ తరువాత నువ్వు, నేను యాదగిరిగుట్టకి, దుర్గమ్మ గుడికి వెళదాము.” అంది రేఖ.

***

నాలుగు రోజుల పాటు దైవదర్శనాలు ముగించుకుని తిరిగొచ్చాక.. అందరూ భోంచేసి, సేదతీరుతున్న సమయంలో

 రేఖ, సరస్వతిల వద్ద చేరింది చిన్నమ్మ. “రేఖా ..నీ చెల్లికి పరీక్షలన్నావు. కనిపెట్టుకుని ఉండమన్నావు. కాని ఈ నాలుగు రోజులూ.. పగలంతా నాగేంద్ర, శ్రీలేఖ అనే ఫ్రెండ్సుతో షికార్లు చేసి…భోజనం సమయానికి నాగేంద్రతో ఇల్లుచేరేది రాధమ్మ. భోజనం రూములోకే తీసుకెళ్ళి తలుపు వేసుకునేది. ఆ నాగేంద్ర ఎప్పుడు తిరిగి వెళ్ళేవాడో తెలీదు. నిన్నా, మొన్నా మాత్రం..శ్రీలేఖ ఇంట్లో గడుపుతానని వెళ్లి.. ఇదో మీరోచ్చే ముందే వచ్చింది.”  అంటూ నోరు నొక్కుకుంది ఆమె. 

“ఆయనకి తెలిస్తే గోలవుతుంది. పరువు పోతుంది. మీరెక్కడా ఏమీ అనకండి.” అన్న తల్లి మాటలకి విస్తుపోయింది రేఖ.  ‘అమ్మ, రాధల సంగతలా ఉంచితే,  ఇంట పరిస్థితులు అతిత్వరగా చక్కబడే మార్గం దొరికితే బావుణ్ణు’ అనుకుంది. 

రాత్రంతా ఆలోచించింది. ‘తండ్రికి నెలకి యాభైరెండు వేలు అందుతున్నాయి.  ఇల్లు సొంతమే.  ఇక రాధ.. ఆ నాగేంద్ర అనే అతన్నే తప్పక పెళ్ళాడుతుంది.  నిజానికి ముందుగా తన వివాహం జరిగితేనే కొంతవరకు పరిస్థుతులు సర్దుకుంటాయి. కాని ఇప్పటికిప్పుడు తనకి తగ్గ వరుడు కావాలంటే ….ముందుగా వసుంధర మేడమ్ నే సంప్రదించాలి.  జాప్యం చేయకూడదు’ అనుకుంటూ నిద్రలోకి జారుకుంది రేఖ.

మరునాడు ఒకింత ముందుగానే ‘యోగా సెంటర్’ కి వెళ్లి వసుంధరను కలిసింది. పరిస్థితులని మేడమ్ కి వివరించి, తన ఆలోచన తెలిపింది. సలహాసహకారాలని కోరింది.
 

సాయంత్రం పనయ్యాక, రేఖ ఇంట్లోకి వస్తూనే వెనుక గార్డెన్ లో ఉన్న అమ్మానాన్న, మేనత్తల వద్దకి నడిచింది. వసుంధర ఇచ్చిన కవర్ తల్లికందించి “మీతో వసుంధర మేడమ్ మాట్లాడారుగా! ఇదో ఆమె మీకిమ్మన్న వివరాలు. నేను ముఖం కడుక్కుని వస్తా.” అని లోనికి వెళ్ళింది.  

ఆమె తిరిగి వచ్చేప్పటికి కవర్ లోని పెళ్ళికొడుకుల ఫోటోలు, వివరాలు గురించి చర్చలు జరుగుతూనే ఉన్నాయి. రేఖని చూసి, “రా ఇలా కూర్చో, మా ముగ్గురికీ ఏకగ్రీవంగా ఇదో ఈ ‘రిషేంద్ర వర్మ’ అన్నివిధాలా బాగా నచ్చాడు.  నీవు ఇంగ్లాండ్ వెళ్ళిపోతావన్న బెంగ తప్ప ఇతను నీకు సరైన జోడీ.” అంది చిన్నమ్మ. 

తల్లితండ్రుల వంక చూసింది రేఖ.  నవ్వుతూ, ఔనన్నట్టు సమ్మతిని తెలిపారు.  “మీరు మెచ్చిన అబ్బాయితోనే నా వివాహం జరుగుతుంది. అయితే మీరు వెంటనే రాధతో కూడా మాట్లాడి తను ఇష్టపడే అబ్బాయి వివరాలు తెలుసుకుని పెళ్ళికి ఒప్పుకోండి. ..అంటే రాధ ఇష్టపడే అబ్బాయి ఒకతను… ఉన్నాడని ఈమధ్యే  తెలిసింది.. అందుకనీ..” అంటూ మేనత్త వంక చూసింది రేఖ. 

“చిన్నమ్మత్తా, వెళ్ళి రాధని పిలుచుకునిరా ప్లీజ్.” అని ఆమెని పంపించాక, “అమ్మా, నాన్నా.. మీకు నచ్చిన ‘రిషేంద్ర  వర్మ’ .. మన మేడమ్ అక్క గారి కొడుకు ‘రిషి’.  రిషి గారి వివరాలు గొప్పగా ఉన్నాయి కదూ!  అన్నివిధాలా అనువైన సంబంధం అనే  నా అంచనా కూడా.  అయితే.. అతనికి ఆరునెల్ల క్రితం ఇంగ్లండులోనే పెళ్లయింది.  కానీ వారి మధ్య సరిదిద్దుకోలేని వ్యత్యాసాలు తలెత్తడం వల్ల మూడునెల్లకే వివాహాన్ని రద్దు చేసుకున్నారట.  ఆ ఒక్క విషయాన్ని మనం వదిలేస్తే, అన్నివిధాలా నాకు సరయినవాడని మేడమ్ అన్నారు.  అతని వివాహం రద్దయిన డాకుమెంట్స్ ని మనం చూసేందుకు సంబంధిత వెబ్-సైట్ వివరాలు ఇచ్చారు మేడమ్.  ఈ సంగతి మన మధ్యే ఉంచి ఒప్పుకోండి.  తరువాత  రాధ పెళ్లి చేయండి.  అన్నీ సర్దుకుంటాయి.  కాబట్టి ఇదే కరెక్ట్ నాన్నా.  అమ్మా నన్ను నమ్ము.” అంది రేఖ.

రాధా, చిన్నమ్మ రావడం చూసి అక్కడినుండి వెళ్ళిపోయింది రేఖ. 

***

తరువాత రెండువారాలకి రేఖ, రిషిల వివాహం..ఆ వెంటనే రాధా, నాగేంద్రల పెళ్లి జరిగాయి.  భర్తతో రేఖ ఇంగ్లండుకి, నాగేంద్రతో రాధ విజయవాడకి కాపురాలకి వెళ్ళిపోయారు.  

*** 

రిషివర్మ ఇంగ్లండులో గొప్ప పేరున్న న్యూరోసర్జన్.  నిబద్ధత, క్రమశిక్షణలతో మసులుకునే యువకుడు.  ఒకరికోసం ఒకరు పుట్టినట్టుగా ఉన్న రేఖ, రిషిల కలయిక దైవనిర్ణయం అన్నట్టుగా ఉంటారు. భార్య నిత్యం కళ్ళఎదుటే  ఉండాలన్నట్టుగా..రేఖకి .. తన వైద్యసంస్థల్లోనూ గౌరవనీయమైన స్థానాన్ని కల్పించాడు రిషి.   అంతేకాక ‘అంజలి యోగా స్టూడియో’ స్థాపనలో ఆమెకి సహకారాన్నందించాడు.  వారాంతాల్లో యోగాభ్యాసన, ఔత్సాహికులకి కూచిపూడి నృత్య శిక్షణనిచ్చే తన భార్య గురించి ఎంతో గర్వపడతాడు కూడా.  రేఖ జీవితం స్వర్గతుల్యమేనని ఆమె తల్లితండ్రులు సంతోషించారు.

ఇక రాధ విషయానికి వస్తే…తరచుగా భర్తపై అలిగి హైదరాబాదు చేరడం, తన కనీసపు అవసరాలు తీర్చలేని భర్త  నచ్చడంలేదని ఫిర్యాదుచేయడం, అతన్ని తూలనాడ్డం పరిపాటయింది. మేనత్త వద్ద చేరి “ఆ పెద్దదేమో అష్టైశ్వర్యాల నడుమ.. అందం, హోదా ఉన్న భర్తతో సుఖంగా ఉందని తరిస్తున్నారు వీళ్ళు.  అరే! అటు పెద్ద చదువు గాని, ఇటు ఆస్థులు గానీ లేని వాడిని ఎలా పెళ్లాడుతావని నాలుగు తన్ని నాక్కూడా మంచి సంబంధం చేయకపోయారా? అసలా పెద్దదే ఇలా వీడితోనే నా పెళ్లయ్యేలా చేసి ఉంటుంది. అందరూ కలిసే నా జీవితాన్ని నాశనం చేసారు.” అంటూ ఏడుపొక్కటే తరువాయిగా వాపోతుంది.    

***

భర్తతో హైదరాబాదుకి వచ్చి తండ్రి యాభయ్యవ పుట్టినరోజు ఘనంగా జరిపించాలని రేఖ ఆశపడింది. తన ఈ  ప్రణాళికలో తల్లితండ్రులని, చిన్నమ్మని,  రాధని కూడా కలుపుకుని ముందుకు సాగింది.

కాపురానికి వెళ్ళిన రెండేళ్ళకి భర్తతో మళ్ళీ పుట్టింట అడుగు పెట్టిన రేఖకి.. చిన్నమ్మ దిష్టి తీయించి లోనికి ఆహ్వానించింది. తల్లితండ్రులు దిగులుగా, శారీరకంగా బలహీనపడి అగుపించడంతో భావోద్వేగానికి గురయింది రేఖ.  చంకన యేడాది పాపతో, మళ్ళీ ఆరునెల్ల గర్భంతో.. రాధ ఎదురొచ్చింది. 

పలకరింపులు, భోజనాలయ్యాక “ఎల్లుండి పొద్దుట మీరు సత్యనారాయణ వ్రతం చేసేందుకు, అదే రోజు సాయంత్రం  గ్రీన్-పార్క్ హోటల్లో మీ నాన్న పుట్టినరోజు వేడుక జరిపేందుకు నీ ఇష్టప్రకారమే ఏర్పాట్లయ్యాయి రేఖా.” అంది చిన్నమ్మ.

***

‘రిషి బావ’ అంటూ ఆత్మీయంగా మాట్లాడుతూ కలుపుగోలుగా తన భర్తతో మెలుగుతున్న రాధని చూసి..చెల్లెలు మారిందని భావించింది రేఖ.  దాని పాపని… రిషి ప్రేమగా దగ్గరికి తీసుకుని… ఆడిస్తుంటే ముచ్చటేసింది ఆమెకి. 

“బావా, మీకోసం ఆంధ్ర స్పెషల్..పూతరేకులు, మామిడి తాండ్ర.. మా వారికి చెప్పి విజయవాడ నుండి ఇవాళ పొద్దున్నే 

తెప్పించాను.  తిని చెప్పండి.”  అంటూ మధ్యాహ్న భోజనమయ్యాక ప్లేటు అందించింది రాధ.  

“నో నో రాధా ప్లీజ్..ఇలా స్వీట్స్ తిని లావెక్కితే, మీ అక్క నన్ను మరో నాలుగు యోగాసనాలు ఎక్కువ చేయిస్తుంది. రేపు తింటాను తప్పకుండా.” అనగానే చిన్నబుచ్చుకుంది రాధ.

“సరేలెండి..తానంటే ఓ మోడల్. ఫ్యామిలీ టైపు కాదుగా! ఇప్పటివరకు పిల్లని కూడా కనలేదంటే రేఖకి తన అందం, దేహ సౌందర్యం ఎంత ముఖ్యమో తెలుస్తుంది.  మీరైనా చక్కగా తిని చక్కగా ఉండండి.  మా పాపని ఇంతగా ముద్దు చేస్తున్నారు? మరి మీకప్పుడే పిల్లలు వద్దనుకున్నారా? లేక రేఖ పిల్లల్ని కనను అందా? అలాంటిదేదైనా ఉంటే చెప్పండి. మా బేబీని మీకు దత్తతిస్తాము.” అంటూ కిలకిలా నవ్వింది రాధ.  ఆ మాటలకి సరస, చిన్నమ్మ నివ్వెరపోయారు. రాధ మాటల్లోని వ్యంగ్యం, నిగూఢమైన ధోరణి రేఖని బాధించాయి.

కేశవ మాత్రం కూతురితో “రాధా, బావతో వ్యక్తిగత విషయాలు ప్రస్తావించడం, అక్కని నొప్పించడం వద్దు.” అన్నాడు. 

*** 

రాధ భర్త నాగేంద్ర పూజ సమయానికి వచ్చాడు.  పూజయ్యాక రిషి, రేఖలని ఆప్యాయంగా పలకరించాడు.  తన కూతుర్ని వొళ్ళో కూర్చోబెట్టుకుని, కొసరి కొసరి తినిపించాడు. సాయంత్రం కేశవరావు పుట్టినరోజు వేడుక బంధుమిత్రుల నడుమ ఆహ్లాదంగా జరిగింది.  యోగా స్టూడియో అధినేత వసుంధర మేడమ్ కూడా వచ్చి ఆనందంగా పాల్గొన్నారు.   

మరునాడు రోజంతా వసుంధర మేడమ్ ఇంట గడిపారు రిషి, రేఖ.  సాయంత్రమయ్యాక ఇంట్లో వాళ్ళందరికీ  

బహుమానాలతో ఇల్లు చేరారు. అందరూ హాల్లో కూర్చునుండగా.. రేఖ అందరికీ బహుమానాలు అందిస్తే, చిన్నమ్మ అందరికీ పకోడీ, టీ తెచ్చి అందించింది.  

“పకోడీ చాలా బాగుంది చిన్నమ్మ.  నాకు చాలా ఇష్టం.  ఇంగ్లండులో మాకు దగ్గరిలోనే ఉంటారు మా పేరెంట్స్. వారానికి రెండు సార్లైనా పకోడీ, రసమలై చేసిస్తుంది మమ్మీ.” అన్నాడు రిషి. 

 “మమ్మల్ని కూడా ఇంగ్లండుకి పిలిపించండి బావా.  నాగేంద్ర ఏదొక జాబ్ చేస్తాడు.  మీకు దగ్గరిలోనే ఉంటాము. రేఖ కూడా వర్కింగ్ కాబట్టి, నేను అన్నీ వండి టైంకి అందిస్తా.  మా పిల్లల్ని మీ పిల్లలే అనుకుని వాళ్ళతో ఆడుకోవచ్చు.” అంది రాధ.  

కాసేపు అలోచించాడు రిషి…“యూ నో.. మా అమ్మా, నాన్నా కూడా మమ్మల్ని అడగలేదు. గ్రాండ్- చిల్రెన్ కావాలని.  రేఖ ప్రేమలో పడి అసలా విషయమే తోచలేదు నాకు.  రేఖ వెరీ లవింగ్ గర్ల్. మంచి మదర్ కూడా అవుతుంది.”, “పోతే మీరు తప్పక ఇంగ్లండులో మమ్మల్ని విజిట్ చేయవచ్చు.” అన్నాడు రిషి.. 

మరికాసేపటికి నాగేంద్ర అందరివద్దా సెలవు తీసుకుని తిరిగి విజయవాడ వెళ్ళిపోయాడు.   ఆ తరువాత వారం రోజులపాటు  తల్లితండ్రులకి కావాల్సినవన్నీ సమకూర్చింది రేఖ.  రోజులు సరదాగానే గడిచాయి. 

***  

“రిషి, ఎల్లుండే కదా మన తిరుగుప్రయాణం.  తెల్లారుజామునే నీవు రాలేవు గానీ, రేపు పొద్దుట నాలుగింటికల్లా 

అమ్మానాన్నలతో  చిలుకూరు గుడికి వెళ్లి,  నీ కాఫీ-టిఫిన్ అయ్యేప్పటికి వచ్చేస్తా.   బ్రేక్ఫాస్ట్ కి.. నీకిష్టమైన పల్లీ పచ్చడి, పెసరట్టు, ఉప్మాతో  పాటు నాకోసం దహీవడ చేస్తుందట మా చిన్నమత్త.” అంది రేఖ రాత్రి భోజనం వద్ద.

***

పొద్దుటే బ్రేక్ఫాస్ట్ కి … రిషికి ఉప్మా, పెసరట్టు దగ్గరుండి కబుర్లు చెబుతూ వడ్డించింది రాధ.  “బావా, మీకు కొన్ని విషయాలు చెబుతాను. సానుభూతితో వినండి.  మా బాల్యంలో అమ్మానాన్నల  ప్రేమ, ఏకాగ్రత  అంతా రేఖకే దక్కింది. అది స్కాలర్‌షిప్పులతో చదువు-డాన్స్-యోగా ట్రైనింగ్ చేసి, జాబ్ చేసి కుటుంబాన్ని ఆదుకుందని.. నిత్యం దానికి హారతులు పడతారు.  నన్నసలు పట్టించుకునేవారు కాదు.  జాబ్ చేస్తూ, రేఖ ఇంటిపట్టున ఉండేదే కాదు.  నేను ఫ్రెండ్స్తో వెళితే మాత్రం చెడ్డదాన్ననే వారు.  ఆ కోపంతో నేను… తెలియక చేసిన తప్పుల్లోకల్లా పెద్దది… నాగేంద్రతో నా వివాహం.  అతను నాకు తగినవాడు కాదు బావ.  త్వరలో విడాకులు తీసుకుంటాను.” అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. రిషి ఇబ్బంది పడ్డాడు.  ఏడవద్దని వారించాడు.

తేరుకుని రిషి వంక చూసింది రాధ. “నాకు, పిల్లలకి మంచి జీవితం కావాలి బావా.  మంచి జీవితం కోసమే కదా రేఖ 

మిమ్మల్ని పెళ్లి చేసుకుంది. ఇప్పటివరకు నాగురించి ఆలోచించిన వారే లేరు.  కాని ఇప్పుడు సంస్కారవంతులు, విద్యావంతులైన మీరు నన్నర్ధం చేసుకొని నన్నాదుకోగలరనే నమ్ముతున్నాను.  వెంటనే కాకపోయినా నాకోసం ఏదైనా ఆలోచించండి.  మీ సాయం ఉంటే..ఇంగ్లండుకి వచ్చి చదువుకుని పని కూడా చేస్తాను.” అనేసి ఏడుస్తూ లోనికెళ్ళిపోయింది.

***

రేఖ ఇంటికొచ్చాక..  పక్కకి తీసుకుని వెళ్లి, చిన్నమ్మ పూసుగుచ్చినట్టు రాధ, రిషిల నడుమ జరిగిన సంభాషణ అంతా వివరించింది. అది విన్న రేఖ..పాదాల కింద భూమి కదిలినట్టయి మంచంమీద కుప్పకూలింది.  తాను లేని సమయంలో.. ఉన్నవీ లేనివి చెప్పి రిషి వద్ద తన గౌరవాన్ని దిగజార్చడమే కాక ఆదుకోమంటూ ప్రాధేయయపడ్డంలో రాధ ఆంతర్యం అర్ధంకాకపోగా అవమానకరంగా భావించింది రేఖ.  ‘ఇంగ్లాండులో స్థిరపడాలన్న తలంపున్నట్టు అమ్మా ద్వారా తనకి చెప్పించినా సరిపోయేది కాదా!’ అనుకుంది.  రాధ పట్ల కోపంగా, ఆమె ప్రవర్తన పట్ల అసహనంగా అనిపించింది ఆమెకి. 

‘చెల్లీ… ఇలా నాతో చెలగాటమా? జీవితమంటే ఓ ఆటగా ఉందా నీకు? తోబుట్టువు కదా అని సహించాను.  ఇక ఉపేక్షించను రాధా.  నీ వైఖరి మార్చుకునేలా చేస్తాను. నిన్ను మంచి మార్గంలోకి తెచ్చేందుకు గట్టిగా ప్రయత్నిస్తాను’ అని నిశ్చయించుకుని పడకగది వైపు కదిలింది రేఖ.  రిషి కూడా రాత్రి భోజనం మానేసి పాలు మాత్రం తాగి బెడ్రూంలోకి వెళ్ళిపోవడం అందరినీ కాస్త బాధపెట్టింది. 

***

మరునాడు పొద్దుటే ఉత్సాహంగా రేఖతోపాటు బ్రేక్ఫాస్ట్ కి వచ్చిన రిషిని చూసి అందరూ ఆనందపడ్డారు.  ఎదురుగా ఉన్న రాధని చూసి “నీవు చెప్పిన విషయమంతా రేఖకి చెప్పాను రాధా.  తనకి ఓ మంచి ప్లాన్ ఉంది. నిన్ను సంతోషంగా చూడాలని ఆశపడుతుంది.  ప్లీజ్ ఓ సారి నాగేంద్రకి ఫోన్ చేస్తావా? స్పీకర్ మీద పెడితే అందరం మాట్లాడుదాము.  మేము రేపు వెళ్ళిపోతున్నాము కదా!” అన్నాడు.  

అయోమయంగా చూసింది రాధ..భర్తకి లైన్ కలిపి.. విషయం వివరించింది. 

ముందుగా రేఖ మాట్లాడింది. “మరిదిగారు,  మేము ఇంగ్లాండ్ వెళ్లేముందు,  ఒక ప్రపోజల్ మీ ముందుంచుతాము. రాధకి ఇంగ్లండులో స్థిరపడాలని ఉంది.  మీరు, రాధ ఓ రెండేళ్ళపాటు కొంచెం శ్రమపడితే… సులువుగా అది నెరవేరుతుంది కూడా.  హెల్త్-కేర్ లో కొన్ని కోర్సెస్ పూర్తి చేస్తే.. మా హాస్పిటల్ ఎంప్లాయిమెంట్ స్కీమ్ ద్వారా మిమ్మల్ని పిలిపించే అవకాశం ఉంటుంది.  అలాగే రాధ కూడా కొన్ని ప్రత్యేక యోగా విధానాల్లో ట్రైనింగ్ కోర్సెస్ చేస్తే నా స్టుడియోలో ఉపాధ్యాయినిగా పిలిపించగలను.  ఆ ఏర్పాట్లు నేను చేస్తాను.  ఇదిగో రిషితో మాట్లాడండి.” అంది నాగేంద్రతో..

“హలో బ్రదర్,  రేఖ ప్లాన్ విన్నారుగా.  మా వైపు నుండి మేము మాటిస్తున్నాము.  మీరు రేఖ ప్లాన్ ప్రకారం ఫాలో అయిపోతే చక్కగా అంతా వర్క్-అవుట్ అవుతుంది.  ఇక అంతా మీ చేతుల్లోనే ఉంది.  అవసరమైన కోర్సుల లిస్ట్ నేను పంపుతాను.  వెంటనే మొదలుపెట్టండి.  ఇకపోతే, ఇప్పుడు…  ఈ సమయంలో ఓ శుభవార్త మీ అందరితో షేర్ చేస్తున్నాను.” అన్నాడు రిషి ఉత్సాహంగా. 

కుతూహలంగా వింటున్న అందరి వంకా చూసాడు రిషి… “మన ఫంక్షన్స్ హడావిడిలో ఇన్నిరోజులూ కంప్యూటర్ తీయనేలేదు.  రెండురోజుల క్రితమే రేఖ గైనకాలజిస్ట్ డా.  మేరీ పంపిన ఇ-మెయిల్ నిన్న రాత్రి చూసాను.  వచ్చేముందు రేఖ ఆమె వద్దకి మెడికల్ చెకప్ కి వెళ్ళింది.  అయితే… మన రేఖ ఇప్పుడు రెండునెల్ల గర్భవతి అని నిర్ధారణ చేసింది డా.  మేరీ.  రాధ ఏమంటా మా పుట్టబోయే పిల్లల విషయం ఎత్తిందో కానీ ఇంత త్వరగా ఈ వార్త వస్తుందని నేను అనుకోలేదు.  రాత్రే మా పేరెంట్స్ కి చెప్పాను.  వాళ్ళు హ్యాపీ.  ఇక్కడ మనం హ్యాపీ.  ఈ రోజు సాయంత్రం ఘనమైన వేడుక జరుపుకుందాము.  మా వసుంధర పెద్దమ్మకి ఇప్పుడే చెబుతాను.” అన్నాడు సంతోషంగా.  

  రాధ వంక చూస్తూ .. “మీరు వచ్చేప్పటికి… మాకు ఒకరో, ఇద్దరో పిల్లలుంటారేమో కూడా. మీ పిల్లలతో మా కిడ్స్ చక్కగా ఆడుకోవచ్చు.  ఇక అంతా నీ సంకల్పంలోనే ఉంది రాధ.  పట్టుదలతో ఈ రెండు మూడేళ్ళలలో సాధించు.  అందరికన్నానీ గురించి ఎక్కువగా ఆలోచించేది మీ అక్క రేఖ అని నాకు బాగా అర్ధమయింది.  మమ్మల్ని నిరుత్సాహపరచవద్దు. నీకు, నీ ఫ్యామిలీకి తప్పకుండా ఒక మంచి జీవితం ఇవ్వడానికి మేము రెడీ.” అన్నాడు రిషి.

నోటమాట లేకుండా భావోద్వేగానికి గురయింది రాధ.  మిశ్రమ భావనలు చుట్టుముట్టడంతో.. తలవంచుకుని కంటనీరు పెట్టుకుంది.  దాదాపు పదిహేనేళ్ళ తరువాత… మొదటిసారి చెల్లెలి భుజంపై చేయి వేసింది రేఖ. “అన్నీ చేయగలవు. అన్నీ సాధించగలవు.  ఇకపై నీ గెలుపే ధ్యాయంగా ముందుకి నడువు చెల్లీ.  నీకు అండగా నేనున్నాను.” అంది ప్రేమగా.

తలెత్తి అక్క ముఖంలోకి చూసిన రాధ,  మొట్టమొదటిసారిగా ఆమెలోని అనురాగవల్లిని  దర్శించుకుంది.  అక్క పట్ల ఇన్నాళ్ల తన వైఖరికి..  ఆమె మనసు పశ్చాత్తాపంతో నిండిపోయింది.    

అక్క చిరునవ్వులోని ఆత్మీయతని,  ఆమె మాటల్లోని మార్దవ్యాన్ని గుర్తించి..  కొండంత స్థైర్యం నిండిన మనసుతో .. తన భుజంపై ఉన్న అక్క చేతిని ప్రేమగా అందుకుంది రాధ.

****

Please follow and like us:

39 thoughts on ““చెల్లీ .. చెలగాటమా? “(ద్వితీయ వార్షిక సంచిక కథల పోటీ రచన)”

  1. కథ చాలా బాగుంది. చదువుతూ ఉంటే సన్నివేశాలు కళ్ళ ముందు కనిపించాయి. అంతే బాగా రాసారు.

    1. కధ మీకు నచ్చినందుకు, మీ స్పందనకు కృతఙ్ఞతలు.

  2. కధ చాలా బాగుంది ఉమా భారతి గారు. చెల్లెలు అక్క పట్ల ప్రవర్తించిన తీరు చాలా కోపం తెప్పించింది.అయినా సంయమనం కోల్పోకుండా అక్క సమస్యను భర్త సహాయంతో పరిష్కరించిన తీరు అద్భుతంగా ఉంది. రిషి వ్యక్తిత్వం గొప్పగా ఉంది.

    1. Girija గారు, మీ స్పందనకు హృదయపూర్వక కృతఙ్ఞతలు.

  3. నమస్తే అండి ఉమాభారతి గారు.మంచి కధ మధ్య తరగతి కుటుంబం బాధ్యత గల తల్లి తండ్రులు నిత్య జీవితంలో కూడ ఇలాంటివి ఎన్నో చూస్తుంటాం అక్క చెల్లెళ్లు మధ్య వున్న తేడాని చక్కగా విశ్లేషించారు.తండ్రి తర్వాత తను బాధ్యతాయుతంగా వుండటం అక్క పాత్ర ఆద్యంతం తన వారి కోసం పడే తపన సాదాసీదా
    సాగే జీవనం అక్క బాగుండటం చూసి ఓర్వలేని తనం
    ఆ చెల్లి ఆలోచనలతో సతమతమవటం రచయిత్రి గారు ఒక నాట్యకారిణి నాట్యం చూస్తుంటే తన్మయత్వంతో ఎలా మంత్రముగ్ధులం అవుతామో అలానే పాఠకహృదయాలని తన కధతో ఆకట్టుకున్నారు.చివరికి ఆ అక్క తన తోబుట్టువు జీవితం బాగుండాలని తన మనసులోని మాట చెల్లి కి చెప్పటం ఆ చెల్లి తన తప్పు తెలుసుకోవడం చాల బాగా చూపించారు. పశ్చాత్తాపంకి మించినది లేదు అభినందనలు అండి.

    1. Yamini గారు, మీకు నమస్సులు. మీ మాటలకు, కదా గురించిన మీ విశ్లేషణకు మనసు నిజంగానే నాట్యం చేసింది.. మీ స్పందనకు, కధ మీకు నచ్చినందుకు చాలా సంతోషం. మిక్కిలి ధన్యవాదాలు..

  4. The story sounds very realistic .Narration was good. On the whole the storyline was Interesting.

    1. వైజయంతి గారు, మీ స్పందనకి ధన్యవాదాలు.

  5. సుబ్బలక్ష్మి గారు మీ స్పందనకి, విశ్లేషణకి ధన్యవాదాలు. మీరన్నది చాలా కరెక్ట్. ఓ స్థాయికి చేరడంలో శ్రమ, ఒడుదొడుకులు, కష్టనష్టాలు, అవాంతరాలు ఎన్నో.. _/\_

  6. Hi Uma! A very great story. Chavadam prarambhincheka manalni aa sannivesam loki teesikellipotundi. Adbhutham. Kadhanam parugu venta naa kallu aagakunda paritettayante nammandi. Expect to see more stories from u soon. With love..ugadi vasantha

    1. మీకు కధ నచ్చినందుకు, మీ స్పందనకు కృతఙ్ఞతలు వసంత గారు.

  7. మన చేతికున్న ఐదువేళ్ళు ఒకేలా వుండవు. అలాగే, కుటుంబంలో పుట్టిన పిల్లలందరి మనస్తత్వాలు ఒకేలా వుండవన్న విషయం మనందరికి తెలిసిన విషయమే. ఈ కథలో చెల్లెలి పాత్రను బాగా వ్యక్తీకరించారు రచయిత్రి. ఆ విధంగా అక్క పాత్ర ఆటోమేటిక్ గా ఉన్నతమైంది. ఒక గీత పక్కన ఎంత చిన్నగీత గీస్తే అది అంత పెద్దదై పోతుంది అన్న చందాన.

    కష్టించి పనిచేయని వారు డబ్బు సులభంగా సంపాదించటానికి ఎలాంటి మార్గాన్నైనా ఎన్నుకుంటారని ఈ కథ స్పష్టంగా చెబుతున్నది. కుటుంబ విలువలను, సంబంధాలను చక్కగా విశదీకరించిన కథ ఇది.

    1. నిజమే M.J గారు, మీరు అన్న ఐదువేళ్ళ సిద్ధాంతాన్ని నేను నమ్ముతాను. మీ స్పందనకి, చక్కని విశ్లేషణకి నమస్సులు. ధనువాదాలు.

  8. వసంతలక్ష్మి గారు, ముందుగా మీ స్పందనకి ధన్యవాదాలు. మీరు అందంగా హృద్యంగా వినిపించే నా కథలు … నాకు ఎంతో స్ఫూర్తినిస్తాయి అన్నది నిజం. కొత్తగా రాస్తున్న ప్రతి కధని మీరు ఎలా పలికి వినిపిస్తారో అనుకుంటూ రాస్తాను.. మీకు ఈ కధ నచ్చినందుకు సంతోషం.. _/\_

  9. ఒకే ఇంట్లో పుట్టిన అక్కాచెల్లెళ్ల మనస్థత్వాల మధ్య ఇంత వ్యత్యాసం ఉన్నా చివరికి చెల్లెల్లో మార్పు రావడం బావుంది

    1. మీ స్పందనకి ధన్యవాదాలు.. _/\_ మాలతి గారు

  10. ఉమాభారతి గారు రాసే కథలన్నీ కుటుంబ వాతావరణం లో వుండడమే కాకుండా అందులో మనుషుల స్వభావాలు…వాటిని సరిదిద్దే పరిష్కారము కూడా తప్పకుండా వుంటుంది. రేఖ వంటి సహృదయరాలు, మొండితనం, మూర్ఖత్వం వున్న చెల్లెలను ఎలా దారిలోకి తెచ్చిందో ఈకథలో మంచితనంతో చక్కగా తెలియపరచి…కథకు మంచి ముగింపు నిచ్చేరు. అభినందనలు ఉమాభారతి గారూ 💐

    1. మీ స్పందనకి, విశ్లేషణకి కృతఙ్ఞతలు సరస్వతి గారు . _/\_

  11. Chelly chelagatama title bagundy.story line chala bagundy.chivariki mugimpu ela vuntundy ,malli malli chadavalani anipinchela vundy.

    1. మీ స్పందనకి, ధన్యవాదాలు శోభా గారు _/\_

  12. Storyline chala chala bagundy.chivariki emi jarugutundy anna asakthi ,malli malli chadavali anpinchela vundy Uma bharathi chelly chelagatama anna story.title bagundy

  13. ఒక పాటనో .. నృత్యాన్నో… చిత్రలేఖనాన్నో అనుసంధానిస్తూ వ్రాసే కథలెప్పుడూ మనసును హత్తుకుని మనని వెంటాడుతాయి. ఆకోవకి చెందిన కథను స్వయంగా ఓ కళాకారిణి కలం నుంచి జాలువారితే… మరింత మనోరంజకమే.
    ఈకథ అటువంటిదే. రెండు విభిన్న కళలలో ప్రావీణ్యం ..కౌశలం నన్ను అచ్చెరువొందేలా చేస్తుంటుంది … వీరి కథలను అనేకం నా ఆడియో చానెల్ వసంతవల్లరి కి చదివిన అనుభవం నాది .🙏🏽

    1. చాలామంది తలెత్తి ఎత్తైన ఏడంతస్తుల భవనాన్ని చూసి ఈర్ష్య పడతారే కానీ ఆ ఏడంతస్తులూ నిలవడానికి పడవలసిన గట్టి పునాది భూమిలోనే వుందని గ్రహించరు. అంత గట్టి పునాది కోసం ఎంత కృషీ, పట్టుదలా కావాలో ఎంతో హృద్యంగా చెప్పిన అక్క రేఖలాంటి పాత్రను ఎంతో అద్భుతంగా సృష్టించారు రచయిత్రి ఉమాభారతిగారు. నిజమే…ఒక అంతస్తుకు చేరుకోవడమంటే చెలగాటం కాదని చక్కటి కథ ద్వారా చెప్పిన ఉమాభారతిగారికి అభినందనలు..

      1. సుబ్బలక్ష్మి గారు మీ స్పందనకి, విశ్లేషణకి ధన్యవాదాలు. మీరన్నది చాలా కరెక్ట్. ఓ స్థాయికి చేరడంలో శ్రమ, ఒడుదొడుకులు, కష్టనష్టాలు, అవాంతరాలు ఎన్నో.. _/\_

    2. వసంతలక్ష్మి గారు, ముందుగా మీ స్పందనకి ధన్యవాదాలు. మీరు అందంగా హృద్యంగా వినిపించే నా కథలు … నాకు ఎంతో స్ఫూర్తినిస్తాయి అన్నది నిజం. కొత్తగా రాస్తున్న ప్రతి కధని మీరు ఎలా పలికి వినిపిస్తారో అనుకుంటూ రాస్తాను.. మీకు ఈ కధ నచ్చినందుకు సంతోషం.. _/\_

  14. కళాకారిణి ఉమాభారతిగారు తమ రచనలలో కళలకు తప్పనిసరిగా ప్రధాన పాత్ర కల్పిస్తారు. ఆసక్తికరంగా సాగుతుంది కథనం. చెల్లి పాత్ర తొందరపాటుతనం, అసూయా తత్వం కలగలిపినది ఐనా చివరికి తన తప్పు తెలుసుకునేట్లు చేసి సుఖాంతం చేశారు. కథనం చదివించేటట్లుగా ఉంది. రచయిత్రికి అభినందనలు.

    1. నిజమే భానుమతి గారు.. కళారాధన, లేదా కళాభ్యాసన లేకుండా పాత్రలని సృజించే యత్నం చేయాలి. కధాంశం నచ్చినందుకు, మీ స్పందనకి, విశ్లేషణకి ధన్యవాదాలు _/\_

  15. కథ చాలా బావుంది. ఉమా భారతి గారికి అభినందనలు.

  16. చాలా చాలా బాగుంది‌. అక్కా పట్ల ఈర్ష్యా భావంతో మెలిగే చెల్లి, అవివేకంతో అందరిజీవితాలు నాశనం చేయబోతున్నాం, తన మంచితనం, తెలివితేటలతో అక్కా సమస్యకు చక్కని పరిష్కారమార్గం చూపటం చాలా బాగుంది.

    1. Lalitha గారు, మీరు సమయం తీసుకుని చదివినందుకు, మీ స్పందనకి ధన్యవాదాలు.. _/\_

  17. కోసూరి ఉమాభారతి గారు మంచి కథారచయిత్రి..తాను నాట్యకారిణి అయినా సాహిత్యం పట్ల అంతులేని అనురక్తి. మనసు ఎంత సున్నితమో కథలు కూడా ఆ సున్నితత్వాన్ని పుణికి పుచ్చుకుంటాయనడానికి చెల్లీ చెలగాటమా ..కథ సాక్ష్యం ..సున్నితమైన రేఖ పాత్ర ను చూస్తే మనకు తెలుస్తుంది. రాధ సగటు అక్కాచెల్లెల్లా ప్రవర్తిస్తూ అక్కను చూసి ఓర్వలేక ప్రవర్తించిన తీరు సహజంగా కళ్లకు కట్టినట్లుగా చూపించారు. బాధ్యత కలిగిన రేఖ ..కుటుంబంలో అటు చెప్పలేక ఇటు చెప్పలేక నలిగే తల్లి పాత్ర మొత్తంగా కథ కథలా కాకుండా మనింట్లో సంఘటనల్లా సహజంగా చూపించారు ఉమా గారు. రిషి , నాగేంద్రలను అద్భుతంగా మలిచారు..,చక్కని కుటుంబకథ. త్యాగం , ఆదర్శం, బాధ్యత, అపార్థం, పశ్చాత్తాపం వీటిని అందంగా మలిచిన కోసూరి ఉమా భారతి గారి కథ నాకెంతగానో నచ్చింది. రచయిత్రికి నా అభినందనలు.

    1. మీరు కధలోని పాత్రలని అంత సూక్ష్మంగా సమీక్షించడం నాకు చాలా ఆనందంగా ఉంది విజయ గారు. మీ ప్రోత్సాహకరమైన స్పందనకి, compliments కి, ఈ చిన్న కధని ఆసక్తిగా చదివి స్పందించినందుకు మిక్కిలి కృతఙ్ఞతలు. _/\_

  18. ‘చెల్లీ, చెలగాటమా?’ మంచి కథ. మంచిని పంచే కథ. ఈ రచయిత్రి కథలలో ఒక మంచి పాత్ర కంపల్సరీ గా ఉంటుంది. ఆదర్శవంతమైన పాత్ర రేఖ ది. ముగింపు సంతృప్తి కరంగా. ఉంది.

    ఇచ్ఛాపురపు జగన్నాథరావు గారి కథలలా, ఉమా భారతి గారి కథలలలోని పాత్రలు హై సొసైటీలో మెసలే పాత్రలే! అయితే, కథలలో కరుణ రసం ఉంటుంది, ఆర్ద్రత ఉంటుంది, ఏమి జరుగుతుందో ననే ఉత్సుకత ఉంటుంది! పాఠకులను కట్టి పడేసి చదివించేందుకు ఈ విధానం చాలదూ? కథా సంవిధానం టాప్ గేర్ లో నడిచింది. కాస్త నెమ్మదిగా సాగితే ఇంకా బాగుండేది అనిపించింది.

    మంచి కథ నందించిన ఉమా భారతి గారికి అభినందనలు.

    1. ముందుగా సమయం తీసుకుని కధ చదివి స్పందించినందుకు మిక్కిలి ధన్యవాదాలు. పాత్రల విషయంగా మీ విశ్లేషణ నన్ను ఆలోచింపజేసింది. హై-సొసైటీ element ని లేకుండా ఆసక్తికరమైన కధనాన్ని సృజించాలి. అదే నా హోమ్-వర్క్.
      మీ కామెంట్ కి సదా కృతఙ్ఞతలు. ధన్యోస్మి… _/\_

Leave a Reply

Your email address will not be published.