“అమ్మను దత్తు ఇవ్వండి”
(ద్వితీయ వార్షిక సంచిక కథల పోటీ రచన)
– వాడపల్లి పూర్ణకామేశ్వరి
శ్రావణ శుక్రవారంనాడు మహాలక్ష్మి పుట్టింది. బంగారుబొమ్మలా వుంది, అంతా అమ్మ పోలికే. పోలేరమ్మ ఆశీర్వాదంతో నీ ఇల్లు పిల్లాపాపలతో చల్లగా వుండాలమ్మా. పిల్లలున్న లోగిలే సిరిసంపదలకు నిలయం, బాలింతరాలు కమలతో బామ్మా అంటూ సంబరపడిపోయింది.
కమలకు ఇద్దరు అబ్బాయిలూ, ఒక అమ్మాయి. ఇది నాలుగవ కాన్పు. బంగారుబొమ్మ అని బామ్మ అంటుంటే, ప్రాణస్నేహితురాలు సీత మాటలు జ్ఞాపకం వచ్చాయి. ఏటేటా పోలేరమ్మ పూజలు తనతో పాటు సీతా చేసింది. పదేళ్లుగా పూజలూ, వ్రతాలూ చేస్తూనే వుంది. ఈసారి నీ బిడ్డను నాకు ఇస్తావా కమలా, ఆర్తిగా అన్న ఆమె మాటలు కమలగుండెల్ని పిండేశాయి. అడిగిన ఆ సమయానికి సీతకు సమాధానం చెప్పలేకపోయినా, మనసులో మాత్రం ప్రాణ స్నేహితురాలైన సీతకి తన నాలుగవ బిడ్డను దత్తత ఇవ్వడానికే నిశ్చయించుకుంది. ఆమేరకు భర్తకు కూడా నచ్చచెప్పి ఒప్పించింది.
“ఏవండీ, మనదీ అంతంత మాత్రం స్థితే. అత్తెసరుగా సాగుతున్న ఆర్థక పరిస్థతే. మన బిడ్డ మనకు బరువుని కాదు. నారు పోసిన వాడు నీరుపోయకా మానడు. కాకపొతే, ఐనవాళ్ల ఇంట మన కళ్ళముందే పెరుగుతుంది. ఆస్తిపాస్తులలో తులతూగుతుంది. అన్నిటికీ మించి బిడ్డలకోసం పరితపిస్తున్న ఆ దంపతుల బిడ్డగా అల్లారు ముద్దుగా పెరుగుతుంది. మీరు అంగీకరిస్తారనే ఆశతోనే కోరుతున్నాను. వాళ్ళకొక్కగాని ఒక్క మగపిల్లాడేనని, కన్యాదాన ఫలితం దక్కాలని మా సూర్యం మావయ్య దంపతులతోనే నాకు కన్నెధార పోయించారు మా నాన్నగారు. ఆ ఇంటికే సీత కోడలైంది. ఆ ఋణం కూడా తీరుతుంది. వారిచేతుల మీదుగా జరిగిన పెళ్ళి మనది” అంటూ భర్తను అడగింది. పుట్టింది ఆడపిల్లకదా, పెళ్ళిబరువు తగ్గుతుందని మధ్య తరగతి తండ్రిలా రంగారావు ఆలోచించడమూ, వెంటనే సరేనని ఒప్పుకోవడము జరిగిపోయాయి. పురిటికందుని మనసారా చూసుకుంటూ, నీకు అమ్మను నేనైనా, ప్రేమను పంచి లాలిచే అమ్మ సీతే, అంటూ ముద్దాడింది.
*****
సీతమ్మ బిడ్డగా శ్రావణి అల్లారుముద్దుగా పెరుగుతోంది. అయినవాళ్ళే కావడంతో పెళ్ళిళ్ళకూ పేరంటాలకూ రెండు కుటుంబాలూ కలుసుకుంటూనే వుంటారు. సీత పెంపకంలో వున్నందువల్ల బిడ్డ దూరమైందన్న వెలితి కమలకు ఎన్నడూ అనిపించలేదు.
కుంటుగా సాగుతున్న రంగారావు వ్యాపారం దశ మారింది. భగవదనుగ్రహంతో లాభాలు వస్తూ, దినదిన ప్రవర్ధమైనమైయ్యింది. ఎంతో వృద్ధి చెందింది. చిన్న పెంకుటిల్లు రెండంతస్తుల మేడగా మారింది. కొడుకులిద్దరూ ఉన్నత విద్యలనభ్యసించి డిగ్రీలందుకున్నారు. అమ్మాయి డిగ్రీ పూర్తి కావస్తోంది. ముగ్గురిలోకి చిన్నదైనా సరే, ఆడపిల్ల పెళ్ళి ముందుగా చెయ్యాలని సంకల్పించి సంబంధాలు చూడడం మొదలెట్టారు. ఐనవారిలోనే మంచి సంబంధం కుదిరి యోగుడైన వరునితో అంగరంగవైభవంగా పెళ్లి చేసారు. ఆ పెళ్ళికెళ్ళినప్పుడే, శ్రావణి కమలకు బాగా చేరువయ్యింది. జన్మనిచ్చిన తల్లి ఆమేనని అంతకు మునుపే తెలిసినా, రక్తంపంచిన అమ్మ ప్రేమను అప్పుడే చవిచూసింది. సీతమ్మ శ్రావణిపై ప్రాణాలే పెట్టుకున్నా, పేగు బంధంలోని అనుభూతిని అప్పుడే తొలిసారిగా పొందింది.
జపాన్లో వున్న బ్రాంచిలో వ్యాపారం కుంటుపడి విపరీతమైన నష్టాలకు దారితీస్తోందని, దాన్ని పునరుద్ధరించడానికి అన్నివిధాలా అర్హుడైన రామ్మూర్తిని ఆ బాధ్యత చేపట్టమని కంపెనీ యాజమాన్యం కోరింది. వారు ఆశించిన ఫలితాలను చూపగలిగిన సామర్ధ్యం తనకున్నందు వల్లనే అట్టి ప్రస్తావన చేసారు.
రాంమూర్తి దంపతులు, శ్రావణిను తీసుకుని జపాన్ పయనానికి సిద్ధమైయ్యారు. దత్తు వెళ్లినా ఇన్నేళ్ళూ కన్నకూతురు కళ్ళెదుటే వుంది, ఇప్పుడు దూరమవుతోందిని బెంగగానే అనిపించింది కమలకు. ఒక్క ఏడాది ఎంతలోకి తిరిగొస్తుంది, ఐనా నీతో మాట్లాడకుండా నేను మాత్రం వుండగలనా, వారంవారం ఫోను చేస్తానులే. శ్రావణి మాట్లాడుతూనే వుంటుందిలే, ఒదార్పుగా చెప్పింది సీత.
జపాన్ దేశం, వారి సంస్కృతీ, సంప్రదాయాలు, అన్నిటికంటే ముఖ్యంగా వారిలోని పట్టుదలా కార్యదీక్షలు శ్రావణిని ఎంతగానో ఆకట్టుకున్నాయి. కుటుంబ వ్యవస్థ పై వారికున్న నమ్మకం, కుటుంబాలలో పెద్దలకు వృద్ధులకూ వారిచ్చే మర్యాదా-మన్ననలు ఎంతో ఆనందాన్ని కలిగించాయి. ఎన్నో కొత్త విషయాలు నేర్చుకుందుకు ఇదొక చక్కటి అవకాశంగా భావించింది. చురుకుతనంతో పాటు ఆసక్తి కూడా ఉన్నందువల్ల, రెండు ముడు నెలలకే, కొత్త భాష యిట్టె నేర్చేసుకుంది. సోషల్-వర్క్ ఎండ్ సొసైటీ ప్రోగ్రెస్ అన్న అంశంపై పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సు జపాన్ యూనివర్సిటీలో చేసింది.
కంపెనీ వారు ఆశించినట్టుగానే అక్కడి బ్రాంచ్ ఒక కొలిక్కి వచ్చినందున వారి కోరికను మన్నిస్తూ, ముందుగానే రామ్మూర్తి గారు అభ్యర్ధించినట్టుగనే మళ్ళీ స్వదేశానికి తన బ్రాంచికే పోస్టింగ్ ఇచ్చారు.
ఈ గాలి, ఈనెల ఈవూరు సెలయేరు.. అన్న పాట వింటూ మన దేశపు మన్ను వాసన కమ్మతనమే వేరు అనుకుంటూ విమానాశ్రయం నుండి ఇల్లుచేరుతూ ఉప్పొంగిపోయాడు రామ్మూర్తి. ఐతే ఆ ఆనందం ఎంతో కాలం నిలవలేదు. రెండునెలలైనా తిరక్కుండా రామ్మూర్తి పనిచేస్తున్న ఎం.ఎన్.సిని, మరో కంపెనీ కొనుగోలు చేసింది. భారతదేశం ఆపరేషన్సుకు మొత్తంగా స్వస్తి చెపుతూ పన్నెండొందల మంది ఉద్యోగస్తులకు పదవి-విరామ నోటీసులు పంపారు. కంటితుడుపుగా ఒక నెల ఎక్స-గ్రేషియా ఇచ్చారు. బెగ్గర్స్ అర్ నాట్ చూసర్స్ అన్నట్టు, దణ్ణం పట్టి వెళ్లడం తప్ప చేయగలిగిందేమీ లేదనుకుని వాపోయారు ఉద్యోగస్తులు.
అనేక ఉన్నత పదవుల్లో ఎన్నో బాధ్యతలను స్వీకరించి కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ సేవలందించి మంచి పేరు తెచ్చుకోడవమేకాకుండా కంపెనీకి ఎన్నో లాభాలు సంపాదించి పెట్టడానికి దోహదపడ్డాడు రామ్మూర్తి. ఉద్యోగం లేకపోవడం తలకొట్టేసినట్టయ్యింది. చేయని తప్పుకు శిక్ష అనుభవిస్తున్నానని లోలోపల కుమిలి పోసాగాడు. మనోవ్యధను మించిన వ్యాధిలేదన్నట్టు, అది అతణ్ణి నిలువెల్లా దహించేస్తూ అమాంతంగా ఆతని ప్రాణాన్నే కబళించేసింది. బళ్ళు ఓడలవుతాయి ఓడలు బళ్లవుతాయన్నట్టు, తల్లకిందులైన పరిస్థితికి తల్లడిల్లింది సీత. ఐతే కర్తవ్యం ముందు బాధ చిన్నదైంది. జీవితమంతా కూడబెట్టిన దానితో తగిన సంబంధం చూసి శ్రావణి పెళ్లి చేసింది సీతమ్మ.
ఒక్కగానొక్క బిడ్డ అవ్వడంతో, పెళ్ళిలో శ్రావణి కోరిన కోరికల్లా అమ్మ తనతోనే ఉండాలన్నది. అందుకు ఒప్పుకున్నవాడితోనే తన పెళ్లి జరుగుతుందని ఖచ్చితంగా చెప్పేసింది. ఆమె మనసుకు తగ్గట్టు ధనవంతుడు కాకపోయినా గుణవంతుడే భర్తగా లభించాడు. శ్రావణి సంసారం ఆనందంగా సాగిపోతోంది.
*****
“మా రెండో అన్నయ్య పెళ్ళి కదా సుబ్బమ్మత్తా, చాలా ఏళ్ళ తరువాత అమ్మను తీసుకునొచ్చాను” పెరిగిన ఊళ్ళోకి దిగుతూనే ఆప్యాయంగా ఒక్కొక్కరినీ పలుకరిస్తోంది శ్రావణి.
తనకి పెళ్ళై అత్తారింటికి వెళ్ళపోయాకా కన్నతల్లిని చూడడం ఇదే మొదటిసారి. రామ్మూర్తి పోయిన సంవత్సరమే రంగారావుకూడా క్షయవ్యాధితో బాధపడి కాలంచేసారు. అప్పుడు చూడడమే. చంకనున్న బిడ్డను ఆమె చేతికందిస్తూ, “ఇదిగోనమ్మా నీ మనవడు” అనునయంగా అంది .
అందుకుందేకానీ అమ్మ మొహంలో జీవకళ కనబడలేదు. ఏదో పోగొట్టుకున్న దానిలా నిరాశగా వుంది. నాన్నగారు పోయినప్పడు కూడా అమ్మను ఇంత వేదనగా చూడలేదు. అప్పటినుండీ అలా ఐపోయిందన్నమాట నిజమేకానీ, ఆమెను మరింకేదో బాధ దొలిచేస్తోందని ఇట్టే గ్రహించింది శ్రావణి.
రెండో అన్నయ్య ఇల్లరికం వెళుతున్నాడని అక్కడికొచ్చాకే తెలిసింది. ఐశ్వర్యంలో పెరిగిన ఒక్కతే కూతురని మావగారు ఆశపడి వుంటారు అనుకుంది. దుబాయిలో పెద్ద చమురు కంపెనీలో పెద్దన్నయ్యకి ఉద్యోగం వచ్చిందిట. ఒదినా పిల్లలతో వచ్చే నెలలోనే వెళ్ళిపోతున్నాడుట. అక్కయ్య ఇల్లు కట్టుకుంటోంది. త్వరలో గృహప్రవేశం తలపెట్టిందిట. అందరూ అభివృద్ధి పథంలోనే పయనిస్తున్నారు. అన్నీ శుభవార్తలే వింటున్నాను అనుకుని సంబరపడింది శ్రావణి.
“అమ్మ వడిలో వాలి సేదతీర్చుకుంటున్న శ్రావణి కురులని నిమురుతూ వణుకుతున్న స్వరంతో, కన్నానే కానీ నిన్ను నేను పెంచలేదు. శ్రావణి బుగ్గపై కన్నీటి చుక్క రాల్తుండగా, నిన్ను దత్తు ఇచ్చాము. అడగచ్చునోలేదో తెలియదుకానీ, ఇప్పుడు జీవితపు చివరి దశలో నాకు నీ ఇంట ఆశ్రయమివ్వగలవా తల్లీ” అర్థిస్తున్నట్టుగా అడిగింది, కమల.
ఒడిలో పడుకున్న శ్రావణి అమ్మను చుట్టేసుకుంటూ, యీ కోవెలలోనే నవమాసాలూ గర్భవాసం చేసాను. అటువంటి అమ్మ నిలువనీడలేక ఆశ్రయాన్ని అర్ధస్తోందా? ఇంతటి దుస్తితి ఏ తల్లికీ రాకూడదు. ఎంత దురదృష్టకరమోనని బాధ పడింది. ఆమె దుఃఖానికి కారణం అర్థమైయ్యింది.
అప్పగింతలు పూర్తై, ఆడ పెళ్ళివారితో ఇల్లరికానికి వెళ్ళిపోయాడు చిన్నన్నయ్య.
ఒప్పందం ప్రకారం ఆస్తి పంపకాలు అయ్యాక వారి అల్లుడి వాటాను బ్యాంకు ఖాతాలో వేసి అప్పచెప్పాలని మరోసారి జ్ఞాపకం చేసి వెళ్ళారు కొత్త వియ్యంకుడు గారు.
“అన్నయ్యా, అమ్మను నాతో తీసుకెళతాను. నా దగ్గరే ఉంటుంది” అభ్యర్ధనగా అడిగింది శ్రావణి.
మా అమ్మను ఎక్కడుంచాలో, ఎలా చూసుకోవాలో మాకు తెలుసు. ఎక్కడికీ పంపేది లేదు, ఖరాఖండి గా చెప్పేసాడు పెద్దన్నయ్య. ‘మా’ అన్న పదాన్ని నొక్కిపలుకుతూ వేర్పాటు చూపుతూ.
“ఇన్నేళ్లూ లేనిది, పాతికేళ్ల తరువాత ఇప్పుడు అమ్మ ఎందుకు కావాల్సొస్తోందో తెలుసుకోలేనంత మూర్ఖులేవ్వరూ లేరు ఇక్కడ?” పుల్ల విరుపుగా అంది శ్రావ్యక్క. పేరులో వున్న శ్రావ్యం స్వరంలో ఏ మాత్రమూ కనిపించలేదు.
“అదేంటి అక్కయ్యా కన్న తల్లిని తీసుకెళ్ళడానికి కారణాలు కావాలా?” అంతే శాంతంగా అంది శ్వావణి.
“అమ్మపై నీకెలాంటి హక్కులూ లేవని దావా వేస్తాను, ఇక మాట్లాడడానికి ఏదైనా వుంటే, కోర్టులో చెప్పుకో” విసురుగా తేల్చేస్తూ విసవిసా వెళ్ళపోయాడు పెద్దన్నయ్య.
*****
“యువరానర్, నేను కన్న నా బిడ్డను చేరడానికి చట్టాల అనుమతి కావాలా? ఆమెతో నాకున్న రక్త సంబంధం, పేగు అనుబంధం తెగిపోతుందా?” విలపించింది కమల.
“చూడండమ్మా, మీ లాయరుగారి వాదనంతా విన్నాము, పరిశీలనలో వుంది. మీరు స్వయంగా చెప్పుకోవలసినదేమైనా వుంటే ఇప్పుడు చెప్పుకోవచ్చు” శ్రావణికు అవకాశం ఇస్తూ అన్నారు జడ్జి గారు.
“నేను కమలమ్మ పేగు తెంచుకు పుట్టిన కూతురిని. తన ప్రాణ-స్నేహితురాలైన సీతమ్మకు పురిటిబిడ్డనైన నన్ను దత్తత ఇచ్చారు. వారి దత్తపుత్రికగా అల్లారు ముద్దుగా పెరిగాను. ఈనాడు నా కన్నతల్లిని నాకు దత్తు ఇవ్వమని సవినయంగా కోరుతున్నాను. అట్టి ఏర్పాటు తనకూ అంగీకారమేననీ, ఎటువంటి ఆక్షేపణా లేకపోగా ఎంతో ఆనందమనీ నా దగ్గరే వుంటున్న మా అమ్మ సీతమ్మ కోర్టువారికి తెలియచేయడమైనది. తతిమా విషయాలన్నీ మా లాయరుగారు వివరించారు. కావున యీ దత్త స్వీకారాన్ని అనుమతిస్తూ ఆమోదము తెలుపవలెనని కోర్టువారికి సవినయంగా మనవి చేసుకుంటున్నాను” అంది శ్రావణి.
“కోర్టువారి అనుమతితో మా, కాదు కాదు, ఆ కుటుంబంవారికి నేను కొన్నివిషయాలపై స్పష్టీకరణ ఇవ్వదలచుకున్నాను.
నాకు మా అమ్మ దత్తుకు కావాలి. అమ్మ మాత్రమే. ఇందులో ఎవ్వరికీ ఎటువంటి ఆక్షేపణలూ ఉండవనుకుంటాను” గంభీర స్వరంతో ప్రశ్నార్ధకంగా అనింది శ్రావణి.
“దత్తుపుత్రికగా మరో ఇంటికి వారసురాలైన నాకు ఆ తల్లికి పుట్టిన బిడ్డగా వారి ఆస్తిలో వాటా వుండదు, కోరకూడదు అని వారి లాయరుగారు చెప్పారు. నాకూ అలాంటి ఆశలుకానీ, ఆలోచనలు కానీ లేవు. నాన్నగారు తన వీలునామాలో అమ్మకూ ఒక భాగం చెందుతుందని వ్రాసినా, చిన్నయ్య పెళ్ళి ఒప్పందాల్లో, నేను పిల్లల వద్దనేగా వుంటాననీ, కనుక అక్కర్లేదనీ అమ్మ దాన్ని మూడుభాగాలుగా చేసి వారికే ఇచ్చిన పత్రాలు కోర్టు వారికి ఇవ్వడమైనది.
కమలమ్మ కన్నకూతురిగా ఆమెను అమ్మను చేసుకోవాలని తాపత్రయ పడ్డానే కానీ ఆమె వెనకున్న ఆస్తిపాస్తులతో నాకు పనిలేదు. గుడికి వెళితేనే భగవంతునితో అవినాభావ సంబంధం కోసమో, అక్కడ నివాసై అనుసంధానమైన ఫలితం కోసమో ఒక నిముషమైనా కూర్చుని వెళ్ళాలని చెపుతారే, అలాంటిది ఆ తల్లి గర్భంలో పదినెలలు నివాసమున్న నేను ఆమెకు ఏమీ కాను అనడం ఎక్కడి న్యాయం. అందుకే, అదే చట్ట ప్రకారం ఆమెను నాకు దత్తు ఇవ్వమని అర్థిస్తున్నాను. ఆమె కూతురిని అనిపించుకోవాలని తహతహలాడుతున్నాను. అమ్మను కావాలనుకుంటున్నాను. అమ్మ ప్రేమను మాత్రమే కోరుకుంటున్నాను” విలపిస్తూ అర్థంచింది శ్రావణి.
కేసు పూర్వాపరాలు పరిశీలించిన పిమ్మట, ఇదొక వినుత్నమైన కేసుగా కోర్టు పేర్కొంది. ఈ కేసు విషయంలో చట్ట పుస్తకాలకంటే మానవతా సంబంధాల విలువలకే ప్రాముఖ్యత ఇవ్వడమైనది. శ్రావణి పెట్టుకున్న పిటిషను ప్రకారము కమలమ్మగారిని తన తల్లిగా దత్త-స్వీకారానికి కోర్టు ఆమోదిస్తున్నది.
రంగారావుగారి ఆస్తులకు వారి ఇద్దరు కుమారులూ మరియు కూతురు వారసులవుతారు. సీతమ్మా, రామ్ముర్తి దంపతుల దత్తపుత్రికగా శ్రావణికి రంగారావుగారి ఆస్తిపై ఎటువంటి హక్కులూ వుండవు. కన్నతల్లిని తాను తీసుకుని వెళ్ళడం కోసం మాత్రమే యీ పెటిషను పెట్టుకున్నదని శ్రావణి ద్వారా స్పష్టీకరణైది. కావున కమలమ్మపై ఎటుంటి వత్తిడినీ తెచ్చి, ఎలాంటి నిర్బంధంతోనూ ఆమెను కట్టివేయకూడదని ఆమె ముగ్గురు పిల్లలనూ హెచ్చరించడమైనది. ఆమెను దత్తత తీసుకున్న కన్నకూతురి వద్దకు వెళ్ళుటకు కమలమ్మకు సర్వ హక్కులూ గలవు. ఆమె ఇష్ట ప్రకారమే శ్రావణి వద్దనే శేష జీవితం గడిపే సర్వహక్కులూ ఆమెకున్నవని కోర్టు వారి తీర్పు.
ఇరువైపులా సీత,కమలమ్మలతో కోర్టును విడిచి ఆనందంగా వెళ్ళింది శ్రావణి.
****
దక్షిణ రైల్వేలో ప్రైవేట్ సెక్రెటరీగా పదవీ బాధ్యతలను నిర్వర్తిస్తున్నాను. ప్రస్తుత నివాసం చెన్నై, తమీళనాడు. పుట్టినది 1973లో పిఠాపురం,తూ.గో.జిల్లా, ఆంధ్ర ప్రదేశ్ లో. తల్లి-తండ్రులు నోరి సుందరేశ్వర రావు, లలిత దంపతులు. విద్యాభ్యాసం హైదరాబాదులో జరిగింది. హిందీనే మొదటి భాషగా వున్న బడిలో చదివిన కారణంచే తెలుగులో కొద్ది పాటి ప్రవేశమే తప్ప ప్రావీణ్యం పొందే అవకాశం కలుగలేదు. డిగ్రీ చదువుతుండగా రైల్వే సర్వీసు కమిషను ద్వారా వృత్తి బాధ్యతలను చేపట్టి, ప్రైవేటుగా ఎమ్.కామ్.చదివాను. వాడపల్లి శ్రీనివాస కిషోర్ గారితో వివాహిక జీవితం, ఇద్దరు పిల్లలు కలుగడం అంతా హైదరాబాదులోనే జరిగింది. 2003 నుండి చెన్నైలో కార్యాలయం వారు నిర్వహించిన హిందీ భాష వ్యాస రచనలు పుస్తక సమీక్షలు మున్నగు పోటీల్లో పాల్గొని అనేక పురస్కారాలు పొందడం జరిగింది. ఆంగ్లంలోకూడా చిన్నా పెద్దా వ్యాసాలు, కథలు వ్రాయడం ప్రవృత్తైంది. సీనియర్ కొల్లీగ్ శ్రీ హరి అనంత్ గారి ప్రోత్సాహంతో, వుమెన్స్-వెబ్, పేరెంట్ సర్కిల్, ప్రతిలిపి వంటి అంతర్జాల బ్లాగుల్లో వ్యాసాలు, కథలు (హిందీలో, ఆంగ్లములో) పంపడం ప్రారంభించాను. ఆ తరుణంలో తెలుగు పత్రికలు పోటీలు నిర్వహిస్తూవుంటాయని మరొకరి ద్వారా తెలిసింది. మాతృభాషలో వ్రాయాలనే ఆసక్తితో, శ్రీ హరిగారు ఇచ్చిన అమితమైన ప్రోత్బలంతో 2020లో కథలు వ్రాయడం మొదలు పెట్టాను.
“మనిషి లో వున్న ఈ బంధవ్యాలు ఇంకా మిగిలివున్నందుకు మనం సంతోషపడాలి.” Is it truly happening in real life?? where children are fighting for assets only and avoiding the responsibility of taking care of old age parents. కథ చాలా చాలా బావుంది రచయిత్రి గారు. Happy ending.
కథ చాలా చాలా బావుంది రచయిత్రి గారు. ఇంకా మరెన్నో కథలు రావాలి మీ కలం నుంచి.
మీ కామెంటు నాకెంతో ప్రోత్సాహకరం. ధన్యవాదములండీ.
కధ చాలా అందంగా మలిచారు, చదువుచున్నంత సేపు సెలయేరులాగా ప్రయాణిస్తున్నట్లుంది, ఏదో గబగబా నడుస్తూ ఉన్నట్లున్నది. మనిషి లో వున్న ఈ బంధవ్యాలు ఇంకా మిగిలివున్నందుకు మనం సంతోషపడాలి. కధ చివరి ముగింపు బాగున్నది. ఇంకా మరిన్ని కథలద్వారా “మనుషుల మధ్య జరుగు ఆత్మీయ పోరాటాలు ” వెలుగులోకి తీసుకురావాలి మీరు. శుభాకాంక్షలు. ఆత్మకూరు అజరత్తయ్య. 👌👌👌
నమస్తే అజరతైయ్య గారు, కథ చదివి మీరు పొందుపరచిన విలువైన అభిప్రాయానికి ధన్యురాలిని. మీ ప్రోత్సాహంతో మరిన్ని చక్కని కథలనందించగలనని ఆశిస్తున్నాను.
అజరతైయ్య గారు. మీ విలువైన అభిప్రాయాన్ని తెలిపినందుకు ధన్యవాదములు. మీ ప్రోత్సాహక మాటలతో మరిన్ని కథలను అందిచగలనని ఆశిస్తున్నాను.
Katha chaala bagundi.manasuki hatthukuneala undi.very touching.
ధన్యవాదములండీ.