నాలాగ ఎందరో..
-వి.శాంతి ప్రబోధ
పసితనం వీడి యుక్తవయస్సు రాక ముందే ఆటాపాటలకు దూరమైన పిల్ల,
స్నేహితురాళ్ళు ఆడుతుంటే చూసి చప్పట్లు కొట్టడం తప్ప తాను కొట్టించుకోవడం తెలియని పిల్ల. తన లోని కోరికల్నిలోనే ఇగుర్చుకున్న పిల్ల.
ముది వయసుకు దగ్గరవుతున్న సమయంలో హర్షధ్వానాల మధ్య అభినందనలు అందుకుంటూ .. తీవ్రమైన ఉద్వేగానికి లోనయింది.
100 మీ , 200 మీ, 400 మీటర్ల పరుగులో మొదటి బహుమతి ఆమెదే.
డిస్క్ త్రో మొదటి బహుమతి, షాట్ ఫుట్ ద్వితీయ బహుమతి, జావలిన్ త్రో మొదటి బహుమతి అంటూ తన పేరు పిలిచినప్పుడల్లా ఆమె మనసు దూదిపింజలా తేలిపోతున్నది.
ఇక్కడ మైక్ లో ప్రకటిస్తున్న మాటలు నాలో అనంతమైన శక్తి నింపిన మిత్రకి చేరితే ఎంత బాగుంటుంది .. మనసులో థాంక్స్ చెప్పుకుంటూ అనుకున్నది ఆమె.
నిజంగా నాలో అంత సామర్థ్యం ఉన్నదా .. తన కంటే చాలా ముందు నుంచీ ఉన్న వారిని వెనక్కి తోసేసి తను ముందు నిలిచిందా .. ఆశ్చర్యపోయింది ముఖానికి పట్టిన చెమట తుడుచుకుంటూ.
అంతలోనే నేను నేనేనా.. అన్న సందేహం ఆమెలో. కాలు భూమి మీద ఆగడం లేదు . మనసు ఆనందంతో పక్షిలా గిరికీలు కొడుతున్నది.
ఆమెలో ఒక్కో గెలుపు మరో గెలుపుకి ఉత్సాహాన్నిస్తూ ఉత్ప్రేరకంగా మారుతున్నది.
సరిగ్గా అదే సమయంలో 60 ఏళ్లలోపు మహిళల అట్లెటిక్స్ ఛాంపియన్ పూర్ణిమ అంటూ ప్రకటించారు .
ఓహ్ కలలోనైనా ఊహించని బహుమతి . ఒకదాని వెంట ఒకటి తన ఖాతాలో జమవుతూ.. విడ్డురంగా అనిపిస్తున్నది .
మహిళల వెటరన్ స్పోర్ట్స్ లో ఉవ్వెత్తున ఎగుస్తున్న కెరటం పూర్ణిమ అంటున్నారెవరో ..
నిజ్జంగా తనలో అంత శక్తి ఉన్నదా .. అయితే , ఇన్నాళ్లు ఏమైంది ..? రకరకాల ఆలోచనలు పోటెత్తుతుండగా ఉద్వేగంతో ఛాంపియన్ షిప్ షీల్డ్ అందుకోవడానికి వెళ్ళింది.
జీవితపు పరుగులో తన ప్రమేయం లేకుండానే పరుగులు పెట్టిందిన్నాళ్ళూ .., కాలం ఆడించే ఆటలో ఎన్నెన్నో ఆటంకాలు, ఉచ్చులు , ప్రమాదాలు దాటుకు వచ్చి అలసిపోయింది. ఇక నడవ లేక డీలా పడిపోయింది . ముందుకు సాగలేనని నిస్సత్తువతో కూలబడిపోయిన స్థితి నుండి .. కొత్త శక్తి నింపుకుంటూ పరుగు పెట్టింది .
శరీరం మనసు ధ్యాసంతా పెట్టి ఆడింది . అందరితో పోటీలో ఉన్నందుకు ఉప్పొంగిపోయింది.
అలాంటిది, తనే విజేతగా నిలవడం.. సంభ్రమాశ్చర్యం ఆమెలో ..
హర్షధ్వానాల మధ్య అభినందనలు అందుకుంటూనే.. తన ఈ స్థితికి కారణమైన మిత్రని పదే పదే తలచుకొంటున్నది.
అంబరాన్ని అంటే సంబరానికి కారకురాలైన మిత్రకి చెప్పాలని తహతహతో ఫోన్ చేయబోతుంటే..
ఓ మీడియా ప్రతినిధి పలుకరించింది . ఆ వెనకే మరి కొందరు వచ్చి చేరారు .
“పరుగు పందెం లో మీ టైమింగ్ రికార్డ్. ఎలా సాధించగలిగారు” అడిగారొకరు.
“అవునా .. అదంతా నాకు తెలియదు. పోటీ కదా.. . పోటీపడి నాకు చేతనయినంత పరిగెత్తానంతే.
చిన్నప్పుడు చెంగు చెంగున లేడి పిల్లలా పరుగులు పెడతానని అనేది మా నాయనమ్మ. బహుశా ఇప్పుడూ అలాగే పరుగు పెట్టానేమో .. చిన్నగా నవ్వుతూ చెప్పింది పూర్ణిమ.
ఓ చిన్నప్పటినుండీ పరుగుల రాణి అన్నమాట అన్నదామె .
లేదండి, నేనెప్పుడూ పరుగు పందెంలో పాల్గొనలేదు. ఆడ పిల్లవు కాదూ .. అని తిట్టి పోసే నాన్నమ్మ పాల్గొననిచ్చేది కాదు. ఆమెకు ఎదురు చెప్పే ధైర్యం మా ఇంట్లో ఎవరికీ లేదా రోజుల్లో. ‘ వెలుగుతున్న మొహంలో సన్నటి నవ్వు రేఖలు
అంటే.. ఇప్పుడు ఈ వయసులో మీ కోరిక తీర్చుకుంటున్నారా ..?
నిజానికి కోరిక తీర్చుకోవడం కోసమో, బహుమతులు అందుకోవడం కోసమో నేను పరుగులు ప్రారంభించలేదు . అది నా లక్ష్యం కాదు.
మానసిక. శారీరక ఆరోగ్యం మెరుగు పరుచుకోవడం కోసం నడక ప్రారంభించాను. అందులోంచి పరుగులోకి వెళ్ళాను . అనుకోకుండా పోటీలో పాల్గొన్నానంతే…
అంతే , ఏంటి మేడం? ఇన్ని బంగారు పతాకలందుకుని. కోచింగ్ ఎన్నాళ్ళ నుండి తీసుకుంటున్నారు ? జర్నలిస్ట్ ప్రశ్న .
కోచింగ్ అంటూ ప్రత్యేకంగా ఏమీ లేదు.
ఈ మధ్యనే అంటే రెండు నెలల నుండి వారానికి రెండు రోజులు మాత్రమే. ప్రాక్టీస్ చేస్తున్నా .
త్రోస్ వేరే వాళ్లు ప్రాక్టీస్ చేస్తుంటే చూసి నేనూ నేర్చుకున్నా.
ఆశ్చర్యం.. ఇంత తక్కువ వ్యవధిలో.. కళ్ళు పెద్దవి చేసింది మొదట పలకరించిన జర్నలిస్ట్.
అసలు ఈ రోజు మీ ముందు ఉన్నానంటే కారణం నా గురువు . తాను లేకపోతే ఇప్పటి నేను లేను .
నిజానికి నాలోని ఆత్మవిశ్వాసం కొట్టుకుపోయింది . దుఃఖం, నిర్లిప్తత, నిస్సహాయత,బద్దకం మేటలువేసుకు పోయింది.
అటువంటి తరుణంలో ..
Crying , Trying ఈ రెండు పదాలు ఒకేలా ఉన్న రెండు పదాలు. మీకు తెలుసు కదా ..
రెండింటికీ ఒకే ఒక అక్షరం తేడా .
కానీ అవి మనమీద మన జీవితాల మీద చూపే ప్రభావం అంతా ఇంతా కాదు.
మొదటిది మన ఆత్మవిశ్వాసాన్ని అతలాకుతలం చేసి కుంగదీసి శిథిలం చేసుకు పోతుంది .
రెండోది మనలో కొత్త శక్తులు తట్టి లేపి నూతనోత్సాహంతో ముందుకు నడిపిస్తుంది . జీవితం పట్ల ఆశ కలిగిస్తుంది.
ఏది ఎంచుకుంటావో.. నీ ఇష్టం .
అది ఏదైనా నీ చేతుల్లోనే, చేతలలోనే..
నీ జీవితానికి కర్త , కర్మ , క్రియ అన్నీ నీవేనని మర్చిపోవద్దని నా గురువు ఉద్బోధ.
ఓ.. రియల్లీ, ఎవరా గురువు .. ఏ సందర్భంలో ..? పూర్ణిమ మొహంలోని వెలుగు చూస్తూ ఉత్సాహంగా యువ జర్నలిస్ట్ ప్రశ్న
నా గురువంటే…
నాకంటే ఓ పాతికేళ్ళు వెనక ఈ భూమ్మీదకి వచ్చిన వ్యక్తి . నా ఆప్తమిత్రురాలు, నా పేగు తెంచుకు పుట్టిన నా కూతురు అని ఆగి అందరి మెహాల్లోని భావాల్ని చదవడంలో నిమగ్ననైంది పూర్ణిమ .
అందరూ ఆశ్చర్యంగా నోరెళ్ళబెట్టి చూస్తున్నారు .
అంటే .. మీ అమ్మాయా .. ఆమె మీ గురువా ..
అవును , మీరు విన్నది నిజమే.. మా అమ్మాయే .
పోస్ట్ మోనోపాజ్ సమయంలో వచ్చిన డిప్రెషన్ ఛాయలను గమనించింది . రోజు రోజుకి నాలో బలహీనమవుతున్న ఆత్మవిశ్వాసాన్ని తట్టిలేపింది .
దుర్భలమవుతున్న మనసుని గట్టిపరిచే విధంగా వ్యవహరించింది .
మరింతగా ఆ ఊబిలోకి పోకుండా నేనేం చేయగలనో నాకు తెలిపింది , ఏం చేయాలో సూచనలు , సలహాలు ఇస్తూ నాకు అండగా నిలబడింది . నాకు గురువైంది . అమ్మకు అమ్మై కాపాడుకుంది- చెబుతున్నది పూర్ణిమ కంఠం గద్గదమవుతుండగా
క్వయిట్ ఇంటరెస్టింగ్ ..
ఎలా ఈ మార్గం ఎంచుకున్నారో వివరంగా చెప్పగలరా .. నిండా పాతికేళ్లు లేని ఔత్సాహిక జర్నలిస్ట్ .
****
చెప్పడం మొదలు పెట్టింది పూర్ణిమ
అమ్మా.. నువ్వు నువ్వేనా ..
నువ్వసలు మా అమ్మవేనా అన్న సందేహం. నిన్ను చూస్తే చాలా కోపం, బాధ అన్నది నా కూతురు మిత్ర
ఎందుకో అంత సందేహం .. మరెందుకో నాపై కోపం , ఆపై బాధ అని నవ్వుతూ అడిగనైతే అడిగాను . కానీ , దాని గొంతులో సీరియస్ నెస్ ధ్వనించిందన్న గమనింపులోకొచ్చి
దానికి నాపై అంత కంప్లయింట్స్ ఏమున్నాయి.. అసలు ఏముంటాయి .. ఏమో .. ఆలోచనలో నేను.
ప్రతిసారి నా మాటల్ని తేలిగ్గా తీసేసి తెలివిగా టాపిక్ మార్చేస్తావ్ .. అక్కడితో అసలు విషయం ఆగిపోతుందని మిత్ర నిష్టురం
అసలేంటే నీ బాధ .. ఊ .. చెప్పు వింటానన్నాను . తెచ్చిపెట్టుకున్న విసుగు ప్రదర్శిస్తూ
నేను నవ్వులాటగా అనట్లేదమ్మా… నిజ్జంగానే చెప్తున్నా .. నువ్వు నమ్ము నమ్మకపో ..
నువ్వు మాత్రం ఇది వరకటి మా అమ్మలా లేవు .
ఆమె మాటల్ని తుంచేస్తూ .. .నీ పిచ్చి గానీ .. ఎలా ఉంటారే … ఎలా ఉంటారు ? మారతారుగా .. నువ్వున్నావా చిన్నప్పటిలాగే .. మారలేదూ .. నేనూ అంతే .. విసుగ్గా అన్నాను.
ఊహూ అలా కాదు . ఈ మార్పు అది కాదు . నేను ఎదుగుతున్నాను . నువ్వు అట్లాకాదు .. ఎట్లా చెప్పాలో తెలియక కొద్దిగా ఆగింది
. ఆ తర్వాత, నువ్వెంత ఉత్సాహంగా, చురుకుగా ఉండేదానివి. ఎన్ని పనులు చకచకా చేసేదానివి . అవన్నీ నాకు తెలియనివా ..
మన ఇంటి చుట్టూ ఉన్న ఆడవాళ్ళకి నిన్ను చూస్తే ఆశ్చర్యం, అసూయ. ఆఫీసుపని, ఇంటిపని, నానమ్మ తాతయ్య ల పని, మా పనులు చేసేదానివి . మాకు అందమైన బట్టలు కుట్టేదానివి , పెయింటింగ్ , ఎంబ్రాయిడరీ చేసేదానివి . మా చదువు సంధ్య చూసేదానివి . ఆఖరికి ముగ్గుల పోటీలలో నువ్వే .. అన్ని పనుల్లో నువ్వే .. విసుగు, విరామం లేకుండా .. మొఖం మీద నవ్వు చెదరనీకుండా..
ఇంటి పట్టునే ఉన్నవాళ్ళు చేయని పనులెన్నో నువ్వు ఉద్యోగం చేస్తూ చేసేదానివి.
అందరిలో మా అమ్మ ఎంత గొప్పగా ఉండేదో తెల్సా.. .
నువ్వు ఇప్పుడలా ఉన్నావా .. చాలా డల్ గా ఉంటున్నావు అనేది మిత్ర.
కాలం మారుతున్నట్టే వయసు పెరగడంలా .. వృద్యాప్యంలోకి రావడంలా .. నచ్చచెప్పే ధోరణిలో నేను .
అదిగో .. అదే.. అదే నాకు నచ్చడం లేదు .
ఆ మాటలే అస్సలు నచ్చట్లేదు .
ఎంత .. ఆ .. నీ వయసు ఎంతనీ .. ?
అరవైకింకో మూడేళ్ళ సమయం ఉంది . అప్పుడే ముస్సలైపోయావా .. మూడుకాళ్ల ముసలమ్మవైనట్లు మాట్లాడుతున్నావ్ అని తగవులాడేది.
నిన్నటి నిన్ను, నీ పనితనం , నేర్పరితనం అన్నీ పోయాయి.
ఇప్పుడు, జీవితాన్ని నీ చేతినించి వదిలేశావ్ . నిన్ను నువ్వు చేజార్చుకుంటున్నావ్. అదేనమ్మా నా బాధ అంటూ విలవిల లాడేది .
అబ్బా ఏదో లేవే.. ఇలా అలవాటు పోయింది.. నన్నిట్లా బతకనీ .. నా ప్రాణం తినకు.. విసుక్కునేదాన్ని
అసలు తప్పంతా నీ దగ్గరే ఉంది అని ఎత్తి పొడిచేది .
అందుకే నువ్వంటే నాకు నచ్చట్లేదు. నిక్కచ్చిగా చెప్పేయడం మొదలు పెట్టింది .
అదేంటని నాలో కోపం బుసబుస పొంగేది . మాట్లాడ్డం మానేసేదాన్ని .
అమ్మా ప్లీజ్ .. నా మాట వినమ్మా ..
మీ అమ్మ వాళ్ళింట్లో నువ్వు చేయలేని పనులు కొన్ని పెళ్లయ్యాక చేశావ్ .
నాన్న కుటుంబ విషయాలు పట్టించుకోకపోయినా పరిస్థితులకు ఎదురొడ్డి నిలబడ్డావ్ .
ఎటువంటి సహకారం లేకుండానే కుటంబ బాధ్యతల్ని మోస్తూనే చదువుకున్నావ్ . ఉద్యోగంలో చేరావు. ఇంటాబయట పని ఒత్తిడి, బంధుమిత్రుల మర్యాదలు అన్నీ నువ్వే.. వేధింపులు , సాధింపులు, నిందలు , నిష్టూరాలు , ఆరళ్ళు అగచాట్లు అన్నీ నీకే .. అవమానాల అగ్నిప్రవేశాలు నీకే ..
కంటి చివర చిట్లే నీటి చుక్కల్ని ఘనీభవింపచేస్తూ గండశిలలా మారిపోయావ్ . అలసిన మొఖంలో పెదవులపై నవ్వులు అద్దుకుంటూ కాళ్ళకి చక్రాలు కట్టుకుని , చేతులతో అష్టావధానం చేశావ్ .
ఎందుకలా చేయగలిగావ్ ..
భవిష్యత్ పై నీకున్న ఆశ, నమ్మకం, పనిపట్ల ఉన్న నిబద్దత, నీ పై నీకున్నవిశ్వాసం నిన్ను ముందుకు నడిపించింది .
కానీ నీకోసం నువ్వు చేయాలనుకున్నవి , నీ బాధ్యతల బందిఖానాలోంచి బయటికి వచ్చి ఆలోచించలేక వాటి పీక నొక్కేశావ్ ..
మా అందరికీ చేసిన పనుల్లోనే తృప్తిని వెతుక్కున్నావ్ .
మేం ఎవరి దారి వాళ్ళు చూసుకున్నాం. నువ్వు ఒంటరయ్యావు . ఆ ఒంటరితనం నుంచి వచ్చిన సమస్యలే నీవి .
దానికి తోడు శరీరం మనస్సుతో నీ హార్మోన్స్ ఆడుకోవడం మొదలు పెట్టాయి . వాటిని అదుపులో పెట్టగల శక్తి నీకు మాత్రమే ఉందమ్మా ..
నీకు నువ్వే ఏవో సాకులు చెప్పుకోవడం మాని నీతో నువ్వు పోరాటం చెయ్యి . నీకోసం నువ్వు ఆలోచించు . ఏం చేస్తే నీ మనసు చెంగు చెంగున పరిగెడుతుందో ఆలోచించు . ఏంచేస్తే నీ మొఖం అరవిరిసిన మందారంలా నవ్వుతుందో ఆలోచించు . ఏం చేస్తే .. గాలిలో తేలిపోతుంటావో ఆలోచించు. ఏం చూస్తే నీ కళ్ళు పరవశిస్తాయో ఆలోచించు ..
ఏం చేస్తే ఉత్సాహం ఉరకలేస్తుందో చూడు. మేమెవరం లేని నీదైన ప్రపంచం ఎలా ఉంటుందో ఆలోచించు అని సుతి మెత్తగా చెప్పేది .
మాట్లాడ్డం మానేస్తే మెసేజ్ లు పెట్టేది .
నేను వాటిని గురించి ఆలోచించడం లేదనీ, ఆ ప్రయత్నం చేయడంలేనీ కోప్పడేది.
నా ఆరోగ్య, ఆర్థిక పరిస్థితి తెలిసీ ఎప్పుడూ ఏదో ఒక క్లాస్ పీకుతుంటుందని తిట్టుకునేదాన్ని.
నీకోసం కొత్త ప్రపంచం ఎదురు చూస్తున్నది . ఆ ప్రపంచంలోకి వెళ్లిన తర్వాతే, నీకు నచ్చిన పని ఏదైనా చేసిన తర్వాతే నీతో మాట్లాడేది అని మెసేజ్ చేసి మాటలు మానేసింది .
ఇన్నాళ్లూ బతిమాలింది . బాధపడింది . కోప్పడింది . ఏం చేసినా నేను మారడం లేదని చివరి అస్త్రం వదిలింది. దాని పట్టుదల గురించి నాకు తెల్సు . అది మాట్లాడక పోతే లోకమంతా శూన్యంగా ఉంటుంది నాకు . నా ఏకైక నేస్తం అదేగా ..
సావధానంగా ఆలోచించడం మొదలు పెట్టాను .
నిజమే .. నేను ఉద్యోగంలో ఉన్నన్నాళ్లూ తీరిక అందని ద్రాక్ష పండే . అప్పుడు తీరికగా , హాయిగా, రికామీగా ఉండడం నాకొక లగ్జరీ .
షాపింగ్ లు , కిట్టీపార్టీలు , పేరంటాలు ఇలా రకరకాలుగా నలుగురూ కలిసి సరదాగా ఎంజాయ్ చేస్తున్న జీవితం పట్ల ఓ ఆకర్షణ .
నేను చేస్తున్న ప్రాజెక్ట్స్ అయిపోవడంతో కొత్త ప్రాజెక్ట్స్ లోకి వెళ్ళలేదు .
ఆ వెసులు బాటుతో నాలుగు రకాల సమూహాలతో కలయికలు సందడిగానే , సరదాగానే ఉంది కొన్నాళ్ళు. కానీ రాను రాను తెలియని అసహనం మొదలయింది.
నా తీరిక సమయం వినోదాన్ని , ఆనందాన్ని ఇవ్వక పోగా అసంతృప్తిని తెచ్చిపెట్టాయి . , చీరలు , నగలు, ఒకరిపై ఒకరు పోటీపడుతూ ఇల్లు, ఒళ్ళు అలంకరణ కిట్టీ పార్టీలు , పేరంటాలు , డాబుసరి మాటలు .., ఎత్తి పొడుచుకోవడాలు, లేదంటే సినిమాలు .. ఆ వాతావరణంలో ఇమడలేనని అర్ధమైపోయింది .
స్వేచ్ఛ సమానత్వం పేరుతో పబ్ లు , పార్టీల్లో తాగడం, పేకాట ఆడడం చేయలేకపోయా.
భక్తి పేరుతో పూజలు పునస్కారాల పేరుతో జరిగే ఆడంబరం , గుళ్ళు , దేవుళ్ళు , తీర్ధయాత్రల లోకంలోనూ కలవలేనని అర్ధమై పోయింది.
ఆ సమూహాల్లో డొల్లతనాన్ని, హిపోక్రసీని తట్టుకోలేకపోయా. నేను కోరుకున్నది అదేదీ కాదని తేలిపోయింది.
లోపం వాళ్లలో ఉన్నదో నాలో ఉన్నదో అర్థంకాలేదు. నలుగురితో నారాయణ అనలేనితనం నాది కదా …
ఇంట్లోనే ఉంటున్నా కదా .. వచ్చే అతిథులు. పెరిగిన పనులు, తరిగిన ఓపిక , తీరిక.
నేననుకున్నది ఏంటి ? జరుగుతున్నది ఏంటి ? ఎందుకిలా జరుగుతున్నది అని నాపై నాకే చిరాకు , కోపం , విసుగు . నీరసం . బతుకు మీద వైరాగ్యం .
మళ్లీ ఉద్యోగంలో చేరదామా అనుకుంటూనే కొంత కాలయాపన…
ఈ వయసులో నాకెవరిస్తారులే అని నాకునేను చెప్పుకున్నాను. సమర్ధించుకున్నాను. మభ్యపెట్టుకున్నాను .
ఏదో అసంతృప్తి నన్ను ముంచెత్తుతున్నది. అనాసక్తంగా మారిపోయాను. జీవితం శూన్యంగా కనిపిస్తున్నది.
మరోపక్క రిటైర్ మెంట్ ప్లాన్స్ ఏమీ చేయని జీవితం నన్ను ఆందోళన పరచడం మొదలెట్టింది.
ఉన్నంతలో పిల్లల్ని కోరిన చదువులు చదివించాం. మా పిల్లలతో పాటు ఆపదలో ఉన్న నలుగురు పిల్లలకు చదువుతో పాటు మా చేతనయిన సాయం చేసాం. మా కోసం మేం ఏమీ చేసుకోలేదు . కనీసం సొంత ఇల్లు కూడా లేదు.
రిటైర్మెంట్ ప్లాన్ చేసుకుందాం అనుకునే సమయంలో ఆర్ధికంగా కోలుకొని దెబ్బ. డెమోనిటైజేషన్ చాలా కుంగదీసింది. ఆ వెంటనే వచ్చిన జిఎస్ టి మా వారి వ్యాపారంలో ఒడిదుడుకులు తెచ్చింది. తీవ్ర సంక్షోభంలో చిక్కుకుపోయిన సమయంలో ఇరవై నాలుగుగంటలూ ఇంట్లోనే ఉండడం మరింత కుంగదీసింది.
అదే సమయంలో పక్కింటి అతను హఠాత్తుగా గుండెపోటుతో పోవడం, శవాన్ని ఇంటికి రానీయని ఇంటివాళ్లు ..ఆ సంఘటన చాలా కదిలించింది .
రేపటి మా పరిస్థితిని అద్దంలో చూపింది.
ఇప్పుడు మీతో నవ్వుతూ ఇలా చెప్పగలుగుతున్నా కానీ అప్పుడు నాలో వచ్చే వ్యతిరేక ఆలోచనలు పంచుకునే అవకాశం లేదు ,పిల్లలు ఎవరి జీవితాల్లో వాళ్ళు బిజీగా ..
మా ఆయన తన పనుల వత్తిడిలో.. చతికిల పడిన వ్యాపారాన్ని నిలబెట్టుకునే ప్రయత్నంలో తలమునకలై…
దూరంలో ఉన్నప్పటికీ మిత్ర అర్ధం చేసుకుని నా పట్ల ఎంతో బాధ్యతతో వ్యవహరించింది. అది స్వీకరించే స్థితిలో నేను లేను .
నాకు తెలియకుండానే ప్రవహించడం ఆగిపోయాను . నిలువ ఉంటే ఏమవుతుంది . మురిగి కంపు కొడుతుంది . నా విషయంలోనూ అదే జరిగింది .
నేను విసుక్కున్నా , కోపగించుకున్నా నా కూతురు నన్ను ప్రక్షాళన చెయ్యాలని, ప్రవహింప చేయాలనీ తన ప్రయత్నం మానలేదు .
ఇన్నాళ్లు నువ్వు చెప్పింది నేను విన్నా . ఇప్పుడు నువ్వు నేను చెప్పింది వినాలి అనేది .
ఇక్కడ చూడు ఆడవాళ్లు ఎలా తిరగేస్తుంటారో అని అక్కడి బామ్మల గురించి చెప్పేది . వీడియో కాల్ చేసి చూపించేది .
అది అమెరికా . ఇది ఇండియా అంటూ కొట్టి పారేసేదాన్ని .
అమెరికా అయినా , ఇండియా అయినా అమ్మ అమ్మేగా . అమ్మ ఆరోగ్యం బిడ్డకి ముఖ్యమేగా .. అని అనేది .
నీకేమన్నా పిచ్చా .. నాకేమయింది. నేనిప్పుడు బాగానే ఉన్నాగా .. ఎందుకింత సతాయిస్తావ్ అని ఎగిరిపడే దాన్ని .
తనూ ఒక్కోసారి విసుక్కునేది. చాలాసార్లు ఓపికగా చెప్పేది .
ఇండియాలో కూడా పరిస్థితులు మారాయమ్మా . మీ నాన్నమ్మ , అమ్మమ్మ , అమ్మ లాగే నువ్వు ఎందుకుండాలి? ఆ కాలం కాదిది. నిన్ను నువ్వు శోధించుకుంటూ ఎదగడానికి అనేక మార్గాలున్నాయి. వాటిని ఉపయోగించుకో.. అంటూ ఓ తల్లి బిడ్డకు చెప్పినట్టుగా చెప్పేది.
లేడి లా పరిగెడతావా .. అంటూ ఒక లింక్ పంపింది . అది మహిళల స్పోర్ట్స్ క్లబ్ ది
మిత్ర దూరాన ఉన్నది . రావాలంటే వీసా సమస్యలు ఉన్నాయి . కానీ దాని మనసంతా అమ్మ మీదే . దాని జీవితాన్ని వదిలేసి ఈ అమ్మ గురించి ఆలోచిస్తూన్నది.
దానికోసమైనా చూసి రావాలనుకున్నా .
అంతలోనే, అయినా .. ఈ వయసులో నాకు ఆటలేంటి ? ఏ కాలో చెయ్యో విరగ్గొట్టుకోడానికి కాకపొతే .. ఎక్కడైనా పడిపోతే .. ఎవరు చూస్తారు , ఎవరు చేస్తారు ? దానికి మతి లేకపోతే నాకుండాలి కదా అనుకున్నాను .
ఇంటికి దగ్గరలోనే ఉన్నది కదా .. సర్లే .. ఒకసారి వెళ్లి చూసి వస్తే వచ్చిన నష్టం ఏంటని దుర్బలమైన మనస్సుకు నచ్చ చెప్పుకున్నాను .
వెళ్లి వచ్చి ఏదో ఒకటి చెప్పి దాని గోల వదుల్చుకుందామని అయిష్టంగానే స్పోర్ట్స్ క్లబ్ కి వెళ్లాను .
నేను వెళ్లేసరికి నా కంటే చాలా పెద్ద వాళ్ళు తల పండిన వాళ్ళు స్పోర్ట్స్ డ్రెస్ లో ప్రాక్టీస్ చేస్తున్నారు. వాళ్ళనలా వింతగా చూశాను .
కొందరు ట్రాక్ లో రన్నింగ్ చేస్తున్నారు . మరో ప్లేసులో సైక్లింగ్ చేస్తున్నారు . వాకింగ్ చేస్తున్నారు . టెన్నిస్ ఆడుతున్నారు . చాలా చలాకీగా ఆడుతూ ఛలోక్తులేస్తూ నాకు బాగా తెలిసిన వాళ్ళలా మాట్లాడుతున్నారు . నాకు చాలా ఆశ్చర్యమేసింది .
మొదటి పరిచయంతోనే నన్ను వాళ్లలో కలిపేసుకున్నారు . వయసు ఒక సమస్య కాదని వాళ్ళ చలాకీతనాన్ని చూస్తే అర్ధమైంది. అక్కడ నేను చూసిన దృశ్యాలు నాకెంతో స్ఫూర్తినిచ్చాయి .
ముఖ్యంగా 70 ఏళ్ల బామ్మ ఈత కొట్టడం నన్ను చకితురాల్ని చేసింది.
అక్కడి పరిచయాల ద్వారా నేను చాలా నేర్చుకున్నాను . నన్ను నేను మలుచుకుంటున్నాను .
ఏమి నేర్చుకున్నారు మేడం? శ్రద్దగా వింటున్న ఆ నలుగురిలో ఓ జర్నలిస్ట్ అడిగింది
పెద్దవాళ్ళయ్యామని గంటల కొద్దీ కూర్చొని ఉండడంతో ఇతరులపై ఆధారపడడం మొదలవుతుందని తెలుసుకున్నాను.
మన శరీర కదలికల్ని ఎంత తగ్గిస్తే అంత త్వరగా వ్హాధుల పాలవుమని. మనం ఎంత చలాకీగా ఉంటే అంత ఆరోగ్యంగా ఉంటామని అర్ధమయింది.
ఏదో ఒక వ్యాపకం అది ఎంత చిన్నదైనా సరే ఉండడం మనిషికి చాలా శక్తినిస్తుంది. వేదన తగ్గిస్తుంది. ఇదంతా నేను ప్రాక్టికల్ గా అనుభవించినదే చెబుతున్నాను .
ఇవన్నీ నాకూతురు చెప్పినప్పుడు అంతగా పట్టించుకోలేదు . కొట్టి పడేశాను. కానీ నా కంటే పెద్దవాళ్ళని అక్కడ చూశాక , వాళ్ళ శారీరక మానసిక ఆరోగ్యాలు చూశాక రియలైజ్ అయ్యాను .
ఇప్పుడు నన్ను నేను, నేను చేస్తున్న పనిని నేను ప్రేమిస్తున్నాను . గౌరవిస్తున్నాను. పటిష్టం చేసుకుంటున్నాను.
ఇంకా ఏమైనా చేయాలనుకుంటున్నారా ? మీ తోటి మహిళలకి మీరేం చెప్పదలచుకున్నారు ? మరో జర్నలిస్ట్ ప్రశ్న .
నిన్నటి నాలాగా ఎందరో .. కానీ , నేనిప్పుడు అందరిలా కాదు .
కొందరిలా ..
మళ్ళీ జీవితం మొదలైనట్లున్నది . సామజిక జీవితంలో మార్పులొచ్చాయి . కొత్త కొత్త మనుషుల్ని కలుస్తున్నా.
చాలా కొత్త అనుభవాలతో వచ్చే ఉత్సాహం కొత్త శక్తిని , సామర్ధ్యాన్ని, సంతోషాన్ని ఇచ్చింది . అన్నింటి కంటే ముఖ్యంగా నన్ను నేను కొలుచుకునే అవగాహననిచ్చింది.
దారి మళ్ళిన నాకు , నా ప్రయాణంలో నన్ను నేను ఎలా మలచుకోవాలో మెరుగుపరుచుకోవాలో, స్పష్టత వచ్చింది.
నా జీవితానికొక లక్ష్యం ఇచ్చింది . ఇవన్నీ ఎమోషనల్ ఫిట్ నెస్ తో ఉండడం వల్లే సాధ్యమయింది .
ఆత్మవిశ్వాసం మనిషికి దివ్యౌషధమని అనుభవపూర్వకంగా చెబుతున్నా ..
అయితే , మానసిక ఆరోగ్యం సరిగాలేదని గుర్తించేదెవరు? మెరుగుపరచుకునే అవకాశం, అండ ఎందరికి ఉంటుంది ? అనే ప్రశ్న నన్ను తొలుస్తున్నది .
ఇప్పుడు ఇలా మీతో మాట్లాడుతుంటే నా మదిలో రూపొందిన ఆలోచన పంచుకుంటున్నా ..
మనం శారీరక ఆరోగ్యాన్ని పట్టించుకున్నంతగా మానసిక ఆరోగ్యాన్ని పట్టించుకోము. కానీ, అది చాలా అవసరం . దాని గురించిన అవగాహన పెంచాల్సిన అవసరం ఉంది. నాలాగా ఎందరో పిల్లలు , పెద్దలు మానసిక సమస్యల్లో ఉన్నారు .
మన బడులు , కుటుంబాలు ఏవీ ఆ దిశగా ఆలోచించడం లేదు . మానసిక ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు కూడా పాఠ్యపుస్తకాల్లో ప్రవేశపెడితే బాగుంటుందేమో..
మానసిక ఆరోగ్యం పట్ల మనలో ఉన్న నమ్మకాల్ని పోగొట్టే విధంగా ఒక కార్యక్రమం రూపొందించుకుని, స్థానిక బడులు, ఉపాధ్యాయులు , ప్రభుత్వ, ప్రభుత్వేతర ఉద్యోగులు, సామజిక కార్యకర్తలు అందరినీ కలుస్తూ ముందుకు సాగాలని అవగాహన కలిగించాలని ఒక ఆలోచన .
ఎలా .. ఎక్కడినుండి అని అడగకండి . త్వరలో నా కార్యాచరణ విషయాలూ ప్రకటిస్తా అని ముగించింది పూర్ణిమ.
******
నేను వి. శాంతి ప్రబోధ . చదివింది జర్నలిజం అయినా స్థిరపడింది సామాజికసేవా రంగంలో. శ్రీమతి హేమలతలవణం, శ్రీ లవణం నిర్వహణలోని సంస్కార్ సంస్థలో వారితో కలసి ఇరవై ఏళ్ళు నడిచాను. ఆ నడకలోనిజామాబాద్ జిల్లాలోని అనేకమంది గ్రామీణ మహిళల, పిల్లల జీవన పరిస్థితులు అవగతమయ్యాయి. ఆ అనుభవాల్లోంచి రాసినవే భావవీచికలు , జోగిని , గడ్డిపువ్వు గుండె సందుక , ఆలోచనలో …ఆమె . భావవీచికలు బాలలహక్కులపై వచ్చిన లేఖాసాహిత్యం . ILO , ఆంధ్రమహిళాసభ , బాల్య లు సంయుక్తంగా 2003లో ప్రచురించాయి. తరతరాల దురాచారంపై రాసిన నవల ‘జోగిని ” . వార్త దినపత్రిక 2004లో సీరియల్ గా ప్రచురించింది . 2015లో విహంగ ధారావాహికగా వేసింది . ప్రజాశక్తి 2004లో ప్రచురించింది . గడ్డిపువ్వు గుండె సందుక (2017) బాలల నేపథ్యంలో, ఆలోచనలో …ఆమె (2018) మహిళల కోణంలో రాసిన కథల సంపుటిలు . అమర్ సాహసయాత్ర బాలల నవల (2019) మంచిపుస్తకం ప్రచురణ. ఆడపిల్లను కావడం వల్లనే శీర్షికతో వ్యాసాలు ప్రజాతంత్ర వీక్లీ లో కొంతకాలం వచ్చాయి . కవితలు ,వ్యాసాలు ,రేడియో ప్రసంగాలు వగైరా వగైరా ..